నాకు నేను ఏమి ఇచ్చేను?
కనకదుర్గా లక్ష్మీరత్న
“అమ్మా! శృతి, వాళ్ళ అమ్మగారు, చంటి గాడిని తీసుకుని రేపు వస్తున్నారు. మీరు వీలు చూసుకుని వస్తారా”? ఫోన్ లో అడిగేడు అనిరుధ్.
“అలాగే రా! నాన్నని టికెట్స్ బుక్ చేయమంటాను.బారసాల నాడు చూసేము. మాకు కూడా వాడిని చూడాలని ఆతృతగా వుంది” ఉత్సాహంగా చెప్పింది మీనాక్షి.
మీనాక్షి, నారాయణమూర్తి గార్ల సంతానం అనిరుధ్, అమల. వారిరువురు వైజాగ్ లో రాష్ట్రప్రభుత్వ హోదాలో ఉద్యోగస్తులు. మూర్తి గారు క్రిందటి ఏడాదే పదవీ విరమణ చేసేరు. మీనాక్షి, అమలకి పురుడు పోయడానికి అమెరికా వెళ్ళినప్పుడు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంది. అక్కడ ఆరునెల్లలు ఉండి వచ్చేక కొంత కాలానికి అనిరుధ్ కి మంచి సంబంధం వస్తే పెళ్లి చేసేరు. కొడుకు, కోడలు హైదరాబాద్ లో ఉద్యోగం చేసుకుంటున్నారు. వాళ్లకి రెండేళ్ళకి ఒక పిల్లవాడు పుట్టేడు. శ్రుతికి మెటర్నిటీ లీవ్ అయిపోవడంతో తల్లితో చంటిగాడిని తీసుకుని హైదరాబాద్ వస్తోంది. ఇప్పుడు వాడిని చూడటానికి వీళ్ళు హైదరాబాద్ వెళుతున్నారు.
వారం రోజులు చంటిగాడితో సరదాగా గడిచిపోయింది. మీనాక్షి, మూర్తి గారు తిరుగు ప్రయాణం అవుదామని అనుకుంటుండగా, శృతి వాళ్ళ బామ్మ బాత్రూంలో జారిపడి తుంటి ఫ్రాక్చర్ అయ్యి సర్జరీ చేయాలంటున్నారని తండ్రి ఫోన్ చేస్తే, శృతి వాళ్ళ అమ్మ, మీనాక్షితో
“వదిన! మీరు కొద్ది రోజులు వున్నారంటే శృతికి, చంటిగాడికి సాయంగా ఉంటుంది. నేను అక్కడ పరిస్థితి చక్క పడ్డాక మళ్ళీ వస్తాను” ప్రాధేయపడినట్లుగా అడిగింది.
“అయ్యో ! ఎంత మాట! మీరు వెళ్లడం విధాయకం. అంతా సర్దుబాటు అయ్యేకే వెళతాం. మీరింక వెనుక దిగులు పెట్టుకోకండి” అని మీనాక్షి ధైర్యం చెప్పింది.
—--------------------
శృతి ఇంటి నుండే పనిచేస్తోంది. అయితే పనిచేస్తున్నంత సేపూ, మీటింగ్స్ అవీ ఉండటం వలన తలుపు వేసుకుంటుంది. మధ్య మధ్యలో చంటిగాడిని చూసి వెళుతుంటుంది. అమెరికాలో అమల కూతురి ఆలనా పాలనా చూసిన అనుభవంతో మీనాక్షి బాగానే మేనేజ్ చేయగలుగుతోంది. మీనాక్షి వంట పని చూసుకుంటున్నప్పుడు మూర్తి గారు చంటిగాడిని చూసుకుంటున్నారు. సాయంత్రం ఇద్దరూ పిల్లాడిని స్ట్రోల్లర్ లో అపార్ట్మెంట్ లో కింద తిప్పుతున్నారు. ఆ మిషతో వారికి వాకింగూ అవుతోంది. అపార్ట్మెంట్లోనూ కొంతమంది పరిచయం కూడా అయ్యేరు.
అనిరుధ్ “అమ్మా! పని ఎక్కువగా ఉంటే వంట మనిషిని పెట్టుకుందాం” అన్నాడు.
