సమస్య ఎక్కడుంది ?

సహరి వార పత్రిక • 08 Oct 2021 • 👁 1 views
“సమస్య ఎక్కడుంది ?“ (బాలల కథ )
రచన: జీడిగుంట నరసింహ మూర్తి
(8/10/2021 సహరి సమగ్ర వార పత్రికలో నా కథ )
“ ఇదిగో వాసూ , చింటూ మీ ఇద్దరూ కంబైన్డ్ స్టడీ చేస్తున్నారుగా. మరి మా వాడు బాగా చదువుతున్నాడా లేదా ?” అడిగింది చింటూ తల్లి.
“ బాగానే చదువుతున్నాడు ఆంటీ “
“బాగా చదివితే వాడికి మార్కులు ఎందుకు తక్కువ వస్తున్నాయి నిజం చెప్పు “
“ ఏమో ఆంటీ “
చింటూ తల్లి సుజన రెట్టించి అదే విషయాన్ని కూపీ లాగాలని మళ్ళీ అడిగింది
“అది కాదు ఆంటీ . మీకు చింటూ చెప్పొద్దని అన్నాడు. మధ్య మధ్యలో నిద్రపోతున్నాడు. నేను నిద్ర లేపాలని అనుకుంటే రేపు పొద్దున్న లేచి చదువుతాను అంటాడు “ అంటూ భయం భయంగానే చెప్పాడు వాసూ . .
“ ఈ విషయం నేను అడిగితే ఇప్పుడు చెపుతున్నావు. ఇందుకోసమైనా ఇద్దరూ కలిసి చదువుతున్నది?. రేపటినుంచి నువ్వు మీ ఇంట్లో చదువుకో. మీ చదువులు మాటేమో కానీ మాకు కరెంట్ బిల్లు మోత మోగిపోతోంది..”అంటూ నిష్కర్షగా చెప్పేసింది. చింటూకీ ఆమె మాటల వెనుక భావం పూర్తిగా అర్ధం కాకపోయినా “ సరే ఆంటీ . రేపటినుండి రాను. మా ఇంటిలోనే చదువుకుంటాను “ అన్నాడు బిక్కమొహం పెట్టి.
“ఏమిటి ఆ పిల్లాడితో గొడవ పడుతున్నావు ?”అంటూ బెడ్ రూంలోంచి బయటకు వచ్చి అడిగాడు చింటూ తండ్రి రాజారావు.
“ చూశారుగా. వీడేమో చదువులో వెనక పడిపోయాడు. మీరేమో వాడిని డాక్టర్ని చేయాలని ఆశపడుతున్నారు . ఆ వాసూ వాళ్ళ అమ్మ వాడి అల్లరి భరించలేకో ఇంకే కారణం వుందో తెలియదు కానీ కంబైన్డ్ స్టడీ పేరుమీదట వాడిని ఇక్కడకు తోలేస్తోంది. ఇక్కడైతే హాయిగా ఫ్యాన్ కింద ఎంత సేపైనా కూర్చోవచ్చు. లైట్ ఎంతసేపైనా వేసుకోవచ్చు ఆ వారా వాళ్ళకు ఆ ఖర్చు తప్పుతుందని ఆవిడగారి ప్లాన్. పోనీలే పిల్లలు ఒకచోట కూర్చుని చదువుకుంటారు అనుకుంటే మన పిల్లాడికి ఏవైనా డౌట్లు వస్తే వాసు “ నేను చదువుకోవాలి. నన్ను డిస్ట్రబ్ చేయొద్దు” అని విసుక్కుంటున్నాడుట . . పైపెచ్చు నువ్వు కొద్దిసేపు నిద్రపో. నేను ఒక గంట తర్వాత లేపుతాను అని చెప్పి మనవాడిని నిద్రనుండి లేపకుండా వాడు మాత్రం చక్కగా చదువుకుంటున్నాడు. వీడేమో అమాయకుడిలా వెర్రి మొహం వేసుకుని వాడేం చెప్పినా వింటున్నాడు . ఈ వయసులో కూడా వాడికి ఎంత స్వార్ధమో చూసారా ? చిన్న పిల్లాడైనా వాడికి ఎంత కుళ్ళు బుద్దో చూడండి. రేపు మన పిల్లాడిని చెడగొట్టినా ఆశ్చర్యం లేదు. నాకు ఇదంతా తెలియక వాసు కూడా మన పిల్లాడు లాంటివాడే నని చింటూతో పాటే వాడికి కూడా పాలు కలిపి ఇస్తున్నాను. వాసు తల్లిని ఏమైనా అనుకొనివ్వనియ్యండి అంత్య నిష్టూరం కన్నా ఆదినిష్టూరం మేలు అని రేపటినుండి వాడిని రావద్దని చెప్పేశాను. మీరు మాత్రం వాడిమీద పొరపాటున కూడా జాలి చూపించకండి. .. కొన్నాళ్లు మీరు వాడి పక్కన కూర్చుని వాడికి ఏమైనా డౌట్స్ వుంటే చెప్పొచ్చు కదా . వాడికి కూడా ధైర్యంగా వుంటుంది “ ఆమె కంఠంలో అభ్యర్ధన కనిపించింది.
