అభిమానం

వెలుగు దర్వాజ • 10 Jan 2021 • 👁 9 views
*****
*అభిమానం*
==========
(సామాజిక కథ)

రచన
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్

(నేను రాసిన కథలలో నాకు చాలా నచ్చిన ఈ కథ 'వెలుగు దినపత్రిక' ఆదివారం అనుబంధం, 'దర్వాజ' లో ది. 10.01.2021న ప్రచురితమైనది)

*****

"నరశింహం గారూ, మీ అమ్మగారికి ఆఖరి క్షణాలు దగ్గర పడ్డాయి. వైద్యానికి శరీరం సహకరించడం లేదు. మహా అయితే ఓ నాలుగైదు గంటలు ఉంటుంది ప్రాణం, అంతే. మీ తమ్ముడు, చెల్లాయిల కుటుంబాలకి కబురు పెట్టండి. ఏదైనా అవసరమైతే నాకు కబురు పెట్టండి" అంటూ మెడికల్ కిట్ తీసుకుని వెళ్ళడానికి లేచారు ఫామిలీ డాక్టర్.

బయటకు వెళ్ళబోతూ, మంచం దగ్గర బేల మొహంతో నిలబడ్డ ఇంటి పనిమనిషి వైపు చూసి, "చూడు గంగా, సుభద్రమ్మ గారిని ఈ ఆరునెలలూ కంటికి రెప్పలా చూసు కున్నావు. ఇక ఈ నాలుగు గంటలూ కూడా శ్రద్ధగా చూసుకుని మాట దక్కించుకో" అంటూ బయటకు నడిచారు ఆ కుటుంబానికి సన్నిహితులైన ఆ డాక్టర్.

మంచం మీద అచేతనంగా ఉన్న సుభద్రను చూడగానే, 'ఎలాంటి అమ్మగారు ఎలా అయిపోయారో ? ' అనుకుంటూ ఓ సారి గతాన్ని నెమరేసుకుంది గంగ.

***** ***** ***** *****

స్కూలు టీచర్ గా పనిచేస్తున్న రాఘవరావు,
సుభద్ర దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. పైసా పైసా కూడబెట్టిన సొమ్ముకు, తన పుట్టింటి వారిచ్చిన కొంత మొత్తం జతచేసి, తన భర్త చేత ఈ ఇల్లు కట్టించింది సుభద్రమ్మ.

తన తల్లి చంద్రమ్మ ఈ ఇంట్లోనే పనిచేసేది. తల్లితో పాటు తను కూడా వచ్చేది, పనిలో సాయం చేయడానికి. అది చూసిన మేష్టారు తన తల్లిని కోప్పడి తమ పిల్లలతో పాటు తనని కూడా స్కూల్లో జాయిన్ చేసి, ప్రతీ సంవత్సరం ఫీజులు కట్టి, పుస్తకాలు కూడా కొని ఇచ్చేవారు. ఇక సుభద్రమ్మ గారయితే తనను సొంత పిల్లలా చూసుకొనేది. తమ పిల్లలతో పాటు తనకు కూడా పండగలకు కొత్త బట్టలు కొనేది.

"ఇదిగో గంగా, ఓ కన్ను వేయ్ సుమా, ముసలావిడ మీద" అన్న పెద్ద కోడలు పిలుపుతో ఈ లోకం లోకి వచ్చింది గంగ.

"పర్వాలేదమ్మా, నేనుంటానుగా ! మీరెళ్ళి పనిచేసుకోండి" అని పంపించి తిరిగి గతంలోకి జారిపోయింది.

అయితే, తనకు చదువు సరిగ్గా అబ్బక పోవడమూ మరియు పై చదువులకు పొరుగూరు వెళ్ళవలసి రావడంతోనూ తన చదువు ఏడవ తరగతి తోనే ఆగిపోయింది.

పిల్లల చదువుల కోసం రాఘవ గారు ఈ ఇల్లు అద్దెకు ఇచ్చేసి, దగ్గరలో ఉన్న టౌనుకు మకాం మార్చేసారు. అక్కడే పిల్లల చదువులు, అమ్మాయిల వివాహాలు కూడా అయిపోయాయి. ఆ సమయంలోనే తనకు కూడా తన మేనమామనిచ్చి పెళ్లి జరిపించేసారు తన తల్లిదండ్రులు.

