ఇక చాలు బాబోయ్ చాలు .

తపస్వీ మనోహరం • 19 Mar 2023 • 👁 17 views
ఇక చాలు బాబోయ్ చాలు .
ఇక చాలు బాబోయ్ చాలు ....( కథానిక ) రచన : జీడిగుంట నరసింహ మూర్తి.
(19/3/2023 తపస్వీ మనోహరం వార పత్రికలో ప్రచురితం )
రఘురాం ఒక రచయిత. ఎన్నో కథలు వ్రాశాడు. అతని కథలు అన్నీ సమాజంలోనుండి పుట్టినవే. ఏదో ఊహించి కలిపించి వ్రాసినవి కావు. ఆ వూళ్ళో అతని బంధువుల కుటుంబాలు ఏభై పైనే ఉంటాయి. అందులో చాలా మంది ఇళ్ళల్లో అతను వెళ్ళి సరదాగా గడుపుతూ ఉండటం అలవాటు.
"పాపం రఘురాం కు బంధు ప్రీతి ఎక్కువ. వాళ్ళ నాన్న తాలూకు చిన్నప్పటి బంధువులను ఏ మారుమూల ఉన్నా కూడా కలిసి మంచైనా చెడైనా పరామర్శించి వెళ్తూ ఉంటాడు. సొంత సోదరులే ఒకరికొకరు సరిగ్గా మాట్లాడుకోవడానికి దూరం జరిగే ఈ రోజుల్లో పాత బంధువులను గుర్తుంచుకుని పలకరించడం ఈ రోజుల్లో ఎవరి వల్ల అవుతుంది ? " అంటూ అతని చుట్టాల్లో అనుకోని వారంటూ ఉండరు.
రఘురాం బంధువుల్లో అతని ఇంటిపేరు గల వాళ్ళు చాలా మంది ఉన్నారు. అతనికి వాళ్ళ పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవాలంటే చాలా ఇష్టం. ఈ రోజుల్లో తాతల పేర్లే తెలియని పిల్లలు చాలా మంది ఉన్నారు. ఇక సొంత తాత తమ్ముళ్ళు పేరులూ తెలియడానికి అవకాశమే లేదు. . వాళ్ళ మొహాలు కూడా ఎప్పుడూ చూడని వాళ్ళు ఉన్నారు. పోనీ చిన్న పిల్లలుకు అవన్నీ ఏమి తెలిస్తాయి అని ఎవరైనా వాదించినా పెద్ద వాళ్ళకు కూడా కొంతమంది అదే సమస్య. పోయిన వాళ్ళ గురించి ఇప్పుడు మనకెందుకు ? పోనీ వాళ్లేమేనా మనకు ఆస్తులు దారపోస్తే వాళ్ళ గోత్ర నామాలతో పాటు రోజూ జపిస్తాం. ఈ రోజుల్లో తల్లీ, తండ్రి, భార్య, పిల్లలు అంతే వాళ్ళ పేర్లు తెలిస్తే చాలు. " అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడే వాళ్ళూ ఉన్నారు.
