మగాళ్లూ మీకు జోహార్లు

వీధి అరుగు (ఆస్ట్రేలియా) • 01 Mar 2023 • 👁 6 views
మగాళ్లూ మీకు జోహార్లు
*****
*మగాళ్లూ మీకు......*
==============
(హాస్య కథ)

(నేను రాసిన ఈ హాస్య కథ, *ఆస్ట్రేలియా* వేదికగా వస్తున్న *వీధి అరుగు* అనే మాసపత్రికలో *మార్చి 2023* న ప్రచురితమైనది)

రచన ::
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్

"మహిళలతో సమానంగా మాకు కూడా సమాన బాధ్యతలు కల్పించాలి"

"అన్ని పనులూ ఆడవాళ్లు మాత్రమే చేయాలా? ఏం ? మేమెందుకు చేయకూడదు?"

"ఔను, మహిళలు చేసే ఇంటి పనులలో కొన్ని మాకు కూడా బదిలీ చేయాలి"

"ఔను. అవసరమైతే దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేద్దాం!"

ఇలాంటి స్లోగన్లతో ఆ 'భ.హ.సం' ఉన్న భవనం, వయసు మీద పడిన మిక్సీలా దడదడలాడి పోతోంది. అక్కడ ఉన్న సుమారు రెండు వందల మంది మగవాళ్ల మొహాలు, నిప్పులో పడిన ఎండు మిర్చిలా ధుమధుమలాడుతున్నాయి.

"సైలెన్స్, కొంచెం నిశ్శబ్దంగా ఉండండి. మీ బాధ మాకు అర్థమైంది. అందరి సూచనలు విని, ఆ తర్వాత ఒక తీర్మానం చేద్దాం! ఒక్కొక్కరే లేచి మీ సమస్య వివరించండి" సభను ప్రారంభిస్తూ చెప్పాడు 'భర్తల హక్కుల సంఘం (భహసం)' అధ్యక్షుడు ఉమాపతి.

"ఏంటి సార్ ఈ దౌర్జన్యం? ప్రతీరోజూ ఆడవాళ్లే లేచి ఇల్లు ఊడ్చాలా? ఏం, ఆ పని మేము చేయలేమా? ఇల్లు తుడిచే బాధ్యత మనకు అప్పగించేలా తీర్మానం చేయండి" చేతికి పట్టిన మట్టిని తుడుచుకుంటూ ఆవేశంగా చెప్పాడు గౌరీపతి.

"ఏం ? బట్టలు ఆడవారే ఉతకాలా? అదేమన్నా బ్రహ్మవిద్యా? అది మనమే చేసేలా తీర్మానంలో పెట్టండి" ఇస్త్రీ మడత నలగని షర్ట్ ను చూసుకుంటూ అరిచాడు సీతాపతి.

"హేమిటో, ఇంటి ముందు ముగ్గులు వేయడం కూడా ఒక కళేనా? మనం వేయలేమా?" సెల్ ఫోన్ లో 'ముగ్గులో ఆడది' అనే కథ చదువుతూ సిగ్గుపడుతూ చెప్పాడు లక్ష్మీపతి.

"ఏం ? ఆఖరికి లేడీ ఫింగర్లు కూడా లేడీసే తరగాలా? కూరలు తరగడంలో మన ప్రతిభ ఏమిటో చూపుదాం! తీర్మానం చేయండి" కీచుగా అరిచాడు, ఆలస్యంగా పెళ్లి చేసుకుని భంగపడ్డ మంగపతి.

"గిన్నెలు తోమడం అనేది, ఏదో గిన్నిస్ రికార్డు సాధించినంతగా సంబరపడిపోతుంటారు ఈ ఆడవారు. దానిని మనం బ్రేక్ చేయాలి. తీర్మానం చేయండి సార్!" లాలాజలం తుడుచుకుంటూ చెప్పాడు విష్ణుపతి.

"సార్, అన్నం వండడంలో మన మగవారికి పూర్వ చరిత్ర ఉన్నా, అది మాత్రం తమ జన్మహక్కుగా ఫీలవుతారు ఈ ఆడవాళ్లు. అది మార్చాలి మనం" చెప్పాడు పొడుగు సుమారుగా ఉండే రమాపతి.

