డీ టెక్నాలజీ

షార్ వాణి • 01 Dec 2025 • 👁 24 views
డీ టెక్నాలజీ
డీ-టెక్నాలజీ

కెవ్వుమని అరిచాడు సుబ్బారావు. ఆ అరుపుకి వంటగదిలో ఉన్న శ్యామల పరిగెత్తుకుంటూ హాల్ కి వచ్చి “ఏమైందండీ” అంది కంగారుగా.
సుబ్బారావు “శ్యామూ! అపార్ట్మెంట్ వాళ్ళు నోటీసు పంపారు” అన్నాడు గొంతు తడారిపోగా “మెయింటైనెన్స్ అమౌంట్ పెంచారా లేదా కొత్త లెఫ్ట్ కు డబ్బులు అడుగుతున్నారా?” అంది బడ్జెట్ వేగంగా మైండ్లో కాలిక్యులేట్ చేస్తూ శ్యామల.
“అహా…అదేం కాదు”అంటూ సోఫాల్లో వెనక్కు తలవాల్చాడు సుబ్బారావు దీనంగా సీలింగ్ వైపు చూస్తూ.
“మరెందుకు అలా అరిచాడు?” అని గట్టిగా అరుస్తున్న శ్యామలను చూసి “ఇది చూస్తే నువ్వు అరుస్తావులే!”అని తన సెల్ ఫోన్ లోని వాట్సాప్ మెసేజ్ ని తన భార్యామణికి చూపించాడు సుబ్బారావు. ఆ మెసేజ్ చదువుతున్నంత సేపు శ్యామల మొహంలోని మారే రంగుల్ని గమనించ సాగాడు సుబ్బారావు.
ఆఖరి పదం చదివిన తర్వాత ఆ మొబైల్ సుబ్బారావు ఒళ్ళో పడేసి కేకలు పెడుతూ సోఫాలో బిగుసుకుపోయింది శ్యామల. ముందుగా తేరుకున్న సుబ్బారావు “శ్యామూ, శ్యామూ” అంటూ శ్యామలను నిదానంగా తట్టాడు. శ్యామల “ఇది నిజమా” అంది
సుబ్బారావు “ఇప్పుడు కొత్తగా ఎలెక్ట్ అయిన అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ ఈ షరతును పెట్టారు మధ్యాహ్నం మూడు గంటలకు మీటింగ్. నేను వెళ్లి సర్దు చెప్పడానికి చూస్తాను” అన్నాడు బాధగా “సరే, నేను ఇప్పుడే ఉలవలచారు స్పెషల్ గా ఎలా చేయాలో యూట్యూబ్ లో చూశాను, భోంచేసి వెళ్దురు” అని నీరసంగా వంటగదికి వెళ్ళింది శ్యామల.
ఇద్దరూ తిన్నాము అనిపించదు బాధగా. మధ్యాహ్నం 2:50 కు “నేను మీటింగ్ కు బయలుదేరుతున్నాను”అని కింద మీటింగ్ హాల్ లోకి దిగాడు సుబ్బారావు.
తల్లికి వీడియో ఫోన్ చేసి “అమ్మా” అంటూ శ్యామల బావురుమంది. సుబ్బారావు అక్కడికి వెళ్లేలోగా చాలామంది గుమ్మిగుడి ఉన్నారు. అందరూ ఇదే విషయం మీద చర్చించుకుంటున్నారు. సెకండ్ ఫ్లోర్లోనే లో నివాసముంటున్న వెంకటేష్ వచ్చి “సార్ సార్, ఇదేంటి సార్ కొత్త ప్రెసిడెంట్ గారు ఇలాంటి షరతు పెట్టారు” అన్నాడు కంగారుగా.
“అదే అర్థం కావడం లేదు వెంకీ! ఎంత కష్టమైన పని ఇది. దీనికి బదులు బండలు మోయొచ్చు” అన్నాడు సుబ్బారావు దిగులుగా
అంతలో హరి, కుమార్, మిస్సెస్ దాస్, మిస్టర్ అండ్ మిసెస్ వర్మ ఇలా చాలామంది వచ్చారు. ఆఖరిగా ప్రెసిడెంట్ మిస్టర్ వికాస్ ఎంటర్ అయ్యి “అందరూ కూర్చోండి!” అన్నాడు.
