ఎందరో బాధితులు అందరికీ మా సానుభూతులు "

తపస్వీ మనోహరం • 01 May 2023 • 👁 10 views
ఎందరో బాధితులు అందరికీ మా సానుభూతులు "
"ఎందరో బాధితులు అందరికీ మా సానుభూతులు "
రచన : జీడిగుంట నరసింహ మూర్తి
(మే 2023 తపస్వీ మనోహరం మాస పత్రికలో ప్రచురించిన నా కథ )
అర్ధరాత్రి 12 గంటలు అయింది. అరుణ తన గదిలోకి యధాప్రకారంగా వెళ్తోంది. ఒక గదిలో బెడ్ లైట్ తప్ప అన్ని గదులలోనూ లైట్లు ఆరిపోయాయి. అప్పటివరకూ నిద్రలో కునుకు పాట్లు పడుతూ ఒక్కసారిగా మెలుకువలోకి వచ్చిన వీధి సింహాలు రోడ్డు మొదల్లో గుమిగూడి భయానకంగా ఏడుస్తున్నాయి తనవాళ్లు ఎవరో చచ్చిపోయినట్టుగా .
మధుసూధన్ వెళ్ళి తన గదిలోకి వెళ్ళి పడుకున్నాడు. ఒక పట్టాన నిద్ర పట్టడం లేదు. అతని ఆలోచన అరుణ గురించే. గత కొన్నాళ్లుగా అరుణ ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంటుంది. ఏదైనా మంచీ చెడూ మాట్లాడదామంటే అవకాశమే ఇవ్వదు.
సరిగ్గా ఒక అరగంట తర్వాత లోపల నుండి అరుపులు వినిపిస్తూ ఉన్నాయి. . చుట్టూ ఎక్కువ ఇళ్ళు లేకపోవడం వల్ల అరుణ చేసే హడావిడి అవతలవాళ్ళకు తెలిసే అవకాశం లేదు. మొగుడిగా ఆ బాధలు తనొక్కడే పడాలి తప్పదు. ఇంట్లో పిల్లలు కూడా లేరు. వాళ్ళు వేరే ఊళ్ళల్లో చదువుకుంటున్నారు.
"ఒసేవ్ రాక్షషి! వదులు.. ఊపిరి ఆడనియ్యకుండా టవల్ తో ఎందుకు మూసేస్తున్నావు ? ఎందుకు ఇలా పగపట్టేశావు ? అసలు నువ్వు మనిషివేనా ? నాకు తెలుసు మంచిగా నటిస్తూ ఏదో ఒకరోజు ఇలా పీక పిసికి చంపేస్తావని . వారం రోజులనుండి కనిపెట్టుకుని ఉన్నా కూడా ఆఖరికి నీ రాక్షతత్వం చూపించనే చూపించావు . . నీకు మాయరోగం రానూ ? నీ పీడ ఎప్పుడు వదిలిపోతుందే ? ....చెయ్యవే నీ అఘాయిత్యాలు. ఇంకా ఎన్నాళ్లు చేస్తావో చూస్తాను ......" అంటూ లోపలనుండి అరుణ ఒకటే హిస్టీరిక్ గా అరిచేస్తోంది.
సమయం చూసుకుని ఆమె ప్రతిరోజూ గదిలో తలుపు వేసుకుని అరిచే అరుపులకు వంత పాడుతూ వీధిలోని పిచ్చి కుక్కలు ఒకదాని మీద ఒకటి పడి భయంకరంగా అరుస్తూనే ఉంటాయి.
మధుసూధన్ కు గత కొన్ని రోజులుగా నిద్ర మాత్రలు వేసుకున్నా అవి అవి ఎప్పుడో ఏ తెల్లారు ఝామునో కానీ పని చెయ్యడం లేదు. ఈ లోపలే అరుణ ఘాతుకాలు జరిగిపోనే జరిగిపోతున్నాయి.
