కాక కోక కేక కాకి

వీధి అరుగు (ఆస్ట్రేలియా) • 01 Dec 2022 • 👁 7 views
కాక కోక కేక కాకి
*కాక..కోక..కేక..కాకి*
==========
(హాస్య కథ)

(నేను రాసిన ఈ హాస్య కథ, వీధి అరుగు (ఆస్ట్రేలియా) అనే మాసపత్రికలో, డిసెంబర్ 2022 లో ప్రచురితమైనది)

రచన ::
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్

ఆ బడి వద్దకు వెళ్లి, ఇక్కడ కవికొండల కామరాజు ఎవరు అంటే ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే, అతడిని కామయ్య కవి అని కొంతమంది పిలిస్తే, పరమ బద్ధకస్తులు మాత్రం 'కా క' అని ముద్దుగా పిలుచుకుంటారు మరి.

ఆగండాగండి. ఈ కామయ్య కవి అంటే ఓ యాభై ఏళ్ల వయసున్న మేష్టారు అయ్యుండొచ్చు అని మీరు అనుకుంటే మటుకు మీరు కప్పులో చెప్పేసినట్లే. ఎందుకంటే, అతను అక్కడ ఆరో తరగతి చదువుతున్న ఓ చిన్న కుర్రాడు.

తన వంశంలో అటు బరంపురం నుంచి ఇటు బళ్లారి వరకూ కూడా ఎవరూ కవులు లేకపోవడంతో తనో పెద్ద కవిగా ఫీలవుతూ ఆ కా క పిలుపుతో పొంగిపోతూ ఉండేవాడు కామయ్య కవి.

అయితే అలా పొంగినప్పుడల్లా అతని తల మీద నీళ్లు బదులు మొట్టికాయలు చల్లి, ముందు చదువు సంగతి చూడరా సన్నాసీ అని అనగదొక్కేది అతని తల్లి 'కో క' ఉరఫ్ కోమల కవికొండల.

అయితే ఓ నాలుగు నెలల తర్వాత అతని కవితా ప్రవాహానికి ఆనకట్ట పడిన సంఘటన ఆ రోజు జరిగింది. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే...

***** ***** ***** *****

తరగతి గదిలో చివర బెంచీలో కూర్చుని, కాగితం మీద ఏదో బరబరా గీకేస్తున్న కామరాజు నుద్దేశించి,

"ఏం చేస్తున్నావురా కా క?" కేకేసారు, అందరూ కేకేసారు అని పిలుచుకునే కేశనకుర్రు కేశవరావు మాష్టారు.

"మీ మీద ఓ పద్యం రాసాను సార్" గర్వంగా చెప్పాడు కాక.

"ఒరే కా క! నా మీద నువ్వు కాక ఇంకెవరు పద్యం రాస్తార్రా? ఏదీ చదువు" అన్నారు తన భారీదేహాన్ని కుర్చీలోకి సర్దుబాటు చేస్తూ.

వెంటనే బెంచి మీద నుంచి లేచి,

"మా కేకేసారు మాకు మంచి గురువు
మోసుకోలేరు ఆయన తన బరువు
ఊరంతా మాత్రం పెడతారు అరువు
పాఠం చెప్పడంలో మాత్రం కరువు"

అని చదివి మాష్టారి స్పందన కోసం చూడసాగాడు కామయ్య కవి, మిగతా పిల్లలంతా బిత్తరపోయి చూస్తుండగా!

ఆ కవిత విని దిమ్మదిరిగిపోయిన కే కే సారు, కుర్చీలోంచి లేచి, తన భారీ కాయాన్ని నెమ్మదిగా తోసుకుంటూ కా క వద్దకు వచ్చి, మెచ్చుకోలుగా అతని భుజం తట్టి,

"తీసేసావురా నాకున్న పరువు
ఇంక తప్పదు నీకు ఈ దరువు "

అంటూ చింతబెత్తంతో కామయ్య కవి వీపు మీద ఘాట్టిగా పాఠం చెప్పేసారు కే కేసారు.

***** ***** ***** *****

"అమ్మా....." అంటూ కేకలేస్తూ బడి నుంచి వచ్చిన కా క ను చూసి కోక ఆరేసుకుంటున్న కా క తల్లి కో క ఉరఫ్ కోమల కవికొండల,

"ఏంటి కా క? ఆ వీపు మీద ఆ గతుకులేంటి?" కోకను పిండుతూ అడిగింది.

