లెదర్ బెల్ట్

సాహో • 01 Jul 2021 • 👁 8 views
లెదర్ బెల్ట్
*****
*లెదర్ బెల్ట్*
==========
(అపరాధ పరిశోధన కథ)

(నేను రాసిన ఈ కథ జూలై 2021 సాహో మహా మాస పత్రికలో ప్రచురితమైనది)

రచన ::
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్

"ఏంటి నాన్నా! నీ మొండి పట్టుదల? మా పిల్లకు పెళ్లి చేయాలి, పల్లెటూర్లోని ఆ పొలాలు అమ్మి నా వాటా ఇచ్చేయమంటే, అమ్మడం కుదరదంటారు? అది మీ స్వార్జితం కాదు కదా?" బ్యాంకు ఉద్యోగి పురుషోత్తాన్ని నిలదీసాడు పెద్ద కొడుకు ప్రదీప్.

"నేను కూడా సిటీలో ఓ అపార్ట్ మెంట్ తీసుకుందాం అనుకుంటున్నా. ఇప్పుడు ఇస్తే ఆ డబ్బు నాకు ఉపయోగపడుతుంది. అందుకే, ఈ రెండు రోజుల్లో ఏదో నిర్ణయం తీసుకోండి నాన్నా" అన్నాడు రెండో కొడుకు రేవంత్.

"ఇదిగో మళ్లీ చెబుతున్నా వినండి. నా స్వార్జితం కాకపోయినా నా తరువాతే మీకు వచ్చేలా వీలునామా రాసాడు మా నాన్న. అందుకే, నా గొంతులో ప్రాణముండగా ఆ పొలం అమ్మను" కరాకండీగా చెప్పాడు పురుషోత్తం.

తరువాత తీవ్ర వాదోపవాదాలు అయిన తరువాత,

"అయితే మీరు బతికుండగా ఆ ఆస్తి మాకు రాదంటారు. అంతేనా?" సోఫాలోంచి లేస్తూ అడిగాడు ప్రదీప్.

"ఔను. అదే నేను చెబుతూంట" సీరియస్ గా చెప్పాడు పురుషోత్తం.

ముందు ఉన్న హాలులో పాల పేకట్లు పడేసిన శబ్ధం విని, వాటిని తీసుకోడానికి వంటింట్లోంచి బయటకు వచ్చిన శారదమ్మ,

"ఏంటండీ!.పొద్దున్నే, పిల్లలతో సమానంగా మీరు కూడా! ఓసారి వాళ్ళు చెప్పింది కూడా వినొచ్చు కదా? ఎప్పుడూ ఎడమొహం, పెడమొహంగా ఉండే పిల్లలిద్దరూ ఈ వంకనైనా కలిసారు. రెండు రోజులు శెలవు కదా, మిమ్మల్ని ఒప్పించి ఆ పొలం అమ్మిద్దామని వచ్చారు. ఓ సారి మీరూ ఆలోచించండి" కొడుకులకు వత్తాసు పలికింది.

"వదిలేయ్ అమ్మా! తాను బతికుండగా ఆ పొలం అమ్మనని ఆయనే చెబుతున్నారుగా! అదే ఫైనల్. నా పాట్లు ఏవో నేను పడతాలే" కోపంగా అక్కడి నుండి తన గదిలోకి వెళ్లాడు ప్రదీప్.

తరువాత రేవంత్ కూడా తన గదిలోకి వెళ్లాడు మనసులో తండ్రిని తిట్టుకుంటూ.

తుఫాను వెలిసిందనుకొని హాయిగా పేపర్ చదవడంలో నిమగ్నమయ్యాడు పురుషోత్తం.

***** ***** ***** *****

మర్నాడు ఉదయం..
బ్యాంకు ఉద్యోగి పురుషోత్తాన్ని ఎవరో హత్య చేసారని కబురు రావడంతో తన బలగంతో పురుషోత్తం ఇంటికి బయలుదేరాడు ఇనస్పెక్టర్ దివాకర్.

సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నాడు ఇనస్పెక్టర్ దివాకర్.
కాంపౌండ్ వాల్ గేటు దాటి లోపలికి ప్రవేశించగానే, పెద్ద స్థలంలో నాలుగు వైపులా ఖాళీ వదిలి, మధ్యలో ఉంది ఆ ఇల్లు. ఇంటి లోపల కుడి వైపు బారుగా ఓ పెద్ద హాలు, ఎడమవైపు వరుసగా ఐదు గదులతో కట్టిన ఇల్లు అది.

ఎడమవైపు రెండో గదిలో, నేల మీద పడి ఉంది పురుషోత్తం మృతదేహం. కాళ్ళు గుమ్మం వైపు, తల కిటికీ వైపు ఉంది. పైన ఉన్న పాత సీలింగ్ ఫ్యాను పెద్ద శబ్ధంతో తిరుగుతోంది. ఆ గదిలో ఓ గోద్రేజ్ బీరువా, ఓ టేబుల్, ఓ కుర్చీ తప్ప ఏమీ లేవు. ఎవరో తాడుతో పీకకి ఉరి బిగించి చంపినట్లు తెలుస్తోంది. మంచం మీద కాసేపు కాళ్లతో గిలగిలలా తన్నుకున్న సూచనగా, మంచం మీద దుప్పటి న‌లిగి ఉంది.

"సార్! మృతదేహం పక్కన ఈ లెదర్ బెల్టు పడి ఉంది. బహుశా దీనితోనే ఉరి బిగించి చంపేసి ఉంటారు సార్" అని అక్కడ పడి ఉన్న బెల్టు చూపించాడు కానిస్టేబుల్.

మిగతా అన్ని ఫార్మాలిటీస్ చూడమని సిబ్బందికి చెప్పి, ముందుగా శారదమ్మను ప్రశ్నించడానికి వేరే గదిలోకి తీసుకుని వెళ్లాడు ఇనస్పెక్టర్.

"చూడండమ్మా! ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని ప్రశ్నించడం భావ్యం కాదు. కానీ తప్పదు. జరిగిన సంఘటన చూస్తూంటే, ఇది ఇంట్లో వాళ్ళ పనే అని తెలుస్తోంది. నిన్న ఏం జరిగిందో కొంచెం వివరంగా చెప్పండి" అని దివాకర్ అడగగానే తండ్రీకొడుకుల మద్య నిన్న జరిగిన వాగ్యుద్ధం గురించి పూర్తిగా చెప్పింది శారదమ్మ, వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ.

"సరే, మరి మృతదేహం పక్కన దొరికిన ఈ బెల్టు ఎవరిది?"

"అది మా చిన్నబ్బాయి రేవంత్ ది"

"అయితే ఏ అబ్బాయి ఈ హత్య చేసుంటాడని అనుకుంటున్నారు?" అడిగాడు ఇనస్పెక్టర్.

"లేదండీ, మా పిల్లలు అటువంటి వారు కారనుకుంటున్నాను. కానీ, ఏమో ఏం చెప్పగలం డబ్బు ఎంతటి పనైనా చేయిస్తుంది" బాధపడుతూ చెప్పింది.

"పోనీ మీ వారికి బయట ఎవరైనా శత్రువులు ఉన్నారా?"

"అబ్బే ఆయన యూనియన్ శెక్రటరీ. చాలా మందికి సహాయం చేసారు. కావాలంటే బయట బ్యాంకు వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్లను అడగండి"

"సరేనమ్మా! ఆ గదిలో హత్య జరుగుతోంటే మీకు ఎవరికీ ఏమాత్రం అలికిడీ వినబడలేదా?"

"లేదండి! అందరమూ తలో గదిలోనూ తలుపులు దగ్గరకు వేసుకుని పడుకున్నాం. గదుల్లో ఫ్యాన్లు ఎప్పటివో పాతవి. ఆ శబ్ధంలో ఏమీ వినబడలేదండీ" కన్నీళ్ళు తుడుచుకుంటూ చెప్పింది శారదమ్మ.

