*****
*కరుణ నేర్పిన కరోనా*
================
(సామాజిక కథ)
(నేను రాసిన ఈ కథ, కరోనా వచ్చిన 2020 నాటి మొదటి రోజుల్లో ఓ కథకుల సమూహం నిర్వహించిన *కరోనా కథల పోటీలో* ప్రధమ బహుమతి పొంది, వారు ప్రచురించిన కథల సంకలనంలో ప్రచురించబడినది)
రచన ::
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్.
"ఏమండీ, మీ నాన్న గారికి ఆరోగ్యం బాగాలేదని, చివరి చూపుగా మిమ్మల్ని ఓ సారి చూడాలను కుంటున్నారనీ మీ బాబాయ్ ఫోన్ చేసి అప్పుడే వారం రోజులవుతోంది. ప్రయాణం గురించి ఏం ఆలోచించారు ?" న్యూజెర్సీలోని తమ స్వంత సౌధంలో టిఫిన్ చేస్తూ, భర్త శ్యామ్ ని అడిగింది హారిక.
"ఇప్పటి కిప్పుడు ఇక్కడ నుంచి ఆంధ్రా లోని ఆళ్లగడ్డ వెళ్ళి రావడం అంత ఈజీనా హారికా ? నిన్ను, పిల్లల్ని తీసుకుని వెళ్ళకుండా, కేవలం నేను ఒక్కడినే వెళ్లి రావాలన్నా ఎన్ని లక్షలతో కూడుకున్న పని ?" విసుగ్గా చెప్పాడు శ్యామ్, కాఫీ తాగుతూ.
"అవుననుకోండి, కానీ జనం అలా అనుకోరు కదా ? మీ అమ్మ నాన్నలకు మీరొక్కరే సంతానం. దానికి తోడు రెండు సంవత్సరాలు క్రితం మీ అమ్మ గారు పోయినప్పుడు కూడా మనం వెళ్ళలేదు"
"నువ్వే కదా, అప్పుడు వెళ్ళవద్దు అన్నది?" ఆశ్చర్యంగా అడిగాడు శ్యామ్.
"ఔను, నేనే అన్నాను. ఎందుకంటే, ఆ సంవత్సరమే కదా, మన దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు చేసి ఈ ఇల్లు కొనుకున్నాం.
మనం వెళ్ళడం లక్షల ఖర్చుతో కూడుకున్న పని. అంతేకాదు, వెళ్ళినా మనం ఆవిడని ప్రాణాలతో చూడలేము. అందుకే మన పెద్దాడుకి ఆరోగ్యం బాగా లేదని సాకు చెప్పి ఎలాగో తప్పించుకున్నాం"
"అదే నేను అనేది. అప్పుడు వద్దు అన్నదానివి, ఇప్పుడు ఎందుకు వెళ్ళమంటున్నావని ?" అడిగాడు కొంచెం అసహనంగా.
"అదికాదండీ, ఈ టైంలో మీరు వెళ్తేనే మీ నాన్న గారిని ఆఖరి చూపు చూసినట్లు ఉంటుందీ, అంతే కాకుండా ఆ ఆళ్ళగడ్డ లోని ఇల్లు, పొలాలు ఏదో బేరం పెట్టి, వచ్చిన కాడికి అమ్మేసి, అది ఇక్కడ బేంకులో పడేసుకుంటే పిల్లల భవిష్యత్తు బావుంటుంది. అందుకే ఇప్పుడు వెళ్ళ మంటున్నాను" మనసులో మాట బయట పెట్టేసింది హారిక.
"కానీ, ప్రపంచం అంతా కరోనా వ్యాధి గురించి ఆందోళనగా ఉన్న ఈ సమయంలో
ఈ ప్రయాణం అవసరమా అని ??"
