*****
*దేవీకృప*
=========
(మినీ హాస్య కథ)
(నేను రాసిన ఈ హాస్య కథ 'విశ్వభారత్' అనే దినపత్రికలో ది. 22.12.2022 న ప్రచురితమైనది)
రచన ::
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్
చిన్నతనంలో ఒకే ఊరిలో, ఒకే స్కూల్లో చదువుకున్న శ్రీదేవి, భూదేవి, లక్ష్మీదేవిలు చాలా సంవత్సరాలు తరువాత అనుకోకుండా సిటీలో ఒక ఎగ్జిబిషన్ లో కలుసుకున్నారు.
ఆ తరువాత రోజుల్లో సిటీలో ఓ బిల్డర్ కట్టిన అపార్ట్ మెంట్లలో ముగ్గురూ కూడా ఫ్లాట్స్ తీసుకుని తమ సొంతింటి కలలను నిజం చేసుకున్నారు.
పదిహేను సంవత్సరాలు గిర్రున తిరిగాయి.
***** ***** ***** *****
సొంతింటి కల నెరవేరినప్పటికీ ముగ్గురిలోనూ ఏదో ఆందోళన, అసంతృప్తి.
ఇలా, ఆందోళనతో ఉన్న వారికి, తరుణోపాయం చెప్పి, సాంత్వన చేకూర్చే అమృతానంద స్వామి వారు ఆ ఊరు వచ్చేరని తెలిసింది.
ఇలాంటివి తాను పెద్దగా నమ్మనని లక్ష్మీదేవి చెప్పడంతో, ఆయనను దర్శించుకోవడానికి బయలుదేరారు శ్రీదేవి, భూదేవిలు.
***** ***** ***** *****
స్వామీజీ నివాసం ఉన్న వసతి గృహానికి చేరగానే, ముందుగా శ్రీదేవి రెండు వేల రూపాయల టికెట్ తీసుకుని, లోపలికి వెళ్లి,
"స్వామీ! మాకు ఒక్కడే కొడుకు. వయసు పన్నెండేళ్లు. పోట్లగిత్తలా అందరితోనూ గొడవలు పెట్టుకుంటాడు. మాకు పెద్ద తలనొప్పిగా తయారయ్యాడు. ఏం చేసినా లొంగడంలేదు. మీరే ఏదో మార్గం చూపించాలి" అని భోరుమంది.
స్వామి ఓ పళ్లెంలో నూనె పోసి, అందులో చూసి, కళ్లు మూసుకుని ఏవో మంత్రాలు జపించి,
"చూడమ్మా ! మీ ఆయన పశుసంవర్ధక శాఖలో పనిచేస్తూ పశువుల దాణా కోసం కేటాయించిన సొమ్మును అన్యాయంగా తింటే, పుట్టిన పిల్లలకు ఆ లక్షణాలు రాకుండా మరే లక్షణాలు వస్తాయ్?" కోపంగా అడిగారు స్వామీజీ.
తేలు కుట్టిన దొంగలా మిన్నకుండిపొయిన శ్రీదేవి, కాసేపటికి తేరుకుని "మరి తరుణోపాయం ఏమిటో చెప్పండి స్వామి" బాధపడుతూ అడిగింది.
"చేసిన పాపం కొద్దిగానైనా పోవాలంటే, ఈ రోజు నుంచే దానాలు చేయడం మొదలు పెట్టు. కొన్నాళ్ళకి తప్పకుండా ఫలితం లభిస్తుంది" అంటూ బొట్టు పెట్టి, ప్రతీ రోజూ కుర్రాడికి పెట్టమని వీభూది చేతికిచ్చారు స్వామీజీ.