ఎన్నాళ్ళీ క్షోభ. ? అప్పటికీ తను ఎన్నోసార్లు చెప్పి చూశాడు. ఎందుకు అలా సైకో అయిపోతున్నావని ? ఈ అర్థ రాత్రులు అలా ఒంటరిగా ఉండకు. పైగా చీకటిలో నీకంటూ ఒక గదిలోకి వెళ్ళి తిరిగి ఏ రెండున్నరకో వస్తున్నావు. . ఇదేమీ బాగోలేదు. నేను కాబట్టి సరిపోతోంది. అదే ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే వాళ్ళ మధ్య అపహాస్య పాలు కామూ ? భోజనాలు అయిపోగానే ఒక గంట తర్వాత పడుకో. నీ ఆరోగ్యం కూడా రోజు రోజుకు దెబ్బతింటోంది. మధ్యాన్నం అంతా ఎవరెవరితోనో గంటల కొద్దీ మాట్లాడుతూంటావు. అవతల వాళ్ళు ఎవరో, నీకు ఏం చెపుతున్నారో అటుంచి మాయదారి గోల రాత్రి పన్నెండు గంటలయ్యేసరికి నీ భయంకరమైన చేష్టలు భరించలేకపోతున్నాను. నీ మైండ్ డైవర్ట్ చేసుకో. పోనీ ఒక గంటసేపు పుస్తకాలు చదువుకో. ఏవైనా కథలు వ్రాసుకో. నువ్వు నిజంగా చెయ్యాలంటే ఎన్ని పనులు లేవు ? పోనీ నీకు తోచినది చేస్తున్నావు అనుకుంటే దానికి అర్ధరాత్రే ఎందుకు ఎంచుకున్నావు ? పైగా మానసిక రోగిలా ఆ అరుపులు ఏమిటి ? నాకేమీ నచ్చలేదు. ఇక ఈ విషయం గురించి నేను సీరియస్గా తీసుకోదల్చుకున్నాను. అలా నీ మానాన నువ్వు, నా మానాన నేను ఎన్నాళ్లు ఇలా జీవించడం ? దీనికేదో ఒక రోజు ఫుల్ స్టాప్ పలకాల్సిందే ..." అంటూ ఎన్నో సార్లు ఆమెను కూర్చోబెట్టి నయానా భయానా చెప్పి చూసే వాడు . . ఆఖరికి ఆమె అప్ప చెల్లెళ్లతో కూడా చెప్పేశాడు మా ఇంట్లో పరిస్తితి రోజురోజుకూ విషమిస్తోందని. వాళ్ళు అదేమీ పట్టించుకోకుండా" అవునా? ... మా ఇంట్లో కూడా మగవాళ్ళు అలాగే అంటున్నారు ..." అంటూ నవ్వేసే వాళ్ళు.
"చంపేస్తున్నాడు. పీక నొక్కెస్తున్నాడు...మరో పక్క విషం తీసుకొచ్చి ఇస్తోంది .. ఎవరైనా రండిరా,, వచ్చి చూడండి " అంటూ మళ్ళీ లోపల నుండి అరుపులు.
మంచమ్మీద నుండి పడబోయి లేచి అరుణ గదివైపు వెళ్ళాడు మధుసూధన్ .
"ఇదిగో నిన్నే. ఏమయ్యింది ప్రతి రోజూ అలా గొంతు చించుకుని అరుస్తున్నావు . నువ్వు రోజు రోజుకి ఒక మానసిక రోగిలా మారుతున్నావు. ఇప్పటికే నీ గురించి అందరికీ తెలిసి పోయింది. అంతగా భయపడిపోతున్నప్పుడు అసలు ఆ తలుపులు బిడాయించుకుని ఎందుకు కూర్చుంటున్నావు? అఘోరించింది చాల్లే. వచ్చి పడుకో. అర్ధరాత్రి వేళ అంకమ్మ శివాల్లాగా రోజూ ఈ నరకయాతన పడలేకపోతున్నాను..." అంటూ గట్టిగా గదమాయించాక ఒక అరగంటకు అరుణ బయటకు వచ్చింది.
