ఆమె ఎవరు

విశ్వ భారత్ • 15 Dec 2022 • 👁 11 views
ఆమె ఎవరు
*****
*ఆమె ఎవరు?*
==========
(మినీ కథ)

(నేను రాసిన ఈ మినీ కథ విశ్వభారత్ అనే దినపత్రికలో 15.12.2022 న ప్రచురితమైనది)

రచన ::
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్

కాలింగ్ బెల్ కొట్టిన శబ్ధం వినబడడంతో లేచివెళ్లి తలుపు తీయగానే ఎదురుగా కనబడిన ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు విద్యాధర్.

"అంటే, ఈ శారద చావలేదా? తన పెళ్లికి అడ్డుగా వస్తున్న తన మాజీ ప్రేయసి అయిన ఈమెను చంపమని ఆ కిరాయి గూండా శంకర్ కి సుపారీ ఇచ్చాను. రెండు రోజుల క్రితమే ఈమెను చంపుతున్నట్లు, వాడు ఫొటోలు కూడా పంపాడు. మరి ఇప్పుడు ఈవిడ... ?"
ఇలా ఆలోచిస్తున్న విద్యాధర్ తో

"హలో విద్యాధర్! లోపలికి రావచ్చా?" అంటూ లోపలికి వచ్చింది ఆమె.

"కొంపదీసి నువ్వూ, శారదా కవలపిల్లలా?" అనుమానం వచ్చి అడిగాడు విద్యాధర్.

"నేనే శారదను. నాకు అక్కాచెల్లెల్లు ఎవరూ లేరు" చెప్పింది ఆమె సోఫాలో కూర్చుంటూ.

"ఒకవేళ ప్రేతాత్మ రూపంలో కానీ వచ్చిందా?"
అని అనుకుంటూ, అనుమానంతో ఆమె పాదాలు వైపు చూసాడు విద్యాధర్.

"నీ అనుమానం నాకు అర్థమైంది విద్యాధర్. నువ్వు అనుకున్నట్లుగా నేను అసలు చావనే లేదు" విద్యాధర్ కళ్లలోకి సూటిగా చూస్తూ చెప్పింది ఆమె.

"మరి కిరాయి గూండా శంకర్ నిన్ను ఉరి తీసి చంపినట్లు, ఇదిగో ఫొటోలు తీసి పంపించాడు. అంటే వాడూ, నువ్వు కలిసి నన్ను మోసం చేసారా? అసలు ఏం జరిగిందో చెప్పు" మొబైల్లో ఫొటోలు చూపిస్తూ, కోపంతో ఊగిపోతూ అడిగాడు విద్యాధర్.

ఈలోగా..

"యూ ఆర్ అండర్ అరెస్ట్ విద్యాధర్. ఇప్పుడు ఆధారాలతో సహా దొరికావు. శారద హత్య కేసులో మొదటినుంచి నిన్ను అనుమానిస్తున్నాం......" అంటూ రంగప్రవేశం చేసాడు ఎస్సై జయసింహ.

ఒక్క సారిగా ఉలిక్కిపడి, తరువాత చేసేదేమీ లేక ఎస్సై వెంట నడుస్తూ జీపు ఎక్కాడు విద్యాధర్.

"సురేఖా! జూనియర్ ఆర్టిస్ట్ వైనా శారదలా అద్బుతంగా నటించావమ్మా" అంటూ శారద రూపురేఖలతో ఉన్న ఆమె చేతిలో వెయ్యి రూపాయలు పెట్టాడు ఎస్సై, ఆశ్చర్యంగా చూస్తూ, తలబాదుకుంటున్న విద్యాధర్ వైపు నవ్వుతూ చూస్తూ!

***** **శుభం** *****