ఉదర పోషణార్ధం ........(కథ )
రచన : జీడిగుంట నరసింహ మూర్తి
(17/12/2021 సహరి వార పత్రికలో ప్రచురితం )
“అన్నీ టేబుల్ మీద పెట్టేశాను. మీరూ , పిల్లలూ వడ్డించుకుని తినెయ్యరూ ? ఈ రోజు షూటింగ్ స్పాట్ చాలా దూరంగా వేశారు. ఆలస్యం చేస్తే నా ప్లేస్లో వేరే వారిని పెట్టి తీసేస్తారు “ అంటూ భుజానికి వ్యానిటీ బ్యాగ్ తగిలించుకుని హాడావిడి పడుతూ బయటకు వచ్చింది రామేశ్వరి . ఇలా ఒకరోజు కాదు . రోజూ దాదాపు ఇదే పరిస్తితి. ఆమె తోడుకోడలి పాత్రలో నటిస్తున్న టీవీ సీరియల్ “ఈ జీవితానికి ముగింపు లేదు” గత సంవత్సరంగా బేగంపేట్ దగ్గర షూటింగ్ కోసం ప్రత్యేకంగా తీసుకున్న అపార్ట్మెంట్లో నడుస్తోంది. షూటింగ్ ఎన్నేళ్లు జరుగుతుందో అనేది ఆమెకే కాదు . ఆ సీరియల్ నిర్మాతకు, దర్శకుడికి కూడా తెలియదు. స్క్రిప్ట్ లో లేని కొత్త కొత్త సన్నివేశాలు జత చేసుకుంటూ వెళ్ళడం వల్ల అందులో నటించే అందరికీ చేతినిండా పని దొరికింది. అవసరం అనిపించిన చోట ఔట్ డోర్ లొకేషన్లలో పని చెయ్యడానికి నటీనటుల చేత అగ్రిమెంట్ కూడా రాయించుకున్నాడు నిర్మాత.
రాత్రి పదకొండు గంటలు ఆ ప్రాంతంలో ఇంటిముందు కారాగింది. రామేశ్వరి ఇంటర్లాక్ తెరుచుకుంటూ ఉసూరుమంటూ లోపలికి వచ్చింది. అప్పటికే భర్త రాజేష్ , పిల్లలు కిరణ్, మూడేళ్ళ కూతురు ఈ ప్రపంచంతో సంబంధం లేనట్టు అలసిపోయి నిద్రపోతున్నారు. ఇంట్లోకి వచ్చి ఐదు నిమిషాలు అయ్యిందో లేదా రామేశ్వరి చేతిలో ఫోన్ మోగింది. స్క్రిప్ట్ రైటర్ అవధాని కొంపలు ములిగినట్టు ఫోను చేస్తున్నాడు.
“ఏమిటి సార్ నేనిప్పుడే లోపలకు వచ్చాను . ఏమైనా అర్జెంటా?” అడిగింది విసుగ్గా.
“ సారీ ఏమీ అనుకోవద్దు. రేపు నేను షూటింగ్ స్పాట్ లో వుండటం లేదు. నా అసిస్టెంట్ వీరేష్ వుంటాడు. ఇంతకీ చెప్పొచ్చే విషయమేమిటంటే మీ పాత్ర రేపటినుండి పూర్తిగా మారిపోతోంది. మామూగా అయితే మీది సాత్విక పాత్ర. ఇంటిని తీర్చిదిద్దే ఉత్తమ కోడలు పాత్ర మీరు చేస్తున్నారు ఇప్పటివరకు. కానీ రేపటినుండి మీరే విలన్. పైకి సాత్వికంగా కనపడినా లోపల విషం కక్కే పాత్ర . కుట్రలు, కుతంత్రాలు ఎక్కువగా వుంటాయి. పరమ గయ్యాళిగా మారబోతున్నారు. అనుకోని పరిస్తితులలో మీ పాత్రను , దానికి అనుగుణంగా స్క్రిప్ట్ మార్చాల్సి వచ్చింది. రాబోయే రెండు రోజులు నేను వుండను కనుక మీరు కన్ఫ్యూజన్ కాకుండా వుండటానికి ఆ విషయం ఇంత అర్ధ రాత్రైనా చెప్పక తప్పడం లేదు . ఇదీ విషయం. ఇక మీరు హాయిగా నిద్రపోండి” అంటూ అవతల ఫోను పెట్టేశాడు అవధాని.
