సాంత్వన

సహరి వార పత్రిక • 23 Apr 2021 • 👁 2 views
సాంత్వన (కథ )
రచన: జీడిగుంట నరసింహ మూర్తి
(23/4/2021 సహరి సమగ్ర వార పత్రికలో నా కథ )
“నువ్వూ, కోడలు, పిల్లలు కులాసాగానే వున్నారు కదా భాస్కరం ?”
“బాగానే వున్నాం నాన్నా ! ఏమిటి అక్కడ విశేషాలు ?”
“ విశేషాలేమీ వుంటాయిరా . నీకు తెలుసుకదా ఈ వూళ్ళో మనసారా పలకరించే వాళ్ళు లేరు. కాలనీలో ఇంతమంది నాబోటి ముసలాళ్లు వున్నా ఈ వయసులో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు , ఇంకా ఏవేవో సాధించెయ్యాలని, సంపాదించేయ్యాలన్న తపన. వాకింగ్ కు వచ్చే వాళ్ళు లేరు . ఐదు నిమిషాలు మాట్లాడితే వడ్డీ నష్టపోయామనే ధోరణి. ఇలాంటి పరిస్తితిలో కొంత గాలి మార్పిడి అవసరం అని మీ అమ్మా , నేను అనుకుంటున్నాంరా . ఒక ఐదారు నెలలలు అమెరికా వచ్చి మీ అందరితో గడపాలని వుంది . వీలు చూసుకుని టిక్కెట్లు బుక్ చేస్తావా ?” అన్నాడు నారాయణ రావు . కొడుకు దగ్గర చనువు వున్నా అలా అడగడంలో ఆయన ఎంత ఇబ్బంది పడాల్సి వచ్చిందో కేవలం ఆయన మనసుకు మాత్రమే తెలుసు.
“ నేను మళ్ళీ చెపుతాను నాన్నా! నాకు కూడా మిమ్మల్ని ఇద్దర్ని చూడాలని వుంది. కానీ ఇక్కడ విపరీతమైన చలి. మైనస్ డిగ్రీ టెంపరేచర్ నడుస్తోంది. అసలే నీకు,అమ్మకు ఆస్మాతో పాటు వేరే సమస్యలు కూడా వున్నాయి కదా . ఇండియాలో లాగా ఇక్కడ వైద్యం చేయించుకోవాలంటే బోళ్ళంత ప్రొసీజర్ . ఒక్క రెండు నెలలలు ఎలాగో గడిపేయ్యండి . త్వరలోనే నేను మీరు ఇక్కడకొచ్చే ప్రోగ్రామ్ ఫిక్స్ చేస్తాను “ అన్నాడు భాస్కరం .
“ఏమంటాడు అబ్బాయి ?” అంది భాగ్యమ్మ మొగుడి పక్కన కుర్చీ వేసుకుని కూర్చుంటూ .
“ఏమంటాడు ఎప్పుడూ చెప్పేదే అక్కడ చలి ఎక్కువగా వుందని మన ఇద్దరి ఆరోగ్యాలకు ఇప్పుడు అనువైన కాలం కాదని “
“పోనీ పిల్లల్ని, కోడల్ని తీసుకుని వాడ్నైనా రమ్మనక లేకపోయారూ నా మనసంతా వాళ్లపైనే వుంది . వాడు వచ్చి నాలుగేళ్లవుతోంది . ఏంటో వాడికి సెలవు దొరికితే ఆ అమ్మాయికుండదు. వాళ్ళకు కుదిరినప్పుడు మనకు ఏదో సమస్య .. “ అంటూ నిర్లిప్తంగా నవ్వుకుంటూ అక్కడనుండి లేచింది భాగ్యమ్మ .
