లిఖితం

సాక్షి • 25 Sep 2025 • 👁 2 views
.

...లిఖితo.....



తూర్పు ఇంకా తెల్లవారలేదు. వీధి లైట్లు మిణుకు మిణుకు మంటూ వెలుగుతున్నాయి. కార్తీకమాసంలోనూ చలిగాలులు వీస్తున్నాయి. ఇంటి నుంచి బయటకు వచ్చాడు గణపతి శాస్త్రి. పంచె పైకిలాక్కుని, భుజం మీద కండువా వేసుకుని, రాగిచెంబు చేత్తో పట్టుకుని ఆ మసకచీకటిలో కేదార్ ఘాట్ కేసి నడవడం మొదలుపెట్టాడు. కాశీలోని ఆ ఇరుకు రోడ్లమీద నడవడం కొత్తవాళ్ళకు సవాలే. శాస్త్రికి ప్రతీ సందు తెలుసు. అతనికి తెలియని వాడ, చూడని ప్రదేశం లేదు.
నెమ్మదిగా కేదార్ ఘాట్ లో మెట్లుదిగాడు. మూడుసార్లు ' హరహర మహా దేవ్ ' అంటూ గంగలో మునిగి గట్టుమీదకు వచ్చాడు. కండువాతో వొళ్ళు తుడుచుకుని, పంచె పిండుకుని కట్టుకున్నాడు. నుదుట విభూతి ధారణ చేసి, శివ పంచాక్షరి మంత్రం మనసులో జపిస్తూ, రాగి చెంబులోని గంగా జలంతో
శ్రీ గౌరి కేదారేశ్వరుడితో బాటు, అరుణాచలేశ్వరుడికి, దక్షిణా మూర్తికి అభిషేకం చేసాడు. చప్పన్న గణపతిని, మీనాక్షి అమ్మవారిని కూడా దర్శించుకొని, మళ్ళీ
చెంబుతో గంగాజలం తీసుకుని బయల్దేరాడు.
ఉత్తర వాహినిగా సాగే గంగా ప్రవాహాన్ని , నదీ జలాలమీద గిరికీలు కొడుతున్న తెల్లని కొంగల్ని చూస్తూ, నెమ్మదిగా మానస సరోవర్ ఘాట్, క్షేమేశ్వర్ ఘాట్, చౌసెట్టి ఘాట్ ల మీదుగా దశాశ్వమేధ ఘాట్ చేరుకొన్నాడు. అలాగే ఘాట్ల మీద నడక సాగిస్తూ మణికర్ణిక ఘాట్ కు చేరుకున్నాడు. అప్పటికే అక్కడ మృతిచెందిన అదృష్టవంతుల కాష్టాలు కాలుతున్నాయి.
'ఆ అదృష్టం కోసమే కదా తను పది సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నాడు. రిటైరయ్యిన తర్వాత వచ్చిన డబ్బులతో కాశీ లోనే ఇల్లు కొనుక్కున్నదే అందుకోసం. పిల్లలు ఇద్దరూ బాగా స్థిరపడ్డారు. తన శేషజీవితాన్ని విశ్వేశ్వరుని సన్నిధిలో గడపాలని, తన కాష్టం ఇక్కడే కాలాలని ఇక్కడకు వచ్చేశాడు. మానవజన్మ దుర్లభం. ఈ జన్మలో కాశీలో మరణిస్తే మోక్షమే. మళ్ళీ జన్మంటూ ఉండదు.' అనుకున్నాడు. అక్కడున్న తారకేశ్వర లింగానికి గంగా జలంతో అభిషేకం చేసాడు శాస్త్రి. మళ్ళీ రాగి చెంబు తో గంగా జలం తీసుకున్నాడు.

భక్తిభావం పొంగుతుంటే తన్మయత్వంతో
'విశ్వేశ్వరా! నా ఆఖరిశ్వాస నీ సన్నిధిలో, ఈ కాశీక్షేత్రం లోనే తీసుకునే అదృష్టం ప్రసాదించు తండ్రీ!' అంటూ చేతులు జోడించి మనస్సులోనే ప్రార్థించి విశ్వనాధుని మందిరంలోకి అడుగుపెట్టాడు. సర్కార్ వారి పుణ్యమాని మందిరం దగ్గర కొన్ని ఇరుకు ఇరుకు వీధులన్నీ విశాలమయ్యాయి. భక్తులు గంగానదిలో స్నానం చేసి సరాసరి విశ్వనాధుని దర్శనం చేసుకోవచ్చు. అక్కడి మందిరంలో పండిట్స్ తో బాటు భద్రతా సిబ్బంది కూడా గణపతి శాస్త్రికి పరిచయం అయినవాళ్లే. శాస్త్రికి క్యూ లతో పనిలేదు. సరాసరి అంతరాలయంలోకి వెళ్లి, అక్కడే ఎంతసేపైనా ధ్యానం చేసుకోగలడు. రాగిచెంబులో తెచ్చిన గంగాజలంతో విశ్వేశ్వరునికి అభిషేకం చేసుకున్నాడు.