హాయిగా సాగుతున్న ఆ సంసారంలో, రాఘవ గారి మరణం కొంత ఒడిదుడుకులకు గురిచేసింది. సర్వీసులో ఉండగానే మరణించడం వలన అంతవరకూ ఏదో కాన్వెంటులో పనిచేస్తున్న పెద్ద అబ్బాయి నరశింహంకు తండ్రి ఉద్యోగం ఇచ్చారు వేరే ఊరులో. పిల్లలు నలుగురు తలోచోట ఉండడంతో, ఇక అప్పటినుంచి, పాపం సుభద్రమ్మ గారి జీవితం మరీ టూరింగ్ జాబు అయిపోయింది. తను ఎంతో ఇష్టపడి కట్టించుకున్న ఈ ఇంట్లో ఉంటానన్నా ఒప్పుకోలేదు పిల్లలు.

"గంగా, అందర్నీ బయలుదేరి వచ్చేయమని ఫోన్ చేసా. నువ్వు మటుకు ఏమాత్రం అనుమానం వచ్చినా కేకవేయ్. వీధి గదిలో ఉంటా" అంటూ లోపలికి వచ్చిన నరశింహం పిలుపుతో ఈ లోకం లోకి వచ్చి,

"పరవాలేదు పెదబాబూ, ఇంకా ఊపిరి ఆడుతోంది. మీ ఏర్పాట్లు మీద మీరు ఉండండి" అని పంపి, మళ్ళీ పాత సంఘటనలు నెమరేసుకోసాగింది.

అనుకోకుండా, రెండు సంవత్సరాల క్రితం నరసింహంబాబుకు ఈ ఊరు బదిలీ అవడంతో, తల్లి కోరిక మేరకు ఈ ఇల్లు ఖాళీ చేయించి తిరిగి ఇంటికి పూర్వ వైభవం తీసుకొచ్చాడు. ఆ రోజు తనకు బాగా గుర్తు.

చాలా సంవత్సరాలు తరువాత సుభద్రమ్మ గారు వచ్చేరని తెలిసి, ఆవిడని చూడడానికి వెళ్ళింది తను. కుశలప్రశ్నల అనంతరం ఎంతో ఉద్వేగంతో

"ఒసే గంగా! నేను ఎక్కడున్నా, చనిపోవడం మటుకు నాకు ఎంతో ఇష్టమైన ఈ ఇంట్లోనే పోవాలని అనుకొనేదాన్నే. భగవంతుడు ఈ విధంగా నా కోరిక తీరుస్తున్నాడు. నాకు ఏదైనా అయ్యి, మంచమెక్కితే మటుకు చివరి వరకు నువ్వే సేవ చెయ్యాలేవ్. ఊరకే కాదులే, ఏదో ఏర్పాటు చేస్తా" అనగానే తను

"ఊరుకోండి అమ్మగారు, అవేం పాడు మాటలు. మీకెప్పుడూ ఆ అవసరం రాదు. అంతేకాదు, మీకు ఏ అవసరమొచ్చినా చెప్పండమ్మా! డబ్బు కోసం కాదు. మీ మీద ఉన్న అభిమానంతో చేస్తా" అని చెప్పింది.

సుభద్రమ్మ ఏ ముహూర్తంలో అలా అందో కానీ సరిగ్గా ఆరు నెలలు తిరక్కుండా అలాగే జరిగింది. ఆవిడకు పక్షవాతం వచ్చి శరీరంలో ఎడమవైపు భాగం చచ్చుబడి పోయింది. అదిగో అప్పటినుండి ఆవిడ మంచానికి అతుక్కుపోయింది. తను ఈ ఇంటికి అంకితమైపోయింది.

ఏదో గురక శబ్దం వినపడడంతో ఉలిక్కిపడి, సుభద్రమ్మ వైపు చూసిన గంగ

"పెదబాబూ గారూ! " అంటూ గట్టిగా అరవడంతో అందరూ పరుగుపెడుతూ వచ్చేరు గదిలోకి. అందరివైపు ఓ సారి ఆనందంగా చూసి, కారుతున్న కన్నీళ్ళతో వీడ్కోలు చెబుతూ తల వాల్చేసింది సుభద్రమ్మ.

***** ***** ***** *****

సుభద్రమ్మ పోయిన రెండవ రోజున ఇంటికి కొన్ని సామాన్లుతో వచ్చిన గంగను,

"ఎందుకు తీసుకొచ్చావ్ ఆ దిక్కుమాలిన మంచం, చమురు పట్టిన ఆ తలగడ, చిరుగులు పడిన ఆ దుప్పటి ? వాటి మీదే కదా ఆ ముసలావిడ పేణాలు పోయింది. ఏం చేసుకుంటావ్ వాటిని ?" గుమ్మంలోనే నిలేసాడు ఆమె భర్త రాజు.