"బాగాలేవని నేను రాసిన రాతలు
మా సారు పెట్టారు ఈ వాతలు"

అంటూ జరిగిన విషయం పద్యంగా చెప్పాడు.

వెంటనే స్పందించిన కో క

"అబ్బే చాలవురా ఈ మోతలు
పడాలి ఇంకో నాలుగు వాతలు"

అంటూ వీపు మీద కే కే సారు కొట్టగా మిగిలిన స్థలంలో చింత బరికతో బాది ఆ ప్రదేశాన్ని లెవిల్ చేసేసింది.

నీరు లేక బీటలు వారిన బీడు భూమిలా మారిన తన వీపును చూసుకుని, అదిగో అప్పటినుంచి కవితలకు కామా పెట్టేసాడు కా క.

***** ***** ***** *****

కవితలతో పాటు, ఇంటర్ అవ్వగానే చదువుకు కూడా కామా పెట్టేసిన కా క కు
కే క తో అదే కేదారేశ్వరి కపిలవాయి తో వివాహం చేసేసింది కో క.

ఏదో ఓ పదిమందికి ప్రైవేట్లు చెప్పుకుంటూ కాలం వెల్లదీస్తున్నాడు కా క.

అయితే, కా క కవిత్వం గురించి ఆనోటా ఈనోటా విన్న కే క , అతనిలో దాగి ఉన్న కవితా ప్రవాహాన్ని బయటకు లాగాలని ప్రయత్నించి‌, ఓ రోజు

"ఏమండీ మీరు మీ చిన్న తనంలో రాసిన కవిత్వం గురించి, దాని పరిణామాలు గురించి తెలిసింది. కానీ, కవిత్వం వలన అంత పెద్దగా పేరు రాదు. నా మాట విని కథలు రాయడం మొదలుపెట్టండి" అంటూ కా క కు కాక పుట్టించింది కే క.

ఆ మాట వినగానే వరదలకు తెగిన ఆనకట్టలా, కా క లో కథావేశం తన్నుకొచ్చింది. వెంటనే యూర్రేకా అంటూ ఓ కేక వేసి, కలాన్ని, కాళ్లనీ ఓ సారి విదిలించి కాగితం తీసుకుని కథలోకి దూరిపోయాడు కా క, అక్కడ చదువుకుంటున్న ప్రైవేటు పిల్లలు భయం భయంగా చూస్తుండగా!

***** ***** ***** *****

"ఏమండీ! రెండు నెలల క్రితం మీరు పంపిన మొదటి కథకు చెక్కు వచ్చినట్టుందండోయ్" పోస్ట్ మాన్ ఇచ్చిన కవర్ తీసుకుంటూ ఆనందంగా కేక పెట్టింది కే క.

"ఔనా? ఎంత అమోంట్ పంపారో చూడు" కారుతున్న చొంగ తుడుచుకుంటూ అడిగాడు కా క.

"మిమ్మల్ని తగలెయ్యా, ఇది చెక్కు కాదు వెనక్కి వచ్చిన మీ కథ. ఔనూ ఆ పత్రిక వాళ్లు మీ కథలో కొన్ని పదాలు హైలైట్ చేసి పంపించారేమిటండీ?" ఆశ్చర్యంగా అడిగింది కే క.

"ఔనా ? ఏదీ ఆ కథ ఓసారి చదువు" అతృతగా అడిగాడు కామయ్య కవి.

"చదువుతున్నా, విని తగలడండి..అదే విని తరించండి" అంటూ బిగ్గరగా చదవసాగింది..

" *పులుస్టాపు* పురంలో నివసిస్తున్న కాముడు *సమాసాలు* అమ్ముకుని జీవిస్తున్నాడు. అతనికి ఆ ఊరి *వ్యాకరణం* గారంటే అమితమైన *విభక్తి* " ...
రెండు లైన్లు చదివి, ఇంక చదవలేక
"ఓలమ్మో ! ఇదేం కథ? ఇవేం పదాలు?" అంటూ ఓ చావు కేక పెట్టింది కే క.

"అంటే..అది.. అది... ప్రైవేటు పిల్లలకు వ్యాకరణం చెబుతూ రాసిన కథన్న మాట. అయినా ఆ ఎడిటర్ అక్కడ కామా, సమోసాలు, కరణం, భక్తి అని మార్చి కథను వేసుకోవచ్చుగా? హేమిటో కొత్త కథకులను ప్రోత్సాహిద్దాం అనే ఆలోచనే ఉండదు వీళ్లకు.." సంజాయిషీ ఇస్తూ చెప్పాడు కా క.

