ఇంటికన్నా గుడి పదిలం "

విశాలాంధ్ర ఆదివారం అనుబంధం • 27 Sep 2023 • 👁 1 views
" ఇంటికన్నా గుడి పదిలం " (కథ )
రచన : జీడిగుంట నరసింహ మూర్తి
(27/9/2023 విశాలాంధ్ర ఆదివారం అనుబంధంలో ప్రచురితం )
" ఏమిటి ఈ మధ్య కాలంలో నీ దగ్గర నుండి ఫోనులు లేవు .ఈ రోజు నేనెలా గుర్తొచ్చాను రా బాబూ ?" అడిగాడు శ్రీకాంత్ హఠాత్తుగా వెంకట రమణ ఫోన్ లైన్లోకి రావడంతో.
" భలేవాడివే. నిన్నెలా మర్చిపోతాను అనుకున్నావు ? ఈ మధ్య అమెరికాలో ఆరు నెలలు ఉండి ఇండియా పదిహేను రోజుల క్రితమే వచ్చాములే. . ఇదిగో ఇక వరసబెట్టి మన వాళ్ళందరికీ ఫోనులు చేయాలని కూర్చున్నాను. అందులో ముందు వరసలో నువ్వున్నావు. అందుకే నీనుండి మొదలుపెడుతున్నాను. ఆరోగ్యం అంతా బాగానే ఉందికదా ? ఆ మధ్య సుగర్ కొద్దిగా ఎక్కువుందని , బ్లడ్ కూడా తగ్గిందని చెప్పినట్టు గుర్తు. ఇప్పుడు అన్నీ సర్ధుకున్నాయా ?" అడిగాడు వెంకట రమణ .
" అవన్నీ ఎప్పుడూ ఉండేవే కానీ అమెరికా వెళ్లానని అంటున్నావు. ఒక్కసారైనా అక్కడనుండి ఫోన్ చేయొచ్చుగా. అదేనయ్యా బాబూ . మన వాళ్ళు ఖండాంతరాలు దాటితే ఇక ఎవరూ గుర్తుకు రారు. సంబంధాలు అలా ఏడ్చాయి కానీ ఒకరినని ఏం ప్రయోజనంలే " అన్నాడు శ్రీకాంత్ కొద్దిగా సీరియస్గా. .
"అయ్యో అలా అనుకోకయ్యా బాబూ. మా అమ్మాయి డెలివేరి కోసం వెళ్ళాం. కొద్దిగా సీరియస్ అయ్యిందిలే. ఒకటే టెన్షన్ పడ్డాం. ఈ హడావిడిలో అసలు బాగా దగ్గర వాళ్ళకు కూడా ఫోన్ చేయలేదు. ఏమిటో పిల్లలు విదేశాలలో ఉండటం కాదు కానీ ఇక్కడ మనం టెన్షన్ తో చావాల్సి వస్తోంది. ఏదైనా అర్జెంట్ పడితే అప్పటికప్పుడు తయారయ్యి వెళ్లడానికి అదేమేనా దగ్గరా దాపా ? అక్కడకు వెళ్లడానికి వాళ్ళు ఖర్చు పెడతాం అంటారు కానీ నాకే మొహమాటం. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా వెళ్లడానికి మనకేమీ ఇక్కడ ఆస్తులు పోగేసి లేవు. అయినా ఎందుకో కానీ అక్కడ వాతావరణం మాకు గిట్టదు. ఇక్కడలా మన టాయ్లెట్లు ఉండవు. ఆ కాయితాలతో తుడుచుకోవడం మన వల్ల కాదు. . ఎప్పుడు పడితే అప్పుడు రోడ్ల మీద వెళ్లడానికి వీల్లేదు. ఇక ఆ టీవీలో వచ్చే ప్రోగ్రామ్స్ కూడా చూడటానికి సిగ్గుపడి చావాలనుకో. అయినా ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడుకోవడానికి వీడియో కెమెరాలు ఉన్నాయిగా. ....." చెప్పుకు పోతున్నాడు వెంకట రమణ.
