ఆయ్ ...పెళ్లారం అండీ బాబూ

తపస్వీ మనోహరం • 30 Apr 2023 • 👁 14 views
ఆయ్ ...పెళ్లారం అండీ బాబూ " (కథ )
రచన : జీడిగుంట నరసింహ మూర్తి
(30/4/2023 తపస్వీ మనోహరం వార పత్రికలో బహుమతి పొందిన నా మాండలికపు కథ )
"ఏమేవ్ వాళ్ళు మధ్యాన్నం మూడు గంటలకల్లా పెళ్లి చూపులకు వచ్చేస్తున్నట్టు కబురు పంపించారు. అమ్మాయిని తొందరపెట్టి తయారవ్వమను. ఇంకోవిషయం. దాని ప్యాషన్లు ఈ రోజుకు పక్కన పెట్టమను. పెళ్లి వాళ్ళకు అది సంప్రదాయకంగా కనిపించాలి. వాళ్ళకు పిల్ల గుణగుణాలతో పాటు మనిషి నావళికంగానూ, కట్టూ, బొట్టూ విషయంలో సంస్కారవంతంగానూ ఉండాలి మరి. . . నాకు తెలుసు మన పిల్ల అటువంటి సంబంధాలను ఒప్పుకోదు అని . అయినా కూడా దాని మెడలు వంచి ఒప్పించు. ఈ సంబంధం పోతే వేరే సంబంధాలు వస్తాయి కానీ ఇంత మంచి సంబంధం మాత్రం నేను తేలేను " అంటూ భార్య రామలక్ష్మికి ఖరాఖండిగా చెప్పేశాడు విశ్వనాధం.
రామలక్ష్మి మొహం ఎర్రబడింది.
" అదేదో దానికి మీరే చెప్పొచ్చుగా. ఈ రోజుల్లో పిల్లలు ఎంత మొండిగా ఉంటున్నారో మీకు తెలియదా ? పెళ్లిళ్లు అయినా మానేస్తారు కానీ ఆంక్షలు పెట్టె సంబంధాలను అస్సలు భరించలేరు. అయినా వాళ్ళు మన పిల్లను చూసి మన దగ్గరకు వస్తున్నారా ? మన ఆస్తి మీద కన్ను పడిఉంటుంది. . హైదరాబాద్ నుండి విమానంలో వచ్చేస్తున్నారా ? అంత తొందరెందుకో ? ఎటూ ఆలోచించుకోకుండా మనల్ని కలవడానికి వచ్చేస్తున్నారు అంటే అంతే మరి. . . మనమేమీ కంగారు పడాల్సిన పని లేదు. . . జనాభా లెక్కల ప్రకారం పదిమంది మగపిల్లలు ఉంటే ఆడపిల్లలు ఒక్కళ్లే ఉన్నారని చెప్పుకుంటున్నారు. ఆడపిల్ల దొరికితే చాలు అన్నట్టుగా ఉన్నాయి సంబంధాలు. సరే లెండి. ఇక నా పనులు నాకున్నాయి. వాళ్ళు రావడానికి కనీసం మూడు గంటలైనా లేదు " అంటూ హడావిడిగా లోపలికి పరిగెట్టింది రామలక్ష్మి .
"ఓషోష్ . ఈ రోజుల్లో ఇంట్లో కూర్చున్నా కూడా ఆడవాళ్ళకు ప్రపంచంలోని అన్ని విషయాలు తెలిసి పోతున్నాయి. "సరేలే కానీ ఒకసారి నేను బయటకు వెళ్ళి ఇప్పుడే వచ్చేస్తాను. పనిమనిషి వస్తే దొడ్లో పూలు కోయించి పెట్టమను " అంటూ బైక్ తీసుకుని వెళ్ళాడు విశ్వనాధం
" అరేయ్ ఎవర్రా అక్కడ పొలంలో కలుపు తీస్తున్నది ?ఒకసారి పనాపి ఇటు రండి " అన్నాడు కొంచం దూరంలో కూర్చుని కలుపు తీస్తున్న వ్యక్తిని.
"ఆయ్ నేనేనండీ బాబూ సుబ్బారావుని .ఏం బాబూ చెప్పండి. కొబ్బరి బోండాలు కొట్టించమంటారా ఆయ్ ? ఎండలో వచ్చినట్టున్నారు ?" అన్నాడు తలపాగా చుట్టుకుంటూ.
