పసివాడి ప్రాణం

కథా వేదిక కెనడా సంకలనం • 01 Jan 2022 • 👁 8 views
*****
*పసివాడి ప్రాణం*
============
(క్రైమ్ కథ)

(నేను రాసిన ఈ క్రైమ్ కథ, 2022 వ సంవత్సరంలో కెనడా వేదికగా ఉన్న *కథావేదిక* అనే సాంస్కృతిక సంస్థ నిర్వహించిన కథల పోటీలో బహుమతి పొంది, వారు ప్రచురించిన *తూర్పు నుంచి పడమరకు* అనే కథల సంకలనంలో చోటు చేసుకుంది)


రచన ::
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్

1995 వ సంవత్సరం, జూన్ 26, సోమవారం, కాకినాడ లోని టూ టౌన్ పోలీసు స్టేషన్.

*సాయంత్రం 6 గంటలు* .

అప్పుడే ఇంటి నుంచి వచ్చి, తన సీట్లో కూర్చున్న సీఐ జయసింహ వద్దకు వచ్చిన కానిస్టేబుల్ వెంకట్రావు,

"సార్! భానుగుడి వద్ద ఉన్న ఆల్ ఇన్ ఒన్ ఫ్యాన్సీ ఎంపోరియం యజమాని శ్రీనివాస్, ఆయన భార్యా మిమ్మల్ని కలవాలట సార్. ఐదవ తరగతి చదువుతున్న వాళ్ల అబ్బాయి దీపక్ కనబడడం లేదుట" అని చెప్పగానే వారిని లోపలికి రమ్మని చెప్పిన సీఐ

"చెప్పండి సార్! అసలు ఏం జరిగింది?" వాళ్లను అడిగాడు, ఆ వివరాలు నోట్ చేసుకోమని ట్రైనీఎస్సై కిరణ్ కు చెబుతూ.

"సార్, మా ఏకైక కుమారుడు దీపక్, గీతా కాన్వెంట్ లో చదువుతున్నాడు. వాడు ప్రతీరోజూ కాన్వెంట్ కు వెళ్లి రావడానికి ఓ ఆటో కూడా పురమాయించాం. అయితే ఈ సాయంత్రం వాడు స్కూల్ నుంచి ఆటోలో రాలేదు, ఎవరో వచ్చి స్కూటర్ మీద తీసుకుని వెళ్లారుట అని మా ఆటో డ్రైవర్ గోపాలం చెప్పాడు. వాడి ప్రాణానికి ఏమీ కాకుండా మీరే చూడాలి సార్. ఎంత డబ్బు ఖర్చు అయినా పరవాలేదు" వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ చెప్పారు శ్రీనివాస్ దంపతులు.

"సరే! మీకు ఎవరిమీదనైనా అనుమానం ఉందా?" అడిగాడు సీఐ జయసింహ.

"సార్! మాది ప్రేమ వివాహం. మా ఇద్దరి కులాలు ఒకటి కాదు. పెద్దవారిని ఎదిరించి పెళ్లి చేసుకున్నాం. అందుకే ఈ కిడ్నాప్ లో మా కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందేమోనని నా అనుమానం సార్" ఏ మాత్రం సంకోచం లేకుండా చెప్పింది శ్రీనివాస్ భార్య పద్మ.

"సార్! మొదట్లో నేనూ నా ఫ్రెండ్ సుధాకర్ కలిసి ఈ షాపు పెట్టాం. పెట్టుబడి నాది, నిర్వాహణ అతనిది. అతని ప్రవర్తన బాగా లేకపోవడంతో బిజినెస్ దెబ్బతింటోందని అతడిని పూర్తిగా వ్యాపారం నుంచి తప్పించాను. అయితే ఈమధ్య అతని వల్లనే నేను ఇంత ఎదిగాననీ, అలాంటిది నన్ను ఎలా తప్పిస్తావనీ, నా అంతు చూస్తాననీ రెండు మూడు సార్లు బెదిరించాడు సార్!" చెప్పాడు శ్రీనివాస్.

"సరే! మీరు అనుమానిస్తున్న వాళ్ల అందరి వివరాలు ఇవ్వండి" అని చెప్పి, వెంటనే ఏదో జ్ఞాపకం వచ్చి,

"ఔనూ! మీ ఆటో డ్రైవర్ గోపాలం మీద అనుమానం రాలేదా?" అడిగాడు సీఐ.

"లేదు సార్! అతను మా ఇంట్లో మనిషి కింద లెక్క. అంతే కాదు, అతను ఇప్పుడు మాతోనే వచ్చాడు" అని శ్రీనివాస్ చెప్పడంతో గోపాలాన్ని పిలిపించాడు సీఐ.

"గోపాలం! అసలు ఏం జరిగిందో నిజంగా చెప్పు, లేకపోతే నిన్ను అనుమానించ వలసి వస్తుంది" సీరియస్ గా చెప్పాడు సీఐ జయసింహ.

"అయ్యా! రోజూలాగే ఈ ఉదయం కూడా దీపక్ బాబును తీసుకుని కాన్వెంట్ వద్ద దించి, ఆ తరువాత ఏదో బేరం తగలడంతో కత్తిపూడి వెళ్లి వచ్చి, మధ్యాహ్నం భోజనం చేసి పడుకున్నాను. ప్రతీరోజూ సాయంత్రం కాన్వెంట్ వదిలే సమయానికంటే ఓ అరగంట ముందుగానే కాన్వెంట్ కు వెళ్లి బాబుని తీసుకుని వస్తాను....." చెబుతున్న గోపాలాన్ని

"మరి ఈ రోజు ఎందుకు వెళ్లలేదు?" అనుమానంగా అడిగాడు సీఐ.

"సాయంత్రం బయలుదేరుదాం అని ఆటో వద్దకు వచ్చేసరికి వెనుక టైరు పంక్చర్ అయ్యింది. స్టెఫినీ లేకపోవడంతో బాషా పంక్చర్ షాపుకు వెళ్లి, ఆ టైరుకు పంక్చర్ వేయించి, స్కూలుకు వెళ్లేటప్పటికి ఎవరో వచ్చి, బాబును తీసుకుని వెళ్లారని తెలిసింది బాబయ్యా" ఏడుస్తూ చెప్పాడు గోపాలం.