"ఏమండీ అంటే అన్నామంటారు కానీ, సునాయాసంగా గేరేజీలో సరుకులు సర్దే మనకి ఈ కేరేజీలో కూరలు సర్దడం ఓ లెక్కా?" జేబులోని స్క్రూ డ్రైవర్ సర్దుకుంటూ చెప్పాడు చలపతి.

ఇక చివర్లో ఉమాపతి లేచి,

"సరే, మై డియర్ ఫ్రెండ్స్! ఈ భహసం అధ్యక్షుడిగా పనులు చక్కబెట్టే నేను, ఇంట్లో సామాన్లు చక్కబెట్టలేనా? అందుకే మీరు చెప్పిన ఈ ఏడు సూత్రాలతో పాటు నా వంతుగా ఎనిమిదో సూత్రంగా ఈ ఇల్లు సర్దడం అనే అంశం చేరుస్తున్నా. ఈ ఎనిమిది అంశాల ప్రణాళికా కాపీలు మీ అందరికీ సాయంత్రం లోగా అందచేస్తాము. దాని ప్రకారం మీరందరూ ఆ పనులు చేసి, మీ భార్యలను ఆశ్చర్యపరచాలి. ఆ తర్వాత తీరుబడిగా, పంచసూత్ర ప్రణాళిక లాంటి ఈ అష్టసూత్ర ప్రణాళిక కాగితం వాళ్లకి అందచేయాలి. ఓకేనా? మరి భవిష్య కార్యక్రమానికి సిద్ధం కండి. ఆల్ ది బెస్ట్" అంటూ సభను చాలించాడు.

***** ***** ***** *****

మర్నాడు ఉదయం...

ఉదయాన్నే లేచి, టిప్ టాప్ గా తయారయ్యి ఇల్లంతా "టకటకా" సర్దేస్తున్న "ఉమాపతి"ని చూస్తూ ఆశ్చర్యపోయింది అతని "భార్య".

ఫేంటు పైకి మడిచి, చీపురుతో ఇల్లు "గబగబా" ఊడ్చేస్తున్న "గౌరీపతి"ని చూసి విస్తుపోయింది అతని "సతి".

డైనింగ్ టేబుల్ వద్ద కూర్చుని, కంట నీరు తుడుచుకుంటూ "పరపరా" ఉల్లిపాయలు తరిగేస్తున్న "మంగపతి" వంక బెంగగా చూసింది అతని "అర్ధాంగి".

వాష్ రూమ్ లో బాసింపట్టి వేసి బట్టల్ని "దబదబా" బండకేసి ఉతికేస్తున్న "సీతాపతి"ని చూసి బుగ్గలు నొక్కుకుంది ఆయన "బెటర్ హాఫ్".

ఇంటి ముందు కల్లాపి చల్లి, లుంగీ పైకి మడిచి, నేల మీద కూర్చొని, "చకచకా" ముగ్గులేస్తున్న "లక్ష్మీపతి"ని సిగ్గుపడుతూ చూసింది వారి "వైఫ్".

సింక్ ముందు నిలబడి కొబ్బరి పీచుతో గిన్నెలకు చిల్లులు పడేలా "బరాబరా" తోమేస్తున్న "విష్ణుపతి"ని వింతగా చూసింది ఆయన "ధర్మపత్ని".

స్టౌ ముందు నిలబడి, కాకరకాయ వేపుడుని "కరకరా" నమిలేసాలా అవలీలగా వేయిస్తున్న "రమాపతి"ని క్రీగంట చూస్తోంది "వాళ్లావిడ".

జలతరంగిణి వాయించేవాడిలా కేరేజీ గిన్నెలు వరసగా పెట్టి, వాటిని "టపటపా" సర్దేస్తున్న "చలపతి" వైపు చంచల మనసుతో చూస్తోంది ఆ "ఇంటావిడ".

మిగతా అందరి సభ్యుల ఇంటివద్ద కూడా ఇదే పరిస్థితి. ఆశ్చర్య పోయిన ఆ అర్ధాంగులు ఇక ఉండబట్టలేక ఎవరికి వారు తమ తమ భర్తలను అడిగారు "షడన్ గా ఏమిటి ఈ మార్పు?" అని.