“ ఇంకేం హాయిగా నిద్రపోవడం ? పొగ పెట్టావుగా ? ఇది నీకు పుట్టిన బుద్దే అయ్యుండాలి. ఏదో రకంగా కక్ష తీర్చుకుంటున్నావు .. ఈ క్షోభ నీకు ఎప్పటికైనా తగిలి తీరుతుంది “ అనుకుంది రామేశ్వరి . ఒకసారి షూటింగ్ మధ్యలో” ఈ డైలాగ్ నాకు నచ్చలేదు స్క్రిప్ట్ మార్చండి” అని చెప్పినందుకు అవధాని మొహం మాడ్చుకున్న సందర్భం ఆమెకు గుర్తొచ్చింది. ఆ విషయంలో డైరెక్టర్ తో కూడా వాదించింది. ఆయన ఏ కలనున్నాడో పాపం డైలాగ్ మార్చమని చెప్పాడు. దాంతో అవధాని అహం దెబ్బతింది. “ నాలాంటి సీనియర్ స్క్రిప్ట్ రైటర్నే అవమానిస్తావా?” అంటూ విరుచుకు పడ్డాడు. . ఆ రోజునుండి ఏదో రకంగా తనని వేధించాలని చూసే వాడు అవధాని. ఇదిగో ఇప్పుడు అవకాశం దొరికినట్టుంది. తన పాత్రనే మార్చేశాడు. గయ్యాళి పాత్ర అంటే అది తన సహజ గుణానికి విరుద్దమైన పాత్ర. చేసేది నటనైనా కూడా ఇది తనకు తగని పాత్ర. ఎప్పుడూ సెట్లో నలుగురినీ చిరునవ్వుతో పలకరించే తన మొహం గయ్యాళి పాత్రకు సూట్ కాదు . నటించి చెడ్డపెరు తెచ్చుకునే కన్నా ఏదైనా వేరే చిన్న పాత్ర ఇమ్మంటే ఎలా వుంటుంది ? అలాంటప్పుడు తను ఒప్పుకున్న ఈ కాంట్రాక్ట్కు ఇస్తామన్న పారితోషికం ఏభై వేలు పోయినట్టేగా ? ఆమెకు రాత్రంతా నిద్రపట్టలేదు . తలంతా బరువుగా అయ్యింది. ఒకటే ఆలోచనలు . రేపు మారిపోయే పాత్ర మీద ఆమెకు ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు. ఉదయం లేవగానే తలంతా బరువనిపించింది. లేదు లేదు . ఎలాగైనా డైరెక్టర్ తో మాట్లాడాలి ఇంత అర్ధాంతరంగా తన పాత్ర ఎందుకు మార్చాల్సి వచ్చిందని దెబ్బలాడాలి . తన మనసుకు నచ్చని వాటితో ఎలా రాజీ పడటం ? నిజానికి ఇలా జరగడం మొదటి సారి కాదు. గతంలో పౌరాణిక సీరియల్లో మొదట సీత పాత్రన్నారు. తర్వాత కొద్దిగా లావుగా కనపడుతున్నావు రాముడి తల్లి పాత్ర కింద మారుస్తున్నాం అన్నారు. ఇంకోసారి నాయకిగా ఎన్నిక చేసి హీరోయిన్ పక్కన సహ నటిగా మార్చారు. సహజంగా తను వివాదాస్పద వ్యక్తి కాకపోవడం , ఏ పాత్ర ఇచ్చినా నోరుమూసుకుని చెయ్యడం వల్ల ఈ సీరియళ్ళ నిర్మాతలు లోకువ కట్టేశారు. “ అనుకుంటూ చెదిరిన మనసుతోనే షూటింగుకు బయలుదేరింది రామేశ్వరి . స్పాట్లోకి వెళ్ళాక రాత్రి స్క్రిప్ట్ రైటర్ అవధాని తన మధ్య జరిగిన సంభాషణ వివరాలు తన సహ నటి రోషిణితో చెప్పుకుంది.
