మనిషిలోని మరో కోణం (కథ ) బహుమతి పొందిన రచన
రచన: జీడిగుంట నరసింహ మూర్తి
(జూన్ 2023 మాధురి మాస పత్రికలో ప్రచురితం )
వచ్చే ఆ తక్కువ పెన్షన్ లో తనకంటూ ఉన్న కొన్ని ముఖ్య అవసరాలను తీర్చుకుంటూ వస్తున్నాడు రామేశం. ఇంట్లోకి కావలసిన పాలు, కూరలు, ఇతర సరుకులు అతను ఎలాగూ కొడుకుతో ఉంటున్నాడు కాబట్టి వాటికి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు.
బయట నుండి రాగానే ఆ ఇంట్లో తలుపు వెనకాల ఉన్న కొక్కానికి అతని బట్టలు తగిలించడం అతనికి అలవాటు. ఈ మధ్య కాలంలో అతని జేబులోని పర్స్ నుండి అయిదొందల రూపాయల కాయితాలు మాయమవడం రామేశం గ్రహించాడు. భార్యని అడిగితే "నాకు మీ డబ్బులు అవసరం లేదు. నాకు ఏం కావాలన్నా నా కొడుకే ఇస్తాడు. రోజూ ఊరుమీద పడి తిరుగుతూ ఉంటారు కదా. ఎక్కడో పడేసుకుని ఉంటారు. లేకపోతే వంద రూపాయలు అనుకుని అయిదొందలు ఇచ్చేసి ఉంటారు. అన్నీ ఆన్లైన్ లో అబ్బాయి తెప్పించి పడేస్తున్నాడు కదా. మీరింకా బజార్లు చుట్టూ తిరిగి చేసేది ఏముంది ? హాయిగా ఇంట్లో కూర్చుని ఏదైనా రాసుకోవడమో, టీవీ చూసుకోవడంమో చేయొచ్చుకదా" అంటూ చీవాట్లు వేసింది.
" బుద్దిలేకుండా మాట్లాడకు. పొరపాటు జరిగితే ఒకసారి జరుగుతుంది. రోజూ డబ్బులు ఎక్కువిచ్చేయడమో, పోగొట్టుకోవడమో జరుగుతుందా ? నువ్వన్నట్టు అన్నీ నీ కొడుకు ఆన్లైన్ లో తెప్పించి పెడుతున్నాడు అని ఒళ్ళు కదల్చకుండా కూర్చుంటే కొవ్వు పెరిగిపోయి ఏ గుండె నొప్పితోనో పోతాను. క్రమం తప్పకుండా బజారు కెళ్ళి చిన్నా , చితకా ఇంట్లోకి కావలసిన సామానులు తెస్తునాను కాబట్టి కాళ్ళూ, చేతులు ఇంకా వంగుతున్నాయి. నీలాగా కూర్చున్న చోట నుండి కదలక పోతే వచ్చే ప్రమాదాలు నీకు ఇప్పుడు తెలియవు. ఆ పరిస్తితులు వచ్చినప్పుడు నువ్వే బాధపడతావు. సరే కానీ నువ్వు నా గది ఊడిపించే టప్పుడు పనిమనిషి తలుపు వేసుకుని ఎందుకు ఊడుస్తుంది ? తలుపు వెనకాల కొక్కాలకు నా బట్టలు తగిలిస్తానని నీకు తెలుసు కదా. ఏం జరుగుతోందో ఏమిటో ? ఇక నుండి నువ్వు పనిమనిషి పక్కనైనా ఉండు. లేకపోతే ఆ గది వదిలేసి నీకు వీలున్నప్పుడు శుభ్రం చెయ్యి. ఈ రోజుల్లో ఎవరినీ నమ్మడానికి వీల్లేదు " అంటూ ఒక అనుమానాన్ని రేకెత్తించాడు రామేశం . రామేశం భార్య అందుకు సీరియస్గా ఖండించింది. "పాపం పనిమనిషి మీద అనుమానం వద్దండీ. వాళ్ళు పొట్టకూటి కోసం కష్టపడి పని చేసుకుంటూ ఉంటారు. మనలాంటి పెద్ద ఇళ్ళల్లో అటువంటి పనులు చేస్తే దొరికిపోతామని చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇక మీరు మీ మనసులో అటువంటి శంకలు పెట్టుకోకండి. ముందు జేబుల్లో డబ్బులు కుక్కుకోవడం మానెయ్యండి. దేనికి ఎంత ఖర్చు పెడుతున్నారో ఎక్కడైనా రాసుకోండి . మీరు ఏమైనా అనుకోండి. నాకు మీ మీదే అనుమానం. మీకు అస్సలు జాగ్రత్తలు తెలియదు " అంటూ నాలుగూ దులిపేసింది.