" సరే బాగానే ఉంది కానీ ఈ ఆరునెలలు మాట్లాడనిది ఈ రోజు ఒకేసారి మాట్లాడేస్తావా ? ఇంతకీ మీ అమ్మాయి డెలివేరి సుఖంగా అయ్యింది కదా అదొక్కటీ చెప్పు చాలు. మిగిలిన విషయాలు ఇంకోసారి మాట్లాడుకుందాం. .." అన్నాడు విసుగ్గా శ్రీకాంత్.
" ఆ .. ఆ.. మొత్తానికి భగవంతుని దయవల్ల అంతా సుఖంగానే జరిగింది. ఇక మాటికి మాటికి వెళ్లలేమయ్యా . మా బంధువులు ఎవరో చెపుతూంటే విన్నాను. ఇప్పుడు ఇళ్ళల్లో కూడా సి‌సి కెమెరాలు పెట్టించుకుని ఇక్కడనుండి అమెరికా , అమెరికా నుండి ఇక్కడ ఏం జరుగుతోందో ఇంటికి ఎవరు వస్తున్నారో అంతా చూసేయొచ్చుట. ఇంట్లో దొంగలు దూరినా కూడా వాళ్ళకు తెలిసి పోతుంది. మనం ఒంటరిగా ఉన్నాం అని భయం వాళ్లకూ ఉండదు. వాళ్ళను చూడకుండా ఉంటున్నాం అన్న బెంగ మనకూ ఉండదు. .." అన్నాడు నవ్వుతూ వెంకటరమణ.
"ఇదిగో రమణా ! నీ సోత్కర్ష అంతా ఓపిగ్గా వింటున్నాను కానీ ఇందాక ఒక మాటన్నావు చూడు మాటికి మాటికి అమెరికా వెళ్లలేము అని. ఆ విషయాన్ని నేను ఒప్పుకోనయ్యా. అలా అన్నవాళ్లు అప్పటికప్పుడు ప్రయాణం అనుకుని ఆకాశంలో రెక్కలు కట్టుకుని అక్కడ వాలిపోతున్నారు. ఈ రోజుల్లో డబ్బులు ఎవరూ లెక్క చెయ్యడం లేదు. మాకు తెలిసిన ఒక కుటుంబం ఇప్పటికి అమెరికా 42 సార్లు వెళ్లిందిట. వాళ్ళకు హైదరాబాద్ ఎయిర్పోర్టు నుండి అమెరికా లోని వాళ్ళ ఇంటివరకు ప్రతి ఒక్కరూ పరిచయం అవ్వడమే కాకుండా "ఏమిటి సార్ ఈ సారి ఆలస్యం ఆయ్యింది. ? మీరు రాక పోతే మాకు తోచి చావడం లేదు" అని బాధ పడే వాళ్ళు కూడా ఎక్కువగా ఉన్నారుట. వాళ్ళతో అంతగా అనుబంధం పెరిగిపోయిందిట . ఎప్పుడు పడితే అప్పుడు అమెరికా వెళ్లడానికి ప్రత్యేకంగా రెండు బ్యాగులు సర్ధి పెట్టుకుంటారుట. పిల్లల్ని విదేశాలు పంపుతున్నారు అంటే ఎప్పుడు పడితే అప్పుడు చూడగలం అన్న నమ్మకం ఉండటం వల్లే కదా. నిజానికి ఇండియాలో ఏదైనా ఊరు వెళ్ళాలి అంటే మనకు సంవత్సరాలు టైమ్ తీసుకుంటాం. కానీ ఇప్పుడు అమెరికా లాంటి విదేశాలు ఎప్పుడు తల్చుకుంటే అప్పుడు వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చేస్తున్నారు. పైకి మనం ఎన్నో కబుర్లు చెపుతాము కానీ రానున్న కాలంలో మన పిల్లలందరూ ఇండియా వదిలేసి విదేశాలలో సెటిల్ అయిపోవడం ఖాయం. . ఇక ఇక్కడ కన్నా అక్కడే ఇళ్ళు కొనుక్కోవడం సులభం అని తెలుస్తోంది. అక్కడకు వెళ్ళి ఇళ్ళు కొనుక్కోకుండా ఉన్న వాళ్ళ పేర్లు కొన్ని నాకు చెప్పు. . ఇక్కడ ఆర్ధికంగా సరిగ్గా బ్రతకలేని వాళ్ళు కూడా ఒకసారి తిప్పలు పడి విదేశాలు వెళ్ళాక "మేము ఇక్కడ ఇల్లు కొనుక్కున్నాం " అంటూ మొదటి మెసేజ్ పెడుతున్నారు అంటే ఆశ్చర్యపోనక్కర లేదు. సరే కానీ ఎప్పుడూ ఈ అమెరికా కబుర్లు చెప్పుకోవాలంటే బోరు కొట్టేస్తోందయ్యా. ఏ కథలలో చూసినా ఈ సినిమాలలో చూసినా ఇదే గోల. అయితే ఒకటి మాత్రం నిజం. ఎవరినైనా ఈ మధ్య ఫోన్ చెయ్యడం లేదేమిటి అని అడిగితే మాత్రం అమెరికాలో ఉన్నాం అని జవాబు చెపుతున్నారు. అంత తేలికైపోయింది ప్రతివాళ్ళకు. ఇక నాకు నిద్ర వస్తోంది. ఏదైనా ముఖ్య విషయం ఉంటే రెండు ముక్కల్లో చెప్పేయ్యి. మళ్ళీ ఇంకోరోజు తీరిగ్గా మాట్లాడుకుందాం " అన్నాడు శ్రీకాంత్ . అతని కంఠంలో విసుగు ద్వనిస్తోంది.
" అదే చెప్పబోతున్నాను. నువ్వు అమెరికా గురించి విషయం ఎత్తావు కాబట్టి ఇద్దరి మధ్యా ఇంతసేపు సంభాషణ నడిచింది. చల్లకొచ్చీ ముంత దాచడం ఎందుకు ? ఒకసారి చెన్నైలో చుట్టుపక్కల పుణ్యక్షేత్రాలు చూడాలని నేనూ మా ఆవిడా అనుకుంటున్నాం. అమెరికాలో మా అమ్మాయి కూడా అదే అంటోంది. మీ క్లోజ్ ఫ్రెండ్ ఒకాయన చెన్నైలో ఉంటున్నారు కదా. వాళ్ళ సహాయం తీసుకుని మొత్తం సౌత్ లో ఉన్న పుణ్య క్షేత్రాలు చూసేసి వచ్చేయ్యండి అనడంతో మాలో అప్పుడు తపన మొదలయ్యింది .ఇప్పటివరకు మా అమ్మాయి కోసం అమెరికా వెళ్ళడంతోనే సరిపోతోంది. ఇండియాలో పక్కన ఎన్నో పెట్టుకుని చూడటం లేదంటే మనకే అవమానం.చెన్నై పరిసర ప్రాంతాలలో ముఖ్యమైన ప్రదేశాలు చూడాలంటే కనీసం ఒక పదిహేను రోజులైనా పడుతుంది. ఎక్కడెక్కడో లాడ్జింగుల్లో ఉంటూ ఎక్కడ పడితే అక్కడ భోజనాలు చేస్తూంటే ఒక సారి ఆరోగ్యం దెబ్బ తిందంటే అక్కడ ఇక ఏ ఊరూ తిరగలేము. ఎలాగూ చెన్నైలో నువ్వు ఉంటున్నావు కాబట్టి అనవసరమైన లగేజ్ అంతా మీ ఇంట్లో పడేసి అక్కడనుండి అన్ని ప్రదేశాలు చూడాలని ప్రయత్నం. నువ్వేమీ కంగారు పడకు. అక్కడనుండి మేము ఒక్కళ్ళమే ఆ యాత్రలన్నీ చేస్తాం అనుకుంటున్నావా ? మీరు కూడా మాతో పాటు వస్తారు. మేము ఎక్కడ తిరిగితే మీరు కూడా అక్కడికి వస్తారు. మాతో పాటే తింటారు. ప్రతి రెండు మూడు రోజులకు మళ్ళీ మీ ఇంటికొచ్చేసి రెస్ట్ తీసుకునే ప్లాన్ ఆలోచిద్దాం. మళ్ళీ అక్కడ నుండి వేరే చోట్లకు బయలు దేరుదాము. ఇక ఇంట్లో వంటలు గురించి నీ భార్య ఒక్కత్తే నడుం విరగకొట్టుకోనక్కరలేదు. మా ఆవిడ వంటలు బ్రహ్మాండంగా వండుతుంది. ఇక ఖర్చు గురించి నువ్వు ఆలోచించకు. మొత్తం నాకు వదిలేయ్యి. ఈ విషయంలో నీకు ఏదైనా సమస్య ఉంటే రెండు రోజుల్లో చెప్పేసేయ్యి. అప్పుడు నేను నా ప్రోగ్రామ్ వాయిదా వేసుకోవడమో, లేదా ఇంకొకవైపు వెళ్లడమో చేస్తాను" అన్నాడు వెంకట రమణ సూటిగా తన ప్లాన్ గురించి చెపుతూ. .