"అవునండీ. ఇవాళ రోజూ కన్నా ఎక్కువగా నాకు చాలా భయం వేసింది. ఇన్నాళ్ళు ఎంతో ధైర్యంగా ఉన్నాను కానీ ఈ రోజెందుకో నా పీక నులిమేసి నట్టు అయిపోయి ఊపిరి కూడా ఆడలేదు ..మీరు వచ్చి తలుపు తట్టకపోతే చచ్చిపోయి ఉండే దాన్నేమో ."¨అంటూ భయం భయంగా అతనికి దగ్గరగా వచ్చి పడుకుంది అరుణ .
** ** ** **
" వదినగారు ఉన్నారా ?" అంటూ తను ఎప్పుడూ చూడని ఇద్దరు ఆడవాళ్ళు వచ్చి మధుసూధన్ను పలకరించారు గుమ్మం ముందు ఆగి. .
"ఇదిగో ఎవరో చూడు నిన్ను అడుగుతున్నారు . . కాస్త వంటింట్లోనుంచి బయటకు రా. " అన్నాడు మధుసూధన్ .
"ఆ .. రండి రండి .నేను ఫోన్ చేసి రమ్మందామనుకున్నాను. ఇప్పుడే వంట అయిపోయింది. అన్నయ్యగారు పెట్టుకుని తింటారు లెండి. మనం అలా గదిలో కూర్చుని ఎంతసేపు మాట్లాడుకున్నా మనకు అభ్యంతరం పెట్టరు " అంటూ వాళ్ళను తన గదిలోకి తీసుకు వెళ్లింది అరుణ .
" నిన్న రాత్రి నాకు కాళ రాత్రే వదిన గారు. ఏదో ఒక రోజు ఏమవుతుందోనని భయంతో బిగుసుకుని చచ్చిపోతానేమో అని అనిపిస్తోంది. ఈ దారుణాలు రోజు రోజుకు శృతి మించుతున్నాయి. ఒక పక్క ఈయన ఒకటే గోల వచ్చి పడుకోమని . ...ఎంతమటుకు నా గురించి అడుగుతారే కానీ మీ అనుభవాలు చెప్పరే ? మా అన్నయ్యగారు మీమీద ఏమీ కేకలేయడం లేదా ? "అని అడిగింది అరుణ గుచ్చి గుచ్చి చూస్తూ ఒకావిడను.
" అటువంటిది ఏమీ లేదు లెండి. వాళ్ళు కూడా అలవాటు పడిపోయారు మన పైత్యానికి. అయినా మన ఇష్టం. పగలంతా ఒళ్ళంతా హూనం చేసుకుని ఇంట్లో చాకిరీ చేసి చేసి అప్పుడే కదా మనకు ఆటవిడుపు . అన్నట్టు ఊరికే చంపేస్తానని బెదిరిస్తోందా ఆ మీనాక్షి లేక నిజంగా చంపేస్తుందా ? భలే సస్పెన్స్ తో సాగుతోంది కదా సీరియల్ ? నాకైతే పిచ్చి పట్టి గట్టిగా అరిచేస్తున్నాను . మా ఆయన మరీ అంత ఎగ్జైట్ కావద్దు. కాస్త అదుపులో ఉండు .." అంటూ మధ్య మధ్యలో నన్ను మామూలు పరిస్తితికి తెస్తూ ఉంటారు .. ఏది ఏమైనా యూట్యూబ్లో ఈ సీరియల్స్ మంచి కాలక్షేపంగా ఉంటున్నాయి కదూ " అంటూ తన అనుభవాన్ని రంగరించి చెప్తూ నవ్వుతోంది ఇంకో ఆవిడ ..
"ఓహో అయితే నాలాంటి బాధితులు ఈ లోకంలో చాలా మంది ఉన్నారన్న మాట . ఇంతమందిని దారిలోకి తేవడం ఎవరికి మటుకు సాధ్యం? అయితే ఇంతమంది మీద మానసికంగా వాళ్ళ మెదళ్ళ మీద దుష్ప్రభావం చూపిస్తున్న ఈ సీరియల్స్ ను ఎంతోకొంత సంస్కరిస్తే బాగుణ్ణు " అనుకున్నాడు మధుసూధన్ వాళ్ళ సంభాషణను పక్క గదిలోంచి వింటూ. *******