"ఓహో నువ్వురా సుబ్బూ ఎవరో అనుకున్నాను సుమీ. . నువ్వే నాకు కావాలి. నీకింకా ఇప్పుడు వేరే పనేమీ లేదుగా . అయితే విను. మొన్న మన తోటలోవి పెద్ద చెరుకు రసాలను మాగెయ్యమని చెప్పాను కదా. మాగేశావా? నేను అడగటమే మర్చిపోయాను రా బాబూ. ఇప్పుడు వాటి అవసరం వచ్చింది " అన్నాడు విశ్వనాధం కంగారుపడుతూ
" అయ్యబాబోయ్ . మీరు చెప్పటం నేను చెయ్యకపోవటమా బాబూ . అవి నిన్నటికే పక్వానికి వచ్చేశాయి అయ్యగోరు. తింటారా తెస్తాను " అన్నాడు సుబ్బారావు పరిగెట్టుకుంటూ వెళ్లడానికి సిద్దమయ్యి.
" ఆగరా బాబూ. చెప్పేది పూర్తిగా విను. చక్కగా నిగనిగలాడిపోతున్న పళ్ళు చూసి రెండు తట్టలకెత్తి ఎంటనే మన ఇంటికి తీసుకురా. . ఈ రోజు పాపగారిని చూసుకోవడానికి పెళ్లి వారొస్తున్నారు రా . తొందరగా ఆ పని చూడు. అన్నట్టు మన పొలం గట్టు మీద వేసిన చక్రకేళి అరటిచెట్టు కాయలు ఏమైనా పండాయిరా ?నేను చూడలేదు ఈమధ్య . పండితే అవి కూడా మాంచివి చూసి రెండు గెలలు మన ఎడ్లబండిమీద వేసి తీసుకురా . మరిచిపోకు. త్వరగా వచ్చేయ్యి. ఆ తర్వాతే నీ పనులు ఏవైనా వుంటే చూసుకుందువు గాని." అన్నాడు బండి స్టార్ట్ చేస్తూ .
" ఆయ్. తమరు ఇంటికెల్లెసరికి అయ్యన్నీ మనింటికాడ ఉంటాయి బాబూ" అంటూ నమస్కారం చేసి పనిలోకి వెళ్లిపోయాడు సుబ్బారావు.
దారిలో వెళ్తూ వెళ్తూ విశ్వనాధం రామయ్య స్వీట్ షాపు దగ్గర ఆగి "ఏమాయ్ మన దగ్గర ఫ్రెష్ గా తాపేశ్వరం కాజాలు, ఆత్రేయపురం పూత రేకులు దొరుకుతాయా ? ఉంటే అర్జెంట్గా పార్సిల్ చేసి మనింటికి ఎంటనే పంపించు. ఈయాల .అమ్మాయిని చూసుకోవడానికి పట్నం నుండి పెల్లోళ్ళు వస్తున్నారు " అన్నాడు విశ్వనాధం ఆదరాబాదరాగా బయలుదేరుతూ . .
**** **** ****
" ఒసేవ్ క్రాంతీ చూశావా మీ నాన్న ఎలాగైనా ఈ ఏడు నీ పెళ్లి చేసేయ్యాలని తెగ ఆతృత పడిపోతున్నాడు . హైదరాబాద్ నుండి ఎవరో పెళ్లి వారొస్తున్నారుట . నువ్వు త్వరగా తయారయ్యి ఉండాలి " అంది నవ్వుతూ రామలక్ష్మి కూతురితో .
"ఏమిటమ్మా ఇది . మీ ఇద్దరి చాదస్తాలు చూస్తూంటే నాకు ఒళ్ళు మండిపోతోంది. అప్పుడే నాకు పెళ్ళా ? అసలు నా ఇష్టం అంటూ ఈ ఇంట్లో లేదా ? ఎవరినో ఒకరిని అంటగట్టి ఇంట్లోంచి తరిమేయ్యాలని చూస్తున్నారా ? ఇలాగే నన్ను బాధపెడితే ఏ పని వాడితోనో లేచిపోతాను అంతే . అప్పటికిగానీ నాన్న తిక్క కుదరదు " అంటూ గట్టిగా అరిచినట్టు అసహనంగా మాట్లాడింది క్రాంతి.