"సరేనమ్మా! అవసరమైతే మళ్ళీ పిలుస్తా"
అని చెప్పి ఆమె వంక ఓ సారి చూసి, బయటకు వెళ్లమని చెప్పి, తర్వాత పెద్ద కొడుకు ప్రదీప్ ను పిలిపించాడు ఇనస్పెక్టర్.

"ప్రదీప్! నిన్న మీ నాన్నగారితో నువ్వు చాలా పరుషంగా మాట్లాడేవని మీ అమ్మగారు చెప్పారు. ఆవిడ మాటలు బట్టి చూస్తూంటే నువ్వే హంతకుడివి అని స్పష్టంగా తెలుస్తోంది. నేరం ఒప్పుకుంటే నీకే మంచిది" కొంచెం బెదిరింపు ధోరణిలో అన్నాడు ఇనస్పెక్టర్ దివాకర్.

"సార్! మా నాన్నగారు అన్న మాటల్నే మళ్ళీ ఆయనకు చెప్పాను తప్ప అవి ఆయన మీద ద్వేషంతో అన్నవి కాదు. డబ్బులు కోసం నాన్నగారిని చంపేటంత క్రూరుడ్ని కాదు సార్. ఆ లెక్కన మా రేవంత్ కూడా ఆయనతో వాగ్వాదం చేసాడు. అంతే కాదు అక్కడ దొరికిన లెదర్ బెల్టు కూడా వాడిదే! మరి వాడిమీద మీకు అనుమానం రాలేదా?" కొంచెం ఆవేశంగా అడిగాడు ప్రదీప్.

"సరే, ఎవరు హత్య చేసారనేది త్వరలోనే తేలుతుంది. అంతవరకూ మా అనుమతి లేనిదే మీరు ఊరు దాడి వెళ్లకూడదు" అని చెప్పి అతడిని పంపించి, రేవంత్ ని పిలిచాడు ఇనస్పెక్టర్.

"మిష్టర్ రేవంత్! హత్యాస్థలంలో దొరికిన బెల్టు నీదేనని మీ వాళ్ళు చెప్పారు. దానికి తోడు నీకు కూడా డబ్బు అవసరం ఉందని మీ అమ్మగారి మాటల్లో తెలిసింది. అసలు ఏం జరిగింది? ఎలా చంపావు?" ప్రశ్నించాడు ఇనస్పెక్టర్ దివాకర్.

"సార్, ఒకవేళ నేనే కనుక హత్య చేసి ఉంటే ఆ బెల్టు అక్కడ ఎందుకు పడేస్తాను? మా ప్రదీపే హత్య చేసి అనుమానం నా మీదకు వచ్చేలా ఆ బెల్టు అక్కడ పడేసి ఉండొచ్చుగా?" ఇనస్పెక్టర్ దివాకర్ ని ప్రశ్నించాడు రేవంత్.

"సరే మీ ఇరువురిలో నేరస్తుడు ఎవరనేది త్వరలోనే తేలుస్తా! అంతవరకూ మీరెవరూ ఊరు దాటి వెళ్లకూడదు" అని అతనికి కూడా చెప్పి, హత్య జరిగిన ప్రదేశాన్ని మరోసారి క్షుణ్ణంగా పరిశీలించి, తన సిబ్బందికి 'అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని రమ్మని' చెప్పి, స్టేషనుకు బయలుదేరాడు ఇనస్పెక్టర్.

***** ***** ***** *****

మర్నాడు సాయంత్రం వచ్చిన ప్రాధమిక రిపోర్టులు ఆధారంగా ప్రదీప్, రేవంత్ లను అదుపులోకి తీసుకున్నాడు ఇనస్పెక్టర్ దివాకర్.