“ కానీ సుజనా నువ్వు నువ్వు వాసూకు ఇంకోరకంగా చెప్పాల్సింది. వున్న పళంగా ఆ పిల్లాడిని బయటకు గెంటేసి మోహమ్మీద తలుపు వేసేసినట్టయ్యింది . సరే అయ్యిందేదో అయ్యింది. ఇక నువ్వు ఈ విషయం గురించి ఎక్కువగా ఎవరితోనూ చర్చించకు. నేను మన వాడి స్కూల్ టీచర్లతో కూడా మాట్లాడతాను . వాడి విషయంలో వాళ్ళనే ప్రత్యేకమైన శ్రద్ద తీసుకోమంటాను. చింటూని ఇక ఈ రోజుకు చదువు ఆపేసి పడుకోమను. “ అన్నాడు రాజారావు భరోసాగా . .
ఆ రోజు ఆఫీసుకు ఉదయం పూట ఆలస్యంగా వస్తానని చెప్పి రాజారావు భార్య సుజనాని , చింటూని స్కూటర్ మీద స్కూలుకు తీసుకెళ్ళాడు . .
“రండి రాజారావు గారు నేనే మీకు ఫోను చెయ్యాలనుకుంటున్నాను “ అంటూ ఆహ్వానించాడు ప్రధానోపాద్యాయుడు .
“ అదే మాస్టారు. పిల్లాడికి ఈ మధ్య మార్కులు బాగా తక్కువ వస్తున్నాయి. చూడటానికి బాగానే చదువుతున్నట్టు అనిపిస్తోంది. క్లాసులో ఎలా వుంటున్నాడో మీ దృష్టికి ఏమైనా వస్తే దయచేసి చెప్పండి “ అన్నాడు రాజారావు సందేహంగా.
“ అవును దాని గురించే చెప్పాలి . మీరు మరి గమనించారో లేదో కానీ మీ బాబు ఈ మధ్య తలనొప్పిగా వుందంటూ ఏడుస్తున్నాడు. బ్లాక్ బోర్డు మీద అక్షరాలు సరిగ్గా చెప్పలేక పోతున్నాడు. ఏ విషయం కూడా గుర్తు పెట్టుకోలేక పోతున్నాడు . క్లాసులో నిద్రపోవడం కూడా జరుగుతోందని మా టీచర్లు ఒకటి రెండు సార్లు నాతో ప్రస్తావన తీసుకొచ్చారు. ఎందుకైనా మంచిది ఒకసారి పిల్లాడిని కంటి డాక్టరికి చూపించండి. ప్రతి రెండు మూడు నెలలకు మా స్కూలులో కూడా అటువంటి టెస్టులు చేస్తూ వుంటారు అనుకోండి. కానీ అంతవరకు ఆగడం మంచిది కాదు . మీ పిల్లాడు చాలా తెలివైన వాడు . కేవలం కంటి సమస్య వల్లే చదువుమీద శ్రద్ద చూపలేకపోతున్నాడు. ఏమీ కంగారు పడనక్కరలేదు. గతంలో కొంతమంది పిల్లలకు ఇటువంటి సమస్యలు వస్తే మేము అన్ని జాగ్రత్తలు తీసుకుని వాళ్ళను మళ్ళీ మామూలు స్తితికి తీసుకోచ్చాం. ఒక రెండు రోజులు పిల్లాడిని స్కూలుకు పంపకండి. ముందు అతని విషయం చూడండి. నాలుగైదు రోజుల్లో చాకులా తయారవుతాడు. డోంట్ వర్రీ .... ఆల్ ది బెస్ట్ “ అంటూ చేయి వూపాడు ప్రధానోపాద్యాయుడు .
అంతా ప్రత్యక్షంగా తెలుసుకున్న సుజన మ్లానమైన ముఖాన్ని కిందకు దించింది . “ నేను పొరపడ్డాను అండీ . వాసుమీద నిజాలు కన్నా నా అపోహతోనే నిర్ధాక్షిణ్యంగా ప్రవర్తించి అతని లేత మనసును గాయపరిచాను . చింటూకి వైద్య పరీక్షలు చేయించిన తర్వాత నేనే స్వయంగా వాసూ వాళ్ళింటికి వెళ్ళి నేను చేసిన తప్పును సరిదిద్దుకుంటాను “ అంది సుజన విచిత్రమైన భావోద్వేగానికి లోనవుతూ .....*****
సమాప్తం