ముగింపు లేని కథ" (కథ )
రచన: జీడిగుంట నరసింహ మూర్తి
(18/6/2023 విశాలాంధ్ర ఆదివారం అనుబంధంలో ప్రచురించిన నా కథ )
"ఇదిగో రాంబాబూ గారూ ! మీరు బయటకు వెళ్ళాక మీ ఇంటినుండి ఫోన్ వచ్చింది.మీ నాన్నగారు నిన్న ఎక్కడికో బయటకు వెళ్ళి ఇంతవరకు రాలేదుట.ఇంట్లో అందరూ కంగారు పడుతున్నారుట. ఒక రెండు రోజులు సెలవు తీసుకుని ఒకసారి మీరు వెళ్లొస్తే బాగుంటుంది. ఆయన ఎక్కడికో పని మీద వెళ్ళి ఉంటారులెండి. మీరేమీ టెన్షన్ పడకండి. . మీరు అక్కడకు వెళ్ళే సరికి వచ్చేసి ఉంటారని నా నమ్మకం " అన్నాడు ఆఫేసులోని సూపరింటెండెంట్ కృష్ణ మూర్తి అప్పుడే బయట నుండి వచ్చిన రాంబాబుని. .
బాంబు లాంటి వార్త వినగానే రాంబాబు క్షణకాలం కొయ్యబారిపోయాడు. వెన్నులో సన్నటి జలదరింపు ప్రారంభమయ్యి మొహం చెమటతో ముద్దయ్యింది. కాళ్ళూ చేతులూ ఆడక రెండు నిమిషాలు స్థాణువై నిలబడి పోయాడు. ఇటువంటి వార్తలు వినడం తమ కుటుంబం నుండి వినడం ఇదే మొదటి సారి. వెంటనే ఏం చెయ్యాలో పాలుపోలేదు. ఇప్పుడు వెంటనే బయలు దేరి వెళ్ళినా కనీసంలో కనీసం పన్నెండు గంటల ప్రయాణం.
" నేను మధ్యాన్నం ఏదో ఒక బస్సు చూసుకుని వెళ్తాను సార్ . ఏదైనా కారణాలతో ఒక రెండు రోజులు ఆలస్యం అయితే దయచేసి మేనేజ్మెంట్కు చెప్పి కన్విన్స్ చేస్తారుగా ?.." అంటూ టేబుల్ మీద ఉన్న ఫైళ్లన్నీ సర్దేసి అల్మారాలో పెట్టేశాడు రాంబాబు . అక్కడున్న కొద్ది క్షణాలే భరించరానంత ఆలస్యంగా అనిపించింది.
రాంబాబు అక్కడే మొహమాటంగా నిలబడి ఉన్నాడు.
"రాంబాబూ మీ పరిస్తితి అర్ధం చేసుకోగలను. మీ చేతిలో ఇప్పుడు ప్రయాణానికి కావలసిన డబ్బులు ఉంటాయని అనుకోను. ఒక నెల అడ్వాన్స్ రికమండ్ చేస్తాను. వెళ్ళి క్యాషియర్ దగ్గరకు వెళ్ళి తెచ్చుకోండి . .." అన్నాడు కృష్ణ మూర్తి మానవతా దృక్పధంతో.
బస్సులో కూర్చున్నాక రాంబాబులో ఆలోచనలు ముసురుకున్నాయి. తన తండ్రి గత కొన్ని రోజులుగా ఆఫీసులో ఏవో అనుకోని సమస్యలతో బాధ పడుతున్నాడు. ఇంట్లో ఆయన సమస్య అర్ధం చేసుకునే వాళ్ళు ఎవరూ లేరు. ఇద్దరు కొడుకుకులు, ఒక కూతురు వేరే వూళ్ళల్లో దూరంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. తను అందరిలో కల్లా చిన్న వాడు. . తను కూడా ఒక ఆరునెలల క్రితం అనుకోకుండా ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజి నుండి ఉద్యోగానికి పిలుపు రావడంతో వచ్చిన ఛాన్స్ వదులుకోవడం ఇష్టం లేక ఎక్కువ గ్యాప్ లేకుండానే వెళ్ళి జాయిన్ అయిపోయాడు.అందరి కన్నా చిన్నవాడు అవ్వడం వల్లో ఏమో తను అంత దూరం వెళ్ళి ఉద్యోగం చెయ్యడం తల్లి తండ్రులకు ఇష్టం లేదు. ఏవైనా పోటీ పరీక్షలకు అటెండ్ అయ్యి మంచి జాబ్ సంపాదించుకుంటే బాగుంటుంది అని వాళ్ళ సలహా. .