" ఏం మాటలవే . బొత్తిగా జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావు. పెళ్లీడుకొచ్చిన పిల్లవి. నువ్విలా మంకుపట్టు పట్టి కూర్చుంటే జరగాల్సినవి ఏవీ మానవు. మీ నాన్న నీకు ఎవరో ఒక అనామకుడిని తెచ్చి పెళ్లి చేస్తాడనుకుంటున్నావా ? పిల్లాడికి అమెరికాలో గొప్ప ఉద్యోగం. అతని తండ్రి ఈ వూళ్ళో రెండొందల ఎకరాల ఆసామి. మనకన్నా వంద ఎకరాలు ఎక్కువన్నమాట. వాళ్ళు నీ మెడలో బంగారం షాపంతా తెచ్చి కుదేస్తారు. ఇక నువ్వు ఏమీ ఆలోచించక మారు మాట్లాడకుండా తయారయ్యి కూర్చో. నా బంగారం కదూ . వాళ్లొచ్చే వేళయ్యింది" అని కూతుర్ని బతిమాలింది రామలక్ష్మి .
"ఏమిటమ్మగోరు పాపగారు మీమీద అరిచేస్తున్నారు. విషయం ఏటో కూసింత నాక్కూడా చెప్పరాదూ?" అని అడిగింది అప్పుడే లోపలకు వచ్చిన పనిమనిషి రంగమ్మ.
"అవునే. పాపను చూసుకోవడానికి పెళ్లి వారొస్తున్నారు . ఇప్పుడే నాకు పెళ్లి వద్దు అంటూ గొడవపెడుతోంది. దాని విషయం ఏముందిలే కానీ పాపకు లక్షణంగా పెళ్లి కుదిరితే నీకు పట్టు చీర పెడతానే . ఇంట్లో పని శ్రద్దగా చెయ్యాలి మరి " అంది రామలక్ష్మి .
"మంచోరే. మీకాడే నా జీవితం. ఆ విసయంలో మీరేమీ అస్సలు బెంగపెట్టుకోకండమ్మా . పెళ్లి పనులు కూడా నేనే దగ్గరుండి చూసుకుంటాను . సమ్మంధమ్ కుదిరితే ఈ శ్రావనంలోనే లగ్గాలు ఎట్టేత్తారా అమ్మా?. పాపమ్మగారిని పెళ్లి కూతురిగా చూడాలని మా చెడ్డ కోరిగ్గా ఉంది. ఏ వయసుకా ముచ్చట . నేను కూడా చూపులప్పుడు పక్కనే కూకుంటాను " అంది పనిమనిషి రంగమ్మ పట్టలేని ఆనందంతో అంట్లు వేసుకోవడానికి వెళ్తూ.
అది భీమవరంకు దగ్గరలో ఉన్న ఒక పెద్ద గ్రామం. చక్కటి పంట పొలాలు,చెరుకు గానుగలు చూసే వాళ్ళకు కనువింపుగా ఉంటాయి. అక్కడకు కొంత దూరంలోనే కొత్తగా ఇంజనీరింగ్ కాలేజీలు కూడా వెలిశాయి. తరతరాలుగా విశ్వనాధం కుటుంబీకులు వ్యవసాయ ఆధారంగా బ్రతుకుతున్నారు. .అదే వూళ్ళో ఆయనకు నూరు ఎకరాలకు పైగా పొలం ఉంది, అక్కడే ఒక పక్కగా డూప్లెక్స్ హౌస్ కట్టించుకున్నాడు. . బయట వంద బస్తాలు పట్టే ఎంతో అందంగా పేడతో అలికి దానిమీద తెల్లటి ముగ్గులుతో తీర్చిదిద్ది కట్టిన రెండు గాదెలు ఆ ఇంట్లోకి అడుగుబెట్టిన వారికి ముచ్చటగా దర్శనమిస్తూ ఈ కుటుంబానికి తిండికి ఎప్పుడూ లోటు ఉండదు అన్న సంకేతంగా అవి కనిపిస్తూ ఉంటాయి. .