“పర్వాలేదులేరా! చంటిగాడు చాలా సేపు నిద్రపోతాడు. ఆ టైములో నా పూజ, వంట పని పూర్తి చేసేసుకుంటాను. వల్ల కాకపొతే అప్పుడే పెట్టుకోవచ్చు” అంది. శని ఆదివారాలు మాత్రం పిల్లవాడిని శృతి, అనిరుద్ధే పూర్తిగా చూసుకుంటారు. మీనాక్షి పుట్టింటి వారు కూడా హైద్రాబాద్లోనే ఉండటం చేత అన్నదమ్ములు కూడా వచ్చి చూసి వెళుతున్నారు. మీనాక్షికి సరదాగానే గడిచిపోతోంది.
—--------------------
అసలు మీనాక్షికి తనకంటూ తీరిక దొరికింది ఈ రెండేళ్ళగానే. ఉద్యోగం చేసుకుంటూనే పెద్ద వాళ్ళ బాధ్యతలు నిర్వర్తించింది. ఆ తరువాత అమల పెళ్లి, పురుడు. సంబాళించడం కష్టమని వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంది. అమెరికాలో ఆరునెలలు పూర్తిగా పనికే అంకితమైపోయి కూతురుని, మనవరాలిని కనిపెట్టుకుని చూసింది. ఇండియా వచ్చేక అనిరుధ్ కి పెళ్లి వేట, వెనువెంటనే పెళ్లి తో పూర్తిగా బిజీ అయిపోయింది. అనిరుధ్ ఒకింటి వాడయ్యేక “హమ్మయ్య! బాధ్యతలు అన్నీ సక్రమంగా పూర్తి చేసేను” అని ఊపిరి పీల్చుకుంది. ఆ తరువాతే ప్రవచనాలు,పారాయణాలు, పెళ్లిళ్లు, పేరంటాలు ,స్నేహితులతో కిట్టీ పార్టీలు, వనభోజనాల తో రెండేళ్లు ఇట్టే సరదాగా గడిచిపోయింది. అమ్మమ్మే కాకుండా బామ్మ కూడా అయినందుకు పొంగి పోయింది.
—-----------------------
హైదరాబాద్ వచ్చి అప్పుడే రెండు నెలలు గడిచిపోయేయి. మీనాక్షికి ఫ్రెండ్స్ గ్రూప్ ల నుండి ఫోన్లు, మెస్సేజెస్ ద్వారా అక్కడ జరుగుతున్న కార్యక్రమాల గురించి తెలియజేస్తున్నారు. ఒక్కొక్కసారి మీనాక్షికి అవి అన్నీమిస్ అవుతున్నానని అనిపిస్తుంటుంది, కానీ అంతలోనే చంటి గాడితో సరదాగా గడిచిపోతోంది కదా అని నచ్చచెప్పుకుంటుంది.
చంటిగాడు పాకడం మొదలెట్టేడు. కింద పడినవి ఏవైనా నోట్లో పెట్టుకుంటాడేమోనని మీనాక్షి అనుక్షణం కనిపెడుతూ ఉండాల్సి వస్తోంది.
“పూజ చేసుకుంటాను, చంటిగాడిని చూడండి” అంటుంది.
ఇలా మొదలెడుతుందో లేదో మూర్తి గారు
“మీనూ ! చంటిగాడు పాక్కుంటూ వెళిపోతున్నాడు. నాకు వాడి కూడా తిరిగేసరికి అలసట వస్తోంది” అంటారు. కోడలు తలుపేసుకుని పని చేసుకుంటుంది కాబట్టి ఆవిడని డిస్టర్బ్ చేయరు.
“వెంటనే నన్ను పిలవకపోతే, కొంచెం స్ట్రోల్లర్ లో వాడిని కిందకి తీసుకు వెళ్ళవచ్చు కదా ! నేను ఈ లోపు పూజ పూర్తి చేసుకుంటాను” అని విసుక్కుంటుంది. అలా కిందకి వెళ్లిన మనిషి వెంటనే “ఎండగా వుంది. పిల్లాడికి ఎండ దెబ్బ తగిలితే కష్టం” అని వచ్చేస్తారు. వాడు బామ్మని చూడగానే మీనాక్షి దగ్గరకి వచ్చేస్తాడు. ఇంక చేసేది లేక మీనాక్షి క్లుప్తంగా పూజ ముగించుకుని లేచి వచ్చేస్తుంది.