ఏదో రకంగా మొదటినుండి బంధు ప్రీతి ఉన్న రఘురాం కు ఎంతోమందిని పలకరించే సందర్భంలో అతనికి ఇక కథలకు ప్లాట్లు దొరకడానికి కష్టం ఏముంటుంది ? ఏదో కావలసిన వాడు, దగ్గర వాడు అని ఆ బంధువులు రఘురాంతో తమ కుటుంబ విషయాలు అన్నీ దాచకుండా మాట్లాడేస్తూ ఉంటారు. వాటిల్లో ఇప్పటివరకు ఎవరికీ తెలియని సంఘటనలు ఎన్నో ఉంటాయి. పైకి ప్రేమలు నటిస్తూ ఒకరి వెనుక ఒకరు పొగపెట్టుకునే అత్తా , కోడళ్ళ వ్యవహారాల దగ్గర నుండి కుటుంబాలలో రగిలిపోయే అసూయలు , ద్వేషాలు, ఈ ఇంటిమీద కాకి ఆ ఇంటిమీద, ఆ ఇంటిమీద కాకి ఈ ఇంటిమీద వాలని కక్షలు, కార్పణ్యాలు, ఆర్ధిక వ్యవహారాలలో ఎక్కువ, తక్కువలు పట్టించుకుని సమాన స్తాయి వాళ్ళను ఇళ్లకు గెట్ టుగెదర్ పేరున పార్టీలు చేస్తూ , తక్కువ స్తాయి వాళ్ళను దూరంగా పెట్టడం వరకు అన్ని విషయాలు వాళ్ళ నోళ్ల నుండి నాన్ స్టాప్ కింద వచ్చేస్తూ ఉంటే వాటినన్నిటిని రఘురాం మెదడులో భద్రంగా రిజిస్టర్ చేసేసుకునే వాడు. ఈ విషయంలో అతను ఎవరికి తగ్గ మాటలు వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో ప్రేమగా నటిస్తూ ఆ కుటుంబాల చరిత్రలను చక్కగా తన కాయితాలలో ఎక్కించి పత్రికలకు పంపించి బహుమతులు కొట్టేసి సమాజంలో , పత్రికలు నడిపే వారి దృష్టిలోనూ ఒక సహజ రచయిత అని పేరు పొందాడు
అతని కథలు చదివే వాళ్ళు "అరె అచ్చం మా ఇంట్లో జరిగిన వాస్తవ సంఘటన లాగానే మీ కథలు ఉన్నాయండీ. కొంపదీసి మీకు పరకాయ ప్రవేశం ఏమైనా వచ్చా ? మేము ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా ఒక్క ఐడియా కూడా రాదు. వస్తే గిస్తే మా కథల స్తాయి నోరులేని పక్షులా మీదో, కోతుల మీదో వ్రాసే బాలల కథలు దాటి ముందుకు వెళ్లలేదు. మీలాగా మనుష్యుల మనస్తత్వాలను అసలు పట్టుకోలేము. మీరు చాలా గ్రేట్ అండీ " అంటూ పొగుడుతూ కామెంట్లు పెట్టేవాళ్లు. ఏ మాత్రం కష్టపడకుండా , ఇతరుల కథలు ఒక్క వాక్యం కూడా చదవకుండా ఇలా అచ్చెమ్మ కబుర్లు, బుచ్చమ్మ కబుర్లు వింటూ వాళ్ళ నిజజీవితాలను తూర్పారబెట్టి ఇంటా, బయటా తనో పెద్ద రచయితగా పేరు సంపాదించేశాడు రఘురాం. .
రఘురాం బంధువుల్లో అతని ఇంటి పేరు గల వాళ్ళు చాలా మంది ఆ ఊళ్లోనే ఉన్నారని చెప్పుకున్నాం కదా. ఇక్కడే ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. వాళ్లలో ఎవరు చనిపోయినా ముందు రఘురాం కు తెలిసేది.
"తప్పదు రఘూ.ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. పోయిన వాళ్ళు ముసలి వాళ్ళే అయినా కూడా ఒక ఇంటిపేరు గల వారు మయలు పాటించాలి. తెలిసీ కూడా ఇంట్లో కలిపేస్తే కుటుంబంలో ఎవరికో ఒకరికి కీడు పట్టుకుంటుంది. ఆ దోషం కొన్ని తరాలు పీడిస్తుంది. నీతో చెప్పకుండా ఉందాం అంటే మేము దూరంగా కూర్చుని నీకు కాఫీలు, ఫలహారాలు ఇవ్వకుండా ఎలా పంపించగలం చెప్పు ? పైగా మయలు కలిపేస్తే మాకు దోషం. ఇంకో విషయం ఏమిటంటే ఆ పోయిన వాళ్ళు కూడా మీ నాన్నకు , మీకు కావలసిన వాళ్లే కదా ? రేపు ఎవరో ద్వారా తెలిస్తే నాకు ఎందుకు చెప్పలేదు అని నువ్వే బాధ పడే అవకాశం ఉంది. " అంటూ రఘురాం వాళ్ళ బంధు సమూహంలోకి అడుగుబెట్టినప్పుడు వాళ్ళు దాచుకోకుండా చావు కబురు చల్లగా చెప్పేసే వాళ్ళు.