ఎంత ఆశగా ఆస్తి చూపించినా ఎంతటి వాడికైనా ఆడపిల్లల పెళ్లిళ్లు అయ్యే అంతవరకు విపరీతమైన ఆదుర్ధా ఉంటుంది. విశ్వనాధం తనకు బంధు బలం చాలా వుందని పెళ్లివారికి తెలియడం కోసం చుట్టుపక్కల ఊళ్ళల్లో ఉన్న తన అన్నదమ్ముల కుటుంబాలను విషయం చెప్పి వెంటనే బయలుదేరి రావాలని చెప్పడం , వాళ్ళంతా రెండు గంటలకల్లా విశ్వనాధం ఇంట్లో వాలిపోవడం కూడా జరిగిపోయింది. .
"ఏంట్రా తమ్ముడూ ! ఒకే ఊళ్ళో ఉన్నా మాకు తెలియకుండానే నీ పిల్ల పెళ్లి చేసేయ్యాలని అనుకుంటున్నావా ? " అన్నాడు విశ్వనాధం పెద్ద అన్నగారు వీరభద్రం
" అయ్యబాబోయ్ .ఏమిటన్నయ్యా అలా అనేశావు మీకెవరికీ తెలియకుండా సంబంధాలు చూడటమే ? మన ఇంట్లో నువ్వే పెద్దోడివి. , ఇక వదిన ఏ శుభకార్యానికైనా ముందు లేకపోతే అసలు ఏ పనీ జరగదు. అసలు విషయం ఏమిటంటే మన కౌలుదారుడు పానకాలు లేడూ? నిన్న ఉదయం నేను పొలంనుండి వస్తూంటే కనపడి " విశ్వనాధం బాబూ మీకు ఇష్టమైతే చెప్పండి. మన పక్కూరి పెద్ద భూస్వామి మాధవరావు గారి అబ్బాయి ఈ మధ్య అమెరికానుండి వచ్చాడుట బాబూ. . రేపో మాపో తిరిగి వెళ్లిపోతాడుట . . ఆళ్ళందరూ ఇప్పుడు హైదరాబాదులో ఉంటున్నారు లెండి. . ఇక్కడ మన వూరి పక్కన ఆరి పొలాలు చూసుకోవడానికి వేరే మనుషుల్ని పెట్టుకుని సాగుచేసుకుంటున్నారు. . ఆరి అబ్బాయికి ఏకంగా పెళ్లి చేసేసి అమెరికా పంపించేస్తే ఒక పని అయిపోతుంది అని నిన్న ఆళ్ళ మనిషి మనవూరు వచ్చినప్పుడు నా చెవినేశాడు. . ఏ విషయం నాకు తెలిసినా మీకు చెప్పకుండా నేనెలా ఉంటానండీ బాబూ ? మనీంట్లో పెళ్లికెదిగిన పాపగారు ఉన్నారు కదా. మీరు అవును అంటే ఆళ్ళ మనిషి ఇక్కడే ఉన్నాడు ఇప్పుడే చెప్పేస్తాను ఇక పెళ్లి చూపులు గట్రా ఆరిష్టం " అంటూ నన్ను ఎటూ ఆలోచించుకోకుండా ఉక్కిరిబిక్కిరి చేసేశాడు రా . .నేను నా పనులు చూసుకుని ఇంటికొచ్చానో లేదో నిన్న రాత్రి హైదరాబాద్ నుండి మాధవరావు గారి ఫోను. మేము వస్తున్నాం. ఈ ఈ రోజే మూడుగంటలకు పెళ్లి చూపులు పెట్టుకుందాం అంటూ. అదేలే ఆళ్ళ అబ్బాయి ఎంటనే విదేశాలు వెళ్ళి పోవాలంట . అందుకే తొందర. ఇదిగో ఇందాకే నీ మరదలు వాళ్ళను కంగారు పెట్టి పిల్లను తయారుచేయ్యమని చెప్పి ఒక్కక్కొళ్లకే ఫోన్ చేసి చెప్తున్నాను. అంతే కానీ మీ అందరూ లేకుండా నా పిల్లకి పెళ్లి ఎలా కుదురుస్తాను చెప్పు ? " అంటూ వీరభద్రం చేతిని తన చేతిలోకి తీసుకుని అనునయంగా నిమిరాడు విశ్వనాధం .
