తరగని గని - ఎం. వీరేశ్వరరావు
భీమారావు తెలుగు సినీ జగత్తులో ముప్పయి ఏళ్ళు మకుటం లేని మహారాజులా వెలిగాక, అరవై వచ్చాక ఇంక ముసలి హీరో పడుచు హీరోయిన్లతో గెంతులు చూడలేమని అని ప్రేక్షకులు అన్నాక. బాక్సులు బ్రద్దలవ్వడం మానేసి వెనక్కి రావడంతో తన పని అయ్యిందని గ్రహించి
జీవితం ప్రజా సేవలో గడుపుతానని రాజకీయంలోకి దిగాడు.
'తెలుగు తేజం' అని ప్రాంతీయ పార్టీ స్థాపించాడు. అన్ని ఊళ్ళల్లోనూ తన ప్రతినిధులకు టెక్కెట్లు ఇచ్చాడు. అప్పుడు పాలిస్తున్న పార్టీని దుమ్మెత్తి పోశాడు. ఎన్నికలు దగ్గర పడడంతో ప్రచారం ఉదృతం చేసాడు.
ఎన్నికలంటే ప్రాంతీయ జాతర.
పల్లి పాలెం నియోజక వర్గంలో 'తెలుగు తేజం' పార్టీ ప్రతినిధిగా భాస్కర్రావు నిలబడ్డాడు. భాస్కరరావు ప్రచారం స్థాయినీ పెంచాడు. జనం వాడిని బట్టి 'తెలుగు తేజం' పార్టీకి బాగా ఓట్లు
పడతాయని అనుకుంటున్నాడు. పల్లిపాలెంలో 'టీ కొట్టు మల్లిగాడు' చాలా పేరు. మల్లిగాడి బండిలో ఒక టీ త్రాగితే ఎక్కడలేని ఉత్సాహం వస్తుందంటారు ప్రజలు. ఒక రోజు మల్లిగాడి దగ్గరికి వచ్చాడు భాస్కరరావు.
"ఏంటీ ఎం.ఎల్.ఏ గారు ఇలా వచ్చారు?" అని నవ్వుతూ పలకరించాడు.
"ఎక్కడ అయ్యాన్రా! మీలాంటి వాళ్ళు దయ ఉంటేనే"
"మా దయ ఏముంది? తమరు పెద్దోళ్ళు!"
"ఒరే మల్లిగా ఎన్నికల సమయంలో మీరే దేవుళ్ళు! ఓటున్న మారాజులు."
" టీ కలపమంటారేమిటి?" అన్నాడు
మల్లిగాడు.
"కలుపు."
టీ రుచి చూసి, "అద్భుతంగా ఉంది. ఒరే నువ్వు నాకో సహాయం చెయ్యాలి! నీ మేలు మర్చిపోను, రేపు గెలిచాక నీకో మంచి ఉద్యోగం చూస్తాను."
ఉద్యోగమంటే మల్లిగాడిలో ఆశ బయలుదేరింది
"చెప్పండి ఏటిసెయ్యాలో."
"ఏం లేదురా! మా కుర్రాళ్లు పగలూ, రాత్రి నాకు ఓటు వెయ్యమని బండ్ల తో తెగ తిరిగేస్తున్నారు. వాళ్ళకి రాత్రి పూట కొంచెం పాద్దెక్కాక పది దాటాక 'టీ' పోసావనుకో అది చాలు వాళ్ళ దగ్గర చిల్లర లేకపోయినా పుచ్చుకోకు, నేనున్నానుగా" అని భుజం మీద తట్టి భాస్కరరావు వెళ్ళిపోయాడు.
ఎన్నికల తేదీ దగ్గర పడింది. భీమారావు అన్ని ప్రాంతాలు హెలికాప్టర్లో తిరుగుతున్నాడు. భాస్కరరావు ఇక్కడ తిరుగుతున్నాడు. మల్లిగాడి దగ్గరకి ఊరికే 'టీ' త్రాగిపోయే జనం ఎక్కువ అయ్యారు.
"డబ్బులు లేకుండా ఎవరికీ టీ పాయ్యకురా!" అని మల్లిగాడి ముసలి తల్లి హెచ్చరించింది.
"నువ్వూరుకో భాస్కరరావుగారు మంచి ఉద్యోగం చూస్తానన్నారు" అన్నాడు మల్లిగాడు.
మల్లిగాడి కళ్ళల్లో అన్నీ ఉద్యోగం కలలే!
డబ్బు నష్టం వస్తోంది! రాత్రిళ్ళు సరిగ్గా నిద్ర ఉండడం లేదు.
ఎన్నికలు పూర్తయ్యాయి. భీమారావు అఖండ, మెజారిటీతో గెలిచాడు. ఎదురు పార్టీ వాళ్ళకి డిపాజిట్లు గల్లంతు అయ్యాయి. భాస్కరరావు ఎం.ఎల్.ఏ అయ్యాడు. భీమారావు ముఖ్యమంత్రి అయ్యాడు. మంత్రి వర్గం మొదటి లిస్టులో భాస్కరరావు పేరు లేదు. రెండవ సారి విస్తరణలో.
