*****
*గెస్ట్ హౌస్*
==========
(హార్రర్ స్టోరీ)
(నేను రాసిన ఈ కథ 2023వ సంవత్సరంలో ఒక ఫేస్బుక్ సమూహం వారు నిర్వహించిన హార్రర్ కథల పోటీలో మొదటి బహుమతి పొందింది. )
రచన ::
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్
"చూడండి, మీరు సీనియర్ కాబట్టి మీకు ఈ అసైన్ మెంట్ ఇస్తున్నా. మీరు ఈ రోజు రాత్రి బయలుదేరి ఆంధ్రా తమిళనాడు బోర్డర్ లో పల్లిపట్టు గ్రామం వద్ద ఉన్న మన క్లయింట్ తాలూకు ఫ్యాక్టరీ ఆడిట్ కి వెళ్ళండి. రెండు రోజులు అక్కడ ఉండి రిపోర్టు తయారు చేయండి. అక్కడ రంగనాధన్ అనే తెలుగు తెలిసిన అకౌంటెంట్ మీకు కావలసిన ఏర్పాట్లు చూస్తాడు" చెప్పవలసిన నాలుగు ముక్కలూ టకటకా చెప్పేసి వెళ్లిపోయారు మా సీనియర్ ఆడిటర్ సుదర్శన్ గారు.
పెద్దాయన మాట కాదనలేక ప్రయాణానికి సమాయత్తమయ్యాను. అయితే అక్కడ ఓ భయంకరమైన అనుభవాన్ని చవిచూస్తానని ఆ సమయంలో నాకు తెలవదు.
***** ***** ***** *****
మర్నాడు ఉదయం చిత్తూరు రైల్వే స్టేషన్ కి నన్ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చాడు రంగనాధన్. ఓ రెండు గంటల కారు ప్రయాణం తర్వాత కంపెనీకి చేరుకున్నాం.
సుమారు ఓ నలభై ఎకరాల స్థలంలో ఉంది ఆ కంపెనీ. ఫ్యాక్టరీ చుట్టూ పెద్ద ప్రహారీ గోడ. ముందు ఫ్యాక్టరీ ఆవరణ, అది దాటగానే ఓ చిన్న సైజు గోడ. దానికి ఓ చిన్న ఐరన్ గేట్. అది తీసుకుని ముందుకు వెళ్లగానే, పెద్ద పెద్ద సర్వే చెట్లతో, పిచ్చి మొక్కలతో నిండి ఓ చిన్న సైజు అరణ్యంలా ఉంది ఆ ప్రదేశం.
"సార్, అదిగో ఆ ఎడమవైపు కనిపిస్తున్న బిల్డింగే మన గెస్ట్ హౌస్. ఇక ఈ మార్గం ద్వారా తిన్నగా పోతే దూరంగా ఓ చిన్న గోడ కనబడుతోంది చూడండి, దాని తర్వాత ఉన్నదే కేంటీన్. ముందు మీరు ఫ్రెష్ అవ్వండి" అంటూ నన్ను గెస్ట్ హౌస్ వైపు తీసుకుని వెళ్లాడు రంగనాధన్.
"ఇంత నిర్మానుష్యంగా, నిశ్శబ్దంగా ఉందేమిటీ?" అనుమానం వచ్చి అడిగాను.
"ప్రస్తుతం అన్ సీజన్ మూలంగా ఫ్యాక్టరీ నడవడం లేదు సార్. మెయింట్ నెన్స్ మరియు ఆఫీసు స్టాప్ మాత్రమే వస్తున్నాం" చెప్పాడు రంగనాధన్, "ఏయ్, అముదవల్లీ ఎక్కడ ఉన్నావ్?" అని గట్టిగా కేకవేస్తూ.
"ఏంటి సారూ! ఆ అరుపులు? ఇక్కడే ఉన్నాగా? లోపల పక్క సర్దుతున్నా. ఒహో ఈ సారేనా మన గెస్టూ?" అంటూ జుట్టు విరబూసుకుని వచ్చింది నల్లగా, బలిష్టంగా ఉన్న ఓ ముప్పై ఏళ్ల స్త్రీ, నా వైపు అదోలా చూస్తూ. ఆ వాతావరణం, ఆమె ఆహార్యం చూడగానే నా ప్రాణం పోయినంత పని అయ్యింది. నా గుండెల్లో దడ నాకు స్పష్టంగా తెలుస్తోంది.
