అందం
రాజోలు గవర్నమెంట్ స్కూల్,
టెన్త్ క్లాస్ ఫస్ట్ పీరియడ్ జరుగుతుంది.
“ఏమిట్రా గొడవ?” అన్నారు
సోషల్ మాస్టర్ వేణుగోపాల్ బోర్డ్ మీద రాస్తూ.
“సార్, రాజు నేను నల్లగా ఉంటానని, అందంగా లేనని తన దగ్గర కూర్చోవద్దు అంటున్నాడు.” అని కంప్లైంట్ చేశాడు రిషి.
“ఒరేయ్ రాజు, అందమంటే ఏమిట్రా?” అని అడిగారు రాయటం అపి.
“సార్!. నాలాగా తెల్లగా, ఉంగరాలు జుట్టు, పెద్ద కళ్ళు ఉండాలి, మా అమ్మ ఎప్పుడు నా కొడుకు చాలా అందంగా ఉంటాడు.” అంటుంది అని చెప్పాడు రాజు.
“అది నిజమే, ప్రతి తల్లికి తన పిల్లలు అందంగానే కనిపిస్తారు, కానీ సృష్టిలో అసలైన "అందమైనది" ఏది? ఒక్కక్కరుగా లేచి చెప్పండి.” అని అడిగారు.
“సార్! మా ఇంటి దగ్గర సెలయేరు గలగలమని పారుతుoటే చాలా అందంగా అనిపిస్తుంది.” అన్నాడు మిత్ర,
“సార్, మా చెట్టు మీద ఉన్న పక్షల గూటిలో, కాకి తన పిల్లలకు నోట్లో ఆహారం పెడుతుంటే ఆ దృశ్యం ఎంతో అందంగా ఉంటుంది.”
“సార్, మా చెల్లి బోసి నోటితో నవ్వుతుంటే బలే అందంగా ముద్దిస్తుంది.” అంది ప్రియ
“సార్” మా ఇల్లు చాలా పెద్దది విశాలమైన గదులతో అందంగా వుంటుంది.”
“సార్, మా ఇంటి చుట్టూ తోట చాలా అందంగా ఉంటుంది.”
సముద్రం, సూర్యుడు ,చంద్రుడు, ప్రకృతి, అవు దూడ ఇలా రకరకాల సమాధానాలు చెప్పారు పిల్లలు.
“సార్, నాకు వీళ్లు చెప్పేవి ఏవి కూడా అందంగా కనిపించవు.” అన్నాడు రిషి.
“అవునా ఎందుకు” అని అడిగారు మాస్టారు
“అందరూ నన్ను కురుపి అని హేళన చేస్తూ ఉంటారు, ఇంటి దగ్గర మా నాన్న కూడా తాగి వచ్చి, నన్ను ‘కర్రోడా కర్రోడా’ అని తిడతాడు, నేనంటే నాకు కూడా నచ్చదు. నాకు మీద నాకే చాలా కోపం వస్తుంది, బాధ వేస్తుంది. వీళ్ళందరూ చెప్పే ఆ ప్రకృతిలోని అందాలు నాకు ఎప్పుడూ కనిపించలేదు, ప్రపంచమంతా నా రంగులాగే నల్లగా, చీకటిగా కనిపిస్తుంది,
నేను చూసే ప్రతిదీ, కోపంతో రగిలే నా కళ్ళ మాదిరి నిప్పు కణికల్లాగా ఎర్రగా మండుతూ ఉంటుంది..” అన్నాడు ఆవేశంగా రిషి
“చూడు రిషి, బాధలో ఉన్న మనిషికి ప్రపంచo ‘అందకారంగా’ కనిపిస్తుంది..
సంతోషంగా వున్నప్పుడు కనిపించే ప్రతి వస్తువులోను అందాన్ని సంతోషాన్ని చూడ గలుగుతాము.” అన్నారు.
అందరూ మౌనంగా జాగ్రత్తగా వినటం గమనించి మళ్లీ మొదలుపెట్టారు.
“చూడండి పిల్లలు, ‘అందం అనేది మనం చూసే దృష్టికోణం బట్టి ఉంటుంది, ఎదుటివారిని ప్రేమించగలిగె హృదయంలో’ వుంటుంది.
‘మదర్ థెరిస్సా’ ఆమె సేవాగుణం, ప్రేమించే హృదయం ఆమె అందాన్ని రెట్టింపు చేశాయి.” ‘అబ్దుల్ కలామ్’ క్షిపణి శాస్త్రవేత్త, ఆయనలో ఉన్న టాలెంట్, మంచిగుణం రాష్ట్రపతిని చేశాయి..”
