స్థితప్రజ్ఞత
కనకదుర్గా లక్ష్మీరత్న
“మావయ్యగారు పార్కులో వాకింగ్ చేస్తూ పడిపోయేరు, నువ్వు, విశ్వం వస్తారా”,
పొద్దున్నే ఏడు గంటలకు పిన్నత్తగారు సత్యవతి, కామాక్షికి ఫోన్ చేసి చెప్పేరు.
“అయ్యో! దెబ్బలేమైనా తగిలేయా అత్తయ్యా ” అడిగింది కామాక్షి
“ ఆ.. మోచిప్ప కొంచెం కొట్టుకుపోయింది” అన్నారు.
చాలా ధైర్యంగా వుండే ఆవిడ గొంతులో కొంచెం ఆందోళన చోటుచేసుకుంది. ఎందుకో కామాక్షి మనసు కీడు శంకించింది.
“ మావయ్య మాట్లాడుతున్నారా” ఆదుర్దాగా అడిగింది.
“లేదు..... నేను, పైన అద్దెకున్న వాళ్ళని పిలిచేను. అంబులెన్సు కూడా వచ్చింది. మేము హాస్పిటల్ కి వెళుతున్నాము. మీరు డైరెక్టుగా అక్కడికే వచ్చేయండి” అని హాస్పిటల్ అడ్రస్ చెప్పేరు.
కామాక్షికి ఎందుకో భయం వేసింది. ఆదివారం అవడం చేత విశ్వం ఇంకా నిద్ర లేవలేదు.
“ లేస్తారా! దక్షిణామూర్తి మావయ్య వాకింగ్ చేస్తూ పార్కులో పడిపోయేరుట. బహుశా ఫ్రాక్చర్ అయ్యుంటుంది. రెండు జతల బట్టలు కూడా సర్దుతాను. బహుశా మనం అక్కడ అత్తయ్యకి తోడుగా ఉండాల్సి రావచ్చు” గాభరాగా చెప్పుకుపోతోంది. విశ్వం నిద్ర మత్తులో వున్నాడు. “అయ్యో” అని మళ్ళీ పడుకుండిపోయేడు.
“సరే! నేను స్నానం చేసి రెడీ అవుతాను. ఈ లోగా మీరు లేవండి”.
స్నానం చేసి వచ్చి బట్టలు, అవీ సర్దింది. విశ్వం లేచి రెడీ అయ్యేక బయలుదేరుతుండగా సత్యవతి గారు ఫోన్ చేసేరు. “ బయలు దేరారా? తొందర లేదులే! బ్రేక్ఫాస్ట్ చేసి రండి. వాడు టెన్షన్ తో డ్రైవ్ చేస్తాడేమో! ఆదుర్దా లేదు, నాకు మనుషులు తోడు వున్నారని చెప్పు. లక్ష్మి కి కూడా ఫోన్ చేసేను. పది గంటల ఫ్లైట్ లో దొరికిందిట” చెప్పేరు.
“ ఇప్పుడే బయలుదేరుతున్నాము అత్తయ్యా! బ్రేక్ఫాస్ట్ అయ్యేక బయలుదేరాలంటే ట్రాఫిక్ పెరిగిపోతుంది. వచ్చేక చూసుకోవచ్చు లెండి” అని చెప్పి, ఇద్దరూ హాస్పిటల్ కి బయలుదేరారు.
వాళ్ళ ఇంటి నుండి పిన్న అత్తగారి ఇల్లు ఇరవైరెండు కిలోమీటర్లు. బెంగుళూరు ట్రాఫిక్ లోకవిదితమే కదా! రెండు గంటలకు తక్కువ పట్టదు జేరడానికి. దారిలో కామాక్షి మనసులో ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి. సత్యవతి గారు, విశ్వానికి స్వయానా పినతల్లి. దక్షిణామూర్తి గారు ఇస్రో లో సైంటిస్ట్ గా పదవీ విరమణ చేసేరు. ప్రస్తుతం ఎనభైయ్యవ పడిలో వున్నారు. సత్యవతి గారు కాలేజీలో మాథ్స్ లెక్చరర్ గా పదవీ విరమణ చేసేరు. క్రిందటి ఏడాదే ఏభయ్యవ పెళ్లిరోజు వేడుకలు ఘనంగా జరిపేరు వారి ఇద్దరి కూమార్తెలు. పెద్దమ్మాయి అమెరికాలో, చిన్నమ్మాయి చెన్నైలో స్థిరపడ్డారు.