వీరభద్రం కాలుస్తున్న చుట్టను బయటకు తీసి తుపుక్కున ఉమ్మేస్తూ "అంత ఇదవ్వకురా బాబూ. అయినా ఏమిటోలేరా ఇవాళా రేపూ తప్పేముందిలే . ఈ రోజుల్లో పట్నంలో వాళ్ళు అంతా అలాగే చేస్తున్నారుట. పెళ్లిళ్లు కుదిర్చేసుకుని చివరాఖరికి శుభలేఖలు పట్టుకొచ్చి ఇస్తూ పెళ్లికి తప్పకుండా రమ్మని చెపుతున్నారంట . అదీనూ సొంత అన్నదమ్ములకు, అక్కచెల్లెళ్లకు కూడా. ఇంతకీ ఆళ్ళ అసలు భయం ముందే చెప్పేస్తే దిష్టి కొట్టేసి ఎక్కడ సంబంధం ఉష్ కాకి అవుతుందని భయం ట. ఏమో నీకు కూడా పట్నం వాళ్ళ సావాసం ఏర్పడి అలాంటి బుద్ది కలిగిందేమో అని చిన్నడౌటనుమానం వచ్చి ఉన్నపలాన వచ్చేశాములే " అంటూ బళ్ళున నవ్వేశాడు వీరభద్రం .
"పెద్దన్నయ్య ఎటకారాలు ఇంకా మానలేదు" అనుకున్నాడు విశ్వనాధం లోలోపల .
వీరభద్రం పక్కనే విశ్వనాధం అక్కగారు రుక్మిణమ్మ తమ్ముడివైపు రుసరుసా చూస్తోంది.
" ఏరా తమ్ముడూ నేను గుర్తున్నానా ? ప్రతి విషయం నాతో మాట్లాడి కానీ చెయ్యవు కదా. మాట వరసకు కూడా ఎప్పుడూ నీ కూతురికి పెళ్లి చేయాలన్న ఆలోచన చెప్పనేలేదూ ? ఏమిటో నీకు ఆ పొలాలు, ఆస్తులు చూసుకోవడమే సరిపోతోంది . ఇక మేము కనపడతామా ?"అని కోపంగా అంటూంటే ఆమె ముక్కు పుటాలు అదురుతున్నాయి. ఆమె అవమానాన్ని అసలు తట్టుకోలేదు. వాళ్ళ కుటుంబాలలో జరిగే ఏ ఫంక్షన్ లోనైనా ఆవిడకు పెద్ద పీట వెయ్యాల్సిందే. .
"అదేమిటి అక్కయ్యా అలా అనేశావు. . ఇప్పుడే కదా అన్నయ్యతో చెప్పాను అనుకోకుండా ఈ సంబంధం కుదిరిందని . అర్ధం చేసుకో .." అన్నాడు విశ్వనాధం బ్రతిమాలుతూ.
" అవును వదినా. మీ తమ్ముడికి ఏదైనా ఆలోచన వచ్చిందంటే వెంటనే అమలు చేసేయ్యాల్సిందే. ఎవరైనా సంబంధాలు ఇంత హడావిడిగా చూస్తారా ? పెళ్లిళ్లు అంటే ఎన్ని చూసుకోవాలి ? అటు ఆరు తరాలు, ఇటు ఆరు తరాలంటారు. కానీ ఈయన గారు అరగంటలో అంతా చక్కబెట్టెయ్యాలని చూస్తున్నాడు. . వచ్చీ చెప్పగానే కాళ్ళూ చేతులు ఆడటం లేదు అనుకో ..." అంటూ రామలక్ష్మి కూడా పనిలోపనిగా తన గోడు కూడా వినిపించింది. .
"ఎహే . ఊరుకోండే . చెపుతూంటే ఎవరూ వినిపించుకోరే . మీమానాన మీరు అపార్ధం చేసుకుంటూ పోతున్నారు. నాకెంత టెన్షన్ గా ఉంటుందో ఆలోచించరే ? దయచేసి మీరందరూ నాకు సహకరించండి. మీకు దణ్ణం పెడతాను " అంటూ చేతులెత్తి మొక్కాడు విశ్వనాధం కోపంగా.