నా నలభై ఐదేళ్ల వయసులో ఎప్పుడూ ఇలా ఒంటరిగా లేను. ఆఖరికి లాడ్జీలలో కూడా కార్నర్ రూమ్ కాకుండా మధ్యలో ఉన్న రూమ్ అడిగి మరీ తీసుకునేవాడిని. అలాంటిది ఈ కీకారణ్యంలో నేనొక్కడినీ ఎలా ?? ఇలా అలోచిస్తూ,
"ఔనూ ఈ గెస్ట్ హౌస్ లో నేను కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారా?" భయం బయటకు కనపడకుండా అడిగాను.
"అబ్బే ఎవరూ లేరు సార్. మీరొక్కరే. మూడు నెలల తర్వాత ఇదిగో, మీరే రావడం. ఫ్యాక్టరీకి దగ్గర్లో ఏ లాడ్జీలు లేకపోవడంతో, ఎవరు వచ్చినా ఇక్కడే ఉంటారు సార్. కేంటీన్ నుంచి కాఫీ, టిఫిన్ పంపిస్తా. మీరు రెడీ అయ్యి ఆఫీసుకు వచ్చేయండి" అముదవల్లికి ఏదో చెప్పి వెళ్లిపోయాడు రంగనాధన్.
స్నానం చేసి, ఏదో ఆలోచిస్తూ డ్రెస్ వేసుకుంటున్న నాకు, తలుపు చప్పుడు కావడంతో ఉలిక్కిపడి, వెళ్లి డోర్ తీసాను.
ఎదురుగా నల్లగా, తుమ్మమొద్దులా ఉండి, భుజాల మీదకి జారిపడుతున్న పెద్ద పెద్ద తల వెంట్రుకలను వెనక్కి తీసుకుంటూ,
"మీరొక్కరేనా గదిలో ఉండేది?" అడిగాడు తన గారపళ్లు కనబడేలా నా వైపు తీవ్రంగా చూస్తూ మిడిగుడ్లు మిటకరిస్తూ భగభగ మండుతున్న ఎర్రటి కళ్లతో ఉన్న ఓ నలభై ఏళ్ల వ్యక్తి.
"అ..అ..అ...ఔను ఒక్కడినే" అతని వైపు భయంభయంగా చూస్తూ చెప్పాను.
"ఎన్నాళ్లుంటారు?" బొంగురు గొంతుకతో అడిగాడు, నా వైపు నమిలేసేలా చూస్తూ.
"ఎ...ఎ...ఎల్లుండి సాయంత్రం వరకూ" గుటకలు మింగుతూ చెప్పాను.
అంతే,... తన కుడి చెయ్యిని ఎడమ చేతిలో ఉన్న సంచీలో పెట్టి నా వైపు చూస్తూ అందులోంచి ఏదో తియ్యబోయాడు.
"ఏ...ఏ...ఏయ్.. ఏమిటి తీస్తున్నావ్?" గొంతు తడారిపోతోంటే అడిగాను.
"బాక్స్ లో టిఫిన్, ప్లాస్కులో కాఫీ" అంటూ నన్ను తప్పించుకుని లోపలికి వచ్చి అవి బల్లమీద పెట్టి వెళ్లిపోయాడు, మరోసారి నావైపు అనుమానంగా చూస్తూ.
***** ***** ***** *****
టిఫిన్ చేసి, గెస్ట్ హౌస్ నుంచి ఫ్యాక్టరీలోని ఆఫీసుకు బయలుదేరిన నేను, అప్పుడే కేంటీన్ నుంచి బయటకు వచ్చి, నా వెనుక వస్తున్న ఇద్దరు కార్మికులు మాట్లాడుకుంటున్న ఆ మాటలు వింటూ, నెమ్మదిగా నడుస్తున్నాను.
"ఇదిగో ఆర్ముగం! ఈ గెస్ట్ హౌస్ దగ్గర రాత్రుళ్లు దెయ్యాలు తిరుగుతున్నాయిట తెలుసా?" అడిగాడు ఓ వ్యక్తి.
"ఔను. మన వెంకటేష్ అయితే ప్రత్యక్షంగా చూసాడుట కూడా ఆ రెండు ఆడ దెయ్యాలని. పాపం, ఆ తర్వాత వాడు ఓ వారం రోజులు మంచం ఎక్కేసాడు!" చెప్పాడు ఆర్ముగం.
