*****
*బాలవాక్కు*
=========
(కథానిక)
(నేను రాసిన ఈ కథ, శ్రీమతి జ్యోతి వలభోజు గారి ఆధ్వర్యంలో *పిల్లలు చెప్పిన పాఠాలు* శీర్షికన 77 మంది ప్రసిద్ధ కథకులు రాసిన కథల సంకలనంలో ప్రచురితమైనది)
రచన ;;
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్
"ఏమండీ! ఇంట్లో అన్ని సరుకులు నిండుకుంటున్నాయి. ఆ కిరాణాకొట్టతను ఇంక అరువు ఇవ్వనని కబురు పెట్టాడు" ఉదయం కాఫీ అందిస్తూ చెప్పింది నా భార్య రాధ.
గొంతు పొలమారుతుండగా, "ఎప్పుడు చెప్పాడు? అసలేం జరిగింది?" అడిగాను, ఖాళీగ్లాసు పక్కన పెడుతూ.
"నిన్న సాయంత్రం కాఫీపొడి కోసం మన పెద్దపిల్లను పంపానండీ. 'ఇప్పటికే పద్దు ఐదువేలు దాటిపోయింది. ముందు మీ నాన్నను ఆ బాకీ జమచేయమను' అని తిట్టి పంపించాట్ట. ఏడుస్తూ వచ్చేసింది" ఆవేదనతో చెప్పింది నా శ్రీమతి.
"చూడు రాధా! ఫ్యాక్టరీలో ఐదునెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదు. ప్రస్తుతం అందరిదీ ఇదే పరిస్థితి. ఖర్చులు తగ్గించుకుని ఒబ్బిడిగా సంసారం చేసుకోవడం తప్పించి ఏమీ చేయలేము" పరిస్థితి చెప్పడానికి ప్రయత్నించాను.
"ఇంకేం ఖర్చులు తగ్గించుకుంటామండీ? ఒక్క పిల్లచాలు మహాప్రభో అంటే వంశోద్ధారకుడు కావాలంటూ రెండో ప్రయత్నం చేసారు. మళ్లీ ఆడపిల్లే పుట్టింది. ఇప్పుడు చూడండి. పిల్లల ఆకలి కూడా తీర్చలేకపోతున్నాము" ఖాళీగ్లాసు తీసుకుని విసురుగా వెళ్తూ చెప్పింది రాధ.
"చాల్లే నోర్ముయ్. అబ్బాయిని కనడం రాదు కానీ, మొగుడికి ఎదురు చెప్పడం ఒకటి" నా అసమర్థతను మా ఆవిడ మీదకు నెట్టేస్తూ పెరట్లోకి స్నానం చేయడానికి బయలుదేరాను.
ఈలోగా లోపలినుంచి, "ఏంటి నాన్నా? అదేదో అమ్మ తప్పయినట్లు అమ్మని తిడతావు?" ఐదోతరగతి చదువుతున్న నా పెద్దకూతురి మాటలు నాకు చెంపదెబ్బల్లా తగిలాయి.
"నోర్ముయ్, పెద్ద ఆరిందాలా ఏమిటా మాటలు? నాన్నగారినలా అనవచ్చా?" అన్న మా ఆవిడ మాటలు కొంచెం ఊరట కలిగించాయి.
***** ***** ***** *****
నేను ఉంటున్న ఊరికి, ఉద్యోగం చేస్తున్న పట్నానికి మధ్య దూరం ముప్పై కిలోమీటర్లు. వారసత్వంగా వచ్చిన ఓ పాడుబడిన రెండుగదుల బంగాళాపెంకులింట్లో మా నివాసం. అందుకే రోజూ అంత దూరం బస్సులో ప్రయాణం.
బస్టాండుకి చేరుకున్న నాకు, అక్కడ ఓ పన్నెండేళ్ల కుర్రాడిని పెడరెక్కలు విరిచి పట్టుకున్న సంఘటన కంటపడింది. నుదుటిమీదికి పడుతున్న ఉంగరాల జుట్టు, చిరిగిన నిక్కర్, మాసిపోయిన బనీనుతో ఉన్న ఆ కుర్రాడి కళ్లలో ఏదో ఆకర్షణ కనబడింది నాకు.
"ఏంటి సార్, ఏమయ్యింది? ఎందుకు ఆ కుర్రాడ్ని పట్టుకున్నారు?" అడిగాను నా పక్కనే నిలబడిన వ్యక్తిని.
"బస్సెక్కబోతున్న ఓ ప్రయాణికుడి జేబులోంచి పర్సు కొట్టేయబోతోంటే పట్టుకుని పోలీసులకు అప్పచెప్పడానికి తీసుకుని వెళ్తున్నారు" జరిగిన సంఘటన చెప్పాడు ఆ వ్యక్తి.