***** ***** ***** *****
ఆ తరువాత వెళ్లిన భూదేవి, తను కూడా రెండు వేల టికెట్ తీసుకుని ఆనందంగా స్వామీజీ గదిలోకి ప్రవేశించి,
"స్వామి, మా పన్నెండేళ్ల కుర్రాడికి ఎప్పుడు చూసినా ఏదో ఒక రోగమే. ఎన్ని మందులు వాడినా గుణం కనబడడం లేదు" బాధగా చెప్పింది భూదేవి.
అంజనం వేసిన స్వామీజీ,
"మీ ఆయన ఆరోగ్యశాఖలో పనిచేస్తారు కదూ? మరి, పేద ప్రజల మందులు కోసం కేటాయించిన సొమ్ము అక్రమంగా తింటే ఇదిగో పిల్లలకు ఇలాగే రోగాలు చుట్టుకుంటాయి......" అంటూ శ్రీదేవికి చెప్పిన తరుణోపాయమే ఈమెకూ చెప్పారు స్వామి.
***** ***** ***** *****
భూదేవి వెళ్లిన పది నిమిషాల తర్వాత, ధ్యాన ముద్రలో ఉన్న అమృతానందను,
"అయ్యా, ఆ ఇద్దరి స్త్రీల బాధకు కారణం ఏమిటన్నది మీ మనోనేత్రంతో దర్శించి అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగేరు స్వామీ" ఆశ్చర్యంతో అడిగాడు శిష్యుడు ఆతృతానంద.
"మనదేముంది? అంతా ఆ దేవీకృప రా !" అన్నారు స్వామి ఆకాశం వంక చూసి నమస్కరిస్తూ.
"అంతే, స్వామి, అంతే" అంటూ తానూ నమస్కారం చేసిన ఆతృతానంద,
కాసేపటి తరువాత
"స్వామి, ఓ ఐదు నిమిషాల నుంచి ఏదో దీర్ఘ ఆలోచనలో ఉన్నారు. కారణం ఏమిటో తెలుసుకోవచ్చా?" వినయంగా అడిగాడు.
"ఆ లక్ష్మీదేవి మన చెంతకు రాలేదురా అర్భకా ?" గుమ్మం వైపు చూస్తూ శెలవిచ్చారు స్వామీజీ.
"రాకపోవడం ఏమిటి స్వామీ, వచ్చిన అందరి వద్దా రెండు వేలు తక్కువ కాకుండా వసూలు చేస్తున్నాంగా?" అనుమానంగా అడిగాడు ఆతృతానంద.
"ఆ లక్ష్మి కాదురా వెర్రిబిడ్డా? నేను అడిగేది ఈ శ్రీదేవి, భూదేవిల స్నేహితురాలు లక్ష్మీ దేవి గురించి" అసలు విషయం చెప్పారు స్వామి.
"ఔనా ? వారి గురించి అంత నమ్మకంగా ఎలా చెప్పగలుగుతున్నారు స్వామీ?" మళ్లీ ఆశ్చర్యపోయాడు ఆతృతానంద.
"అంతా ఆ దేవీకృప రా ఢింభకా!" పైకి చూస్తూ శాంతంగా చెప్పారు స్వామి.
"ఆ దేవీకృప ఎలా లభిస్తుందో ఈ అర్భకుడికి కొంచెం అర్థమయ్యేలా శెలవీయండి గురువర్యా" వినయంగా అడిగాడు.
"ఏమీ లేదురా మూర్ఖా ! ఆ ముగ్గురు స్త్రీలదీ విడదీయరాని స్నేహంరా ! వాళ్ళు ఉంటున్న ఆ "దేవీకృప" అపార్ట్మెంట్స్ లో గతంలో నేను కొన్నాళ్లు వాచ్ మెన్ గా పనిచేసానురా, అర్భకా!" అంటూ రెండు చేతులతో గెడ్డం బరుక్కుంటూ లేచాడు అమృతానంద ఉరఫ్ అమృతరావు, ఆ రోజు వచ్చిన వసూళ్లు లెక్కపెట్టుకోవడానికి.
***** **శుభం* ** *****