కామాక్షికి అత్తగారి దగ్గర ఎంత చనువో, సత్యవతి గారి దగ్గర కూడా అంతే చనువుగా ఉంటుంది. పిన్నత్తగారు, మామగారు ఆదర్శ దంపతుల్లా అనిపిస్తారు కామాక్షికి. వారిద్దరూ ఒకరికొకరు ఏంతో చేదోడువాదోడుగా వుంటారు. మూర్తి గారు, సత్యవతిగారికి ఇంటిపనుల్లో సాయపడితే, సత్యవతి గారు, మూర్తి గారికి బైట పనుల్లో అంటే బ్యాంకు పనులు మొదలైన వాటికి తోడు వెళుతుంటారు. ఇద్దరూ ఒకే మాటపై ఉంటారు. ఆవిడ, భర్తకి అనుగుణంగా తనని తాను మలచుకున్నారనిపిస్తుంది కామాక్షికి. ఇద్దరిలోనూ చెక్కు చెదరని ధైర్యం. ఆటుపోటులకి కంపించిపోరు. మోహంలో ఏ విధమైన ఆందోళని ప్రదర్శించరు. ఏవైన చిన్న చిన్నసమస్యలు ఉన్నా వారిద్దరూ కలిసి సామరస్యంగా పరిష్కరించుకుంటారు. పిల్లలకి కూడా చెప్పరు. ఎవ్వరినీ అనవసరంగా ఇబ్బంది పెట్టకూడదని వారి సిద్ధాంతం. ఒకొక్కసారి వారిద్దరికీ చిన్నా, చితకా అనారోగ్యాలు వచ్చినా, ఊళ్ళోనే విశ్వం వున్నా చెప్పేవారు కాదు. కోలుకున్నాక చెప్పేవారు.
“ ఊళ్ళో వున్న వాళ్లకు కూడా చెప్పకపోతే ఎలాగత్తయ్యా” అని కామాక్షి కోప్పడేది.
“ మీరు వస్తే నాకు బాగానే ఉంటుందే! కానీ వాడు పిన్నికి బాగాలేదని ట్రాఫిక్లో పడి ఇంతదూరం టెన్షన్తో డ్రైవ్ చేసుకుంటూ వస్తాడు. చిన్నచిన్న వాటికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకిష్టం ఉండదు. అవసరమైతే మిమ్మల్ని పిలవకుండా ఉండను కదా” అంటారు.
ఇప్పుడు ఫోన్ చేసేరు అంటే మామయ్యకి ఎలా వుందోనని అనుకుంటుండగా లక్ష్మి ఫోన్ చేసింది.
“వదినా! మీరు హాస్పిటల్ కి జేరేరా? డాడీ పాస్డ్ అవే” అని ఏడుస్తూ చెప్పింది.
“అయ్యో! ఎలా”, విస్తుపోతూ అంది కామాక్షి. స్పీకర్ ఆన్ లో పెట్టింది. విశ్వం కూడా విన్నాడు. మౌనంగా కారు డ్రైవ్ చేస్తున్నాడు.
“మాసీవ్ ఎటాక్ ట. అసలు డాడీ ఎంత హెల్త్ కాంక్షస్! ఎంత డిస్సిప్లిన్డ్ గా వుంటారు! అంతా అయోమయంగా వుంది. నా ఫ్లైట్ డిలే అయ్యింది. లేట్ అవుతుందేమో వచ్చేసరికి. మమ్మీ నార్మల్ గానే మాట్లాడుతోంది . బహుశా బ్యాలన్సుడ్ గా ఉండటానికి ప్రయత్నిస్తున్నట్లుగా అనిపిస్తోంది” గద్గద స్వరంతో అంది.
