చిదంబర రహస్యం (కొసమెరుపు కథ ) రచన: జీడిగుంట నరసింహ మూర్తి
(30/7/2021 సహరి సమగ్ర వార పత్రికలో ప్రచురించిన నా కథ )
ఆ అమ్మాయి ఉదయం ఎనిమిది ఆ ప్రాంతంలో టిఫిన్ బాక్స్ పట్టుకుని హడావిడిగా మెట్లు దిగి బస్సు కోసం పరిగెడుతుంది. పేరు సుబ్బలక్ష్మిట . ఆమె తల్లితో పాటు పై పోర్షన్లో రెండు గదులు తీసుకుని వుంటోంది. చూస్తూంటే పని విషయంలో చాలా సిన్సియర్ అని ఆమె ఉరుకుల పరుకులే చెపుతాయి . కింద వాటాలో గ్రౌండ్ ఫ్లోర్లో రెండేళ్ల క్రితం పెళ్ళైన చిదంబరం వుంటున్నాడు. అతనికి రోజూ ప్రత్యక్ష నారాయణుడు అదే సూర్యభగవానుడు దర్శనం అయినా కాకపోవచ్చునేమో కానీ సుబ్బలక్ష్మి దర్శనం మాత్రం అవ్వాల్సిందే . సంప్రదాయం, అణుకువ గల కుటుంబంలో పెరిగిన సుబ్బలక్ష్మికి రోజూ అతగాడు కింద గ్రిల్ తలుపు దగ్గర వేలాడిపోతూ వుండటం వొంటికి కారం రాసుకున్నట్టు అనుభూతి కలుగుతూ వుంటుంది. . మొదట్లో రెండు రోజులు ఏదోలే అని సరిపెట్టుకున్న ఆమెకు ఇప్పుడు రోజు రోజుకు ప్రత్యక్ష నరకం చవిచూసినట్టుగా అనిపిస్తోంది. ఈ పరిస్తితిని ఎలా ఎదుర్కోవాలో ఆమెకు అర్ధం కావడం లేదు. అతను రోజూ పనిగట్టుకుని గ్రిల్ తలుపు దగ్గర వేలాడిపోతూ వుండటం సుబ్బలక్ష్మికి చాలా ఇబ్బందిగా వుంటోంది.
ఆఫీసునుండి తల్లికి ఫోన్ చేసి చెప్పిందో ఏమిటో సుబ్బలక్ష్మి తల్లి ఈ రోజు ఏదో ఒకటి తేల్చేయ్యాలని అనుకుని ఆయాసపడుతూ మెట్లు దిగి కిందకు వచ్చింది. కింద చిదంబరం లేడు. అవును ఎందుకుంటాడు ? సుబ్బలక్ష్మి వెళ్లిపోయిందిగా. మళ్ళీ రేపు తయారవుతాడు అన్న మాట . సరే . రేపు కాపలా కాసి కూతురు కన్నా ముందే తయారయ్యి చిదంబరం చేష్టలు కనిపెట్టాలని నిర్ణయించుకుంది ఆ పెద్దావిడ . అతని భార్య ఊరెళ్ళి నప్పుడు మేడపైకి పిల్చి ఒకటిరెండు సార్లు కాఫీకి కూడా ఆహ్వానించింది సుబ్బలక్ష్మి తల్లి. చిదంబరం అనేది పాత పేరైనా తాతగారి పేరు అదే అవడంతో అతనికీ పెట్టారు అని నవ్వుతూ చెప్పాడు . పిల్లాడు మంచి కుదురైన వాడు అనుకుంది కానీ ఇలా తన కూతురు పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తాడని అనుకోలేదు.
పెద్దావిడ కిందకు కూతురితో పాటు దిగింది. చిదంబరం అటువైపు తిరిగి పేపర్ చదువుకుంటున్నాడు. ఇటు తిరుగుతాడేమో అని రెండు మూడు నిమిషాలు ఎదురు చూసింది. అసలు అతన్ని తను ఏమని ప్రశ్నించగలదు? చూస్తూంటే వాళ్ళూ వున్నతమైన కుటుంబం వాళ్ళులాగానే వున్నారు. తనకు కూడా సొంత వూళ్ళో ఆస్తులు వున్నాయి. పిల్ల వుద్యోగం కోసం వచ్చి ఈ వూళ్ళో తోడు వుంటోంది. ఎప్పుడూ ఎవరితోనూ దెబ్బలాడి ఎరగరు. ఏమీ చేయలేని పరిస్తితిలో మళ్ళీ పైకి వెళ్ళి పోయింది.