మరో నెల గడిచింది. మూర్తి గారికి నెమ్మదిగా వైజాగ్ గాలి సోకింది. ఒక రోజు అనిరుధ్ భోజనాల వేళ
“ నాన్నా! మీరు ఇల్లు అద్దెకి ఇచ్చేసి ఇక్కడికి షిఫ్ట్ అయిపోతే బెటర్. అక్కడ శృతి బామ్మకి వయసు పెద్దదవడంతో నడక పూర్తిగా రాలేదుట. అత్తయ్యకి ఇల్లు వదలలేని పరిస్థితి. మీకు ఇక్కడ బాగానే వుంది కదా! వైజాగ్ తో ఇంక పనేముంది? మీకు ఎప్పుడైనా వెళ్లాలనిపిస్తే వెళ్లి రావచ్చు. నువ్వు కూడా ఆలోచించు అమ్మా! ఇద్దరికీ సమ్మతమైతే ఇల్లు అద్దెకిచ్చి మీరిక్కడకు షిఫ్ట్ అయిపోవచ్చు. చంటిగాడిని చూడటానికి ఒక నానీని, వంటకి ఒక మనిషిని పెట్టుకుంటే అమ్మకి పని వెసలుబాటుగా ఉంటుంది. ఏమంటావమ్మా?” అడిగేడు.
మీనాక్షి, మూర్తిగారు ఆ మాట వినగానే కొంచెం దిగ్భ్రమకి లోనయి ఏమనాలో తెలియక మౌనం వహించేరు. ఇద్దరికీ ఇల్లు వైండప్ చేసి అద్దెకివ్వాలంటే మనస్కరించడంలేదు. కొంచెం సేపటికి మీనాక్షి తేరుకుని
“రేపు ఏ విషయం చెబుతాను నాన్న!” అంది.
రాత్రి మూర్తిగారితో “వాళ్లకి అవసరం అయినప్పుడు కాదు కూడదు, మా ఇంటికి మేము పోతాం అంటే ఏమి బాగుంటుంది? పైగా రిటైర్ అయిపోయినవాళ్ళం. పిల్లలకి మన అవసరం పడినప్పుడు వారి వెనుక నిలబడటం పెద్దవారిగా మన బాధ్యత. పిల్లలే కదా మన ప్రపంచం. వారిని కాదనుకుని మన ఇంటికి వెళ్లినా అయ్యో! పిల్లలు ఏమి ఇబ్బంది పడుతున్నారోనన్న గునుపు మనల్ని ఇంకా బాధిస్తుంది. వాళ్ళు పిలిచినప్పుడల్లా మాటిమాటికి వెళ్లడం కన్నా, అందరం ఇక్కడే ఉంటే సరిపోతుంది. మీరు ఇక్కడ కూడా స్నేహితులను చేసుకున్నారు కదా, చంటిగాడు కూడా చూస్తుండగా పెద్దవాడవుతాడు. అప్పుడు మన సహాయం అవసరం ఉండదు. మనింటికి మనం వెళ్లిపోవచ్చు” అని సర్ది చెప్పింది.
మూర్తి గారు అన్యమనస్కంగా “ సరే! అలాగే కానీ”! అన్నారు.
మర్నాడు మీనాక్షి తోబుట్టువులతో ఈ విషయం చెప్పింది.వారు కూడా అందరూ ఒకే వూర్లో వుంటున్నందుకు సంతోషించేరు.
మీనాక్షి, మూర్తిగారు వైజాగ్ వెళ్ళేరు. ఇల్లు చూడగానే మీనాక్షికి, మూర్తి గారికి ప్రాణం లేచొచ్చింది. ఎండిపోయిన మొక్కలను చూస్తే చివుక్కుమంది మీనాక్షికి. వారిని చూడటానికి స్నేహితులు వచ్చేరు.
“మీనాక్షి! నువ్వు వెళ్ళేక మన గ్రూప్ లో చైతన్యమే లేదు. నీ జోక్స్, నవ్వు అన్నీ మిస్ అయిపోతున్నాము. నీలాగా మాకు సలహా ఇచ్చేవాళ్ళు కూడా లేరు” అని ఫీల్ అయ్యేరు.
ఒక వాటా వారికింద అట్టిపెట్టుకుని మిగతా పోర్షన్ అద్దెకిచ్చి వచ్చేరు.