“మేము దాదాపుగా దగ్గరికి వచ్చేసేము. నువ్వుఅధైర్య పడకు. అమ్మకి తోడు మేము ఉంటాములే”, అమ్మని కలిసేక మాట్లాడుతాను సరేనా!” అని ధైర్యం చెప్పి ఫోన్ పెట్టేసింది కామాక్షి.
హాస్పిటల్ వచ్చింది. కారు పార్కు చేసి ఆదరాబాదరాగా వెళ్ళేరు. వీళ్ళని చూడగానే సత్యవతి గారు, విశ్వం చేయి పట్టుకుని “బాబాయిని పంపించేసెనురా” అన్నారు.
విశ్వం ఆవిడ పక్కనే కూర్చుని “ఎలా జరిగింది పిన్నీ” అడిగేడు.
“ రోజూ లాగానే ఉదయం నాలుగు గంటలకు లేచేరురా! యోగా చేసేరు. స్నానం చేసి తన పంచె ఉతుక్కుని ఆరేసుకున్నారు. కాఫీ తాగి వాకింగ్ కి బయలుదేరేరు. నేను వంట ఇంట్లో పని చేసుకుంటున్నాను. ఇంతలోనే మా కాలనీలో వాళ్ళే ఆయనని తీసుకు వచ్చి సందు చివర పడిపోయేరని చెప్పి హాల్లో దీవాన్ మీద పడుకోబెట్టేరు. ఎలా ఉందీ అని అడిగితే “బాగానే …. వున్నాను” అని ముద్దముద్దగా మాట్లాడి కళ్ళు మూసుకున్నారు. ఆ తరువాత పైన అద్దెకున్న వాళ్ళని పిలిస్తే, అంబులెన్సుని పిలిచేరు. డాక్టర్ చూసి బ్రాట్ డెడ్, మాసివ్ ఎటాక్ అన్నారు. ఏమిటోరా! అంతా క్షణాలలో జరిగిపోయింది” కధ చెబుతున్నట్లు చెప్పేరు.
“బాబాయ్ ఈ మధ్యనే టెస్టులు అన్నీ చేయించుకుని బాగున్నాయన్నారుగా! మరి సడన్ గా ఈ హార్ట్ ఎటాక్ ఏమిటీ?” విస్మయంగా అడిగేడు విశ్వం.
“అదేరా! ఎప్పుడేమి జరుగుతుందో మనకి తెలియదు. బహుశా ఆయన చేయవలసిన కర్మలు అయిపోయి ఉంటాయి, వెళ్ళిపోయేరు. ఏమి చేస్తాం? బాబాయిని ఈ రూమ్ లో ఉంచేరు. మీరిద్దరూ వెళ్లి చూసి రండి” అన్నారు.
“ పిన్నీ! కళ్యాణికి కబురందిందా”? అడిగేడు విశ్వం
“ ఆ చెప్పెనురా! వాళ్ళు టిక్కెట్లు చూసుకుంటున్నారు. రావడానికి రెండు రోజులు పట్టదూ? వాళ్ళు వచ్చేంతవరకు ఉంచడం కష్టం. పైగా “డాడీ నేను పోయేక కూడా నలుగురికి ఉపయోగపడాలి. నా బాడీని, కళ్ళని మెడికల్ కాలేజీకి డొనేట్ చేయండి” అని తనతో ఒకసారి అన్నారని గుర్తు చేసింది. లక్ష్మితో కూడా ఈ మాట ఇందాక ఫోన్లో మాట్లాడినప్పుడు చెప్పేను. డాడీ ఇష్ట ప్రకారమే కానిద్దాం అంది” అన్నారు.
ఇన్ని చెబుతున్నా ఆవిడ మోహంలో ఏ అలజడి, మాటల్లో ఆందోళన కనపడలేదు. అన్నింటికీ అతీతంగా ఉన్నట్లు కనిపించేరు.
విశ్వం, కామాక్షి రూంలోకి వెళ్లి మూర్తి గారిని చూసి దణ్ణం పెట్టుకున్నారు. ఆయన మొహం ప్రశాంతంగా వుంది. మళ్లీ సత్యవతి గారి దగ్గరకి వచ్చి కూర్చున్నారు. ఆవిడ ధోరణిలో చెప్పుకుపోతున్నారు.
