అనుకోని అతిథి

రవళి • 01 Jun 2026 • 👁 23 views
అనుకోని అతిథి
అనుకోని అతిథి
డా. కె రమ్య
“హే శ్యామ్, నాకు బ్రేక్ ఫాస్ట్ ఆర్డర్ పెట్టావా?” అంది తనూజ హడావిడిగా తన ఆఫీస్ బ్యాగ్ సర్దుతూ.
“నాకు టైమ్ లేదు, తనూ! ఐ యామ్ గెట్టింగ్ లేట్” అన్నాడు శ్యామ్‌సుందర్ షూస్ వేసుకుంటూ.
“మైగాడ్ బ్రేక్ ఫాస్ట్ తినకపోతే నాకు కళ్ళు తిరుగుతాయి” అని తనూజ తన ఆపిల్ ఫోన్ లోని జ్విగ్గీ యాప్ ఓపెన్ చేసింది.
అంతలో డోర్ బెల్ మోగింది.
శ్యామ్‌సుందర్ తలుపు తీయగా, ఎవరో ఒక అతను సఫారీ వేసుకొని కనిపించాడు. శ్యామ్‌ను చూసి నవ్వుతూ లోనికి రాబోతే, తనూజ, “హూ ఆర్ యు?” అంది గట్టిగా.
దానికి అతడు “అక్కా!” అన్నాడు.
తనూజ, శ్యామ్‌సుందర్ అయోమయంగా ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు.
“అక్కా! నేను అక్కా! మనోజ్‌ని! మీ పెళ్ళికి రాలేదని కోపమా? ఏం బావా, నీకు కూడా గుర్తు లేనా?” అంటూ శ్యామ్‌ను దాటుకుంటూ లోపలికి వచ్చాడు మనోజ్. శ్యామ్‌సుందర్, తనూజలకు నాలుగునెలల క్రితమే పెళ్ళయింది. ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగస్థులు! హైదరాబాద్‌లోనే ఈయమ్మై ద్వారా ఒకఫ్లాట్ తీసుకున్నారు. తనూజ మరియు శ్యామ్‌సుందర్ వాళ్ళ తల్లిదండ్రులకు ఏకైక సంతానం, అందువల్ల ఈ చుట్టరికం ఏమిటో అర్థం కాలేదు!
“అబ్బబ్బ! అక్కా, ఎంత ఎండో తెలుసా బయట?” అంటూ హాల్లో ఉన్న ఏసీని ఆన్ చేసాడు, మనోజ్ సోఫాలో కూర్చుని.
“అక్కా! చల్లటి మజ్జిగ ఇస్తావా?” అన్నాడు.
చిర్రెత్తుకొచ్చింది తనూజకు. శ్యామ్ పరిస్థితి చెప్పనవసరం లేదు.
“హలో, అసలెవరు నువ్వు? నాకు నువ్వు తెలియదు!” అంది తనూజ కటువుగా.
దాంతో శ్యామ్‌సుందర్ కూడా, “అవును! అసలెవరు నువ్వు?” అన్నాడు గట్టిగా.
“మీ ఇద్దరికీ నేను గుర్తులేదా? సరిపోయింది! సరే, నేనే వివరిస్తాను, ముందు మజ్జిగ ఇవ్వు అక్కా” అన్నాడు జాలిగా మొహం పెడుతూ.
అలా అడిగేసరికి అతను నిజంగానే తమకు దూరపుబంధువేమో, తమకు తెలియకపోయి ఉండొచ్చు అనుకున్నారిద్దరూ.
శ్యామ్ “ఇంట్లో మజ్జిగ…” అంటూ తనూజను చూసాడు.
తనూజ కోపంగా చూసింది. దాంతో శ్యామ్‌సుందర్, మనోజ్ పక్కన కూర్చొని “ఇంట్లో మజ్జిగ లేదు” అంటూ నసిగాడు.
“ఏంటి మజ్జిగ లేదా? మరి రోజూ పెరుగు, మజ్జిగ తాగరా?” అరిచాడు మనోజ్ ఆశ్చర్యంగా.
ఆ అరుపుకి శ్యామ్, తనూజ ఇద్దరూ అదిరిపడ్డారు.
