“అమ్మా, స్కూల్ కి వెళ్ళొస్తాను” అన్నాడు రవి పలకా, బుక్కూ తీసుకొని
తల్లి గౌతమి ఒకసారి తన బిడ్డ రవి ని తేరిపారా చూసింది. పాపిడి తీసి దువ్విన జుట్టూ, చొక్కా నిక్కర్ పాతదయినా, తనకు బాగా ఉతికి పెట్టింది కాబట్టి పరిశుభ్రంగా, శుచిగా బాలవచ్చసుతో యువరాజులా కనపడ్డాడు. కానీ, కాళ్లకు చెప్పులు లేవు! కాదు,కొనే స్థోమత లేదు.
“ సరే నాన్నా, అలాగే” అంది.
స్కూల్ కు బయలుదేరుతున్న రవి “అమ్మా!” అన్నాడు.
“ఏంటి నాన్నా” అంది గౌతమి ముభావంగా పొయ్యిలో కట్టలు పెడుతూ.
“ఏం లేదమ్మా” అంటూ బయలుదేరాడు రవి.
చిన్న పాక, చుట్టూ ఎండిపోయిన చెట్లు!కాకులూ, చిన్న పక్షులూ.. ఇదీ తన ఇంటి వాతావరణం! తండ్రి ఉన్నన్ని రోజులూ తాగీ, తాగీ అలసిపోయి చచ్చాడు. తన తల్లి గౌతమి చుట్టుపక్కన నాలుగు ఇళ్ళల్లో పాచిపని చేసుకుని తనను పోషిస్తోంది. మధ్యాహ్న భోజనం స్కూల్ లో పెడతారు. రాత్రికి అమ్మకు అందరిలల్లో రకరకాల కూరలు ఇస్తారు! లేదా కొంచెం అన్నం వండి రసమో, పచ్చడో చేస్తుంది. కానీ రవి కి ఈమధ్య పొద్దున్నే చాలా ఆకలేస్తుంది. కానీ నోరు తెరిచి అడిగితే అమ్మ ఇక్కడ ఇబ్బంది పడుతుందని ఓర్చుకుంటున్నాడు. మధ్యాహ్నానికి నీరసం వచ్చేస్తోంది. “రవి బాబూ!ఆగు నాన్నా” అంది గౌతమి బయలుదేరుతున్న రవి ఒక్కసారిగా ఆశ్చర్యపడి చూశాడు. గౌతమి గబగబా వచ్చి రవి షర్టు పైకి తీసి పొట్ట దగ్గర తలను ఆన్చింది. రవి కి వెచ్చగా గౌతమి కన్నీరు తగిలింది.
వెంటనే “అమ్మా, అదీ..”అంటూ ఏదో చెప్పబోయాడు దాంతో గౌతమి “నాకు తెలుసు నాన్నా! నీ బుజ్జి బొజ్జలో ఆకలేస్తోందనీ, దా” అంటూ దగ్గరున్న గట్టున తీసుకెళ్లి కూర్చోబెట్టింది.
వెంటనే గిన్నెలోని గంజిని గ్లాస్ లో పోసి “తాగు నాన్నా” అంటూ రవికి ఇచ్చింది.
ఆకలితో ఉన్న రవి గటగటా గంజిని తాగేసి “అమ్మా! నాకు ఆకలవుతోందని నీకు ఎలా తెలుసు?” అన్నాడు ఆశ్చర్యంతో కూడిన ఆనందంతో .
“బిడ్డ ఆకలి తల్లికి ఎరుక!చిన్ని నా బిడ్డకు శ్రీరామరక్ష! స్కూల్ కి బయలుదేరు” అంది గౌతమి సంతోషంగా రవికి దిష్టి తీసి.
“ సరే అమ్మా” అంటూ రెట్టింపు ఉత్సాహంతో రవి స్కూల్ కి వెళ్ళాడు.
ఉదయాన తన బిడ్డ కడుపు నింపడానికి,సాయంకాలం ఇంకో ఇంట్లో అదనంగా పనిచేయడానికి ఒప్పుకున్న గౌతమికి మనసు నిండిపోయింది!!