ఎక్కడెక్కడో తిరిగి ఇంటికొచ్చిన రఘురాం ని అన్నదమ్ములు, ఇతర కుటుంబ సభ్యులు గుచ్చి గుచ్చి అడిగే వాళ్ళు " ఏరా అందరిళ్ళల్లో బాగానే ఉన్నారుగా ? ఒకవేళ నెగిటివ్ విషయాలు అదే ముఖ్యంగా మన ఇంటి పేరు గల వాళ్ళకు ఏదైనా అయితే వాళ్ళను ఏ పదకొండో రోజునో చెప్పమను. . ఒకేసారి తల స్నానం చేసేస్తే సరిపోతుంది. అంతే కానీ నువ్వు అటువంటి వార్తలు ఊరంతా తిరిగి మోసుకొచ్చావంటే అందరమూ నానా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఈ విషయంలో వాళ్ళతో ఖచ్చితంగా మాట్లాడు. కొంతమందికి అలా చెప్పడం బాగా సరదా. వాళ్ళు ఒక్కళ్లే ఎందుకు బాధ పడాలని అందరినీ ఇరికిస్తారు. " అంటూ రఘురాం ను ఎందుకైనా మంచిదని కాస్త దూరంగా వుంచి మనసులో ఏ విషయాన్ని దాచుకోకుండా అతని మోహమ్మీదే కక్కేస్తారు . .
రోజులు ఒకేలా ఉండవు కదా. ఇన్నాళ్లూ రఘురాం బంధువుల ఇళ్ళల్లో ఎవరికీ లేని ప్రత్యేకతను ప్రదర్శిస్తూ అందరి మన్నలను పొందుతూ వచ్చిన అతనికి ఈ మధ్య ఏ ఇంట్లో చూసినా తిరస్కార భావం ఎదురవుతోంది. గుమ్మంలోనే ఒక ప్లాస్టిక్ నవ్వు నవ్వి పంపించేసే వాళ్ళు ఎక్కువయ్యారు. అప్పుడప్పుడు ఎండనపడి వచ్చాడని ప్రేమతో వాళ్ళ ఇళ్ళల్లోనే భోజనాలు కూడా ఏర్పాటు చేసే అతని తండ్రి తాలూకు , తల్లి తాలూకు బంధువులు ఈ మధ్య అటువంటి ఆర్భాటాలు జోలికి వెళ్ళడం లేదు. మహా అయితే ఒక కప్పుడు టీ ఇచ్చేసి లోపల ఏవో పనులున్నట్టు సంకేతాలు ఇస్తూ, ఇంకొంతమంది అయితే తమ పిల్లలకు పరీక్షలు దగ్గర పడ్డాయని, వాళ్ళకు ఎటువంటి డిష్ట్రబెన్స్ పనికిరాదని సూటిగా చెప్పేసే వాళ్ళు . కొంతమంది గుమ్మంలోనే పలకరించి పంపించేస్తున్నారు.
అలవాటైపోయిన కాళ్ళు, పైగా ఎంతోమందితో చనువు ఉండటంతో వారానికొకసారి కాకపోయినా పదిహేను ఇరవై రోజులకొకసారైనా రఘురాం ఎవరో ఒకరి గుమ్మం తొక్కుతూనే వున్నాడు. ఆ రోజు చిక్కడపల్లి ఒక బంధువు ఇంటికి వెళ్ళి తలుపు తట్టగానే లోపలనుండి ఎవరో అంటున్నారు " వచ్చినట్టున్నాడు ఆ రఘు రామ్ గాడు కొంపలు ముంచడానికి ? వాడికి పనేముంది ? అందరిళ్ళల్లో విషయాలు అన్నీ విని కథలు రాసి పారెయ్యడమేగా ? ఎలా ఎంతమందిని జీవితాలను వీధిన పారేశాడో ? వీడి జన్మ తగలెయ్యా?చుట్టం కాదు కానీ మన బ్రతుకులతో ఆడుకుంటున్నాడు " అంటోంది ఒక స్త్రీ గొంతు.