—------------------------
చంటిగాడు నడక నేర్చేడు. మీనాక్షికి మోకాళ్ళ నెప్పులు మొదలయ్యేయి. ఒక చోట కూర్చుని అన్నం తినడు. ఇది వరకే నయం. హై చైర్లో కూర్చో బెట్టి అన్నం పెట్టేవారు. ఇప్పుడు వాడు గిరా గిరా తిరుగుతాడు. ఇది వరకు సాయంత్రాలు స్ట్రోల్లర్లో తిప్పేవారు అపార్టుమెంట్లో. ఇప్పుడు అందులో కూర్చోనని మొరాయిస్తాడు. అడ్డదిడ్డంగా పరుగెడతాడు. కొంచెం పెద్ద పిల్లలు నడిపే సైకిళ్ళ నుండి వీడిని కాపాడాలంటే తల ప్రాణం తోకకి వస్తోంది. చంటిగాడు పెరుగుతున్న కొద్దీ మరీ కంట కనిపెట్టుకుని ఉండాల్సి వస్తోంది.
శృతి కూడా ఆఫీస్ కి వెళ్లడం మొదలెట్టింది. తల్లిదండ్రులకు కష్టం అవుతోందని పొద్దున్న నుంచీ, సాయంత్రం దాకా వుండే మనిషిని పెట్టేరు. ఒకరిని శుభ్రంగా లేదని శృతి తీసేసింది. ఇంకొకరిని చూసి చంటిగాడు జడుసుకుని వెళ్లడం మానేసేడు. మూడవ ఆవిడ అతి చొరవ మీనాక్షికి నచ్చలేదు. నాలగవ ఆవిడకి వీళ్ళ ఇంటి పనే నచ్చలేదు.పెద్ద వాళ్ళతో పని జరిగిపోతోంది కదా అని అనిరుధ్, శృతి కూడా నానీ వెతుకులాట మానుకున్నారు. కొంతలో కొంత సహాయంగా ఉంటుందని వంట మనిషిని పెట్టుకున్నారు. మూర్తి గారికి మాత్రం వంటావిడ చేసే వంట తమ పద్దతిలో లేకపోవడం వలన మీనాక్షి దగ్గర సణగడం మొదలెట్టేరు. ఆయనకి వంట చేయడం మీనాక్షికి తప్పింది కాదు.
—------------------
కాలవశంలో చంటిగాడు ఐదేళ్ల వాడు అయ్యేడు. పెరుగుతున్న పిల్లాడితో పాటు మీనాక్షి, మూర్తి గారికి బాధ్యతలు పెరిగేయి. మూర్తి గారికన్నా మీనాక్షికే పెరిగేయనడం సబబు .బాధ్యతలతో పాటు వయసూ పెరిగింది. ఓపిక మాత్రం నెమ్మదిగా తగ్గడం మొదలెట్టింది. చంటిగాడిని స్కూల్ బస్సు ఎక్కించడం, దింపుకోవడం మూర్తిగారి బాధ్యతయింది. ఒకొక్కసారి మధ్యాహ్నాలు ఆయన కునుకు తీస్తుంటే లేపడం ఎందుకని బద్దకంగా వున్నా మీనాక్షి వెళ్లి చంటిగాడిని తెచ్చుకుంటుంది. ఇవి చాలదన్నట్లు వాడిని డ్రాయింగ్ అని కీబోర్డ్ అని రకరకాల క్లాసుల్లో వేసేరు. వాటికి దింపడాలు, తీసుకురావడాలతో సాయంత్రాలు అయిపోతాయి. మీనాక్షికి నెమ్మదిగా శరీరం మొరాయిస్తోంది. మునుపటిలా ఓపిక, ఉత్సాహం ఉండడం లేదు. నిత్యపూజ కూడా చేసుకోలేక దీపంతో సరిపెడుతోంది. కొంచెం సమయం దొరికితే నడుము వాలుద్దామనిపిస్తోంది.
—-----------------------
ఒక రోజు అమల ఫోన్ చేసి “అమ్మా! నాకు ప్రెగ్నన్సీ కంఫర్మ్ అయ్యింది. మూడు నిండింది. మార్నింగ్ సిక్నెస్ వలన నేను పని ఎక్కువగా చేసుకోలేకపోతున్నాను. పాపం ఈయనే పాపని చూసుకుంటూ కిచెన్ లో హెల్ప్ చేస్తున్నారు. క్రిందటి సారి లాగానే ఈ డెలివరీకి కూడా మీరుంటే బాగుంటుందమ్మా” అని చెప్పింది. మీనాక్షి, ఇంట్లో ఇంకో పసిబిడ్డ పారాడబోతోందని ఆనందపడిపోయింది.