“ రామీ . నువ్వు మరీ అంత పతివ్రత లాగా వుంటే ఈ ఫీల్డ్ లో కుదరదు . ఇంట్లో నువ్వు ఉత్తమ ఇల్లాలువే కావచ్చు. . అలాగే వుండు. . బయట ప్రపంచంలో కాస్త అందరితో చనువుగా వుండాలి. వాళ్ళకు దగ్గరగా మసులుకోవాలి. వాళ్ళ మాట వినాలి. ఐ మీన్ వాళ్ళకు లొంగిపోవాలి అని అనడంలేదు. కాస్త వాళ్ళను ఉషారు పరచాలి. అప్పుడే నీకు కోరుకున్న పాత్రలు వస్తాయి. వాళ్ళకు సహకరించకపోతే ముష్టి , కురూపి, కుంటి పాత్రలైనా వెయ్యడానికి సిద్దపడాలి. ప్రస్తుత పరిస్తితిలో షూటింగులే జరగడం లేదు. మనకు కావలసింది డబ్బు. .ఇప్పుడు నేను చూడు . నేనందరితో ఎంత ఫ్రీగా వుంటాను ?నీలా మొగాళ్లను చూడగానే బిర్రబిగుసుకు పోను. రోజుకు ఎన్నోసార్లు షేకండ్లు ఇవ్వాల్సి వుంటుంది. రాసుకుంటూ పూసుకుంటూ తిరగాలి. వాళ్ళతో కూర్చుని జోక్స్ వెయ్యాలి. అప్పుడప్పుడు కొన్ని వల్గర్ జోకులు దొర్లుతూ వుంటాయి. అటువంటప్పుడు మొహం మాడ్చుకు కూర్చోకూడదు. అంతకన్నా ముందుకు పోయేవాళ్లు చాలామంది వుంటారు అనుకో. . అవన్నీ పట్టించుకుంటే వేషాలే రావు. గొంగళిలో తింటూ వెంట్రుకలు లెక్కించడం మంచిది కాదు. వెళ్ళి ఆ నిర్మాత, దర్శకులతో సరదాగా మాట్లాడుతూనే రిక్వెస్ట్ చెయ్యి. మీరు ఎలా చెపితే అలా మీ దారిలో నడుస్తాను . ఈ సారికి నన్ను పాత పాత్రలోనే కొనసాగించమని వేడుకో. ఏమో నీ అదృష్టం బాగుంటే వాళ్ళ మనసు మారొచ్చు “ అంటూ తన దారిలో రామేశ్వరిని కూడా పెట్టాలని సలహాలు పారేసింది రోషిణి. ఆమె షెడ్యూల్ వుందనుకుంటా. ఈ లోపు రోషిణి ముఖానికి మేకప్ మ్యాన్ మోహమ్మీద మొహం పెట్టి రంగులు అద్దేస్తున్నాడు . ఆమెలో కించిత్తు బిడియం కూడా కనిపించడం లేదు. రామేశ్వరికి ఎందుకో రోషిణి పద్దతి నచ్చలేదు. వేషాల కోసం అంతగా దిగజారాలా ? ఆమె కంటే మొగుడూ , మొద్దులూ అంటూ ఎవరూ లేరు. సోలో బ్రతుకు బ్రతికేస్తోంది. తనకు సంసారం వుంది. ఆంక్షలు వున్నాయి. నిజానికి తన సహనటులు తనతో చనువును ప్రదర్శించడానికి సంశయిస్తారు. తన మేకప్ కూడా తనే వేసుకునే రామేశ్వరికి రానూ రానూ పరిస్తితులు ఇబ్బందిగా కనిపిస్తున్నాయి . .
అవధాని దర్శకుడి బుర్ర ఎంతగా మార్చాడో తెలియదు కానీ పాత పాత్రనే కొనసాగించడానికి ససేమిరా ఒప్పుకోలేదు. ఒక పక్క రోషిణి అదే ఫ్లోర్లో తచ్చాడుతూ రామేశ్వరికి సైగలు చేస్తోంది కాస్త గారాలు పోతూ దర్శకుడితో చనువును ప్రదర్శించమని . అది తన అభిమతానికి పూర్తి విరుద్ధం అని గట్టిగా నమ్మిన రామేశ్వరి ఆ సీరియల్ నుండి తప్పుకుంది.