భాస్కరరావుకి ఆరోగ్య శాఖ దొరికింది. భాస్కరరావుని పల్లిపాలెంలో దండలు వేసి ఊరేగించారు. 'మీ సేవలకే నా జీవితం అంకితం' అని మరీ మరీ చెప్పాడు భాస్కరరావు.
అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు మల్లిగాడు టిక్కెట్టు కొనుక్కుని పల్లిపాలెం నుండి హైదరాబాద్ వచ్చి కుకట్పల్లిలో తన స్నేహితుడి ఇంట్లో దిగాడు. మల్లిగాడిని చూసి మల్లిగాడి స్నేహితుడు వెంకట్ ఆశ్చర్యపోయాడు. వెంకట్ బాలానగర్ లో ఓ చిన్న ఫ్యాక్టరీలో ఫిట్టర్గా పని చేస్తున్నాడు. మల్లిగాడు భాస్కరరావు ఉద్యోగం ఇప్పిస్తాడని. అదీ గవర్నమెంటు ఉద్యోగం!
'నిజమేనా!' అన్నాడు వెంకట్.
భాస్కరరావు ఎన్నికలలో గెలవడానికి తనవంత పాత్రం ఏలా నిర్వహించింది వివరంగా చెప్పాడు.
వెంకట్ విన్నాడు కానీ అతని మనసులో సందేహం.
వెంకట్ మల్లిగాడికి ఏ బస్సులు ఏలా ఎక్కాలో, ఏలా తిరగాలో చెప్పాడు. మల్లిగాడు భాస్కరరావుని ఎం.ఎల్.ఏ క్వార్టర్స్లో కలిశాడు. రెండు రోజులు పోయాక రమ్మన్నాడు. రెండు రోజులు పోయాక మల్లిగాడు భాస్కరరావుని అసెంబ్లీ దగ్గర కలిశాడు. గేటు దగ్గర సాయంత్రం వరకూ, ఒక సమోసా తిని కూర్చుని ఉన్నాడు మల్లిగాడు.
"ఇంకా నిర్ణయం అవ్వలేదు. ఆర్థిక మంత్రితో మాట్లాడాలి" అని అన్నాడు భాస్కరరావు,
భాస్కరరావు రేపుమాపు అంటూ మల్లిగాడిని త్రిప్పుతున్నాడు. మల్లిగాడు తెచ్చుకున్న డబ్బు ఖర్చు అయిపోయింది. ఒక రోజు తన బాధ చెప్పుకున్నాడు మల్లిగాడు.
"బాబూ! మిమ్మల్ని నమ్ముకొని వచ్చాను. ఏదో దయ చూపిస్తారని. చెప్పండి ఉద్యోగం ఉందా ?"
"ఒరే అసలు విషయం ఏమిటంటే ఒక పోస్టు
ఉంది. అది వెనుకబడిన కులాల వారికి కేటాయించారు. సోషల్ వేల్ఫేర్ ! నేను చెప్పినా వినలేదు. ఆర్థిక మంత్రి మనిషికి ఇచ్చేశారు. ఈసారి చూద్దాం" అంటూ చెప్పాడు భాస్కరరావు.
"బాబూ" అంటూ ఒక్కసారి మల్లిగాడు సమయంలో కృంగిపోయాడు. ఎన్నికల నిద్రలేకుండా టీ కాచటమే గుర్తుకు వచ్చింది మల్లిగాడికి, కట్టుకొన్న ఆశా సౌధాలన్నీ కుప్పకూలాయి. కలలన్నీ కల్లోల నీరధులయ్యాయి.
సమయానికి ఆ రోజు ఒక వ్యక్తి హుస్సేన్ సాగర్లో దూకబోతుంటే, సరిగ్గా అటువెళ్తున్న వెంకట్ అతన్ని రక్షించాడు. అతన్ని చూసి ఆశ్చర్యపోయాడు. మల్లిగాడు ఆత్మహత్యకి ప్రయత్నించాడు!
"నువ్వా" అన్నాడు వెంకట్.
మల్లిగాడు తల దించుకున్నాడు.
"ఏమిటీ పిచ్చిపని"
జరిగింది చెప్పాడు మల్లిగాడు. "మోసపోయాను! మనుషులు మంచిగా ఉంటారని నమ్మి."
"నాకు మొదటి నుండి భాస్కరరావు మీద అనుమానమే! ఇది అనుభవం అనుకో! మనసుల్ని నమ్మడం కన్నా 'పనిని' నమ్ముకోవడం మంచిది, పని తరగని గని! మళ్ళీ టీ కొట్టు పెట్టుకో!"
"అలాగే" అన్నాడు మల్లి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుండగా!
ఈ డబ్బు ఉంచు అని మూడు వందలు ఇచ్చాడు వెంకట్.
"టిక్కెట్ డబ్బు చాలు"
"ఫర్వాలేదు"
ఇద్దరూ బస్ స్టాప్ వైపు అడుగులు వేస్తున్నారు. దూరం నుండి "ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా" అని ఘంటశాల పాట వినిపిస్తోంది!
సమాప్తం