మారాలి... మారాలి.

విశాలాంధ్ర ఆదివారం అనుబంధం • 14 Jun 2026 • 👁 7 views
మారాలి... మారాలి.
మారాలి... మారాలి !(కథ)

"అల్లుడుగారు ఈసారి పండక్కి కూడా రాలేదమ్మా?" మనవరాలుతో మాత్రమే వచ్చిన కూతురు సంగీతని అడిగాడు రాజశేఖరం.

" పెళ్లి అయిన ఐదేళ్లలో ఒక్కనాడు కూడా మీరు పండక్కి మా ఇంటికి రాలేదు. ఎందుకండీ అని.. నేను మీ అల్లుడిని పోరి పోరి అడిగితే... 'మీ నాన్నగారికి నేను ఇలా అన్నాను అని చెప్పకు. నాకేం బాధ లేదు. నువ్వు లా పాసైన సర్టిఫికెట్ ఒకసారి చూపించవయ్యా' అని అడిగారట కదా... మాఆయన్ని పెళ్లయిన కొత్తలో. 'లా పాస్ అవకుండా పాస్ అయ్యానని అబద్ధం చెప్పను కదా. అలా ఆయన నన్ను అవమానించారు. అందుకని నేను ఎప్పుడూ ఏ పండక్కి మీ ఇంటికి రాను' అన్నారు.ఆయన ఏ పండక్కీ ఎందుకు రావడం లేదో నాకు ఇప్పుడే అర్థమైంది. నేను కూడా రాకపోతే మీరు బాధపడతారు వచ్చాను. " అంది సంగీత నిష్టూరంగా.

" అదా సంగతి!అడిగితే గిడిగితే పెళ్లి అవకముందు అడగాలి గాని, అయ్యాక అడిగితే... ఇదిగో ఇలాగే ఉంటాయి విషయాలు.హు. అనుమానం మనసుతో బంగారంలాంటి అల్లుణ్ణి ఇంటికి రాకుండా చేశారు. ఇదీ మీ నిర్వాకం." అంది అప్పుడే వచ్చిన రాజశేఖరం భార్య జయంతి!

" అమ్మా . నా మీద ప్రమాణం చేసి ఒక మాట చెప్పు. మీ ఆయన నిన్ను బాగా చూసుకుంటున్నాడా?" అడిగాడు రాజశేఖర్ కూతురిని.

" ఈ మాట గత ఐదేళ్లుగా మీరు అడుగుతూనే ఉన్నారు నాన్న. మళ్లీ జీవితంలో మీరు అడక్కుండా చెబుతున్న నా సమాధానం వినండి. మా ఇద్దరిదీ ఒకటే మాట ఒకటే మాట. నా గురించి మీరు ఎప్పుడు బెంగ పడవద్దు. మా అత్తగారివల్ల ఏవో చిన్న గొడవలు జరుగుతాయి కాని మేమిద్దరం ఎంతో అన్యోన్యంగా ఉన్నాం అని చెప్పడానికి మీ మనవరాలు సాక్ష్యం. ఆయనకి కోపం వచ్చినప్పుడు నేను తగ్గిపోతాను. నాకు కోపం వచ్చినా నేనే తగ్గిపోతాను. ఇదే నా సంసార సూత్రం " వజ్రాయుధం లాంటి వ్యాఖ్యలతో కూతురు చెప్పిన సమాధానం విని మనసులో సగం చచ్చిపోయాడు రాజశేఖరం.

కష్టపడి పెంచి, వాళ్లకు ఇష్టమైన చదువులు చదివించి, తన స్థాయికి తగ్గట్టు ఉన్నంతలో చక్కని పెళ్లి చేసిన తన కూతురు అంత స్వచ్ఛంగా తన అభిప్రాయం చెప్పాక తానేం చేయాలో అర్థమైంది అతనికి.

' నేను బయటికి వెళ్లి వస్తాను ' అని అరగంటలో తిరిగి వచ్చాడు రాజశేఖరం. ఏం జరిగిందో తెలియదు గానీ ఆ సాయంత్రానికి పండగ మూడు రోజులు ఉండటానికి ఇంటికి వచ్చిన భర్తను చూసి సంగీత, జయంతి సంతోషంలో మునిగిపోయారు.

కూతురు వచ్చిన రోజు సాయంత్రానికే కొడుకు కోడలు దిగారు విశాఖపట్నం నుంచి మనవడితో.
"అమ్మయ్య. కాస్త విశ్రాంతి తీసుకున్నాక బజారుకు వెళ్ళొద్దామురా."అన్నాడు రాజశేఖరం.

" అలాగేనండి" అన్నాడు ప్రభుదేవా.

బజార్ కు వెళ్లే దారిలో తండ్రిని అడిగాడు ప్రభు.

"ఏంటి నాన్నగారండి.. ఇంకా అమ్మతో ఏదో విషయానికి గొడవపడుతూనే ఉన్నారా రోజూను..."

" నేను కావాలని గొడవ పడతానా ఏమిట్రా! మీ అమ్మ ఈ పని చేద్దాం అంటుంది. దానివల్ల కలిగే ఫలితం ఆలోచించి ఇష్టమైతే చేద్దాం అంటాను కష్టమైతే వద్దు అంటాను. అది చిలికి చిలికి గాలివానై దెబ్బలాట అవుతుంది. తప్పు నా ఒక్కడిదే అన్నట్టు మాట్లాడతావేం?"

