మువ్వల గంటల రిక్షా

సహరి వార పత్రిక • 12 Nov 2021 • 👁 1 views
మువ్వల గంటల రిక్షా (కథ )
(12/11/2021 సహరి వార పత్రికలో ప్రచురితం )
రచన : జీడిగుంట నరసింహ మూర్తి
రోజూ వాకింగ్ నుండి వెనక్కి వచ్చేటప్పుడు నా వెనుకనుండి అదే సమయానికి మువ్వల గంటల రిక్షా స్కూల్ పిల్లల్ని ఎక్కించుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ రిక్షాను చూస్తూ ఉంటే చిన్నప్పుడు నేను స్కూలుకు వెళ్తున్న రోజులు గుర్తుకొచ్చి ఎంతో థ్రిల్ గా ఉండేది. ఎండనక, వాననక ఆ రిక్షా లాగే వ్యక్తిని చూసిన ప్రతి వ్యక్తి క్రమశిక్షణ అంటే ఏమిటో అర్ధం చేసుకోగలడు .
ఒకరోజు సాయంత్రం నేను రెగ్యులర్గా చదివే వారపత్రికలు కొందామని పాత మార్కెట్ వైపు వెళ్లాను. మార్కెట్ వెనకాల చాలామంది గుడిసెలు వేసుకుని వుంటున్నారు. . నేను రోజూ చూసే రిక్షాలాగే వ్యక్తి చేతి సంచీతో కూరలు మోసుకుంటూ వెళ్తూ నన్ను చూసి ఆగాడు.. అప్పుడప్పుడు మార్గ మధ్యంలో నేనతన్ని పలకరిస్తూ ఉండటంతో నన్ను గుర్తు పట్టి " ఏం బాబూ బాగున్నారా?" అని దణ్ణం పెట్టాడు.
"బాగున్నానోయ్ . ఏమిటి ఈ మధ్య నీ మువ్వల గంటల రిక్షా అలికిడి ఎక్కడా కనిపించడం లేదు ? స్కూలుకు సెలవలు ఇచ్చారా ఏమిటి ? మీ ఇల్లు ఇక్కడేనా? అన్నట్టు చాలా రోజులనుండి నిన్ను చూస్తున్నాను. కానీ నీ పేరేమిటో కనుక్కోలేదు ? అడిగాను యధాలాపంగా.
" నా పేరు వీరేశం అంటారండీ. ఆ కనబడే గుడిసెల్లోనే ఒక గుడిసె మాది. తమరికి అభ్యంతరం లేకపోతే మా ఇల్లు ఒకసారి చూసి పొండి " అంటూ నేను వస్తున్నానో లేదో చూసి నాతోపాటు ముందుకు నడిచాడు..
నేను జర్నలిస్టుగా పనిచేస్తూ వుండటం వల్ల ఎన్నో సార్లు మురికి వాడలు కూడా తిరిగి వాళ్ళ సమస్యలు సేకరించే వాడిని. ఆ అలవాటుగా రిక్షా అతను ఇల్లు చూపిస్తాను రమ్మని అనగానే ఇంకేమీ ఆలోచించకుండా అతని వెంట వెళ్ళాను. . అక్కడున్న ఇళ్లల్లో రిక్షా అతని నివాసం కొంతలో కొంత బాగానే ఉందని పించింది. పక్కనే వున్న కుర్చీలో కూర్చుని ఆసక్తితో అతని వివరాలు అడిగాను.
.
"ఏముంది బాబూ .ముగ్గురాడపిల్లలు .కొడుకుల్లేరు. ఈ స్థలం సర్కారు వారు ఇస్తే ఇక్కడ చిన్న గుడిసె వేసుకున్నాను. రాత్రింబవళ్ళు ఒంట్లో ఓపికున్నంతవరకు స్కూలు పిల్లలను రానూ పోనూ రిక్షాలో దిగబెట్టి ఆ డబ్బుతో కాస్తో కూస్తో పిల్లలని చదివించాను. పెళ్లిళ్లు కూడా చేసేసి బాధ్యత దించుకున్నాను" అన్నాడు వీరేశం . అలా చెప్తూ వుంటే అతని కళ్ళు గర్వంగా మెరిసాయి .
"ఆశ్చర్యంగా వుందే ? రిక్షా తొక్కుకుంటూ ముగ్గురాడ పిల్లల పెళ్లి చేసావా ? బాగా డబ్బున్న వాళ్ళే ఒక పిల్ల పెళ్లి చెయ్యడానికి తల్లకిందులవుతున్నారే ఈ రోజుల్లో ?" అన్నాను దిగ్భ్రాంతిగా.