ఈ మధ్యకాలంలో తను తల్లి తండ్రులను చూడాలని ఒకసారి ఇంటికి వెళ్ళాడు. కొత్తగా జాబ్లో చేరడం వల్ల ఎక్కువ సెలవు దొరకలేదు. ఉన్నది చాలా తక్కువ సమయం. ఆ సాయంత్రం తను తిరుగు ప్రయాణం అవ్వబోతూ ఉండగా తండ్రి రామ్మోహన రావు " రామూ . నీతో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి. నేను ఒక అరగంటలో ఒక ముఖ్యమైన పని చేసుకుని వచ్చేస్తాను. నేను బస్టాండ్ వరకు వచ్చి నిన్ను విజయవాడ బస్సు ఎక్కిస్తాను .ఆ మధ్యలో అన్ని విషయాలు మాట్లాడతాను ..ఇంకా చాలా టైముంది. నేను వచ్చే అంతవరకు బయలుదేరొద్దు" అన్నాడు ఒక రకంగా బ్రతిమాలుతున్నట్టుగానే .
తన తండ్రి అంత దీనంగా తనని ఎందుకు వచ్చే అంతవరకు ఆగమన్నాడో తను ఆయన మనసులో ఉన్న యదార్ధ పరిస్తితిని గ్రహించలేకపోయాడు. తను కానీ వెంటనే బయలు దేరి విజయవాడ చేరుకుంటే కానీ మళ్ళీ అక్కడ నుండి తను ఎక్కవలసిన చోటుకు రిజెర్వేషన్ చేయించుకున్న బస్సును అందుకోలేడు.. పోనీలే ముందు వూరు చేరుకుని తన తండ్రి చెప్పాలనుకున్న మాటలు ఫోన్లో మాట్లాడి తెల్సుకోవచ్చు అని నిర్ణయించుకుని బయలుదేరే ముందు తల్లికి తన పరిస్తితిని వివరించి వెంటనే బస్టాండ్ కు వెళ్లిపోయాడు. ఆ క్షణంలో తండ్రి గుర్తుకు వచ్చినా ఏదో బలహీనత ఆవరించి ముందుకు సాగిపోయాడు. .
వెనక్కి వచ్చి సరిగ్గా పది రోజులు కూడా కాలేదు. ఈ లోపలే జరగరాని ఘోరం జరిగిపోయింది. రాంబాబు మనసులో ఎన్నో శంకలు తలెత్తుతున్నాయి.తండ్రి తనతో ఏమి చెప్పాలనుకున్నాడో ? తను ఆ అవకాశం ఇవ్వకపోవడం వల్ల ఈ రోజు ఆయన వెళ్లిపోవడానికి బలీయమైన కారణం ఏమిటో తెలుసుకోవడంలో తను ఫ్లాఫ్ అయ్యాడు. ఈ లోటు భర్తీ చెయ్యడం ఎవరి వల్ల అవుతుంది ?
** ** **
వ్యాకులత చెందిన మనసుతో రాత్రంతా బస్సులో ఆలోచిస్తూనే ఉన్నాడు రాంబాబు పరిస్తితి ఫోన్ చేసి కనుక్కుందామనుకున్నా తను ఇంకా ఫోన్ కొనుక్కోలేదు. కిందకు దిగి ఏ టెలిఫోన్ బూత్ నుండి మాట్లాడి కనుక్కోవాలన్న ఆలోచన కూడా రాలేదు. ముందు అతని ధ్యాస అంతా ఇంటిమీదే. . బస్టాండ్లో ఆగగానే రాంబాబు వెంటనే ఆటోలో ఎక్కాడు.ఏదైనా అద్భుతం జరిగి తను వెళ్ళేసరికి తండ్రి ఇంట్లో ఉండి అంతా సవ్యంగా ఉంటే ఎంత కష్టమైనా సరే తను తండ్రిని, తల్లినీ తనతో పాటు తీసుకుపోయి తనతోనే ఉంచుకుంటాడు. తన అన్నగార్లతో కూర్చుని మాట్లాడి తండ్రి చేస్తున్న ఉద్యోగానికి వీఆర్ఎస్ తీసుకునేటట్టుగా బలవంతం చేసి అటు వాళ్లతోనో , కాదంటే తనతోనైనా తీసుకుపోయే విషయం గట్టిగా నిర్ణయం తీసుకోవాలి.దానితో తన తండ్రి ప్రస్తుతం తన ఆఫీసులో ఎదుర్కుంటున్న పరిష్కరించలేని సమస్యలకు ఒక్కసారిగా తెర పడుతుంది.
