మీటింగ్ స్పాట్

సినీ వాలి • 03 Dec 2021 • 👁 6 views
మీటింగ్ స్పాట్
*****
*మీటింగ్ స్పాట్*
===========
(మినీ కథ)

(నేను రాసిన ఈ మీనీ (సస్పెన్స్) కథ
*సినీవాలి* అనే అంతర్జాల పత్రికలో ది. 03.12.2021 ప్రచురితమైనది)

రచన ::
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్

"దుర్గా! నాకు తెలుసు. మనం రోజూ కలుసుకునే ఈ స్పాట్ వద్ద నువ్వు తప్పకుండా ఉంటావని. అందుకే వచ్చాను"

"......................"

"కూర్చో. ఎక్కడికి లేచి అలా వెళ్తున్నావ్ ? అక్కడే ఆగు. నేను చెప్పేది కొంచెం విను దుర్గా"

"......................"

"ఏమిటా స్పీడు, కొంచెం నెమ్మదిగా నడు"

"......................"

"నీకు తెలుసుగా! మనం ఏడాది క్రితం బైక్ మీద వస్తుంటే ఏక్సిడెంట్ అయ్యి, నా కాలు ఫ్రాక్చర్ అయ్యిందనీ, వేగంగా రాలేననీ"

"......................"

"ఆగు దుర్గా, ఒక నిమిషం అక్కడ నిలబడి నేను చెప్పేది పూర్తిగా విను"

"......................"

"ఆగవా? నేను చెప్పేది కూడా వినవా? కనీసం వెనక్కి తిరిగి నా వైపు కూడా చూడవా?"

"......................"

"ఎందుకు నా మీద అంత కోపం?"

"......................"

"నిన్ను ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి, రెండు రోజులు నుంచి ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి పారిపోయాననే కదా, నా మీద నీకు కోపం?"

"......................"

"ఏమిటి మాట్లాడవు? నేను చెప్పేది వినాలని లేదా? లేక వినబడడం లేదా?"

"......................"

"అందుకే, కొంచెం నెమ్మదిగా నడు. నేను చెప్పేది వినబడుతుంది"

"......................"

"వినకపోయినా చెప్పడం నా బాధ్యత కాబట్టి చెబుతున్నా, విను. నువ్వు అనుకున్నట్లుగా నేను నిన్ను మోసం చేయలేదు దుర్గా. నాకు భయంకరమైన ఎయిడ్స్ వ్యాధి వచ్చింది"

"......................"

"ఏమిటీ, నమ్మకం లేదా? అయితే, నేను ఇక్కడే ఉంటాను. మా ఇంటికి వెళ్లి అమ్మని అడుగు రిపోర్ట్స్ చూపిస్తుంది. నేను నిర్లక్ష్యం చేయడం వలన రోగం బాగా ముదిరిపోయిందిట. ఇంక మందులు కూడా సహకరించవుట"

"......................"

"నన్ను నమ్ము దుర్గా! నా వలన నీ జీవితం నాశనం కాకూడదనీ, అలాగే ఈ విషయం తెలిసిన మా ఇంట్లో వారు నన్ను దూరం పెట్టాడం మూలంగానూ ఇదిగో ఇలా బయటకు వచ్చేసా. అంతే తప్ప నిన్ను మోసం చేయడానికి కాదు"

"......................"

"ఏమిటి అంత కోపం? చెప్పేది పూర్తిగా విను. ఆ రోగం గురించి నన్ను అనుమానించకు. నేను ఎవరితోనూ తిరుగలేదు. నా కాలు ఫ్రాక్షర్ అయినప్పుడు ఎక్కువగా రక్తం పోతే, అప్పుడు నాకు రక్తదానం చేసిన వారి రక్తంలో ఏదో తేడా జరిగి ఉండొచ్చని డాక్టర్ చెప్పాడు"

"......................"

"అందుకే నా మాట విని, నీ జ్ఞాపకాలలోంచి నన్ను పూర్తిగా తీసేయ్. వేరే ఎవరినో పెళ్లి చేసుకుని సుఖంగా ఉండు. అందుకే ఇంక నీకు కనబడకూడదని ఇదిగో ఇలా వచ్చేసా"

"......................"

"ఆగు దుర్గా, ఆగు. ఏమిటి ఆ మూర్ఖత్వం? చెప్పిన మాట విను"

"......................"

"ఏయ్, ఆగు, ఆగు. ఏమిటి? ఆ కొండ పైకి ఎందుకు ఎక్కుతున్నావ్? అది డెత్ స్పాట్, కింద లోయలో పడితే చచ్చిపోతావ్"

"......................"

"ఏయ్, మూర్ఖురాలా! నా మాట వినవే. కిందకు దిగి రావే"

"......................"

"ఏమిటీ లోయలోకి దూకేస్తున్నావా? దూకకే, అనవసరంగా నీ జీవితం చేజార్చుకోకే. ఒక్క నిమిషం ఆలోచించవే, ప్లీజ్. ఒక్క నిమిషం అక్కడే ఉండు. ఇదిగో, నేనూ పైకి వస్తున్నా"

"......................"

"హయ్యో హయ్యో. దూ...కే...సా...వా? దుర్మార్గురాలా! ఆవేశంలో ఎంత పని చే....సా...వే"

"......................"

"అంటే ??? ఇదే డెత్ స్పాట్ లో మొన్న నేను ఆవేశంలో చేసిన పనే, ఈ రోజు నువ్వు చేసావన్నమాట"

"......................"


***** **సమాప్తము** *****