“ అవును బాబూ ఈ రోజుల్లో సొంత కొడుకూ , సొంత గొడుగూ ఉండాలని అంటారు కదా బాబయ్యా . నాకు సొంత కొడుకు లేకపోయిన సొంత గొడుగు అదే గొడుగు లాంటి ఈ ఇల్లు వుంది కదయ్యా .నా పిల్లలు పండగా పబ్బానికి ఇంటికొస్తే ఈ గూడు నిలువ నీడనిస్తోంది. ఇక నా పిల్లల పెళ్లిళ్ల విషయానికొస్తే నిజానికి ఇదంతా నా ఒక్కడి వల్ల అయ్యే పని కాదు సామీ . . అంతా ఆ కలకత్తా బాబు చలవే . ఆ అయ్యది సముద్రమంత పెద్ద మనసు “ అన్నాడు కనుకొనల్లో చిమ్మిన కన్నీరును పై బట్టతో తుడుచుకుంటూ .
అతని సమాధానానికి నేను అతని వైపు విస్మయంగా చూశాను .
“ఒకసారి ఇటు రండి బాబూ “ అంటూ ట్రంక్ పెట్టేలోంచి ఏవో కాయితాల దొంతర బయటకు తీశాడు వీరేశం . . దానితో పాటు ఒక ఫోటో కూడా వుంది.
“ ఎవరితను ?” ఉండబట్టలేక అడిగేశాను . .
“ ఈ బాబే బాబూ . నా పిల్లల పెళ్లిళ్లు చెయ్యడానికి, ఈ గుడిసె కట్టుకోవడానికి కూడా సాయం చేసింది “
“ అలాగా ఇంతకీ ఇతను నీకేం అవుతాడు ? ఇప్పుడు ఎక్కడ వున్నాడు ?” అడిగాను ఉద్విగ్నతతో .
అప్రయత్నంగా అతని కళ్ళల్లో మళ్ళీ నీళ్ళు ఊబికాయి.
“నాకు కొడుకులు లేరన్న బెంగ లేకుండా నన్ను అనుక్షణం కనిపెట్టుకుని చూసిన దేవుడు బాబూ !”
నా ప్రశ్నకు సరైన సమాధానం దొరక్క అతనివైపు అయోమయంగా చూశాను.
“ అవును బాబూ. ఆ బాబు ఇప్పుడు కలకత్తాలో పెద్ద జాబు చేసుకుంటున్నాడు. నా మువ్వల గంటల రిక్షా ఆ బాబును చిన్న క్లాసునుండి పెద్ద క్లాసులోకి వెళ్ళే అంతవరకు మోసింది. చిన్నప్పటి నుండి నా రిక్షాలో వస్తూ నాతో పెంచుకున్న అనుభూతులు ఆ బాబూ మర్చిపోలేదు.నేను కూడా ఆ బాబును నా గుండెల్లో పదిలంగా దాచుకున్నాను . . ఆ రుణం ఎలాగైనా తీర్చుకోవాలని అనుకున్నాడో ఏమో నన్ను మర్చిపోకుండా నేనెక్కడ వున్నానో తెలుసుకుని నాకు డబ్బు పంపించే వాడు . ప్రతి పదిహేను రోజులకు నాకు ఉత్తరం రాసి మా క్షేమ సమాచారాలు కనుక్కుంటూ ఆ బాబు పెద్ద మనసు చాటుకున్నాడు. మా మధ్య ఏ నాటి బంధమో ఏమో కానీ ఇంతమందిని రోజూ స్కూలు దగ్గర వదిలి పెడుతూ వుంటాను కానీ నా మొహం ఎవరూ చూసిన పాపాన పోలేదు. ఆ ఒక్క ఆ కలకత్తా బాబు మటుకు నన్ను కన్న తండ్రి కన్నా ఎక్కువగా చూసుకుంటున్నాడు. ఏమిటో బాబూ . ఎండనక, వాననక ఓపికున్నన్నాళ్లు రిక్షా లాగాను. నాకు చదువు లేకపోయినా పిల్లల మధ్య మసులుకోవడం వల్ల నాకూ కూసింత తెలివి తేటలు అబ్బినట్టున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో కొద్దిగా ఒంట్లో నలతగా వుండి నా ఆకలి దప్పులు తీర్చే రిక్షాని పక్కన పడేశాను . ఆ బాబు ఈ వూరు వచ్చినప్పుడల్లా తిన్నగా నా గుడిసెకు వచ్చి నా కష్టాలు అడిగి తెలుసుకునే వాడు. నేను వద్దంటున్నా ఈ కుర్చీలు, నేను పడుకోవడానికి ఈ మడత మంచం కొనిచ్చాడు . మా ముసలి దానికి చీరలు , మందులు ఇచ్చాడు.” వీరేశం కృతజ్ఞతా భావంతో ఇంకా ఏదో చెప్పుకుపోతున్నాడు.