దాంతో అందరూ తమకు కేటాయించిన సీట్లలో కూర్చోగానే “ముందుగా నన్ను అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ గా సెలెక్ట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు” అన్నాడు. అందరూ చప్పట్లు కొట్టారు “అదే మేం చేసిన తప్పు” అన్నాడు వెంకటేష్ సుబ్బారావుకి మాత్రం వినపడేలాగా.
“మీకు అందరికీ సందేశం అందిందిగా! వచ్చే ఆదివారం మనమందరం మన ఇళ్లల్లో డీ- టెక్నాలజీ ను పాటించాలి: అంటే లిమిటెడ్ టెక్నాలజీ లేదా అసలు టెక్నాలజీని వాడకుండా గడపాలి” అన్నాడు వికాస్ ఉత్సాహంగా.
ఆశ్చర్యంగా
“మనిషి తలుచుకుంటే ఏదైనా సాధ్యమే మిసెస్ వర్మ. ఒకసారి ప్రయత్నించడంలో తప్పేముంది?” అన్నాడు వికాస్ కూల్ గా.
“అంటే మనం టీవీ, లాప్టాప్, మిక్సీ, వాషింగ్ మెషిన్ ఏదీ ఈరోజు వాడకూడదా? అంది మిస్సెస్ వర్మ.
“నో ఛాన్స్ మేడం వాడకూడదు” అన్నారు
“మా మెయిడ్ యూట్యూబ్ చూసే వంటలు వండుతుంది” అంది గందరగోళంగా మిస్సెస్ వర్మ
“ఆ రోజు తను ఆల్రెడీ బాగా వచ్చిన వెంటనే చేయమనండి” అన్నాడు వికాస్
“మెయిడ్సే కాదు! మా భార్యల్ని కూడా యూట్యూబ్ చూసే చేస్తారు” అన్నాడు వెంకటేష్ దీటుగా
“ఆ ఒక్కరోజు అలా చూసి చేయకూడదు! ఇవే కాదు పిల్లలు గేమ్స్ కూడా ఇండోర్ ఆర్ అవుట్డోర్ గేమ్స్ వాడాలి, నో వీడియో గేమ్స్! ఆర్ పబ్జి గేమ్స్! ఆర్ ఆన్లైన్ కంప్యూటర్ గేమ్స్” అని నిట్టూర్చాడు వికాస్.
“ఈ షరతును తప్పకుండా పాటించాలి?” అని అరిచారు అందరూ ముక్తకంఠంతో
60 ఏళ్ల వికాస్ ముఖం గంభీరంగా మారింది.
“ఫ్రెండ్స్, నేను ఈ అపార్ట్మెంట్కు రాకముందు 35 ఏళ్ళు ముంబై, వైజాగ్ లాంటి ప్లేసెస్ లో అపార్ట్మెంట్ కు సెక్రటరీగా పనిచేశారు. నేను ఇలా ఒకరోజు అడుగుతున్నానంటే మీరందరూ దయచేసి అర్ధం చేసుకోండి” అన్నాడు ప్రాధేయపడుతున్నట్లుగా.
దాంతో ఎవరు ఏమీ మాట్లాడలేక పోయారు.
“అందరూ చల్లటి మజ్జిగ తాగి ఇళ్లకు వెళ్ళండి” అని అక్కడి నుంచి కదిలాడు. ఆ చల్లటి మంచిగా వాళ్ళ కడుపులో రగులుతున్న మంటను అర్పలేకపోయింది. అందరూ బాధపడుతూ గొణుగుకుంటూ ఇంటికి వెళ్లిపోయారు. వారం రోజులు తర్వాత వచ్చే ఆదివారం ను తల్చుకుంటూ దిగులు పడిపోతూ, తగు జాగ్రత్తలు తీసుకుంటూ కాలం గడిపారు.