"అందుకే ఈ నెలలోనే వెళ్ళమంటున్నాను. రాబోయే రోజుల్లో ఈ కరోనా ఇంకా తీవ్రస్థాయిలో ఉంటుందని న్యూస్ లో చెబుతున్నారుగా. దీపం ఉండగా ఇల్లు చక్కపెట్టుకోవడం ఉత్తమం కదా ? అంతేకాదు, కరోనా ఇంత తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో కూడా తండ్రి కోసం వచ్చేడన్న సింపతీ మీమీద ఉంటుంది" భర్తకు హితబోధ చేసింది హారిక.
***** ****** ****** **** ****
నాలుగు రోజుల తరువాత......
ఇండియాకి వెళ్లి, అక్కడ ఓ నాలుగు రోజులు ఉండి తిరిగి రావడానికి టికెట్లు బుక్ చేసుకున్నాడు శ్యామ్. ప్రయాణం రోజు రానే వచ్చింది.
న్యూజెర్సీ ఎయిర్ పోర్టు రకరకాల మాస్కులతో కలకలలాడుతోంది. అక్కడి అధికారులు శ్యామ్ లగేజీని, ఆరోగ్యాన్ని క్షుణ్ణంగా చెక్ చేసి, అన్నీ ఓకే అని, లగేజీకి ఓ టేగ్, మొహానికి మాస్కు తగిలించి, చేతులకు శానిటైజర్ పుష్కలంగా తగిలించి, విమానం వద్దకు తరలించారు. విమానం ముందుకు పోతుంటే, శ్యామ్ గతంలోకి జారిపోయాడు.
***** ****** ****** **** ****
రామయ్య, లక్ష్మి దంపతులకు పెళ్లి అయిన పది సంవత్సరాలకు లేకలేక పుట్టేడు శ్యామ్. దానితో అతన్ని చాలా గారాబంగా పెంచింది తల్లి. ఇంజనీరింగ్ చదువు అయిపోగానే హైదరాబాద్ వెళ్లి ఏదైనా ఉద్యోగం చూసుకోమన్నాడు తండ్రి.
దానికి ససేమిరా అంటూ, తన కొడుకుని తమ బంధువుల పిల్లలతో పోల్చుకుని వారిలాగే ఉన్నత చదువులు చదివి పేరు తెచ్చుకోవాలి అనీ, తమకూ ఊరికి కూడా మంచి పేరు తేవాలని, శ్యామ్ ని విదేశానికి పంపడానికి సమయత్తం చేసింది తల్లి.
విదేశాల్లోనే ఉన్నత విద్య ముగించుకుని, అక్కడే ఉద్యోగం కూడా సంపాదించుకుని, తను పని చేసిన కంపెనీలో పనిచేసే తెలుగు అమ్మాయి హారికను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు శ్యామ్.
హారికకు నా అనేవారు ఎవరూ లేరు. ఆమె తల్లిదండ్రులు ఎప్పుడో దశాబ్దాల క్రితమే ఆంధ్రా నుంచి వచ్చి న్యూజెర్సీలో సెటిల్ అయ్యి , అక్కడే ఓ ఒక కారు ప్రమాదంలో ఇరువురూ మరణించారు, ఆరేళ్ళ కూతురుని అనాధను చేసి!
హారిక తరపు బంధువులు ఎవరూ లేకపోవడంతో రెండు వైపులా మీరే పెద్దలుగా ఉండి, ఇక్కడికి వచ్చి పెద్ద మనసుతో తమ వివాహం జరిపించమని తల్లితండ్రులుకు, ఊర్లో ఉన్న తన బాబాయ్ ఫోన్ ద్వారా వర్తమానం పంపేడు. కానీ తాము రాలేమనీ, మీరే వివాహం చేసుకొని తమ వద్దకు వచ్చి ఆశీర్వాదం తీసుకోవాలని బదులిచ్చారు శ్యామ్ తల్లి తండ్రులు, ఆ విధంగానైనా తన కొడుకు గొప్పతనం గురించి నలుగురికీ చెప్పవచ్చన్న ఆశతో.
పాపం, ఆ ముసలి తల్లిదండ్రుల ఆశను వమ్ముచేసాడు శ్యామ్.