అతని వివరాలు నమోదు చేయమని, అతడిని అదుపులోకి తీసుకోమని తన సిబ్బందికి పురమాయించి, శ్రీనివాస్ దంపతులకు ధైర్యం చెప్పిఇంటికి వెళ్లమని, కిడ్నాపర్ నుంచి ఏదైనా ఫోన్ వస్తే వెంటనే తమకు చెప్పమని, తన సిబ్బందితో కలిసి శాంతినగర్ లో ఉన్న గీతా కాన్వెంట్ వద్దకు చేరుకున్నాడు సీఐ జయసింహ.

***** ***** ***** *****

*రాత్రి 07.00 గంటలు* .

తమ స్కూల్ నుంచి కుర్రాడు కిడ్నాప్ అయ్యాడనీ, పోలీసులు వస్తున్నారని తెలిసిన ఆ కాన్వెంట్ యాజమాన్యం రాత్రి అయినా ఇంకా అక్కడే ఉన్నారు.

వారి వద్ద నుంచి స్కూలుకు సంబంధించిన వివరాలు సేకరించిన సీఐ, ఆ తరువాత గేట్ కీపర్ సింహాచలాన్ని రమ్మని, సాయంత్రం ఎవరు వచ్చారో చెప్పమన్నాడు.

"సార్! మా కాన్వెంట్ కు ఎక్కువమంది రిక్షాలలోనే వస్తారు. ఆటోలలో వచ్చేది ఇద్దరే. ఈ బాబు, అలాగే చిత్రాడ రెడ్డి గారి అబ్బాయి. ఐదు గంటలకు అందరూ వెళ్లి పోయారు కానీ, ఈ బాబుని తీసుకుని వెళ్లే ఆటో రాలేదు. ఓ పది నిమిషాల తర్వాత ఓ కుర్రాడు స్కూటర్ మీద వచ్చి, 'ఈ రోజు ఆటో రాదుట. మీ నాన్న గారు నిన్ను తీసుకుని రమ్మన్నారు' అని దీపక్ బాబుకు చెప్పాడు సారూ. నేను వెంటనే ఈ దీపక్ బాబుని 'నీకు ఇతను తెలుసా?' అని అడగగానే 'ఓ బాగా తెలుసు' అని ఆ బండి వెనకాల ఎక్కి వెళ్లిపోయాడు సార్! అంతే సార్ జరిగింది" భయపడుతూ చెప్పాడు గేట్ కీపర్.

"ఆ వచ్చిన వ్యక్తిని ఇంతకు ముందు ఎప్పుడైనా చూసావా? అలాగే ఆ బండి నెంబర్ ఎంతో చెప్పగలవా?" అడిగాడు సీఐ.

"నేను ఇక్కడ చేరి రెండు నెలలే అయ్యింది సార్. అందుకే అతడిని ఇంతకు ముందు చూడలేదు. నెంబర్ జ్ఞాపకం లేదు కానీ, అది సిమెంట్ రంగు బజాజ్ చేతక్ సార్" జ్ఞాపకం చేసుకుని చెప్పాడు సింహాచలం.

ఆ వివరాలు నోట్ చేసుకోమని, ఆ తర్వాత ఆ బండి వివరాలు సేకరించమని తన సిబ్బందికి చెప్పి అక్కడ నుంచి బయలుదేరాడు సీఐ.

***** ***** ***** *****

*రాత్రి 08.00 గంటలు* .

అక్కడ నుంచి బయలుదేరిన సీఐ జయసింహ నేరుగా నాగమల్లి తోట వద్ద ఉన్న బాషా పంక్చర్ షాపుకు వెళ్లాడు. అప్పటికే రాత్రి కావడంతో షాపు మూసేయబోతూ, పోలీసు జీపు చూసి బయపడుతున్న బాషాతో

"చూడు బాషా! ఈరోజు సాయంత్రం ఆటో డ్రైవర్ గోపాలం నీ దగ్గరకు వచ్చాడా?" సూటిగా ప్రశ్నించాడు సీఐ.

"సాయంత్రం 4.30 ప్రాంతంలో టైర్ తీసుకుని నడుచుకుంటూ వచ్చాడు సార్. పిల్లాడిని కాన్వెంట్ నుంచి తీసుకుని రావాలని తొందరపెట్టడంతో ఓ ఇరవై నిమిషాల్లో పంక్చర్ వేసి ఇచ్చాను సార్" జరిగిన విషయం చెప్పాడు బాషా.

"ఆ సమయంలో నీ షాపులో ఇంకా ఎవరైనా ఉన్నారా?" అడిగాడు సీఐ.

"ఎవరూ లేరు సార్!" తడుముకోకుండా చెప్పాడు బాషా.

ఆ తరువాత అక్కడ నుంచి నేరుగా తమ స్టేషన్ కు చేరుకున్నారు సీఐ బృందం.

***** ***** ***** *****

*రాత్రి 09.00 గంటలు* .

సోఫాలో కూర్చుని తీవ్రంగా ఆలోచిస్తున్న శ్రీనివాస్, ఫోన్ మోగడంతో ఉలిక్కిపడి లేచి,

"హలో, ఎవరు మాట్లాడేది?" భయపడుతూ అడిగాడు.

"సీ మిస్టర్ శ్రీనివాస్, నువ్వు పోలీసు రిపోర్టు ఇచ్చావని మాకు తెలిసింది. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నీ బిడ్డ నీకు దక్కడు. నీ ప్రతీ చర్యనూ మా వాళ్లు మారువేషంలో ఉండి గమనిస్తున్నారు. రేపు ఉదయం తొమ్మిది గంటలకు నీ షాపు నెంబరుకు ఫోన్ చేస్తా. ఓ ఐదు లక్షలు రెడీ చేసుకో. ఎక్కడ ఇవ్వాలో అక్కడ చెబుతా" గరుకు గొంతొకతో చెప్పాడు అవతలి వ్యక్తి.