రాంబాబు ఇంటి వద్దకు చేరుకునే సరికి అప్పటికే ఇంట్లో బయటనుండి రావలసిన అన్నదమ్ములు,అక్కగారు రానే వచ్చారు . లోపలకు ఆతృతగా అడుగుబెడుతున్న అతనికి ముందు గదిలో మంచమ్మీద తండ్రి కాళ్ళు కనపడగానే "హమ్మయ్య" అని గుండెల నిండా హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు.
ఆ మరుక్షణంలోనే ఆ కాళ్ళు తన తండ్రి లుంగీ పంచి కట్టుకున్న తన పెద్దన్నగారివి అని తెలిసి మనసంతా వికలమైపోయింది.
రాంబాబును చూడగానే అన్నగారు పడుకున్న వాడు దిగ్గున లేచి కూర్చున్నాడు.
"రారా బాబూ ! నువ్వు కూడా వచ్చేశావు మాకు ధైర్యంగా ఉంది. చూశావా నాన్న ఎంత పని చేశాడో ? అంత పరిష్కురించుకోలేని సమస్యలు ఆయనకేమి ఉన్నాయిట ?కనీసం ఆయన సమస్యలు ఎప్పుడైనా మనతో చెప్పుకుని ఉంటే మనకు తోచిన సలహా ఇచ్చే వాళ్ళం. ఒక వారం రోజుల క్రితమే నువ్వు వచ్చి వెళ్లావుట. కనీసం అప్పుడైనా నీకైనా చెప్పి ఉంటే ఆయన మనసు మార్చేవాడివి . లేకపోతే మాతో చెప్పేవాడివి. . ఏం చెయ్యాలో తెలియక అందరమూ బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాం. కొద్దిసేపు రిలాక్స్ అవ్వు.అందరమూ కలిసి ఇటు చుట్టుపక్కల వూళ్ళు తిరిగి వద్దాం ఎవరైనా చూసిన వాళ్ళు ఏమైనా చెపుతారేమో ? " అన్నాడు రాంబాబు పెద్ద అన్నగారు రమణ. .
లోపల వంటగదిలో రాంబాబు తల్లి విశాలక్ష్మి కలలో కూడా ఊహించని సంఘటనను తలుచుకుంటూ బాధను గుండెల్లోనే దిగదింపుకుని ఇంటికొచ్చిన వాళ్ళందరికీ అల్పాహారం చేసే విషయంలో హడావిడి పడుతోంది. ఎంతటి విషాద సమయాలలో కూడా తిండి ఎవరూ మానుకోరు కదా. ఆవిడ పెట్టే టిఫిన్ తిని బయటకు వెళ్దామని అందరూ ఆలోచిస్తున్నారు.
ఏదో ఘోరమైన విపత్తు జరిగి ఉంటుందని రాంబాబు మనసు సూచిస్తోంది. ఎంతో మాట్లాడాలనుకున్న అతని పెదవులు ఉద్వేగంతో కంపిస్తున్నాయి,
కొడుకులకు టిఫిన్లు అందించాక తల్లి చీర కొంగును కళ్ల మీద కప్పుకుని తన్నుకొస్తున్న ఏడుపును ఆపుకుంటూ నీరసంగా గోడకు జార్లగిలపడి కళ్ళు మూసుకుని పిల్లలు మాటాడుకుంటున్న మాటలు వింటూ అయోమయంగా చూస్తూ ఉండిపోయింది.
అందరూ తయారయ్యి బయటకు వస్తూండగా ఎదురింటి పూర్ణచందర రావు చూసి "సారీ బాబూ చాలా దురదృష్టం . ఇలా జరుగుతుందని మెమవరమూ ఊహించలేదు.ఈ రోజు పేపర్ చూసారా ? నాన్నగారికి సంబంధించిన వార్త ఒకటి వచ్చింది " అంటూ గోడ మీద నుండి పేపర్ అందించాడు.
పేపర్ చూస్తున్న రమణ కళ్ళు బైర్లు కమ్మాయి. కాళ్ళల్లో బలం సన్నగిల్లింది. మెదడు ఆలోచించే శక్తిని కోల్పోతోంది.
