అజాత శత్రువు

సహరి వార పత్రిక • 18 Mar 2022 • 👁 3 views
అజాత శత్రువు (కథ ) రచన : జీడిగుంట నరసింహ మూర్తి
18/3/2022 సహరి వార పత్రికలో ప్రచురితం
"ఏం మోసుకొచ్చారు ఇవాళ" అని అడగడం అలవాటు సుభద్రమ్మకు బయటనుండి వచ్చిన భర్త చేతిలోని బరువైన సంచీనీ అందుకుంటూ. .
దొడ్లో ఎన్నో రకాల కూరలు కాస్తున్నా బయటకు పనిగట్టుకుని వెళ్ళడం నాలుగైదు రకాల కూరలు మోసుకురావడం రాజారావుకు అలవాటు. బయట బజారులో రోడ్డు పక్కన కూరల దుకాణాల వాళ్ళంటే ఆయనకు ఎంతో జాలి. ఉదయమే పేపర్ కొనుక్కోవడానికి మార్కెట్ వైపు వెళ్లినప్పుడు వివిధ వాహనాలలో కూరల మూటలు కూరకాయల షాపుల దగ్గర దించుతూ వుంటే ఎన్నోసార్లు అనుకునే వాడు మనం ఉద్యోగాలు చేసేసి కష్టపడి పోతున్నాం అనుకుంటూ వుంటాం . పాపం వ్యవసాయ దారులు భూమిని, కాలాలను నమ్ముకుంటూ ఎంతో శ్రమ పడితే కానీ ఇంతమంది జనాల నోటిదగ్గరకు తిండి రావడం లేదు . . తెలతెలవారక ముందే మొదలయ్యే ఈ ప్రహసనం పాపం రాత్రి పొద్దుపోయే అంతవరకు కొనసాగుతూనే వుంటుంది . . అందుకే వాళ్ళ గురించి కొద్దిసేపేనా ఆలోచిస్తాడు. ..
"అవును రాజారావుగారూ , దొడ్లో అన్ని కూరలు పండిస్తున్నా, మళ్ళీ బజారునుండి రెండు చేతులతో మోసుకొస్తూనే వుంటారు. మిమ్మల్ని చూస్తూంటే ఈ వాడంతటికీ విచిత్రంగా అనిపిస్తుంది. " అన్నాడు రోజూ రాజారావు ఇంటికి పేపరు చదువుకోవడానికి వచ్చే రామారావు. .
" అలా అంటారా ? పాపం బయట కూరలు అమ్ముకునే వాళ్ళు కూడా బతకాలికదా. కనీసం మనం మన దొడ్లో పండించుకోలేని వాటినైనా బయటనుండి తేవాలని నేను అనుకుంటూ వుంటాను. మాది కూడా పెద్ద సంసారం. పైగా వచ్చే పోయే బంధువులు కూడా ఎక్కువే. అన్నట్టు ఫ్రెష్ గా ఆనపకాయలు కోసాం ఈ రోజే. మీరో కాయ తీసుకుని మీ పక్క వాళ్ళకు ఒకటి ఇవ్వండి. వూరికె చెట్టుకు వుంచితే ఎండిపోతాయి. " అనగానే రామారావు మొహం చేటంతయ్యింది .
" పోనీలెండి . మీకు నలుగురికీ పంచిపెట్టాలన్న మంచి గుణం వుంది. అందుకే మీ ఇల్లంటే పనిమనుషులు దగ్గరనుండి వంట మనుసులు వరకు పట్టుకుని వేలాడుతూ వుంటారు. " అంటూ ఆకుపచ్చని రంగులో నవనవలాడుతున్న ఆనపకాయలను ఆ చేత్తో ఒకటీ , ఈ చేత్తో ఒకటి పట్టుకుని బయలు దేరాడు రామారావు .