బయటకు వచ్చి అన్నపూర్ణని, ఆ ప్రాంగణంలో భాస్కర రాయులు వారు ప్రతిష్టించిన శ్రీ చక్ర లింగాన్ని, విశాలాక్షిని దర్శనం చేసుకున్నాడు. గదోలియా చౌక్ లో పనులు చూసుకొని, జంగంబాడి మఠ్, పాండే హవేలీ, సైకిల్ స్వామి సత్రం మీదుగా గదికి బయలుదేరాడు.
ఇరుకు సందుల్లో తాపీగా తిరుగుతున్న ఆవుల్ని, భయపెట్టే కుక్కల్ని తప్పించుకుంటూ, రుద్ర జపం చేసుకొంటూ నడవడం శాస్త్రి ప్రతిభ.
'ఈ దారుల్లో ఆవులు మనుష్యుల్ని పొడవవు. ఆలయం మీదనుంచి గ్రద్దలు ఎగరవు. బల్లులు అరవవు. శవాలు వాసన పట్టవు. ఇంతకంటే గొప్ప పుణ్యక్షేత్రం ప్రపంచంలో ఉందా? ' అనుకున్నాడు శాస్త్రి.
"అయ్యా! విశ్వనాధుని గుడికి ఎలా వెళ్ళాలి?" అన్నారు ఎవరో. కాశీలో చాలామంది తెలుగు మాట్లాడుతుంటారు.
ప్రక్కకు చూసాడు శాస్త్రి. ఓ అరవయ్యేళ్ళ పైబడిన పెద్దాయన కుటుంబంతో నిలబడి ఉన్నాడు.
"శివ శివ అనుకుంటూ వెళ్ళండి. లేకపోతే ఓం నమశ్శివాయ అనుకుంటూ వెళ్ళండి" అన్నాడు.
"అది కాదు స్వామీ! మందిరానికి దారెటని" అన్నాడు ఆ పెద్దాయన.
"ఎక్కడనుంచి వచ్చారు? ఎక్కడ దిగారు?" అన్నాడు శాస్త్రి.
"రాజమండ్రి నుంచి వచ్చామండి. ఎక్కడా ఆశ్రమాలు ఖాళీ లేవండి. గంగలో మునిగి బట్టలు మార్చుకున్నాం" అన్నాడు ఆయన.
"సరే! ఒక పనిచేయండి. ఇక్కడికి దగ్గరలోనే మా ఇల్లు. అక్కడ మీరు మీ సామాన్లు పెట్టుకుని విశ్రాంతి తీసుకోవచ్చు. అదిగో అలా తిన్నగా వెళ్లి ఎడమప్రక్కకు తిరిగితే విశ్వనాథుని ఆలయం. నాకూడా రండి" అని వాళ్ళ సమాధానం కోసం చూడకుండా తన ఇంటికేసి దారితీశాడు. వాళ్ళు ఆనందంగా శాస్త్రిని అనుసరించారు.
"ఇదిగో ఇదే విశ్వనాధుని మందిరం... పది నిమిషాలు నడవ గలిగితే మా ఇల్లు." ఆన్నాడు శాస్త్రి.
"అయ్యా! తమరు పుణ్యాత్ములు. నా పేరు రామనాధం. రిటైర్డ్ స్కూల్ టీచర్ని. ఈమె నా భార్య వైదేహి. వీడు నా కొడుకు రవి. వాడి భార్య రేవతి. వీళ్ళు నా మనవలు" అని కుటుంబ సభ్యులందరిని పరిచయం చేశాడు.
శాస్త్రి తన ఇల్లు చూపిస్తూ,
"నాదో నాలుగు గదుల చిన్న ఇల్లు. మీకు నచ్చితే ఆ గదిలో మీ సామాన్లు పెట్టుకుని గుడులన్నీ తిరిగి రావొచ్చు. మీ గదికి తాళం వేసుకుని వెళ్ళిరండి" అన్నాడు గది చూపించి శాస్త్రి. అప్పుడే మిగిలిన రెండు రూముల్లో వసతి దొరకని తెలుగు వాళ్ళ కుటుంబాలు ఖాళీ చేసి వెళ్లాయి.
"అయ్యా! మేము ఓ నాలుగు రోజులుండి ఇక్కడ చుట్టుప్రక్కల ఆలయాలు అన్నీ చూసుకుంటాము. రోజుకు ఎంత ఇవ్వాలో చెప్పండి" అన్నాడు రామనాధం.