"నేను దొంగను కాను సార్. నన్ను నమ్మండి. ఆకలేసి..." నా వైపు చూసి ఏడుస్తూ, ఏదో చెప్పబోతున్నాడు ఆ కుర్రాడు.
ఈలోగా, "దొరికిన ప్రతీదొంగా ఇలాగే చెబుతాడు. ఈ వయసులోనే ఇలా ఉంటే పెద్దయితే గజదొంగ అవడం ఖాయం. తీసుకునివెళ్లి పోలీసులకు అప్పచెప్పండి" ఓ ప్రయాణికుడు ఆవేశంగా చెబుతున్నాడు.
వాడిని చూసిన తరువాత నా మనసు ఎందుకో జాలితో నిండిపోయింది.
వెంటనే, "చూడండి, పోయిన సొమ్ము దొరికింది కదా? పాపం కుర్రాడి భవిష్యత్తు పాడవుతుంది. వదిలేయండి సార్" అని అక్కడున్న వారికి చెప్పాను. నా ప్రతిపాదన నచ్చి ఓ ఇద్దరు నాకు వంత పాడారు. ఇంక చేసేదేమీ లేక వాడిని తలో దెబ్బ వేసి, ఎవరి దోవన వాళ్లు వెళ్లిపోయారు అందరూ. ఆ కుర్రాడు నాకు ఓ నమస్కారం చేసి అక్కడ నుండి తారాజువ్వలా పారిపోయాడు.
నేను కూడా ఎక్కవలసిన బస్సు రావడంతో, అక్కడినుండి బయలుదేరాను.
***** ***** ***** *****
నేను పనిచేస్తున్న అట్టల ఫ్యాక్టరీకి చేరుకుని పనిలో నిమగ్నమైన కాసేపటి తరువాత, "ఏం అన్నా, ఈ నెలైనా జీతాలు ఇస్తారా?" ఆశగా అడిగాను, నా కోవర్కర్ సత్యాన్ని.
"ఈ నెల కూడా రావురా! వచ్చేనెలలో ఓ రెండు నెలల జీతమిచ్చేలా ఉన్నారు" చెప్పాడు సత్యం.
"ఇంటినెలా నడపాలో అర్థం కావడంలేదు! ఉన్న నగలు తాకట్టు దుకాణానికి చేరుకున్నాయి. పోనీ ఉద్యోగం మారదామా అనుకుంటే, మన మేనేజ్మెంట్ మంచిదని ఆలోచిస్తున్నా. పోనీ ఓ వెయ్యి రూపాయలుంటే సర్దుబాటు చెయ్యగలవా?" అడిగాను మడతపెట్టిన అట్టలు ఒబ్బిడిగా సర్దుతూ.
"ఒరేయ్, నిన్ననే మీవదిన గాజులు కుదవపెట్టి ఐదువేలు తీసుకున్నా. నువ్వు అడిగిన మొత్తం సాయంత్రం ఇస్తాలే" ఆ మాటలు నా చెవిలో అమృతం పోసాయి.
***** ***** ***** *****
సత్యమిచ్చిన డబ్బులతో ఓ వారంరోజులు ఇబ్బంది లేకుండా గడచిపోయాయి. ఆ రోజు ఉదయం నా వైరుబుట్టలో కేరేజ్ పెట్టుకుని డ్యూటీకి బయలుదేరాను. బస్స్టాండులో నేనెక్కవలసిన బస్సు కోసం చూస్తున్నా. ఈలోగా నా జేబులో డబ్బా ఫోన్ మోగింది. ఏదో తెలియని నెంబర్.
ఎత్తి "హలో" అన్నాను.
"ఏవండీ నేనూ రాధను. ఎస్టీడీ బూత్ నుంచి మాట్లాడుతున్నాను"
"చెప్పు రాధా! ఏం జరిగింది? ఎందుకు ఇప్పుడు ఫోన్ చేసావ్?" అడిగాను విసుగ్గా.
"ఏమండీ మన పెద్ద పిల్లని ఫీజు కట్టేవరకూ రావద్దని ఇంటికి పంపేసారండీ" ఏడుస్తూ చెప్పింది రాధ.
"ఏమిటీ? ఫీజు కట్టలేదని బడినుంచి పంపేసారా? ఎంత దారుణం? సరే ఎంత కట్టాలిట?"
"ప్రస్తుతానికి రెండువేలు కట్టమంటున్నారు" చావుకబురు చల్లగా చెప్పింది శ్రీమతి.
