/అవివేకం/
తెల్లారు ఐదింటికి లేచి తన ఫేస్బుక్ అకౌంట్లో ఉన్న లైకులు,కామెంట్లను, అన్ని చదువుకొని వాటికి రిప్లై ఇచ్చాకే నిత్య కృత్యాలను మొదలుపెట్టేవాడు గోపి. ఎప్పటిలాగే ఆరోజు ఉదయాన్నే లేచి మొబైల్ని చూసుకున్నాడు. 10 మిస్సుడు కాల్స్ ఉన్నాయి. రోజు రాత్రిపూట వచ్చే నోటిఫికేషన్ సౌండ్కి చిరాకు పడేది గోపి భార్య ఝాన్సీ .
అందుకే పడుకునే ముందు మొబైల్ని సైలెంట్ మోడ్లో పెట్టి పడుకోవడం అలవాటు.
అలానే ఆరోజు కూడా పడుకునే ముందు ఫోను సైలెంట్ మోడ్లో పెట్టి పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయం తన ఫోన్లో 10 మిస్డ్ కాల్స్ చూసి కంగారు పడ్డాడు. ఆ నంబరు కూడా కొత్త నంబరు.
వెంటనే ట్రూ కాలర్ ఓపెన్ చేసి ఆ నెంబర్ ఎవరిది అని చెక్ చేసాడు. ఏమి సమాచారం రాలేదు.
నెంబర్ సరిగ్గా ఉన్నదో లేదో అని స్క్రీన్ జూమ్ చేసి చూసాడు. అదొక ల్యాండ్ లైన్ నెంబర్. అందుకే వివరాలు లేవు.
ఫోన్ చేద్దామని అనుకున్నాడు. కానీ ఈ సమయంలో కాల్ చేస్తే సభ్యతగా ఉంటుందో ఉండదో అనుకుంటూనే... ఆత్రం ఆపుకోలేక కాల్ చేశాడు. కానీ ఎవరు ఎత్తలేదు. మళ్లీ కాసేపయ్యాక మరొకసారి ప్రయత్నిద్దాం అనుకున్నాడు.
ఉదయాన్నే లేచి ఇల్లు శుభ్రం చేసుకుని కాఫీ తాగుతూ పిల్లలిద్దరితో మాట్లాడటం ఝాన్సీకి అలవాటు.
పెద్దది కావ్య హైదరాబాదులో ఐఐటీ చేస్తుంది. బాబు ఎన్ఐటిలో సీటు వచ్చి మొదటి సంవత్సరం వరంగల్ కాలేజీలో చదువుతున్నాడు.
పిల్లలిద్దరూ చెరో పక్క వెళ్ళిపోవడంతో ఇంటిలో ఒంటరిగా అయిపోయింది ఝాన్సీ.
పిల్లల భవిష్యత్తు కన్నా తల్లిదండ్రులకు కావాల్సిందేముంది. వారి ఎదుగుదలే మన భవిష్యత్తు కదా అనుకొని సర్దిచెప్పుకుంటూ కాలం వెళ్లబుచ్చేది ఝాన్సీ.
రోజులానే ఆరోజు కూడా పిల్లలకి ఫోన్ చేద్దామని అనుకుంటే తన ఫోను రిపేర్ షాప్కి ఇచ్చి మూడు రోజులవుతున్న తీసుకురావడం మర్చిపోతున్నాడు గోపి.
"ఏవండోయ్ నా ఫోన్ తెచ్చారా? అని అడిగింది" ఝాన్సీ
'లేదే...మర్చిపోయాను'.
'ఈరోజు ఎలాగైనా కచ్చితంగా తెచ్చి పెడతాను అన్నాడు గోపి.
"సర్లే ఇదే మాట మూడు రోజుల నుంచి చెప్పుతున్నారు మిమ్మల్ని నమ్ముకునే బదులు నేను వెళ్లి తెచ్చుకున్నా బాగుండు ఆ చీటీ ఇలా ఇవ్వండి అంది చేతికి కాఫీ అందిస్తూ "
'ఫోన్లో దూరిపోయి మరి మెసేజ్ టైప్ చేస్తున్న గోపి ఒక నిమిషం ఆ కాఫీ టేబుల్ మీద పెట్టు నేను ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతున్నాను అన్నాడు."