"నేను భక్తులకు సేవ చెయ్యడం భగవంతునికి సేవ చెయ్యడం గా భావిస్తాను. బంధుమిత్రులకు, వసతి దొరకని వారికి నా గదులు ఉచితంగానే ఇస్తాను. ఇక్కడ స్టౌవ్ ,పాత్రలు ఉన్నాయి. మీ పిల్లలకు పాలు కాచి ఇచ్చుకోవచ్చు. మీరు ఖాళీ చేసి వెళ్లే టప్పుడు తలుపుకు గొన్నెం పెట్టి వెళ్ళిపోవచ్చు. భోజనానికి ఇక్కడ సత్రాలు, ఆశ్రమాలు చాలా ఉన్నాయి. అందరూ ఉచితంగానే భోజనం పెడతారు.మీరు ఇవ్వలనుకున్న డబ్బులు ఎవరైనా అవసరం ఉన్నవాళ్లకు ఇవ్వండి" అన్నాడు శాస్త్రి. రామనాధం కుటుంబం వారికి చూపించిన గదికి వెళ్ళిపోయారు. తన గదికి వెళ్లి మళ్ళీ స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని, ప్రాణాయామం, ధ్యానం చేసి, యోగాసనాలు వేసి పది నిముషాలు మౌనంగా కూర్చున్నాడు.
కరోనా సమయంలో భార్య పోవడంతో శాస్త్రి ఒంటరి వాడయ్యిపోయాడు. 'అందరూ పోయేవాళ్ళమే...కాస్త ముందు వెనుక ...అదృష్టవంతురాలు కనుకనే అనసూయ కాశీలో పోయింది' అని సర్ధిచెప్పుకున్నాడు. కాశీ వచ్చిన వారికి సేవ చెయ్యడం అంటే విశ్వనాథుడికి సేవ చెయ్యడం లాగే భావిస్తాడు శాస్త్రి.
రామనాథం వాళ్ళు సామాన్లు గదిలో పెట్టుకుని తాళం వేసుకుని గుడికి వెళ్ళిపోయారు.
ఇంతలో సెల్ మోగింది. చూస్తే
బెంగళూర్ నుంచి పెద్దకొడుకు విశ్వనాథ్. శాస్త్రి సెల్ ఆన్ చేసాడు.
"ఎలా ఉన్నారు నాన్నా?" అన్నాడు విశ్వనాథ్.
"భేషుగ్గా ఉన్నాను. చెప్పు" అన్నాడు శాస్త్రి.
"మీకు చెప్పాను కదా నాన్నా కొత్తగా విల్లా తీసుకుంటున్నాను అని. . రేపు పదిహేనో తారీఖు గృహప్రవేశం... నాలుగు రోజులుండి వెళ్ళండి. రాను పోను ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తాను" అన్నాడు.
"ఈ భవబంధాలు తెంచుకుంటేనేగానీ నేను అనుకున్న గమ్యం చేరలేనురా.
రిటైర్ అయ్యాక ఐదేళ్లు ప్రతీ ఏడాదీ అమలాపురం నుంచి కాశీ వచ్చేవాడ్ని .పదేళ్లు క్రితం ఇల్లు కొన్నప్పటినుంచి మీ అమ్మ పోయినా ఎక్కడికీ వెళ్లకుండా ఇక్కడే ఉంటున్నాను. ఎందుకని? నా ఆఖరి శ్వాస ఇక్కడే తీసుకోవాలని, నా కాష్టం ఇక్కడే కాలాలని. నువ్వు బెంగళూరు నుంచి , చిన్నాడు అమెరికా నుంచి ఫోన్ చేస్తారు. అప్పుడు నా మనసు అటే లాగుతుంది. మీరు జీవితాల్లో బాగా స్థిరపడ్డారు. నాకా పెన్షన్ వస్తుంది. నా గురించి ఆలోచించోద్దురా . అస్తమానూ ఫోన్లు చేసి నా ప్రస్థానాన్కి ఆటంకం కలిగించకండి రా!... రావడానికి కుదరదు." అన్నాడు శాస్త్రి.
"అయ్యో! అదేమిటి నాన్నా! కన్నబిడ్డ శుభమాని గృహప్రవేశానికి రమ్మని పిలుస్తే కుదరదంటారేమిటి? ఈ ఒక్కసారికి నామాట వినండి. రాకపోతే మేం అంతా బాధ పడతాం. మీరు రాకపోతే అసలు గృహా ప్రవేశమే చేసుకోము." అన్నాడు బాధగా.
