ధన్యజీవి

వంశీ రామరాజు గారి కథల సంకలనం • 01 Jan 2023 • 👁 9 views
ధన్యజీవి
*****
*ధన్యజీవి*
========
(సామాజిక కథ)

(నేను రాసిన ఈ కథ శ్రీ వంశీ రామరాజు గారి ఆధ్వర్యంలో 66 మంది రచయితలు రాసిన *కొత్త కథలు 2023* అనే కథల సంకలనంలో ప్రచురితమైనది)


రచన ::
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్

"నాన్నా! ఎల్లుండే మన నాగపూర్ ప్రయాణం. ఓ పది రోజులకు సరిపడా బట్టలు, మందులు సర్దుకుని రెడీగా ఉండు!" తండ్రి శేషగిరితో చెప్పాడు సుభాష్.

"ఒరే, మీ బావమరిది పెళ్లికి నేనెందుకురా? అయినా ఎక్కడ వైజాగ్, ఎక్కడ నాగపూర్? కోడలూ, నువ్వూ వెళ్లి రండి" సంశయిస్తూ చెప్పాడు శేషగిరి.

"మా డాడీ మీకు కూడా చెప్పారుగా, మా తమ్ముడి పెళ్లి అనీ, మనని ఓ వారం ముందుగా రమ్మని! అయినా ఏంటండీ మీ బెట్టుసరి?" శేషగిరి మీద నోరు చేసుకుంది కోడలు సుజన.

"అబ్బే, అదేం లేదమ్మా! నేను కూడా అంత ముందుగా వస్తే బాగుండదేమోనని" చిన్నగా గొణిగాడు శేషగిరి.

"ఆరోగ్యం సరిగ్గా లేని మిమ్మల్ని ఒక్కరినీ వదిలేసి వెళ్తే జనం మమ్మల్ని ఛీ అంటారు. ఏం పర్లేదు రండి, అక్కడ మేము పెళ్లి పనులలో బిజీగా ఉంటే, మన చంటాడిని ఆడిద్దురు గాని" ఫైనల్ డెసిషన్ చెప్పి కిచెన్ లోకి వెళ్లింది సుజన.

"ఔను నాన్నా! సుజన చెప్పింది కరెక్ట్. పిల్లాడిని ఆడించడానికైనా మీరు రాక తప్పదు" భార్య మాటను బలపరచాడు సుభాష్.

అభిమానం అడ్డు వస్తున్నా, ఇక చేసేదేమీ లేక ఆ ప్రయాణం ఏర్పాట్లలో పడ్డాడు శేషగిరి.

***** ***** ***** *****

కుటుంబ సభ్యులతో నాగపూర్ చేరుకున్న రెండవ రోజు మధ్యాహ్నం, వీధి గదిలో తనకు కేటాయించిన సోఫాలో కూర్చొని ఏదో మరాఠీ దినపత్రికలో బొమ్మలు చూస్తున్నాడు శేషగిరి. లోపల గదుల్లో అందరూ నగలు, చీరలు గురించి చర్చించుకుంటున్నారు.

ఈలోగా, "హా... అడ్రస్ సహీ హై... కడ్బీ చౌక్ చౌరస్తా, పెట్రోల్ పంప్ కీ సామ్నే... 402, జీవన్ ధారా అపార్ట్మెంట్........" సెల్ ఫోన్ లో ఎవరితోనూ మాట్లాడుతూ వీధి గదిలోకి వచ్చాడు సుజన తండ్రి, హర్షవర్ధన్.

వియ్యంకుడిని చూసి, సోఫాలోంచి లేచాడు శేషగిరి.

"చూడండి శేషగిరీ, ప్రతిభా సూపర్ మార్కెట్ నుంచి సరుకులు తీసుకుని డెలివరీ బోయ్ వస్తాడు. బెల్ కొడితే చూడండి, లోపల మేము కొంచెం బిజీగా ఉన్నాము" శేషగిరికి చెప్పి లోపలికి వెళ్లాడు హర్షవర్ధన్.

‘హూ...ఈ మహానుభావుడికి, నన్ను బావగారూ, అని పిలవటానికి కూడా నామోషీ. అయినా ఇదంతా ఈ సుభాష్ గాడి వల్లనేలే...’ అని మనసులో అనుకుంటూ ఒకసారి గతంలోకి జారిపోయాడు శేషగిరి.