"ఏముంటాయి రోజు... గుడ్ మార్నింగ్లు, గుడ్ నైట్లు చెప్పుకోవడం తప్ప, అంతకన్నా మీరుద్ధరించేది ఏంటంట ఆ ఫేస్బుక్లో అని చిరాకు పడింది ఝాన్సీ "
'నీకు చెప్పిన అర్థం కాదులే నన్ను వదిలేయ్ అన్నాడు' గోపి.
"చెప్పి చెప్పి నోరు నొప్పి పెట్టి ఎప్పుడో వదిలేసాను ఇప్పుడు కొత్తగా వదిలేయడానికి ఏమీ లేదు కాకపోతే పిల్లలిద్దరితో మాట్లాడాలి ఒక క్షణం ఆపి ఆ ఫోన్ ఇస్తే పిల్లలతో మాట్లాడి ఇచ్చేస్తాను అని అడిగింది" ఝాన్సీ.
'అబ్బా ఇస్తాను లేవే! చాలా సీరియస్ డిస్కషన్ అవుతుంది ఇక్కడ .నిన్న రాత్రి పెట్టిన ఒక పోస్ట్కి ఎవడో నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. వాడికి సరైన సమాధానం ఇవ్వద్దు అన్నాడు గోపి కోపంగా '
"ఎవడో ముక్కు ముఖం తెలియని వాడు ఏదో పెట్టాడని వాడికి సమాధానం ఇవ్వడం అంత అవసరమంటారా ?
పిల్లలతో మాట్లాడటం ముఖ్యమంటారా ? అని గుర్రున చూసింది"
'రోజు నేను పెట్టే పోస్టులకు ఎన్ని వందల మంది నన్ను ఫాలో అవుతూ అభిమానిస్తున్నారో నీకేం తెలుసు. ఇల్లే నీకు ప్రపంచం లోకంలో ఏం జరుగుతుంది ఎలా ఉన్నారు? అన్నది నీకు ఏమీ తెలియదు. అందుకే ఇలా మాట్లాడుతున్నావ్' అని కసురుకుంటూ ఫోన్ ఇచ్చాడు.
"అవును నాకు ఏమీ తెలియదు. నా పిల్లలు నా భర్త నాకు ముఖ్యం.వాళ్లే నా ప్రపంచం. ఊరందరి సంగతి నాకు అనవసరం అంటూ చేతిలో ఫోను తీసుకుంది.
ఝాన్సీ కావ్యకి ఫోన్ చేసింది. నాట్ రీచబుల్ అని వచ్చింది. మళ్లీ చేసింది. మళ్లీ అదే వస్తుంది.
అదేంటండీ పాప సెమినార్కి వెళ్ళింది కదా! అక్కడ సిగ్నల్స్ లేవా ఏంటి? ఎన్నిసార్లు చేసినా ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది అని చెప్పింది గోపికి.
'అదే అయ్యుంటుంది లేవే, ఒక మెసేజ్ పెట్టు, పాప తీరిగ్గా ఉన్న సమయం చూసుకొని తనే కాల్ చేస్తుంది. అన్నింటికీ కంగారే 'అని సముదాయించాడు.
అంతే అయ్యుంటుంది అని తనలో తాను అనుకొని కొడుకుకి కాల్ చేసింది ఝాన్సీ.
కొడుకుతో మాట్లాడేసి ఫోను గోపికి ఇచ్చి మళ్ళీ తన పనిలో తను నిమగ్నం అయిపోయింది.