"ప్రతీదానికి ఈ ఏడుపొకటి. సరే! రెండు రోజులు కంటే ఉండటానికి కుదరదు. ఇదే ఆఖరిసారి. సరేనా?" అన్నాడు శాస్త్రి అయిష్టంగానే.
"అలాగే..థాంక్యూ! నాన్నా" అన్నాడు విశ్వనాథ్ ఆనందంగా. సెల్ కట్ చేసాడు.
కాఫీ తాగుదామని చూసాడు.పాలు లేవు. చిన్న గ్లాసుడు బియ్యం సింగిల్ బర్నర్ స్టవ్ మీద పడేశాడు. రాత్రి మిగిలిన మజ్జిగ ఉంటే వేసుకుని తిన్నాడు. ఏది ఉంటే అది తినడం, లేక పోతే పస్తుండటం, మరీ ఆకలనిపిస్తే ఏ ఆంధ్ర ఆశ్రమానికో, గాయత్రి సత్రానికో, కరివెన వారి సత్రానికో వెళ్ళడం, అక్కడ భోజనం అయ్యిందనిపించడం, అక్కడ సత్రంవారికి, యాత్రీకులకు ఏదో ఒక సేవ చెయ్యడం అలవాటయిపోయింది.
మళ్ళీ సెల్ మ్రోగింది.
చూస్తే అమలాపురం నుంచి చిరకాల మిత్రుడు రామ్మూర్తి. సెల్ ఆన్ చేసాడు.
"ఒరేయ్! శాస్త్రి! నువ్వు అస్తమానూ ఫోన్ చేసి కాశీ రా, గంగలో మునుగు, విశ్వేశ్వరుని దర్శనం చేసుకో అని చెబుతున్నావు కదా! నా భార్య కూడా వెళదామండి అని గొడవ చేస్తోంది. రేపు పన్నెండో తారీఖు ఉదయం కాశీ వస్తున్నాం...మాకు ఆశ్రమంలో వసతి ఏర్పాట్లు చెయ్యరా". అన్నాడు రామ్మూర్తి..
"అలాగే. ఎంతమంది వస్తున్నారురా?"
"నేను, నాభార్య, కొడుకు, కోడలు" ఆన్నాడు రామ్మూర్తి.
"ఏనాడూ గుడికి వెళ్ళనివాడివి, భగవన్నామం జపించని వాడివి, శుద్ధబద్దకస్తుడువి. ఇంటిపని, బయటపని మీ ఇల్లాలే చేస్తుందికదా! ఇన్నాళ్ళకు విశ్వనాధుని దర్శనం చేసుకోవాలని నీకు బుద్దిపుట్టింది. శుభం. తప్పకుండా రండి..నేను చూసుకుంటా" అన్నాడు శాస్త్రి.
"థాంక్స్ రా!" అన్నాడు రామ్మూర్తి.
తర్వాత నెమ్మదిగా ఆంధ్రాశ్రమం ఆఫీసులోకి వెళ్ళాడు. అక్కడ యాత్రీకులకు ఆశ్రమం తరుపున సేవ చేస్తూ గడిపాడు.
సాయంత్రం ఆరు అయ్యింది దశాశ్వమేధ ఘాట్ కు బయల్దేరాడు. గంగా హారతికి సమయం.
కనుల విందుగా జరిగే హారతుల్ని చూడడానికి వచ్చిన జనాలు మెట్ల మీద కూర్చొన్నారు. మైకులో శ్రావ్యంగా భక్తి సంగీతం సాగుతోంది. కొంతమంది విదేశీయులతో బాటు మిగతా యాత్రీకులు కూడా ఆ సుందర దృశ్యాలని తమ కెమెరాలలో భద్రపరుచు కొంటున్నారు. అంతలో పట్టు పంచెలు కట్టుకున్న యువకులు హారతులు సమర్పించడానికి సిద్ధమవుతున్నారు. నదిలో అందమైన పడవల మీద జనం కూర్చుని, తమ కనుల ముందు జరుగుతున్న గంగా హారతుల్ని భక్తి శ్రద్ధలతో గమనిస్తున్నారు.
ఎప్పుడూ కూర్చునే మండపం లోనే కూర్చున్నాడు శాస్త్రి. హారతి ప్రారంభమయ్యింది. రోజూ చూసే హారతులయినా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది శాస్త్రికి.
హారతి అవగానే ఆశ్రమానికి వచ్చాడు.
గిన్నెలు ఖాళీగా ఉన్నాయి.
రెండు అరటిపళ్ళు తిని శివపురాణం తీశాడు. పది గంటలు దాకా పారాయణం చేసి నడుము వాల్చాడు. శివనామ స్మరణ చేసుకుంటూ కళ్ళు మూసుకున్నాడు.