ఆ తరువాత ఒక సంవత్సరానికి అబ్బాయి, ఇంకో రెండేళ్లకు అమ్మాయి పుట్టడం, వాళ్ళ పుట్టినరోజులకు కూడా తల్లిదండ్రులు రాకపోవడం, తాము కూడా వివిధ కారణాలతో ఆళ్ళగడ్డ వెళ్ళడానికి కుదరకపోవడం, ఆఖరికి రెండు సంవత్సరాలు క్రితం తల్లి చనిపోతే ఆవిడని కడసారి చూడడానికి కూడా వెళ్ళక పోవడం......ఇలా అన్నీ గుర్తుకు వస్తున్నాయి శ్యామ్ కు.
ఇప్పుడు తండ్రి మీద ప్రేమ మాట ఎలా ఉన్నా, ఆయన సంపాదించిన ఆస్తి కోసం ఎనిమిది సంవత్సరాల తరువాత తను స్వదేశానికి ప్రయాణమవడం, విదేశీ మోజులో పడి మానవ సంబంధాలు ఎలా మసకబారి పోతున్నాయో? అసలు తన హృదయం ఇలా పాషాణం లా ఎలా మారి పోయింది ??...
ఇలాంటి ఆలోచనలుతో సతమతమవుతూ నిద్ర లోకి జారుకున్న శ్యామ్ కి పైలట్ అనౌన్స్ మెంట్ తో మెలుకువ వచ్చింది.
***** ****** ****** **** ****
శంషాబాద్ విమానాశ్రయం చూస్తూంటే, ఏదో పెద్ద హాస్పిటల్ చూసినట్టు అనిపించింది శ్యామ్ కి. అందరూ ఆసుపత్రిలో డాక్టర్లులా ముక్కలకు మాస్కులు తగిలించుకుని హడావుడిగా అటూఇటూ తిరుగుతున్నారు.
విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల్ని వేరే గదిలోకి తరలించి, శల్య పరీక్షలు చేసిన తరువాత మాత్రమే వాళ్ళని బయటకు పంపుతున్నారు. అలాగే శ్యామ్ ని కూడా నఖశిఖ పర్యంతం పరీక్షించి, చివరికి, మూతికి మాస్కు కట్టి, చేతిలో శానిటైజర్ పెట్టి జనజీవన స్రవంతి లోకి వదిలేరు విమానాశ్రయం అధికారులు.
"సార్, నేను ఆళ్లగడ్డ వెళ్ళాలి, ట్రైను లో వెళ్తే బెటరా ? లేక బస్సు బెటరా ?" బయటికి వచ్చి, ఎంక్వయిరీ లోని గుమాస్తాను అడిగాడు శ్యామ్.
"ఈ కరోనా వలన రైళ్లు, బస్సు సర్వీసులు బాగా తగ్గించారు సార్. నన్నడిగితే మీరు టాక్సీ చేయించుకుని వెళ్ళడం బెటర్" చెప్పాడు గుమస్తా.
***** ****** ****** **** ****
టాక్సీ ఊరులోకి ప్రవేశించే రోడ్డు పక్కనే ఉన్న తమ పొలంలో, ఓ చెట్టు కింద కూర్చుని, గుండు సవరించుకుంటూ పేపరు చదువుతున్న తన బాబాయ్ రమేష్ ని చూసేడు శ్యామ్.
"బాబాయ్, ఏమిటి ఈ అవతారం ? నేను శ్యామ్ ని గుర్తు పట్టలేదా ? సరే కానీ, ఇప్పుడు నాన్న ఎలా ఉన్నాడు ? " ప్రశ్నలవర్షం కురిపించాడు.
"ఓర్నీ, ఎన్నేళ్ళయిందిరా నిన్ను చూసి. పద పద ....ముందు అర్జంటుగా కారులో కూర్చో, మాట్లాడుకుంటూ మా ఇంటికి పోదాం" అంటూ తొందరపెట్టాడు రమేష్.