"పోనీలేరా వదిలేయ్యి. కోపం తెచ్చుకోమాక . ఇంతకీ వాళ్ళు మనాళ్ళేనా ? సంప్రదాయం మంచిదేనా ? పూర్తిగా కనుక్కోకుండానే మధ్యలో వాడెవడో పానకాలు చెప్పాడని పెళ్లి చూపులకు తయారైపోతున్నావా ? అయినా మాకెందుకులే మధ్యలో. అసూయతో పెళ్లి చెడగొట్టాలని చూస్తున్నారు అని అనుకుంటారు . మమ్మల్నందరినీ పెళ్లి చూపులకు పిలిచావు అంతే సంతోషం " అంటూ ఎప్పుడూ విశ్వనాధాన్ని ఏదో రకంగా విమర్శించే తమ్ముడు పద్మనాభం తనకు తెలియకుండానే అక్కసు వెళ్ళబుచ్చాడు. .
" లేదులేరా తమ్ముడూ . పిల్లాడు అమెరికాలో చేస్తున్నాడు . వాళ్ళకు ఆస్తులు తక్కువేమీ కాదు. . సంప్రదాయాల్లో మనకన్నా ఎక్కువే. మనూరు పక్కనే చచ్చే అంత ఆస్తి ఉంది . ఆరింట్లో పడితే మన పిల్ల జీవితాంతం సుఖపడిపోద్ది అయ్యన్నీ నేను యోచించే కబురు పంపానులే . ఇక వాళ్లొచ్చే వేళయ్యింది . ఇక ఎవరూ మాట్లాడకుండా గమ్మునుంటే మంచిది. " అంటూ ప్రాధేయపూర్వకంగా చెప్పాడు విశ్వనాధం. .
లోపల రామలక్ష్మి కూతుర్ని తయారు చెయ్యడానికి ఆపసోపాలు పడుతోంది.
"నువ్వేమీ మమ్మల్ని ఇబ్బంది పెట్టకే నా తల్లీ. . అయినా నీకు ఈ సోకులు పిచ్చి ఎక్కడనుండి వచ్చిందే బాబూ ? మనం ఉంటున్నది పల్లెటూర్లోనే కదా. నీ తోటి పిల్లలు చూడు ఎంత చక్కగా లంగా ఓణీ వేసుకుని ఎంత ముచ్చటగా ఉంటారో ? నువ్వేమిటో ఎక్కడ చూసావో ఏమో కానీ ఆ వెధవ ప్యాంట్లు వేసుకుని తిరుగుతూ ఉంటావ్ . మన లాంటి పల్లెటూళ్ళల్లో ఉన్నవాళ్లకు ఆ పద్దతి తప్పమ్మా. " అని నచ్చచెప్పాలని చూసింది రామలక్ష్మి .
" అయ్యబాబోయ్. నేనేసుకునే డ్రస్ నీకు ఫేషన్ గా అనిపిస్తోందా ? నువ్వింకా ఏ కాలంలో ఉన్నావే బాబూ ? అమ్మా నువ్వేమీ నా డ్రస్ గురించి ఆలోచించకు. .ఒక వేళ పెళ్లి సంబంధం కుదిరింది అనుకుందాం. పెళ్లి కొడుకు ఉండేది అమెరికాలోనే కదా. . అక్కడ ఎలాంటి బట్టలు వేసుకుంటారో అందరికీ తెలుసు. . అయినా నేను ఇక్కడ వాళ్ళ తల్లి తండ్రులతో ఉండను కదా. పెళ్లవగానే ఝామ్మని అమెరికా వెళ్లిపోనూ ? ' అంది కళ్ళు పెద్దవి చేసి తల్లికి ఏదోవిధంగా నచ్చచెపుతూ . .
బయట హడావిడి కనిపిస్తోంది. పెద్ద వాహనం వచ్చి విశ్వనాధం ఇంటిముందు ఆగింది. అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడి బయటకు వచ్చేశారు.
" ఆయ్ . రండి రండి బావగారు ? మీకోసమే చూస్తున్నాం . ప్రయాణం బాగా జరిగిందా " అంటూ దగ్గరుండి అందరికీ కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి తుడుచుకోవడానికి కొత్త టవల్ అందించాడు విశ్వనాధం.
