పరిష్కారం దొరికింది

సహరి మాసపత్రిక • 01 Oct 2021 • 👁 1 views
పరిష్కారం దొరికింది ( కథ )
(అక్టోబర్ 2021 సహరి మాస పత్రికలో ప్రచురితం )
రచన : జీడిగుంట నరసింహమూర్తి
“ నాకిక ఈ సంసార బంధాలు వద్దురా నాయనా ! మీనాన్న బ్రతికున్నంతవరకు ఏడ్పించేశాడు. ఎప్పుడు చూసినా ఇంటినిండా చుట్టాలు. వాళ్ళందరికీ వండిపొయ్యలేక నరకం అనుభవించాను. ఆరోగ్యం బాగాలేకపోయినా ఏనాడూ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి ఎరగడు. రోగం వస్తే అదేదో నేరం చేసినట్టు దెప్పిపొడుస్తూ వుండేవాడు. . పనిమనుషులు సరిగ్గా దొరికే వాళ్ళు కారు. రాత్రి పదింటి తర్వాత కూర్చుని చేతులు పడిపోయేటట్టుగా అంట్లన్నీ తోమాల్సి వచ్చేది. . బజార్లో దొరికిన కూరలన్నీ తెచ్చిపడేసి వచ్చిన చుట్టాలకు వండమనే వాడు . సగం ఆయుషు అప్పుడే ఆవిరైపోయింది “
“ఇప్పుడు మాత్రం ఏం మిగిలింది చెప్పు ? ఎటువంటి ఆర్ధిక వెసులుబాటు లేకుండా కనీసం వృద్దాప్యంలో అనుభవించడానికి పెన్షన్ కూడా లేకుండా నీమీద, కోడలి మీద ఆధారపడి బ్రతుకుతున్నాను . . ఇక్కడ మీరు నాకు అన్ని సౌకర్యాలు కలిగిస్తున్నట్టు మీరు అనుకోవచ్చు. మనశ్శాంతి అనేది దొరకనప్పుడు ఏమి చేస్తే మాత్రం ఏం ప్రయోజనం ? నేనంటే పిల్లలకు కూడా ప్రేమ లేదు. ఒంట్లో బాగున్నా లేకపోయినా చాకిరీ తప్పడం లేదు. ఈ వయసులో ఎవరైనా వండిపెడితే తిని కాస్త విశ్రాంతి తీసుకునే సమయం. ఈ తల్లి దగ్గర ఎప్పుడైనా ఒక్క అయిదు నిమిషాలు గడిపావా ? కడుపు చించుకుంటే కాలు మీద పడుతుందని మిమ్మల్ని అనుకుని ఏం లాభం లేదు. . . జీవితం అంతా ఇలాగే గడిచిపోయేటట్టుగా వుంది. ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే నన్ను వృద్దాశ్రమంలో చేర్చమని నిన్ను ప్రాధేయ పడాలని. అవునురా నా వయసు వారికి అక్కడ అన్నివిధాలుగా బాగా చూసుకుంటారుట. చిన్న చిన్న పనులు చేసుకోగలిగితే చాలుట. నీకు కూడా ఆదాయం అంతంత మాత్రంగానే వుంది. నీ తండ్రి సంపాదించిన ఆస్తి అంటూ ఏమీ లేదు నీకు ఆర్ధికంగా సాయపడటానికి . నిజానికి ఏ తల్లి తండ్రులు తమకు తాముగా ఇటువంటి కోరిక కోరరు. కానీ ఒకటి మాత్రం నిజం . పరిస్తితులతో రాజీపడలేక వృద్దాశ్రమాల బాట పడతారు. అయితే నీకు నేను ఒక మాట ఇస్తున్నాను.” ఇది కేవలం నా కోరికమీద, నా అభిమతంతోనే నా బలవంతమ్మీదనే నా కొడుకు, కోడలకు ఇష్టం లేని పరిస్తితిలలో నన్ను వృద్దాశ్రమంలో చేర్చారు కానీ వాళ్ళకు ఎటువంటి దురుద్దేశం లేదు “ అని నేను బాండ్ పేపర్ మీద రాసి వుంచుతాను.ఈ విషయంలో మీ మీ ఇరువురికీ ఎటువంటి చెడ్డపేరు రావడం నా కిష్టం లేదు. ఈరోజునుండి ఇక నువ్వు ఆ పనిలో వుండు . ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయంతో నాకు కొంత మనశ్శాంతి దొరుకుతుంది .మీకూ కొంత వెసులుబాటు లభిస్తుంది. “ అంటూ సుదీర్ఘంగా కొడుకు రాజాతో చర్చించి బలవంతాన చేతిలో చెయ్యి కూడా వేయించుకుంది మహలక్ష్మి.