"రెండు లైన్లకే ఇన్ని బూతులు అయితే రెండు పేజీలు మార్చడం అంటే మాటలా? ఇంకా నయం ఆ ఎడిటర్ ఎవరో నాలాగే గట్టిపిండంలా ఉన్నాడు. ఇంకోకడైతే ఈ పాటికి లెటర్ లో మీ పేరు రాసి ఆత్మహత్య చేసుకొనేవాడు" తల బాదుకుంటూ చెప్పింది కే క.

"సరే! ఈసారి జాగ్రత్తగా రాస్తాలే!" కే క ను సముదాయిస్తూ చెప్పాడు కా క.

***** ***** ***** *****

మరో రెండు నెలలు తరువాత పోస్ట్ లో వచ్చిన కవర్ తెరిచిన కే క

"ఇదిగోండోయ్..మీ రెండో కూతురు కూడా మీ మీద బెంగతో తిరిగి పుట్టింటికి వచ్చేసింది" కవర్ విప్పుతూ వెటకారంగా చెప్పింది.

"ఔనా! ఈ కథ బాగానే రాసానే! ఎక్కడ తేడా కొట్టిందంటావ్?" ఆలోచిస్తూ అన్నాడు కా క.

"ఎక్కడా? ఇదిగో ఇక్కడ! కథ చదువుతున్నా విని తరించండి....

"ఆ రోజు కాముడికి *శీతోష్ణస్థితి* సరిగ్గా లేదు. లోపల *భాష్పోత్సేకాలు* రగులుతున్నాయి. తన భార్య *అయిస్కాంతాన్ని* పిలిచి *పాదరసం* వండమన్నాడు...."

కథ చదవడం ఆపి "ఏమిటండీ ఈ కథ? అసలు ఏం చెప్పదలచుకొన్నారు? ఆ ఎడిటర్ ఏమని రాసారో చూడండి..ఇంకో సారి ఇలాంటి కథలు పంపిస్తే మీ పేరు పిచ్చాసుపత్రి వాళ్లకు రిఫర్ చేస్తారుట" కా క ను పేకాడేసింది కే క.

"అంటే.. అది.. అది.. పిల్లలకు సైన్స్ పాఠాలు చెబుతూ అలా అలా రాసేసనన్నమాట. అక్కడ మానసిక స్థితి, భావోద్వేగాలు, సూర్యకాంతం, పాయాసం అని పెడితే సరిపోతుందన్న మాట. ఆ విషయం ఆ ఎడిటర్ కి తెలియదన్నమాట" నంగినంగిగా చెప్పాడు కా క.

"అయినా మిమ్మల్ని కథలు రాయమని ప్రోత్సాహించడం నాదే తప్పు. ఏదో ఓ రవికల గుడ్డకు సరిపడా డబ్బులు వస్తాయని ఆశపడ్డాను కానీ, ఇలా పీకల మీదకు తెస్తారనుకోలేదు" చీదిన ముక్కును గోడకు రాస్తూ చెప్పింది కే క.

"సరేలే! ఆ గోడ పాడి చేయకు. ఈసారి పిల్లలకు ప్రైవేటు చెబుతూ కాకుండా రాత్రి కూర్చుని కథ రాస్తా" కే క ను కాకా పట్టాడు కా క.

***** ***** ***** *****

ఓ ఆర్నెళ్ల తరువాత తపాలాలో వచ్చిన ఓ ఉత్తరం తీసుకుని

"హేవండోయ్! ఈ సంగీత సుధ పత్రిక వాళ్లెవరో మీ కథ వేసుకుంటారుట. అయితే కొన్ని సూచనలు చేసారు. మీరు పంపిన కథను, వాళ్లు మార్చి రాయమన్న కథనూ కూడా పంపారు. చదువుతా వినండి.

ముందు మీరు పంపిన కథ...

"ఆ రోజు పెళ్లాం చేత చిక్కి, దెబ్బలు తిని ఆకలితో ఉన్న కాముడు శివదేవుని గుడికి వెళ్లాడు. అక్కడికి చేరుకున్న అతనిలో భక్తి భావాలు పెల్లుబికాయి. ఈలోగా వంటశాల నుంచి వచ్చిన ఘుమఘుమలు ఆస్వాదిస్తూ, అంతా దేవుని మాయ అనుకుంటూ ఆ వైపు అడుగులు వేసాడు.............." అంటూ చదువుతున్న
కే క తో

"సరే కథ పూర్తిగా అవసరం లేదు కానీ, వాళ్ల వెర్షన్ ఏమిటో అది చదువు" భార్యను వేడుకున్నాడు కా క.