ఈలోగా డిఎస్పీ ప్రభాకరరావు నుంచి ఫోన్ రావడంతో ఆ ఫోన్ ఎత్తిన దివాకర్ తో,
"ఏమయ్యా ? ఆ బ్యాంకాయన కేసు ఎంతవరకూ వచ్చింది? మృతుని ఇద్దరు కొడుకులనీ అదుపులోకి తీసుకున్నావుట? ఆ పురుషోత్తం యూనియన్ లీడరుటగా? లేటయితే పైనుంచి ప్రెషర్ వస్తుంది. ఓ రెండు రోజుల్లో కేసు క్లోజ్ చేసేయ్" చెప్పారు డీఎస్పీ.

"అలాగే సార్, బెల్టు మీద వేలిముద్రలు చిన్న అబ్బాయి వేలిముద్రలతో సరిపోవడం వలన అతడినీ, అలాగే కొంత అనుమానం వచ్చి పెద్ద అబ్బాయిని అదుపులోకి తీసుకున్నా సార్. ఓ రెండు రోజుల్లో కేసును ఓ కొలిక్కి తెస్తా. ఇప్పటికే ఓ రెండు బృందాలు ఆ పని మీదే ఉన్నాయి సార్!" అని చెప్పి ఫోన్ పెట్టేసాడు ఇనస్పెక్టర్ దివాకర్.

***** ***** ***** *****

రెండు రోజుల తర్వాత, డీఎస్పీ ప్రభాకరరావు అనుమతితో ఆయన కార్యాలయంలో పురుషోత్తం హత్య కేసు విషయమై సమావేశం ఏర్పాటు చేసాడు ఇనస్పెక్టర్ దివాకర్.

"సార్! హంతకుడు దొరికాడు సార్. తనే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు" సమావేశం ప్రారంభిస్తూ చెప్పాడు దివాకర్.

"ఇంతకీ హంతకుడు ఎవరు? పెద్దవాడా? చిన్నవాడా?" బిస్కెట్ పాలలో నంచుకుని తింటూ అడిగారు డీఎస్పీ.

"ఇద్దరూ కాదు సార్" అని చెప్పి, తన సిబ్బంది వైపు చూసాడు ఇనస్పెక్టర్.

"మరి అలాంటప్పుడు వాళ్లిద్ధరినీ ఎందుకు అదుపులోకి తీసుకున్నావ్?"

"అసలైన హంతకులకు తమ మీద పోలీసులకు అనుమానం రాలేదని, వారిని తప్పు దోవ పట్టించడానికి సార్! " అని చెప్పి సిబ్బంది తీసుకుని వచ్చిన వ్యక్తిని చూపిస్తూ "సార్! హంతకుడు ఇతడే" అని చెప్పి "చెప్పు. ఏం జరిగిందో, ఎందుకు చంపవలసి వచ్చిందో మళ్ళీ వివరంగా చెప్పు" అని ఆ వ్యక్తిని ఉద్దేశించి చెప్పాడు దివాకర్.

"సార్! నా పేరు స్వరాజ్. నేను ఇంటర్ చదువుతుండగా బ్యాంకులో టెంపరరీ అటెండర్ గా చేస్తున్న మా నాన్న స్కూటర్ ప్రమాదంలో చనిపోయాడు. అప్పుడు యూనియన్ లీడర్ గా ఉన్న ఈ పురుషోత్తం గారే తన పలుకుబడితో ఆ ఉద్యోగం మా అమ్మకు వచ్చేలా చేసారు. అయితే ఆయన పేరుకే పురుషోత్తం కానీ గుణానికి కాదని మా అమ్మకి తెలియడానికి ఆరు నెలలు పట్టింది" అని చెబుతూ ఆగాడు స్వరాజ్.

"చెప్పు స్వరాజ్! మధ్యలో ఆపకు" అన్నాడు ఇనస్పెక్టర్.