***** ***** ***** *****

అప్పట్లో వైజాగ్ లో ఓ బట్టలు షాపులో సేల్స్ మెన్ గా పనిచేస్తూ, ఓ చిన్న ఇంట్లో అద్దెకు ఉండేవాడు తను. సుభాష్ కి పదిహేనేళ్ల వయసు ఉండగా, దురదృష్టవశాత్తూ తన భార్య మానసిక వ్యాధితో మరణించింది. ఆ రోజు నుంచి సుభాష్ ని కంటికి రెప్పలా కాచుకున్నాడు తను.

తనలా కాకుండా, వాళ్ల అమ్మ పోలికలతో అందంగా, తెల్లగా ఉండేవాడు సుభాష్. అందుకనేనేమో, అమ్మాయిల దృష్టి వీడిమీదే ఉండేది. డిగ్రీ ఆఖరి సంవత్సరంలో ఉండగా ఓ రోజు ఓ అమ్మాయితో ఇంటికి వచ్చాడు సుభాష్. వచ్చీరాగానే,

"నాన్నా! ఈ అమ్మాయి పేరు సుజన. నాగపూర్ లో బాగా స్థిరపడ్డ ఆంధ్రులు. వీళ్ళ నాన్నగారు నాగపూర్ లో ఆదాయపు పన్ను శాఖలో పెద్ద హోదాలో ఉన్నారు. ఈ అమ్మాయి ఇక్కడ హాస్టల్లో ఉండి యూనివర్సిటీలో డిగ్రీ చదువుతోంది. ఓ సెమినార్ లో పరిచయం అయ్యింది...." అంటూ చెప్పుకుపోసాగాడు, సుభాష్.

ఈలోగా అతనికి అడ్డుపడి,

"డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చేస్తున్నా అంకుల్. మేమిద్దరమూ ప్రేమించుకున్నాము. నిజానికి, ఇలాంటి తక్కువ సంబంధం మా డాడీ అసలు ఒప్పుకోరు కానీ ఆయనని ఒప్పించే బాధ్యత నాది. ఏదో ఫార్మాలిటీ కోసం మీతో చెబుతున్నాము అంతే" ఒక్క ముక్కలో చెప్పింది సుజన.

నిశ్చేష్టుడై వింటున్న తనను పట్టించుకోకుండానే,

"ఔను నాన్నా! అంతా సుజన చూసుకుంటుంది. అలాంటి గొప్ప సంబంధం కుదిరితే మన జీవితాలు కూడా ఒడ్డున పడతాయి!" ఆశగా చెప్పాడు సుభాష్.

"మీరు ఇష్టపడ్డారు, వాళ్ల నాన్నగారు కూడా ఇష్టపడితే నాకు అభ్యంతరం ఏముంటుంది?" గొంతు పెగల్చుకొని ఎలాగో అన్నాడు కానీ, లోలోపల చాలా భయాందోళనలకు గురి అయ్యాడు తను.

మనసులో ఏ మూలనో ఈ పెళ్ళికి సుజన తండ్రి ఒప్పుకోక పోతే బాగుండును అని కూడా అనిపించింది. కొడుకు అమ్ముడుపోవటమనేది ఏ తండ్రికి మాత్రం ఇష్టమౌతుంది?

కూతురు మొండి పట్టుదల పట్టడంతో ఇక కాదనలేక ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు హర్షవర్ధన్. ఆ తరువాత తన పలుకుబడి ఉపయోగించి వైజాగ్ ఆదాయపుపన్ను శాఖలో తన అల్లుడికి ఓ ఉద్యోగం కూడా వేయించాడు, భవిష్యత్తులో తమ ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చన్న ఉద్దేశ్యంతో.

కొడుక్కి పెళ్ళయి, సుజన కాపురానికి వచ్చిన తరువాత, రెండు మూడు నెలలు బాగానే గడిచినా, తన ఆరోగ్యం పాడవడంతో, తన జీవితం పూర్తిగా కొడుకు, కోడలు చేతిలోకి వెళ్లిపోయింది. అన్నింటికీ వాళ్ళమీద ఆధారపడవలసిన దుస్థితి వచ్చేసింది తనకు.

***** ***** ***** *****

కాలింగ్ బెల్ శబ్దం వినబడడంతో ఉలిక్కిపడి గతంలోంచి బయటకు వచ్చిన శేషగిరి, లేచి వెళ్లి తలుపు తీసాడు. వచ్చిన ఆ డెలివరీ పర్సన్ సరుకులు లోపల పెట్టి, తిరిగి వెళ్లబోతోంటే, అతన్ని ఎక్కడో చూసినట్టు అనిపించింది. ఎక్కడ? ఎక్కడ చూసాడు తాను?

