*****
*ధీరజ*
=========
(కథానిక)
(నేను రాసిన ఈ కథ ప్రజా నటి శ్రీమతి జమున గారి స్మరణలో 52 మంది కథకులు రాసిన కథలతో వెలువడిన సంకలనంలో ప్రచురితమైనది)
రచన ::
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్
సాయంత్రం టీవీలో వస్తున్న 'అత్తా కోడలు' సీరియల్ చూస్తున్న పార్వతమ్మ తలుపు చప్పుడు కావడంతో వెళ్లి తీసింది.
ఏడుస్తూ లోపలి గదిలోకి వెళ్తున్న కోడలు ధీరజ వైపు ఆశ్చర్యంగా చూస్తూ,
"ఏరా! నవీన్, ఏమయ్యింది? మీ ఆవిడ అలా ఏడుస్తూ ఎందుకు వెళ్తోంది? ఆ రిపోర్టులు చూసి డాక్టర్ ఏమంది?" కొడుకును పట్టుకుని కుదిపేస్తూ అడిగింది పార్వతమ్మ.
"అమ్మా....అమ్మా...అది.... అదీ..." అంటూ నసుగుతున్న కొడుకును
"చెప్పరా సన్నాసీ, ఏమంది ఆ డాక్టర్?"
కోపంగా అరిచింది.
"అమ్మా! ధీరజకు పిల్లలు పుట్టే అవకాశం లేదుట. పిల్లలు కావాలంటే వేరే మార్గాలలో ప్రయత్నం చేసుకొమ్మంటున్నారు" అసలు విషయం చెప్పాడు నవీన్.
"సరిపోయింది. నీకు అప్పుడే చెప్పా, ఈ అనాథ పిల్ల మనకెందుకురా? ఎంచక్కా మా తమ్ముడి కూతురు సుధను చేసుకోరా అని! విని చావలేదు, ప్రేమ ప్రేమ అంటూ ఈ దిక్కుమాలిన పిల్లను చేసుకున్నావు. పోనీలే ఇష్టపడ్డావు కదా అని ఊరుకుంటే ఇప్పుడు ఇది గొడ్రాలు అని కూడా చెబుతున్నావు. అందుకే ఇప్పటికైనా మించి పోయింది ఏమీ లేదు. మావయ్య కూతురు సుధకు ఇంకా పెళ్లి కుదరలేదు. నువ్వు ఊ అంటే ఎగిరి గంతేస్తాడు మా తమ్ముడు......." చెప్పుకుపోతోంది పార్వతమ్మ.
"నువ్వు ఉండమ్మా! ఒకసారి ధీరజ అభిప్రాయం కూడా అడుగుతాను" తల్లికి నచ్చచెప్పే ప్రయత్నం చేసాడు నవీన్.
"ఇంకా దాన్ని అడిగేదేంట్రా! ఈ కృత్రిమ గర్భాలు గట్రా మన ఇంటా వంటా లేవు. దీనిని వదిలేయమని చెప్పడం లేదు. ఇది కూడా మనతో పాటు ఇక్కడే ఉంటుంది. సుధకు పుట్టిన పిల్లలను ఆడిస్తూ..." కొడుకును రెచ్చగొడుతూ చెబుతోంది పార్వతమ్మ.
గదిలో కూర్చుని ఏడుస్తూ తల్లీకొడుకుల సంభాషణ వింటోంది ధీరజ. ఒక్కసారిగా ఆమెకు తన గతం జ్ఞాపకం వచ్చింది.
***** ***** ***** *****
పసితనంలోనే తల్లిదండ్రులు పోగొట్టుకున్న తనను ఎవరో పుణ్యాత్ముడు ఓ అనాథ ఆశ్రమంలో చేర్పించాడు. తను అక్కడే పెరిగి ఇంటర్ వరకూ చదువుకుంది. ఆ ఆశ్రమానికి రోజూ తన ఆటోలో సరుకులు తీసుకుని వచ్చేవాడు ఈ నవీన్.
ఐదు సంవత్సరాల క్రితం మొదలైన ఆ పరిచయం ప్రేమగా మారి, పెళ్లి దిశగా అడుగులు వేస్తున్న సమయంలో, "నవీన్! నేను అనాథను. ఆస్తులు లేవు. నేను మీ అమ్మగారి అభిమానం పొందగలనా?" సందేహంగా అడిగింది తను.
"ధీరూ! అభిమానం సంపాదించడానికి
ఆస్తులే అక్కరలేదు. మాట మంచితనం ఉంటే చాలు" తనకు నచ్చచెప్పాడు నవీన్.