తనూజ “ఉదయం నట్స్ లేదా బ్రేక్ ఫాస్ట్ ఆర్డర్ పెట్టుకుంటాము, మధ్యాహ్నం కంపెనీ వాళ్ళు పెడతారు, నైట్ రోటీలు వంటమనిషి చేసి వెళ్తుంది! సో, ఇంకెందుకు? ఇంకా ఏమన్నా అవసరమైతే ఆర్డర్ పెడతాను!” అంది తనూజ.
“ఇప్పుడు ఈ వాటర్‌తో అడ్జస్ట్ అవ్వు బావా” అంటూ వరుస కలిపాడు శ్యామ్‌సుందర్. ఫ్రిడ్జ్‌లోని వాటర్ బాటిల్‌ని మనోజ్‌కు అందిస్తూ.
మనోజ్ వాటర్ బాటిల్ లోని వాటర్ గటగటా తాగేసి, ఖాళీబాటిల్ టీపాయ్ మీద పెట్టాడు.
“సరే! బావా, టిఫిన్ చేద్దాం లే. ఈరోజు ఏం వండావు అక్కా?” అని నాలుక కరుచుకొని, “ఈరోజు ఏం ఆర్డర్ చేసావక్కా?” అన్నాడు మనోజ్, తనూజను చూసి నవ్వుతూ.
తనూజ “మేము ఆఫీసుకి వెళ్లే… వ” అని ఏదో చెప్పబోయేలోగా “తనూ! బావ వచ్చాడుగా హాఫ్ డే లీవ్ తీసుకుందాం లే! బావా, ఏం టిఫిన్ కావాలో చెప్పు, ఆర్డర్ పెడతాను” అన్నాడు శ్యామ్‌సుందర్ తన ఐఫోన్ లోని జ్విగ్గీ ఓపెన్ చేస్తూ.
తనూజ తన బాస్‌కి, ‘హాఫ్ డే లీవ్!’ అని మెసేజ్ పెట్టింది “నాకు పూరీ, ఒక మసాలాదోశ, రెండు ఇడ్లీలు వడ, ఒక పెసరట్టు బావా!” అన్నాడు.
ఆర్డర్ పెడుతున్న శ్యామ్‌సుందర్ తలపైకెత్తి, “చాలా బావా?” అన్నాడు.
“చాల్లే బావా! మళ్ళీ బయటికి వెళ్ళి కాఫీ తాగుదాం” అన్నాడు మనోజ్ కాళ్ళు ఆడిస్తూ.
చేసేదిలేక “తనూ, నీకు?” అన్నాడు శ్యామ్‌సుందర్ తనూజను చూస్తూ
“మనిద్దరికీ ఇడ్లీ చాలు.” అంది తనూజ నిర్లిప్తంగా.
దాంతో మనోజ్ “నీకెలా సరిపోతుంది బావా! నేను తినేది మొత్తం నువ్వు కూడా తినాలి, అంతే!” అన్నాడు మనోజ్
“అలా తింటే శ్యామ్ వెయిట్ గెయిన్ అవుతాడు, పొట్ట కూడా వస్తుంది” అంది తనూజ ఆందోళనగా.
“ఒక్కరోజుకి ఏం రాదులే అక్కా!” అన్నాడు మనోజ్. తనూజ కూడా సోఫాలో కూర్చుని, “ఇప్పుడు చెప్పు ఎలా శ్యామ్‌కు వరస అవుతావు నువ్వు?” అంది “భలేదానివి! నిజంగా గుర్తు లేనా?” అన్నాడు మనోజ్. శ్యామ్ కూడా, “అలా కాదు బావా! మేమిద్దరం చిన్నప్పటినుంచి హాస్టల్లో ఉండి చదువుకోవడం వల్ల ఎక్కువగా చుట్టాలతో కలవలేదు! ఫ్రెండ్స్ మాత్రమే. అందుకని తనూజకు గుర్తుండక పోయుండొచ్చు! తనకు ఎలా వరుస అవుతావు?” అన్నాడు శ్యామ్.
‘ఇదేంటి అతను శ్యామ్ తరఫు కాదా? తన తరఫా? ఒకసారి మామ్‌ను అడగాలి’, అనుకుంటూ ఫోన్ తీస్తున్న తనూజ, డోర్ బెల్ మోగడంతో వెళ్ళి తలుపుతీసింది.