"ఏంటి బాబాయ్,ఇంత తొందర ? ఇదంతా కరోనా గురించి భయమేనా ? అసలు ఏమయ్యింది" అడిగాడు శ్యామ్.
"ఏమవ్వడం ఏమిట్రా! కరోనా వల్ల ఓ మూల కొంపలు ములుగుతూంటేనూ! అదృష్టం బావుండి, ముందు జాగ్రత్తలు తీసుకోవడం మూలంగానూ మరియు సాంప్రదాయ పద్ధతిలో పరిశుభ్రత పాటించడం వలన, ప్రస్తుతానికి మన పళ్ళెటూళ్ళు అన్నీ పరిశుభ్రంగా ఉన్నాయి, ఎటువంటి కరోనా లాంటి రోగాలు లేకుండా! అంతేకాదు, కొత్త వ్యక్తులెవరినీ ఊరులోకి రాకుండా కట్టడి చేస్తున్నాం. మరి నువ్వు చూస్తే , ఏకంగా ఫారిన్ నుంచి వచ్చేవు. ఇంతకు ముందు అయితే, మీ అమ్మ ఆశించిన విధంగా నీకు రాజభోగాలు జరిగేవి. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారు అయ్యింది. నువ్వు వచ్చిన విషయం ఊర్లో వాళ్ళకు తెలిసింది అంటే చాలా గొడవలు అయిపోతాయి"
"అయితే ఫారిన్ నుంచి వచ్చిన వారందరికీ కరోనా ఉన్నట్టా ??"
"అది నాకు తెలియదురా. ఇంతకుముందు NRI లు అంటే Nenu Raanu Indiaki అనేవారు. ప్రస్తుతం కరోనా వచ్చిన తరువాత జనం NRI లను, Nuvvu Raaku Indiaki అంటున్నారు. అంతా కాలమహిమ. సరేకానీ నువ్వు ఓ రెండు గంటలు మా ఇంట్లో విశ్రాంతి తీసుకుని తిరిగి ఇదే టేక్సీలో రహస్యంగా వెనక్కి వెళ్ళిపో. పరిస్థితులు ఏమీ బాగాలేవు. సరేకానీ, ఇల్లు వచ్చింది దిగు" అంటూ డోర్ తీసేడు బాబాయ్.
"బాబాయ్, ముందు నాన్నని చూసి వస్తాను" అని చెప్పబోతున్న శ్యామ్ ని
"ముందు లోపలికి రారా" అంటూ గదిలోకి తీసుకుని వెళ్ళాడు.
***** ****** ****** **** ****
"ఏమిటి ? నాన్న చనిపోయి అప్పుడే రెండు వారాలయ్యిందా? ఖర్మకాండ నువ్వు చేసేవా ? ఏమిటి బాబాయ్ నువ్వు చెబుతున్నది ? " రమేష్ చెప్పింది విని, ఏడుస్తూ అడిగాడు శ్యామ్.
"ఔనురా, లంగ్ కాన్సర్ ముదిరి, చనిపోయే ఒక రోజు ముందు నన్ను పిలిచి, నీకు ఫోన్ చేసి నీ పనికి ఆటంకం కలిగించవద్దని, ఆ ఖర్మకాండ అంతా నన్నే చేయమనీ చేతిలో చేయి వేయించు కున్నాడురా మీ నాన్న. అందుకే మీ నాన్న పోయిన నాలుగు రోజుల వరకూ ఈ విషయం నీకు చెప్పలేదు" బాధ పడుతూ చెప్పాడు రమేష్.
"అంత పాపం నేనేం చేసాను బాబాయ్ ?"