శనివారం రాత్రి శ్యామలకు నిద్ర పట్టక “ఏమండి” అని పిలిచింది గోముగా.
“చెప్పు శ్యామూ” అన్నాడు సుబ్బారావు
“నేను మా అమ్మతో వీడియో కాల్ మాట్లాడకుండా ఒక్కరోజు కూడా ఉండలేనండీ! అదీ కాక ఫోన్లో పాటలు పెట్టుకుని పనులు చేయడం అలవాటైందండి, యూట్యూబ్ చూసి వంటకాలు… ఇలా చాలా..” అంది శ్యామల పొడిపొడిగా.
“రేపు ఒక్కరోజే కదా శ్యామూ” అన్నాడు సుబ్బారావు
“అలా కాదండీ, మనం ఒక్క గంట ప్రయాణం చేస్తే మన అక్క వాళ్ళ ఇంటికి వెళ్లొచ్చు కదా, అందువల్ల…” అంది శ్యామల.
“ఇలాంటి ఆక్టివిటీ పెట్టినప్పుడు వెళ్లడం బాగుండదు శ్యామూ! ఒక రోజే గా” అన్నాడు సుబ్బారావు.
ఇద్దరూ అలా బాధపడుతూ నిద్రపోయారు.
రానే వచ్చింది ఆ డీ టెక్నాలజీ దినం ఆదివారం. సరిగ్గా 5 గంటలకు కాలింగ్ బెల్ మోగింది. ఇంత పొద్దున్నే ఎవరబ్బా అనుకుంటూ సుబ్బారావు లేచి కళ్ళు నులుముకుంటూ తలుపు తీయగానే ఎదురుగా వాచ్మెన్ “మీ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఇవ్వమన్నారు సార్, అవసరం అయితే ఈ బటన్ ఫోన్ వాడొచ్చు” అని సీరియస్ గా చెప్పి ఫోన్లు తీసుకొని వాచ్మెన్ వెళ్ళిపోయాడు, బటన్ ఫోన్లో తన సిమ్ము మార్చుకొని లోపలికి వచ్చిన సుబ్బారావు అలా హాల్లో సోఫాలో పడుకోగానే కళ్ళు మూతలు పడ్డాయి.
“ఏమండీ, ఎందుకు బెడ్ రూమ్లో ఫ్యాన్ తిరగడం లేదు, ఏసీ పనిచేయడం లేదు” శ్యామల అరుపులకి వచ్చిన సుబ్బారావు వెళ్లి చూడగా ఆ లైన్ లో కరెంటు రావడం లేదని గ్రహించాడు. అలాగే మిక్సీ, గ్రైండర్ కూడా వచ్చే కరెంటు ఆగిపోయిందని వాచ్మెన్ కి ఫోన్ చేసేలోగా, మైక్ లో అనౌన్స్మెంట్ “కరెంటు కూడా టెక్నాలజీ కాబట్టి, పొదుపుగా/ఒక ఫ్యాన్ ఒక లైట్ లాంటి మినిమం కరెంటు ఇవ్వబడుతుంది” అని వినబడగానే సోఫాలో కూలబడ్డాడు సుబ్బారావు.
“మీరు బ్రష్ చేసుకోండి, కాఫీ కలుపుతాను” అని శ్యామల లోపలికి వెళ్లి కాఫీ కలుపుకొని వచ్చింది. ఇద్దరూ ఎప్పటిలాగా ఫోన్ గెలుకుతూ కాకుండా ఎదురురెదురుగా కూర్చుని కాఫీ తాగాసాగారు శ్యామల కళ్ళ కింద నల్లటి కాయలను గమనించారు.