చూస్తూండగానే ఆకాశం కారు మబ్బులు కమ్మెసి గట్టిగా ఉరిమింది. ఆ వెనుకే కుండపోతగా వర్షం గుమ్మరించసాగింది
“ఉండండి బాబయ్య. కాసేపు ఇలా వచ్చి కూర్చోండి. కొద్దిగా వర్షం తగ్గుముఖం పట్టగానే నా రిక్షాలో మిమ్మల్ని ఇంటిముందు దిగబెడతాను “ అన్నాడు వీరేశం ఆకాశం వైపు పరికించి చూస్తూ .
“ అసలే ఓపిక లేదంటున్నావు. రిక్షా ఏమి లాగుతావులే. నేనెలాగో అలా వర్షం తగ్గుముఖం పట్టాక ఇంటికి వెళ్ళి పోతాను” అని నేను ఎంత వద్దన్నా కూడా ఒప్పుకోకుండా నన్ను మూలపడేసిన రిక్షా బయటకు తీసి నన్ను మా ఇంటికి తీసుకు వచ్చాడు . . అప్పటికే అతని ఒళ్ళంతా తడిసి ముద్దయ్యిపోయింది. వయసు ప్రభావం వల్ల వణికి పోతున్నాడు. పళ్ల బిగువున చలిని భరిస్తున్నట్టు తెలుస్తోంది.
“వస్తాను బాబయ్యా లోపలకెళ్లి శుభ్రంగా తల తుడుచుకోండి బాగా తడిసిపోయారు” అంటూ రిక్షా తీసుకుని వెనక్కి వెళ్లబోయాడు.
నిజానికి నాకు పూర్తిగా టాప్ అంతా కప్పి వర్షంలో తడుసుకుంటూ నన్ను కొంచం కూడా తడవకుండా ఇంటికి క్షేమంగా మోసుకొచ్చింది అతనే.
నేను పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ వెళ్ళి అతని చేతిని పట్టుకుని “ ఆగు వీరేశం . . వర్షం తగ్గేవరకూ ఇక్కడే కూర్చో. అసలే నీ ఒంట్లో ఏమీ బాగోలేదు. ఇంకో పక్క తడిసి ముద్దయ్యావు . . కాస్త టిఫిన్ తిని వేడి వేడి కాఫీ తాగు కొద్దిగా ఓపిక వస్తుంది. “ అని అతన్ని వారించి నా భార్య మాధవికి టిఫిన్ తీసుకురమ్మని పురమాయించాను. వద్దు వద్దు అంటూ అతను మొరాయించినా వరుణ దేవుడు చూపిస్తున్న ప్రతాపానికి మొహమాట పడుతూనే గోడ పక్కనే నిలబడి పోయాడు.
మా ఆవిడ లోపలనుండి బయటకు వస్తూ వీరేశాన్ని బాగా పరికించి చూసి “ అవును ఇతన్ని ఇంతకు ముందు చూసినట్టున్నాను. ఇప్పుడు గుర్తుకొస్తోంది. నువ్వు పిల్లల్ని నీ రిక్షాలో స్కూలుకు తీసుకు వెళ్ళే వాడివి కదూ. మా ఇంటికి కూడా వచ్చే వాడివి. . ఏం బాబూ బాగున్నావా ? ఇప్పుడు ఎక్కడుంటున్నావు ? ఇంకా నీ రిక్షాలో పిల్లల్ని తీసుకు వెళ్తున్నావా ?” అంటూ చిన్నగా నవ్వుతూ తల తుడుచుకోవడానికి ఒక టవల్ తీసుకొచ్చి ఇచ్చింది.
“వద్దమ్మా . నా తుండు రిక్షాలో వుంది. కొత్తది ఎందుకమ్మా ఇస్తారు అనవసరంగా? అంటూ మొహమాట పడుతూ తల తుడుచుకున్నాడు. .