"ఏమీ తెలియనట్టు అడుగుతావేంట్రా ? నీకోసం మీ అమ్మ ఆరు సంవత్సరాలు ఎదురు చూసింది. ఏ రోజైనా వస్తా వేమోనని. కళ్ళారా ఓ సారి చూసి చనిపోదామని. కొడుకు ఉండి కూడా ఒంటరితనం అనుభవించార్రా, మీ అమ్మా, నాన్నా. నీ మీద బెంగతో మీ అమ్మ పోయిన తరువాత మీ నాన్న మరీ ఒంటరైపోయాడు"
"అమ్మ పోయినప్పుడు నేను పూర్తిగా డబ్బు ఇబ్బందుల్లో ఉన్నా బాబాయ్. కానీ, నాన్నకు సీరియస్ అని నువ్వు ఒక్క ఫోన్ కొడితే వెంటనే బయలుదేరి వచ్చేసే వాడినిగా బాబాయ్"
"ఆ ప్రయత్నం కూడా చేసా. కానీ మీ నాన్న నీకు ఫోన్ చేయడానికి ఒప్పుకోలేదు. మీ అమ్మ చనిపోయినా కానీ నువ్వు రాక పోవడంతో , తల్లి తండ్రులు మీద నీకు కరుణ కానీ జాలి కానీ లేవని ఓ నిశ్చయాని కొచ్చి , నీ మీద ఆశలు పూర్తిగా వదులు కున్నాడు. ఇంకో విషయం చెబుతున్నా, జాగ్రత్తగా వినరోయ్, మీ నాన్న స్వార్జిత మైన ఆస్తులు, ఈ ఊర్లో ఉన్న రెండతస్తుల మేడని కరుణా వృధ్ధా శ్రమానికీ, బేంకులో ఉన్న ఐదు లక్షల డిపాజిట్ , ప్రభుత్వ సహాయనిధి ద్వారా రాబోయే రోజుల్లో కరోనా మహమ్మారి వలన నష్టపోయే కుటుంబాలకు, ఇక ఆ ఎనిమిది ఎకరాల పొలం నీ కుటుంబ పేరున అదికూడా ఎవరికీ ఇరవై సంవత్సరాల పాటు అమ్మడానికి వీలు లేకుండా, నువ్వు స్వయంగా లేదా కౌలు కిచ్చి కానీ సేధ్యం చేసుకొనేలా దస్తావేజులు రాసి, రిజిస్టర్ చేయించేడురా మీ నాన్న. కొన్ని రోజులు పోయాకా నేనే కొరియర్ లో పంపుదాం అనుకున్నాను. ఈ లోగా నువ్వే వచ్చేవు" అంటూ దస్తావేజులు తాలూకు కాయితాలు, బిత్తరపోయి చూస్తున్న శ్యామ్ చేతిలో పెట్టాడు రమేష్.
"అయితే ఇప్పుడు నన్ను ఏం చేయ మంటావ్ బాబాయ్ ??" బేలగా అడిగాడు శ్యామ్.
"అదిగో, మీ పిన్ని భోజనం రెడీ చేసింది. శుభ్రంగా స్నానం చేసి, భోజనం చేసి వచ్చిన దారినే వెనక్కి వెళ్ళిపో. జనం దృష్టిలో పడితే ప్రమాదం" అని చెప్పి భోజనం ఏర్పాట్లు చేయడానికి లేచాడు రమేష్.
***** ****** ****** **** ****
తిరిగి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చి, టాక్సీకి రానూపోనూ ఛార్జీలు చెల్లించి, లగేజీ తీసుకుని తన తిరుగుప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు చేసుకుంటున్న శ్యామ్ వద్దకు ఒళ్ళంతా పూర్తిగా ఏప్రాన్ ధరించిన నలుగురు మనుషులు వచ్చి, తమ ఐడెంటిటీ కార్డులు చూపించి,
"చూడండి శ్యామ్, మీరు న్యూజెర్సీ నుంచి ఉదయం వచ్చారు కదా ? మేము మీ గురించే ఉదయం నుంచి వెతుకుతున్నాం. మీరు ఎక్కిన కారు నెంబర్ ఆధారంగా ట్రాక్ చేస్తే మీరు తిరిగి ఇక్కడికే వస్తున్నారని తెలిసింది. మాకు ఈ ఉదయం ప్రభుత్వం నుంచి వచ్చిన సూచనలు ప్రకారం విదేశాల నుండి వచ్చిన వాళ్ళని రెండు వారాలు పాటు ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే క్వారంటైన్ సెంటర్లలో ఉంచమనీ, ఆ తరువాత వారి ఆరోగ్యం బావుంటే వారిని వారి స్వస్థలాలకు పంపిచమనీ ఆదేశాలు వచ్చేయి. అందువలన మీరు సహకరించి మాతో రండి" అని శ్యామ్ ని వేన్ ఎక్కించారు, ప్రభుత్వ అధికారులు, అతనికి కూడా పూర్తిగా ఏప్రాన్ తొడిగి.