అందంగా లేను అని బాధపడుతూ కూర్చుంటే, జీవితంలో వెలుగును చూడలేవు.
“ ఇక్కడ మీకు ఏమీ అర్థమవుతుంది,
మనిషికి అవసరమైంది శారీరక అందం కాదు, మానసికమైనది. మీలో వున్న ప్రత్యేక సామర్థ్యం, వ్యక్తిత్వం, సుగుణం, ఆనందమే మీ చుట్టు ప్రకాశిస్తూ మీలో వున్న ‘ప్రత్యేకత’ అనే వెలుగు మాత్రమే ఎదుటి వారికి కనిపిస్తుంది, అంతేకానీ మీ శారీరక అందం కాదు అర్థమైందా?” అన్నారు.
“అర్థమైంది సార్” అన్నారు.
“రిషి, నువ్వు చెప్పు ఏమీ అర్దమైంది?”
“అందం కన్నా ప్రత్యేక సామర్థ్యం (స్పెషల్ టాలెంట్), వ్యక్తిత్వం గొప్పదని అర్థమైంది.” అన్నాడు.
“గుడ్, నీకు ఏది ఆనందమో, నీలో ఉన్న ప్రత్యేకత ఏమిటో గుర్తించు, నీకు ఇష్టమైన పని మీద ఎక్కువగా శ్రద్ధచూపించు, నీ సామర్థ్యం మెరుగుపడుతుంది. నీ ప్రతిభ నిన్ను అందలo ఎక్కిస్తుంది. అప్పుడు రంగు కాదు. అసలైన ‘నువ్వేంటో’ అందరి కళ్ళకు కనిపిస్తుంది” అన్నారు మాస్టారు.
“థాంక్యూ సార్, నాకు చదువుకోవటం అంటే చాలా ఇష్టం, నేను బాగా చదువుకుని పెద్ద ప్రొఫెసర్ అవుతాను. ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దుతాను.” అన్నాడు రిషి పట్టుదలగా.
“గుడ్, ఒక మంచి పని చేయడానికి ఆలస్యం పనికిరాదు, ఈరోజు నుంచే బాగా చదువుకోవడం మొదలుపెట్టు, ఎగ్జామ్స్లో నీకే ఫస్ట్ ర్యాంక్ రావాలి.” అన్నారు మాష్టర్.
“ సార్, ఈరోజు నుంచి నేను చదువు మీదే దృష్టి పెడతాను. ” అన్నాడు రిషి,తన మీద తనకున్న నమ్మకoతో..
సాయంత్రం నాలుగు అవటంతో టంగ్ టంగ్ టంగ్,.. స్కూల్ బెల్ రింగ్ అయింది...
పిల్లలందరూ బ్యాగులు తీసుకుని ఇళ్లకు పరిగెత్తారు..
…………………
ఇంటికి రాగానే కాళ్లు, చేతులు, మొఖం కడుక్కుని,.
అమ్మ పెట్టింది తిని, పుస్తకాలు తీసి చదువుకోవడం మొదలుపెట్టాడు రిషి.
“ఏందిరోయ్! రోజు ఇంటికి రాగానే పుస్తకాలు పక్కన పారేసి దిగులుగా కూర్చునేటోడివి, ఈ రోజేమైంది పుస్తకాలు పట్టి కూర్చున్నావు.” అంది ఆశ్చర్యంగా రిషి తల్లి రాములమ్మ.
“పరీక్షలు దగ్గరకు వస్తున్నాయమ్మ చదువుకోవాలి.” అన్నాడు రిషి..
“నా బాబే, నా బంగారం సదువుకో నాయన, నువ్వు బాగా సదువుకోవాలి “ అని రిషి తల నిమిరి వెళ్ళిపోయింది.
తల్లి తనని ఎంకరేజ్ చేయడం సంతోషంగా అనిపించింది రిషికి.
అదే తన మొదటి గెలుపుగా భావించాడు,
స్కూలుకి వెళ్లడం రావడం ఫ్రెష్ అయి
ఏదైనా తిని పడుకునేవరకు చదువుకోవడం తన దినచర్యగా మార్చుకున్నాడు.
“ఏందిరా ఎప్పుడు చూసినా పుస్తకాలు పట్టుకునే కూర్చుంటున్నావు. ఫకీర్ కొట్టుకుపోయి బీడీకట్టలు పట్టుకురా” అన్నాడు రిషి తండ్రి సూరయ్య.
“నేను వెళ్ళను నాన్న, నేను చదువుకోవాలి.” అన్నాడు మొండిగా రిషి,
“ఏందిరోయ్, నాకే ఎదురు చెప్తున్నావు.” అని కర్ర తీసుకొని కొట్టబోయాడు...