అన్నగారి మొహాన్ని చూసి కళ్ళముందు ఘోరం జరుగుతున్న ప్రేక్షకుల్లా చూస్తూండి పోయారు మిగిలిన వాళ్ళు.
"అయిపోయిందిరా . అంతా అయిపోయింది. మన చెయ్యి దాటి పోయింది. ఇంకా నాన్నను ఎక్కడా వెతకాల్సిన అవసరం లేదు. ..ఇదిగో ఈ పేపర్ చూడండి .." అంటూ వాళ్ళకు అందించాడు రమణ వణికిపోతున్న చేతులతో.
పేపర్లో వేసిన వార్త చూసి తమ్ముళ్ళు ఉలుకూ పలుకూ లేకుండా కొయ్యబారి పోయారు. అందరిలో గట్టు తెగిన నదిలా దుఖం ముంచుకొచ్చింది .
ఏం జరిగిందో తెలుసుకోలేక విశాలక్ష్మి అమాయకంగా గుమ్మంలో నుండి చూస్తోంది.
"అమ్మకు ఇప్పుడే ఏం చెప్పొద్దు . ముందు వెళ్ళి కన్ఫర్మ్ చేసుకున్నాక ఎలా చెప్పాలో ఆలోచించుకుని చెపుదాం" అన్నాడు రమణ
చిన్నవాడైన రాంబాబు అసహాయంగా శూన్యం నిండిన కళ్ళతో చూస్తున్నాడు. అతను అన్నగార్లు ఏం చెపితే తను అనుసరించడానికి సిద్దంగా ఉన్నాడు.
అందరినీ బాల్యస్మృతులు చుట్టుముట్టుతున్నాయి. నాన్న తన పిల్లల గురించి ఎంతో కలలు కంటూ వస్తున్నాడు. తమ ఎదుగుదల గురించి ప్రతి క్షణమూ గొప్పగా ఫీలవుతున్నాడు. తను రిటైరవగానే తను, తన భార్య తన పిల్లల దగ్గరికి వెళ్ళిపోయి హాయిగా ఏ చీకూ చింతా లేకుండా బ్రతికేస్తాం అంటూ అందరితో గర్వంగా చెప్పుకున్నాడు. ఆ క్రమంలో పిల్లల్ని ఎప్పుడూ కూడా పల్లెత్తు మాట కూడా తూలలేదు. అయితే పిల్లల దగ్గర తన గురించి ఎప్పుడూ ఏదీ చెప్పుకోలేదు. తన ఆర్ధిక పరిస్తితుల గురించి ఎప్పుడూ చర్చించలేదు. తన బాధలు తనే ఒంటరిగా అనుభవించాడు. తమతో చెప్పుకోలేని పరిస్తితులేమి ఉన్నాయో ఈ క్షణం వరకు ఆయన పిల్లలకు ఎవరికీ అర్ధం కావడం లేదు.
ఆ కుటుంబం లోని ముఖ్య సభ్యులు అందరూ హుటాహుటిన విజయవాడ బయలుదేరారు. ఆ పోలీస్ స్టేషన్ అడ్రెస్ కనుక్కుని అదుపుతప్పిన గుండెలను అర చేతిలో పట్టుకుని లోపలకు వెళ్ళి పేపర్లో ఆ రోజు వచ్చిన వార్త చూసి వచ్చాం అని చెప్పుకున్నారు.
"కూర్చోండి. నదిలో మాకు దొరికిన శవం తాలూకు బట్టలు చూపిస్తాం. అవి కానీ మీ వాళ్ళవే అని మీరు నమ్మితే ఇక్కడకు రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆత్మహత్యలు చేసుకున్నవాళ్ళ శవాల మార్చురీ దగ్గరకు తీసుకు వెళ్ళి చూపిస్తాం ..." అన్నాడు ఒక పోలీస్ అధికారి.
అవి తండ్రి బట్టలు అని చెప్పడానికి వాళ్ళ దగ్గర ఎవరి దగ్గరా ఆధారాలు లేవు. కారణం గత ఆరునెలలుగా తండ్రి వేసుకున్న బట్టలు ఎవరూ చూసి ఉండకపోవడమే.