“శ్యామూ, ఏంటి నీ కళ్ళ కింద ఆ డార్క్ సర్కిల్స్? ఫేషియల్ కి రెగ్యులర్గా వెళ్లడం లేదా?” అన్నాడు సుబ్బారావు
“చేయించుకుంటున్నానండీ! కానీ పోవడం లేదు. కన్సీలర్ తో మేకప్ అప్పుడు కవర్ చేస్తాను! అయినా ఏ రోజూ లేనిది, ఈరోజు మీకు ఎలా కనిపించింది?” అంది శ్యామల ఆశ్చర్యంగా. ఏం చెప్పాలో తెలియక నవ్వాడు సుబ్బారావు
ఏం టిఫిన్ చేద్దామని ఆలోచించే లోపు “అమ్మగారూ “అంటూ పనిమనిషి రత్తాలు వచ్చింది.
“ ఇల్లంతా శుభ్రం చేయి, నేను స్నానం చేసిన తర్వాత బట్టలు… “అని ఆగింది శ్యామల.
“ఏమైంది అమ్మగారూ… ఓ అదా, ఈరోజు వాషింగ్ మిషన్ వాడకూడదు కదా, రేపు వేస్తానులెండి” అంది రత్తాలు.
“బట్టలు నాకట్లా పేర్చడం నచ్చదు రత్తాలు, ఈరోజు చేత్తో ఉతుకు” అంది శ్యామల.
దాంతో రత్తాలు “అమ్మగారూ! నావల్ల కాదు. ఇల్లు శుభ్రం చేసేసరికి నాకు సరిపోతుంది” అని శ్యామల మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా ఇల్లు ఊడవ సాగింది
సుబ్బారావు స్నానం చేసి హాల్ కి వచ్చి ఏం చేయాలో పాలు పోక చేతిలో ఫోన్ లేక, టీవీ ఆన్ చేశాడు. సిటీ కేబుల్ తప్ప ఇంకేం రాలేదు. కారణం:లిమిటెడ్ టెక్నాలజీ అని బుర్రకు తట్టింది. షోకేస్ లో ఒక మూల కొన్ని బుక్స్ పేర్చబడి ఉన్నాయి. ఎప్పుడో ఏడాది క్రితం ఫెస్టివల్లో కొన్నాడు. ఆర్. కె. నారాయణ ద గైడ్ అన్న పుస్తకం అందులోంచి తీశాడు. ఒక్క ఐదు నిమిషాలు ఫోకస్ గా చదవలేకపోయాడు. చాలా కష్టపడి అటు ఇటు పేపర్లు తెప్పి ఒక 20 నిమిషాలు చదివే లోపు ఇంట్రెస్టింగ్ గా అనిపించింది.
అక్కడ శ్యామల వంటగదిలో ఫ్యాన్ లేక ఉప్ మంటూ, ముందు రోజే రుబ్బిన పిండితో పెసరట్టు వేస్తోంది, ఒకపక్క ఉప్మా చేస్తోంది. ఇప్పుడు అల్లం చట్నీ ఎలా చేయాలని ఆలోచిస్తుంది.
తన దగ్గర ఉన్న పాత రోలును తీసుకొని శుభ్రం చేసి అల్లం పచ్చిమిర్చి వగైరాను కచ్చాపచ్చాగా దంచసాగింది. ఒక పది నిమిషాలకి అది పచ్చడి రూపాన్ని దాల్చింది.

“ఏమండీ టిఫిన్” అన్న శ్యామల పిలుపుతో పుస్తకం నుంచి ఈ లోకానికి వచ్చాడు సుబ్బారావు పెసరట్టు ఉప్మాను అల్లం పచ్చడిలో తినగానే తన చిన్నతనంలో బామ్మ రోటి పచ్చడి గుర్తుకొచ్చిన సుబ్బారావుకి అప్రయత్నంగా కంట్రోల్ నుంచి నీరు వచ్చింది.
శ్యామల “ఏమండీ కారం ఎక్కువైందా?”అంది కంగారుగా
ఏమీ లేదన్నట్లుగా తలూపి టిఫిన్ తినేసి, పుస్తకంలో నిమగ్నమయ్యాడు సుబ్బారావు. రత్తాలు ఇల్లు శుభ్రం చేసి గబగబా తన వంతు టిఫిన్ తీసుకొని వెళ్ళిపోయింది.