దానికి "ఇన్నాళ్లూ మిమ్మల్ని బాధ పెట్టాం. ఇన్నాళ్లకు మా తప్పు తెలుసుకున్నాం. మా బాధ్యత గుర్తించాం. ఇంకేమీ అడగకండి. ప్లీజ్! ఇక, మీ దినచర్యలో మేము పాలు పంచుకునే పనుల వివరాలు కావాలంటే మటుకు ఇదిగో ఈ 'అష్టసూత్ర ప్రణాళిక' చదువుకోండి " అంటూ ఆ కాగితం తమ తమ భార్యలకు అందచేసారు ఆ భర్తలు.

అది చదివి, 'మార్చి ఎనిమిది', 'మహిళా దినోత్సవం' సందర్భంగా, ఇకనుంచి ఎనిమిది రకాల ఇంటి పనులు తమ భర్తలు చేస్తారని తెలుసుకున్న ఆ మహిళామణులు, ఇప్పటి కైనా తమ భర్తలకు జ్ఞానోదయం కలగచేసినందులకు ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు, "మగాళ్లు ఎంత మంచివాళ్లు" అని మనసులో పాడుకుంటూ.

(మహిళామణులు అందరూ, ఇక్కడితో ఆగిపొండి! నా మాట వినండి. ఇంక ముందుకు వెళ్లకండి)

***** ***** ***** *****

ఆ మర్నాడు, మార్చి 9 ఉదయాన్న...

"ఏవండీ, లేవండీ! ఇల్లు చిందరవందరగా ఉంది, అన్నీ సర్దేసిన తర్వాత నన్ను లేపండేం" ఉమాపతికి ఆర్డర్ వేసింది అతని భార్య.

"గదులన్నీ మట్టిమట్టిగా ఉన్నాయి. తొందరగా లేచి తుడవండీ" పడుకున్న గౌరీపతి ఫేంటు పట్టుకుని లాగుతూ బతిమాలింది అతని సతి.

ఇలా...

ఆ సంఘ సభ్యుల అందరి ఇళ్లలోనూ
తమ భర్తలను లేపి, పనులలో పెట్టడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు ఆ మహిళామణులు.

వారి అభ్యర్ధనలను పెడచెవిన పెట్టిన, ఆ పురుషపుంగవులు బద్దకంగా ఒళ్ళు విరుచుకుంటూ,

"ప్రతీ వ్యాపార ప్రకటనకు చివర్లో చిన్న చిన్న అక్షరాలతో "షరతులు వర్తిస్తాయి" అని ఉంటుంది. అలాగే ఈ 'అష్టసూత్ర ప్రణాళిక' చివర్లో చిన్న చిన్న అక్షరాలతో ఏముందో ఓ సారి చూడండి" అంటూ మళ్ళీ దుప్పటి బిడాయించుకున్నారు.

అంతే, అందరూ ఆత్రుతగా ఆ కాగితంలోని చివరి వాక్యాలు వంక చూడసాగారు‌ ఆ మహిళామణులు.

అందులో..

"ఈ అష్టసూత్ర ప్రణాళిక అమలు కేవలం మార్చి ఎనిమిది, మహిళా దినోత్సవం రోజున మాత్రమే. మిగతా రోజుల్లో ఇది వర్తించదు"

అని ఉండడం చూసి విస్తుపోయిన ఆ మహిళామణులు,
ఇప్పటికి కూడా తమ భర్తలకు జ్ఞానోదయం కలగచేయనందుకు ఆ దేవుడిని మనసులో నొచ్చుకుంటూ, యధావిధిగా తమ రోజువారీ కార్యక్రమాల్లో పడ్డారు "మగాళ్లు వొట్టి మాయగాళ్లు" అని మనసులో పాడుకుంటూ.

***** **శుభం** *****

అంకితం::
ప్రతీరోజూ భార్యల పనులలో సహకరించే మంచి భర్తలకు మాత్రమే ఈ కథ అంకితం.

@@@@@@@@