*****
*దెబ్బ తిన్న మనిషి*
==============
(మినీ కథ)
(నేను రాసిన ఈ కథ గణేష్ డైలీ అనే దినపత్రికలో 13.06.2021న ప్రచురితమైనది)
రచన ::
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్
ఉదయం పదకొండు గంటల సమయం.
అది, రద్దీ అంతగా లేని ఓ చిన్న మార్కెట్ ప్రాంతం. జనం ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు.
చెవులకు లోలకులు, మెడలో లాకెట్ వేసుకుని, సాంప్రదాయ దుస్తుల్లో ఉన్న ఓ ఇరవై ఏళ్ల అమ్మాయి ఏదో ఆలోచిస్తూ, పరధ్యానంగా ఆ రోడ్డు మీద నడుస్తోంది.
అయితే, లాల్చీ షరాయి వేసుకుని, ఉంగరాల జుట్టుతో నల్లగా, బలిష్టంగా రౌడీలా ఉన్న ఓ ముప్పై ఐదేళ్ల వ్యక్తి, స్కూటర్ మీద తనని వెంబడిస్తున్నాడన్న విషయం, పాపం ఆ అమ్మాయికి తెలియదు.
అంతే...
అదను చూసి, ఆ అమ్మాయి మెడలోని లాకెట్ తెంపబోతున్న ఆ వ్యక్తిని, రోడ్డు పక్కన నిలబడి ఫోన్ మాట్లాడుతున్న ఓ పాతికేళ్ల యువకుడు గమనించి, ఒకే ఒక్క అంగలో అక్కడికి చేరుకుని, ఆ స్కూటర్ మీద బలంగా తన్నాడు.
ఆ దెబ్బకి స్కూటర్ తో సహా కింద పడిపోయిన ఆ వ్యక్తిని, పక్క వారి సాయంతో పట్టుకుని పక్కనే ఉన్న కరెంటు పోల్ కు కట్టేసాడు ఆ యువకుడు.
అంతే అంతవరకూ దిగ్భ్రాంతికి గురైన ఆ అమ్మాయి తేరుకుని తన ఎడమ కాలి జోడుతో ఆ వ్యక్తి చెంప చెల్లుమనిపించింది. అదే అవకాశంగా చుట్టుపక్కల చేరిన వారు కూడా తమ చేతులకు పని చెప్పారు.
అవమానభారంతో కుచించుకుపోతూ
"ఎలా తప్పించుకోవాలో నాకు తెలుసు. నాతో పెట్టుకుంటారా? నా తడాఖా చూపిస్తా! మీ ఇద్దరినీ వదిలేది లేదు" అంటూ ఆ అమ్మాయి, యువకుడి వంక చూస్తూ చెప్పాడు రౌడీలా ఉన్న ఆ వ్యక్తి.
సరిగ్గా అదే సమయానికి
ఏదో పని ఉండి తన స్కూటర్ పై ఆ మార్కెట్ వద్దకు వచ్చిన ఓ ముఫై ఏళ్ల యువతి ఆ జనాన్ని చూసి, ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఆ గుంపు వద్దకు చేరుకుంది.
కరెంటు స్థంబానికి కట్టేసి ఉన్న తన భర్తను చూసి, సిగ్గుతో తల దించుకుని "ఛీ! ఇదా ఇన్నాళ్లూ నువ్వు చేస్తున్న నిర్వాకం. ఇంటికి రా నీ పని చెబుతా" అని మనసులో అనుకుంటూ అతని కంట పడకుండా అక్కడ నుండి చల్లగా జారుకుంది.
***** ***** ***** *****
రాత్రి ఇంటికి చేరిన ఆ లాల్చీ వాలాతో
"మధ్యాహ్నం చూసాను. అలా నడిరోడ్డు మీద నలుగురు చేత దెబ్బలు తినడానికి సిగ్గుగా లేదూ? చేసింది చాలు కానీ, ఇప్పటికైనా ఆ వృత్తి మానేయ్!" చెప్పింది అతని భార్య, అసహ్యంగా చూస్తూ.
"అలా మానేస్తే, నీకు ఇలాంటి నగలు ఎలా కొనివ్వగలను బంగారం?" అంటూ అప్పుడే కొన్న ఓ బంగారు నెక్లెస్ ఆమె మెడలో అలంకరించాడు ఆ వ్యక్తి.
అది చూసి మురిసిపోయిన ఆమె,
"వద్దు, ఆ వృత్తి మానవద్దు. కంటిన్యూ చెయ్యి. ఏదో తెలియక అన్నాను, అంతే" అంది ఆప్యాయంగా ఆ నెక్లెస్ తడుముతూ.
"నాకు తెలుసు బంగారం, నీ గురించి, నా ఒంటి మీద దెబ్బ పడితే నువ్వు సహించవని" అంటూ ఆమెకు ఓ ఫ్లైయింగ్ కిస్ ఇచ్చి, మర్నాడు ఉదయం తన షూటింగ్ స్పాట్ ఎక్కడో తెలుసుకోవడానికి ప్రొడక్షన్ మేనేజర్ కి ఫోన్ చేయడానికి లేచాడు, వర్ధమాన సినీ విలన్ విక్రమ్.
***** **శుభం** *****