"ఇదిగో ఇది గెస్ట్ హౌస్ కాదు. ఘోస్ట్ హౌస్. రెండేళ్ల క్రితం ఓ ఆఫీసర్ ఈ గెస్ట్ హౌస్ కి వచ్చాడుట. ఆ టైంలో ఆయన ఓ ఇద్దరు అమ్మాయిలను రేప్ చేసి వదిలేసాట్ట. ఓ మూడు నెలలు తర్వాత పాపం ఆ అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నారుట. ఆ పిల్లల ఆత్మలే దెయ్యాలై తిరుగుతున్నాయిట" మొత్తం స్టోరీ చెప్పాడు రెండవవాడు.
అంతే .....వింటున్న నా వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. ఆ తర్వాత ఆఫీసుకు ఎలా చేరానో నాకే తెలవదు.
***** ***** ***** *****
సాయంత్రం వరకూ ఆఫీసు పనిలో బిజీగా ఉన్న నేను,
"సార్! ఇంక బయలుదేరుదామా?" అన్న రంగనాధన్ పిలుపుతో ఉలిక్కిపడ్డాను.
"ఓ సారీ, పనిలో పడి టైం కూడా చూసుకోలేదు. ఔనూ! ఈ రాత్రి నువ్వు నా రూమ్ లో ఉండవచ్చు కదా? సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేద్దాం" భయాన్ని లోపల దాచుకుంటూ అడిగాను.
"అయ్యో సారీ సార్, ఈరోజు సాయంత్రం మా అక్కని పాకాల లోని వాళ్ళింట్లో దింపి రావాలి. ఔనూ, ఎల్లుండే కదా మీ రిటర్న్ జర్నీ. రేపు రాత్రి మటుకు తప్పకుండా వస్తాను సార్. రండి మిమ్మల్ని గెస్ట్ హౌస్ వద్ద దింపి నేను ఇంటికి బయలుదేరతాను" అని లేవదీసాడు రంగనాధన్.
ఆఫీస్ నుంచి గెస్ట్ హౌస్ కు వెళుతూ,
"రంగన్! అసలు దెయ్యాలున్నాయంటావా? నీ అభిప్రాయం ఏమిటి?" అని అడిగాను సందేహం తీర్చుకోవడానికి.
"అయ్యో మీరు భలే వారు సార్. సిటీలో ఉండే మీరే ఇలా దెయ్యాల గురించి నమ్మితే ఎలా?" అన్నాడు రంగనాథం నా వైపు ఆశ్చర్యంగా చూస్తూ.
దానికి నేను వెంటనే "అబ్బే నేను అలాంటి వాటిని అస్సలు నమ్మను. అంతే కాదు, మా మావయ్య ఒకరు ఇలాంటి వారికి కౌన్సిలింగ్ కూడా ఇస్తూ ఉంటాడు. కానీ ....." అంటూ ఉదయం నుంచి విన్న విషయాలన్నీ చెప్పాను.
"ఓ, అదా! ఆ ఆఫీసర్ చాలా మంచి వ్యక్తి సార్. అది ఆ ఆఫీసర్ అంటే గిట్టని వాళ్లు చేసిన ప్రచారం. ఆ అమ్మాయిల్లో ఒకరు ఆర్ధిక పరిస్థితులు వలన, ఇంకో ఆమె అనారోగ్యం కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు. అంతే తప్ప వారి చావుకు ఈయనకూ ఎటువంటి సంబంధం లేదు సార్. ఇక దెయ్యాలు తిరగడం అనేది ఎవరో కల్పించిన పుకారు" సందేహం నివృత్తి చేసాడు రంగనాధన్.
"మరి ఆ గెస్ట్ హౌస్ వాచ్ మెన్, అముదవల్లి చేష్టలు ఏమిటి, అదోలా ఉన్నాయి?" అడిగాను ఆ సందేహం కూడా తీర్చేసుకుందామని.
"అబ్బే వాళ్ల చూపులు, చేష్టలు అలాగే ఉంటాయి సార్. మీరు భయపడకండి. వాళ్లు చాలా మంచివాళ్లు. ఎటొచ్చీ కొంచెం పని బద్దకం. అందుకే ఎవరు వచ్చినా ఎన్నాళ్లుంటారు అని అడుగుతారు. అంతే. మరి ఉంటా సార్. రేపు ఉదయం కలుసుకుందాం" నాకు గుడ్ నైట్ చెప్పి వెళ్లిపోయాడు రంగన్.