"ఇదిగో.. ఇదే మీతో వచ్చిన గొడవ. ఆడవాళ్ళకి బోలెడన్ని కోరికలు ఉంటాయి. అన్నీ కాకపోయినా అందుబాటులో ఉన్న వాళ్ల కోరికలు తీరిస్తే వాళ్లు హ్యాపీ ఫీలవుతారు కదా. కోరిక వాళ్లదైనప్పుడు అది మీ దృష్టిలో అనవసరం అనుకుంటే ఎలాగండి? అప్పుడే కదా దెబ్బలాటలు మొదలయ్యేది. మీకు ఏదో విషయంలో ఏదో కలిసొస్తే పొందేది కాదు నాన్నగారు ఆనందం సంతోషం అంటే. మన కుటుంబ సభ్యులందరితోనూ పంచుకునేది. మీరు చేసే పనికి వాళ్ళందరూ ఆనందం పొందుతారే... వాళ్ళ ఆనందాన్ని చూసి మీరు ఎంతో సంతోషిస్తారే. అదండి నిజమైన ఆనందం అంటే."

వీపు మీద ఎవరో చర్నాకోలతో లాగిపెట్టి గట్టిగా కొట్టినట్టు అయింది రాజశేఖరానికి.
అతను ఆ భావంలో ఉండగానే కొడుకు అడిగాడు

" ఇంతకీ మనం వెళ్లేది ఎక్కడికి నాన్నగారు? " బైక్ నడుపుతూ అడిగాడు ప్రభు.

" అదేమిటిరా. పండక్కి మీ అందరికీ బట్టలు తీసుకుందామని"

" మా అందరికీ అంటే... మీరు కొనుక్కోరా? "

" నాకు బీరువానిండా బోలెడన్ని బట్టలున్నాయి. నేను కొనుక్కోవడం మానేస్తే 2000 మిగులుతాయి. పైగా డబ్బులతో మీ అమ్మకి మంచి చీర కొనవచ్చు. ఏమంటావ్? "అదేదో ఘనకార్యం అన్నట్లు సమాధానం చెప్పాడు రాజశేఖరం.

" అసలు మీరు జీవితంలో ఎప్పుడైనా సంతోషపడ్డారా నాన్నగారు? " స్కూటర్ రోడ్డు పక్కన చెట్టు కింద ఆపి అడిగాడు ప్రభు.

" అదేమిట్రా.నా సంతోషానికి ఏం తక్కువ? నేను ఇప్పుడు బాగానే ఉన్నానే'' వెర్రినవ్వు నవ్వుతూ అన్నాడు రాజశేఖరం.

" బట్టలు కొనడానికి అని మీరు ఇంటిదగ్గరే చెబితే నేను కూడా వచ్చేవాడిని కాదు. మాకు నచ్చిన నచ్చకపోయినా మీరు పెట్టాల్సినవి కొనితెచ్చి పెట్టేస్తారుగా. అదే అందర్నీ తీసుకుని షాప్ కి వచ్చామనుకోండి. వాళ్లకి నచ్చిన బట్టలు వాళ్ళు ఎంతో సంతోషంగా ఎన్నుకున్నారనుకోండి. డబ్బు సంగతి పక్కన పెట్టండి. అప్పుడు వాళ్ళ ముఖాల్లో కనిపించే ఆనందాన్ని మీరు ఎన్ని లక్షలిస్తే కొన్ని పెట్టగలరు చెప్పండి.మీ పెంపకంలో పెరిగిన నాకు కూడా ఈ విషయం తెలియదు. మీ కోడలు నాకు నేర్పింది. అప్పటినుంచి మా ఇద్దరిదీ ఒకటే మాట ఒకటే మాట."

ఏమీ మాట్లాడలేక అటుతిరిగి మౌనంగా ఉండిపోయాడు రాజశేఖరం సాలోచనగా!

"మీ కన్నా ఒక తరం పెద్దవాడినై ఉండి కూడా నా పురుషాధిక్య అహంకారంతో ఇన్నేళ్లు దేవతలాంటి మీ అమ్మ భావప్రకటనాశ్వేశ్చని అణగదొక్కి ప్రతీవిషయంలోనూ ఆమెను బాధపెట్టి అసంతృప్తి జీవితాన్ని మిగుల్చుకున్నాను. ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటూ పరస్పర అవగాహనతో సంసారం ఎలా దిద్దుకోవాలో మిమ్మల్ని చూసి ఇక అసలైన భర్తగా
శేషజీవితమంతా బ్రతుకుతానని నాకు నేను ప్రమాణం చేసుకుంటున్నాను బాబు. "

చమర్చిన కళ్ళని కొడుకుకి కనిపించకుండా తుడుచుకుని... "నేను బైక్ నడుపుతాను. నువు వెనుక కూర్చో!" అని బైక్ ని ఇంటివైపు పోనిచ్చాడు రాజశేఖరం కొత్తవెలుగు వచ్చిన ముఖంతో!

తండ్రిలోని మార్పును చూసి హృదయంలో ఎంతగానో సంతోషించాడు ప్రభుదేవా.

సమాప్తం