కానీ “ అమెరికా అయితే అంట్లు, లాండ్రీ పని కూడా మనమే చేసుకోవాలి. ఇద్దరి పిల్లలని నిభాయించాలి. నా వల్ల అయ్యే పనేనా “ అని తన సంశయాన్ని మూర్తిగారి దగ్గర వ్యక్తపరచింది.
మూర్తి గారు “ అమ్మూ! పోనీ ఈ సారికి మీ అత్తగారిని పిలుస్తావా? వాళ్ళు వెళ్లి వచ్చేక మేమొస్తాము” అన్నారు.
“ లేదు నాన్నా! నాకు ఈ సారి కూడా సెక్షన్ కావచ్చని డాక్టర్ అంది. నెప్పులతో నేను చేసుకోలేను. మా అత్తగారిని అందించమనలేను. అమ్మ దగ్గర అయితే నాకు కంఫర్టబుల్ గా ఉంటుంది. చంటిగాడికి ఇబ్బంది అవుతుందని రానంటున్నారా? అన్నయ్యతో నేను మాట్లాడుతానులే. మంచి ఏజెన్సీ నుండి నానీని పెట్టుకోమని చెబుతాను” అంది.
మీనాక్షి” నువ్వేమీ అన్నయ్య తో అనకు. మేము వస్తాములే” అంది.
విషయం తెలిసి అనిరుధ్ ” అమ్మా! మీరు వెళ్ళండి. మేము ఈ లోపు నానీ కోసం ట్రై చేస్తాము” అన్నాడు.
మీనాక్షి అమెరికా ప్రయాణానికి శారీరకంగా ఆయత్తం చేసుకోవడానికి జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇన్నాళ్లుచంటిగాడితో చెలిమి కావడం వలన వాడిని విడిచి వెళ్ళడానికి బాధగానూ వుంది. వాడికి నానీ కూడా దొరికింది. మీనాక్షి“చంటీ ! నేను, తాత అమెరికా వెళుతున్నాము కదా! ఇంక నుండి ఈ అక్కే నీకు అన్నీ చేస్తుంది. గుడ్ బాయ్ లాగా ఉండాలి. నీకు అక్కడ నుండు బోల్డన్ని బొమ్మలు, చాక్లెట్లు తెస్తాను సరేనా? అని మాట తీసుకుంది. ఆ అమ్మాయి కూడా చిన్నది కావడంతో అన్ని పనులు ఆడుతూ పాడుతూ చేస్తూ చంటిగాడికి ఇట్టే మాలిమి అయ్యింది.
______________
మీనాక్షి, మూర్తి గారు అమెరికా జేరుకున్నారు. ఇచ్చిన డేట్ కన్నాముందే అమల పండంటి పిల్లవాడిని కన్నది. ప్రయాణ బడలిక తీరకుండానే మీనాక్షి పనుల్లోకి దిగాల్సి వచ్చింది. సి సెక్షన్ అవడం వల్ల అమల తేలికగా తిరిగేంతవరకు మీనాక్షే అన్నీ అందిస్తోంది. వంట పని, పిల్లల పనితో పాటు, అంట్ల పని, ఇంటి పని కూడా తోడయ్యేయి. అల్లుడు ఆఫీస్ పనిలో బిజీగా ఉండటం చేత తనకి వీలైనప్పుడల్లా పెద్ద పిల్లని చూడటంలోనూ, మిగతా పనులలోను పాలు పంచుకుంటున్నాడు. మూర్తిగారు ఎదో చేసేరంటే చేసేరన్నట్లు ఉంటుంది. ఇంక మీనాక్షికి పొద్దున్న లేచిన మొదలు, పడుకునేంతవరకు ఎదో ఒక పనితో తీరిక లేకుండా అయిపోతోంది. చంటిగాడితో రోజూ ఫోనులో మాట్లాడుతానని మాటిచ్చిన మీనాక్షి, అడపా దడపా మాట్లాడటానికి కూడా కుదరడంలేదు .