“అంత అహంకారం , అతిశయం నీకు పనికి రాదు . చేతులారా మంచి ఛాన్స్ పోగొట్టుకున్నావు .నీకు నువ్వుగా మూర్ఖత్వంతో నీ భవిష్యత్తును సమాధి చేసుకున్నావు. నీ ఖర్మ “ అంటూ దులపరించేసే తన వగలు వయ్యారంతో రామేశ్వరి మొదట్లో వేసిన ఉత్తమ తోడుకోడలి పాత్ర అతి లాఘవంగా సొంతం చేసుకుంది .
రామేశ్వరి షూటింగ్ కాన్సిల్ చేసుకుని అర్ధాంతరంగా ఇంటికి రావడంతో ఆమెకు రావలసిన ఏభై వేల రూపాయలు ముందుగా చేసుకున్న కాంట్రాక్ట్ ప్రకారం ఆగిపోయింది.
అసలే అంతంత మాత్రం సంపాదన, చాలా వరకు పెళ్ళాం నటిస్తున్న సీరియళ్ల మీదే ఆధారపడి పిల్లల చదువులతో పాటు కష్టంగా సంసారం నడుస్తున్న సాధారణ పరిస్తితులలో వస్తున్న అవకాశాలను చేజార్చుకుని ఇంటికి వచ్చిన రామేశ్వరిపైన ఆమె మొగుడు తాచుపాములా పైకి లేచి నానా దుర్భాష లాడాడు . కొద్ది రోజుల్లో చేతికి రావలసిన పెళ్ళాం షూటింగుల తాలూకు ఏభై వేలు హుళక్కి అయినందుకు అతనికి పిచ్చి కోపంగా వుంది.
“ఓసినీ నీ పత్రివ్రతా వేషాలు తగలేయ్య. నీకెప్పుడైనా చెప్పానా అటువంటి పాత్రలే ఒప్పుకోమని ? అసలు నాకు అభ్యంతరం లేనప్పుడు నీకు ఈ బుద్ది ఎక్కడనుండి వచ్చింది ? నిక్షేపంగా వాళ్ళిచ్చిన ఏ వేషమైనా ఒప్పుకుని డబ్బులు సంపాదిస్తావనేగా నేను సరైన ఉద్యోగం చూసుకోకపోవడానికి కారణం ? మీ ఫ్రెండ్ రోషిణి ఇందాకే ఫోను చేసి చెప్పింది నువ్వు చేతులారా వస్తున్న అన్ని ఛాన్సులు పోగొట్టుకుంటున్నావని , మంచి పేరొస్తున్న సమయంలో అవకాశాలను కాలదన్నుకున్నావని , అదే ఇంకోళ్లైతే లక్షలు లక్షలు కూడబెట్టి మంచి బంగళా కూడా కొనుక్కునే వారని చెప్తూ బాధపడింది.. చి .. చి . నీ మీద పెట్టుకున్న నా ఆశలన్నీ గంగలో కలిపావు .....” అంటూ రామేశ్వరి మొగుడు ఆమెకు టార్చర్ పెట్టాడు . .
** ** ** **
కొన్నేళ్ళ తర్వాత ...... ఆ బంగళా ముందు “ఆడి” కారు ఆగింది . అందులోంచి సీనియర్ నటి రామి , ఆమె వెనుక ఆమె మేనేజర్ అనుసరించాడు .రామి ఇప్పుడు సీరియళ్లలోనూ, సినిమాలలోనూ ఒక బిజీ తార . ఆమె అడుగులకు మడుగులు ఒత్తుతూ, ఆమె సంపాదన తనివితీరా చూసుకుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడా చక్కబెట్టుకుంటున్న రామేశ్వరి భర్తే మేనేజర్ గా ద్విపాత్రాభినయం చేస్తూంటే రామేశ్వరి టీవీ షోలు ,అడపాదడపా సినిమాలలోనూ , మరోపక్క సంసారం చేసుకుంటూ మూడు పాత్రలు ముచ్చటగా పోషించేస్తోంది తన జీవన శైలిలో అయిష్టంగా నైనా కొన్ని సడలింపులు తర్వాత హాయిగా జాలీగా ***
సమాప్తం Se