"తప్పకుండా ఇస్తా. నా బిడ్డను ఏమీ చేయకండి" ధీనంగా వేడుకున్నాడు శ్రీనివాస్.

"అది నీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. మళ్లీ పోలీసులకు ఈ విషయం చెప్పావో నీకు దక్కేది మీ అబ్బాయి దీపక్ శవమే. గుడ్ నైట్..." అంటూ ఫోన్ పెట్టేసాడు ఆ కిడ్నాపర్.

చాలా సేపు తర్జనభర్జనలు పడిన తర్వాత, ఫోన్ చేసి, సీఐ జయసింహకు ఈ విషయం
చెప్పాడు శ్రీనివాస్.

"గుడ్. స్టేషన్ కు రాకుండా ఫోన్ చేసి చెప్పి మంచి పని చేసారు శ్రీనివాస్. రేపు ఉదయం కూడా ఫోన్ రాగానే నాకు సమాచారం ఇవ్వండి. మీ ప్రయత్నం మీరు చేయండి. మా డ్యూటీ మేము చేస్తాం. భయపడకండి మీ అబ్బాయి క్షేమంగా వస్తాడు" ధైర్యం చెప్పాడు సీఐ జయసింహ.

వెంటనే తన సిబ్బందికి శ్రీనివాస్ కు ఆ కాల్ ఎక్కడ నుంచి వచ్చిందో టెలిఫోన్ ఆఫీసులో ఎంక్వయిరీ చేయమని చెప్పి, ఇంటికి బయలుదేరాడు సీఐ.

***** ***** ***** *****

*రాత్రి 10.00 గంటలు* .

రాత్రి ఇంట్లో భోజనం చేస్తున్న సీఐ జయసింహ, ఫోన్ రావడంతో, లిఫ్ట్ చేయగానే,

"సార్, తొమ్మిది గంటలకు శ్రీనివాస్ కు వచ్చిన ఆ ఫోన్ జగన్నాధపురం బస్టాండ్ సమీపంలో ఉన్న ఓ ఎస్టీడీ బూత్ నుంచి వచ్చిందిట సార్. అక్కడికి వెళ్లి వివరాలు సేకరించాం. ఎవరో మఫ్లర్ ధరించిన వ్యక్తి ఎర్రటి రాజదూత్ బైక్ పై వచ్చి, ఫోన్ చేసి హడావుడిగా వెళ్ళి పోయాడుట. రాత్రి కావడంతో బండి నెంబర్ కనబడలేదుట" సేకరించిన వివరాలు చెప్పాడు కానిస్టేబుల్ వెంకట్రావు.

"వెరీగుడ్, రేపటి లోగా ఆ బైక్ కు సంబంధించిన వివరాలు కూడా సేకరించండి" కానిస్టేబుల్ కు చెప్పి ఫోన్ పెట్టేసాడు సీఐ జయసింహ.

***** ***** ***** *****

మర్నాడు
*ఉదయం 09.00 గంటలు*

ఉదయం ఎనిమిదన్నర గంటలకే తన షాపు తెరచి, కిడ్నాపర్ నుంచి వచ్చే ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాడు శ్రీనివాస్.

సరిగ్గా తొమ్మిది గంటల ఐదు నిమిషాలకు ఫోన్ మోగడంతో ఆదుర్దాగా ఫోన్ తీసిన శ్రీనివాస్ తో,

"మిష్టర్ శ్రీనివాస్ మాట్లాడకుండా నేను చెప్పేది మాత్రం విను. సాయంత్రం ఐదు గంటలకు నువ్వు ఐదు లక్షల కేష్ ఒక మైకా సంచీలో పెట్టి, పిఠాపురం రోడ్డులో చిత్రాడ దాటిన తర్వాత వచ్చే అమ్మవారి గుడి ఎదురుగా, ఓ రెండు వందల మీటర్ల దూరంలో ఉన్న పొలంలో ఓ పాడుబడిన రేకుల షెడ్ ఉంటుంది. దాని చూరులో ఆ కవర్ పెట్టేసి వెళ్లిపో. ఒక్కడివే రావాలి. అర్థమయ్యిందా? మళ్లీ పోలీసులు...." చెబుతున్న కిడ్నాపర్ తో,

"నో..నో..నిన్నటి నుంచి పోలీసులతో ఏమీ చెప్పడం లేదు. నా మాట నమ్మండి. నేను డబ్బుతో వస్తా. మా అబ్బాయిని అక్కడ అప్పగిస్తారా?" ఆశగా అడిగాడు శ్రీనివాస్.

"నో..నో..నువ్వు డబ్బులు ఇచ్చిన అరగంట తిరక్కుండానే మీ అబ్బాయి మీ ఇంటి వద్ద ఉంటాడు. ఓకే.. బై.." శ్రీనివాస్ ఏదో చెప్పబోయేలోగా ఫోన్ పెట్టేసాడు కిడ్నాపర్.

***** ***** ***** *****

*ఉదయం 09.30 గంటలు*

కాసేపు తర్జనభర్జన అనంతరం ఈ విషయం ఫోన్ లో సీఐ జయసింహకు చెప్పాడు శ్రీనివాస్.

వెంటనే తన సిబ్బందికి టెలిఫోన్ ఆఫీసుకు ఫోన్ చేసి, ఆ కాల్ ఎక్కడ నుంచి వచ్చిందో ట్రేస్ చెయ్యమని చెప్పాడు జయసింహ.

ఓ పావుగంట తర్వాత ఆ ఫోన్ ఒంటిమామిడి జంక్షన్ వద్ద ఉన్న ఓ పబ్లిక్ బూత్ నుంచి వచ్చింది అన్న సమాచారం తెలిసింది సీఐ జయసింహకు.

