ఊహాతీతం

విశాలాంధ్ర దినపత్రిక ఆదివారం అనుబంధం • 30 Jul 2023 • 👁 1 views
"ఊహాతీతం "( కథ )
రచన : జీడిగుంట నరసింహ మూర్తి
(విశాలాంధ్ర దినపత్రిక ఆదివారం అనుబంధం 30/7/2023 లో ప్రచురించిన కథ )
"ఆగాకు. వీడేదో కొత్త విషయం చెపుతున్నాడు .." అనేసరికి అప్పటివరకూ ఎవరికి వాళ్ళు చెప్పిన విషయాలే మళ్ళీ మళ్ళీ చెప్పి విసిగిస్తున్న వాళ్ళ నోళ్లకు తాళం పడింది. అందరూ ఆసక్తిగా సూర్యం వైపు చూశారు .
"అవునురా. ఇన్నేళ్లుగా మనం ఎక్కడో అక్కడ కలుసుకుంటూ ఉండటం, చెప్పిన విషయాలే మళ్ళీ చెప్పుకుంటూ అందులోనే సంతృప్తి పడటం జరుగుతోంది. కారణం మనమందరమూ ఒకే చోట ఉండి అక్కడ విషయాలు బాగా గమనించడం వల్ల ఇంకా కొత్త విషయాలు తెలిసే అవకాశామూ లేదు. చెప్పడానికీ ఏమీ లేదు. కానీ ఈ సారి మనం అందరమూ ఇక్కడ కలుసుకోవడానికి కారణం మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలనుకోవడం . ఇది మీ అందరికీ ఊహాతీతమైన విషయం. సావదానంగా కూర్చుని ఆ విషయాన్ని గురించి చర్చించుకుందాం . ." అన్నాడు సూర్యం తను చెప్పాలనుకున్న విషయాన్ని సస్పెన్స్ లో ఉంచి.
"అవునవును. నువ్వు చెప్పే విషయం ఏదైనా అది ఖచ్చితంగా కొత్తదిగా ఉంటుంది. అందులో ఊహలు, కల్పితాలు ఏవీ ఉండవని మాకందరికీ తెలుసు. వెంటనే చెప్పేస్తే థ్రిల్ ఉండదు. ఈ లోపల వేరే కబుర్లు గురించి మాట్లాడుకుందాం ,," అని ఒక సోదరుడు సంజయ్ అనడంతో అందుకు అందరూ ఏకీభవించారు.
"అలా అయితే ఒక పని చేద్దాం. వాడిని ఆ కొత్త సంగతేదో పూర్తిగా ఆలోచించుకోమను. ఈ లోపల టిఫిన్లు పూర్తి చేసి ఫిల్టర్ కాఫీ తాగేసి కూర్చుందాం..వినడానికి ఓపిక కూడా ఉంటుంది. ..." అన్నాడు వారిలో పెద్దాయన రమణారావు.
ప్రస్తుతం సూర్యం అక్కడ హోస్ట్. అతని ఇంటిలోనే అందరూ చేరారు. అతని ఇల్లు అందరూ కలిసి కనీసం రెండు మూడు రోజులైనా హాయిగా గడపడానికి అనువైన ప్రదేశం. అతను ఇప్పటివాళ్లులాగా కాకుండా ఇంకా పాత పద్దతులు పట్టుకుని వేలాడుతూ ఉంటాడు. ఆ క్రమంలోనే అందరినీ సంవత్సరానికి కనీసం రెండు సార్లైనా తన ఇంట్లో కలపాలని ప్రయత్నం చేస్తూ ఉండటమే కాకుండా ఆ విషయంలో విజయం కూడా సాధించాడు.
ఒక అరగంట సేపు వాళ్ళందరూ విశాలమైన ఆ ఇంట్లో దొడ్డి అంతా తిరిగి అందంగా చూడముచ్చటగా ఒక క్రమ పద్దతిలో అమర్చిన పూల మొక్కల కుండీలు, మరోపక్క సిమెంట్ తొట్టెలలో ఏపుకొచ్చి కాయలు కాస్తున్న వంకాయ, దొండకాయ పాదులు లాంటి మొక్కలు కళ్ళారా చూశాక వాళ్ళందరికీ సగం కడుపు నిండిపోయింది.