"అయితే నేను రెండు వారాలు ఎక్కడ ఉండాలి సార్ ??" భయంగా అడిగాడు.
"ప్రభుత్వం ఆధీనంలో ఉన్న రిసార్ట్స్ లో. డాక్టర్ల ఆధీనంలో" ముక్తసరిగా చెప్పాడు ఓ అధికారి.
***** ****** ****** **** ****
కదులుతున్న వేన్ లో కూర్చొని, అధికారుల అనుమతితో భార్యకు వాట్సప్ మెసేజ్ చేయడం మొదలెట్టాడు శ్యామ్.
డియర్ హారికా !
ఈ మెసేజ్ చదువుతూ, ఈయనకు ఇంత వేదాంతం ఎక్కడ నుంచి వచ్చిందా అని ఆశ్చర్య పోకుండా శ్రద్ధగా మనసు పెట్టి చదువు.
నేను క్షేమంగానే ఆళ్లగడ్డ చేరేను.
కానీ,
చాలా బాధాకరమైన విషయమేమిటంటే మా నాన్న చనిపోయి అప్పుడే రెండు వారాలు అయిపోయిందిట. ఆ విషయాలు అన్నీ నీకు అక్కడకి వచ్చేకా డిటైల్డ్ గా చెబుతాను.
ఇకపోతే...
ఇక్కడ మన స్వదేశంలో, ముఖ్యంగా మా ఊరు లాంటి చిన్న చిన్న ఊర్లలోనూ కూడా కరోనా వ్యాధి నివారణకు తీసుకుంటున్న చర్యలు అద్భుతం. ముఖ్యంగా ఈ వ్యాధి విదేశాల నుంచి వస్తున్న వారి ద్వారా విస్తరిస్తోందన్న విషయం గ్రహించి, ఈ రోజు నుంచి అలాంటి వారిని తీసుకుని వెళ్లి నగరానికి దూరంగా ఉన్న హెల్త్ సెంటర్లలో రెండు వారాలు పాటు అబ్జర్వేషన్లో ఉంచుతారుట. ఆ క్రమంలోనే నన్ను ఓ రిసార్ట్ కి తీసుకుని వెళ్తున్నారు. అక్కడ నన్ను ఓ గదిలో ఒంటరిగా, మిగతా ప్రపంచానికి దూరంగా ఉంచు తారుట.
నేను లేని ఆ ఒంటరితనాన్ని నా తల్లి దండ్రులు ఏ విధంగా అనుభవించారో, నేను కూడా నా పిల్లలకు, కుటుంబానికి, మిగతా ప్రపంచానికి దూరంగా ఉంటే ఎలా ఉంటుందో నాకు అనుభవం లోకి రావడానికి భగవంతుడు ఈ విధంగా *కరోనా* రూపంలో తెలియచేస్తున్నాడని అనిపించింది.
మనుషుల్లో జాలి, *కరుణ* లాంటివి అడుగంటి పోయి, పశుప్రవృత్తి పెరిగి, అరాచకాలు మితిమీరినపుడు భగవంతుడు ఏదో అవతారంలో వచ్చి వాటిని సరిదిద్దుతాడని పురాణాలలో చదివేం. అందుకే ఈ కలియుగంలో భగవంతుడు వాటిని ఇలా *కరోనా* లాంటి వ్యాధుల రూపంలో సరిదిద్దుతాడనిపిస్తోంది. దీనికి నా జీవితమే ఓ చిన్న ఉదాహరణ.