—-------------------
పిల్లవాడికి మూడవ నెల రాగానే అమల ఆఫీస్ కి వెళ్లడం మొదలెట్టింది. ఏడుస్తున్నాడని, వాడిని ఎత్తుకు తిప్పడంతో మీనాక్షికి భుజం నెప్పి మొదలైంది. మోచిప్పలు మొరాయిస్తున్నాయి. కంటి నిండా నిద్ర కరువయ్యింది. మూర్తి గారు చేయగలిగిన పనులు ఆయనకి చెపుతోంది. అమల కూడా ఆఫీస్ నుండి వచ్చేక పిల్లలతో గడుపుతోంది కానీ ఇంటి పనుల్లోకి తల్లికి సాయం వెళ్లడం లేదు. పిల్లవాడి కేరింతలు, కబుర్లు మీనాక్షికి శరీర బాధలని తట్టుకునే శక్తిని ఇస్తున్నాయి. మీనాక్షి తన ఆలనా పాలనలో పిల్లవాడిని దినదిన ప్రవర్ధమానుడి లాగా చేయగలిగింది కానీ తాను మాత్రం కృష్ణ పక్షపు చంద్ర రేఖలా సన్నగిల్ల సాగింది. ఆరోగ్యం సహకరించక, శరీరం నిరాకరిస్తుంటే చేయలేక, ఎవరికీ చెప్పుకోలేక , మీనాక్షికి క్రమేణా బాధ్యతలు బరువుగాను, జీవితం భారంగాను అనిపించసాగింది. ఇదివరకు నవ్వుతూ, తుళ్ళుతూ వున్న మోహంలో ఇప్పుడు చిరునవ్వుకు కూడా చోటు లేదు. ఇదివరకు సమయమంతా తన గుప్పెట్లో గోచరించేది. ఇప్పుడు తినడానికి, నిద్రకి కూడా అగుపించడంలేదు. నెమ్మదిగా జీవితం నిస్సారంగాను, నిరర్ధకంగాను అనిపించసాగింది.
“ఎలా వుండే దాన్ని! ఇలా అయిపోయేనేమిటి”! అని తన మీద తనకే జాలి కలగసాగింది. నైరాశ్యం ఆవహించి ఎవరితో మాట్లాడటానికి మనస్కరించక సామాజికంగా దూరంగా ఉంటే బాగుండుననిపిస్తోంది. తన ఉనికినే కోల్పోయే స్థితికి వచ్చింది మీనాక్షి.
మీనాక్షిలో వచ్చిన మార్పుని ఇంట్లో అంతా గమనించేరు. అమల తండ్రిని విషయం అడిగితే
“ఈ మధ్య అమ్మకి మోకాళ్ళ నెప్పులు ఎక్కువయ్యేయి. ఇక్కడ వెథర్ అమ్మకి అంత సూట్ కాదుగా! ఇండియా వెళ్ళేక రెస్ట్ తీసుకుంటే సరిపోతుందిలే” అన్నారు.
“అమ్మా ! రిటైర్ అయ్యేక కూడా విశ్రాంతి లేకుండా బాధ్యతలు వచ్చేసేయి. నీకు చేంజ్ గా ఉంటుంది. వీక్ ఎండ్స్ బైటకి వెళదాము” అంది.
“ వద్దు. నేను పిల్లవాడిని కనిపెట్టుకుని ఇంట్లో వుంటాను. మీరు వెళ్లి రండి” అంది“.
అమల మీనాక్షికి షుగర్, బీపీ చెక్ చేయించింది. అన్నీ బాగానే వున్నాయి. తామిద్దరం పిల్లల్ని చూసుకుంటామని ఎక్కువ శ్రమ పడవద్దని చెప్పింది . అనిరుధ్ కి ఫోన్ చేసి తల్లి పరిస్థితి వివరించి ” అన్నా! అక్కడ అన్ని టెస్ట్స్ చేయించు. అమ్మ ఎప్పుడూ ఇంత డల్ గా లేదు. వీలయితే కౌన్సిలింగ్ చేయించు” అంది.
“అమ్మ ఇక్కడ కూడా అప్పుడప్పుడు డల్ గా ఉండేది. బహుశా వైజాగ్ మిస్ అవుతుందేమో” అన్నాడు.