ఆ తరువాత ఆశ్రమ పెద్దల అంగీకారంతో మా ప్రేమ ఫలించి పెళ్లి వరకూ వచ్చింది.
భర్తతో నట్టింట అడుగుపెట్టిన రోజు నుంచే పార్వతమ్మ సాధింపులు మొదలయ్యాయి తనకు. ఆవిడ మేనకోడలి స్థానంలో తను వచ్చిందని ఆవిడకు అక్కసు. కానీ నవీన్ కోసం అవన్నీ భరించింది తను.
***** ***** ***** *****
ఏదో ఆలోచిస్తూ ఉండిపోయిన ధీరజ
నవీన్ గదిలోకి రావడంతో వాస్తవంలోకి వచ్చింది.
"ధీరూ! అమ్మ చెప్పింది విన్నావు కదా? ఇప్పుడు చెప్పు, ఏం చేద్దాం?" గదిలోకి వచ్చి భార్యను అడిగాడు నవీన్.
"ఓ పని చేద్దాం, అత్తయ్య గారు కృత్రిమ గర్భం వద్దు అంటున్నారు కాబట్టి ఓ అనాథ శిశువును దత్తత తీసుకుందాం" ఆశగా చెప్పింది.
"అబ్బే! ఎవరికో పుట్టిన బిడ్డ మన బిడ్డ ఎందుకు అవుతాడు ధీరూ?"
"నేను కూడా ఎవరికి పుట్టేనో తెలియని అనాథనే కదా? మరి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు?"
"అది వేరు. అయినా, నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదని ఇప్పుడేగా తెలిసింది! చూడు ధీరూ, మా తాతకు మా నాన్న ఒక్కడే కొడుకు. మా నాన్నకు నేను ఒక్కడినే. అందుకే అమ్మ మా వంశాంకురం కోరుకోవడంలో తప్పు లేదంటాను"
"నవీన్! నీ మనసుకు నచ్చింది చేయడంలో తప్పులేదు కానీ, వేరొక మనసును నొప్పించి చేయడం పెద్ద తప్పు. సరే, ఇప్పుడు నాకు అర్థమైంది. నువ్వు మీ సుధను వివాహం చేసుకుంటావు. నేను మీకు పుట్టబోయే పిల్లలను ఆడిస్తూ అత్తగారి సేవలో తరించాలి. అంతేనా?"
"చూడు ధీరూ, నాకు నువ్వు కావాలి. అలాగే నాకు నా ద్వారా పుట్టిన సంతానం కావాలి. ఇంక నిర్ణయం నీదే. రేపు ఉదయంలోగా ఏ విషయం ఆలోచించుకుని చెప్పు" కరాకండీగా చెప్పాడు నవీన్.
"సరే, నవీన్. ఏ విషయం రేపు ఉదయంలోగా చెబుతాను" ఏదో నిశ్చయానికి వచ్చినట్లు చెప్పింది ధీరజ.
***** ***** ***** *****
మర్నాడు ఉదయం నిద్రలేచిన నవీన్ కు ధీరజ కనబడకపోవడంతో ఇల్లంతా వెతికిన అతనికి టేబుల్ మీద ఉత్తరం కనబడింది.
"నవీన్
నీ బాధ నాకు అర్థమైంది. నా ద్వారా నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదు. అందుకే నేను నీ జీవితం నుంచి శాశ్వతంగా వెళ్లపోతున్నాను. నా కోసం వెతకవద్దు. నీ జీవితంలోకి రాబోయే సుధ జీవితం నాలాగ కాకూడదని, ఆమెకు సంతానం కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ...
ఎప్పటికీ నీకు ఏమీకాని
ధీరజ "
ఉత్తరం చదివిన నవీన్ కాసేపు మౌనంగా ఉండిపోయి, కాసేపటి తరువాత, "అమ్మా, మావయ్యను రమ్మని చెప్పు" చెప్పాడు తల్లితో.
***** ***** ***** *****
ఇంటినుంచి బయలుదేరిన ధీరజ, సముద్రం వైపుగా నడస్తోంది.
"హు... నేనెవరి కోసం బతకాలి? తల్లిదండ్రులెవరో తెలియదు. తోడబుట్టిన వారు లేరు. బంధువులు లేరు. ప్రేమించి పెళ్లి చేసుకున్న మొగుడు, మోజు తీరేక గొడ్రాలంటూ తన బంధాన్ని వదిలించుకున్నాడు. అనాథగానే పెరిగాను. అనాథగానే పోతాను. నా కోసం కన్నీరు కార్చేవారు ఎవరూ లేరు. అమ్మా! సాగరమాతా, నన్ను నీ అక్కున చేర్చుకో" పరిపరి విధాలుగా ఆలోచిస్తూ, సముద్రంలోకి నడవసాగింది ధీరజ.