*ఉదయం 10.00 గంటలు*

"సార్! నేను ఫోర్ నాట్ త్రీ ని ఒంటిమామిడి జంక్షన్ నుంచి మాట్లాడుతున్నా. సుమారు ఓ గంట క్రితం ఓ వ్యక్తి నల్లటి లూనా మీద వచ్చి ఈ కాల్ చేసాడుట. నెంబర్ చూడలేదుట" సీఐ జయసింహకు సమాచారం ఇచ్చాడు కానిస్టేబుల్.

"వెరీగుడ్, నువ్వు అర్జంటుగా ఆర్టీవో ఆఫీసుకు వెళ్లు. అక్కడ మన కానిస్టేబుల్ వెంకట్రావు ఉంటాడు. మీరిద్దరూ కలిసి ఆ
సిమెంట్ రంగు బజాజ్ చేతక్, ఎర్రటి రాజదూత్, నల్లటి లూనా బండ్ల వివరాలు సేకరించండి. వాటి యజమానుల వివరాలు తీసుకుని అర్జంటుగా రండి. క్విక్" అంటూ
ఆర్డర్ పాస్ చేసాడు జయసింహ.

తరువాత ఎస్సై కిరణ్ తో

"మిష్టర్ కిరణ్, మీరు మన సమీప పోలీసు స్టేషన్లకు ఫోన్ చేసి ఆ మూడు రకాల మోడల్ బళ్లు ఈ మధ్య చోరీకి గురి అయినట్లు ఏమైనా కేసులు ఫైల్ అయ్యాయేమో కనుక్కోండి. క్విక్" ట్రైనీ ఎస్సైకి పురమాయించాడు సీఐ జయసింహ.

***** ***** ***** *****

*ఉదయం 10.30 గంటలు*

"సార్! మన సర్కిల్ లో ఉన్న అన్ని పి.యస్. లలోనూ ఎంక్వయిరీ చేసాను. ఎక్కడా కూడా ఆ మోడల్ బళ్లు పోయినట్లు కేసులు రిజిస్టర్ అవ్వలేదు సార్" సేకరించిన సమాచారం చెప్పాడు ఎస్సై కిరణ్.

"ఔనా? అయితే కిడ్నాపర్లు తిరిగిన బైకులు దొంగిలించినవి కాదన్నమాట. మరి ఎవరివి? ఆ వెహికిల్స్ వివరాలు తెలిస్తే మన పరిశోధన ఈజీ అవుతుంది. ఔనూ, ఇంతకీ కిడ్నాప్ కు పాల్గొన్నది ముగ్గురంటావా? " నుదురు మీద ముని వేళ్ళతో కొట్టుకుంటూ అన్నాడు సీఐ.

"చెప్పలేం సార్. ముగ్గురు కలసి ఒకడిని నియమించుకుని ఉండవచ్చు కూడా! ఏది ఏమైనా, మనవాళ్లు ఆర్టీవో ఆఫీసులో ఉన్నారు కదా సార్. ఇంకో అరగంట చూద్దాం. లేకపోతే అప్పుడే ఆలోచిద్దాం సార్" ఆశగా చెప్పాడు ఎస్సై కిరణ్.

***** ***** ***** *****

*ఉదయం 11.30 గంటలు*

"హలో...సార్! నేను కానిస్టేబుల్ వెంకట్రావును మాట్లాడుతున్నాను. ఆర్టీవో ఆఫీసునుంచి ఆ మూడు వెహికిల్స్ వివరాలు తీసుకుని వాటిని ఫిల్టర్ చేయగా రెండు బండ్ల డిటైల్స్ దొరికాయి. మీరు ఊహించినట్లే ఆ బజాజ్ చేతక్ శ్రీనివాస్ తండ్రి రంగనాథ్ గారిది సార్. అలాగే ఆ రాజ్ దూత్ శ్రీనివాస్ మాజీ పార్ట్ నర్ సుధాకర్ ది. మీరు ఓకే అంటే వాళ్లిద్దరినీ అదుపులోకి తీసుకొని స్టేషన్ కి వస్తాం సార్. ఆ లూనావాలా ఎవరో కూడా కనుక్కుంటాం" వెహికిల్స్ కి సంబంధించిన సమాచారం స్పీడుగా చెప్పాడు కానిస్టేబుల్.

"వెల్ డన్. అర్జంటుగా వాళ్లను అదుపులోకి తీసుకోండి. ఈలోపు వాళ్లు ఊరు దాటిపోకుండా చెక్ పోస్ట్స్ అలర్ట్ చేయండి" ఆర్డర్లు పాస్ చేసాడు సీఐ జయసింహ.

***** ***** ***** *****

*మధ్యాహ్నం 01.00 గంట*

"చూడండి రంగనాథ్ గారూ! నగరంలో పేరు పడ్డ కాంట్రాక్టర్ మీరు. మిమ్మల్ని కాదని మీ అబ్బాయి శ్రీనివాస్ వేరే అమ్మాయిని చేసుకున్నాడన్న కక్షతో వాళ్ల వంశాంకురాన్ని కిడ్నాప్ చేయడం సమంజసమా? మీ మీద ఎవరికీ అనుమానం రాకుండా ఉండడానికి ఐదు లక్షల డ్రామా ఆడారు. అలాగే, దీపక్ కు సందేహం రాకుండా ఉండడం కోసం మీ వద్ద ఎన్నాళ్లనుంచో పని చేస్తున్న మీ డ్రైవర్ అప్పారావుకు మీ బజాజ్ చేతక్ బండి ఇచ్చి పంపించారు. మర్యాదగా ఆ కుర్రాడ్ని ఎక్కడ దాచారో చెప్పండి" అదుపులోకి తీసుకున్న శ్రీనివాస్ తండ్రిని ఇంటారాగేట్ చేస్తూ కొంచెం కఠినంగా అడిగాడు సీఐ జయసింహ.