పెళ్ళికొడుకు తండ్రి మాధవరావు లోపలకొస్తూ ప్రత్యేకంగా ఇంటిని ప్రతి అంగుళం పరిశీలించసాగాడు. .
"రండి వదినగారు కూర్చోండీ" బాగున్నారా అంటూ పలకరించి వాళ్ళందరికీ వెండి చెంబుతో మంచి నీళ్ళు అందించింది రామలక్ష్మి .
" బాగానే ఉన్నామండీ. మీ వూరు, మీ ఇల్లూ చాలా బాగుంది " అంటూ మొగుడి వెనకాల లోపలికి వస్తూ అంతా పరిశీలించ సాగింది పెళ్లి కొడుకు తల్లి.
పెళ్ళికొడుకు పేరు మధు. చూడటానికి బాగానే ఉన్నాడనిపించింది అందరికీ.
రామలక్ష్మి లోపలనుండి పని మనిషి సహాయంతో పెద్ద పెద్ద ప్లేట్లలో టిఫిన్లు తీసుకొచ్చి " తీసుకోండి. స్పెషల్గా చేయించిన తాపేశ్వరం కాజా, ఆత్రేయ పురం పూతరేకులు " అంటూ వచ్చిన వాళ్ళందరికీ తలో ప్లేటు అందించింది రామలక్ష్మి . అయితే పెళ్ళికొడుకు ముఖంలో ఎటువంటి ఫీలింగ్స్ లేకపోవడం , ముళ్లమీద కూర్చున్నట్టుగా ఉండటం రామలక్ష్మి గమనిస్తూనే ఉంది.దాదాపు క్రాంతి మొహంలో కూడా ఎటువంటి ఆనందం కనిపించడం లేదు. పెళ్లికొడుక్కి తనని ఇష్టపడకుండా ఉంటే బాగుణ్ణు అని ఆమె అనుకుంటోంది. పైకి తల్లితండ్రుల దగ్గర పెద్దగా మారాం పెట్టకుండా ఒప్పుకుంది కానీ అసలు అమెరికా సంబంధం అనగానే మొహం నల్లగా అయిపోయింది. . ఇవేమీ పట్టనట్టుగా మాధవరావు, విశ్వనాధం పొలాలు , వెయ్యాల్సిన పంటల గురించి మాట్లాడుకుంటున్నారు. .
పెళ్లి చూపుల తతంగం అట్టహాసంగానే జరిగింది. ఏ విషయమో రేపు ఉదయం కల్లా చెపుతాము అని చెప్పి పెళ్లి వారు వెళ్ళిపోయారు.
మర్నాడు ఉదయం పెళ్లి వారినుండి ఏ కబురు వస్తుందోనని ఆతృతగా చూడసాగారు విశ్వనాధం దంపతులు . కానీ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పెళ్లి కొడుకు మధు తన ఇష్టాన్ని చెప్పకుండానే వెంటనే అమెరికా చక్కేశాడని తెలిసింది. అప్పటికే అతను అమెరికాలో ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి సిద్దంగా ఉన్నాడని, తల్లితండ్రులను బాధపెట్టడం ఇష్టం లేక పెళ్లి చూపులకు వచ్చాడని వాళ్ళందరికీ అర్ధమైపోయింది.
కొన్ని రోజులకు క్రాంతి ఆ వూళ్ళో వ్యవసాయాధికారితో గత రెండేళ్లుగా చెట్టాపట్టాలేసుకుని ప్రేమలో ఉన్నారని అతనితో పెళ్లి చేయకపోతే ఆ ఊళ్ళో ఉన్న పెద్ద కాలవలో పడి చచ్చిపోతానని అసలు విషయం బయట పెట్టడంతో ఆటోమాటిక్ గా ఆ రెండు కుటుంబాలు గప్చిప్ అయిపోయాయి. క్రాంతి ప్రేమ విషయం బయటపడ్డాక ఆ వూళ్ళో మరో పదిమంది ప్రేమ జంటలకు ధైర్యం వచ్చి తల్లి తండ్రులతో ఎంచక్కా పొరాడి జీవితంలో స్తిరపడి పోయారు. . ఆయ్.... పల్లెటూళ్ళల్లో చాలా ప్రేమ కథలు మరి ఇలానే ఉన్నాయండీ బాబూ " ******.