ఈలోగా...
"అమ్మా! నువ్వు వెళ్లకమ్మా. వెనక్కి వచ్చేయమ్మా. ప్లీజ్ అమ్మా. మమ్మల్ని వదిలి వెళ్లకు. మాకు భయం వేస్తోంది" అంటూ ఎవరో పిల్లలు గట్టిగా అరవడం ఆమె చెవిన పడింది.
"నన్ను అమ్మా అని పిలిచేవారెవరున్నారు? నాకా అదృష్టం లేకుండా చేసాడు కదా ఆ భగవంతుడు ? అంతా నా భ్రమ" అనుకుంటూ మరింత లోపలికి వెళ్లడానికి సమాయత్తం అయ్యింది ధీరజ.
మళ్ళీ అవే పిలుపులు వినబడడంతో, అనుమానం వచ్చిన ధీరజ ఓసారి దూరంగా ఉన్న ఆ గట్టు వైపు చూసింది. ఇద్దరు చిన్న పిల్లలు తన వైపు చూస్తూ ఏడవడం ఆమె కంటబడింది. వెంటనే తన ప్రయత్నం విరమించుకున్న ధీరజ ఆ పిల్లలు వద్దకు వెళ్లి,
"ఏడవకండి నాన్నా. అసలేం జరిగింది?" అని, వాళ్లను బుజ్జగిస్తూ అడిగింది.
"ఆంటీ, అమ్మానాన్నా ప్రతీరోజూ దెబ్బలాడుకుంటారు. నిన్న రాత్రి కూడా నాన్న తాగి వచ్చి అమ్మను కొట్టాడు. అమ్మ కూడా నాన్నను కొట్టింది. తెల్లారి లేచి చూస్తే నాన్న నోట్లోంచి నురగలు వస్తున్నాయి. అమ్మ ఆయనను లేపడానికి ప్రయత్నం చేసింది. ముక్కు దగ్గర వేలు పెట్టి చూసింది. అంతే! వెంటనే మమ్మల్ని ఈ బీచ్ కు తీసుకుని వచ్చి, తను వచ్చేదాకా ఇక్కడే ఉండమని అదిగో ఆ నీటిలోకి వెళ్లింది. వెళ్లి చాలా సేపు అయ్యింది. ఇంకా రాలేదు" ఏడుస్తూ చెప్పాడు ఆ కుర్రాడు.
అంతే, జరిగిన విషయం అర్థమయ్యింది ధీరజకు.
"ఊరుకో నాన్నా, ఊరుకో తల్లీ! మీరు ఏడుస్తున్నారని, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకొమ్మని మీ అమ్మే నన్ను పంపింది. నడవండి, మనం ఇంకో ఇంటికి వెళ్దాం. ఇప్పటినుంచి నేను ఆంటీని కాను, అమ్మను. ఏదీ ఓసారి 'అమ్మా!' అని పిలవండి" ఉబికివస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ, వారిని గుండెలకు హత్తుకుంటూ అడిగింది ధీరజ.
"అమ్మా, నువ్వు కూడా మా అమ్మలా మమ్మల్ని వదిలేసి వెళ్లిపోవు కదా?" ధీరజను అల్లకుపోతూ అడిగారు పిల్లలు.
"లేదర్రా, మీరు నాకు దేవుడు ఇచ్చిన పిల్లలు. నేను మీకు దేవుడిచ్చిన తల్లిని. మనది దేవుడు కలిపిన బంధుత్వం" తనలాగ ఈ పిల్లలు కూడా అనాథలు కాకూడదని కృతనిశ్చయంతో చెప్పింది ధీరజ.
కాసేపటికి దూరాన్నించి, "స్వాతంత్ర్య దినోత్సవం సంధర్భంగా పేద మరియు అనాథ మహిళలకు ఉచిత కుట్టుమిషన్లు అలాగే స్వయం ఉపాధికి ప్రభుత్వం కల్పిస్తున్న చక్కటి అవకాశాలు. వివరాలు కోసం ఈ వేదిక వద్దకు రండి" అని మైకులో వస్తున్న ప్రకటన వినడంతో తన ఇద్దరు పిల్లలను తీసుకుని ఆ వైపుగా నడక సాగించింది ధీరవనిత ధీరజ.
బంధుత్వాలు కలుపుకుని ముందుకు వెళ్తున్న ఆ ముగ్గురినీ చూస్తూ, ఆనందంగా వెనక్కి వెళ్లింది సాగరమాత.
***** **శుభం** *****