ఆ కర్రను చేత్తో పట్టుకుని ఆపి,..
“నాన్న, నేను ఇంకా అలాంటి పనులు చేయను, నువ్వు నన్ను చదువుకోనివ్వు డిస్టర్బ్ చేయకు” అన్నాడు గట్టిగా రిషి.
రిషి కోపం చూసి కొంచెం జంకాడు సూరయ్య.
“ఏందయ్యా బుద్ధిగా చదువుకునే పిల్లవాడిని పట్టుకుని పనులు చెప్తున్నావు.
నీకు పోవటం కట్టమైతే, పైసలు ఇయ్యి నేను పోయి తెస్తా, అంతేగాని సదువుకునే పిల్లాడిని చెడగొట్టకు, వాడు బాగా చదివి గొప్పోడు అవ్వాలా” అంది రంగి.
“ఏంటే కలలు కంటున్నావా, ఆడి మొహం చూడు చదివి గొప్పోడయ్యే మొహమేనా, కర్రినాయాలా! ఎవర్రా నీ మొహానికి ఉద్యోగం ఇస్తారు.” అన్నాడు చిరాగ్గా సూరయ్య.
తండ్రి మాటలకు, రిషికి అరికాలు మంట నషాలానికి ఎక్కింది. కానీ మాస్టారు చెప్పినట్లు, ఎవరి మాటలు పట్టించుకోకుండా ‘తన టాలెంట్ ఏంటో తను నిరూపించుకోవాలి’ అనుకున్నాడు.
“అందo ఎందయ్య అందం, ఈ పైపై మెరుగులు ఎవరికి కావాలి, నా కొడుకు గొప్పోడు అయినాక, నువ్వే ఆడికి ‘జేజేలు’ పలుకుతావు చూస్తా ఉండు.
అని కోపంగా వీరయ్య జేబులోంచి యాబై రూపాయల నోటు తీసుకుని ఫకీరు కొట్టుకు వెళ్ళిపోయింది రాములమ్మ.
‘ఎవడెటు పోతే నాకేంటి, నా బీడీ కట్ట నాకు వస్తుంది’ అనుకుని, నులకమంచం మీద పడుకుని పాటలుపాడటం మొదలుపెట్టాడు, అప్పటికే ఫుల్లుగా తాగి వున్న సూరయ్య.
తండ్రి పాటలకు చదువు బుర్రకెక్కక,
ఇంటివెనక్కి వెళ్లి చెట్టు కింద కూర్చుని, బుడ్డి దీపం వెలిగించుకుని చదువుకోవటం మొదలుపెట్టాడు రిషి.
తనకేమైన డౌట్లు ఉంటే సోషల్ మాస్టర్ వేణుగోపాల్ దగ్గరకు వెళ్లి చెప్పించుకునేవాడు.
రిషి పట్టుదల చూసి మాస్టారు ముచ్చటపడి, రిషికి అర్థమయ్యేలా పాఠాలు చెప్పేవారు.
..............
టెన్త్ క్లాస్ క్వార్టర్లీ ఎగ్జామ్స్ లో అన్ని సబ్జెక్టుల్లో డబ్బై శాతం మార్కులతో పాస్ అయ్యాడు రిషికి.
తన మీద తనకు నమ్మకంతో, ఇంకా బాగా చదవాలని పట్టుదల పెరిగింది. పట్టువదలని విక్రమార్కుడిలా పుస్తకంలో ప్రతిపాఠం ప్రతివాక్యం అర్దం చేసుకుంటూ చదవటం మొదలుపెట్టాడు. హాఫ్ఇయర్లి పరీక్షల్లో క్లాస్ ఫస్ట్ వచ్చాడు.
సంతోషంతో రెక్కలు వచ్చిన పక్షిలా చెట్లంటా పొలంగట్లమీద ఎగురుతూ గెంతుతూ పరుగులు పెట్టాడు.
"తనకు తానే కొత్తగా కనిపిస్తున్నాడు.
నింగి నేలా, చెట్టు, పుట్ట, పశువులు, పక్షులు, "ప్రకృతి" ఎటు చూసినా అందంగా కనిపిస్తుంది.
కనిపించిన ప్రతిఒకరిని నవ్వుతూ పలకరించాడు.
ఎప్పుడూ కోపంగా దిగులుగా, పిలిచినా పలకకుండా వెళ్ళిపోయే కొడుకులో మార్పు చూసి సంబరపడిపోయింది రాములమ్మ.