***** ***** ***** *****
రంగనాథన్ చెప్పిన మాటలతో ధైర్యం వచ్చిన నేను, రాత్రి క్యాంటీన్ బాయ్ తెచ్చిన టిఫిన్ తొందరగా తినేసి, తలుపులు బిడాయించి, ఏమీ తోచక, నిన్న రైల్వే స్టేషన్ లో కొన్న ఓ వారపత్రిక చదువుదామని తీసాను.
ఆ వార పత్రిక కవర్ పేజీలోనే 'అసలు దెయ్యాలు ఉన్నాయా ? వివరాలు లోపలి పేజీల్లో' అని ఉంది. ఉలిక్కిపడిన నేను ఆ పేజీ మూసేసి, వెంటనే ఆఖరి పేజీల్లో ఉన్న దైవమార్గం అనే శీర్షిక తిరగేసాను. అందులో 'భూత ప్రేత పిశాచాలు తొలగిపోవాలంటే ఏమి చేయాలి' అని ఒక ఆర్టికల్ కనపడింది.
ఒక్క సారిగా నన్ను మళ్లీ భయం ఆవరించింది. ఆ పుస్తకాన్ని విసిరికొట్టి, బెడ్ లైట్ వేసుకుని, ఫ్యాను ఫుల్ స్పీడులో పెట్టి, ఒళ్ళంతా దుప్పటి కప్పుకొని పడుకున్నాను.
ఎప్పుడు పట్టిందో కానీ మంచి నిద్ర పట్టింది.
***** ***** ***** *****
గాఢనిద్రలో ఉన్న నేను, ఒళ్ళంతా చెమటలు పట్టడంతో, ఏం జరిగిందో తెలియక ఒక్కసారి ఉలిక్కిపడి మొహం మీంచి దుప్పటి తీసి చూసాను. గది అంతా గాఢాంధకారం. ఫ్యాను తిరగడం లేదు. బయట వర్షం కురుస్తున్న కారణంగా కాబోలు కరెంటు పోయినట్టుంది. రివ్వుమని వీస్తున్న ఈదురుగాలి శబ్దాలు, ఉరుముల శబ్దాలు స్పష్టంగా వినబడుతున్నాయి.
ఈలోగా ఎవరో తలుపు మీద 'టక్ టక్' మని కొడుతున్న శబ్ధం. ఒక్కసారిగా నా గుండె గొంతుకలోకి వచ్చినట్లు అయ్యింది. చెవులు రిక్కించి మళ్లీ విన్నాను. మళ్లీ తలుపు మీద టక్ టక్ మని కొడుతున్న శబ్ధం.
"ఒరే పిరికి పందా,తలుపు తియ్యరా" ఎవరో ఆడమనిషి భయంకరంగా అరుస్తోంది.
ఏం జరుగుతోందో కాసేపటి వరకూ అర్ధం కాలేదు. ఈలోగా కళ్లు మిరుమిట్లు గొలిపే భయంకరమైన వెలుగు . గుండెలు అదిరిపోయే పెద్ద శబ్ధం . ఆ శబ్ధానికి ఉలిక్కిపడి కిటికీ లోంచి బయటకు చూసాను.
ఎర్రచీర, తెల్లచీర కట్టుకున్న ఇద్దరు అమ్మాయిలు గాలిలో ఎగురుతూ కిటికీ వైపు దూసుకొస్తున్నారు . అంతే , రెండు కళ్లూ మూసుకుని, ఆంజనేయ దండకం చదువుకుంటూ, తడుముకుంటూ వెళ్లి ఆ కిటికీ తలుపులు మూసేసి వచ్చి మంచం మీద వాలాను.
మళ్లీ తలుపు మీద ఎవరో టక్ టక్ మని కొడుతున్న శబ్ధం నా చెవులకు స్పష్టంగా వినబడుతోంది.
ఈలోగా
"ఒరే పిరికి పందా, తలుపులు తియ్యరా! ఈరోజు నిన్ను వదిలేది లేదు" వికటాట్టహాసం చేస్తూ అరుస్తోంది ఎవరో స్త్రీ.