"బాగుంది. చక్కగా అల్లారు కథను. సీ మిష్టర్ ఇనస్పెక్టర్, శ్రీనివాస్ నా కన్న కొడుకు. దీపక్ నా వంశోద్ధారకుడు. మా మధ్య గొడవలు ఉన్న మాట వాస్తవమే, ఇంకొన్నాళ్లకు అవే సర్దుకుంటాయి. అంతే కానీ ఇలాంటి చిన్న విషయాలకే సొంత మనవడినే కిడ్నాప్ చేసేటంత నీచ సంస్కృతి కాదు నాది. ఇక, మీరు చెప్పిన ఆ బజాజ్ బండి నాకు సెంటిమెంట్. అది నా మొదటి సంపాదనతో కొనుక్కున్నది. మీరు చెప్పినట్లు ఆ బండి నిన్న మా అప్పారావు కు ఇవ్వలేదు. దానిని రెండు రోజుల క్రితం.............." జరిగిన విషయం చెప్పాడు
రంగనాథ్.

"ఓకే! మీరు చెప్పిన విషయం నోట్ చేసుకున్నా. ఈ సాయంత్రం వరకూ మీరు మా స్టేషన్ లో ఉండాలి" రంగనాథ్ కు చెప్పి,
సుధాకర్ ను ప్రశ్నించడానికి వేరే గదిలోకి వెళ్లాడు సీఐ జయసింహ.

***** ***** ***** *****

"సీ మిష్టర్ సుధాకర్! మీ మధ్య ఉన్న గొడవలు కారణంగా పసివాడిని కిడ్నాప్ చేయడం ధారుణం. వారం రోజుల క్రితం నువ్వు శ్రీనివాస్ షాపుకి వెళ్లి అతడిని బెదిరించావని తెలిసింది. సరే, నీకు జరిగిన నష్టానికి పరిహారంగా ఓ ఐదు లక్షలు ఇచ్చే ఏర్పాటు నేను చేస్తా. మర్యాదగా ఆ కుర్రాడ్ని ఎక్కడ దాచావో చెప్పు" విచారణ సంధర్భంగా సూటిగా అడిగాడు సీఐ.

"ఏమిటి సార్, మీరనేది? మేము గొడవ పడడం నిజమే కానీ, నేను ఆ కుర్రాడ్ని కిడ్నాప్ చేయడం ఏమిటి? నాకూ ఆ వయసు అమ్మాయి ఉంది" ఆందోళనగా చెప్పాడు సుధాకర్.

"నీ కట్టు కథలు ఆపు సుధాకర్. నిన్న ఏం జరిగిందో చెబుతాను విను. నిన్న సాయంత్రం ఏదో పని ఉండి మీ ఫ్రెండ్ బజాజ్ స్కూటర్ తీసుకుని నాగమల్లి తోట వైపు వెళ్తూ, అక్కడ ఆటో డ్రైవర్ గోపాలం ఉండడం చూసావు. వెంటనే నీలోని రాక్షసుడు నిద్ర లేచాడు. వెంటనే నీ బండిని దీపక్ చదువుతున్న కాన్వెంట్ వైపు పోనిచ్చావు. నీకు, తన తండ్రికి మధ్య ఉన్న గొడవలు తెలియని ఆ పసివాడు నీ బండి ఎక్కాడు. ఆ కుర్రాడ్ని ఓ చోట దాచి, రాత్రి నీ రాజదూత్ బైక్ మీద జగన్నాధపురం వెళ్లి, మారు గొంతుకతో శ్రీనివాస్ ను బెదిరించావు. అక్కడే నువ్వు దొరికిపోయావు" నిజం రాబట్టేందుకు చిన్న ట్రిక్ ప్లే చేసాడు సీఐ జయసింహ.

"సార్, కట్టుకథలు చెబుతున్నది మీరు. నా స్నహితులు ఎవరికీ బజాజ్ బళ్లు లేవు. ఇంకో విషయం నా రాజదూత్ బైక్....." అసలు విషయం చెప్పాడు సుధాకర్.

"నేరం చేసిన ప్రతీవాడూ ఇలాగే చెబుతాడు. సాయంత్రం లోగా ఆ పసివాడు దొరక్కపోతే అప్పుడు వచ్చి చెబుతా నీ పని" సుధాకర్ కు వార్నింగ్ ఇచ్చి తన సీటు వద్దకు వచ్చాడు సీఐ.

***** ***** ***** *****

"సార్, ఆ లూనా బండి వివరాలు సేకరించాం సార్. ఆ బండి శ్రీనివాస్ గారి భార్యని ప్రేమించి, భంగపడిన భాస్కర్ అనే అతనిది సార్" సేకరించిన విషయం సీఐ కు చెప్పాడు కానిస్టేబుల్.

"గుడ్. వాడు ఎక్కడ ఉన్నా వెంటనే అరెస్ట్ చేయండి. బహుశా ఆవిడ మీద ప్రతీకారం కోసం చేసి ఉంటాడు" కిడ్నాపర్ దొరికాడన్న ఆనందంతో చెప్పాడు సీఐ.

"ఆయన రెండు నెలల క్రితమే దుబాయ్ వెళ్లి పోయాడు సార్. ప్రస్తుతం ఆ బండి అతని తమ్ముడు వాడుతున్నాడు" అసలు విషయం చెప్పాడు కానిస్టేబుల్.

"సరే! అతని తమ్ముడిని, ఆ బండిని తీసుకుని రండి" ఆవేశంగా చెప్పాడు సీఐ.

"ఆ పని మీదే వెళ్లాము సార్. కానీ ఆ లూనా.... " అక్కడ జరిగిన సంగతులు చెప్పాడు కానిస్టేబుల్.

***** ***** ***** *****

*మధ్యాహ్నం 02.00 గంటలు*

"కిరణ్, ఈ ముగ్గురి వద్ద నుంచి సేకరించిన సమాచారంలో నీకు ఏమైనా కామన్ పాయింట్ దొరికిందా?" సీట్లో రిలాక్స్ అవుతూ, నవ్వుతూ ఎస్సై కిరణ్ ని అడిగాడు సీఐ జయసింహ.

"దొరికింది సార్! అది............." తన ఊహకు అందిన విషయం చెప్పాడు ఎస్సై.