“ఎవరో ఒకరు ముందు, ఒకరు తరువాత వెళ్లాల్సిందే!. ఆయన ముందు వెళ్ళిపోయేరు. అది మన చేతుల్లో లేనిది. ఏడుస్తూ కూర్చుంటే జరగాల్సిన పనులు చూసుకోవాలి కదా! ఇప్పుడు మనం ఆయన ఇష్ట ప్రకారమే అన్నీ జరిపించాలి. మెడికల్ కాలేజీకి డొనేట్ చేయాల్సిన విషయం హాస్పిటల్ వారితో మాట్లాడు. ఆ పనులన్నీ ఇంక వాళ్ళే చూసుకుంటారు. ఐ డొనేషన్ సంగతి నేను చెప్పేసేనులే! ఎందుకంటే తొందరగా తీయాలి కదా !
హాస్పిటల్ ఎదురుగా బోల్డు టిఫిన్ సెంటర్లు వున్నాయి. వాళ్ళు వచ్చే లోపు మీరిద్దరూ వెళ్లి ఇడ్లీ తిని రండి. టిఫిన్ కూడా చేయకుండా పొద్దున్నే బయలుదేరి వచ్చేరు. బాబాయికి అలా పొట్ట మాడ్చుకుని కూర్చుంటే ఇష్టం ఉండదు, నేను కూడా రెండు ఇడ్లీలు తిని మందులు వేసుకున్నాను. ఇదిగో పాపం వీళ్ళు తెచ్చిపెట్టేరు” అని ఇంటి పైన అద్దెకున్న ఆయనని, ఆయన కొడుకుని చూపించేరు.
“ మా అబ్బాయి,కోడలు వచ్చేరు కదా, మీరు ఇంటికి వెళ్ళండి” అన్నారు వాళ్ళతో. “మీరు కూడా వెళ్లి తినేసి రండి” అని, లక్ష్మికి ఫోన్ చేస్తున్నారు.
ఆవిడంత బ్యాలన్సుడ్ గా మాట్లాడుతుంటే విశ్వం, కామాక్షి ఆశ్చర్యపోయేరు.
విశ్వం “పిన్నీ! నీకు కాఫీ తెస్తాను” అని వెళ్ళేడు. ఆవిడ ఫోన్లో మాట్లాడటం అయ్యేక కామాక్షి
“అత్తయ్యా! మీరు హడావిడిగా వచ్చేసేరు కదా! మందులు ఎక్కడివి? నిజంగా టిఫిన్ తిన్నారా”? అడిగింది.
“అంబులెన్సు వచ్చేలోపు బీరువాలోంచి కాష్ తీసుకుని నా బ్యాగ్ లో కుక్కుకున్నాను. ఈయన మెడికల్ ఫైల్స్ కూడా ఇదిగో ఈ సంచీలో పెట్టేను. మీకు, కళ్యాణి, లక్ష్మికి ఫోన్ చేసి తెలియబరిచేను. నా మందులు కొన్ని ఎప్పుడూ నా హ్యాండ్బ్యాగ్ లో పెట్టుకుంటాను కదా ! టిఫిన్ తిని వేసుకున్నాను. నేనేమీ అయిపోను కానీ, విశ్వం కాఫీ తెచ్చేక మీరిద్దరూ వెళ్లి తిని రండి. ఆనక క్రతువులు మొదలైతే, పూర్తి అయ్యేసరికి సాయంత్రం అవుతుంది” అన్నారు.
“ఇలాంటి పరిస్థితుల్లో మనిషికి కాళ్ళు చేతులు ఆడవు. కానీ పాపం ఆవిడ అచేతనంగా అయిపోకుండా ఒక్కరూ ఎలా సమర్ధించేరో! ఆవిడ గుండె ధైర్యం, సమర్ధత గురించి అత్తయ్య ద్వారా విన్నాను. ఇప్పుడు చూస్తున్నాను” మనసులో ఆవిడ నిబ్బరానికి జోహార్లు చెప్పింది కామాక్షి.