ఈ లోపు ఆ ఇంటి ఇల్లాలు వేడివేడిగా దూదుల్లాంటి గారెలు,పక్కన కొబ్బరి చెట్నీ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి "వేడి చల్లారిపోతాయి.తిన్నాక మాట్లాడుకోండి " అంటూ పిలిచింది. ఆవిడకేమిటో కానీ ఇంట్లో నలుగురు ఉండి సందడి చేస్తేనే సంతోషంగా ఉంటుంది. ఎప్పుడూ ఈ విషయంలో మొగుడి మీద విసుక్కుని ఎరగదు అంటారు. ఒక రకంగా ఆవిడే ఒకసారి అందరినీ రమ్మనండి. ఈ సారి అందరమూ కలిసి చాలా రోజులైపోయింది అంటూ బలవంతం చేసిన రోజులు కూడా ఉన్నాయి.
ఎవరికి వాళ్ళు యాంత్రికంగా ఒక పక్క జీవితాలను గడిపేస్తూనే మరో పక్క తమ పిల్లలకు కొన్ని తరాల వరకు సరిపడా కూర్చోబెట్టి ఆస్తులు కూడబెడుతూ ఒకరి మొహాలు ఒకరు చూసుకోకుండా రోజులు, నెలలు గడిపేస్తున్న తరుణంలో సూర్యం ఇంట అడపాదడపా జరిగే గెట్ టుగదర్లు,ఎవరింట్లో వాళ్ళు వండుకుంటూ విసిగెత్తి పోయి వున్న ఆడవాళ్ళకు ఆట విడుపులా ఆ ఇంట్లో కలవడం, రుచికరమైన టిఫిన్లు, నోరూరించే వంటలను ఆస్వాదిస్తూ తింటూ మనసారా కబుర్లు చెప్పుకుంటూ గడపడం అక్కడ చేరిన వాళ్ళందరికీ ఎంతో ఇష్టం. అందుకే దూరం అని పెట్టుకోకుండా అనుకున్న సమయానికి అందరూ చేరిపోతారు.
ఆ ఇంట్లో ఎవ్వరూ మొహమాట పడాల్సిన అవసరం లేదు. తినగలిగినంత తినొచ్చు. తినకపోతేనే కోపగించుకునే వాళ్ళు ఆ ఇంట్లో ఉన్నారు. . తింటున్న కొద్దీ వేడి వేడి పదార్ధాలు అప్పటికప్పుడు నూనెలో దేవి వచ్చేస్తూ ఉంటాయి. తింటున్నన్నంత సేపు చూస్తూ అక్కడే నిలబడి చూసే వాళ్ళు ఎవరూ ఆ ఇంట్లో ఎవరూ లేరు. .
"అమ్మాయి. టిఫిన్ అందరికీ ఇవాళ హార్డ్ అయ్యింది అంటున్నారు. వంటగదిలో దూరి ఇప్పుడే చెయ్యి కాల్చుకోవద్దు. ఒక గంట, రెండు గంటలు రెస్టు తీసుకుని అప్పుడు వంట గదిలోకి వెళ్ళు. అంతగా ఎవరికీ ఆకలి లేదు. ఆలస్యం అయితేనే కడుపులో బాగా కాలుతుంది. ..." అంది నవ్వుతూ పెద్ద తోడికోడలు .
అక్కడ కొచ్చిన ఆడవాళ్ళెవరూ వంటగదిలోకి వస్తే సూర్యం భార్య ఒప్పుకోదు.
"మా ఇంటిలో నేనే వండిపెట్టాలి. కావాలంటే మేము మీ ఇంటికొచ్చినప్పుడు వంటలో కలిపించుకోండి. ఇక్కడ మీకెవరికీ హక్కు లేదు . మీరు కలిపించుకుంటే నాకు సంతృప్తిగా ఉండదు .." అని ఆమె నిష్కర్షగా చెప్పేసినా ఒక రకంగా ఆవిడ స్టేట్మెంట్ వాళ్ళందరికీ ఎంతో రిలీఫ్ గా అనిపించేది.