"యస్, కరెక్ట్ గెస్సింగ్. నేనూ అదే అనుకున్నా. మరి ఇంకెందుకు ఆలస్యం? సివిల్ డ్రెస్సులో వెళ్లి, ఎవరూ చూడకుండా, అతడిని మా ఇంటికి తీసుకుని వచ్చేయ్. కమాన్. క్విక్. మనకు ఎక్కువ సమయం లేదు" కిరణ్ కు పని పురమాయించి, ఇంటికి బయలు దేరాడు సీఐ జయసింహ.

***** ***** ***** *****

*మధ్యాహ్నం 02.30 గంటలు*

"భానుమూర్తి గారూ, మీతో సహా మీ వద్ద పనిచేస్తున్న వర్కర్ల వివరాలు అర్జంటుగా కావాలి" ఎస్సై కిరణ్ తీసుకుని వచ్చిన అతడిని సూటిగా అడిగాడు సీఐ.

"దేనికి సార్?" కొంచెం భయపడుతూ నెమ్మదిగా అడిగాడు భానుమూర్తి.

"కారణం చెబితే కానీ ఇవ్వరా?" సీరియస్ గా సీఐ అడగడంతో, అక్కడ ఉన్న తెల్లకాగితం మీద తన వద్ద పనిచేస్తున్న ఇరవై మంది వివరాలు రాసి ఇచ్చాడు భానుమూర్తి.

ఆ వివరాలు చూసి,
"వెరీగుడ్ ! నాకు ఓ విషయం చెప్పండి, ఈ ముగ్గురి స్కూటర్లు మీ వద్ద రిపేర్లు కు వచ్చాయా?" ఆ ముగ్గురి పేర్లు చెప్పి, భానుమూర్తి కళ్లలోకి సూటిగా చూస్తూ అడిగాడు సీఐ.

"వచ్చాయి సార్. కానీ మా మెకానిక్ ఒకడు రెండు రోజుల నుంచి శెలవులో ఉండడం వలన బళ్లు డెలివరీ లేట్ అయ్యింది" ఆలస్యానికి కారణం చెప్పాడు భాను స్కూటర్ రిపేర్ షెడ్ యజమాని భానుమూర్తి.

"ఓకే, ఆ మెకానిక్ పేరు ఏమిటి? ఎక్కడుంటాడు?" ఏదో క్లూ దొరికిందన్న ఉత్సాహంతో అడిగాడు సీఐ జయసింహ.

"అతని వివరాలు ఆ కాగితం మీద రాసాను సార్. అతని పేరు ఉమేష్, ఉండేది ఇక్కడే అయినా, వాళ్ల అక్క పెళ్లి ఉందని, శెలవు పెట్టి ఓ పదిమైళ్ల దూరంలో ఉన్న సొంత ఊరు పెనుగుదురు వెళ్లాడు" అతని వివరాలు చెప్పాడు భానుమూర్తి.

"ఓకే భానుమూర్తి గారూ! థాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. అన్నట్టు ఈ విషయాలు ఎక్కడా చెప్పకండి. చాలా రహస్యంగా ఉంచాలి" వార్నింగ్ ఇస్తున్నట్లు చెప్పాడు సీఐ.

***** ***** ***** *****

*మధ్యాహ్నం 03.30 గంటలు*

పెనుగుదురులో తన అక్క పెళ్లి పనులలో బిజీగా ఉన్న ఉమేష్, తన ఇంటి ముందు పోలీసు జీప్ ఆగడంతో ఉలిక్కిపడి,
"ఎవరు కావాలి సార్" అడిగాడు భయం భయంగా.

"ఉమేష్ అంటే నువ్వేనా?" అతని వయసు బట్టి ఊహించుకుని అడిగాడు సీఐ.

"నేనే సార్. ఏం జరిగింది?" అడిగాడు ఆందోళనగా.

కిడ్నాప్ జరిగిన విషయం గురించి పూర్తిగా వివరించి,
"శ్రీనివాస్ కొడుకు దీపక్ కిడ్నాప్ కేసులో నిన్ను అరెస్టు చేస్తున్నాం" చెప్పాడు సీఐ.

"సార్! రెండు రోజుల నుంచి నేను ఇక్కడే ఉన్నాను. కాకినాడ రాలేదు. అటువంటప్పుడు ఆ బండ్లు వేసుకుని ట్రయిల్ కి ఎలా వెళ్తాను. కావాలంటే మా ఫ్రెండ్ వెంకటేష్ ని అడగండి. నా రూమ్ తాళాలు అతని దగ్గరే ఉన్నాయి. దయచేసి ఒకసారి ఆలోచించండి సార్!" వేడుకుంటూ చెప్పాడు ఉమేష్.

"వెంకటేష్ ఎవరు? అతనికి నీ రూమ్ కీస్ ఎందుకు ఇచ్చావ్?" ఉమేష్ వైపు తీక్షణంగా చూస్తూ అడిగాడు సీఐ.

"ఏదో చిన్న పార్టీ ఉందని తీసుకున్నాడు సార్. వెంకటేష్ అంటే..........."అతని వివరాలు చెప్పాడు ఉమేష్.

"సరే! నీ దగ్గర డూప్లికేట్ కీ ఉంటుంది కదా! ఓ సారి నీ రూమ్ సెర్చ్ చేయాలి. నో టైం" ఉమేష్ ని తొందరపెట్టాడు సీఐ జయసింహ.

వేరే గత్యంతరం లేక పోలీసు జీప్ ఎక్కాడు ఉమేష్, బంధువులంతా ఆశ్చర్యంగా చూస్తుండగా!

కాకినాడ రామారావు పేట వైపు సాగిపోయింది పోలీసు జీప్.

***** ***** ***** *****

*సాయంత్రం 04.00 గంటలు*

"హలో.. హలో..సీఐ సార్! నేను శ్రీనివాస్ ని. ఆ కిడ్నాపర్ చెప్పిన అడ్రసుకు డబ్బు తీసుకుని వెళ్తున్నా. దయచేసి మీరు ఎవ్వరినీ అక్కడికి మఫ్టీలో పంపకండి. మా అబ్బాయి ప్రాణాలు నాకు ముఖ్యం" వస్తున్న కన్నీరు ఆపుకుంటూ ఫోన్ లో వేడుకున్నాడు శ్రీనివాస్.