ఆ రోజు రాజారావు వట్టి చేతులతో ఇంట్లోకి అడుగుబెట్టాడు. ఈ రోజు ఏం మోసుకొచ్చారు అని భార్య అడగడానికి ఆస్కారం లేకుండానే అతనితో పాటు ఒక వ్యక్తి మొహమాటపడుతూ గుమ్మం బయటే నిలబడి పోయాడు.
"ఇదిగో ఈయన్ని గుర్తుపట్టగలవా ? "´అన్నాడు సుభద్రమ్మతో రాజారావు లోపలికొస్తూ .
సుభద్రమ్మ ఒక నిమిషం కళ్ళు చిట్లించి చూసింది ఆ అపరిచిత వ్యక్తి వైపు.
" గుర్తుతెచ్చుకుంటున్నాను కానీ ముందు వారిని లోపల కూర్చోపెట్టండి. అలా గుమ్మం దగ్గరే నిలబెట్టెస్తారే. ఈ లోపల కాఫీ తీసుకువస్తాను. మీరు ఆయనతో మాట్లాడుతూ వుండండి" అంటూ లోపలికి వెళ్లింది .
"మాస్టారూ పిల్లలూ అంతా బాగున్నారా ? మిమ్మల్ని చూసి చాలా రోజులయ్యింది . " అంటూ పక్కనే వున్న సోఫాని టవల్ తో దులిపి కూర్చోమన్నాడు రాజారావు . .
ఈ లోపు సుభద్రమ్మ రెండు గ్లాసులతో కాఫీ తీసుకువచ్చి " అవును ఇప్పుడు లీలగా గుర్తొస్తోంది. వీరు మాధవరావు గారు కదూ. మీరూ ఈయనతో పాటు టీచర్గా పని చేశారుగా. మనం పదిహేనేళ్ళ క్రితం పక్కపక్క ఇళ్ళల్లో వుండే వాళ్ళం కదా ?" అంది సన్నగా మందహాసం చేస్తూ.
" అవునమ్మా. చాలా సంతోషం. నేనింకా మీకు గుర్తున్నానన్న మాట. నేను మీకు చేసిన అన్యాయం నేనింకా మర్చిపోలేదు. రాజారావు మాస్టారి మంచితనాన్ని అవివేకంతో గుర్తించలేక మీ కుటుంబాన్ని ఇడుముల పాలు చేసినందుకు ఆ భగవంతుడు నాకు సరైన రీతిలో శిక్షే వేశాడు." అంటూ అపరాధిలా తలదించుకున్నాడు అతను .
"మాధవరావు గారూ ! ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు లెండి. అప్పట్లో అవగాహనా లోపం వల్ల జరగరాని అనర్ధం జరిగిపోయింది. నిజానిజాలు తెలుసుకోవడానికి ఎటువంటి ప్రయత్నం జరగలేదు. నా ప్రతిష్టకు భంగం కలిగి తాత్కాలికంగా నా కుటుంబం ఇబ్బందులు పాలైనా ఏనాడూ నేను ఆ విషయాలను మనసులో ఉంచుకోక భవిష్యత్తు కార్యాచరణ కోసమే నా ప్రయత్నాలు మొదలెట్టాను. ఏది ఏమైనా ఇన్నాళ్లకు మిమ్మల్ని కలిసినందుకు నాకు చాలా ఆనందంగా వుంది. దయచేసి ఇక ఆ పాత సంగతులను వదిలేద్దాం. . మీ చెల్లెలు మీకు స్నానానికి వేడి నీళ్ళు తోడింది . హాయిగా సేద తీర్చుకోండి. ఈ లోపు మన దొడ్లోని మీరు బాగా ఇష్టపడే అరటి పువ్వులతోనూ, అరటి దూటతో వండిన వంటలుతో భోజనం చేశాక మిగతా విషయాలు మాట్లాడుకోవచ్చు. . ఈ వూళ్ళో వున్నన్నాళ్లు మీరు మాకు ముఖ్య అతిధి. . ఇక్కడ మీరు ఏమాత్రం మొహమాట పడవలసిన అవసరం లేదు " అంటూ పెట్టిలోంచి కొత్త టవల్ తీసి ఇచ్చాడు రాజారావు.