టిఫిన్లకు ముందు అందరూ ఒకసారి ఫిల్టర్ కాఫీ తాగారు. టిఫిన్లు అయ్యాక మళ్ళీ రెండవసారి పొగలు కక్కుతున్న కాఫీలు వచ్చేశాయి. ఎందుకులే మళ్ళీ అంటూ అనే వాళ్ళు అక్కడ ఎవరూ లేరు. అక్కడ మొహమాటం అనే మాటకు తావులేదు అని ముందే చెప్పుకున్నాం కదా. .
" ఏమిటిరా బాబూ ! ఇలా తింటూ , తాగుతూ ఉంటే రోజంతా ఇదే సరిపోయేటట్టుగా ఉంది. ఇక చెప్పాలనుకున్న ఆ కొత్త విషయాన్ని సూర్యం ఎప్పుడు చెపుతాడు ? ముందు వాడికి అవకాశం ఇవ్వండి. " అన్నాడు సంజయ్ కలిపించుకుని.
కానీ ఆ సస్పెన్స్ అలా కొనసాగుతూనే ఉంది.
** ** **
రాత్రి అందరూ మేడ మీదకు చేరాక సూర్యం అప్పుడు నోరు మెదిపాడు.
" మీ అందరికీ తెలియని ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మన ఊళ్ళో మనకొక ఇల్లు ఉందని తెలిసింది. ఆ విషయం నాకు బాగా కావలసిన పరిచయమున్న వ్యక్తి బయటపెట్టాడు. దీన్ని గురించి కూలంకషంగా చర్చించాల్సి ఉంది. ఆ ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. ముందు కొంత బ్రీఫ్ చేశాక ఆ పేపర్లు కూడా చూపిస్తాను. అప్పటివరకూ అందరూ ఓపిక పట్టాల్సి ఉంటుంది. " అన్నాడు సూర్యం వాళ్లందరినీ ఊరిస్తూ.
"ఇప్పటికీ నమ్మలేకపోతున్నాం రా. మనకేమిటి ఆ వూళ్ళో సొంత ఇల్లు ఉండటమేమిటి ? ఆ వూళ్ళో ఉన్నన్నాళ్లు మనకు తెలిసి చాలా ఆర్ధిక ఇబ్బందులు పడ్డాం. మన చదువులు చదివించడానికే నాన్న బోళ్ళన్ని అప్పులు చేయాల్సి వచ్చింది. అప్పుడప్పుడు ఎన్నో అవసరాల కోసం అమ్మ నగలు తాకట్టు పెట్టాల్సి వచ్చేది. ఆ అప్పు తీర్చడానికి మళ్ళీ ఇంకో పెద్ద అప్పు చెయ్యడం చూశాం. అటువంటి అతి సాధారణమైన జీవితాన్ని నెట్టుకుంటూ వచ్చిన మనకు సొంత ఇల్లు ఉండటం అనేది ఎటువంటి పరిస్తితులలోనూ నమ్మడానికి వీల్లేకుండా ఉంది. ..." అన్నాడు పెద్ద అన్నగారు రమణారావు.
" అప్పట్లో మనం ఉంటున్న వీధిలో ఒక మట్టితో కట్టిన డాబా అమ్మకానికొస్తే నాన్న వాళ్ళు ఎంతకు అమ్ముతున్నారో కనుక్కోమని చెప్పడం ఒక రెండు రోజులు అదే విషయంమ్మీద సంప్రదింపులు జరపడం గుర్తుంది .. కానీ ఎవరో ఆ ఇల్లు ఏదైనా తుఫాన్ వస్తే పడిపోతుంది అని భయపెట్టడంతో మళ్ళీ ఆ విషయాన్ని మన ఇంట్లో ఎవరూ ఎత్తలేదు. అంతే కానీ ఆ తర్వాత కూడా అటువంటి ఆలోచన కానీ, అంత ధైర్యం కానీ మన కుటుంబంలో ఎవరూ చేయలేదు. మరి ఇన్నాళ్ల తర్వాత అక్కడ మనకొక ఇల్లు ఉందని తెలియడం నిజంగా ఇది శుభపరిణామం. ఇంత మంచి విషయాన్ని వెంటనే చెప్పకుండా ఎలా ఉగ్గపట్టుకుని ఉన్నావురా బాబూ ?" అన్నాడు సంజయ్.