ఇకపోతే, మొన్నటి వరకూ యుద్ధాలలో అణు బాంబులు ద్వారా విధ్వంసం సృష్టించి, ఇక రాబోయే యుద్ధాలన్నీ బయో వార్ లేదా కృత్తిమ బాక్టీరియా జనం మీద వదలడం ద్వారా దేశాలను తమ ఆధీనంలోకి తెచ్చుకుంటామని ప్రకటించిన అగ్ర రాజ్యాలు , ఇప్పుడు ఆ సంగతి పూర్తిగా మరచి పోయి, అన్ని దేశాల వారు కలిసి సంయుక్తంగా ఈ కరోనా వైరస్ కి విరుగుడు కనిపెట్టే పనిలో పడటమేమిటి ?
అంటే, వారికంటే ముందే ఆ భగవంతుడు ఈ వైరస్ జనం మీదకు వదిలేడన్నమాట. అంటే బలవంతులు మీరు కాదు, నేను. అనవసరంగా మీరూ మీరూ కొట్టుకొని చావకండి. అందరూ సంఘటితంగా ఉండండి అని చిన్న సందేశం ఇచ్చేడన్న మాట. మరి ఇది భగవంతుని లీల కాకపోతే, మరేమిటి ??
ఇంకో విషయం..
సంపూర్ణ గ్రహణం సమయంలో సూర్యుడిని ఒక నల్లని మచ్చ పూర్తిగా కప్పి వేసి, లోకాన్ని అంధకారంలోకి నెట్టి వేస్తుంది. ఈ ప్రక్రియను *కరోనా* అంటారు. కానీ కొద్ది నిమిషాల తరువాత ఆ మచ్చ తొలిగి మళ్లీ సూర్యుడు తన వెలుగు కిరణాలను లోకం మీదకు ప్రసరిస్తాడు.
అలాగే
ఈ *కరోనా* వ్యాధి కూడా కొద్ది రోజుల్లో తొలగి అందరూ ఆనందంగా ఉంటారని నాకు పూర్తి నమ్మకంగా ఉంది. అలాగే నేను కూడా కొద్ది రోజుల్లో ఈ తాత్కాలిక బంధిఖానా నుంచి బయటపడి, మనం అంతా తిరిగి కలుసుకుని శేష జీవితాన్ని హాయిగా గడుపుతామనీ ఈ విషయంలో నన్ను నా తల్లిదండ్రులు క్షమించి, నాకు ఆశీస్సులు అందచేస్తారని మనస్పూర్తిగా నమ్ముతున్నా.
ఇక చివరగా..
నా తల్లిదండ్రులు నా మూలంగా పడిన బాధలు, మనం మన పిల్లలు వలన పడకూడదు అన్న స్వార్ధంతో, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను.
అదేమిటంటే...
గతమంతా ఓ పీడకలగా మరచిపోయి,
నేను అక్కడకి రాగానే, న్యూజెర్సీలోని మన ఇల్లు అమ్మివేసి, అందరం తిరిగి ఆళ్ళగడ్డ వచ్చేసి, మా నాన్న కోరిక మేరకు హాయిగా వ్యవసాయం చేసుకుంటూ, అమ్మ ఆశయం నెరవేరేలా అందరికీ ఉపయోగ పడే ఓ చిన్న సైజు కాన్వెంట్ లాంటిది పెట్టి, మన పిల్లలను కూడా మన దగ్గరే ఉంచుకుని, వాళ్ళని ప్రయోజకులని చేయాలని నిశ్చయించు కున్నాను.
ఈ విషయంలో నువ్వు నాకు సంపూర్ణంగా సహకరిస్తావని, ఈ రోజు నుంచే ఆ ఏర్పాట్లులో ఉంటావని ఆశీస్తూ..
నాకు ఈ బుద్ధి కలగడానికి పరోక్షంగా కారణమైన *కరోనా* కి కృతజ్ఞతలతో..
నీ
శ్యామ్.
***శుభం****