" అయ్యో అన్నయ్యగారు ఉపాహారం చేశారో లేదో కనుక్కోకుండా ఏమిటండీ మీరు మరీనూ. ఆ అరటిపువ్వు, దూటకూరలు వండటానికి కొద్దిగా ఆలస్యం అవుతుంది. . ఈ లోపు వేడి వేడి ఇడ్లీ వాయి తీసి పెడతాను. అప్పట్లో అన్నయ్యగారు నేను చేసిన ఇడ్లీ బాగా మెచ్చుకుంటూ" అంత దూదిలా ఇడ్లీ ఎలా వస్తుందమ్మా ?. మాకు ఎన్ని సార్లు చేసినా రాళ్ళులా తయారవుతాయి " అంటూండేవాళ్లు ఆయన భార్యను ఆటపట్టిస్తూ.
". చాల్లెద్దురూ. వదినగారిని తక్కువ చేసి మాట్లాడకండి. చాలా సార్లు ఆవిడ పంపిన పదార్ధాలు రుచి చూసి ఎంతో మెచ్చుకునే వాళ్ళం. ఏమిటో పాత జ్ఞాపకాలు ఒక్కటొక్కటిగా గుర్తుకు వస్తున్నాయి. " అంటూ రెండు నిమిషాల్లో పొగలు కక్కుతున్న వేడి వేడి ఇడ్లీ ఘుమ ఘుమ లాడుతున్న కొబ్బరి చట్నీతో సహా తీసుకొచ్చి ప్లేట్లు అందించింది. మాధవరావుకు రాజారావులోనే కాదు అతని భార్యలోనూ ఇసుమంత తన పట్ల ద్వేషం కనిపించలేదు. వారి ఆతిద్యం పట్ల వారి సమక్షంలో ఏదో మాట్లాడాలనుకున్నా గొంతు పెగలడం లేదు .
ఒక గంట సేపు మాధవరావు, రాజారావుల మధ్య పిచ్చా పాటి నడిచింది.
" ఏమండీ దొడ్లో రెండు అరిటాకులు కోసుకుని రండి. అన్నయ్యగారికి, మీకు భోజనం వడ్డిస్తాను " అంటూ వంట గదిలోంచి పిలుపు వచ్చింది.
"భర్త మాటని ఎన్నడూ జవదాటని మహా ఇల్లాలు సుభద్రమ్మగారు. ఎన్ని ఒడిదుడుకులు వున్నా ఆ సంసారం ఈ మాత్రం చీకూ చింతా లేకుండా నడిచిపోతోందంటే దానికి ఆమె సహకారం ప్రతి విషయంలోనూ వుంది. రక్తపోటు, నడుమునొప్పి లాంటి ఆరోగ్య సమస్యలు ఆమెను వేధిస్తున్నా కూడా ఇంటికి వచ్చిన బంధువుల దగ్గర పొరపాటున కూడా తేలేది కాదు. .
భోజన కార్యక్రమాలు ముగిశాక " ఆ తర్వాత విషయాలు చెప్పండి మాధవరావు గారు . మన మధ్య అనుకోని అపార్ధాల వల్ల నాకు ఇక ఆ వూళ్ళో తలెత్తుకోలేని పరిస్తితి ఏర్పడి వేరే వూరికి ట్రాన్సఫర్ పెట్టుకోవడం, పోస్టింగ్ దొరకడం వెంట వెంటనే జరిగిపోయింది. ఈ హడావిడిలో నా వంతు కర్తవ్యంగా సహ ఉపాద్యాయుడిగా మీకు ఒకసారి కనపడి వెళ్దాం అనుకున్నా అవకాశం దొరకలేదు. అందుకు మీరు నన్ను క్షమించాలి. . చాలా కాలం తర్వాత నేను మీ గురించి వాకబు చేస్తే మీరు కూడా ఆ వూళ్ళో లేరని తెలిసి చాలా ఆశ్చర్యపోయాను. ఆ తర్వాత ఇదిగో మళ్ళీ ఇప్పుడే చూడటం. " అన్నాడు రాజారావు. అలా అంటూంటే అతని ముఖంలో చెప్పలేనంత భావోద్వేగం కనిపించింది . .
