అవమానం

సహరి వార పత్రిక • 18 Feb 2022 • 👁 2 views
అవమానం ( కథ )
రచన : జీడిగుంట నరసింహ మూర్తి
(18/2/2022 సహరి వార పత్రికలో ప్రచురితం )
రామారావు ఎన్నో కంపినీలలో ఉద్యోగం చేసి విసిగెత్తిపోయాడు. రాత్రింబవళ్ళు తిండీ తిప్పలు పక్కన పెట్టి పనిచేసినా చీటికీ మాటికీ అవమానాలు ఎదుర్కోక తప్పలేదు. దానితో ఒకరోజు ఉద్యోగాలపై విరక్తి పుట్టి ఒక దుర్ముహూర్తాన ఏభైయారు వయసు దాటకుండానే బాస్ మొహంపై రాజీనామా లేఖ పారేసి ఇంటికొచ్చేశాడు.
ఇంట్లో వూరుకునే కూర్చోవడంతో పెళ్ళానికి , పిల్లలకు , చివరకు వూళ్ళో వాళ్ళకు కూడా లోకువైపోయాడు రామారావు. పని చేసిన ఆఫీసుల్లో ఒక రకమైన అవమానాలు భరిస్తే “ఏ సంపాదనా లేకుండా వూరుమీద పడి తిరుగుతున్నాడు మేమంతా ఉద్యోగాలు చేసి రిటైరైపోయినా కూడా ఖాళీగా కూర్చోకుండా ఏదో ఒక పని చేసుకోవడం లేదా ?” అంటూ దగ్గర బంధువులు కొంతమంది శుభకార్యాలకు కూడా పిలవడం మానేసి అవమానించడం మొదలెట్టారు.
“నేను ఎంతోమందికి ఉద్యోగాలు వేయించానురా. నీకు ఇంటరెస్ట్ వుంటే చెప్పు మా సొంత ఆఫీసులో ఏదో ఒక పోస్ట్ క్రియేట్ చేసి ఇస్తాను. అలా ఏ పని లేకుండా వుంటే త్వరగా చచ్చిపోతారురా . నీ మంచి కోసం చెపుతున్నాను .నీ ఇష్టం “ అంటూ రామారావు కజిన్ మోహన్రావు ఏదో సందర్భంలో కలిసినప్పుడు హెచ్చరించడం , దానికి ఇంట్లో వాళ్ళు కూడా మద్దతు తెలపడంతో ఏమాత్రం ఇష్టం లేకపోయినా ముప్పై నలబై కిలోమీటర్ల దూరంలో వున్న అతని కజిన్ హౌస్ కం ఆఫీసుకు ఎర్రని ఎండలో బస్సులు పట్టుకుని ఇంటర్వ్యూకు వెళ్ళాడు.
ముందు గదిలో ఒక టైపిస్ట్ బండెడు పేపర్లు వేసుకుని ముచ్చెమటలు కారిపోతూ టైపు చేస్తున్నాడు. పైన ఫ్యాన్ కూడా తిరగడం లేదు. రామారావు పక్కనే వున్న కుర్చీలో కూలబడ్డాడు. తను వచ్చినట్టు సంకేతాలు వెళ్ళినా కూడా మోహన్రావు బయటకు రాలేదు . అతని ముందునుండే మోహన్రావు భార్య, పిల్లలు హడావిడిగా అటూ ఇటూ తిరుగుతున్నారు కానీ రామారావు రాకను పట్టించుకోవడం లేదు. ఏ దేవుడో కరుణించినట్టు చివరకు రెండు గంటల నిరీక్షణ తరవాత మోహన్రావు నుండి లోపలకు పిలుపు వచ్చింది. తనకు బాగా దగ్గర బంధువైనా కూడా అతను ఇప్పుడు ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అవడంతో అన్ని ఫార్మాలిటీస్ పాటించాల్సి వచ్చింది.
“ అసలు నువ్వు ఎన్నో కంపినీలలో పనిచేసావు కదా . ఒక్కచోట కూడా ఎందుకు నిలదొక్కులేకపోయావ్ ?” అంటూ మోహన్రావు వేసిన నషాలాన్ని అంటే మొట్టమొదటి ప్రశ్నకు రామారావు మొహం అవమానంతో జేవురించింది.
“ఇప్పుడు నీకోసం ప్రత్యేకంగా ఏదైనా ఉద్యోగం కేటాయిస్తే ఇక్కడ మొదటినుండి పనిచేస్తున్న వాళ్ళు అభ్యంతరం పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్నాళ్లు నేను చెప్పిన పని ఏదో ఒకటి చేస్తూ వుంటే వాళ్ళకు అలవాటు అయ్యి మెల్లిమెల్లిగా పాతుకుపోవచ్చు. ప్రస్తుతం నాకు బజారు పనులు చేసి వాళ్ళు లేరు. కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు కట్టడం ఆలస్యం అవుతోంది. నేను ఎక్కువగా క్యాంపులకు వెళ్లాల్సి వుంటంతో వాటికి సంబంధించిన టికెట్లు రిజర్వేషన్ల బాధ్యత కూడా చేసే వాళ్ళు లేరు. కొంతకాలం వరకు నువ్వు ఖాళీగా వుండాల్సి వస్తుంది కనుక ఇటువంటి పనులు మొదట్లో నువ్వు చెయ్యగలిగితే ఆ తర్వాత నీ చురుకుదనం బట్టి ఆఫీసులో ఏదో ఒక పోస్ట్ చూసి అందులో పడేస్తాను. నీకు ఇష్టమైతే రేపే వచ్చి జాయిన్ అవ్వొచ్చు” అన్నాడు మోహన్రావు ఇక నీ ఇంటర్వ్యూ అయిపోయింది నువ్వు వెళ్లొచ్చు అని అర్ధం వచ్చేటట్టుగా తన సీటులోంచి లేచి లోపలకు వెళ్లిపోయాడు .
బయటకు వచ్చాక రామారావుకు అనిపించింది తను అనవసరంగా, అకారణంగా గోరంతలు కొండంతలు చేసుకుని నిక్షేపం లాంటి ఉద్యోగం వదులుకొచ్చానా అని. మోహన్రావు ఇప్పుడు ఇంత దారుణంగా చేసిన అవమానంతో పోల్చుకుంటే తను ఆఫీసులలో పడ్డ అవమానాలు ఏ పాటి ? నెలోచ్చేసరికి టంచన్గా జీతాలు తీసుకునేటప్పుడు ఆ మాత్రం తనకు సహనం లేకపోతే ఎలా ? తను పొరపాటు చేశాడు . తను అహంకారంతో చేసిన తప్పును జీవితంలో సరిదిద్దుకోగలడా ? తన తొందరపాటుకు శిక్ష అనుభవించ వలసిందే. మనసును ప్రక్షాళన చేసుకున్నాక మోహన్రావు నిట్ట నిలువునా చేసిన అవమానం తాలూకు భారం మెల్లమెల్లగా దిగి రామారావుకు ఇప్పుడు తదుపరి కర్తవ్యం బోధపడింది . ********
సమాప్తం