ఒక పక్క తల్లి తండ్రులను నిర్లక్ష్యంగా వృద్దాశ్రమాలకు తోలేస్తున్న కొడుకులను తూర్పారబట్టే కార్యక్రమాలు ఎక్కడచూసినా వువ్వెత్తున ఎగిసిపడుతూ వుంటే ఎంత తల్లి తన ఇష్ట ప్రకారం వృద్దాశ్రమంలో చేర్పించమన్నా కూడా తను ఇంత నిర్లజ్జగా అమానవీయంగా ప్రవర్తిస్తే లోకం నిస్సందేహంగా గడ్డి పెడుతుంది. తప్పదు . ప్రస్తుత పరిస్తితిలలో ఇంట్లో ఎవ్వరికీ మనశ్శాంతి లేదు . గత కొద్ది రోజులుగా తల్లికి , భార్యకు మధ్య అసలు పొసగడం లేదు. ఉప్పూ నిప్పులా వుంది . చాలా మంది భార్యలు పోరుతున్నట్టుగానే రమణి కూడా రాత్రిళ్ళు తనకి నిద్ర పట్టకుండా చేసేది . ఒక పక్క ఎదుగుతున్న పిల్లల భవిష్యత్తు చూసుకోవాలి. సాధారణమైన ఆర్దిక పరిస్తితులతో ఇంట్లో అందరినీ సంతృప్తి పరచాలి. నానాటికీ పరిష్కారం దరిదాపుల్లో దొరకని ఈ సమయంలో తల్లి తన ఇష్టం మీదనే వృద్దాశ్రమంలో చేర్పించమని కోరుకుంటోందంటే ఒక రకంగా గుట్టు చప్పుడు కాకుండా వృద్దాశ్రమంలో చేర్చడం తప్ప వేరే దారి కనిపించడం లేదు. రాజా మనసు పూర్తిగా మొద్దుబారింది. మంచీ చెడు ఆలోచించే విచక్షణ పూర్తిగా కోల్పోయాడు .
“అమ్మా నీ వస్తువులు అన్నీ జాగ్రత్తగా సర్దుకో. ముఖ్యంగా మందులు . నువ్వేమీ దిగులు పడొద్దు. మేము అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తాం. పైగా ఇంతకు ముందులా వృద్దాశ్రమాలు లేవు. వాళ్ళు వృద్దులను ఏ లోటూ రానీయకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. . నువ్వు అనుకుంటున్నట్టు జీవితమంతా చాకిరీ చేసి అలసిపోయిన నీకు కొంతలో కొంత మనశ్శాంతి దొరుకుతుంది. ఈ రోజునుండి అదే పని మీద వుంటాను “ అంటూ తల్లికి భరోసా కల్పించాడు రాజా ఒకరోజు ..
వారం పది రోజులు గడిచిపోయాయి. కొడుకు నుండి ఎటువంటి స్పందనా లేదు.
“ ఏరా అబ్బాయి ఏం చేశావు నా విషయం ?” అని అడిగింది మహాలక్ష్మి ఉండబట్టలేక .