"లేదు రాజారావు గారు. ఒక రోజు స్కూల్లో జీతాలకు డబ్బు డ్రా చెయ్యడానికి బ్యాంకుకు వెళ్ళిన నాకు చేదు అనుభవం ఎదురయ్యింది. బ్యాగ్లో వున్న లక్ష రూపాయలు ఎవడో దొంగ కొట్టేశాడు. నా అప్పులు తీర్చుకోవడానికి నేనే ఆ ప్లాన్ వేశానని నా మీద అకారణంగా నెపం వేసి నన్ను ఉద్యోగం నుండి సస్పెండ్ చేశారు. కాళ్లా వేళ్లా పడ్డా పై ఆఫీసర్లు నా పైన జాలి చూపించలేదు. సస్పెన్షన్ సమయంలో జీతంలో కూడా సగం కోత విధించారు. ఇక అక్కడ జరిగిన అవమానం తట్టుకోలేక ఎవరికీ మొహం చూపించ లేక నేను పుట్టిన వూళ్లోనే వేరే ఉద్యోగం వెతుక్కున్నాను. తర్వాత కాలంలో అదే వూళ్ళో వున్న ఒక ఎకరం భూమిని అమ్మేసి కూతురు పెళ్లి చేశాను. ఇద్దరు పిల్లలు పుట్టాక అల్లుడు మమ్మల్ని అందరినీ మోసం చేసి ఎటో వెళ్ళి పోయాడు. ఎక్కడున్నాడో కూడా ఇంతవరకు తెలియదు. ఉన్న ఒక్క కొడుకు మమ్మల్ని బాగానే చూసుకున్నాడు కానీ ఆ తర్వాత ఎవరినో పెళ్లి చేసుకుని మాకు దూరంగా వుంటున్నాడు. నేను పనిచేసిన పాత స్కూలులో రావలసిన బకాయిలు కింద రావలసిన సొమ్ము పోయిన సొమ్ముకు జమ చేసుకున్నామని చెప్పడంతో విపరీతంగా ఆర్ధిక ఇబ్బందులు ఎదురుకుంటున్నాం. ఇదంతా ఒకనాడు నేను మీకు తలబెట్టిన అపకార ఫలితమే అని నాకు తెలుసు. మీరు ఎక్కడున్నా వెతికి నా గోడు చెప్పుకోవాలని అనుకుని ఎవరో ఇచ్చిన సమాచారం ద్వారా ఇన్నాళ్లకు మిమ్మల్ని కలుసుకోగలిగాను . ..." అంటూ పైపంచితో కళ్ళు తుడుచుకున్నాడు మాధవరావు .
" లేదు మాధవరావు గారు . నేను ఆ విషయం ఎప్పుడో మర్చిపోయాను. మీకు కలిగిన ఇబ్బందులకు నేను ఎంతో విచారిస్తున్నాను. మీ వివరాలు వుంటే నేను ఏదో విధంగా మీకు సహాయపడి ఉండేవాడిని. ఇప్పటికీ మించిపోయింది లేదు. నేను చాలాకాలంగా ఈ వూళ్ళో ఒక టుటోరియల్ కాలేజీ పెడదామనుకుంటున్నాను.దానికి ఒకళ్ళిద్దరు టీచర్లు కావాలి.మీకు ఆసక్తి వుంటే వెంటనే మీ కుటుంబంతో సహా ఇక్కడకు వచ్చేయ్యండి. ఇద్దరం కలిసి కాలేజీ నడుపుదాం. ?" అన్నాడు రాజారావు మాధవరావు మొహంలోకి అభ్యర్ధనగా చూస్తూ.