గోపి ఊర్లో ఉన్న ఇంటర్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్నాడు. ఉదయాన్నే చిన్నపిల్లాడిలా లంచ్ బాక్స్ పట్టుకెళ్తే మళ్ళీ ఎప్పుడో సాయంత్రానికి కానీ ఇంటికి రాడు. వచ్చాక కూడా ఆ మొబైల్ పట్టుకొని కూర్చుంటాడు.ఇక గోపి ఇంట్లో ఉన్నా లేనట్టే. ఎన్నోసార్లు ఝాన్సీకి గోపీకి ఇదే విషయంలో గొడవలు కూడా జరిగాయి.
చిన్నప్పటి నుంచి పెద్ద కవి అవ్వాలని గోపి కోరిక.
కానీ చదువు , ఆ తర్వాత పెళ్లి ,బాధ్యతల వలన తన కోరిక తీరలేదు.
ఒకటి రెండు సార్లు తన మనసులో భావాలను రాసి పేపర్ వాళ్లకి పంపించాడు. కానీ వాళ్లు స్వీకరించలేదు.
కానీ తీరని కోరిక మనసులో అలానే ఉండిపోవడంతో తనకు నచ్చినది తను రాయాలనుకున్నవి చెప్పాలనుకున్నవి అప్పుడప్పుడు రాసుకుంటూ ఉండేవాడు.
అలా ఫేస్బుక్ వచ్చాక తన మిత్రుడు సలహాతో ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో రాయడం మొదలుపెట్టాడు.
మొదట్లో ఎవరూ పెద్దగా స్పందించేవారు కాదు.
రాను రాను ఫేస్బుక్లో స్నేహితుల లిస్టు పెరిగి 5000 మంది ఫాలోవర్స్ పెరిగారు . గోపి పెట్టిన పొస్టుకి కనీసం 100 లైకులు వచ్చేవి. ఇక కామెంట్లో అయితే ఫేస్బుక్ లోనే వీళ్లంతా దేశాన్ని ఉద్ధరిస్తున్నట్టు చర్చా గోస్టులు కూడా పెట్టుకునేవారు. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు గోపి ఇప్పుడు ఫేస్బుక్ స్టార్.
వాళ్ల ఫేస్బుక్ చాటింగ్ కొన్నిసార్లు పెద్దపెద్ద గొడవలకి కూడా దారి తీసేవి. అందరికీ గోపినే పెద్ద దిక్కు.
ఆరోజు గోపి క్లాసులో లెసన్ చెప్తుండగా ఝాన్సీ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది.' ఓహో షాప్ కెళ్ళి ఫోన్ తెచ్చుకున్నావా? అన్నాడు ఫోన్ ఎత్తగానే.'
"ఆ తెచ్చుకున్నాను కానీ, అది కాదండి విషయం అంటూ కంగారు పడుతుంది ఫోన్లో ఝాన్సీ."
'ఏమైంది ఝాన్సీ! ఎందుకంత కంగారు పడుతున్నావు? కాస్త నీళ్లు తాగు అన్నాడు' గోపి.
"పాపకి ఫోన్ చేస్తూనే ఉన్నాను కానీ నాట్ రీచబుల్ అనే వస్తుంది నాకు ఎందుకో కంగారుగా ఉంది అని చెప్పింది ఝాన్సీ."
ఆ మాట వినగానే గుండెల్లో రాయి పడినట్టు అయింది గోపికి.
'తన ఫ్రెండ్స్ ఎవరికైనా కాల్ చేసి కనుక్కున్నావా'? అని అడిగాడు
"అది కూడా జరిగింది తనతో వెళ్లిన పావనికి కాల్ చేశాను. నిన్న సెమినార్ అయిన వెంటనే రూమ్కి వెళ్లిపోయారంట.పావని మాత్రం బంధువుల ఇంటికి వెళ్లిందంట. నిన్న పావని కావ్యతో లేను అని చెప్పింది. "
'పావనిని మిగిలిన అమ్మాయిలకి కాల్ చేసి
కనుక్కోమను చెప్పు.ఈలోగా నేను కాలేజీకి ఫోన్ చేసి కనుక్కుంటాను. వాళ్లకి తోడుగా ఎవరో ఒకరు లెక్చరర్ వెళ్లే ఉంటారు.వాళ్ళకి ఏదైనా తెలిసి ఉంటుంది' అని ఝాన్సీని సముదాయించాడు.