విశ్వం ఆవిడకి కాఫీ తెచ్చి ఇచ్చేక, హాస్పిటల్ వారితో మాట్లాడి వచ్చేడు.
“ పిన్నీ! ఐ హాస్పిటల్ వాళ్ళు వచ్చి కళ్ళు తీసుకుని వెళ్ళేరు. ఇప్పుడు అంబులెన్సులో బాడీ ని ఇంటికి తీసుకువెళ్లే ఏర్పాటు చేస్తారుట. మనవాళ్ళు అంతా వచ్చి వెళ్ళేక, హాస్పిటల్ కి ఇన్ఫోర్మ్ చేస్తే వాళ్ళు వచ్చి బాడీని మెడికల్ కాలేజీ కి తీసుకువెళ్ళతారుట. రిచువల్స్ చేసుకోండి కానీ బాడీ మీద పసుపు, కుంకాలు లాంటివి వెయ్యద్దన్నారు, ఎందుకంటే డొనేట్ చేయవలసినది కదా!” చెప్పేడు.
విశ్వం హాస్పిటల్ ఫార్మాలిటీస్ పూర్తి చేసేక ఇంటికి వచ్చేరు. చుట్టు ప్రక్కల వారు వచ్చేరు. సత్యవతిగారు ఎలాంటి మనోవికారాలు ప్రదర్శించకుండా పూస గుచ్చినట్లు వచ్చిన వారందరికీ ఉదయం నాలుగు గంటల నుండి ఏమి జరిగిందీ ఓపికగా చెబుతున్నారు. మధ్యలో ఆవిడే విశ్వానికి పురోహితుడు నంబరు ఇచ్చి మాట్లాడమన్నారు. విశ్వం ఆయనకు అంతా వివరంగా చెప్పేడు. పురోహితుడు క్లుప్తంగా ఇంటి వద్ద తంతు నిర్వహించి, బాడీ డొనేషన్ కాబట్టి దానికి ప్రత్యయామ్న పద్ధతుల్లో క్రతువు నిర్వహిస్తానని చెప్పేడు.
కామాక్షి, విశ్వంతో ” అత్తయ్యని చూసారా! ఎంత ధైర్యంగా వున్నారో? వాళ్ళిద్దరిది ఆదర్శ దాంపత్యం కదా! ఆవిడ కుదేలైపోతారేమో అనుకున్నాను. అంత నార్మల్ గా మాట్లాడటం ఎలా సాధ్యం? “ ఆశ్చర్యపోతూ అంది.
విశ్వం “ పిన్ని ఇప్పుడు షాక్ లో వుంది. అందుకే అలా ధోరణి లో ఏకధారగా మాట్లాడేస్తోంది” అన్నాడు.
మనుషులు వస్తున్నారు. వచ్చిన వాళ్లంతా “ అంత డిస్సిప్లిన్డ్ గా వుంటారు. ఆయనకి ఇలా జరగడం ఏమిటీ” అన్నారు.
సత్యవతి గారు “ అవును. ఆయన అన్నం కొలిచినట్లు తింటారు. చిరు తిండ్ల మాటే లేదు. రెండు పూటలా వాకింగ్ చేస్తారు. తన బట్టలు కూడా తనే ఉతుక్కుంటారు” చెప్పేరు.
కొందరు “అదృష్టశాలి. అనాయాస మరణం” అన్నారు.
వెంటనే అత్తయ్య “అవునండీ! ఆయన ఎవరి చేత సేవ చేయించుకోకుండా వెళ్ళిపోవాలి అనేవారు. ఆయన కోరుకున్నట్లే జరిగింది” అన్నారు .
మధ్య మధ్యలో కామాక్షి ఆవిడకి కొబ్బరి నీళ్లు ఇస్తూ” అత్తయ్యా ! మీరింక మాట్లాడకండి. హైరానా పడిపోతున్నారు” అంది.
పురోహితుడు వచ్చేడు. సత్యవతి గారు విశ్వంతో “ మీ అమ్మ, నాన్నకి చేసినట్లుగా, మీ బాబాయికి కూడా నువ్వే క్రతువులు చేయాలి రా” అన్నారు.