ఆ క్షణంలో రాజారావు పట్ల అతని మనస్సు కృతజ్ఞతా భావంతో నిండిపోయింది.
" రాజారావు గారు. మీది సముద్రమంత పెద్ద మనసు. మీ మంచితనానికి మీ దగ్గర ఈ రోజు తలవంచుకుని నిలబడటానికి సిద్దంగా వున్నాను. మీకు అన్యాయం చేసిన వాడికి మీ పక్కన చోటిస్తానంటున్నారంటే నిజంగా దేవుడు ఎక్కడో లేడనిపిస్తోంది . నిజానికి మీ ఆదరణ పొందడానికి నాకు అర్హత లేదు. అయితే నా ఆర్ధిక పరిస్తితులు మిమ్మల్ని వెతుక్కుంటూ ఇలా రప్పించాయి. మీనుండి సహాయం పొందడం కన్నా ముందు మీకు క్షమాపణ చెప్పడమే నా ధ్యేయం. అయితే వరం ఇచ్చిన వేలుపు లాగా నా కుటుంబాన్ని ఆదుకుంటానని మీరన్న మాటకు నాకు జీవితమ్మీద తిరిగి ఆశ పుడుతోంది .. నా కుటుంబాన్ని నిలబెడుతున్న వారిగా మిమ్మల్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను " అన్నాడు మాధవరావు గాద్గదికమైన గొంతుతో . .
"మీరు మాటి మాటికి అన్యాయం చేశాను అనకండి. మీ పరిస్తితిలో వున్న వారు ఎవరైనా అప్పుడు అలాగే ప్రవర్తిస్తారు. ఇక ఆ విషయం ఇంతటితో మర్చిపొండి. కొద్దిసేపు విశ్రమించండి. " అన్నాడు మాధవరావుకు మంచం వాల్చి పక్క సర్ధుతూ .
రాత్రి రాజారావుకు సరిగా నిద్రపట్టలేదు. ఇన్నాళ్ళు మాధవరావు విషయం తను అస్సలు ఆలోచించలేదు. జరిగిపోయిన విషయాలు అతను మళ్ళీ మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయడు. ఈ రోజు వూహించకుండా మాధవరావు పాత్ర ప్రవేశించాక ఆనాడు జరిగిన విషయాన్ని గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. తను ఎంత అవివేకంగా మాధవరావు కుటుంబం విషయంలో తలదూర్చాడు ? అతని భార్య నాగలక్ష్మి తన ఇంటికి వచ్చి తన భర్త మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నాడని అమాయకంగా చెప్పుకుంది. అలా ఒకరోజు కాదు రెండు రోజులు కాదు తమ ఇంటివైపు వచ్చినప్పుడల్లా ఇదే ప్రస్తావన.
"చాలామంది ఇలాగే వుంటారామ్మా. పని ఒత్తిడులు కావచ్చు. కొన్ని అసంతృప్తులు వుండొచ్చు. పోనీ కొన్నాళ్లు అందరూ కలిసి ఏదైనా వూరు వెళ్లిరండి. . పిల్లలకు పరీక్షల సమయంలో టీచర్లు అందరికీ పని ఎక్కువగా వుంటుంది. ఆ సమయంలో సమన్వయం లోపిస్తుంది. అటువంటప్పుడు విహార యాత్రలు భార్యా భర్తలను మానసికంగా దగ్గర చేస్తాయి " అన్నాడు రాజా రావు.
"అయ్యో అన్నయ్యగారు అంత సరసం కూడానా ? ఆయన ఎందుకో నా ఉనికిని భరించలేకపోతున్నారు. నేను కనపడితే చాలు చీదరించుకుంటున్నారు. ఇలాంటి మనిషిని తోడుగా తీసుకుని వెళ్ళే పరిస్తితి మరింత అధ్వాన్నంగా వుంటుంది. ఆయన పెట్టే టార్చర్ ఇంతా అంతా కాదు. వేరే ఉపాయం చెపుతారనుకుని మీ దగ్గరకు వచ్చాను " అంది ఆమె ఉసూరుమంటూ కుర్చీలోంచి లేచి నిలబడి.