భార్యకు సర్ది చెప్పాడు గాని గోపి మనసులో ఏదో భయం మొదలైంది.కాళ్ళు చేతులు వణకడం ప్రారంభమయ్యాయి.కాలేజీకి ఫోన్ చేసి కావ్య కోసం కనుక్కున్నాడు.
కాలేజీ ప్రిన్సిపల్ సెమినార్కి వెళ్ళిన లెక్చరర్ని కాల్ చేసి విషయం కనుక్కుంటానని చెప్పాడు.
ఆత్రుతగా ప్రిన్సిపల్ కాల్ కోసం ఎదురు చూస్తున్నాడు గోపి.
అంతలోనే ప్రిన్సిపల్ కాల్ చేసి సాయంత్రం సెమినార్ అయిన తర్వాత ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్లిపోయారటండి. లెక్చరర్కి ఏమీ తెలియదన్నారు.నిన్ననే సెమినార్ లాస్ట్ డే కావటం వలన షాపింగ్ అవి చేసుకునే వాళ్ళని చేసుకోమని చెప్పారంట.
ఒకరిద్దరూ తమ బంధువుల ఇంటికి వెళ్తామని, సాయంత్రం బస్సు టైం కల్లా వచ్చేస్తామని పర్మిషన్ తీసుకుని వెళ్లారని లెక్చరర్ ప్రకాష్ చెప్పాడు.అలా ఏమైనా వెళ్లిందేమో అన్నాడు ప్రిన్సిపల్.
'అలా వెళ్లిన ఒంటరిగా వెళ్ళదు కదండి. ఎవరో ఒకరు పక్కన ఉండే ఉంటారు. వాళ్లకి ఫోన్ చేసి అమ్మాయి కోసం కనుక్కొని చెప్పండి ప్లీజ్ .మాకు ఇక్కడ కాళ్లు చేతులు ఆడటం లేదు' అన్నాడు గోపి.
అయ్యో మీరేమి కంగారు పడొద్దు. నేను అక్కడున్న లెక్చరర్కి కాల్ చేసి కావ్య కోసం కనుక్కోమని చెప్తాను అని ధైర్యం చెప్పాడు ప్రిన్సిపల్.ప్రకాష్ సెమినార్కి వెళ్ళిన అమ్మాయిలందరిని పిలిచి కావ్య కోసం అడిగాడు.
అందరూ నిన్న సాయంత్రం సెమినారు అయినా వెంటనే ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్లిపోయామని,కావ్య రూమ్మేట్ పావని తనతో పాటు ఉంటుంది కనుక తనకే తెలుస్తుందని చెప్పారు. కానీ పావని నిన్న పర్మిషన్ తీసుకొని బంధువులు ఇంటికి వెళ్లిపోవడంతో కావ్య సంగతి ఎవరికి తెలియలేదు.
ఎవరిని అడిగినా కావ్య గురించి తెలియదు అని చెప్పడంతో ప్రిన్సిపల్ సలహా మేరకు లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చాడు ప్రకాష్.
కంప్లైంట్ తీసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.
పోలీసులు కిడ్నాప్ ఏమో అని అనుమానించి కావ్య తండ్రి గోపికి కాల్స్ ఏమైనా వచ్చాయా అని అడిగారు.
ఆ వివరాలు తనకు ఏమి తెలియదని,గోపికి ఫోన్ చేసి పోలీసులతో మాటల్లడించాడు ప్రకాష్.
మొదట ఏ ఫోన్ కాలు రాలేదని చెప్పిన గోపి గుర్తుతెచ్చుకొని ఉదయానే సుమారు 3 నుంచి 4 గంటల సమయంలో 10 మిస్డ్ కాల్స్ ఉన్నాయని తిరిగి కాల్ చేస్తే ఎవరు లిఫ్ట్ చేయలేదని చెప్పాడు.