“అమ్మా . నువ్వు అతనికి క్లాస్ తీసుకోలేదా మళ్ళీ ఈ రోజు కూడా తగలడ్డాడు. ఇంట్లో శుభ్రంగా కొత్త పెళ్లాన్ని పెట్టుకుని అతని ఇదేం బుద్ది ఠంచన్గా నేను బయటకు వెళ్ళే సమయానికి తయారైపోతాడు. ఈ విషయం మనం డీల్ చేయలేం కానీ ఈ రోజు ఫోన్ చేసి ఇంటి ఓనర్ కి చెప్పు ఆయన చూసుకుంటాడు. అద్దెకు ఆశపడి అతను ఏమీ చెయ్యలేకపోతే మనం మా ఆఫీసుకు దగ్గరగా ఇంకో ఇల్లు వెతుక్కుందాం” అంటూ గొంతులో కొంత కఠినత్వం ధ్వనిస్తూనే చెప్పింది సుబ్బలక్ష్మి .
“ ఫోన్ చేసానే. ఇంటి ఓనర్ వేరే వూళ్ళో వున్న కొడుకు దగ్గరకు వెళ్లాడుట. అదేదో మీరే సెటిల్ చేసుకోండీ. కొంతమంది కుర్రాళ్ళకు అలాంటి లక్షణాలు వుంటాయి. చూసీ చూడనట్టుగా మనం తలవంచుకుని వెళ్లిపోవాలి “ అంటూ సలహా ఇచ్చాడు ఆయనకు నెలనెలా ఒకటవతేదీకి వచ్చే అద్దె ఎక్కడ పోతుందో అన్న భయం ఎక్కువగా వుంది. సరే. మనం మాత్రం ఇప్పటికిప్పుడు ఇల్లు మారడం కూడా కష్టం. చుట్టపక్కల కూరల షాపులు, కిరాణా షాపులు, పాలు, పెరుగు ఇక్కడ పుష్కలంగా దొరుకుతున్నాయి. పనిమనిషి కూడా చక్కగా పనిచేసి వెళ్లిపోతోంది. నువ్వు ఆఫీసుకు వెళ్ళేటప్పుడు అతని వైపు చూడకు . అతను అక్కడ వున్నాడని కూడా నీకు అనిపించకూడదు. ఇలా కొన్నాళ్లు నీ ప్రవర్తన గమనించాక అతనే నోరుమూసుకుని ఇంట్లో కూర్చుంటాడు. “ అంటూ పెద్దరికంగా మంచి సలహా ఇచ్చింది.
రోజూ రెండు బస్సులు పట్టుకుని ఆఫీసుకు వెళ్ళడం నానా యాతనగా వుంటోంది సుబ్బలక్ష్మికి. ఏదో ఈ వంకనైనా ఇల్లు మారుదాం అనుకుంటే అమ్మ పడనిచ్చేటట్టుగా లేదు అనుకుంటూ వుసూరుమని తనగదిలోకి వెళ్లిపోయింది సుబ్బలక్ష్మి.
పదిహేను రోజుల తర్వాత ఇంటి ఓనర్ వచ్చాడు . అతని రాక చూసిన సుబ్బలక్ష్మి, ఆమె తల్లి జరగబోయే సంఘటనకు ఆతృతగా ఎదురుచూడటం మొదలు పెట్టారు.
ఒక అరగంట తర్వాత “ వస్తాను సార్ చిదంబరం గారు మీరిచ్చిన ఆతిద్యానికి చాలా సంతోషం . . ఎవ్వరూ ఏమీ అనుకునేది లేదు . మీరు కంటిన్యూ చేయండి . పాపం ఆఫీసులో పద్దెనిమిది గంటలు ఏసీ రూముల్లో పని చేస్తూంటే డి- విటమిన్ ఎలా అందుతుంది ? లేనిపోని రోగాలు వస్తాయి. రోజూ కాసేపు పొద్దున్నే మీరు గ్రిల్ లో ఎండలో నిలబడటం చాలా మంచి పని. డాక్టర్లు కూడా అదే చెపుతున్నారు. ఏదో సమయం చూసుకుని ఎండలో కాసేపు తిరగమంటున్నారు. అమ్మాయికి నా థాంక్స్ చెప్పండి చక్కటి చిక్కటి మంచి కాఫీ ఇచ్చినందుకు “ అంటూ పైన మెట్లమీద నిలబడి ఆతృతగా చూస్తున్న తల్లీ కూతుళ్ల వైపు పరికించి చూస్తూ “ ఏమ్మా అర్ధం అయ్యింది కదా ? మీరు కూడా ఎప్పుడూ ఇంట్లోనే కూర్చోకుండా కాస్త డి విటమిన్ పీల్ఛండి “ అంటూ నవ్వుకుంటూ స్కూటర్ ఎక్కి వెళ్ళి పోయాడు . ****