జ్విగ్గీ బాయ్ ఫుడ్ డెలివరీ ఇచ్చాడు. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి చేరుకున్నారు. “ఇవ్వక్కా, నేను వడ్డిస్తాను!” అంటూ మనోజ్ తనకూ శ్యామ్‌కూ అన్ని ఐటమ్స్ ప్లేట్‌లో పెట్టాడు.
“నాకు ఇడ్లీలు చాలు” అంటూ తనూజ ఇడ్లీలు తన ప్లేట్‌లో పెట్టుకుంది.
రోజూ తనూజ రూల్స్‌తో పొద్దున టిఫిన్ సరిగ్గా తినలేక అవస్థపడుతున్న శ్యామ్‌కు తన ప్లేట్‌లో కలర్ కలర్‌గా, వెరైటీలు కనపడేసరికి నోరూరింది! అంతే గబగబా తినసాగాడు. మనోజ్ కూడా అదే స్టైల్‌లో తింటున్నాడు. తనూజ వారిద్దరినీ చూసి ఒకే జీన్స్ ఏమో అనుకొని, ఇడ్లీలను కంప్లీట్ చేసింది ఇంకా వాళ్ళిద్దరూ తింటూనే ఉన్నారు.
“బావా మసాలాదోశ అదిరిపోయింది!” అన్నాడు. మనోజ్
“పూరీ ఇంకా సూపర్ బావా!” అన్నాడు శ్యామ్.
తనూజ మామ్‌కి కాల్ చేసింది, మనోజ్ గురించి కనుక్కుందామని!
“మనోజ్ మీ అత్త ఆడపడుచు కొడుకు! మొన్న మీ అత్త ఫోన్ చేసినప్పుడు కూడా అతని యూ ఎస్‌లో ఉన్నాడని చెప్పింది” అంది తనూజ మామ్.
“అతను మా తరఫు కాదట నువ్వు మామయ్యని అడిగి కన్ఫర్మ్ చేసుకో!” అని మెల్లగా అంది.
“చాలా టేస్టీగా ఉన్నాయి బావా, అన్ని టిఫిన్స్!” అంటూ సోఫాలో కూర్చున్నాడు మనోజ్.
“నేను ఇప్పుడే వస్తాను” అంటూ ఫోన్ తీసుకొని, బాల్కనీలోకి వచ్చాడు శ్యామ్.
తనూజ, “ఇంకా మీరు ఎలా వరుస అవుతారో చెప్పలేదే?” అంది.
“మనోజ్ పేరు కలిగిన వాళ్ళెవరూ మన చుట్టాలలో లేరు” అని తేల్చిచెప్పాడు శ్యామ్ తండ్రి.
“రేయ్ ఎవరు నువ్వు?” కోపంగా అన్నాడు శ్యామ్‌సుందర్, లోపలికి వస్తూ.
“ఏంటి బావా, ఆ గొంతు?” అన్నాడు, మనోజ్.
ఇంతలో మనోజ్ ఫోన్ రింగ్ అయింది.
“ఏం బావా, ఇంకా ఇంటికి రాలేదు? నేను, మీ అక్కా ఆఫీస్‌కి లీవ్ పెట్టి వెయిట్ చేస్తున్నాం” అని ఎవరో మాట్లాడారు.
“బావా! మీది శాంతి అపార్ట్మెంటే కదా?” అడిగాడు మనోజ్.
“ఆ, బావా! ఫ్లాట్ నెంబర్ 106.” అన్నాడు అవతలి వ్యక్తి.
“మీ ఫ్లాట్ నెంబర్?” అన్నాడు మనోజ్, తనూజను చూసి.
“109.” అంది తనూజ
“వెంటనే వస్తున్నా బావా!” అని మనోజ్ ఫోన్ పెట్టేసాడు “నేను వెళ్లాల్సింది 106కు, మీ బోర్డులోని 9, 6 గా పడింది చూసుకోండి” అన్నాడు బయటికి వెళ్తూ, “సారీ అక్కా! సారీ బావా! బాయ్!!”అంటూ 106 కి పరుగు తీసాడు మనోజ్.
‘ఎన్ని రోజులకు మంచి టిఫిన్ చేసాను!’ అనుకొని లోలోపల సంతోషిస్తూ “రా తనూ! ఆఫీస్‌కి వెళ్దాం రా” అన్నాడు శ్యామ్ దీనంగా మొహం పెట్టి!!
***