మళ్ళీ ఇంకోరోజు తన జేబులోంచి ఇంకో అయిదొందలు పోయినట్టు గమనించాడు రామేశం. "నిన్న నేను బజారు వెళ్ళాను కానీ ఒక్క నయాపైసా ఖర్చు పెట్టలేదు. ఈ రోజు చూస్తే మళ్ళీ అయిదొందలు మాయం. నువ్వెన్ని చెప్పు నా అనుమానం నాది. ఇక రోజూ ఇలాగే అవుతూంటే ప్రతినెలా నాకు వచ్చే ఆ కాస్త పెన్షన్ ఎవరికో దానం చేస్తున్నట్టు అనుకోవాలి . ఒకసారి పనిమనిషితో కదిపి చూడు అయ్యగారి జేబుల్లోంచి డబ్బులు మాయం అవుతున్నాయని ఆయన మతిమరుపు వల్ల పొరపాటున కింద పారేసుకుంటే తీసి ఇచ్చేయమని చెప్పు. . ఇప్పటికే పదిహేను వందలు పోయాయి. ఎన్నాళిలా సరిపెట్టుకుని ఊరుకోవడం ? " అంటూ మండిపడ్డాడు రామేశం భార్య దగ్గర.
" నా వల్ల కాదు పనిమనిషితో చెప్పడం . ముందు మీరు అసలు ఆ తలుపు వెనకాల మీ బట్టలు తగిలించడం మానెయ్యండి. లేదా డబ్బులు జేబుల్లో ఉంచకుండా బీరువాలో పడేయ్యండి . అసలే ఎవరూ పనిమనుషులు దొరకడం లేదు. మీ కోడలు తనకు తెలిసిన వాళ్ళను పట్టుకుని ఎలాగో ఈ పనిమనిషిని సంపాదించింది. తనని అనుమానిస్తున్నాం అని తెలిసిందంటే పని మానేయడం , ఆ తర్వాత మీరూ, నేనూ కలిసి అది చేసే పనులన్నీ చెయ్యాలి . అప్పటికీ సాధ్యమైనంత వరకు పనిమనిషి వెనకాలే ఉంటున్నాను. ఆ డబ్బులు ఎలా మాయం అవుతున్నాయో భగవంతుడికే తెలియాలి " అంటూ నిస్సత్తువుగా మంచమ్మీద కూలబడింది.
ఆ రోజు రామేశం వియ్యంకుడు ఏదో పని మీద ఆ వూరు వస్తూ కూతురుని చూడాలని ఇంటికి వచ్చాడు.
" ఏం బావగారూ ఎలా ఉన్నారు ? ఆరోగ్యం బాగుంది కదా. ఎలా కాలక్షేపం అవుతోంది ?" అని అడిగాడు సంచీలోనుండి స్వీట్ ప్యాకెట్ బయటకు తీసి టేబుల్ మీద పెడుతూ.
"ఏముందండీ. ఇంట్లో కావల్సిన వస్తువులు అన్నీ మా అబ్బాయి ఆన్లైన్లో తెప్పించిపెడుతున్నా నాకు సంతృప్తి ఉండదు. ప్రతి రోజూ బజారు వెళ్ళడం , ఏదో ఒకటి కొనుక్కు రావడం తప్పనిసరి. ఆ విధంగా నా వాకింగ్ కూడా అయిపోతుంది. ఇక టీవీలో వార్తలు, సీరియళ్ళు మామూలే. ఏమిటోనండీ. నా పనులు నేను చేసుకుంటున్నా ఈ మధ్య ఒక విషయంలో నాకు పూర్తి మనశ్శాంతి లోపించింది. నా జేబుల్లోంచి డబ్బులు ఎవరో కొట్టేస్తున్నారు. దానితో నాకు రోజూ చాలా అశాంతిగా ఉంటోంది. అసలే నాకు వచ్చేది అతి తక్కువ పెన్షన్. అన్నిటికీ పిల్లాడి మీద ఆధారపడటం ఇష్టం లేక నాకు బాగా అవసరమైన వస్తువులు , కొన్ని మందులు నేను ఆ డబ్బుతోనే కొనుక్కుంటూ ఉంటాను. ఇప్పుడు ఇదో సమస్య వచ్చి పడింది. నాకైతే పనిమనిషి మీద అనుమానం. మీ చెల్లెలు నోరుమూసుకుని వుండమంటుంది. ఎలా చావాలో నాకు అర్ధం కావడం లేదు. ఒకరోజు పనిమనిషిని నిలబెట్టి నాలుగూ కడిగేయ్యాలన్న ఆవేశం వస్తుంది . ఆ రోజు కూడా త్వరలో వస్తుంది లెండి. ఏదో మాట్లాడాలి కాబట్టి ఈ విషయం మీతో చెప్పాను. దీనిపై మీ సలహా ఏమిటంటారు ?" అని అడిగాడు వియ్యంకుడిని ఏదైనా ఉపాయం చెపుతాడేమోనని.