అతని వెనుకే వెళ్లి,

"ఇదిగో బాబూ! నీది వైజాగ్ కాదూ?" అడిగాడు శేషగిరి.

"తెలుగు మాలూమ్ నై, మే నాగపూర్ వాలా హూ" గబగబా చెప్పి, వేగంగా వెళ్లిపోయాడతను.

"ఇదిగో బాబూ, ఒకసారి ఇలా చూడు" అతని వెనుకనే, వేగంగా నడుస్తూ పిలిచాడు శేషగిరి.

శేషగిరి మాటలను వినకుండా, అతను గబగబా లిఫ్టులో వెళ్లి పోయాడు.

ఈలోగా లోపలి నుంచి వచ్చిన సుభాష్, "నాన్నా! కారిడార్ లో ఏమిటి ఆ అరుపులు, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు. లోపలికి నడు!" సీరియస్ గా అన్నాడు.

"ఒరే, సుభాష్! అతను... వాడు... వాడు ఎవరు అనుకుంటున్నావ్?" గద్గద స్వరంతో అడిగాడు శేషగిరి.

"ఎందుకు తెలియదూ, నాకు తెలుసు... రంగుతో సహా, అన్నీ నీ పోలికలే కదా... వాడు పదిహేనేళ్ల క్రితం ఇల్లు వదలి పారిపోయిన నీ పెద్ద కొడుకు విక్రమ్. ఇందాక సరుకులు లోపల పెడుతున్న సమయంలోనే వాడిని గుర్తు పట్టాను. మనిషిలో పెద్ద మార్పు ఏమీలేదు. అయినా వాడి మీద నీకంత ప్రేమ ఏమిటి నాన్నా? వాడి గురించి బెంగ పెట్టుకునే కదా, అమ్మ చనిపోయింది? దయచేసి, మావాళ్లకు ఆ డెలివరీ అతను నా అన్నయ్యని చెప్పకు!" కఠినంగా చెప్పాడు సుభాష్.

"సుబ్బూ, వాడు నీ కంటే ఆరేళ్లు పెద్ద. చదువు సరిగ్గా అబ్బక జులాయిగా తిరుగుతూ ఉంటే, కోపం వచ్చి, నేనే ఎక్కడికైనా పోయి కష్టపడి బతకమని వాడిని తరచుగా తిడుతూ ఉండేవాడిని. నా సాధింపులు భరించలేకనే ఓ రోజు ఇంట్లోంచి పారిపోయాడు. ఇదిగో ఇన్నాళ్లకు ఇలా..." కన్నీరు తుడుచుకుంటూ చెప్పాడు శేషగిరి.

"సరే, ఏడవకు. ముందు లోపలికి నడు. ఈ విషయం ఇక్కడితో వదిలేయ్. లేకపోతే నా పరువు పోతుంది, అర్థమయ్యిందా?" హెచ్చరికగా చెప్పాడు సుభాష్.

'ఒరే సన్నాసీ, వాడు నీలా ఒకరి నీడలో బతుకుతున్న పరాన్నజీవి కాదురా. తన స్వశక్తితో బతుకుతున్న కష్టజీవి' అని మనసులో అనుకుని,

"సరే ఈ విషయం మీ వాళ్లకు చెప్పను, నీ కడుపు మీద కొట్టను సరేనా?" తండ్రి చెప్పిన ఈ మాటతో ఆనందంగా లోపలకి వచ్చాడు సుభాష్, తండ్రి వెంట రాగా!

***** ***** ***** *****

లిఫ్ట్ లోకి అడుగుపెట్టి, జి బటన్ నొక్కిన విక్రమ్ కళ్ళు కన్నీటితో నిండిపోయాయి. లిఫ్ట్ లో అప్పుడు ఎవ్వరూ లేకపోవటం అతని అదృష్టం. పదిహేనవ అంతస్తు నుండి వేగంగా దిగుతున్న ఆ లిఫ్ట్ లోని ఆ డెలివరీ పర్సన్ విక్రమ్ దుఃఖం అంతకన్నా వేగంగా పెల్లుబుకుతోంది. కడుపు ఉండ చుట్టుకుపోతుండగా... రెండు చేతుల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగాడు.