ఆ నంబర్ని వెంటనే పంపించమని చెప్పాడు ఆ స్టేషన్ ఎస్ఐ.
గోపి ఇచ్చిన నెంబర్కి చాలాసేపటి నుంచి రింగ్ చేస్తున్న ఎవరూ ఎత్తలేదు.ఆ నంబర్ ఆధారంగా అది ఏ ఏరియా పరిధిలోకి వస్తుందో కనుక్కొని చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను చెక్ చేశారు. అక్కడ ఉన్న ఒక సీసీ కెమెరాలో కావ్యతో పాటు ఒక అబ్బాయి కనిపించాడు.
ఆ అబ్బాయి కోసం సెమినార్కి వెళ్లిన వారిని ఆరా తీస్తే...
ఎవరు ఏమీ తెలియదు అని చెప్పారు.
ఏం చేయాలో తోచని పోలీసులు విషయం మొత్తం గోపికి చెప్పి వెంటనే రమ్మని చెప్పారు.
గోపి విషయాన్ని తెలుసుకోవాలని కంగారుగా వెంటనే బయలుదేరి వెళ్ళాడు.అక్కడికి చేరుకున్న గోపికి సీసీ కెమెరా వీడియోని పోలీసులు చూపించారు.
ఆ వీడియో చూసిన వెంటనే గోపి షాక్ అయ్యాడు.
ఆ సీసీ కెమెరాలో ఉన్న వ్యక్తి తన పూర్వ విద్యార్థి నిరంజన్గా పోలీసులకు తెలియజేశాడు గోపి.
నిరంజన్ ఫోన్ నెంబర్ ఆధారంగా పోలీసులు నిరంజన్ని కనిపెట్టి అదుపులోకి తీసుకున్నారు.
కావ్యను గోపికి అప్పచెప్పారు.
అదుపులోకి తీసుకున్న నిరంజన్ని ఆరా తీయగా ...
తాను గోపి యొక్క పూర్వ విద్యార్థినని , ఫేస్బుక్ ఫాలోవర్ని అని చెప్పుకుంటూ వచ్చాడు.
'రోజు మాస్టారు పోస్టులతోనే నాకు తెల్లారేది.రోజు మాస్టారు పెట్టే పోస్టులను చదివి మొదటగా స్పందించే వాడిని
అతనిని రోజు ఫాలో అవుతూ వచ్చాను.అలా ఫాలో అవుతూ ఉండగా సార్ తన కూతురు కోసం చెబుతూ పెట్టిన పోస్టులలో కావ్య ఫోటోని చూశాను. ఆమె ఆకతాయితనం, చిలిపితనం , సార్ మాటలలో వింటుంటే తెలియకుండా ఆమెపై అభిమానం పెరిగింది.
ఆమెతో ప్రేమలో పడ్డాను .అదే విషయాన్ని కావ్యకి చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను. కానీ ఆమె నా ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయలేదు. ఆమె ఫోన్ నెంబర్ కూడా తెలీదు. పైగా ఆమె హైదరాబాదులో ఉంటుంది.
అందుకే కావ్యకి ఏమీ ఇష్టం,ఏం చేస్తుంది అన్నింటిని మాస్టారు పెట్టే పోస్టుల ద్వారా ఫాలో అవుతూ ఉండేవాడిని. అలా వారం రోజుల కిందట గోపి సార్ పెట్టిన పోస్ట్ ఆధారంగా కావ్య సెమినార్కి వెళ్తుందని తెలుసుకున్నాను. నా ప్రేమ తెలుపటానికి ఇక్కడికి వచ్చానని తెలిపాడు. '
'కావ్య ఒంటరిగా కనిపిస్తే నా మనసులో మాట తెలియచేయాలని ఎదురు చూశాను. నేను ఆశ పడ్డట్టుగానే కావ్య సాయంత్రం ఒంటరిగా బయటికి వచ్చింది. తనని వెంబడిస్తూ వెళ్లాను.'