శ్యామల బాత్రూం కి వెళ్లి బట్టలు చేత్తోనే ఉతక సాగింది.
అది చూసిన సుబ్బారావు “ఏంటి శ్యామూ! రేపు మిషన్లో వేసుకోవచ్చుగా” అన్నాడు
“నాకు అలా నచ్చదు కాదండీ! ఒక పది నిమిషాలు”అంది శ్యామల
ఇక చేసేది లేక సుబ్బారావు హాల్ కి వెళ్లి పాపం శ్యాము బట్టలుతికి మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేయాలి అని అనుకుంటూ, ఫ్రిడ్జ్ తీస్తే కూరగాయలు ఏవి లేవు. ఇప్పుడే కూరగాయల, ఆకుకూరలు అంటూ అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చే కూరగాయల అబ్బాయి గొంతు వినబడింది.
జిపిఏ ఫోన్ పే లాంటివి చేయకూడదు కాబట్టి ముందుగానే కొంత డబ్బు డ్రా చేసి ఉంచడంతో దాంట్లోని రెండు వందలు తీసుకొని లిఫ్ట్ దగ్గరికి వెళ్లి, అది లిఫ్ట్ ఆఫ్ చేయబడింది డీటెక్నాలజీ వలనఅని గుర్తు రావడంతో మెట్లు దిగసాగాడు.
ఇద్దరు మోడ్రన్ డ్రెస్ లో ఉన్న లేడీస్ “ఈ ప్రెసిడెంట్ చావగొడుతున్నాడు, సండే కూడా టార్చ్రర్” అంటూ నాజుగా ఉన్నా మెట్లు దిగడానికి ఇబ్బంది పడసాగారు. ఫోర్త్ ఫ్లోర్ నుండి గ్రౌండ్ ఫ్లోర్ కి వచ్చేసరికి నీరసం వచ్చింది సుబ్బారావుకి.
ఆరోజు ఒక్కసారిగా అంత జనం చేశారు వచ్చేసరికి అవాక్కయ్యాడు కూరగాయలమ్మే అబ్బాయి. అంతలో వెంకటేష్ “నువ్వు మరీ అంత సంబర పడిపోవద్దు బాబూ! ఈరోజు లింక్ ఇట్ ఇన్షా మార్ట్ వగైరా ఆప్స్ వాడకూడదు కాబట్టి, కాబట్టి జనం రేపటి నుంచి షరా మామూలే” అన్నాడు “అయ్యగారూ! మీలాంటి వాళ్ళు ఒక పదిమంది కొంటేనే కదండీ మాకు పూట గడవడానికి” అన్నాడు ఆ అబ్బాయి జాలిగా
అలా జనం కూరగాయలు కొనడానికి ఎగబడ్డారు. సుబ్బారావు కూడా ఒక కేజీ వంకాయలు, మునక్కాయలు, కీరకాయలు, ఉల్లిపాయలు కొన్నాడు. దాంతో తన దగ్గర ఉన్న 200 రూపాయలు అయిపోయాయి. కూరగాయలు అంత ధరలా? రోజూ స్కాన్ చేసి అమౌంట్ వేస్తుంటే తెలియడం లేదు అనుకున్నాడు. ఇంట్లోకి రాగానే అలసిపోయి పడుకున్న శ్యామాను చూసాడు. అప్పటికే సుబ్బారావు కాళ్ళు పీకేస్తున్నాయి. కూరగాయలు డైనింగ్ టేబుల్ మీద పెట్టి తనూ నిద్రపోయారు.
కుక్కర్ విజిల్ కి మెలకువ వచ్చి చూస్తే టైం 12 అవుతోంది. అప్పుడే శ్యామల వంట చేయడానికి ఉపక్రమిస్తోంది. ఏమి తోచని సుబ్బారావు కూరగాయలు, తరిగింగించడం కొత్తిమీర కరివేపాకు వలిచి ఇవ్వడం, లాంటి చిన్న చిన్న పనులు చేయడంతో ఆశ్చర్యపోయింది శ్యామల. ఇద్దరూ కలిసి వంట చేసుకుని తృప్తిగా తిన్నారు.