“ ఏమీ అనుకోకండమ్మా. చాలా ఇళ్ల దగ్గర ఆగి పిల్లలని తీసుకు వెళ్ళే వాడిని కదా. మిమ్మల్ని గుర్తు పట్టలేకపోయాను. ఇల్లు కూడా ఇంతకు ముందు వేరే సందులో వున్నట్టుగా వుంది కదా అమ్మగారూ “ అంటూ అసంకల్పితంగా అక్కడే టేబుల్ మీద వున్న ఫోటో వైపు చూసి “ ఏమిటమ్మా ఈ బాబు ఫోటో ఇక్కడుంది ?” ఆశ్చర్యంగా అడిగాడు వీరేశం.
“ ఇతనా? . మా అబ్బాయే. చిన్నప్పుడు వీడిని కూడా నీ రిక్షాలో స్కూలుకు తీసుకు వెళ్ళే వాడివి . అవును ఇప్పుడు మా అబ్బాయి పెద్దవాడయ్యాడు కదా. ఎలా పోల్చుకోగలిగావు ? “ అంటూ ఆశ్చర్యంగా అడిగింది మాధవి.
“ చిన్నప్పుడు మా అబ్బాయిని నీ రిక్షాలో ఎక్కించడానికి నేను ఎప్పుడూ వచ్చే వాడిని కాను. అమ్మగారే ఆ బాధ్యత తీసుకునే వారు. అందుకే నిన్ను కన్నతండ్రిలా చూసుకుంటున్న మా అబ్బాయి ఈశ్వర్ కు తండ్రిని నేనే అని నీకు తెలిసే అవకాశం లేదు . అయితే మా అబ్బాయి నీకు సహాయం చేస్తున్నట్టు నాకు మీ ఇంట్లో ఇందాక నువ్వు పెట్టిలో దాచి వుంచిన ఉత్తరాలతో పాటు వున్న ఫోటో చూపించే అంతవరకు తెలియదు . నాకు ముందే తెలిసి వుంటే నేను కూడా నీ పిల్లల పెళ్లిళ్లకు ఎంతో కొంత సహాయపడే వాడిని. ఇంకో విషయం . ఇకనుండి నీ ఆరోగ్యం కుదుటపడినా కూడా రిక్షా తొక్కడానికి వీల్లేదు. ఈ రోజునుండి నీ బాధ్యత మేము తీసుకోవాలని అనుకుంటున్నాం. నీకు మా జర్నలిస్టుల ఆఫీసులోనే తగిన ఉద్యోగం ప్రయత్నం చేస్తాను. నీ మువ్వల గంటల రిక్షాలో ఎక్కి స్కూలుకు వెళ్ళి చదువుకున్న మా అబ్బాయి పెద్ద ఉద్యోగస్తుడయ్యాడంటే అంతా నీ చలవే. మేమూ నీ రుణం ఏదో విధంగా తీర్చుకోవాలిగా మరి “ అన్నాను అతని చెయ్యి పట్టుకుని .
వీరేశానికి ఇది ఊహించని పరిణామం. అతనికి మనసులో అనిపించింది .” నిజంగా ఈ తండ్రీ కొడుకులిద్దరూ దేవుళ్ళ లాంటివారు . డబ్బులోనే ఆనందాన్ని వెతుక్కునే మనుష్యులున్న ఈ రోజుల్లో ఎంతమంది తమ పిల్లలను చిన్నప్పుడు రిక్షాలో మోసిన వారిని గుర్తు పెట్టుకుని ఈ విధంగా బాధ్యత తీసుకుని మొయ్యగలరు అంతా తన అదృష్టం కాకపోతే ?” అని .
ఈలోపు నేను మా అబ్బాయికి ఈశ్వర్కు ఫోను చేసి “ ఇప్పుడు నీకు బాగా తెలిసిన వ్యక్తిని ఫోనులో కలుపుతున్నాను. బహుశా నువ్వు వూహించలేవు . ఇదిగో ఫోను ఇస్తున్నాను. మాట్లాడు “ అంటూ వీరేశానికి రిసీవర్ అందించాను .
మొహమాటంతో రిసీవర్ అందుకుని అవతల వ్యక్తి గొంతు గుర్తుపట్టిన వీరేశం నిర్ఘాంత పోయినా ఆ వెంటనే మొహం చేటంతయ్యింది . ఆనందంతో అతని పెదవులు వణకసాగాయి . వీరేశం మా అబ్బాయితో మాట్లాడుతూ అతనికి నేను జీవనోపాధిని కలిపిస్తున్న విషయం గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటూ వుంటే అతని మొహంలో మాపైన నిష్కల్మషమైన ఆప్యాయతా భావం తొణికిసలాడటం గమనించి నేనూ, మాధవి ఎంతో గర్వంగా ఫీలయ్యాం ***