కాలనీలో తన కొడుకులాగా విదేశాలలో వుద్యోగాలు చేసే వాళ్ళు చాలా మంది వున్నారు. నెలల తరబడి ఇళ్లకు తాళాలు వేసి వుండటం , వాళ్ళు పిల్లల దగ్గరకు వెళ్ళడం రావడం కూడా తను చూస్తూనే వుంటాడు నారాయణ రావు
“ఎప్పుడూ బిక్కుబిక్కుమంటూ ఏముంటారు నారాయణరావు గారు ? హాయిగా మాలాగా మీరు కూడా అమెరికా వెళ్ళి మీ కొడుకు దగ్గర ఎంజాయ్ చెయ్యొచ్చుగా ?” అంటూ చాలా మంది ఏదో రకంగా మనసును మెలిపెట్టి భాగ్యమ్మ గారు ఇచ్చిన చిక్కటి కాఫీ తాగి , ఆ రోజు న్యూస్ పేపర్లు చదివి వెళ్ళి పోతూండే వాళ్ళు. వాళ్ళు వెళ్ళాక నారాయణరావు దంపతులలో కొంత నైరాశ్యం అలుముకునేది. ఎవరూ లేరనుకోవడం ఎంత వెర్రితనమో వున్నారనుకోవడం కూడా అంతే తెలివితక్కువ తనం . ఒక్కోసారి పరిస్తితులకు మనిషి బానిస . తప్పంతా భాస్కరం మీదే నెట్టేయ్యడానికి వీల్లేదు. ఎందుకో తనకికూడా ఆ విమానాలలో అంతంత దూరం ప్రయాణం చెయ్యాలంటే ఇష్టం అనిపించదు. హాయిగా వున్న చోటే కూర్చుని నచ్చిన పుస్తకాలు, పేపర్లు చదువుకుంటూ టీవీలో సీరియళ్ళు చూసుకుంటూ సాయంత్రం పూట అలా దగ్గర్లో వున్న పార్కుకెళ్లి కాలక్షేపం చేసుకుంటూ వుంటే జీవితాలు గడిచిపోవా ? వేరే దేశాలు వెళ్ళి ఆరోగ్యాలు పాడుచేసుకోవడంతో పాటు అవతలి వారిని ఇబ్బంది పెట్టడం ఎందుకు అనిపిస్తుంది . . పాపం భాగ్యమ్మకు మాత్రం కొడుకు దగ్గరకు వెళ్లాలని తన చుట్టుపక్క వాళ్ళతో ఆ విషయం గొప్పగా చెప్పుకోవాలన్న ఆరాటం ఎప్పుడూ వుంటుంది. కానీ మొగుడికి ఇష్టం లేకుండా తనొక్కత్తే వెళ్లలేదు కదా ? అప్పటికీ ఎన్నో సార్లు మొగుడితో వాదించేది మీవల్ల నాకు ఏ కోరికలూ తీరడం లేదని .
“పోనీ వెళ్లవోయ్ నీకు అభ్యంతరం ఏమిటి ? కానీ రెండు విమానాలు మారుకుంటూ ఆ సెక్యూరిటి వాళ్ళతో ఇంగ్లీషులో మాట్లాడుతూ మానేజ్ చేయగలను అంటే నా వంట నేను వండుకుంటూ కాలక్షేపం చెయ్యడం నాకేమీ కష్టం కాదు . కానీ ఐదవ తరగతి వరకు చదువుకున్న నీకు తెలుగు తప్ప ఏ భాషా రాదు . మన ఇంటికి వచ్చిన ఆడవాళ్ళు ఇంగ్లిష్, హిందీలో గడగడా మాట్లాడేస్తూ వుంటే వెర్రి మొహం వేసుకుని చూస్తూ వుంటావు కదా! ఒంటరిగా ఎన్నో అవరోధాలు దాటుకుంటూ బయట ప్రపంచంలోకి వెళ్లగలవని నాకు నమ్మకం లేకే నిన్ను ఒక్కదాన్నే పంపే ధైర్యం చెయ్యడం లేదు. అక్కడకు వెళ్ళినా కూడా నీకు ఆ వంట కార్యక్రమం నీమీదే పడుతుంది. నీకు ఇంకా రెస్ట్ ఎక్కడ ? . , పోనీ భాస్కరం ఈ వూరు వచ్చి వెళ్ళేటప్పుడు నిన్నుకూడా తీసుకువెళతాడేమో అనుకుంటే వాడు ఇక్కడకు రావడమే మిధ్యగా వుంటోంది “ ఇలా చాలాసార్లు భార్య భాగ్యమ్మను నిరాశ పరుస్తూ వుండే వాడు నారాయణ రావు . .
భాగ్యమ్మ తలకింద చెయ్యిపెట్టుకుని మంచానికి చివరగా గోడవైపు తిరిగి దిగులుగా పడుకుని వుండటం నారాయణ రావు ఎన్నోసార్లు గమనిస్తూ వస్తున్నాడు. అటువంటి సందర్భాలలో ఆమె మీద చాలా సార్లు విపరీతంగా జాలి కలుగుతూ వుండేది. ఈ నాటి తరం వాళ్ళు లాగా మొగుడి మొహం మీదే ఈసడించేసి పెత్తనం చెలాయించే మనస్తత్వం కాదు ఆమెది. ఏమీ చేయలేని ఆశక్తత ఆమెది.
