ముందు చూపు

తపస్వి మనోహరం • 11 Dec 2022 • 👁 10 views
*****
ముందు చూపు
============
(మినీకథ)

(నేను రాసిన ఈ మినీ కథ "తపస్వి మనోహరం* అనే పత్రికలో, డిసెంబర్, 2022 లో ప్రచురితమైనది)

రచన ::
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్


"ఏవండీ, బారసాల రోజున, మన అమ్మాయికి ధనలక్ష్మి అని పేరు పెడదామండీ!"

"అలాగే పెడదాంలే, కానీ, బారసాలకి అయ్యే ఖర్చులు ఎలాగా ? అని ఆలోచిస్తున్నానే !"

"అమ్మాయి అదృష్టవంతురాలండీ, ముందు ఆ పేరు పెట్టండి, దాని డబ్బు అదే తెచ్చుకుంటుంది."

***** ***** ***** *****

"చూసేరా ! బారసాల ఎంత బాగా జరిగిందో ! ఔనూ ! ఫంక్షన్ కి ఎంత ఖర్చు అయ్యిందండీ ?"

"నువ్వన్నది నిజమేనే ! దాని డబ్బు అదే తెచ్చుకుంది. అయిన ఖర్చు కంటే దానికి బహుమతులు రూపంలో వచ్చిన డబ్బులే ఎక్కువున్నాయి."

***** ***** ***** *****

"ఏవండీ, అమ్మాయి ధనలక్ష్మిది ఇంటర్ అయ్యింది. మరి మంచి పేరున్న కాలేజీలో చేర్పాంచాలి. ఆ ఏర్పాట్లు ఏవో చూడండి."

"మంచి కాలేజీల్లో అంటే ఆ ఖర్చు భరించగలమా అని ఆలోచిస్తున్నానే !, అదీగాక టెంత్ లోకి వచ్చిన మన అబ్బాయి చదువు గురించి కూడా ఆలోచించాలి కదా ?? "

"ధనమేరా అన్నిటికీ మూలం అనుకుంటే ఎలాగండీ. మీ ప్రయత్నం మీరు చేయండి. తరువాత దాని అదృష్టం ఎలా ఉంటుందో అలా జరుగుతుంది."

***** ***** ***** *****

"ఏమేవ్, గుడ్ న్యూస్, అమ్మాయి ఇంటర్ మార్కులు చూసి, ఫీజులు లేకుండా ఉచితంగా సీటు ఇచ్చేరే ఆ ప్రైవేటు కాలేజీ వాళ్ళు. "

"నే చెప్పేను కదండీ, ధనలక్ష్మి అదృష్టవంతు రాలూ, తన ఖర్చులకు తనే ఏర్పాటు చేసుకుంటుంది అనీ."

***** ***** ***** *****

"ఏవండీ ! అమ్మాయి ధనలక్ష్మి డిగ్రీ అయిపోయింది. మరి, ఏదైనా సంబంధం చూసి పెళ్లి చేసేస్తే మన బాధ్యత తీరుతుంది."

"పెళ్లి అంటే, ఓ రెండు, మూడు లక్షలు కావాలి. బేంకు సేవింగ్స్, పీ.యఫ్. లోనూ తీసుకుంటే సరిపోతుందనుకో."

"ఏదైనా ముందు తెలిసిన వాళ్ళందరికీ సంబంధం గురించి చెప్పండి. ప్రతీదీ డబ్బుతో ముడి పెడతారు మీరు !"

***** ***** ***** *****

"ఇదిగోనేవ్, ఆ అమలాపురం సంబంధం వాళ్ళు ఫోన్ చేసారు. మన ధనలక్ష్మి అందం, అణుకువ, చదువు చూసి ఉభయ ఖర్చులు తామే పెట్టుకుని పెళ్లి చేసుకుంటామని."

"నే చెప్పాను కదండీ ! అన్నింటికీ ధనమే మూలం కాదనీ, ఇంకా మంచి కూడా బతికే ఉందనీ. ఓ పని చేయండి, మనం అమ్మాయికి ఇద్దామనుకున్నది ఎక్కడైనా డిపాజిట్ చేయండి."

***** ***** ***** *****

"ఒరే తమ్మడూ, మన అమ్మ ధనలక్ష్మి పేరున ఒక్క బాంక్ అకౌంట్ కానీ, ఓ పైసా డిపాజిట్ కానీ లేదురా ! మరి ఈ పదిరోజుల దినం కార్యక్రమాలు, పెద్ద దినం ఖర్చు, దానాలు ఎలా చేయాలో అర్థం అవడం లేదురా ?"

"ఔను, అన్నయ్యా ! నేను కూడా అదే ఆలోచిస్తున్నా. మొన్ననే యాభై లక్షలు పెట్టి అపార్ట్ మెంట్ తీసుకున్నా. లేకపోతే కొంచెం ఖర్చు భరిద్దును."

"నేనూ అంతేరా ! పెద్దాడిని చదువు కోసం అమెరికా పంపడానికి ముప్పై లక్షలు ఖర్చు అయ్యింది. ఇకపోతే, నాన్నగారు సంపాదిం చినది అంతా ఆయన జబ్బు నయంచేయ డానికీ, ఆయన చావు ఖర్చులకే సరి పోయింది. మరి ఈవిడ సంగతెలాగా అని.........?????"

"ఒరేయ్, బయట నిలబడి, మీ మాటలన్నీ విన్నానురా ! మీ అమ్మ అంత్యక్రియల ఖర్చులు గురించి మీరేం ఇబ్బంది పడకండ్రా !"

"మావయ్యా ! ఏంటి నువ్వనేది ??"

"ఔనురా, మా అక్క ధనలక్ష్మికి అన్నింటికీ మూలం డబ్బు అని తెలుసురా ! అందుకే చిన్నతనం నుంచి కూడా, ఎవరిమీదా ఆధారపడకుండా తన జీవితానికి కావలసిన ఏర్పాట్లు తనే చేసుకుంది."

"చాలా ఆశ్చర్యంగా ఉంది మావయ్యా, నువ్వు చెబుతోంటే !!"

"ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదురా ! ఓ ఏడాది క్రితం మీ అమ్మని, "అక్కా ! పుట్టింటి పసుపు కుంకుమగా నీకు ఇవ్వవలసిన ఆరు లక్షలు నా దగ్గరే ఉండిపోయాయి, ఎప్పుడు ఇవ్వమంటావు ?"" అని అడిగా ? దానికి ఏమందో తెలుసా ??"

"ఏమంది మావయ్యా ?"

"ఇదిగో ఈ కార్యక్రమానికి ఇమ్మంది... ఇదిగో, ఈ డబ్బు తీసుకుని మీ అమ్మని ఘనంగా సాగనంపండి."

"మావయ్యా ! క్షమించండి. అమ్మనీ, ఆవిడ ముందు చూపునూ, సరిగ్గా అర్ధం చేసుకోలేక పోయాం ! డబ్బే అన్నింటికీ మూలం అనుకున్నాం. మా కళ్ళు తెరుచు కున్నాయి."

"ఏడిసార్లెండి పిచ్చి పీనుగుల్లారా ! మీరేం చేస్తారు ? లోకమే అలా ఉంది. వెళ్లి అమ్మకు క్షమాపణలు చెప్పి, ఆవిడ ఆఖరి ప్రయాణానికి ఏర్పాట్లు సంగతి చూడండి."

***** ***** సమాప్తం ***** ****