"దేవుడా! నేను ఏం పాపం చేసాను. ఎందుకు నాకు ఈ నరకం? మా బాస్ నన్ను ఇక్కడకి పంపడమెందుకు? నేను రావడం ఎందుకు? పెద్ద ధైర్యవంతుడిలా ఆ రంగనాధన్ వద్ద దెయ్యాలు లేవని గొప్పలు చెప్పడమెందుకు? దేవుడా! నువ్వూ ఉన్నావు, అలాగే ఆ దెయ్యాలూ ఉన్నాయి. నేను నమ్ముతున్నా. వాటి నుంచి నువ్వే కాపాడాలి" అనుకుంటూ ఏ శబ్ధాలు వినబడకుండా చెవులు రెండూ మూసుకుని, ఆంజనేయ దండకం చదువుకుంటూ, గజగజ వణుకుతూ చాలా సేపటి తరువాత నిద్రలోకి జారిపోయాను.
***** ***** ***** *****
ఎవరో తలుపు మీద టక్ టక్ మని కొడుతున్న శబ్ధానికి తుళ్లిపడి లేచాను.
కిటికీ తలుపు వేయడం మూలాన్న గది చీకటిగా ఉంది.
ఈసారి టక్ టక్ మన్న శబ్ధంతో పాటు
"సార్! లేవండి. నేను కేంటీన్ బోయ్ ని. కాఫీ తెచ్చాను" అని వినబడడంతో "హమ్మయ్యా, బతుకు జీవుడా!" అనుకుని వాచీలో టైం చూసాను. ఉదయం ఏడున్నర. కరెంటు లేకపోయినా మంచి నిద్ర పట్టింది అనుకుంటూ వెళ్లి తలుపు తీసాను.
***** ***** ***** *****
ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేయడానికి రంగనాధన్ తో కలిసి గెస్ట్ హౌస్ కి వచ్చిన నేను,
"ఇదిగో రంగన్! ఈ రాత్రికి నాకు చిత్తూరు కానీ పుత్తూరు లాడ్జీలలో కానీ ఓ రూమ్ బుక్ చెయ్యవయ్యా" కొంచెం సీరియస్ గానే చెప్పాను, భోజనం కేరేజ్ విప్పుతూ.
"పరవాలేదు అలాగే చేద్దాం సార్, కానీ ఎందుకు?" ఆశ్చర్యంగా అడిగాడు రంగనాధన్.
"ఎందుకంటే.......... " రాత్రి జరిగిన దెయ్యం సంఘటనలు అన్నీ పూస గుచ్చినట్లు చెప్పాను.
దానికి ఘొళ్లున నవ్వి, "సార్, మీకు చెప్పేటంత గొప్పవాడిని కాదు కానీ, ఈ దెయ్యం భయం అనేది మనం ఊహించుకునేదే. రాత్రి మీరు దెయ్యాలు గురించి ఆలోచిస్తూ పడుకొని ఉంటారు. అందుకే జరిగిన సంఘటనలు అన్నీ కూడా ఆ దెయ్యం చేసినవే అనుకొని భావించి ఉంటారు" అని చెప్పి ఓ సారి రూమ్ బయటకు వెళ్లాడు.
కాసేపటికి నన్ను బయటకు కేకేసి
"సార్! చూసారా, రాత్రి గాలివానకి ఈ మామిడి చెట్టు కొమ్మ సగం విరిగి ఇదిగో ఈ వసారా తలుపు మీద పడింది. అందుకే గాలి వీచినప్పుడల్లా టక్ టక్ మని శబ్ధం వచ్చింది" ప్రాక్టికల్ గా ఆ కొమ్మ ఊపి ఆ శబ్ధం వినిపించాడు. నాకు అది నిజమే అనిపించింది.
మళ్లీ లోపలికి వచ్చి భోజనానికి కూర్చుంటూ
"ఏంటి సార్, ఈ కిటికీ తలుపులు మూసేసారు?" అడిగాడు రంగనాధన్.
"మరి అందులోంచే కదా ఆ రెండు ఆడదెయ్యాలు నా వైపు రాబోయాయి" కొంచెం భయంతో చెప్పాను.
"ఊరుకోండి సార్. మీరు మరీనూ!" అని నవ్వుతూ ఆ కిటికీ తెరచి, "సార్, ఇవేనా రాత్రి మిమ్మల్ని భయపెట్టిన ఆడదెయ్యాలు?" నన్ను కిటికీ వద్దకు రమ్మని సైగలు చేస్తూ చెప్పాడు రంగనాధన్.