"ఊరుకో మావా ! నువ్వు అన్నట్లు అమ్మగారి ఆఖరి రోజులు వీటి మీదే గడిచేయి. మామూలుగా అయితే ఆ కుటుంబసభ్యులు ఆవిడ జ్ఞాపకంగా వీటిని ప్రాణప్రదంగా చూసుకోవాలి. కానీ ఎందుకో భయపడి ఇలా ఇచ్చేసారు. నేను మటుకు వీటిని అమ్మగారి కానుకగానే దాచుకుంటాను" ఖరాఖండిగా చెప్పింది గంగ.

"ఈ చాకిరీ ఏదో ఇంకో ఇంట్లో చేస్తే, బోలెడు డబ్బులు వచ్చేవి. ఇదో పనికిరాని అరువు చాకిరీ. సరే, ఆ మూల తగలెయ్యి వాటిని. ఆవిడ పెద్ద దినం అయిన తర్వాత ఎవరి కైనా అమ్మేద్దాం"

భర్తతో వాదన చేయలేక, అతను చెప్పినట్టే చేసి, తిరిగి సుభద్రమ్మ ఇంటికి బయలు దేరింది గంగ.

***** ***** ***** *****

ఆ రోజు, సుభద్రమ్మ గారి పెద్ద దినం. వచ్చిన బంధువులు అందరూ వెళ్ళిపోవడంతో ఇల్లు అంతా బోసిపోయింది. ఇంట్లో ప్రాణం పోవడంతో ఇల్లు ఆరు నెలల పాటు ఖాళీ చేసేయాలని నిశ్చయించుకుని, సామాన్లు సర్దుకోవడం ప్రారంభించారు. అంతే కాదు, తరువాత రోజుల్లో ఆ ఇంటిని కూలగొట్టేసి నాలుగు అంతస్థుల అపార్ట్మెంట్ కట్టాలని నిశ్చయించుకున్నారు.

కుటుంబ సభ్యులు నలుగురూ సుభద్రమ్మ కాలం చేసిన గదిలోకి వచ్చి, ఆవిడ ఎంతో ఆప్యాయంగా చూచుకొనే ఓ చిన్న సైజు చెక్క పెట్టి లాంటిది తాళం తీసి తెరిచి చూసారు. ఎందుకంటే అందులోనే ఆవిడ, నెలనెలా వచ్చే పెన్షన్ డబ్బులు అవీ దాచుకునేది. అందులో బోలెడు డబ్బు ఉంటుంది అని ఆశతో పెట్టి తెరిచిన వాళ్ళకి అందులో ఉన్న డబ్బులు చూసి మతిపోయింది.

"ఇదేంట్రా? మరీ బొత్తిగా మూడు వేల రూపాయలు ఉన్నాయి" అడిగింది చిన్న కూతురు.

"పోనీ ఈ ఆరు నెలలు తీసివేసినా, అమ్మ తీసుకున్న నెల వారీ పెన్షన్ డబ్బులే ఎంత లేదన్నా పాతిక వేలు పైనే ఉండాలి కదరా ??" అడిగాడు రెండో కొడుకు.

"అమ్మకి దాన గుణం ఎక్కువ. చూడ్డానికి వచ్చిన చుట్టాలందరికీ తలా కొంత , అలాగే ఆ గంగకి కూడా ఈ రెండేళ్ల కాలంలో ఎంతో కొంతఇచ్చేసి ఉంటుందర్రా!" చెప్పింది పెద్ద కూతురు.

"చుట్టాల సంగతి నాకు తెలియదు కానీ, ఆ గంగకు మటుకు ఈ రెండేళ్ల కాలంలో అమ్మ ఏమీ ఇవ్వలేదు. ఎందుకంటే, ఆ అనుమానం వచ్చే, గంగ వెనకాల నేనో , వదినో ఎప్పుడూ ఉండేవాళ్ళం. అది సరేకానీ, పాపం గంగ, అమ్మకి చేసిన సేవకు మనం అందరం కలిపి ఎంతో కొంత ఇస్తే బావుంటుందేమో, ఆలోచించండి" చెప్పాడు నరశింహం.