"అటువంటప్పుడు కొన్నాళ్లు ఆయనకు దూరంగా వుండటమే. మీ పుట్టింటికి వెళ్లిరండి. ఆయనకు మీకూ కూడా సాంత్వన లభిస్తుంది . " అని ఉచిత సలహా ఒకటి పారేశాడు రాజారావు . కానీ తన సలహా నాగలక్ష్మి అంత సీరియస్గా తీసుకుంటుందని అనుకోలేదు. . మొగుడి రాక్షతత్వాన్ని ఏ మాత్రం భరించ లేక పూర్తిగా విసిగిపోయిన ఆమె వేరే ఆలోచన చెయ్యక మొగుడు స్కూలునుండి వచ్చేలోపు బట్టలు సర్ధుకుని ఇద్దరు చిన్న పిల్లలతో సహా బయట పడింది. ఆ పట్టున ఆవిడ ఆరేడేళ్లు మొగుడి గడప తొక్కలేదు . పుట్టింటివాళ్లు మాత్రం ఎన్నాళ్లు పోషించగలరు ? ఆ తర్వాత వాళ్ళ మధ్య ఏం వాదనలు జరిగాయో కాని ఒకరోజు అర్ధరాత్రి నాగలక్ష్మి తన ఇంటి తలుపు కొట్టింది. ఈ వూహించని హఠాత్ సంఘటనకు కొద్దిసేపు మాధవరావు మ్రాన్పడి పోయాడు.అప్పటివరకూ అతనిలో బిగబెట్టిన ఆవేశం, ద్వేషం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. ఏ మాత్రం వేరే ఆలోచనకు తావు ఇవ్వక లోపలికి రావద్దంటూ ఆమెను తలుపు బయటే నిలబెట్టేశాడు. . . పిల్లల్ని తనతో పాటు ఉంచుకుని ఆమెను బలవంతాన పంపించేయ్యాలని చూశాడు.
తను అమాయకురాలినని , పక్కింటాయన రాజారావు తనకు తప్పుడు సలహాలు ఇచ్చి కొన్నాళ్లు మీకు దూరంగా వుండమని చెప్పడం వల్ల ఏమీ ఆలోచించుకోలేని ఒక అసహాయురాలిగా నేను ఈ గడప దాటానని, పిల్లల మొహం చూసి ఎప్పటికప్పుడు మీ దగ్గరకు రావాలని ఎంతో ఆతృత పడ్డానని , మీరు నా మొహం చూడటానికి ఇష్టం లేదంటూ రాసిన ఉత్తరాలు నన్ను ఎటువంటి నిర్ణయం తీసుకోలేని పరిస్తితిని కలిపించాయని , అంతంత ఆర్ధిక పరిస్తితి కలిగిన తన తల్లి తండ్రులు తనని , పిల్లలను సాకలేక అనారోగ్యం పాలవడంతో చావైనా, బ్రతుకైనా మీతోనే అని మనసుకు బాగా నచ్చచెప్పుకుని ధైర్యంగా వచ్చేశానని ఆతృత, ఉద్వేగం, భయం మిళితమైన గొంతుతో చెప్పి అతని కాళ్లమీద పడిపోయింది నాగలక్ష్మి . తన కాపురం నిలబెట్టుకోవడానికి ఆమెకు అది అన్యాయం అని అనిపించినా రాజారావు మాస్టారుని నిలువునా ఇరికించక తప్పలేదు.