దూరంగా, ఓ తుమ్మ చెట్టుకు చిటారు కొమ్మన కట్టబడి, గాలికి అటూఇటూ వేలాడుతున్న ఎర్రచీర, తెల్లచీర కట్టిన ఓ రెండు దిష్టి బొమ్మలను చూసి,
"ఔను అవే. అయితే అవి దెయ్యాలు కావా? గడ్డితో చేసిన దిష్టి బొమ్మలా?" విస్తుపోతూ అడిగాను. కాసేపటి తరువాత తేరుకుని,
"సరే ఒప్పుకున్నా. మరి ' తలుపులు తియ్యరా ' అని కర్ణకఠోరంగా అరిచింది ఎవరూ?" ఆఖరి సందేహం అడిగాను, తిరిగి భోజనం వద్ద కూర్చొని.
దానికి మళ్లీ ఘొళ్లున నవ్విన రంగనాధన్,
"సార్, మన ఫ్యాక్టరీ కి కూతవేటు దూరంలో ఓ సినిమా హాల్ ఉంది. అందులో ప్రస్తుతం ఏదో ఓ దెయ్యం సినిమా ఆడుతోంది. రాత్రి మీకు కరెంటు లేకపోవడంతో, నిశ్శబ్దంగా ఉండడం వలన ఆ సినిమాలోని డైలాగులు మీకు దగ్గరగా వినిపించి ఉంటాయి, అంతే" సాంబారు కలుపుకుంటూ చెప్పాడు.
నిన్న ఉదయమే ఫ్యాక్టరీ గేటు ముందు ఆ సినిమా వాల్ పోస్టర్ చూడడం వలన అతను చెప్పింది నిజమే అనిపించింది.
"సార్! ఈ రోజు సాయంత్రం స్నేహితులతో ఓ చిన్న పార్టీ ఉంది. అది చూసుకుని రాత్రి మీతో కాలక్షేపం చేయడానికి తప్పకుండా వస్తా సార్" టేబుల్ వద్ద నుంచి లేస్తూ చెప్పాడు రంగనాధన్.
అతను ఇచ్చిన వివరణలతో భయం పూర్తిగా పోయిన నేను, "పరవాలేదు, టేక్ యువర్ ఓన్ టైం" అని ఆనందంగా చెప్పి, తిరిగి ఆఫీసుకు బయలుదేరా, అతనితో కలిసి.
***** ***** ***** *****
సాయంత్రం ఆఫీసు నుంచి వస్తూ ఎందుకైనా మంచిదని నిద్ర పట్టడం కోసం ఓ కాంపోజ్ మాత్ర కొనుక్కుని తెచ్చుకున్నాను.
రాత్రి తొమ్మిది వరకూ చూసి రంగనాధన్ ఇంకా రాకపోవడంతో నిద్ర మాత్ర వేసుకుని మంచం మీదికి చేరాను.
***** ***** ***** *****
గాఢనిద్రలో ఉన్న నాకు తలుపు ఎవరో కొడుతున్న శబ్ధం వినబడి ఉలిక్కిపడి లేచాను. చేతికి ఉన్న రేడియం డైల్ వాచీ చూసాను. టైం 12.30 చూపిస్తోంది. ఒక్కసారిగా ఒంటిమీద వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. లేచి వెళ్లి తలుపు తీయడానికి సందేహిస్తున్నాను. కాసేపటికి,
"సార్! తలుపు తెరవండి. నేను రంగనాధన్ ని" మళ్లీ తలుపు మీద కొడుతూ పిలుస్తున్నాడు.
ఆ గొంతు గుర్తుపట్టిన నేను, లేచి వెళ్లి తలుపు టవర్ బోల్ట్ తీసి,
"ఏమిటయ్యా, ఇంత ఆలస్యం?" అడిగాను అతడిని లోపలికి పంపి, తిరిగి తలుపుకి బోల్ట్ వేస్తూ.
"సారీ సార్, పార్టీ అయిన తరువాత ఫ్రెండ్స్ అందరం కలిసి ఆ దెయ్యం సినిమా చూడడానికి వచ్చాము. సినిమా తరువాత అందర్నీ వాళ్ల ఇళ్లకు పంపించి నేను ఇలా వచ్చాను. మళ్లీ రేపటి నుంచి మీరు ఉండరు కదా? చెప్పండి సార్ ఏమిటి విశేషాలు?" మంచంమీద కూర్చుంటూ అడిగాడు రంగనాధన్.