"ఓకే శ్రీనివాస్ గారూ! నేను ట్రైనీ ఎస్సై కిరణ్ ని. సార్ ఏదో పని మీద బయటకు వెళ్లారు. మాకు కూడా ఆ పసివాడి ప్రాణం ముఖ్యం. మీ ప్రయత్నంలో మీరు ఉండండి. మేము ఎవ్వరమూ రాము. కానీ, మా పని మేము చేస్తాం. ఆల్ ది బెస్ట్" శ్రీనివాస్ కు ధైర్యం చెప్పి ఫోన్ పెట్టేసాడు ట్రైనీ ఎస్సై కిరణ్.

***** ***** ***** *****

*సాయంత్రం 05.00 గంటలు*

కిడ్నాపర్ చెప్పిన స్థలంలో నగదు ఉన్న పాకెట్ ఉంచి, తిరిగి చూడకుండా తన బైక్ మీద వేగంగా ఇంటి వైపు బయలుదేరాడు శ్రీనివాస్, తన కొడుకును ఎప్పుడు చూస్తానా అన్న ఆనందంలో.

ఈ తతంగం అంతా అమ్మవారి గుడి వెనుక ఉన్న చెట్టు మీద కూర్చొని గమనించిన కిడ్నాపర్ ఓ పది నిమిషాలు వెయిట్ చేసి, రోడ్డు మీద తనని ఎవరూ గమనించడం లేదని నిర్ధారించుకుని నెమ్మదిగా చెట్టు దిగి ఆ పాకెట్ తీసుకుని, తన సైకిల్ మీద అక్కడ నుంచి ఉడాయించాడు.

***** ***** ***** *****

*సాయంత్రం 05.30 గంటలు*

"ఒరే! దీపక్, కట్లు విప్పుకుని ఎక్కడ దాక్కున్నావురా? బయటికి రా రా, లేకపోతే చంపేస్తా" తన స్థావరానికి వచ్చిన కిడ్నాపర్ అక్కడ గదిలో దీపక్ లేకపోవడంతో ప్రతీ అంగుళం వెదుకుతూ పిచ్చిపిచ్చిగా అరుస్తున్నాడు.

అప్పుడే లోపలికి వచ్చిన సీఐ జయసింహ,
"మిష్టర్ వెంకటేష్ ! యూ ఆర్ అండర్ అరెస్ట్" అంటూ నగదు ఉన్న కవరునూ, బిత్తరపోయి చూస్తున్న వెంకటేష్ ను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించాడు.

***** ***** ***** *****

*సాయంత్రం 06.00 గంటలు*

పోలీసు స్టేషన్ కు వచ్చిన శ్రీనివాస్,
"సార్! ఆ కిడ్నాపర్ మోసం చేసాడు. మా అబ్బాయిని ఇంటికి పంపలేదు. వాడిని ఏం చేసాడోనని భయంగా ఉంది సార్ " గుండెలు బాదుకుంటూ ఘొళ్లుమన్నాడు శ్రీనివాస్.

"ఏం చేసేవాడా? మేము ఆ గదికి వెళ్లడం కొంచెం ఆలశ్యం అయితే, మీ అబ్బాయిని చంపేసి ఉప్పుటేరులో పడేసేవాడు. కానీ, కంగారు పడకండి, మీ అబ్బాయి క్షేమంగా ఉన్నాడు. నిన్న రాత్రి నుంచి తిండి లేకపోవడంతో కొంచెం నీరసంగా ఉండడంతో మీ వాడిని హస్పిటల్ లో చేర్పించాం" చెప్పాడు సీఐ జయసింహ.

"ఏమిటి సార్, మీరనేది? మా అబ్బాయిని చంపడం ఏమిటి??" విస్తుపోతూ అడిగాడు శ్రీనివాస్.

"తనను గుర్తుపట్టిన వ్యక్తిని ఏ కిడ్నాపర్ కూడా ప్రాణాలతో వదలడు మిష్టర్ శ్రీనివాస్. మీ అబ్బాయి దీపక్ విషయంలో కూడా అలాగే జరిగేది" అసలు నిజం చెప్పాడు సీఐ.

"ఇంతకీ మా దీపక్ గుర్తుపట్టిన ఆ కిడ్నాపర్ ఎవరు సార్?" ఆశ్చర్యంగా అడిగాడు శ్రీనివాస్.

"ఆ కిడ్నాపర్ ఎవరో కాదు. మీ ఆటో డ్రైవర్ గోపాలం కొడుకు వెంకటేష్" బాంబు పేల్చాడు సీఐ జయసింహ.

ఆశ్చర్యంగా వింటున్న శ్రీనివాస్ వైపు చూస్తూ తిరిగి చెప్పసాగాడు సీఐ,

"అతనికి మీ కుటుంబ విషయాల మీద అవగాహన ఉంది. నువ్వు సుధాకర్ తో గొడవ పడడం, నీకు మీ నాన్నతో పడకపోవడం ఇలా అన్ని విషయాలు అతనికి తెలుసు. రెండు రోజుల తేడాలో మీ నాన్న, సుధాకర్, భాస్కర్ ల యొక్క స్కూటర్లు తను పనిచేస్తున్న షెడ్ కి రావడంతో అతనిలో ఈ కిడ్నాప్ అంశానికి బీజం పడింది. దానికి తోడు ఉమేష్ శెలవు మీద వెళ్లడంతో అదనపు బలం చేకూరింది. ఆ చర్యలో భాగంగా మొదటగా నిన్న లంచ్ టైమ్ లో తన ఇంటికి వచ్చినప్పుడు, వాళ్ల నాన్న గోపాలం నడుపుతున్న ఆటో టైరుకి కన్నం పెట్టాడు. తరువాత ఆ స్కూటర్లు మీద ట్రైల్ కి వెళ్లినట్లు వెళ్లి తన పని కానిచ్చాడు. దీపక్ కు కూడా ఇతను తెలవడంతో ఏ మాత్రం ఆలోచించకుండా బండి ఎక్కాడు. తర్వాత మీ అబ్బాయిని రామారావు పేటలో ఉమేష్ రూమ్ లో బంధించాడు" విచారణలో భాగంగా వెంకటేష్ తనకు చెప్పిన విషయాలు అన్నీ వివరించాడు సీఐ.