" చూస్తూంటే మీకెవరికీ పెద్దగా ఆశ్చర్యంగా ఉన్నట్టుగా నాకనిపించడం లేదు. నిజానికి ఇది సాధ్యమా ? ఆలోచించండి. .." అన్నాడు సూర్యం అందరి కళ్ళల్లోకి గుచ్చి చూస్తూ.
" మాకైతే నమ్మ బుద్ది కావడం లేదు. కానీ నువ్వు డాక్యుమెంట్స్ కూడా చూపిస్తానని చెపుతున్నావుగా. ఇంకా నమ్మక ఏం చెయ్యాలి ? నాన్న మనకు తెలియకుండా ఆ విషయం దాచి పెట్టాడంటావా ?ఒకనాడు మన తాతయ్యలు వాళ్ళు ఉన్న ఊళ్ళో ఏదో ఒక పాత ఇల్లు ఉండేది అనే వాళ్ళు . అందులో నాన్న వాటాకు కొంత డబ్బు వస్తే దాన్ని మన చదువులకే ఉపయోగించేశాడని అమ్మ చెప్పేది. పోనీ మనకు తెలియని అటువంటి స్థలాలు కానీ, ఇళ్ళు కానీ నాన్న ఆర్ధిక పరిస్తితిని చూసి ఎవరైనా వ్రాసిచ్చారా అనే అనుమానం కూడా వస్తోంది . అది కూడా మనకు తెలియకుండా దాచే అంత పరిస్తితి ఎందుకుంటుంది? ఏమైనా ఇంత ఊహించని , నమ్మ శక్యం కాని విషయం చెప్పిన నువ్వే దీని వెనక వున్న అంతరార్ధం చెప్పాలి. చిన్న వాడివైనా నీకు మాకన్నా ఇటువంటి విషయాలలో అవగాహన ఎక్కువగా ఉంటుందని మా అందరి ఉద్దేశ్యం. .." అన్నాడు రమణారావు సోఫాలో వెనక్కి వాలి పోతూ.
"రాత్రి మేమేవరమూ భోజనాలు చేయం. కాస్త గోధుమ రవ్వ ఉప్మా చేయించేయ్యి. దానితో పాటు ఒక గ్లాసుడు మజ్జిగ తాగేస్తే ఈ రోజుకు గడిచిపోతుంది .." అన్నాడు సంజయ్ పొట్టమీద చెయ్యి వేసి నొక్కుకుంటూ.
" ఇక నేను సస్పెన్స్ కు తెర దించేస్తున్నాను అందరూ జాగ్రత్తగా వినండి. మనమందరమూ మన ఊళ్ళో ముప్పై ఏళ్ళు పైగా ఉన్నా ఒక స్థలం కానీ, ఇల్లు కానీ కొనుక్కోలేకపోయాం అంటూ బాధపడని రోజు లేదు . ఎన్ని సార్లు ఆ వూరు వెళ్ళొస్తున్నా మనకంటూ సొంత ఇల్లు అంటూ లేకపోవడం వల్ల ఎవరో తెలిసిన వాళ్ళింట్లో ఉండటమో, లాడ్జింగుల్లో గడపడం జరుగుతోంది. ఆ లోటు ఎప్పటికీ తీర్చలేనిదిగా ఉండిపోయింది. అటువంటి పరిస్తితులలో చాలా కాలం తర్వాత నాకొక బలమైన ఆలోచన కలిగింది. ఇంతమంది మనకక్కడ ఇల్లూ, వాకిలి లేదు అనుకుంటూ శుష్కమైన సంభాషణలు చేస్తున్నాం కానీ , మనలో ఎవరో ఒకరు మన అమ్మా, నాన్నలకు గుర్తుగా ఒక ఇల్లు ఆ వూళ్ళో కొంటే బాగుంటుందని ఆలోచన ఎవరికీ రాలేదు. మన అందరికీ ఒక్కొక్కళ్ళకు రెండేసి మూడేసి ఇళ్ళు,ఇంకా ఎన్నో స్థలాలు ఈ వూళ్ళో ఉన్నాయి. మన ఆస్తులు ఇక్కడ పెంచుకుంటూ వెళ్దామని