రోజులు గంగా ప్రవాహంలా నెమ్మదిగా గడుస్తున్నాయి.
ఉదయాన్నే ఎవరో తలుపు కొడుతూంటే తలుపు తీసాడు. ఎదురుగా రామ్మూర్తి, భార్య, కొడుకు, కోడలు చిరునవ్వుతో నిలబడ్డారు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది రామ్మూర్తి పన్నెండో తారీఖు వస్తానన్నాడని.
"రండి...రండి " అంటూ ఆహ్వానించాడు..
అప్పటికే శాస్త్రి గంగాస్నానం చేసి, మణి కర్ణిక ఘాట్లో కాలుతున్న కాష్టాల్ని తృప్తిగా చూసి, విశ్వేశ్వరునికి అభిషేకం చేసుకు వచ్చి సంధ్య వార్చుకోడం ముగించాడు.
రామ్మూర్తిని చూడగానే "రా...రా ..రామ్మూర్తి! ఎన్నాళ్ళకెన్నాళ్ళకు" అంటూ ఆహ్వానించాడు .
"మీకుఇంట్లోనే రెండు రూములు ఏర్పాటు చేసాను. కాలకృత్యాలు తీర్చుకుని రండి. గంగా స్నానం చేసి, విశ్వేశ్వరుని దర్శించుకుందురు గానీ "అన్నాడు శాస్త్రి.
వారికి గదులు చూపించాడు.
"కార్తీకమాసంలో కాశీ వచ్చారు. మంచి పని చేసారు, త్వరగా తయారై రండి" అన్నాడు.
ఓ అరగంటలో అందరూ వచ్చారు. అందర్నీ కేదార్ ఘాట్ కు తీసుకెళ్ళి, సంకల్పం చెప్పించి స్నానాలు చేయించాడు.
"ఏం చలిరా నాయనా! వణికిపోతున్నాను. నా వల్ల కాదు బాబోయ్ అంటున్నా మా అన్నపూర్ణ బలవంతంగా లాక్కొచ్చింది" అన్నాడు రామ్మూర్తి గజగజ వణుకుతూ.
"ఈ మాత్రం చలికే ఇంత హడావిడి చేస్తున్నావ్. ఈ చలిని గులాబ్ సర్దీ అంటారు, ఇక్కడ వాళ్ళు. జనవరి నెలలో చూడాలి, చలికి కాలు బయట పెట్టలేం. ఐనా పుణ్యం ఊరికే రాదుగా. పుణ్యం కావాలంటే ఆమాత్రం కష్టపడక తప్పదు." అన్నాడు శాస్త్రి.
ఘాట్ల మీద నడిపిస్తూ, ఆ విశేషాలు వర్ణిస్తూ విశ్వనాధుని దర్శనం చేయించాడు. ఆతర్వాత సహస్ర లింగేశ్వరుడు, మనోకామేశ్వరుడు, ధనేశ్వరుడు, ప్రీతికేశ్వరుడు, సాక్షి గణపతి, ఢుండి గణపతి,అన్నపూర్ణ, విశాలాక్షిల దర్శనం చేయించాడు. "ఇళ్ళల్లోను, షాపుల్లోనూ గుళ్ళు కట్టుకోవడమేమిటిరా? వీళ్ళ భక్తి పాడుగాను!" అన్నాడు రామ్మూర్తి.
"కాదురా. ఒకనాటి గుళ్లనే, షాపులుగా, ఇళ్లుగా మార్చేసారు. ఏం చెయ్యగలం?" అన్నాడు శాస్త్రి.
రామ్మూర్తి కి చాలా అలసటగా ఉంది. భారీకాయంతో నడవలేక పోతున్నాడు. ఆతని భార్యకి మాత్రం ఇంకా చూడాలని ఉంది. ఉత్సాహంగా శాస్త్రి ముందుకు సాగుతూ, మంగళ గౌరి, మాయుఖాదిత్యుడు బిందుమాధవుడు,
కాలభైరవుడు, దండపాణి, కృత్తి వాసేశ్వరుని దర్శనాలు చేయించాడు.
రామ్మూర్తికి కాఫీ చుక్క గొంతులో పడకపోవడంతో చుక్కలు కనిపిస్తున్నాయి. అతగాడు దృష్టి అంతా కాఫీ మీదే ఉండి చిరాకుగా ఉంది.