"ఆ పురుషోత్తం భయపెట్టో, బెదిరించో మొత్తం మీద మా అమ్మను లోబరుచుకున్నాడు. ఫలితం మా అమ్మ గర్భవతి అయ్యింది. ఇది తెలిసి, మా అమ్మ శీలాన్ని శంకిస్తూ, నానా దుర్భాషలాడాడు. ఆ అవమానం భరించలేక మా అమ్మ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. తరువాత పురుషోత్తం వచ్చి, ఆత్మహత్య చేసుకుంది అని చెబితే బ్యాంకు నుంచి పరిహారం విషయంలో ఇబ్బందులు వస్తాయనీ, అనారోగ్యంతో మరణించింది అని మా మేనమామ చేత అందరికీ చెప్పించి కేసు లేకుండా చేసాడు" తల వంచుకుని చెప్పాడు స్వరాజ్.

"సరే ఈ విషయాలు అన్నీ నీకు ఎవరు చెప్పారు?" అడిగాడు డీఎస్పీ.

"ఆత్మహత్య చేసుకున్న రోజు సాయంత్రం నేను ట్యూషన్ నుంచి వచ్చేసరికి అమ్మ చనిపోయి ఉంది సార్. చేతిలో ఉన్న ఉత్తరంలో ఇవన్నీ విపులంగా రాసింది. వెంటనే పోలీసులకు చెప్పి అతడిని కటకటాల వెనక్కి పంపుదాం అనుకున్నా, కానీ తన పలుకుబడితో కేసు నుంచి తప్పించుకుంటాడని, మౌనంగా ఉండి ఆ ఉత్తరాన్ని ఇదిగో ఈ పర్సులో దాచుకుని, ఆ తరువాత చదువు నిమిత్తం మా మేనమామ ఇంటికి వెళ్లి పోయాను. సుమారు పది సంవత్సరాలుగా నాలో రగులుతున్న పగ మొన్నటికి తీరింది సార్" గతం అంతా చెప్పాడు స్వరాజ్.

"సరే! హత్య ఎలా చేసావో అది చెప్పు" మళ్లీ అడిగాడు ఇనస్పెక్టర్.

"నేను మా మేనమామ ఇంట్లో ఉన్నప్పటికీ ఈ పురుషోత్తం గురించి వాకబు చేస్తూనే ఉన్నా సార్. క్రిందటి సంవత్సరమే తెలిసింది, అతను ఈ ఊర్లో స్థిరపడ్డాడని. ఇక్కడకొచ్చి ఓ ఇంట్లో అద్దెకు ఉండి, అతడిని రోడ్డు మీద చంపడానికి చాలా ప్రయత్నాలు చేసా, కానీ కుదరలేదు. చివరికి ఓ మిల్క్ బూత్ లో డెలివరీ బాయ్ గా చేరి, పురుషోత్తం ఇంట్లో పాల పేకట్లు వేస్తూ వాడి భార్య ద్వారా కావలసిన వివరాలు అన్నీ సేకరించాను. అన్నదమ్ములు ఇద్దరూ ఆస్తి గురించి తండ్రిని అడగడానికి వస్తున్నారని ఆవిడ ద్వారానే తెలిసింది సార్. ఆరోజు పాలపేకట్లు వేస్తూ వాళ్ళ సంభాషణ మొత్తం విన్నాను. ఆ రోజు రాత్రే పురుషోత్తం చావుకు ముహూర్తం పెట్టి, కత్తితో అతడి పీక కోసి చంపడానికి బయలుదేరాను సార్" చెబుతున్న స్వరాజ్ ను ఆపి,

"హత్య జరిగింది లెదర్ బెల్టుతో పీకకు ఉరి బిగించి కదా?" అడిగారు డీఎస్పీ.