రమణలో లోలోపల ఆందోళన పెరిగిపోతోంది. అలా వదిలేసి వెళ్లిపోవడానికి మనసొప్పడం లేదు. అక్కడే ఉన్న పోలీసును అడిగాడు "బాబూ ఇలా ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళ విషయంలో వెంటనే వాళ్ళ బంధువులకు శవాన్ని ఇచ్చేస్తారా ?" అని .
"అబ్బో దీనికి చాలా తతంగం ఉంటుంది సార్. ముందు వాళ్ళ కుటుంబం మీద కేసు పెడతారు. ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ తాలూకు కుటుంబ సభ్యులందరినీ పిలిపించి అన్ని కోణాల్లో విచారించి కానీ డెడ్ బోడీని ఇవ్వరు. ఆ శవం మీ వాళ్ళదేనా ?కన్ఫర్మ్ చేసుకుంటే మిమ్మల్ని దగ్గరుండి తీసుకు వెళ్తాను " అన్నాడు ఆ పోలీసు.
"నాన్నకు అటువంటి డ్రస్ లు లేవు అని నాకు అనిపిస్తోంది. . ఆయన సాంప్రదాయ దుస్తులు వేసుకుంటాడు. వీళ్ళు చూపిస్తున్న డ్రస్ చూస్తే చాలా తేడాగా అనిపిస్తోంది. పైగా ఇక్కడ చాలా పెద్ద ప్రొసీజర్ ఉందని అంటున్నారు. ఇవన్నీ మనం ఎదుర్కోగలమా ? వీళ్ళు కూడా అనుమానంగా చెపుతున్నారు కానీ ఖచ్చితంగా ఆధారాలు ఏమీ లేవుగా ? వీళ్ళకు రోజూ ఇటువంటి కేసులు లెక్కకు మించి వస్తూ ఉంటాయి. కాబట్టి మనం తొందర పడి ఈ కేసులలో ఇరుక్కోవడం మంచిది కాదనిపిస్తోంది. పోలీసులకు ఈ డ్రస్ తప్ప వేరే ఆధారాలు ఏమీ దొరకలేదుట. ..మనం ఇంతటితో వదిలేసి వెళ్ళి పోవడం మంచిది అనిపిస్తోంది ..."అంటున్నాడు గుండె రాయి చేసుకుని ఆ సోదరులలో ఒకరు.
వచ్చిన వాళ్ళు తర్జన భర్జన పడటం చూసి పోలీస్ ఆఫీసర్ కలిపించుకుని "పర్వాలేదు లెండి .మీ వాళ్ళు కాకపోతే మంచిదే. చాలా మంది ఎటూ తేల్చుకోలేక మమ్మల్ని అనవసరంగా శ్రమ పెట్టి మార్చురీల చుట్టూ తిప్పుతారు. చివరకు వాళ్ళ వాళ్ళు కాదని తేల్చేసి వెళ్లిపోతారు. ..ఇదంతా రోజూ మాకు మామూలే ..పూర్తిగా మీకు నమ్మకం ఉంటేనే చెప్పండి. " అన్నాడు తన పని తను చేసుకుంటూ .
అంతే . ఏదో సెంటిమెంట్ వెంటాడి ఎవరినీ ఆ క్షణంలో ఇంకొక్క అడుగు కూడా ముందుకు వెయ్యనియ్యలేదు. ఆ నిజం ఆ క్షణంలో వాళ్ళ మధ్యే సమాధి అయిపోయింది.
** ** ** **
సంవత్సరాలు గడుస్తున్నా రామ్మోహనరావు మిస్సింగ్ కేసు మిస్టరీగానే ఉండిపోయింది.దానితో పాటు ఆయన ఇంట్లోనుండి వెళ్ళి పోవడానికి గల కారణాలు కూడా తెలియకుండానే మరుగున పడిపోయాయి.
"ఒక్కసారి ఆ మార్చురీకి ధైర్యం చేసి వెళ్లి చూసుంటే ఇన్నాళ్లుగా మనం పడుతున్న మానసిక క్షోభకు తెరపడేది కదా .. చాలా పెద్ద పొరపాటు చేశాం .." అని వాళ్ళు అనుకోని రోజు లేదు ..విశాలక్ష్మి మాత్రం తన భర్త ఎక్కడో అక్కడ ఇంకా ఉండి ఉంటాడు అన్న నమ్మకంతో మనవళ్లు,మనవరాళ్ళ మధ్య జీవితాన్ని బరువుగా లాగేస్తోంది.
అవును మరి . కొన్ని జీవితాలకు ముగింపు ఉండదు.********
- సమాప్తం