విశ్వం “ అలాగే పిన్నీ” అన్నాడు.
ఇంకో గంటకి లక్ష్మి, వాళ్ళ ఆయన వచ్చేరు. లక్ష్మి వస్తూనే తల్లిని పట్టుకుని మౌనంగా ఏడ్చింది. అప్పుడు కూడా సత్యవతి గారి కంట్లోంచి ఒక్క బొట్టు కూడా రాలేదు.
“ ఊరుకో తల్లీ ! డాడీ ఏ బాధా పడకుండా వెళ్ళిపోయేరు. నేను ధైర్యంగానే వున్నాను” అని ఓదార్చేరు.
లక్ష్మి తండ్రిని పట్టుకుని శబ్దం రాకుండా ఏడ్చింది. తల్లీ, కూతురు ఎవరు కుంగిపోయినా అవతలి వాళ్ళు అధైర్య పడతారని పంటి బిగువున దుఖాన్ని అదిమి పెట్టుకున్నారనిపించింది కామాక్షికి.
పురోహితుడు ప్రత్యాయామ్న పద్దతిలో దహన క్రియలు వివరించేడు. “ఒక కర్ర పుల్లకి మూర్తి గారి ఆత్మను ఆపాదించి, దానికే ఇక్కడ పూజ చేస్తాం. తరువాత దానికే దహన క్రియలు చేసి, భస్మాన్ని మూడవ రోజున కావేరీలో కలపాలి. నేను కూడా మీతో వస్తాను. అక్కడ కలిపే ముందు చిన్న పూజ ఉంటుంది” చెప్పేడు.
మెడికల్ కాలేజీ వాళ్ళు వచ్చి అంబులెన్సులో మూర్తి గారిని తీసుకువెళ్లిపోయేరు.
విశ్వం, సత్యవతి గారి అల్లుడు, పురోహితుడు వెంట క్రతువులు చేయడానికి వెళ్ళేరు. సత్యవతి గారు బంధువులందరికీ ఫోన్లో విషయం తెలియజేస్తున్నారు.
లక్ష్మి ,కామాక్షితో ”వదినా! అమ్మ దుఃఖాన్ని బలవంతంగా లోలోపల దిగమింగుకుంటోంది. అలా బాధని అదిమి పెట్టుకుంటే అది ఏ గుండె నెప్పికో దారి తీస్తే ఎంత ప్రమాదం”! భయపడింది.
“అవును. గుండెలోని బాధని బైటకి వెళ్లగక్కేస్తే మనుసు తేలిక పడుతుంది. బహుశా అత్తయ్య, మామయ్యా లేరనే వాస్తవాన్ని గ్రహించడానికి మనస్కరించక, గాంభీర్యంతో కప్పి పుచ్చడానికి ప్రయత్నిస్తూ ఉండవచ్చు, లేదా ఆవిడ బాధపడుతుంటే పిల్లలు ఇంకా బేలగా అయిపోతారని అలా నిబ్బరంగా వుంటున్నారేమో! లేదంటే ఆవిడ వీటన్నింటికీ అతీతంగా వుండే జ్ఞాని అయినా అయి ఉండాలి” అంది కామాక్షి.
క్రతువులకి వెళ్ళినవాళ్ళు ఇంటికి వచ్చేరు. అందరి స్నానాలు అయ్యేయి. లక్ష్మి అందరికి టిఫిన్లు ఆర్డర్ చేసింది. సత్యవతి గారు విశ్వాన్ని పిలిచి “ ఈ రోజు క్రతువు నీ చేతుల మీదుగా జరిగింది. మిగతా తంతు కూడా నువ్వే నిర్వహించు నాయనా”! అన్నారు.
“ అలాగే పిన్నీ! మిగతా వ్యవహారాలన్నీ నేను చూసుకుంటాను. నువ్వు ఎక్కువ హైరానా పడకు. ఈ పురోహితుడే మిగతా క్రతువులు కూడా పూర్తి చేస్తానన్నాడు. నువ్వు వెళ్లి కొంచెం సేపు పడుకో. మాట్లాడి మాట్లాడి బాగా అలసిపోయావు ” అన్నాడు.