"రెండువేలా? ఇప్పుడెక్కడినుంచి తేగలను? దీనికి రెండే పరిష్కారాలు. ఒకటి దానిని స్కూల్ మాన్పించడం లేదా నేను ఎవరి జేబైనా కొట్టేయడం. పెట్టేయ్ ఫోన్!" విసుగ్గా చెప్పి, కాల్ కట్ చేసాను.
ఈలోగా నా ముందు లాల్చీ షరాయి వేసుకున్న ఒకాయన నోట్లు బయటకు తీసి లెక్కపెట్టుకుని మళ్లీ వాటిని పర్సులో పెట్టుకోవడం కనిపించింది. వెంటనే నా బుర్రలో ఓ మెరుపు మెరిసింది.
ఆ పర్సు నేను కొట్టేస్తే? అందులో ఈజీగా పదివేలకు పైనే ఉంటాయి. ఈ రెండు నెలలూ హాయిగా గడచిపోతాయి. నా వాలకం చూసి నన్ను ఎవరూ దొంగ అనుకోరు. ప్రస్తుతానికి ఇంతకు మించి మార్గం లేదు. వెంటనే నా పథకాన్ని కార్యరూపంలో పెట్టడానికి ఎవరికీ అనుమానం రాకుండా ఆ షరాయి వ్యక్తి మీద ఓ కన్నేసి ఉంచాను.
***** ***** ***** *****
ఈలోగా నేనెక్కవలసిన బస్సు వచ్చింది. నా అదృష్టం బాగుండి ఆ షరాయివాలా కూడా ఈ బస్సు వద్దకే వచ్చాడు. అంతే, జనం గుంపులుగా బస్సు ఎక్కడానికి వచ్చారు. ఇదే అవకాశంగా భావించి, మంచిచెడ్డల గురించి ఆలోచించకుండా, నేను పనిలోకి దిగిపోయాను.
ఆ వ్యక్తి ముందు మెట్టెక్కే వరకూ ఉండి, ఓ ఇద్దరి తర్వాత నేను నిలబడ్డాను. నెమ్మదిగా చొక్కాకి ఉన్న సూదిపిన్ను తీసి ఆ లాల్చీవాలా కుడిచేతి మీద గుచ్చాను.
ఆ దెబ్బకతను, "బాబోయ్, ఏదో గుచ్చుకుంది" అని వెనక్కి తిరిగాడు. ఈలోగా నేనతని జేబులోంచి పర్సు తీసేసి నా వైరుబుట్టలో వేసుకుని, అతడిని తోసుకుని, ఆనందంగా బస్సులోకి ఎక్కేసాను.
కిందకి దిగిన షరాయివాలా, ఓసారి జేబు వైపు చూసుకుని, "బాబోయ్, నా పర్సు ఎవరో కొట్టేసాడు" అని బిగ్గరగా అరిచాడు. వెంటనే ఆ అరుపుకు ఉలిక్కిపడిన నేను, కీడు శంకించి ఎందుకైనా మంచిదని నా వైరుబుట్టని పైనున్న లగేజీ స్టాండులో పెట్టేసి దేవుడిని తలుచుకుని ఊపిరి పీల్చుకున్నాను.
దేవుడు నా మొర ఆలకించాడు. ఇంతలో ఎవరో,
"అదిగో పర్సు కొట్టేసిన ఆ కుర్రవెధవ పర్సు పడేసి పారిపోతున్నాడు, పట్టుకోండి" అనడంతో అందరూ వాడి వెంటపడ్డారు. అక్కడే ఉన్న ఓ పోలీసు అతడిని ఒడిసి పట్టుకున్నాడు. నేను కూడా ఎవరా అని చూస్తే వాడు, వారం క్రితం నేను చూసిన ఉంగరాల జుట్టు కుర్రాడే. ఆ సంఘటన చూసిన నాకు - చెప్పకపోవడమే కొంచెం బాధ అనిపించినా, నా పరిస్థితి నన్ను ఏమీ చేయలేని నిస్సహాయుడిని చేసింది.
ఆ తరువాత ఏదో అనుమానం వచ్చి నా వైరుబుట్ట తీసి చూసి, అందులో పర్సు లేకపోవడంతో నేను అవాక్కయ్యాను. అంటే ఆ దొంగవెధవ లాఘవంగా నా బేగ్ లోంచి పర్సు కొట్టేసాడన్నమాట. అంటే వీడు నిజంగా దొంగేనన్న మాట. అనవసరంగా వీడిని మొన్న కాపాడాను. కోపంతో నా మొహం ఎరుపెక్కిపోయింది. బస్సు పెద్ద శబ్దం చేస్తూ బయలుదేరింది.
***** ***** ***** *****
నా దురదృష్టానికి చింతిస్తూ, మళ్లీ ఎవరిని యాచించాలని ఆలోచిస్తూ, ఫ్యాక్టరీకి చేరుకుని పనిలో పడ్డాను.
