స్పెషల్ కేసు

విశ్వ భారత్ • 👁 8 views
స్పెషల్ కేసు
*****
*స్పెషల్ కేసు*
========
(మినీ కథ)

(నేను రాసిన ఈ మినీ కథ విశ్వభారత్ దినపత్రికలో ది. 06.12.2022 న ప్రచురితమైనది)


రచన ::
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్

"ఇదిగో మిమ్మల్నే రేపు శ్రావణశుక్రవారం పూజకు ఓ వెయ్యిరూపాయలు తెచ్చుకోండి. జనంమీద పడి దౌర్జన్యంగా సంపాదించిన సొమ్ము మాత్రం తేవద్దు" ట్రాఫిక్ పోలీస్ పరమేశానికి చెప్పింది వాళ్లావిడ కనకం.

***** ***** ***** *****

"హూ..ఇంకా ఈ రోజుల్లో నీతీనియమం ఎక్కడ ఏడిసింది? జనంమీద పడి తినడమే బెటర్" అనుకున్న పరమేశం, ఎదురుగా ఆకుపచ్చ టీషర్ట్ వేసుకుని నీటుగా తయారై, బైకుమీద రాంగ్ రూట్లో వస్తున్న ఓ వ్యక్తిని ఆపి, బెదిరించి, రేపు కోర్టుకు వచ్చి బండి తీసుకోమనీ, లేదా ఐదువేలు ఫైన్ కట్టమని గదమాయించాడు.

తన కారు మధ్యలో ఆగిపోయిందనీ ఓ అర్జెంటు పనిమీద వెళ్లాల్సి రావడంతో ఫ్రెండ్ బైకుమీద బయలుదేరాననీ, తన వద్ద వెయ్యి రూపాయలే ఉన్నాయని, అవి తీసుకుని వదిలేయమని బతిమాలడంతో

చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అని ఆ వెయ్యితో తృప్తిపడి అతడిని వదిలేసాడు పరమేశం.

కాసేపటికి తెల్ల యూనిఫామ్ వేసుకుని దర్జాగా హెల్మెట్ లేకుండా స్కూటర్ పైన వస్తున్న ఓ మధ్యవయస్కుని ఆపి అతను చెప్పేది ఏమీ వినకుండా అతనినుంచి కూడా దౌర్జన్యంగా ఓ ఐదు వందలు నొక్కేసి ఆనందంగా ఇంటివైపు బయలుదేరాడు.

***** ***** ***** *****

కాసేపటికి
"ఏవండీ నేను కనకాన్ని. మన చంటాడికి ఒంట్లో బాగలేక పోవడంతో వాడిని తీసుకుని హాస్పిటల్ కి వచ్చాను. మీరు త్వరగా రండి...." హాస్పిటల్ అడ్రసు చెప్పి ఫోన్ పెట్టేసింది.

***** ***** ***** *****

హాస్పిటల్లో, గాబరాపడుతున్న భర్తతో

"ఇప్పుడే డాక్టర్ గారు వచ్చి చూసి, కంగారు ఏమీ లేదు, కొంచెం నీరసం అంతే, అని మందులు రాసారు. ముందు కన్సల్టేషన్ ఫీజు కట్టి రండి. ఇంటికి బయలుదేరుదాం" చెప్పింది భార్య.

"హమ్మయ్యా! దేవుడున్నాడు, గండం గడిచింది" అనుకుని ఫీజు కట్టడానికి వెళ్లాడు.

***** ***** ***** *****

"సార్! కన్సల్టేషన్ ఫీజు పదిహేను వందలు కట్టండి" చెప్పింది రిసెప్షనిస్టు. "అదేంటీ? ఐదువందలే కదమ్మా" అని అడిగిన పరాంకుశంతో "మీది స్పెషల్ కేసుట. డౌటుంటే డాక్టర్ గారిని అడగండి" అని ఆయన గదివైపు చూపించింది.

ఆ గదిలో, ఇందాకా తాను దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేసిన ఆకుపచ్చ టీ షర్ట్ ఆయన తన వైపు చూసి నవ్వడం చూడగానే పరిస్థితి అర్థమైంది పరాంకుశానికి.

అంతే! ఆయనకు ఓ నమస్కారం చేసి, కిక్కురుమనకుండా ఆ డబ్బులు కట్టేసాడు. అంతే కాదు, మిగిలిన ఐదు వందలు అక్కడున్న దేవుని హుండీలో వేసి దణ్ణం పెట్టుకున్నాడు పరాంకుశం.

***** **శుభం** *****