*****
*నాన్న చెప్పిన నీతి*
=============
(మినీ కథ)
(నేను రాసిన ఈ మినీ కథ నిత్య అనే మాసపత్రికలో మార్చి 2022 సంచికలో
ప్రచురితమైనది)
రచన ::
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్
"ఒరే సుబ్బూ! ఇండియా రాజధాని ఏది?"
"ఢిల్లీ రా విస్సూ"
"మరి బీహార్ రాజధాని?"
"పాట్నా"
"ఇవన్నీ ఎవరు చెప్పార్రా?"
"నాన్నగారు చెప్పారు"
***** ***** ***** *****
"ఒరే సుబ్బూ! రెసిడెన్షియల్ స్కూల్లో చేరుతున్నావుట?"
"ఔనురా విస్సూ"
"ఈ స్కూల్లో బాగానే చెబుతున్నారుగా?"
"అక్కడ ఇంకా బాగా చెబుతారుట"
"ఎవరు చెప్పారు?"
"నాన్నగారు చెప్పారు"
***** ***** ***** *****
"సుబ్బూ! మీ తాతగారిని వృద్ధాశ్రమంలో చేర్పించారుట?"
"ఔను, వృద్ధులకు ఇంట్లో కన్నా అక్కడే సదుపాయంగా ఉంటుందిట్రా విస్సూ"
"ఎవరు చెప్పారు?"
"నాన్నగారు చెప్పారు"
***** ***** ***** *****
"ఏరా ! సుబ్బూ! ఇంక పై చదువులు మానేసి, ఉద్యోగంలో చేరిపోయావుట?"
"ఔనురా! ఉద్యోగం చేస్తూ ఉన్నత విద్య అభ్యసిస్తే మంచిదిట!"
"ఎవరు చెప్పారు?"
"నాన్నగారు చెప్పారు"
***** ***** ***** *****
"సుబ్బూ! రాధను కాదని లక్ష్మిని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావ్?"
"లక్ష్మి వాళ్ళ నాన్న కోటీశ్వరుడుట. ఆయన తదనంతరం ఆ ఆస్తి అంతా మాకేనట"
"ఎవరు చెప్పారు?"
"నాన్నగారు చెప్పారు"
***** ***** ***** *****
"సుబ్బూ! పాపం మీ నాన్నను వృద్ధాశ్రమంలో చేర్పించావుట?"
"ఔను, వృద్ధులకు ఇంట్లో కన్నా అక్కడే సదుపాయంగా ఉంటుందిట్రా విస్సూ"
"ఈ విషయం నీకు ఎప్పుడు తెలిసింది?"
"మా తాతగారిని ఓల్డ్ ఏజ్ హోమ్ కి పంపినపుడు"
"అప్పుడు ఎవరు చెప్పారు?"
"నాన్నగారు చెప్పారు"
***** **సమాప్తము** *****