" బావగారు ఆ పని చేయకండి . ఈ రోజుల్లో మన జాగ్రత్తలో మనం ఉండాలి. పని మనుషులను అనుమానిస్తే వాళ్ళు తిరుగుబాటు చేసి మనల్నే ఇరికిస్తారు. అనడం బాగోదు కానీ మిమ్మల్ని ఆమె చెయ్యి పట్టుకోబోయాడని రేపు బయట అందరికీ మీమీద ప్రచారం చేస్తే మీ పరువు , మా కూతురు అల్లుడు పరువు ఏమికాను ? అయ్యిందేదో అయ్యింది. పోయిన డబ్బు మీది కాదని ఊరుకోండి. ఇంకా నయం నాతో సంప్రదించారు. లేకపోతే మీరేదేనా అనుచిత నిర్ణయాలు తీసుకుని ఉంటే ప్రమాదంలో పడేవాళ్లు " అంటూ గట్టిగా హెచ్చరించాడు రామేశం వియ్యంకుడు.
వియ్యంకుడు హెచ్చరించినా కూడా రామేశం మనసులో సుడిగుండాలు తిరుగుతున్నాయి. ఎలాగైనా తన జేబులోనుండి మాయమైన డబ్బు గురించి చేజించాలి. అప్పుడే తనకు మనశ్శాంతి .
ఇన్నాళ్ళు కొడుకుతో తన జేబులోంచి డబ్బులు మాయమవ్వడం గురించి చెప్పలేదు రామేశం. ఆశ్చర్యంగా కొడుకు గదిలోనుండి వాళ్ళ పెళ్ళికి కొన్న పెద్ద మంచం స్తానంలో మరో కొత్త మంచం కనపడటం చూసి పాతది ఏమయ్యింది అని అడిగాడు రామేశం . ఆ మంచం పాతది అయిపోయిందని పని మనిషికి ఇచ్చేశాము. పనిమనిషి నెలకు ఎంతో కొంత చొప్పున తన జీతంలో మినహాయించుకోమని చెప్పింది. రెండు నెలలనుండి ఎలాగో ఇబ్బంది పడి మంచానికి బాకీ తీరుస్తోంది " అన్నాడు కొడుకు. దానితో రామేశానికి క్లూ దొరికినట్టయ్యింది.
ఆ రోజు అందరూ ఒక చోట కూర్చుని ఉండగా రామేశం తన మనసులోని దాగిఉన్న అనుమానాలను చెప్పడం మొదలు పెట్టాడు.
" చాలా మంది చేసే తప్పే నువ్వూ, మీ ఆవిడా చేశారు. ఇళ్ళల్లో పని చేసే పనిమనుషులు చాలా కష్టాల్లో ఉండి నాలుగిళ్ళల్లో పనిచేసుకుని జీవితాలను లాగిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకు మనం ఏదైనా వస్తువు ఇవ్వాలని అనుకుంటే వాళ్ళ నుండి ఏమీ ఆశించకుండానే ఊరికే ఇచ్చేయ్యాలి. వాళ్ళకు మనం ఇచ్చే నెల జీతంలోంచి ప్రతి నెలా కోత విధిస్తే ఇక వాళ్ళ ఇళ్ళు ఎలా గడుస్తాయి? ఆ సమయంలో వాళ్ళ పరిస్తితి చాలా దుర్భరంగా ఉంటుంది. నా అజాగ్రత్త పక్కన పెట్టు. నువ్వు చేసిన పనికి మన పనిమనిషికి దిక్కు తోచని స్తితిలో ,నిస్సహాయ స్తితిలో ఒక పొరపాటు పని చేయాల్సి వచ్చింది అని నేను అనుకుంటున్నాను. అదే నా జేబులోంచి డబ్బు పోవడం . అందులోనూ ఈ మధ్య పనిమనిషి మొగుడు ఏదో వీధి తగాదాల్లో జైలు పాలయ్యాడని విన్నాను. ఈ పరిస్తితులన్నీ ఆమెను దొంగతనానికి ప్రోత్సహించినట్టుగా మనం భావించాలి . అయ్యిందేదో అయ్యింది. ఈ నెల నుండి మన పనిమనిషి దగ్గర నుండి ఏ బాకీ వసూలు చేయొద్దు. ఇప్పటివరకు చేసినది చాలు. ఇక ఆ పొరపాటు చేయొద్దు. నువ్వే కాదు ఎవరైనా కూడా మన వస్తువులు వదిలించుకోవాలంటే ఇటువంటి బీదా బిక్కీలకు ఉచితంగా ఇచ్చేయ్యాలి. వాళ్ళ నుండి ఏదైనా ఆశిస్తే మన ఇంట్లో జరిగినట్టే జరుగుతుంది " అంటూ కొడుకు, కోడలుకు బాగా అర్ధమయ్యే రీతిలో బుర్రలను ప్రక్షాళన చేశాడు.
గత కొన్నాళ్లుగా రామేశం జేబులో లెక్కలులో ఎటువంటి తేడా రాక పోవడంతో తన అనుమానం సబబే అని అనిపించి, పనిమనిషి బాకీని ఈ విధంగానైనా రద్దు చేసి ఒక మంచి పని చెయ్యగలిగానన్న ఆత్మ తృప్తి అతనిలో సంపూర్ణంగా కలిగింది. *******
సమాప్తం