"ఇవ్వడానికి డబ్బులు ఎవరిదగ్గర ఉన్నాయిరా ? అయినా ప్రతీ నెలా వెయ్యి రూపాయలు ఇస్తూనే ఉన్నాం కదా ? అది కాకుండా మొన్ననే మంచం కూడా ఇచ్చేసాం కదా ? కాదూ కూడదు అంటే అమ్మ పాత చీరలు నాలుగు ఇస్తాంలే" సమాధాన పరిచింది పెద్ద కూతురు, అక్కడితో ఆ సంభాషణకి ఫుల్ స్టాప్ పెట్టే ఉద్దేశంతో.

***** ***** ***** *****

"వచ్చేవా, మహారాణీ, రా దయచేయి, నీ సేవలకు మెచ్చి సుభద్రమ్మ గారి ఏడు వారాల నగలు నీకు దానం చేసేసారా ?" గుమ్మంలో అడుగు పెట్టిన గంగను వెటకారంగా అడిగాడు ఆమె భర్త రాజు.

"మావా, నేను అమ్మగారి మీద ఉన్న అభిమానం వలన సపర్యలు చేసేను కానీ ఏమీ ఆశించి కాదు. అమ్మగారితోటీ, అలాగే ఆ ఇంటితోటీ కూడా ఈ నాటితో ఋణం తీరిపోయింది" బాధపడుతూ చెప్పింది.

"ఛస్..ఈ కబుర్లు ఎప్పుడూ వినేవే కానీ, కానుకగా ఏమిచ్చారో చెప్పు"

"నేను ఏమీ అడగలేదు. వాళ్ళే అమ్మగారి చీరలు ఓ నాలుగు ఇచ్చారు"

"థూ..నీయవ్వ, కట్టి పడేసిన నాలుగు చీరలు ఇచ్చేరా ? అవేమో గొప్ప పట్టు వస్త్రాలులా తెచ్చుకున్నావా ? మొన్నేమో, ఆవిడ పోయిన మంచం, ఇప్పుడు ఈ వాడిపడేసిన కోకలు. ఈ అవమానం చాలదే నీకు ?" అంటూ కోపంతో ఊగిపోతూ లోపలున్న మంచాన్ని గంగ మీద పడేలా విసిరికొట్టేడు. దెబ్బకి మంచం రెండు ముక్కలయ్యింది. అదే ఊపుతో తలగడ, దుప్పటి కూడా విసిరి కొట్టేడు.

బిత్తరపోయి భయం భయంగా చూస్తున్న గంగకు, రాజు విసిరిన తలగడ, విరిగిపడ్డ మంచం తాలూకు మేకుకు తగిలి, అక్కడ చిరిగిన చోట నాలుగు మడతలు పెట్టిన ఓ ఐదు వందల రూపాయల నోటు కనబడింది.

"మావా, ఇలా చూడు" అంటూ ఆ నోటును చూపించింది. ఆశ్చర్యంతో బిత్తరపోయిన రాజు, ఆ తలగడ పూర్తిగా చింపి, అందులో దూది వేరు చేసి చూస్తే, మడతలు పెట్టిన వంద నోట్లు, ఐదు వందల నోట్లు, కొన్ని రెండు వేల నోట్లు కూడా ప్రత్యక్ష మయ్యాయి. అన్నీ లెక్క పెట్టి "ఇరవై వేలు పైమాటేనే" అన్నాడు, ఆనందంతో.

ఇది చూసిన గంగకు గతంలో ఓ సారి సుభధ్రమ్మ "ఒసే గంగా, నాకు ఈ ఇంట్లోనే చనిపోవాలని ఉందే. నాకు ఏదైనా అయ్యి, మంచమెక్కితే మటుకు చివరి వరకు నువ్వే సేవ చెయ్యాలేవ్, ఊరకే కాదులే,ఏదో ఏర్పాటు చేస్తా." అన్న మాటలు గుర్తుకు వచ్చేయి.

ఏర్పాటు చేయడం అంటే ఇదా ?
అంటే, అమ్మగారుకు ఈ పనికిరాని తలగడ, దుప్పటి తమ పిల్లలు ఎవరూ తీసుకెళ్లరని అవి తనకే ఇస్తారని ముందే తెలుసన్నమాట.

ఏదిఏమైనా, ఆ ఇంటికి అమ్మగారికి ఋణం ఆ విధంగా తీరిపోయింది. తనకీ అమ్మగారికి ఋణం ఈ విధంగా తీరిపోయింది..." ఇలా, పరిపరివిధాల ఆలోచిస్తూ కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్న గంగను, అనునయిస్తూ, ఆత్మీయంగా దగ్గరకు తీసుకున్నాడు రాజు, రెండుగా విరిగిన మంచాన్ని ఒబ్బిడిగా పక్కన పెట్టి.


***** **** సమాప్తం **** *****