రఘురాంకు తలకొట్టేసినట్టుగా ఉంది. వీళ్ళంతా తన బాధితులు అని అతనికి అర్ధమయ్యింది. అక్కడే ఉంటే మోహమ్మీద నీళ్ళు కూడా గుమ్మరిస్తారు అని ఉసూరుమని ఎర్రని ఎండలో తల మీద జేబు రుమాలు వేసుకుని ఇంత దూరం వచ్చాక మళ్ళీ వెనక్కి పోతే తనకు కథలకు ఐడియాలు ఎలా దొరుకుతాయి? అందులోనూ ఇటువంటి నిజ జీవితాల కథలకే తనకు బాగా పేరొచ్చింది. తిరిగే కాలు, వ్రాసే చెయ్యి ఊరుకోదు అని ఇంట్లో ఏ పనీ లేకుండా ఖాళీగా కూర్చుంటే ఎలా తోస్తుంది ? ఈ మధ్య కథలు వ్రాయడం మానేశారా అని ఎవరైనా అడిగితే ఐడియాలు రావడం లేదని చెపితే ఏం బాగుంటుంది ? ఇటువంటి రకరకాల ఆలోచనలతో రఘురాం బుర్ర వేడెక్కిపోయింది.
అప్పటివరకూ "నువ్వు వస్తేనే మాకు బాగా కాలక్షేపం అవుతుందయ్యా . మన బంధువులలో నీకున్న ప్రేమ , ఆప్యాయత ఎవ్వరిలోనూ దివిటీ వేసి వెతికినా కనపడదు. నువ్వు మాకు కావలసినంత ఎనర్జి ఇస్తావు. .." అంటూ ఒకటే పొగిడిన బంధుకూటమి మూకుమ్మడిగా రఘురాం ను పక్కన పెట్టేశారు. అతని పొడ ఎవరికీ గిట్టడం లేదు. పెళ్లిళ్లకు , శుభ కార్యాలకు పిలవడం మానేశారు. కొరివితో తల గోక్కోవడం ఎందుకు ? మన సంసారాలను బయట పెట్టుకోవడం ఎందుకు ? అతనేమీ మనకు కావలసిన దగ్గర చుట్టమా ఇంటికి పిల్చి గౌరవించడానికి ?వాడి తండ్రి పోయినప్పుడే ఆ కుటుంబంతో బంధాలు తెగిపోయాయి. మళ్ళీ ఇప్పుడు వీడిని దగ్గరకు చేరదీసి ఈ సంబంధాలను ఎందుకు కొనసాగించడం వెర్రి కాకపోతే అని వాళ్ళల్లో వాళ్ళు ఎన్నో ప్రశ్నలు వేసుకుని చివరకు రఘురాంను మర్చిపోవడానికి విశ్వ ప్రయత్నాలు చెయ్యడం మొదలు పెట్టారు. .
ఇదంతా కొన్ని రోజులుగా గ్రహిస్తున్న రఘురాం "ఛి ...ఛి తనకు సిగ్గులేదు అనుకుంటున్నారా వీళ్ళంతా ? అవునులే తను కూడా అతిగా ప్రవర్తించాడు. వెధవ కథలు వ్రాయడం కోసం ఇలా అందరిచేత నానా మాటలు పడి ఛీ కొట్టించుకుని జీవితాన్ని లాగించకపోతే ఊరుకునే కూర్చుంటే రోజులు వెళ్లిపోవా ? ఇప్పటివరకు వ్రాసిన కథలు చాలు. ఇంకా ప్రత్యేకంగా ఒరగబెట్టేది ఏమీ కనపడటం లేదు. తన బంధువుల తిట్లు తన పాలిట శాపాలుగా పరిగణిస్తే తనకు మాత్రం ఏమైనా మనశ్శాంతి ఉంటుందా ? నో .. నో .. ఈ కథలకు కొన్నాళ్లు విశ్రాంతి ఇచ్చి ఇతర రచయితల పుస్తకాలు అన్నీ చదివి వాళ్ళు ఏం వ్రాస్తున్నారో, వీలైతే వాళ్ళ దారిలో పయనించడం లేకపోతే ఇక వ్రాస్న్ది చాలు అనుకుని నోరుమూసుకుని కూర్చుని ఇంట్లో మనవళ్లను , మనవరాళ్లను ఆడిస్తూ శేష జీవితాన్ని గడిపెయ్యడం ఉత్తమోత్తమ మార్గం అని మనసులో పూర్తి అంతర్మధనం చెందాకా రఘురాంకు ఇప్పుడు అతనికి పూర్తి ప్రశాంతత చేరువయ్యింది. **