—-----------
ఆరునెలల అమెరికా వాసం పూర్తయ్యి మీనాక్షి, మూర్తిగారు ఇండియా బయలుదేరేరు. అమల తల్లి ఆరోగ్యం గురించి తండ్రికి గట్టిగా చెప్పింది. హైదరాబాద్ జేరేక తల్లిని చూసి అనిరుధ్
“ఏంటమ్మా! బాగా నీరసంగా కనిపిస్తున్నావు. డాక్టర్ దగ్గరకి తీసుకువెళతాను” అన్నాడు.
చంటిగాడు బామ్మ,తాతలను చూసి తెగ ఆనందపడిపోయేడు. శృతి వంటావిడ, నానీ తో ఇల్లుని బాగానే మేనేజ్ చేసింది. అనిరుధ్ దగ్గరుండి మీనాక్షికి అన్ని టెస్టులు చేయించేడు. డాక్టర్ దగ్గరకి కన్సల్టేషన్ కి తీసుకువెళ్లేడు.
ఆవిడ మీనాక్షి రిపోర్ట్స్ అన్నీ చూసి “ అన్నీ నార్మల్ గానే వున్నాయి. వయసురీత్యా, పనుల వలన మోచిప్పల్లో అరుగుదల వచ్చింది. మీ రొటీన్ ఏమిటి? మీ గురించి చెప్పండి” అంది.
మీనాక్షి తన రిటైర్మెంట్ దగ్గర నుండి ప్రారంభించి, పిల్లల పెళ్లిళ్లు, పురుళ్ళు, చంటి పిల్లల ఆలనా పాలనా, మధ్యలో రెండేళ్ల కాలంలో ఎంత ఆక్టివ్ గా ఉన్నదీ, ఆ తరువాత తన శరీర సహాయ నిరాకరణతో నెమ్మదిగా ఎలా నైరాశ్యానికి లోనైనదీ, తన సొంత ఊరు, ఇంటికి వెళ్ళాలన్న ప్రభలమైన కాంక్షను, పిల్లల అవసరాలకి ఆదుకోవాలనే తాపత్రయం ఎలా తొక్కిపెట్టిందీ, అయినప్పటికీ మనవళ్ళు, మనవరాలను చూస్తే తనకు ఎంత స్వాన్తన కలుగుతుందీ చెప్పింది.
డాక్టర్ అంతా విని “సరే! ఇంతమంది అవసరాలు తీర్చిన మీరు, మీకు ఏమి ఇచ్చుకున్నారు”? అడిగింది .
మీనాక్షి నీరసంగా నవ్వి “నాకు నేను ఏమి ఇచ్చుకోవాలి? ఏమి ఇచ్చుకుంటాను డాక్టర్” అంది.
మీరింకా గ్రహించుకోలేదా? …… మీరే కాదు, చాలా మంది ఆడవాళ్లు గ్రహించుకోలేని సత్యం. మీకోసం మీకంటూ సమయమే మిగుల్చుకోవడం లేదు. పిల్లలను పెంచి పెద్ద చేసి, వృద్ధిలోకి తీసుకొచ్చి, వారిని ఒక ఇంటి వారిని చేయడం వరకే తల్లిదండ్రులగా మన బాధ్యత. పిల్లలకి మన సహాయ, సలహాలు అవసరమైనప్పుడు మనకు చేతనైనంత తోడ్పాటు చేయవలసిందే. అది మన విధ్యుక్త ధర్మం కూడానూ. పక్షులు తమ పిల్లలకి రెక్కలు వచ్చేంతవరకు కంటికి రెప్పలా కాపాడుతాయి. ఒకసారి రెక్కలు వచ్చేక అవి ఎగురుకుంటూ పోతాయి. ఎవరి దారులు వారివే. ఒంట్లో ఇంకా సత్తువ వుంది కదా అని మనం పిల్లలు నిభాయించవలసిన బాధ్యతలను కూడా నెత్తిన వేసుకుంటున్నాము. అలా బాధ్యతలకు బందీలైపోతుంటే, అవి ఎప్పటికి తీరేను ?మనకు తీరిక ఎప్పుడు దొరికేను? ఒంట్లో నిస్సత్తువ ఆవహించిన నాడు ఉలిక్కిపడి సింహావలోకనం చేసుకుంటే అసలు మనకంటూ సమయమే మిగుల్చుకోలేదని, అంతా ఇతరులకే వెచ్చించేమన్న విషయం అంతుపట్టేసరికి మనకి సమయమే లేకుండా పోతుంది. మన సంపాదనలో కొంత అవసరార్ధం ఎలా అట్టేపెట్టుకుంటామో,అలాగే భగవంతుడు నీకు కేటాయించిన సమయంలో కొంత నీకోసం …. .