శ్యామల కు ఫోన్ లేకుండా తెగ బోర్ కొడుతుంది. అంతలో తన అమ్మ కూడా గుర్తొచ్చింది దాంతో కొంచెం ఏడుపు రాగా, తన చిన్ననాటి ఆల్బమ్స్ మరియు పెళ్లి ఆల్బమ్స్ వెతికి తీసి ఆ ఫొటోస్ చూసుకుంటూ ఆ బంధువుల బంధువుల, ఫ్రెండ్స్, వాళ్లతో బంధుత్వాలు, అనుబంధాలు అప్పట్లో జరిగిన కలిసి ఆడుకున్న వైనాలు, కలిసి గడిపిన మాట్లాడుకుంటూ మనస్ఫూర్తిగా నవ్వుకున్నారు. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో “ఏమండీ ఇంట్లోనే బోర్ గా ఉంది” అంది శ్యామల.
దాంతో ఇద్దరూ ఫ్రెష్ అయి నాలుగో అంతస్తు నుంచి కిందకు దిగారు. సుబ్బారావుకి ఈసారి అంత కష్టం అనిపించలేదు కానీ శ్యామల కొంత ఇబ్బంది పడింది.
అక్కడ వాకింగ్ ఏరియానే కాకుండా పార్క్ లో కూడా చాలా మంది ఉన్నారు. అక్కడ ఆడవాళ్లు మరియు మగవాళ్ళు జట్లు జట్లుగా మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ చిన్నచిన్న ఆటలు ఆడసాగారు. శ్యామల సుబ్బారావు కొంతసేపు ఒళ్ళు మరిచి ఆడారు, అంతాక్షరి పాడుకున్నారు మరియు మోనో యాక్షన్ లాంటి చిన్న గేమ్స్ లో పార్టిసిపేట్ చేశారు. ఇంకా అక్కడ పిల్లలు అందరు రైమ్స్ పాడుతూ, ఫుట్బాల్, వాలీబాల్, షటిల్, క్రికెట్ ఆడుకున్నారు.
అలా అక్కడ ఒక్కరోజులోనే చాలామంది పరిచయమయ్యారు శ్యామలకి వాళ్లు రోజు సాయంకాలం ఐదు నుంచి ఆరు వరకు అక్కడ వాకింగ్ చేస్తామని, తనను కూడా జాయిన్ అవ్వమని చెప్పారు. ఎప్పుడూమఇంట్లోనే ఉండి, సెల్ఫోన్ చూసుకుంటూ కాలం గడిపే శ్యామలకు వాళ్లతో మాట్లాడటం చాలా సంతోషాన్ని కలిగించింది.
సుమారు 6 గంటలకు ఇల్లు చేరుకుని దీపం పెట్టింది శ్యామల. ఎందుకో మనసూ, శరీరమూ ఉత్సాహంగా అనిపించింది. తన రోజూ సెల్ ఫోన్ లో చదివే మంత్రాలను ఈరోజులో బుక్ లో చూసి ఇష్టంగా చదవసాగింది. ప్రతిరోజూ, ఆ ఫోన్లో వచ్చే నోటిఫికేషన్, మెసేజెస్, కాల్స్ వల్ల సరిగ్గా చదవలేక పోతున్న శ్యామల కు, ఈరోజు బుక్కు చూసి చదవడం వల్ల ఎలాంటి ఆటకం లేకుండా అరగంట ధ్యాన సాధన చేయగలిగింది. దానికి తోడు సుబ్బారావు కూడా శ్యామల పక్కనే కూర్చొని పూజ చేయ పూలు వేసి పూజ చేశాడు. దాంతో వాళ్లకి అనర్వచనీయమైన అనుభూతి కలిగింది. హాల్కి వచ్చిన శ్యామల ఆరోజు దినపత్రికలోని పదవినోదం చేయసాగింది. సుబ్బారావు దానికి తోడ్పడంతో ఇద్దరూ పోటాను పోటీగా ఆ పదవినోదాన్ని పూర్తి చేశారు. “ఏమండీ, మీలో ఇంత ఉత్సాహం ఉందని నాకు తెలియదా?”అంది శ్యామల