"ఈ ఊరేమిటిరా శాస్త్రి! ఈ ఇరుకిరుకు సందులు గొందులు, వాటిల్లో అడ్డంగా పడుకున్న కుక్కలు, తాపీగా సాగే ఆవులు వాటి మలమూత్రాలు, దుర్గంధం... మోటార్ సైకిళ్ళ విన్యాసాలు, కిక్కిరిసిన జనం... వాళ్ళ జరదాలు, కిళ్ళిల కంపు...అబ్బబ్బ..ఎలా ఉంటున్నావురా బాబూ? దేవుడు కాశీలోనే గానీ, కూచిమంచి అగ్రహారంలో లేడా? ఆ పండిట్లు ఏమిటిరా? వాళ్ళ దౌర్జన్యం ఏమిటి? వాళ్ళ చెయ్యి తడిపితే కానీ విశ్వనాధుని దర్శించు కొనివ్వరా?" అన్నాడు రామ్మూర్తి అసహనంగా.
"నువ్వు కాశీ యాత్ర కు వచ్చావు. విహార యాత్రకు కాదు. ఇది మహోన్నతమైన ఆధ్యాత్మిక కేంద్రం..అందమైన ప్రదేశాలు చూడాలంటే కాశ్మీర్ కు వెళ్లొచ్చు. జన్మ సార్థకం కావాలంటే కాశీకే రావాలి. దీన్ని మహా స్మశానం అంటారు. నువ్వు చెప్పే ఈ అసౌకర్యాలన్ని మన భక్తిని, సహనాన్ని పరీక్షించడానికి విశ్వనాథుడు పెట్టే పరీక్షలు." అన్నాడు శాస్త్రి.
దర్శనాలయ్యి ఆశ్రమానికి వచ్చేటప్పటికి మధ్యాహ్నం రెండు అయ్యింది.
"కాఫీ" అన్నాడు రామ్మూర్తి.
"ఇక భోజనాలే. ఆంధ్రా ఆశ్రమంలో భోజనం చాలా బాగుంటుంది. భోజనాలు అయ్యాక విశ్రాంతి తీసుకొండి. సాయంత్రం ఆరుగంటలకు హారతికి వెళ్దాం" అని భోజనాలకు తీసుకెళ్లాడు.
తను కూడా విశ్రాంతి తీసుకుని సాయంత్రం దశాశ్వమేధ ఘాట్ కు తీసుకెళ్ళి హారతి చూపించాడు. రామ్మూర్తి కు ఈ దర్శనాలు, హారతులు మీద ఆసక్తి లేదు. ఎక్కడ మంచి భోజనం దొరుకుతుందా, ఎక్కడ సుఖంగా కునుకు తీయవచ్చు అన్నదానిమీదే ధ్యాస.
రెండో రోజు
మనిషిని తోడు ఇచ్చి, చింతామణి గణపతి, సంకట మోచన్ హనుమాన్,దుర్గా దేవాలయం, కాశీరాజు కోట, అస్సీ ఘాట్, బెనారస్ విశ్వవిద్యాలయం చూసే ఏర్పాటు చేశాడు.
మూడోరోజు శాస్త్రి కారు ఏర్పాటు చేశాడు.
"ఈ కార్ డ్రైవర్ జగన్నాథ్ మన కోనసీమ వాడే. అక్కడ ఎక్కడ ఏం చెయ్యాలి, ఎక్కడ పిండప్రదానం చెయ్యాలో అన్నీ అతనే చూపిస్తాడు. రేపు త్రివేణి సంగమం వెళ్లి రండి. ఎల్లుండి గయలో ఎక్కడ ఏది చెయ్యాలో అన్నీ చూపిస్తాడు. గయలో పిండ ప్రదానం చేస్తే పితృ దేవతలు తరిస్తారు. మన జన్మ కూడా ధన్యమే అంటారు. నేను రేపు మా పెద్దాడి గృహప్రవేశానికి బెంగళూరు వెళ్లి రెండు రోజుల్లో వచ్చేస్తాను.మీరు అన్నీ చూడటానికి మూడు నాలుగు రోజులు పడుతుంది. ఈలోపు నేను వచ్చేస్తాను" అన్నాడు శాస్త్రి రామ్మూర్తి భుజం మీద చెయ్యేసి.
"నువ్వున్నావు కాబట్టి వచ్చానురా శాస్త్రి! లేకపోతే గుమ్మం దిగే ప్రసక్తే లేదు. నీకు తెలుసుగా, ఇంటి ప్రక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికే వెళ్లను. అవునూ గాయత్రి సత్రంలో భోజనాలు చాలా రుచిగా ఉంటాయిని విన్నాను..." అన్నాడు రామ్మూర్తి బొజ్జ చేత్తో రాసుకుంటూ.
"నీకు భుక్తి మీద ఉన్న రక్తిలో పదోవంతు భక్తి మీద ఉంటే బాగుండేది రా! సరే అలాగే కానీయ్" అన్నాడు శాస్త్రి.
రామ్మూర్తి కుటుంబం కార్లో కూర్చోగానే కారు బయల్దేరి, మలుపు తిరిగింది.