“ సరేలోవోయ్ . నాకు మాత్రం వాళ్ళను చూడాలని వుండదా? మన ఇద్దరికీ వేరే రోగాలతో పాటు శంఖు చక్రాల్లా బీపీ షుగర్లు కూడా వున్నాయి . ఎప్పుడు ఎలా వుంటుందో తెలియదు . మందులమీద బ్రతుకును లాగుతున్నాం. ఏదో సొంత ఇంట్లో దొడ్లో చిన్న చిన్న కూరలు పండించుకుంటూ ఆనందంగా గడిపేస్తున్నాం అని అనుకుంటున్నాం కానీ ఈ వయసులో పిల్లల తోడు లేకుండా జీవితాలను ముగించాలనుకోవడం అవివేకమే .ఏదోలా బ్రతికేయ్యాలనుకుంటే కాలం చేతి వేళ్ళమధ్య ఇసుకలా జారిపోతుంది . అయితే మనకిష్టం లేకో , భాస్కరానికి అనుకోని పరిస్తితుల వల్లో ఒకరికొకరు దూరంగా వుండాల్సి వస్తోంది కానీ నేను మరీ అంత మూర్ఖుడిని కాను . చాలా మంది పిల్లలు విదేశాలలో వుండి తల్లి తండ్రులను స్వదేశంలో ఒంటరిగా వదిలేసి చచ్చిపోయినా చివరి చూపు చూడటానికి కూడా రారు అని పిల్లల మీద అపవాదులు వేస్తూ వుంటారు. పరువు ప్రతిష్టల కోసం పిల్లలను అప్పులు చేసైనా సరే తమ స్వార్ధాన్ని పక్కనపెట్టి వాళ్ళను విదేశాలకు పంపేస్తూ వుంటారు. చివరకు వాళ్లమీదే నెపం వేస్తూ వుండటం పరిపాటైపోయింది. కానీ మనం మాత్రం మనకిష్టం అయ్యే ఈ దేశంలోనే వుండి మన సొంత ఇంటిమీద మమకారంతో లోకులు ఏమనుకున్నా జీవితాన్ని లాగించేస్తున్నాం. ఏదో వారం పది రోజుల కోసం వాడిని బోళ్ళంత డబ్బు ఖర్చుపెట్టించి రమ్మనడం కూడా భావ్యం కాదనుకో . సరే. అంత మొండిపట్టు పట్టి వాడికి అలా దూరంగా వుండటం మంచిది కాదు. వాడితో మాట్లాడతాను ఈ రోజే “ అని భాగ్యమ్మ మనసును చల్లపరిచేవాడు నారాయణ రావు . ఇదంతా కొడుకుతో ఫోనులో మాట్లాడక ముందు మొగుడూ పెళ్ళాల మధ్య జరిగిన సంభాషణ .
కొడుకు ఇంతకు ముందు రెండు మూడు సార్లు చెప్పినట్టుగానే ఈసారి కూడా చెప్పడంతో నారాయణరావుకు అనుమానం రాక పోలేదు . అలా అని కొడుకును ప్రశ్నించలేడు ఎందుకు తమ ప్రయాణాన్ని వాయిదా వేస్తున్నావు అని ? . అయితే కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టుగా ఈలోపు అమెరికా నుండి ఆయనకు వూహించని ఫోన్ ఒకటి వచ్చింది.
“ బావగారూ నేను రాజారావుని అమెరికా నుండి మాట్లాడుతున్నాను . మా అబ్బాయి కూడా ఇక్కడే వున్నాడు కదా. అమ్మాయి దగ్గర కొన్నాళ్లు అబ్బాయి దగ్గర కొన్నాళ్లు వున్నట్టు వుంటుందని ఆరునెలల క్రితం అమెరికా వచ్చాం. మీరు ఎలాగూ ఆ వూరు విడిచిపెట్టే సూచనలు కనిపించక పోవడంతో, పైగా మాకు పెద్దగా ఎటువంటి నిబంధనలు లేకపోవడం వల్ల ఎప్పుడు పడితే అప్పుడు ప్లాన్ చేసుకుని అమెరికా వెళ్లిపోతున్నాం. వెళ్తున్నట్టు, వెళ్ళినట్టు మీకు కూడా ఎప్పటికప్పుడు చెప్పాలని అనుకున్నా వీలుకాక పోయింది ఏమీ అనుకోకండి. మీ ఆరోగ్యాలు జాగ్రత్త “ అంటూ వియ్యంకుడు ఇన్నాళ్లకు ఫోన్ చెయ్యడంతో కొడుకు భాస్కరం పరిస్తితి పూర్తిగా అర్ధం అయ్యింది నారాయణ రావుకు . . అదీ అసలు కారణం .ఎటువంటి అడ్డంకులు లేని తన వియ్యంకుడు అనుకున్నదే తడవుగా కూతురి ఇంట్లో వాలిపోతూ వుండటం అక్కడ పెత్తనం అంతా కోడలిది అవ్వడం వల్ల ఏమీ చేయలేని నిస్సహాయతతో కొడుకు తమ ప్రయాణం ఏదో రకంగా వాయిదా వేసుకొస్తున్నాడని గ్రహించాక ఆయనకు కొడుకు మీద కోపం రాలేదు పైగా జాలి వేసింది .
“ అవును వాడు చెప్పుకోలేని విచిత్ర సంఘర్షణల మధ్య నలిగిపోతున్నాడు . మనని సుఖపెట్టలేక పోతున్నానని వాడు నిత్యం ఆలోచిస్తూనే వుంటాడు . మన వియ్యంకుడిది అవకాశం . మనది మొదటినుండి పూర్తిగా చొరవలేని తనం. ఈ పరిస్తితులలో ఎప్పుడూ వాళ్ళదే పైచేయిగా వుండటం సహజం. జీవితం అంటేనే రాజీ పడటం.. .ఆ దేశం ఎప్పుడు వెళ్లాలని రాసి వుంటే అప్పుడే వెళ్తాం . నువ్వేమీ నిరాశ పడకు. మనకూ మంచి రోజులు వస్తాయి “ అంటూ జరిగిన విషయం చెప్పి భాగ్యమ్మను ఓదార్పు మాటలతో సాంత్వన పరిచాడు నారాయణ రావు . .
. – సమాప్తం