“ లేదమ్మా నిన్ను వుడికించడానికి నేను ఒప్పుకున్నట్టు అలా నటించాను. నేనంత కఠినాత్ముడిని కాను. నా బంగారు తల్లిని దూరం చేసుకుంటానా ? నాన్న పోయాక నాకే లోటు రానియ్యకుండా రోగం వచ్చినా రొచ్చొచ్చినా పక్కనే వుండి అన్ని సేవలు చేస్తూ కంటికి రెప్పలా కాపాడుకున్నావు . అప్పుడప్పుడు నేను చేసే తమాషాలలో నిన్ను వృద్దాశ్రమానికి పంపిస్తాననడం కూడా ఒక భాగం. ఈ తమాషాలో నీ కోడలు కూడా సరదాగా నాకు సహకరించింది. ఇక్కడ నీకే లోటు రానియ్యకుండా నా ప్రాణంలా చూసుకుంటాను “ అంటూ తల్లిని దగ్గరకు తీసుకున్నాడు రాజా. నిజానికి మహాలక్ష్మికి కూడా వృద్దాశ్రమానికి పోవడానికి , అక్కడ పరిస్తితులు ఎదుర్కోవడానికి సుతారం ఇష్టం లేదు. కొడుకుమీద ఒక బాణం విసిరి చూసింది. ఏది ఏమైతేనేం మళ్ళీ పరిస్తితులు యధాస్తితికి వచ్చాయి.
నిజానికి రెండు రోజులక్రితం మొగుడూ పెళ్ళాల మధ్య జరిగిన ఒక రహస్య సంభాషణ మహాలక్ష్మికి తెలిసే అవకాశమే లేదు. ఆ విషయం ఆ గదిలోనే సజీవ సమాధి అయ్యింది .
“ ఏమండీ మీ అమ్మగారి విషయం కనుక్కున్నారా లేదా పాపం ఆవిడ సామాన్లు కూడా సర్ధుకు కూర్చుంది “ అంది రమణి మొగుడి పక్కన వచ్చి కూర్చుని .
“ ఆ .. ఆ .. కాళ్లరిగేటట్టు తిరుగుతూనే వున్నాను. ఇప్పుడు వృద్దాశ్రమాల నిర్వాహకులు బాగా తెలివి మీరారు. ఏదో రకంగా కొడుకులు తల్లి తండ్రులను వదుల్చుకోవాలని చూస్తున్న పరిస్తితులను సొమ్ము చేసుకోవాలని లక్షల కొద్దీ డొనేషన్లు కడితే కానీ వృద్దులను ఎవరినీ చేర్చుకోవడం లేదు. ఇప్పుడు మా అమ్మకు ఐదు లక్షలు కట్టమన్నారు . ఇది కూడా స్పెషల్ ఆఫరుట . . దీనికి కూడా ఎవరైనా బాగా పేరున్న వాళ్ళు రికమండ్ చేస్తేనట . ఏదో శాస్త్రం చెప్పినట్టు ఇంట్లో ఖర్చు ఎక్కువయ్యి ఎలా తగ్గించాలో తెలియక సతమతమవుతూ వుంటే అప్పులు చేసి కూడా ఆవిడను వృద్దాశ్రమాలకు పంపించాల్సిన అవసరం ఏముంది ? పెద్దావిడ ఆవిడ పని ఆవిడ చేసుకుంటోంది. పనిమనిషి రానప్పుడు ఓపిక లేకపోయినా నీకు సాయం చేస్తోంది కదా. పిల్లలు విసిగిస్తున్నా దగ్గరకు తీస్తోంది. మనం వూరెళ్లినప్పుడు ఇంటికి కాపలాగా కూడా వుంటోంది. అప్పడాలు, వడియాలు లాంటివి చేసి మండుటెండలో కూడా ఆరేసి పెడుతోంది. ఇవన్నీ మనం మర్చిపోయి వృద్దులంతా వ్యర్ధులు అని తక్కువ చేసి వాళ్ళను వదిలించుకోవాలనుకోవడం నాకే సిగ్గనిపిస్తోంది. నువ్వు కాస్త ఆవిడతో ప్రేమగా వుంటూ మనసులో వ్యర్ధమైన ఆలోచనలకు తావు ఇవ్వకుండా నడుచుకో . మనమధ్య జరిగిన సంభాషణ పొరపాటున కూడా ఆవిడకు తెలియనియ్యకు అంటున్నాడు రాజా. ఇప్పుడతనికి ఎన్నో లక్షల అప్పులు తీర్చేసినంత రిలీఫ్ కలిగింది.
మహాలక్ష్మమ్మకు జీవితం మీద వూహించని భరోసా ఏర్పడింది. ఇప్పుడు ఆవిడ పనులు రెచ్చించిన వుత్సాహంతో చేసుకుపోతోంది ******
సమాప్తం