"సరే చూద్దాములే. ఈ విషయం గురించి నేను నీతో రేపు మాట్లాడతాను. అంటూ సుధీర్ఘ సంభాషణ జరిగిన అనంతరం ఫోన్ పెట్టేశాడు శ్రీకాంత్ .
** ** ** **
వెంకటరమణ కాఫీ తాగుతూ పేపర్ చదువుతూంటే వాట్స్ యాప్లో ఒక క్లిప్పింగ్ వచ్చింది. "చెన్నైలో మళ్ళీ పడగవిప్పిన కరోనా . ప్రతి వారూ అడుగడుగునా జాగ్రత్తలు తీసుకోవాల్సిన క్లిష్ట సమయం ". అదీ మెసేజ్ పూర్తి వివరాలు .
వచ్చిన మెసేజ్ చూడగానే వెంకట రమణ ఉలిక్కి పడ్డాడు. కరోనా మళ్ళీ కొన్ని ప్రదేశాలలో విజృంభిస్తోంది అని పేపర్లలోనూ, టీవీలలోనూ తను చూస్తున్నాడు. కానీ ఇంత చేటు భయంకరంగా వ్యాపిస్తోందని అతను అనుకోలేదు.
ఇంకో ఐదు నిమిషాల తర్వాత శ్రీకాంత్ నుండి ఫోన్ వచ్చింది.
"రమణా ! నేను పంపిన క్లిప్పింగ్ చూసే ఉంటావు కదా . నువ్వు ఇక్కడికి విహార యాత్రలకు వస్తానంటే దానికి నా సమాధానంగా నేను నీకు ఈ క్లిప్పింగ్ పెట్టలేదు. కేరళ, తమిళనాడు, బెంగళూరులో ఇప్పటికే ఆరోగ్య శాఖ నుండి హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇలాంటి సమయంలో ప్రజలు తీర్ధ యాత్రలు, విహార యాత్రలు మానుకోవాలని దాని సారాంశం. నువ్వు అమెరికాలో ఆరునెలలు ఉండి వచ్చావంటే ఇక్కడ ఇండియా లో కన్నా అక్కడే ఎంతో బెటర్. అయితే నిన్న ఈ విషయం గురించి ఎందుకు చెప్పలేదు అని నీకనుమానం రావచ్చు. నీ ఉత్సాహం మీద నీళ్ళు చల్లడం నా అభిమతం కాదు. కొన్ని ఆధారాలతో నిన్ను ఒప్పించగలను అన్న నమ్మకంతోనే ఈ రోజు ఇక్కడ ఉన్న పరిస్తితిని చెప్పడానికి ప్రయత్నించాను. ప్రస్తుతం మాకు చుట్టు పక్కల పది ఇళ్ళల్లో పైగా కరోనా రొగులు ఉన్నారు. ఇప్పుడు మీ కుటుంబం గానీ, మా కుటుంబం గానీ బయట యాత్రలకు వెళ్ళడం క్షేమం కాదని నా ఉద్దేశ్యం. కొన్నాళ్లు ఈ ప్రోగ్రామ్ పోస్ట్పోన్ చేసుకోవడం మంచిది . ఇక్కడ పరిస్తితి కొంత అదుపులోకి రాగానే తప్పకుండా నువ్వనుకున్న పుణ్య క్షేత్రాలు దర్శించుకుని వద్దాము. .. ఈ విషయంలో దయచేసి నన్ను అపార్ధం చేసుకోకు. నువ్వు కూడా ఒకసారి చెన్నై పేపర్ ఎడిషన్ చూడు. అందులో కరోనాకు సంబంధించిన వివరాలు ఉంటాయి ...." అంటూ ముందు జాగ్రత్తగా తన మిత్రుడు అపార్ధం చేసుకున్నా పర్వాలేదు అనే ఉద్దేశ్యంతో ఉన్నది ఉన్నట్టు చెప్పేశాడు శ్రీకాంత్.