మాధవరావు మొహంలో రంగులు మారాయి. క్రమంగా నాగలక్ష్మి మీద వున్న కక్ష రాజారావు మీదకు మళ్ళింది. మాధవరావు ఇంట్లోనే రాజారావు కుటుంబం పదేళ్ళకు పైగా అద్దెకు వుంటోంది. ఇద్దరూ వృత్తి రీత్యా వేరు వేరు స్కూళ్ళల్లో ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. ఆపత్కాలంలో నాగలక్ష్మి ఆడిన అబద్దం ఫలించడంతో మాధవరావు ద్వేషం రాజారావు వైపు మళ్ళింది. . దాని ఫలితమే ముందూ వెనుకా ఆలోచించక రాజారావు కుటుంబాన్ని తక్షణమే ఇల్లు ఖాళీ చేయించడమే కాకుండా గతంలో రాజారావు తన దగ్గర చేసిన అప్పుకు అతన్ని కోర్ట్ కు ఈడ్చాడు. నాగలక్ష్మి కాపురం బంగారంలా చక్కబడి పోయింది. అయితే వూహించని ఆ అవమాన భారాన్ని తట్టుకోలేక రాజారావు కుటుంబం కొన్నాళ్ళ తర్వాత వేరే ఉద్యోగం వెతుక్కుని ఆ వూరు విడిచిపెట్టింది.
మళ్ళీ ఇన్నాళ్లకు మాధవరావు కలిశాడు.
ఉదయం తలుపు తెరవగానే మూలుగులు వినిపిస్తూ వుండటంతో రాజారావు సుభద్రమ్మను పిల్చి చూడమన్నాడు. పని మనిషి గౌరమ్మ ఒక మూలగా మూడంకె వేసి పడుకుని జ్వరంతో వణికిపోతూ కనిపించింది. కొన్నాళ్ళ క్రితం సుభద్రమ్మ ఇంట్లో పని ఎక్కువయ్యిందంటూ ఇల్లు మానేసి వేరే ఇంటికి పని కుదుర్చుకుంది గౌరమ్మ. . ఈ మధ్య కాలంలో ఆమె ఏమయ్యిందో కూడా తెలియదు. ఒక సంవత్సరం తర్వాత ఈ స్తితిలో ఆమెను మళ్ళీ ఇదే చూడటం. విపరీతమైన జ్వరంతో బాధపడుతున్న తనచేత బలవంతంగా పని చేయించుకుంటూ కాళ్ళూ, చేతులు ఆడని స్తితిలో రోడ్డుమీదకు గెంటేయ్యడంతో ముక్కుతూ , మూలుగుతూ దిక్కులేని స్తితిలో సుభద్రమ్మ ఇంటికి వచ్చి చేరింది.
ఎన్నో ఏళ్లుగా తన ఇంట్లో సేవ చేసిన గౌరమ్మను ఆ స్తితిలో చూశాక సుభద్రమ్మకు , రాజారావుకు అప్రయత్నంగా కళ్ళల్లో నీళ్ళు ఊబికాయి. ఒక్క నిమిషం ఆలోచించక రిక్షా మాట్లాడి పనిమనిషి గౌరమ్మను ఆసుపత్రికి తీసుకెళ్ళాడు. రెండు రోజుల్లో పూర్తిగా కోలుకున్న గౌరమ్మ పవిత్రమైన గుడిని వదిలేసి ఇన్నాళ్లూ ఎక్కడెక్కడో తిరిగి నందుకు అవ్యక్తమైన భావాలను ముఖమ్మీద కనపరుస్తూ ఆ ఇంట్లోనే స్తిరపడి పోయింది
ఈ ప్రహసనం అంతా మాధవరావు గమనిస్తూనే ఉన్నాడు. రాజారావు ఆర్ధికంగా ఉన్నత స్తితిలో లేకపోయినా మాధవరావు దృష్టిలో ఒక మహోన్నత స్తితికి ఎదిగిపోయాడు. తననే కాదు తనలాంటి ఎందరినో చేసిన అపకారాన్ని కూడా మరిచి ,వారిని హృదయపూర్వకంగా చేరదీస్తున్న మహనీయుడుగా ,అజాత శత్రువుగా అతని గుండెల్లో శాశ్వతంగా మిగిలిపోయాడు *