ఫలాలు ఫలితాలు

విశ్వ భవిష్యత్తు • 01 Dec 2022 • 👁 11 views
ఫలాలు ఫలితాలు
*****
"ఫలాలు-ఫలితాలు"
==============
(మినీ హాస్య కథ)

(నేను రాసిన ఈ హాస్య కథ విశ్వభారత్ ఆనే దినపత్రికలో 01.12.2022 న ప్రచురితమైనది)

రచన::
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్

జాతకాలు పిచ్చి చాలా ఎక్కువగా ఉన్న ఆశారావు, ఓ ఆదివారం ఉదయం,

"ఏమేవ్! ఈ రోజు నాకు ఆకస్మిక ధనలాభం
అని రాసారే ఈ దినఫలాల్లో, చూడు" మొహం చాటంత చేసుకుని చెప్పాడు దినపత్రిక భార్యకు అందిస్తూ.

"మీ చాదస్తం మండిపోనూ! ఇవి తర్వాత చూస్తాను కానీ, ముందు మార్కెట్ కు వెళ్లి కూరగాయలు తెండి మహాప్రభో!" భర్తకు సంచీ అందిస్తూ చెప్పింది జీవిత.

అంతే! భార్యకు ఎదురు చెప్పలేక చిల్లులు పడిన జల్లెడలా మొహం పెట్టుకుని మార్కెట్ కు బయలుదేరాడు ఆశారావు.

***** ***** ***** *****

ఏదో ఆలోచిస్తూ మార్కెట్ నించి తిరిగి వస్తున్న ఆశారావుకు రోడ్డు మీద పడి ఉన్న
వంద రూపాయల నోటు కనబడింది. అంతే, ఆనందంగా వంగి తీయబోయేంతలో, పక్కనున్న వ్యక్తి

"సార్, అది మీది కాదేమో?" అని వారించడంతో, "లేదు లేదు నాదే, ఇప్పుడే పడిపోయింది" అని ఆ నోటు చొక్కా జేబులో పెట్టుకుని, ఎవరూ చూడకుండా అక్కడ నుండి రేసుగుర్రంలా ఇంటికి దౌడు తీసాడు.

***** ***** ***** *****

"ఏమేవ్! చూసావా? ఈరోజు నా దినఫలం నిజం అయ్యింది! రోడ్డు మీద వంద రూపాయలు దొరికాయి" ఇంట్లోకి వస్తూ బంతిలా గంతులేస్తూ చెప్పాడు ఆశారావు.

"బాగానే ఉంది సంబడం కానీ, ముందు అవి దేవుని దగ్గర పెట్టండి, అన్నట్లు చెప్పడం మరిచాను. పనిమనిషికి జీతం ఇవ్వాలి, ఓ వెయ్యి రూపాయలు ఇక్కడ పెట్టండి" చావు కబురు చల్లగా చెప్పింది జీవిత.

"హూ..నన్ను ఒక్క పది నిమిషాలు కూడా సంతోషపడనీయవు కదా?" అంటూ గాలి తీసిన బంతిలా అయిపోయిన ఆశారావు, విసుక్కుంటూ ఫాంట్ జేబులో చెయ్యి పెట్టి కరెంటు షాక్ కొట్టిన కోతిలా కీచుమని అరచి,

"ఏమేవ్, ఎవడో నా పర్సు కొట్టేసాడు, అందులో ఉన్న మూడు వేలు కూడా!" అంటూ సోఫాలో కూలబడ్డాడు.

***** ***** ***** *****

ఆ మాటలకు కంగారు పడుతూ వచ్చిన జీవిత ఇచ్చిన మంచి నీళ్లు తాగుతూ, పెట్టిన తిట్లు తింటూ, కాసేపటికి తేరుకుని,

"మరి, ఈరోజు దినఫలాల్లో ధనలాభం అని రాసాడు కదా? ఇలా జరిగిందేమిటే?" అమాయకంగా భార్యను అడిగాడు ఆశారావు.

"జరుగుతుంది, ఎందుకంటే ఈ ఆదివారం అనుబంధం పుస్తకంలో ఉన్న వారఫలాల్లో, 'మీ రాశి వారు ఈ వారం ఇతరుల చేతిలో మోసపోతారు' అని కూడా రాసి ఉంది, చదవండి" అంటూ ఆ పుస్తకం చేతికిచ్చింది జీవిత.

అది చదివి
"ఔను, నిజమే సుమా! అయితే నేను ఎలా మోసపోయానంటావ్?" సందేహంగా అడిగాడు ఆశారావు.

"ఇదిగో ఇలా!" అంటూ దినపత్రికలో పడిన ఓ వార్తను చూపిస్తూ, పేపర్ అతని చేతికి ఇచ్చింది జీవిత.

"నగరంలో కొత్త తరహా మోసాలు.. రహదారి మీద ఓ నోటు కింద పడవేసి, అది తీసుకునేందుకు ఎవరైనా ప్రయత్నం చేసేలోపు వారి పర్సు లాఘవంగా...." తర్వాత ఇంక చదవలేక పోయాడు ఆశారావు.

"ఇప్పటికైనా జరిగింది అర్థమయ్యిందా?" కోపంగా అడిగింది జీవిత.

"అర్థమయ్యింది కానీ, నాదో చిన్న సందేహం. అయితే మరి, రేపటినుంచి నేను ఈ దినఫలాలు ఫాలో అవ్వాలా? లేకపోతే.. ఆ వారఫలాలు ఫాలో అవ్వాలా?" ఆశగా అడిగాడు మోసపోయినా ఇంకా ఆశ చావని ఆశారావు.

"నా ఖర్మ అండీ...నా ఖర్మ. మీరు ఏమీ ఫాలో అవ్వక్కర్లేదు మహానుభావా! మీరు ఇలాగే పరాకుగా ఉంటే ఆ దొంగలే మిమ్మల్ని ఫాలో అవుతారు. పోలీసు స్టేషన్లో జేబు దొంగల ఫొటోలు పెట్టినట్లు, ఈ పాటికి ఆ జేబుదొంగల స్థావరాల్లో మీ ఫొటో పెట్టేసే ఉంటారు" విసుక్కుంటూ చెప్పి వంటింట్లోకి వెళ్లిన భార్య జీవిత వైపు జీవచ్ఛవంలా చూస్తూ ఉండిపోయాడు ఆశారావు.

***** **శుభం** *****