ఇంతలో రామనాధం కుటుంబంతో వచ్చాడు. కుటుంబం అంతా శాస్త్రికి దండం పెట్టి వెళ్ళిపోయారు.
తన నివాసానికి వచ్చి పూజాకార్యక్రమాలు ముగించుకొని, ఫలహారం తిని, ఆశ్రమానికి వచ్చి యాత్రికుల సేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాడు.
మర్నాడు ఉదయమే సెల్ మోగింది. కొడుకు జగన్నాథ్.
ఆన్ చేసి "చెప్ప రా!" అన్నాడు.
"ఈరోజు సాయంత్రం ఫ్లయిట్ కు టికెట్ పంపించాను. అందింది కదా! మళ్ళీ మీకు పదహారో తారీఖుకు కాశీకి టికెట్ బుక్ చేసాను. ఎట్టిపరిస్థితుల్లో మీరు రావాలి నాన్నా!" అన్నాడు విశ్వనాథ్.
"అలాగేలేరా! వస్తున్న్నాను" అన్నాడు అయిష్టంగానే.
సెల్ డిస్ కనెక్ట్ అయ్యింది.
ఆ సాయంత్రం ఫ్లైట్ కు బెంగళూరు బయల్దేరాడు. విశ్వనాథ్ ఎయిర్ పోర్ట్ కు కార్ లో వచ్చి తండ్రిని రిసీవ్ చేసుకున్నాడు.
ఆరాత్రి కొడుకు, కోడలు మనవడితో సంతోషంగా గడిపాడు. మరునాడు గృహప్రవేశానికి బంధుమిత్రులందరూ వచ్చారు.
అందరూ శాస్త్రి అదృష్టాన్ని, ఆధ్యాత్మిక చింతననూ పొగిడేవారే. విశ్వనాథ్ కొన్న విల్లా చాలా ఖరీదైనది. కొడుకుతో అటువంటి ఇంటిలో ఉండే అవకాశం వదులుకున్నందుకు కొందరు శాస్త్రి మీద జాలి పడ్డారు. గృహప్రవేశానికి వచ్చినవాళ్ళందరితో మంచి హడావుడిగా ఉంది. మంత్రాలతో, మంగళ వాయిద్యాలతో, తోరణాలతో, పట్టుచీరలతో ఇల్లు కళకళలాడుతోంది.
ఇంతలో శాస్త్రి సెల్ మోగింది. చూస్తే డ్రైవర్ జగన్నాథ్ కాల్ చేస్తున్నాడు. ప్రక్కకు వెళ్లి ఆన్ చేశాడు.
"చెప్పు జగన్నాథ్" అన్నాడు.
"సార్! ఘోరం జరిగిపోయింది సార్! మీ ఫ్రెండ్ రామ్మూర్తి గారిని గయలో విష్ణుపాదాల దగ్గర పిండ ప్రదానం చేయించి, కాశీలో కేదారఖండం తీసుకురాగానే హార్ట్ ఎటాక్ వచ్చి ప్రాణం వదిలేశారు సార్! బాడీని మణికర్ణికా ఘాట్ కు తీసుకొచ్చాం సర్!" అన్నాడు జగన్నాథ్. శాస్త్రి నిర్ఘాంతపోయాడు.స్థాణువులా నిలబడిపోయాడు.
తేరుకుని " అయ్యో! నేను రేపు వస్తున్నాను. నువ్వు దగ్గరుండి కార్యక్రమాలన్నీ సజావుగా చేయించు" అని సెల్ కట్ చేశాడు. టైం చూస్తే మధ్యాహ్నం రెండు అయ్యింది. ఎవరిహడావుడిలో వాళ్ళు ఉన్నారు. కొందరు భోజనాలు చేస్తున్నారు.
శుభం జరుగుతున్న ఈ ఇంట్లో ఎవరికీ ఈ వార్త చెప్పడానికి లేదు. వెంటనే బాత్రూంలో దూరి తల స్నానం చేసి వచ్చాడు.
"ఇదేమిటి నాన్నా! మిట్టమధ్యాహ్నం వేళ ఈ స్నానం ఏమిటి ?" అన్నాడు జగన్నాథ్ .
"నాకు కాశీలో అలవాటు రా! " అన్నాడు.
ఇంతలో కొడుకు ఎవరో పిలిస్తే వెళ్ళిపోయాడు.
శాస్త్రి ఆలోచనలో పడ్డారు.
