సన్మాన పత్రం (కథ ) రచన : జీడిగుంట నరసింహ మూర్తి
(ఫిబ్రవరి 2022 సహరి మాస పత్రికలో ప్రచురితం )
“ఇక్కడ సన్మాన పత్రాలు రాయబడును” అన్న బోర్డు చూసి లోపలకు తొంగిచూశాడు వైకుంఠరావు . హాస్పటల్లో వెయిటింగ్ రూమ్ దగ్గర ఎప్పుడు పిలుపు వస్తుందా అని చూసే పేషంట్లు లాగా వరసగా కుర్చీలలో కొంతమంది కూర్చుని వున్నారు. వాళ్ళ మెడల్లో వాళ్ళు కవులు, కళాకారులు అన్న గుర్తుగా రకరాల కండువాలు చుట్టి వున్నాయి .కొంతమంది చేతిలో కాయితాల దొంతరలు కనిపిస్తున్నాయి. వాళ్ళల్లో కొందరు పెన్నుతో ఏవో అండర్ లైన్ చేసుకుంటూ వున్నారు. అంతమంది జనాలను చూసిన వైకుంఠ రావు ఒంటరిగా సన్మాన పత్రాలు రాసే ఆయన్ని కలవాలన్న ప్రయత్నం వాయిదా వేసుకుని వెనక్కి వెళ్లబోతూ వుంటే అక్కడున్న అసిస్టెంట్ “ రండి.. రండి కవి గారు . పని త్వరగానే అయిపోతుంది వచ్చి కూర్చోండి అన్నాడు . .
అందరూ వెళ్ళిపోయారు తను ఒక్కడినే మిగిలాను అని కన్ఫర్మ్ చేసుకున్నాక రెండు గంటల దీర్ఘ నిరీక్షణ అనంతరం వైకుంఠరావు వంతు వచ్చి లోపలికి ప్రవేశించాడు . .
“ మీ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ?” అడిగాడు ముకుందరావు .ఆయనే సన్మాన పత్రాలు తయారుచేసే వ్యక్తి .మనిషి పుష్టిగా బలంగా వున్నాడు. ఆ చేతికీ, ఈ చేతికీ అన్ని రకాల లోహాల ఉంగరాలు తళతళ మెరిసిపోతున్నాయి. ఇది కాక ముంజేతికి ఒక బరువైన కడియం చూస్తూంటే ఎవరికైనా అనిపిస్తుంది ఆయన వ్యాపారం దినదినాభివృద్దిగా పరుగులెత్తుతోందని. .
“ అదేనండీ. వారం రోజులలో నాకో సన్మానం వుంది. సన్మాన పత్రం బాగా ఆకర్షణీయంగా వుండాలి. ఇక నా గురించి చెప్పాలంటే చిన్నప్పటినుండి చాలా మంది కవులతో తిరిగిన అనుభవం వుంది.పుస్తకాల పిచ్చి కూడా ఇంతా అంతా కాదు. ఈ సమాజం మీద ఏదేదో రాసేయ్యాలని కసి ,తపన అణువణువునా వుంది. .ఆ తపనతోనే సుమారు 100 కథలు పైగా రాశాను. వాటితో పాటు ఐదారు నవలలు .. ఇంకా ఇంకా సినిమా సాహిత్యం, పాటలు ఇవన్నీ కూడా అంటే చాలా అభిలాష “
“చాలా బాగుందండీ. ఇవి చాలు మీకు సన్మాన పత్రం అద్భుతంగా రాయడానికి. ఏదీ మీ కథలు కొన్ని చూపించండి “ అంటూ అతని చేతిలోని బ్యాగు వైపు చూశాడు ముకుందరావు .
“ అదే అదే దానిగురించి మీతో పర్సనల్గా మాట్లాడాలని వచ్చాను. నిజానికి నేను రాశానన్న 100 కథలు, ఇతర నవలలు అన్నీ ఆముద్రితాలు. ఇంతవరకు ఎక్కడా అచ్చుకాలేదు. సన్మాన పత్రంలో అచ్చు విషయం ఎక్కడా ఎత్తకుండా ఇవన్నీ సంకలనాల రూపంలో అచ్చులో వున్నాయి అని రాయాలి. నాకు సన్మానం చేయించుకోవాలని పిచ్చి ఎక్కువగా వుంది. కానీ అవి ఇంతవరకు ఏ పత్రిక వాళ్ళు ఒక్క రచన కూడా తీసుకోకపోయావడం వల్ల నా కోరిక తీరేటట్టుగా కనిపించడం లేదు. మీరు దయచేసి ఆ లోటు తెలియకుండా నలుగురూ అసూయపడేలా సన్మాన పత్రం ముద్రించి ఇవ్వాలి. అందుకు ఎంత డబ్బైనా పర్వాలేదు. నాకు నా పని కావడం ముఖ్యం “ అన్నాడు వైకుంఠరావు సిగ్గుపడుతూ.
“ అయ్యో ఏమీ పర్వాలేదు సార్. ఈ విషయంలో మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నా దగ్గరకు వస్తున్న వాళ్ళంతా సగానికి పైగా మీలాంటివారే “ అంటూ ముకుందరావు ఐదు నిమిషాలలో పరపరా సన్మాన పత్రం రాసేసి వైకుంఠరావు చేతిలో పెట్టాడు అందుకు ఫీజు ఐదువేల రూపాయలు అందుకుంటూ *****.
సమాప్తం