'తనని నేను వెంబడిస్తున్న సంగతి గమనించిన కావ్య భయపడి నన్ను తప్పించుకొని వెళ్లిపోయింది.
అయినా వదలకుండా తనని ఫాలో అవుతూ వెళ్లాను.' కాసేపటికి ఆమె పరుగులు పెట్టడం ఆపి
"నువ్వు ఎవరు అని అడిగింది."
'నేను మీ నాన్నకి పెద్ద ఫాలోవర్ని ఇంకా చెప్పాలంటే ఒక పూర్వ విద్యార్థిని. ఎప్పటినుంచో నేను మిమ్మల్ని ఫేస్బుక్లో మీ నాన్నగారు పెట్టే పోస్టుల ద్వారా ఫాలో అవుతున్నాను. ఈరోజు కూడా మీరు సెమినార్కు వస్తున్నట్టు మీ నాన్నగారు వారం రోజుల కింద పెట్టిన పోస్ట్ ఆధారంగా తెలుసుకొని వచ్చాను.'అని చెప్పాను
"ఎందుకు నన్ను వెంబడిస్తున్నారు" అని అడిగింది.
' నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను 'అని చెప్పాను
ఆ మాట వినగానే నా మాటలను వినిపించుకోకుండా నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయింది.
తనకోసం వారం రోజులుగా ఎన్నో ఏర్పాట్లు చేసుకొని మరీ వచ్చిన నాకు కావ్య అలా పట్టించుకోకుండా వెళ్లిపోవడంతో కోపం వచ్చింది.
కావ్య పట్టించుకోకపోయినా, ఆమెను ఒప్పించాలని ఆమెనే అనుసరిస్తూ వెళ్ళి కావ్యకు నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఆమెను పట్టుకున్నాను.
కావ్య కోపముతో నన్ను లాగి పెట్టీకొట్టింది. నాకు భరించలేనంత కోపం వచ్చింది.
నా ప్రేమను ఒప్పుకోకుంటే... నీ ఫోటోలు అన్నీ నా దగ్గర ఉన్నాయి
వాటిని మార్ఫింగ్ చేసి నెట్లో పెడతానని బెదిరించాను.
ఆ మాటలు విన్న కావ్య భయపడిపోయింది.నా నుంచి తప్పించుకొని పారిపోవడానికి ప్రయత్నించింది. తాను ఎవరికో ఫోన్ చేయడానికి ప్రయత్నించింది. నేను ఆమె ఫోను విసిరి కొట్టి కావ్యను బలవంతంగా లాక్కు వెళ్లడానికి ప్రయత్నించాను.
కానీ కావ్య తప్పించుకుని పారిపోయింది. తనని వెతుక్కుంటూ వెళ్లిన నాకు కావ్య కాయిన్ బాక్స్ నుంచి ఫోన్ చేస్తూ కనిపించింది. నేను కావ్యను లాక్కుంటు వెళ్ళిపోయాను. నిజానికి
ఆమెకి హాని చేసే ఉద్దేశం ఏమీ లేదు. తనని ఒప్పించడం కోసమే తనని బంధించాను అని జరిగినదంతా చెప్పాడు.
చెడు చెసే ఉద్దేశం లేకపోతే ఫొటోస్ మార్ఫింగ్ చేస్తాను అని ఎందుకు అంటావు.? నీలాంటి వాడిని వదిలి పెట్టకూడదు. అయినా ఒక ఆడపిల్లని మానసికంగా హింసించడం నేరంగా పరిగణిస్తూ అబూసింగ్ కేసు కింద నిరంజన్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఈ సంఘటన తర్వాత గోపి మళ్ళీ ఎప్పుడు ఫేస్బుక్ని ముట్టుకోలేదు. తాను చేసిన పనికి సిగ్గుపడి భార్య బిడ్డలకు క్షమాపణ చెప్పాడు.అతి అనర్థం అని తన స్వీయ అనుభవాన్ని అందరికీ బోధిస్తూ వచ్చాడు.
-జ్యోతి మువ్వల