ఎన్నాళ్ళు... ఉహు, ఎన్నేళ్ళు అయింది నాన్న ముఖం చూసి? ఏదీ ఆ సింహంలాంటి రాజసం, గాంభీర్యం? ఏదీ కన్నులలో ఆ ఆత్మవిశ్వాసం? ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు నాన్న? వాడు... వాడు... సుభాష్... ఏం మారలేదు... అలాగే అందంగా ఉన్నాడు, కానీ అలాగే కఠినంగా కూడా... చిన్నప్పుడు... తనకు అన్నింటిలో ఫెయిల్ మార్కులు వస్తే ఎంతో చీదరింపుగా చూసేవాడు. తనకు వాడంటే ఎంతో ఇష్టం... దగ్గరకు చేరబోతే ఛీ కొట్టేవాడు. తను నల్లగా ఉంటానని వాడికి చిన్నచూపు.
ఓ సారి నాన్న తనను వీపు చిట్లేలా బెల్టుతో కొట్టి, ఇంట్లోంచి వెళ్ళిపొమ్మని అన్నాడు.

తనకూ అనిపించింది... ఆయన్ను తాను చాలా విసిగిస్తున్నాడు... ఎంత ప్రయత్నించినా చదివినవి గుర్తు ఉండటం లేదు... ‘బయటకు వెళ్లిపోవాలి... వీళ్ళకు అందనంత దూరం’ అనుకుంటూ రైలు ఎక్కి చాలా దూరం వెళ్ళిపోయాడు... ఇప్పుడు ఇలా ఉన్నాడు... డెలివరీ ఏజంట్ గా పనిచేస్తూ... నాన్న తన దగ్గరకు వస్తే ఎంత బాగుండును? వస్తాడా? వస్తే మాత్రం పువ్వుల్లో పెట్టి చూసుకోడూ? అవునూ, అమ్మ? అమ్మ కనిపించదేమి? ఒకవేళ అమ్మ వీళ్ళతో రాలేదేమో...

ఎలాగో ఆఫీసుకు చేరుకున్నాడు విక్రమ్.
“ఏమిట్రా, అదోలా ఉన్నావు?” కొలీగ్ అడిగిన ప్రశ్నకు ఏమీ లేదంటూ దాటవేసి, మేనేజర్ దగ్గరకు వెళ్ళి ఇక ఆ రోజుకు తాను పనిచేయలేనని చెప్పి పర్మిషన్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు.

***** ***** ***** *****

విక్రమ్ వెళ్ళిన ఓ పావుగంట తర్వాత, "సార్, ఇందాకా వచ్చిన ఆ డెలివరీ బాయ్ ఫోన్ నెంబర్ ఇస్తారా?" హర్షవర్ధన్ ని అడిగాడు శేషగిరి.

"దేనికి శేషగిరి గారూ! వాడికి ఏవైనా పెళ్లి సంబంధాలు చూస్తారా?" వెటకారంగా, నవ్వుతూ అడిగాడు హర్షవర్ధన్.

"లేదు సార్. అతను చాలా అభిమానవంతుడులా ఉన్నాడు. టిప్పు ఇవ్వబోతే వద్దన్నాడు. అంత అభిమానం పనికిరాదని చెబుదామని" తన వైపు అనుమానంగా చూస్తున్న సుభాష్ వంక చూస్తూ, వియ్యంకుడు చెప్పిన ఆ నెంబర్ నోటు చేసుకున్నాడు శేషగిరి.

అంతేకాదు, ఈ వివాహ కార్యక్రమం అయిన తరువాత తను వైజాగ్ రావడం లేదని, ఇక తన శేషజీవితం అంతా, స్వశక్తితో పైకి వచ్చిన తన పెద్దకొడుకు విక్రమ్ వద్దేనని సుభాష్ కు చెప్పాలని నిశ్చయించుకున్నాడు శేషగిరి.

అందరూ హడావుడిగా ఉన్న సమయంలో, లిఫ్ట్ ఎక్కి, ఓ రెండు ఫ్లోర్ల క్రిందకు వచ్చి, అక్కడ కారిడార్ లో నిలబడి, విక్రమ్ నంబర్ రింగ్ చేసాడు శేషగిరి.

“హలో” అనగానే,
“నాన్నా, విక్కీ, నేను నాన్నను మాట్లాడుతున్నారా... వెంటనే వచ్చి నన్ను నీతో తీసుకువెళ్ళరా... ప్లీజ్...” అని చెప్పి కాల్ కట్ చేసేసాడు శేషగిరి. తరువాత చాలా నమ్మకంగా లిఫ్ట్ లోకి వచ్చి, ఆనందంగా క్రిందికి దిగసాగాడు ఆ ధన్యజీవి.

***** **శుభం** *****