"సార్! వెంకటేష్ కు మా అబ్బాయి మీద ఎందుకు సార్ అంత కక్ష?" అమాయకంగా అడిగాడు శ్రీనివాస్.

"అతని కక్ష మీ అబ్బాయి మీద కాదు, నీ మీద" ఆశ్చర్యపోయిన శ్రీనివాస్ తో తిరిగి చెప్పసాగాడు సీఐ.

"యస్. ఓ పదిహేను రోజుల క్రితం అతను నీ వద్దకు వచ్చి, సొంతంగా ఓ షెడ్ పెట్టుకుంటాననీ, ఓ లక్ష రూపాయలు సర్దుబాటు చేయమని, వాయిదాల మీద తీర్చేస్తానని అడిగాడు. నువ్వు ఇవ్వలేదు సరికదా అతన్ని పరుషంగా మాట్లాడావు. దాంతో ఈ కిడ్నాప్ మార్గం ఎంచుకున్నాడు. లక్ష అంటే అతని మీద అనుమానం వస్తుందని ఐదు లక్షలు డిమాండ్ చేసాడు. గొంతులు మార్చి ఫోన్ చేసాడు. అసలు ఈ కేసు ఓ గంటలో సాల్వ్ అయిపోయేది. నీ వలనే ఇరవై నాలుగు గంటలు పట్టింది" సీరియస్ గా చెప్పాడు సీఐ జయసింహ.

"నేనేం చేసాను సార్?" అమాయకంగా అడిగాడు శ్రీనివాస్.

"నిన్న, మీకు ఎవరిమీదనైనా అనుమానం ఉందా అని అడిగినప్పుడు ఈ వెంకటేష్ డబ్బు అడిగిన విషయం చెప్పి ఉంటే కేసు నిన్ననే సాల్వ్ అయ్యేది. ఓ విషయం గుర్తుంచుకో శ్రీనివాస్! లాయర్లు, డాక్టర్లు, పోలీసులు వద్ద ఏ చిన్న విషయాన్ని కూడా దాయకూడదు. వెళ్ళండి, ఆసుపత్రిలో ఉన్న మీ దీపక్ ను తెచ్చుకోండి. ఆల్ ది బెస్ట్" శ్రీనివాస్ కు షేక్ హాండ్ ఇస్తూ చెప్పాడు సీఐ.

"థాంక్యూ సార్. మా అబ్బాయిని ప్రాణాలతో అప్పగించారు. మీ మేలు మరువలేను సార్" రెండు చేతులు ఎత్తి నమస్కారం చేసి, అక్కడ నుంచి ఆనందంగా కదిలాడు శ్రీనివాస్, తన కొడుకు ప్రాణాలతో దక్కాడన్న ఆనందంలో.

***** ***** ***** *****

"సార్, నాదో చిన్న డౌట్. భాను స్కూటర్స్ యజమాని భానుమూర్తి గారు తన దగ్గర ఉన్న వర్కర్స్ లిస్టు ఇవ్వగానే దాని ప్రకారం అందరినీ లోపల వేసి కుమ్మేస్తే నిందితుడు ఎవరో తెలిసిపోయేది కదా?" తనకు వచ్చిన సందేహం తీర్చుకొనేందుకు అడిగాడు ట్రైనీ ఎస్సై కిరణ్.

"ఎక్సలెంట్ డౌట్ కిరణ్. కానీ, మనకి ఆ వర్కర్స్ నిందుతులా? కిడ్నాప్ చేసిన వారికి సహకరించారా? లేక కేవలం అనుమానితులా? అనేది పూర్తిగా తెలియదు. అంతే కాదు అంతమందిని విచారణ చేసేటంత సమయం కూడా మనకు లేదు. అందుకే ఆ పద్ధతి ఫాలో అవ్వలేదు" సమాధానంగా చెప్పాడు సీఐ జయసింహ.

"సార్, ఇంకో సందేహం. ఉమేష్ అనే అతను మొన్నటి నుంచే శెలవులో ఉన్నాడు కదా? మరి అలాంటప్పుడు అతనికి ఆ స్కుటర్స్ మీద ట్రైల్ కి వెళ్లడానికి అవకాశమే లేదు. అతని ఇంటికి విచారణ కోసం వెళ్లడంలో ఉన్న ఆంతర్యం ఏమిటో నాకు అర్థం కాలేదు సార్?" అనుమానం వ్యక్తం చేసాడు ఎస్సై.

చిన్నగా నవ్వి చెప్పసాగాడు సీఐ జయసింహ

"ముందు మనకు కావలసింది కిడ్నాపర్ కాదు, ఆ పసివాడి ప్రాణం. ఆ కుర్రాడ్ని ఎక్కడ దాచి ఉంటారు? అన్న ఆలోచన వచ్చినప్పుడు, ఉమేష్ శెలవులో ఉన్నాడు కాబట్టి మనం అతడిని అనుమానించమని అతని ఇంటిలో దాచిపెట్టి ఉండవచ్చేమో అనిపించింది. ఓ చిన్న ప్రయత్నం చేసాం. అనుకోకుండా అదే నిజమయ్యింది. ఏది ఏమైనా భగవంతుని దయవలన ఆ కుర్రాడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే ఆ ముగ్గురినీ వదిలేసి, వెంకటేష్ ని అరెస్టు చూపించి, ఛార్జ్ షీట్ ఫైల్ చెయ్యి" కుర్చీలోంచి లేస్తూ చెప్పాడు సీఐ జయసింహ.

***** **సమాప్తం** *****