అనాకారి అని దూరం పెట్టిన వాళ్ళందరూ, తన దగ్గరకు డౌట్లు తీర్చుకోవడానికి రావడం,
తన పక్కనే కూర్చుంటూ స్నేహం చేయాలని ఉబలాపడటం చాలా ఆనందంగా అనిపించింది, తన మీద తనకి నమ్మకం పెరిగింది రిషికి.
………………..
ఒక రోజు రిషి స్నేహితులతో కలిసి స్కూల్ నుంచి ఇంటికి వస్తున్నాడు. ఆకాశం నల్లటిమబ్బులు కమ్మి. సన్నగా వానచినుకులు మొదలైంది. స్నేహితులందరూ ఇళ్లకు పరిగెత్తారు.
వానజల్లుకు పక్షులన్నీ కిలకిలరావాలతో గూళ్ళకు చేరుకున్నాయి.
పుస్తకాలు బ్యాగు తల మీద పెట్టుకుని గబగబా నడవటం మొదలుపెట్టాడు రిషి.
వానజల్లుకు తడవకుండా మూడు చిన్న చిన్న గువ్వల జంటలు చెట్టు కొమ్మకొమ్మకు ఉన్న రంగురంగుల పువ్వులరెక్కలను పొదరిల్లులా చేసుకొని ఒదిగిపోయి వానగాలికి ఊయల వూగుతూ తొంగిచూస్తున్నాయి.
ఆ దృశ్యం చూడటానికి ఎంతో ఆహ్లాదకరంగా అనిపించింది. వాటి తెలివికి ఆశ్చర్యపోయాడు. అంత చిన్న గువ్వపిట్టలకు ఎవరునేర్పారు సమయం సందర్భంబట్టి నడుచుకోమని, ప్రకృతి అందమైనదే కాదు, మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది అని ఆలోచిస్తూ నడుస్తున్న రిషికి.
తమ పక్కవీధిలో ఉంటున్న స్వీటీ, బంటి వర్షంలో తడుస్తూ ఆడుతూ కనిపించారు.
“అరేయ్ బంటి, స్వీటీ, మీకు ఇప్పుడు మంచి మ్యాజిక్ చూపిస్తాను.” అని చెప్పి,
స్వీటీ చేతిలో ఉన్న అరిటాకులు తీసుకుని, వాటిలో కొంచెం పెద్ద ఆకును తీసి గొడుగులాగా చేసి పిల్లలకు ఇచ్చాడు.
“వావ్! అరిటాకు గొడుగు” అని చెప్పి ఇద్దరూ అరిటాకు పట్టుకుని ఒకరినొకరు చూసుకుంటు సంతోషంతో ఎగురుతున్న పిల్లలను చూసి, మనసoతా ఆనందంతో నిండిపోయింది.
“అందం, ఆనందం, ఎక్కడో లేదు మన మనసులోను, మనం చేసే పనులలోనే వుంది.” అని అర్థమైంది రిషికి.
తను అందంగా లేను అనే నూన్యతాబావం పోయింది, మనసంతా ఏదైనా సాధించగలనని నమ్మకంతో లక్ష్యంతో నిండిపోయింది.
టెన్త్ పరీక్షలలో డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చాడు.
అక్కడితో ఆగకుండా దీక్ష, పట్టుదలతో అంచలంచెలుగా ఎదుగుతూ…. ఎదిగే కొద్ది ఒదుగుతూ, తన లక్ష్యానికి చేరుకున్నాడు రిషి.
..................
అంతర్జాతీయ యునెస్కో కింగ్ సెజోంగ్ లిటరసీ” సన్మాన సభ జరుగుతోంది.
‘ప్రొఫెసర్ రిషి’కి సన్మానం చేసి మంత్రి రామప్పస్వామి మాట్లాడుతూ….
“అన్ని దానాలలో విద్యాదానం గొప్పది.”
విద్య వలన ఒక వ్యక్తి తో పాటుగా అతని కుటుంబం, దేశం కూడా అభివృద్ధి చెందుతుంది.
అవార్డ్ గ్రహీత ప్రొఫెసర్ రిషిగారు నిరక్షరాస్యతకు వ్యతిరేకంగా పోరాటంచేసి, ఎన్నో విద్యాసంస్థలు స్థాపించారు, ఎంతోమంది పేద విద్యార్థులకు ఫ్రీగా చదువుకునే అవకాశాన్ని కల్పించారు.” అన్నారు.
హర్షధ్వానాలతో మరుమోగిపోయింది..
సంతోషమే స్వర్గం,.. దుఖఃమే నరకము.
…శుభం…