ఆరోగ్య సంరక్షణ, అభిరుచులు, అభిలాషల నిమిత్తం సద్వినియోగ పరచుకుంటే, అదే నీకంటూ నువ్వు మిగుల్చుకున్న ఆస్తి. భగవంతుడు ప్రతి ఒక్కరిలోనూ ఎదో ఒక ప్రతిభ పెడతాడు. ఖాళీ సమయంలో మనలో దాగివున్న ప్రతిభను వెలికి తీసి దానిని పునరుద్ధరించుకోవాలనే ఆలోచనే మనము రానీయము. ఆ సమయాన్నికూడా ఇతరుల సేవకే వినియోగించాలని చూస్తాము. ఈ ప్రకృతిలో నువ్వు ఒక అందమైన సృష్టివి. నిన్ను, నువ్వు గౌరవించుకో. నువ్వు స్వేచ్ఛను పొంది, నీలోని “నువ్వుకు” ఊపిరి పోయి. మనసు సేద తీరుతుంది. జీవితం అందంగానూ, ఆహ్లాదంగానూ అనిపిస్తుంది. అప్పుడు గర్వంగా నాకు “నన్ను” మిగుల్చుకున్నానని చెప్పుకుంటావు. ముందు మీరు వెల్నెస్ సెంటర్ లో మెడిటేషన్, యోగాలోనూ జేరండి. మీ మానసిక, శారీరక బాధలన్నిటికీ ఉపశమనం కలుగుతుంది. ఇంక ఆఖరి సలహా ఏమిటంటే మీరు మీ వూర్లో వున్నా, పిల్లల దగ్గర వున్నా, మీ శక్తికి మించిన పనులకుగానీ, బాధ్యతలకు గానీ పోకండి. ఆప్షన్స్ లో మనం భాగమైతే మనమే బెస్ట్ ఆప్షన్ అవుతాము. అలా కాకుంటే వున్న ఆప్షన్నే బెస్ట్ గా మలచుకుంటారు. మీరు అమెరికా వెళ్ళినప్పుడు మీ కోడలు నానీతో పిల్లాడిని,ఇంటిని బాగానే సంరక్షించుకుంది కదా! మనం లేకుంటే పిల్లలు చేసుకోలేక ఇబ్బంది పడిపోతారనే భ్రమలోంచి బైటకు రండి. సర్వీసులో వున్నప్పుడు వర్క్- లైఫ్ బాలన్స్ను మైంటైన్ చేసుకున్న మీకు, ముందు ముందు కూడా అలాగే చేసుకోమని చెప్పాల్సిన అవసరం ఇంక లేదనుకుంటా” అని దీర్ఘ బోధ చేసింది.
—-------------
ఆ రాత్రి డిన్నర్ టైం లో మూర్తి గారు అనిరుధ్ తో “ కొంతకాలం మేము వైజాగ్ లో ఉండి వస్తాము. ఏమంటావ్?” అని అనిరుధ్ జవాబు కోసం చూసేరు.
“అలాగే నాన్న! అమ్మకి, మీకు ఏది బాగుంటే అది చేయండి. ఆవిడ ఆరోగ్యం కుదుట పడితే అంతకన్నా కావాల్సిందేముంది”? అన్నాడు.
మీనాక్షి వైజాగ్ లో వెల్నెస్ సెంటర్ లో మూడు నెలల యోగ, మెడిటేషన్ ప్రోగ్రాంలో జేరింది.ఆవిడ అటెండెంట్ గా మూర్తి గారూ జేరేరు. అక్కడ తోటి వారితో పరిచయం ఏర్పడింది. అందరూ వారి వారి అనుభవాలు పంచుకుంటున్నారు. ఇతరత్రా ఆక్టివిటీస్ లో కూడా ఉత్సాహంగా పాలుపంచుకుంటోంది. అక్కడి ప్రశాంత, ఆహ్లాదకర వాతావరణంలో మీనాక్షి ఆరోగ్యం క్రమేణా కుదుటపడి కొత్త తేజంతో తొణికిసలాడింది.
“
“