"ఔను సార్. కానీ ఆ ఇంట్లో ఓ గదిలో కిటికీ దగ్గరగా ఉన్న ఆ లెదర్ బెల్టు కనబడడంతో, నా ప్లాన్ మార్చేసి, చేతికి గ్లౌసు వేసుకుని నెమ్మదిగా ఆ బెల్టును బయటకు లాగి, ఇంకో గదిలో మంచం మీద కిటికీ వైపు తల పెట్టుకుని పడుకున్న పురుషోత్తం మొహం మీద మొదట క్లోరోఫాం చల్లి, తర్వాత నా రెండు చేతులూ ఒడుపుగా లోపలికి పోనిచ్చి ఆ బెల్టుతో అతని పీకకు ఉరి వేసి చంపేసి ఆ బెల్టు ఆ గదిలోనే పడేసి బయటకు వచ్చేసా. అనుమానం ఆ అన్నదమ్ములు ఇద్దరి మీదకూ వస్తుందనుకున్నా కానీ నేను చేసిన ఓ చిన్న పొరబాటు నన్ను ఇంత త్వరగా పట్టిస్తుందని అనుకోలేదు సార్" అని చెప్పి మౌనంగా నిలబడి పోయాడు మిల్క్ డెలివరీ బోయ్ స్వరాజ్.

స్వరాజ్ ని లోపలికి తీసుకుని వెళ్లమని
చెప్పిన డీఎస్పీ,

"వెల్ డన్ ఇనస్పెక్టర్. కేసుని భలే ఛేదించావు. అతను చెబుతూంటే, ఏదో చిన్ననాటి పగ నేపథ్యంలో వచ్చిన సినిమా చూసినట్టుంది. ఔనూ ! అసలు నీకు ఇతని మీద అనుమానం ఎలా వచ్చింది ?"

"నా పరిశోధనలో ఆ అన్నదమ్ములు కానీ, బ్యాంకు వారు కానీ హంతకులు కారని ముందుగానే తేలింది సార్. అప్పుడు వీరు కాకుండా ఆ ఇంటితో సంబంధం ఉన్నవారు ఎవరా అని శారదమ్మ గారిని ప్రశ్నిస్తే ,ఆవిడ 'పనిమనిషి, ఇస్త్రీ అబ్బాయి, పాలవాడు, కూరగాయలు వాడు, పోస్ట్ మేన్' అని చెప్పారు. ఒక్కొక్కరినీ విడిగా ప్రశ్నించా. ఎవరిమీద అనుమానం రాలేదు కానీ స్వరాజ్ ను ప్రశ్నిస్తున్నపుడు, అతని ఎడమ చేతికి అయిన గాయం చూడగానే అనుమానం వచ్చింది. మొదట ఏవో కుంటి సాకులు చెప్పాడు కానీ తర్వాత నేరం చేసినట్టు ఒప్పుకున్నాడు" చెప్పాడు ఇనస్పెక్టర్.

"అంటే ఆ కిటికీ ఊచల వలన అతని చేతికి గాయమయ్యిందా" అనుమానంగా అడిగాడు డీఎస్పీ ప్రభాకరరావు.

"ఔను సార్. హత్యా స్థలాన్ని రెండో సారి క్షుణ్ణంగా పరిశీలించినపుడే, ఓ చోట సూదిగా ఉన్న ఆ కిటికీ ఊచలకి అంటుకున్న రక్తపు మరకలు, చిన్ని చిన్న వెంట్రుకలు నేను గమనించాను. చివరికి అవే అతడిని పట్టించాయి. అవి స్వరాజ్ వే నని రిపోర్టులు కూడా వచ్చాయి. మిగతాది అంతా అతనే చెప్పాడు కదా సార్" ఫైల్ మూస్తూ చెప్పాడు ఇనస్పెక్టర్ దివాకర్.

"బాగుందయ్యా! పిట్ట తగువు పిట్ట తగువు పిల్లి తీ‌ర్చింది అన్నట్లు తండ్రీకొడుకుల మధ్య ఆస్తి తగువు ఈ స్వరాజ్ తీర్చాడన్న మాట" బయటకు వెళ్తూ చెప్పాడు డీఎస్పీ ప్రభాకర్.

"ఔను సార్. అంతే" అంటూ ఆయనను అనుసరించాడు ఇనస్పెక్టర్ దివాకర్.

***** **సమాప్తము** *****