‘అవును ఎప్పుడూ టీవీనో, సెల్ఫోన్ చూస్తూ కాలం గడుపుతాను,,బయట షాపింగ్ కి వెళ్ళినా మధ్య మధ్యలో ఇద్దరు ఎవరు ఫోన్లు వాళ్ళు చూస్తారు. ఇక వీక్ డేస్ లో శ్యామలతో గడిపే అవకాశం ఏ ఉండదు ఇక పిల్లల గురించిన ఆలోచన రెండేళ్ల వరకు వద్దను కున్నారు కానీ ఎందుకో ఈరోజు శ్యామల తన కంటికి చాలా అందంగా కనిపించసాగింది. శ్యామల ముఖంలో ఎప్పుడూ వేసే మేక ప్ వలన కాకుండా శ్రమతో కూడిన సంతోషం కనిపించసాగింది. చిరునవ్వుతో శ్యామలను అది అలాగే చూస్తూ తన్మయుడయ్యాడు సుబ్బారావు.
అంతలో మైక్ లో అనౌన్స్మెంట్ లోయఅందరు కింద కన్వెన్షన్ హాల్ కు డిన్నర్ కు రావాలని పిలుపు వచ్చింది. దాంతో అందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉల్లాసంగా ఉత్సాహంగా డిన్నర్ చేశారు.
వికాస్ వర్మ “వెల్కం! క్రితం వారం కంటే ఈ సండే మీరు చాలా సంతోషంగా కనిపిస్తున్నారు! మీ అనుభవాలను ఒక వాక్యంలో పంచుకోగలరా?” అన్నాడు నవ్వుతూ
‘మా ఇంట్లో అలారం టైం పీస్ ఈరోజు మోగింది’
‘నా భార్యతో కలిసి చాలా రోజుల తర్వాత కబుర్లు చెప్పాను’
‘ ఈరోజు ఒక పుస్తకం చదివాను’
రోటి పచ్చడి తిన్నాను’
‘మా పిల్లలతో కలిసి సరదాగా గడిపాను’
‘ మా కుటుంబం ఇంత ఉత్సాహవంతమైందని నాకు తెలియదు’
‘ ప్రేమానురాగాలు ఇంత మర్చిపోతున్నామా అని తెలియదు’
అలా కొంతమంది గట్టిగట్టుగా సమాధానాలు చెప్పారు.
“ మనం టెక్నాలజీ యుగంలో ఉన్నాము. టెక్నాలజీ నేర్చుకొని దాంతో ప్రయాణం చేయాలి! తప్పదు. కానీ, ఈ టెక్నాలజీ వల్ల మనం మనుషులము అన్న విషయం మర్చిపోతున్నామా. కనీసం పలకరించికోకపోవడం, పరస్పర సహాయ సహకారాలు అందిచుకోవడం, చిన్నచిన్న సంతోషాలు, అన్నిటికంటే చాట్ జిపిటి వాడకం వల్ల ఆలోచించడం మర్చిపోతున్నాం. ఇవన్నీ తిరిగి పొందాలంటే మనము ఒక బార్డర్ గీసుకోవాలి. ఎంతవరకూ, ఎంత మోతాదులో, మనం టెక్నాలజీ ను వాడాలి అని’ అందుకే ఈ చిరు పరీక్ష పెట్టాను. మనం మనుషుల మీద కాకుండా, మన మీద కూడా కాకుండా, యంత్రాల మీద ఎంత ఓవర్ డిపెండెంట్ అవుతున్నాము అని మీకు ఇప్పుడే తెలిసి ఉంటుంది. అది దేనికి దారితీస్తుందో ఆలోచించండి” అని ఆపాడు.దాంతో హాల్ అంతా కరతాలధ్వనులు మోగాయి.