'ఎంత అదృష్టవంతుడు రామ్మూర్తి! భాద్యతలు తీరిపోయాయి. ఒక్కనాడు గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకోని వాడు కాశీలో, అందులోనూ భైరవ యాతనలకు తావు లేని
కేదార ఖండంలో ఆఖరిశ్వాస తీసుకున్నాడంటే విశ్వనాథుని దయలేకుండా జరుగుతుందా? పుణ్యాత్ములు పాపాత్ములని మనం ఏవో లెక్కలు వేస్తాం. కానీ ఆ విశ్వేశ్వరుని లెక్కలు వేరే ఉంటాయి. ఎవరికి ఏది, ఎప్పుడు ఇవ్వాలో లిఖించేది ఆయనే ' ఆనుకున్నాడు శాస్త్రి.
అతగాడికి బాధపడాలో, సంతోషించాలో అర్థం కావడం లేదు. 'అది పూర్వజన్మ సుకృతం. సంచిత ప్రారబ్ధ కర్మల ఫలితం.ఈ జన్మలో కాకపోతే గత జన్మలో చేసుకున్న పుణ్యం.' అనుకున్నాడు. సాయంత్రానికి వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు. శాస్త్రి కుటుంబసభ్యులు మాత్రమే మిగిలారు..
"రేపు ఉదయమే కదా ఫ్లయిట్. బట్టలు, మందులు, పూజాసామాన్లు అన్నీ సర్డుకోవడం అయిపోయింది. పెందరాళే పడుకోవాలి. ప్రొద్దున్నే లేవాలి కదా !"అన్నాడు శాస్త్రి.
"సరే! నాన్నా! పడుకోండి. తెల్లవారు ఝామునే లేపుతాను" అన్నాడు విశ్వనాథ్.
శాస్త్రికి మనసంతా వికలం అయిపోయింది. పడుకున్నాడన్న మాటేగాని, చిన్ననాటి మిత్రుడు అలా అకస్మాత్తుగా శివైక్యం చెందడాన్ని జీర్ణించుకోలేక పోతున్నాడు. ఏ అర్ధరాత్రికో నిద్రలోకి జారుకున్నాడు. రోజు బ్రహ్మమూహూర్తంలో లేచే శాస్త్రి ఇంకా లేవలేదు. విశ్వనాథ్ రెడీ అయ్యి టైం చూసుకున్నాడు. ఫ్లయిట్ కి టైం అవుతోంది. లేపుదామని తండ్రి గదిలోకి వచ్చాడు.
శాస్త్రి ప్రశాంతంగా పడుకుని ఉన్నాడు.
"ప్రయాణానికి టైం అవుతోంది. లేవండి నాన్నా!" అంటూ శాస్త్రి వంటిమీద చెయ్యివేసాడు. చల్లగా మంచులా తగిలింది తండ్రి శరీరం. జరిగింది నమ్మలేక పోయాడు. తిరిగి రానిలోకాలకు తండ్రి ప్రయాణం ఎప్పుడో ప్రారంభమయ్యిందని విశ్వనాథ్ కు తెలియగానే "అయ్యో! నాన్నా" అని గట్టిగా అరిచాడు. ఆ కేకకి విశాలాక్షి పరిగెత్తుకొచ్చింది. పరిస్థితి అర్థమయి ఒక్క క్షణం మౌనంగా ఉంది.
" బాధ పడకండి. దీనినే లాలటలిఖితం అంటారేమో! విశ్వనాథుని లిఖితం...అదృశ్యం...అగోచరం...ఆఖరిక్షణం కన్నకొడుకు దగ్గర తనువు చాలించారు. బంధుమిత్రులను కళ్ళారా చూసారు. మనవడితో హాయిగా ఆడుకున్నారు. పదేళ్ళుగా విశ్వేశ్వరుని సేవ ఫలితంగా అనాయాసమరణం పొందారు. కాశీలో మరణిస్తేనే పుణ్యం ప్రాప్తించదు. పుణ్యం చేసుకున్నవాళ్లు ఎక్కడ మరణిస్తే అదే కాశీ. మృత్యుంజయమంత్రం లో చెప్పినట్లు దోసపండు ముచిక నుంచి విడిపోయినంత సులభంగా ఆయన శరీరాన్ని విడిచిపెట్టారు. ఆయన ఆత్మకు తప్పక సద్గతులు కలుగుతాయి.ఆయన ధన్యులు. అమెరికాలో ఉన్న మీ తమ్ముడు హరనాథ్ కు తెలియజేయండి. సంతోషంగా ఆయన అంత్యక్రియలు చేసి, చితాభస్మం కాశీతీసుకెళ్లి గంగ లో నిమజ్జనం చెయ్యండి" అంది విశాలాక్షి కళ్ళు తుడుచుకుంటూ.
విశ్వనాథ్ తేరుకుని బంధుమిత్రులందరికీ ఫోన్లు చెయ్యడం మొదలుపెట్టాడు.


...........అయిపోయింది......