మధ్యాహ్నం భోజనాలసమయంలో బుట్టలోంచి కేరేజ్ తీస్తున్న నాకు అందులో ఓ నాలుగు ఐదు వందల నోట్లు కనబడ్డాయి. ఇవి ఎక్కడినుండి వచ్చాయి? కొంపతీసి ఇందాక ఆ పర్సులోంచి జారి పడ్డాయా? అలా పడితే మడతపెట్టి ఎందుకు ఉంటాయి? ఒకవేళ ఎవరైనా పెట్టారా? పెడితే ఎవరు పెట్టారు? ఆశ్చర్యపోతూ ఆలోచిస్తున్న నాకు ఓ మెరుపులాంటి సమాధానం దొరికింది. ఆ నోట్లు జేబులో పెట్టుకుని సాయంత్రం కోసం ఎదురుచూడసాగాను.
***** ***** ***** *****
సాయంత్రం మా ఊర్లో బస్సు దిగిన నేను నేరుగా బస్సు డిపోలో ఉన్న పోలీసు ఔట్ పోస్ట్ వద్దకు చేరి అక్కడ ఉన్న పోలీసుని ఆ కుర్రాడి గురించి ఆరాతీసాను. వాడిని లోపలిగదిలో ఉంచారని తెలియగానే, ఆయన అనుమతి తీసుకుని వాడి వద్దకు వెళ్లాను.
"చూడు బాబూ! నువ్వెవరు? నేను కొట్టేసిన పర్సు ఎందుకు తీసావు? నా బాస్కెట్లో రెండువేలెందుకు ఉంచావు?" నెమ్మదిగా అడిగాను.
"సార్ నేనొక అనాథను. నన్ను కిష్టుడు అంటారు. మొన్న మీరు నన్ను పోలీసుల బారి నుంచి రక్షించారు. అందుకే మీకు సహాయం చెయ్యాలనిపించిది. నేనంతకుముందు దొంగిలించిన డబ్బులు మీ బుట్టలో పడేసాను" విషయం చెప్పాడు కిష్టుడు.
"మరి నేను దొంగిలించిన పర్సు ఎందుకు కొట్టేసావు?" అనుమానంగా అడిగాను.
"సార్, ఉదయం మీ భార్యగారితో ఫోన్లో మాట్లాడిన మాటలు విన్నాను. మీరు పర్సు కొట్టేయడం కళ్లారా చూసాను. ఈలోగా ఆ షరాయి ఆయన అరవడంతో నేను రంగంలోకి దిగాను" చెప్పాడు జుట్టును పైకి తోసుకుంటూ.
"అదే, ఎందుకు అలా చేసావు?" ఆసక్తితో అడిగాను.
"సార్, నేను దొరికినా పరవాలేదు. మీరు దొరికితే మీ జీవితం నాశనం అవుతుంది. అంతేకాదు, మీ కుటుంబం రోడ్డున పడిపోతుంది. నాకులాగ మీ పిల్లలు కాకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాను" చెబుతున్న వాడి మొహంలో ఏదో వెలుగు.
"ఒరేయ్ కృష్ణా! చిన్న కుర్రవాడివైనా ఎంత బాగా చెప్పావురా, నా కళ్లు తెరిపించావు" అని వాడిని గుండెలకు హత్తుకుని, "ఒరేయ్, నిన్ను మా ఇంటికి తీసుకుని వెళ్లి చదివిస్తాను. వస్తావా?" అడిగాను ఆశగా. ఆ మాట వినగానే వాడి కళ్లల్లో వెయ్యివాట్ల కాంతి నాకు కనపడింది.
వెంటనే బయటకు వచ్చి, "కానిస్టేబుల్ గారూ! దయచేసి ఆ కుర్రాడి మీద కేసులు బుక్ చేయకండి. ఇప్పుడే నాకు తెలిసిన అడ్వకేట్ గారిని తీసుకుని వస్తా" అని ఆయన అనుమతి తీసుకున్నాను.
"ఎస్. నేను తీసుకున్న నిర్ణయం తప్పుకాదు. నా తరువాత నా పిల్లలను ఓ అన్నయ్యగా చూసేది వాడే. అవసరం అయితే ఈ పాడుబడిన ఇంటినమ్మేసి, పిల్లల ముగ్గురి చదువులకోసం పట్నం మకాం మారుస్తా" మనసులో అనుకుంటూ లాయర్ గారింటివైపు ఆనందంగా అడుగులు వేసాను, ‘వాడినపూలే వికసించెలే, చెరవీడిన హృదయాలు....’ అన్న పాట కేంటీన్నుంచి వినబడుతుండగా.
***** **శుభం** *****