"సరే వాళ్లు అడిగింది చదువుతా వినండి.

"ఆ రోజు పెళ్లాం చేత *జిక్కి* , దెబ్బలు తిని ఆకలితో ఉన్న కాముడు, *మహదేవన్* గుడికి వెళ్లాడు. అక్కడికి చేరుకున్న అతనిలో *మనో* భావాలు పెల్లుబికాయి. ఈలోగా *ఘంటసాల* నుంచి వచ్చిన ఘుమఘుమలు ఆస్వాదిస్తూ అంతా దేవుని *లీల* అనుకుంటూ ఆ వైపు అడుగులు వేసాడు.."

అని చదవడం ఆపింది కే క.

"అలా ఎందుకు రాయాలంటావ్?" అమాయకంగా అడిగాడు కామయ్య కవి.

"అయ్యో మీ అమాయకత్వం ఆవులెత్తుకెళ్లా! ఆ మాత్రం తెలియదా? ఆ పత్రికలో అన్నీ సంగీత ప్రధానమైనవే వేస్తారు. అందుకే అలా మార్చమన్నారు" అసలు విషయం చెప్పింది కేదారేశ్వరి.

"నో..నా వృత్తికి ద్రోహం చెయ్యను. ఆ ఎడిటర్ ఎవరో నా కంటే తిక్కలోడులా ఉన్నాడు. ఈ కథను ఇంకా చక్కగా మలచి వేరే పత్రికకు పంపిస్తాను. అంతే కాదు, నాకు ఓ విషయం అర్థమయ్యింది. నేను తిరుగు టపా కోసం కవర్లు పంపితే వాళ్లు నా కథను తిరిగి పంపేస్తున్నారు. ఈసారి రిటర్న్ కవర్ పెట్టకుండా కథ పంపుతాను" కథాప్రతిజ్ఞ చేసాడు కా క.

***** ***** ***** *****

అదే కథను మరింత మెరుగులు దిద్ది, సర్దుబాటు అనే పత్రికకు పంపే పనిలో పడ్డాడు కా క.

ఓ రోజు తన స్టూడెంట్ అయిన కా కి ని అదే కామవరపు కిషోర్ ని పిలిచి, ఆ కథను పోస్ట్ చేయమని కా కి చేతికి ఇచ్చాడు కా క.

***** ***** ***** *****

ఓ వారం తిరగకుండానే సర్దుబాటు పత్రిక నుంచి వచ్చిన కవర్ చూసి కకావికలమై పోయిన కా క

"ఇదేమిటోయ్, మనం రిటర్న్ కవర్ పంపకపోయినా నా కథ తిరిగి పంపించారు ఏమిటి?" విడ్డూరంగా అడిగాడు కా క, కవర్ ముక్కలుగా చింపి అవతల పడేస్తూ.

"ఆ కథ, వాళ్ల దగ్గర ఉంటే ఎప్పటికైనా ప్రమాదమని వాళ్ల సొంత డబ్బులతో పంపించి ఉంటారు లెండి. ఏం చేస్తాం. నాకు రవికల గుడ్డ కొనుక్కునే ప్రాప్తం లేదన్నమాట. ఔనండోయ్, ఇంకో విషయం. ఈ మధ్య క కా, అదేనండీ కథల కార్ఖానా అనే వాట్సాప్ సమూహం ఏర్పడిందిట. అందులో ఇలాంటి కథలకు మరమ్మతులు చేస్తారుట. ఎవరైనా తెలిసిన వారి ద్వారా అందులో చేరండి. నన్నూ అలాగే జనాల్ని రక్షించిన వారవుతారు" ఇంకా ఆశ చావని
కే క, సలహా ఇచ్చింది కా క కు.

"అలగలాగే. నువ్వేటంటే నేనదంటాను" అంటూ ఫోన్ తీసాడు కా క.

ఇదంతా వింటూ తనలో తాను ముసిముసిగా నవ్వుకుంటున్నాడు కింద కూర్చుని చదువుకుంటున్న కా కి.

ఎందుకంటే..

సర్దుబాటు పత్రికకు పంపిన ఆ కవర్ మీద, టూ అడ్రస్ దగ్గర కా క చిరునామా, అలాగే ఫ్రమ్ అడ్రస్ దగ్గర సర్దుబాటు పత్రిక చిరునామా, పొరపాటున రాసింది అతనే కదా మరి !!

***** **శుభం** *****