*****
(నేను రాసిన ఈ హాస్య కథ విశ్వభవిష్యత్
అనే దినపత్రికలో ది. 26.11.2022 న
ప్రచురితమైనది)
*ఉప్పు కప్పురంబు*
===============
(మినీ హాస్యకథ)
రచన ::
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్
శోభనం రోజున మంచం మీద కూర్చుని భార్య కోసం ఆతృతగా గుమ్మం వైపు చూస్తున్నాడు కొత్త పెళ్ళి కొడుకు సంగీతరావు. ఈ లోగా తలుపు వద్ద అలికిడి గమనించి,
"రా, చంపకమాలా! ఇంకా అక్కడే నిలబడి పోయావేం?" అడిగాడు, మంచం దిగి.
అంతే, వెంటనే
*నీవేనా నను పిలిచినది* ,
*నీవేనా నను తలచినది* "
అని పాడుతూ రివ్వున వచ్చి అతడిని చుట్టేసింది చంపకమాల.
ఆ దెబ్బకి కింద పడబోయిన సంగీతరావు, కాసేపటికి నిలదొక్కుకుని,
"ఒహో, అయితే నీకు పాటలు బాగానే వచ్చన్నమాట. పాటలు ఒక్కటేనా? లేక డాన్స్ లాంటిది ఏదైనా....?" నెవ్వెరపోతూ అడుగుతున్న సంగీతరావు మాట పూర్తి కాకముందే మంచం మీంచి ఒక్క ఉరుకు ఉరికి
" *ఓయ్....పాండవులు పాండవులు తుమ్మెద*
*పంచ పాండవులోయమ్మ తుమ్మెద* "
అని పాడుతూ కుప్పిగంతులు వేయసాగింది
చంపకమాల.
అది చూసి బిత్తరపోయిన సంగీతరావు ఒక్క ఉదుటున మంచం మీద నుంచి దూకి, ఆమె నాట్యానికి, గానానికి రెండింటికీ కలిపి తాళం వేసేసాడు.
కాసేపటి తర్వాత తేరుకుని,
"ఎంతసేపూ పాటలేనా? ఈ రోజు గుర్తు ఉండేలా ఏదైనా ఒక తీపి.." అని కోతిలా మూతి ముందుకు పెట్టి అడిగిన సంగీతరావు మాట పూర్తి కాకముందే,
" *అందమైన బావా, ఆవుపాల కోవా*
*విందుగా పసందుగా ప్రేమనందుకోవా* "
అంటూ ఓ కోవాబిల్ల అతని నోట్లోకి పంపించింది చంపకమాల. ఆ దెబ్బకి ఉక్కిరిబిక్కిరి అయిన సంగీతరావు.
"ఏంటా స్పీడు? కొంపతీసి నువ్వు స్కూటర్ డ్రైవింగ్ కానీ నేర్చుకోలేదు కదా?" ఏదో అనుమానం వచ్చి అడిగాడు భయంభయంగా. అంతే వెంటనే మంచం మీద నుంచి ఒక్క గెంతు గెంతి, రెండు చేతులూ ముందుకు చాపి
" *నేను బుల్లెట్ బండెక్కి వచ్చేత్తపా* *డుగ్గుడగ్గుడుగ్గుడుగ్గని* "
అంటూ అతని మీదికి రాసాగింది. ఆ ధాటికి భయపడి వెంటనే పక్కకు తప్పుకున్న సంగీతరావు
"ఏమిటి? ఏదడిగినా పాటలు రూపంలో సమాధానం చెబుతున్నావు. కొంపతీసి నీకు పాటలంటే ఇష్టమా?" అడిగాడు ఆముదం తాగిన మొహం పెట్టి.
"అయ్యో, పాటలంటే ఇష్టమున్నది నాకు కాదు, మీకు. ఎందుకంటే పెళ్లి చూపులకు వచ్చినప్పుడు మీరే చెప్పారు కదా? మీకు పాటలంటే ఇష్టమని! అందుకే ఈ మూడు నెలల్లో పాటలు బాగా ప్రాక్టీస్ చేసేసానన్నమాట" అసలు విషయం చెప్పింది చంపకమాల.
"చంపేవ్ పో, చంపకమాలా! నాకు పాటలు కాదు, పద్యాలు అంటే ఇష్టం. నీ పేరు కూడా సూటవ్వడంతో, అందుకే నిన్ను ఇష్టపడ్డాను. ఇక, పాటలంటే ఇష్టమన్నది ఆ రోజు నాతో పాటు వచ్చిన అచ్చు నాలాగే ఉండే నా కవల సోదరుడు సాహిత్యరావు. నువ్వు పొరబడినట్టున్నావు" వెర్రిమొహం వేసుకుని చెప్పాడు సంగీతరావు.
"ఔనా? అయితే మీ పేర్లు చూసి నేనే పొరబడ్డానన్నమాట. ఉండండి, ఇప్పుడే ఒక ఫోన్ చేసుకుని వస్తా" హడావుడిగా చెప్పింది చంపకమాల.
"ఈ సమయంలో ఎవరికీ?" అనుమానంగా అడిగాడు సంగీతరావు.
"మన పక్క గదిలో మీ కవల సోదరుడు సాహిత్యరావుతో, ప్రస్తుతం ఇదే స్థితిలో ఉన్న నా కవల సోదరి పల్లవికి. పాపం అది కష్టపడి పద్యాలు నేర్చుకుంది" బిక్క మొహం వేసుకుని కూర్చున్న సంగీతరావు వైపు చూస్తూ చెప్పింది చంపకమాల.
***** **శుభం** *****