"పర్వాలేదులే. ఇది నీ ఒక్కడి సమస్య కాదు. ప్రపంచంలో ఎక్కడో అక్కడ కరోనా తీవ్ర ప్రభావం చూపిస్తూనే ఉంది. అక్కడి పరిస్తితి మాకన్నా నీకే బాగా తెలుసు. నేను ఏమీ అనుకునేది లేదు ఇందులో. మళ్ళీ పరిస్తితులు కొద్దిగా చక్కబడ్డాక ఆలోచిద్దాములే ..." అంటూ ఫోన్ పెట్టేశాడు వెంకట రమణ .
"ఇప్పుడు కరోనా ఎక్కడా లేదు . హాయిగా ఎక్కడైనా తిరిగేయొచ్చు" అని అనుకోవడానికి వీల్లేకుండా కరోనా తన ప్రతాపాన్ని అప్పుడప్పుడు చూపిస్తున్న నేపధ్యంలో ఏడెనిమిది నెలలు గడిచిపోయింది.
ప్రకృతిలో బీభత్వంగా వర్షం పడి ఆ వెనువెంటనే మళ్ళీ విపరీతంగా ఎండ కాయడం ఎంత సహజమో , అనుకోకుండా కరోనా శాంతించినట్టు ప్రపంచ హెల్త్ డిపార్ట్మెంట్ నుండి వార్తలు వెలువడ్డాయి. కరోనా కేసులు కూడా గణనీయంగా తగ్గిపోయాయి అని గణాంకాలు చెపుతున్నాయి.
ఎప్పటికప్పుడు వార్తలు ఆకళింపు చేసుకునే శ్రీకాంత్ తన స్నేహితుడి కోరిక తీర్చడం తన ధర్మం అనుకుని ఆ రోజు ఫోన్ చేసి ' ఇప్పుడు ఇక్కడ అంతా బాగానే ఉంది. సరిగ్గా ఈ సమయంలో మన ప్రోగ్రామ్ వేసుకుంటే సేఫ్ గా బయట పడగలం"అని చెప్పాలనుకుని వెంకట రమణకు ఫోన్ చేశాడు
వెంకట రమణ ఫోన్ స్విచ్చాఫ్ వస్తోంది. ఇంకో వారం రోజుల తర్వాత అనుకుంటా వెంకట రమణ నుండి శ్రీకాంత్ కు వాట్స్యాప్ ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ సారాంశం ఏమిటంటే తను కుటుంబంతో సహా పది రోజుల క్రితం అమెరికా వచ్చాడని. మరో ఆరునెలలు అక్కడే ఉండబోతున్నాడని.
వెంకట రమణ లాంటి వాళ్ళకు ఎక్కడో అక్కడ కాలక్షేపం కాకుండా ఉండదు . ఇండియాలో ఉండలేకపోతే అమెరికా. అక్కడ కాకపోతే ఇండియా.
" అవును .చూస్తూంటే మనకు అమెరికానే దగ్గరగా ఉన్నట్టుంది.ఇక్కడ తిరగడానికి భయపడే వాళ్ళు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా, ప్రాణాంతక వ్యాధులు వచ్చినా ఖండాంతరాలు దాటేసి వెళ్లిపోతున్నారంటే వాళ్ళు ఇంటికన్నా గుడి పదిలం అనుకుంటుంటున్నట్టున్నారు .ఇక్కడ ఇండియాలో ఏదో ఒక ప్రాణాంతక వ్యాధితో ఒకటి తర్వాత ఒకటి వచ్చి ఏ వూరు వెళ్లాలని ప్రయత్నం చేసినా నిత్యం భయపడి చావాల్సిందే . పోనీలే ఏదో విధంగా వెంకట రమణనేనా ఎంజాయ్ చెయ్యనీ ..." అని అనుకుంటూ ఉంటే శ్రీకాంత్ పెదవుల మీద ఒక విలక్షణమైన నవ్వు మెరిసింది. ******
సమాప్తం