"ఏమున్నాయయ్యా, అందరూ బాగున్నారు. ఔను ఇంతకీ సినిమా ఎలా ఉంది?" నిద్ర మత్తులో ఆవలిస్తూ అడిగాను.
"ఆ ఏదో బోర్ సినిమా సార్. ఇంకా ఈ రోజుల్లో అలాంటి దెయ్యం సినిమాలు ఎవరు చూస్తారు ? ఓనూ, అడగడం మరిచాను, మీ హైదరాబాద్ లో ఎదో సైబర్ టవర్ అని కడుతున్నారుట?......" రంగనాధన్ ఇంకా అలా ఏదో మాట్లాడుతూనే ఉన్నాడు.
"ఏంటి సార్, కబుర్లు చెప్పుకుందాం రమ్మన్నారు. తీరా వస్తే, ఏమీ మాట్లాడరు?........" రంగనాధన్ మాట్లాడుతున్న మాటలు వింటూ, నిద్రమాత్ర ప్రభావం వలన కాబోలు, సమాధానాలు ఇవ్వకుండానే మత్తుగా నిద్రలోకి జారిపోయాను.
***** ***** ***** *****
చాలాసేపటి తర్వాత తలుపు మీద టక్ టక్ మన్న శబ్ధం వినబడడంతో ఒక్కసారిగా భయపడి లేచాను. కాసేపటికి,
"సార్! లేవండి. కాఫీ తెచ్చాను" అని కేంటీన్ కుర్రాడి గొంతుక వినబడడంతో "హమ్మయ్యా, నువ్వా నాయనా!" అనుకుని వాచీలో టైం చూసాను. ఉదయం ఏడు గంటలు.
లేచి వెళ్లి తలుపు బోల్ట్ తీసి కాఫీ అందుకున్నాను.
అప్పుడు గుర్తు వచ్చాడు నాకు రంగనాధన్. ఔను ఏడీ? అని బెడ్ మీద చూసాను. అతను లేకపోవడంతో...... ఒహో, రాత్రి వచ్చింది కల అన్నమాట. ఏదైతేనేం, మొత్తం మీద నాకు దెయ్యాలంటే భయం పోగొట్టేలా చేసాడు అనుకుని చిన్నగా నవ్వుకున్నాను.
ఆరోజు ఆఖరి రోజు కావడంతో, పని త్వరగా పూర్తి చేయాలి అనుకుని వెంటనే తయారయ్యి ఆఫీసుకు బయలుదేరాను.
***** ***** ***** *****
ఆఫీసులో ఎవరూ కనబడకపోవడంతో బయటకు వచ్చి,
"ఏంటి ఈరోజు స్టాప్ ఎవరూ ఇంకా రాలేదు?" సెక్యురిటీ గార్డు ని అడిగాను.
"అయ్యో మీకు తెలియదా సార్. అందరూ రంగనాధన్ సార్ ఇంటికి వెళ్లారు" అన్నాడు నా వైపు ఆశ్చర్యంగా చూస్తూ.
"ఎందుకు? ఏదైనా ఫంక్షనా?" అనుమానంతో అడిగాను.
"కాదు సార్. రాత్రి ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకుని, తర్వాత మన పక్కనే ఉన్న సినిమా హాల్లో దెయ్యం సినిమా చూసి అందరూ కలసి వస్తూంటే, రంగనాధన్ సారును లారీ గుద్దేసిందిట. ఈయన స్పాట్ డెడ్........" ఇంకా ఏదో చెబుతున్న అతన్ని ఆపి,
"ఔనా? ఇంతకీ ఆ ఏక్సిడెంట్ రాతి ఏ టైంలో జరిగిందిట?" ఏదో అనుమానం వచ్చి అడిగాను.
"అర్ధరాత్రి 12.30 కి సార్.... "
"అంటే రాత్రి నా గదికి వచ్చింది???......." ఏదో ఆలోచిస్తూ, నెమ్మదిగా నడుచుకుంటూ లోపలికి వచ్చి కుర్చీలో కూర్చుండి పోయాను, అప్పుడే బయటనుండి వచ్చిన ఆఫీసు బోయ్, తన చేతిలోని ఫొటో ఫ్రేమ్ బల్లమీద పెట్టి, దానికి దండ వేసి దణ్ణం పెడుతుండగా, ఫొటోలో ఉన్న రంగనాధన్ నా వైపు నవ్వుతూ చూస్తుండగా!
***** **సమాప్తము** *****