అనుకుంటున్నాం కానీ ఇప్పటికీ మన వూరు ఏమిటి అని ఎవరైనా అడిగితే మనముండి వచ్చిన ఊరునే చెప్పుకుంటున్న నేపధ్యంలో ఆశ్చర్యంగా ఈ మధ్య అక్కడే సెటిల్ అయిపోయిన నా పాత మిత్రుడు తన ఇల్లు ఒకటి అమ్మాలని అనుకుంటున్నానని, మన స్నేహానికి గుర్తుగా మీరైతేనే ఆ ఇల్లు తీసుకుంటే తన కోరిక నెరవేరుతుందని, ఈ వూళ్ళో మీకంటూ ఒక ఇల్లు ఉన్నట్టు ఉంటుందని , ఒకటికి నాలుగు సార్లు నాకు ఫోనుల మీద ఫోనులు చేసి చెప్పడంతో ఇంట్లో మేమందరమూ ఒక నిర్ణయానికొచ్చాక ఈ వూళ్ళో ఒక స్థలం అమ్మేసి వెంటనే ఆ ఇల్లు మన అమ్మా నాన్నల పేరు మీద కొనేసి దానికి ఓనర్ షిప్ నేను తీసుకున్నాను. అయితే ఈ విషయం ముందుగా మీ అందరికీ కూడా చెప్పి చేయాలని అనుకున్నా ఎంతో చనువుగా ఉండే నా మిత్రుడు సలహా మీద ఈ విషయం సస్పెన్స్ గా ఉంచి మీ అందరినీ ఒకచోట సమావేశ పరిచి బహిర్గతం చేయాలని తీసుకున్న గట్టి నిర్ణయమే ఇది. నేను చేసిన పని మన వాళ్లందకు సంతోషాన్ని ఇస్తుందని భావిస్తున్నాను. అయితే ఇక్కడ ఒక విషయం గట్టిగా చెప్పాలని అనుకుంటున్నాను. ఆ ఇంటి మీద ఓనర్ షిప్ నాకు ఉంది కానీ ఆ ఇల్లు మన అందరిదీ. దాని మీద మన అందరికీ హక్కు ఉంటుంది. మనలో ఎవరు ఎప్పుడు ఆ వూరు వెళ్ళినా ఆ ఇంట్లో యదేచ్చగా, హాయిగా కుటుంబాలతో సహా గడపచ్చు."మనకూ మన ఊళ్ళో ఒక ఇల్లు ఉంది అనే తృప్తి మన అందరిలో శాశ్వతంగా ఉండిపోవాలి" ఇదీ నా కోరిక . ..." అంటూ కొన్ని గంటలుగా సాగుతున్న ఉత్కంఠతకు తీర తీశాడు సూర్యం.
కలలో కూడా ఎవ్వరూ ఊహించని తమ్ముడు సూర్యం నిర్ణయానికి, ఇన్నాళ్లూ శుష్క కబుర్లతో తమ ఊరిమీద ఎక్కడలేని ప్రేమను వ్యక్తపరుస్తూ కనీసం తమ తల్లి తండ్రుల పేరు మీదట ఒక్క స్మారక చిహ్నాన్ని కూడా మిగల్చక ఒక చోట చేరి రకరకాల రుచులను ఆస్వాదిస్తూ కేవలం తమ దంతసిరిని మాత్రమే తీర్చుకుంటూ ఆత్మవంచన చేసుకుంటున్న ఆ సోదరులకు తమకెప్పుడూ ఊహల్లో కూడా రాని విషయాన్ని తన తమ్ముడు తన నెత్తిమీద వేసుకుని ఆచరణలో కార్య రూపాన్ని కావించి తరతరాలకు అందరూ గుర్తించుకునేలా చేసి తన ఆత్మ విశ్వాసాన్ని బలంగా చాటుకున్న అతని పట్ల ఆ అన్నదమ్ములందరికీ ఆ క్షణంలో ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో అర్ధం కాక వారి గొంతులు చాలా సేపు మౌనంగా మూగగా ఉండిపోయాయి. *****
సమాప్తం