మర్నాడు ఉదయం అయిదు గంటలకి వంటింట్లో అలికిడి అయితే కామాక్షి లేచి వచ్చి చూసింది. లక్ష్మి, సత్యవతి గారు కష్ట సుఖాలు మాట్లాడుకుంటున్నారు. కామాక్షిని చూసి సత్యవతి గారు చెరగని చిరునవ్వుతో “గుడ్ మార్నింగ్! కాఫీ తాగుతావా”? అన్నారు. ఆవిడ చక్కగా స్నానం కూడా చేసేసేరు. కామాక్షి అవాక్కయ్యింది. ఆవిడ ముందు రోజు ఏమీ జరగనట్లే వున్నారు. అంతలో సిగ్గుపడింది” అయ్యో ! అత్తయ్యా! నేను మీకు ఇవ్వాల్సింది పోయి, మీరు నాకు కాఫీ కలపడం ఏమిటీ“ అంది. ‘ పర్వాలేదులేవే ! మాకు ఉదయమే లేవడం అలవాటే! మొహం కడుక్కుని రా ! కాఫీ ఇస్తాను” అన్నారు.
కామాక్షి కాలకృత్యాలు తీర్చుకుని వచ్చింది. ఈ లోగా విశ్వం కూడా లేచి కాఫీ తాగుతున్నాడు. సత్యవతి గారు ఆ పూట టిఫిన్, భోజనాల ఏర్పాటు కోసం కేటరింగ్ వాళ్లకి ఫోన్ చేస్తున్నారు. కామాక్షికి, విశ్వానికి అంతా దిగ్భ్రమగా వుంది. అశుభం జరిగిన చోట ఎక్కడా ఇంత నిశ్శబ్ద వాతావరణాన్ని చూడలేదు.
విశ్వం “పిన్నీ! ఏమైనా పనులుంటే నాకు చెప్పు. నువ్వు రెస్ట్ తీసుకో” అన్నాడు. లక్ష్మీ వాళ్ళ ఆయన “ ఆవిడ పనుల్లో తనని తాను ఎంగేజ్ చేసుకుంటున్నారు” అన్నాడు. ఇంక విశ్వం ఊరుకున్నాడు.
మూడవ రోజున కల్యాణీ, కుటుంబం కూడా అమెరికా నుండి వచ్చేరు. కల్యాణి, తల్లిని పట్టుకుని ఒళ్ళు కదిలిపోయేలా ఏడ్చింది. సత్యవతి గారు కల్యాణి వీపు తట్టుతూ మౌనంగా ఓదార్చేరు. లక్ష్మి కొడుకు కూడా పరీక్షలు అయిపోయేక వచ్చేడు. వాడికి అమ్మమ్మ దగ్గర బాగా చెలిమి. కావేరీలో కలిపే తంతు కోసం అందరూ వెళ్ళేరు. కామాక్షి మాత్రం సత్యవతి గారికి తోడుగా ఇంట్లోనే వుంది.
సత్యవతి గారు, మూర్తి గారు వున్నప్పుడు ఎలా పనులు చేసుకునేవారో, ఇప్పుడు కూడా అలాగే పనులు చేసుకుంటున్నారు. ఆవిడలో కానీ, ఆవిడ దినచర్యల్లో కానీ ఏ మార్పూ లేదు. పైగా ఇంట్లో పిల్లల సందడి, మనవళ్లతో కాలక్షేపం, క్రతువుల కోసం వచ్చే బంధువుల ఏర్పాట్లతో ఆవిడకి చాలా బిజీగా గడిచిపోతోంది. అయినా రోజు కొకసారైనా “ఆయన బ్రేక్ఫాస్ట్ తినకుండానే వెళ్ళిపోయేరు” అనేవారు. “ డాడీకి ఇలా వండితే కూర నచ్చుతుంది” అని పిల్లలతోను, “ మీ బాబాయ్కి నీలానే పచ్చళ్ళు అంటే ఇష్టం రా” అని విశ్వంతోను, ఆయన ఇష్టా ఇష్టాలు, ఆదర్శాలు, క్రమశిక్షణ, కష్టపడే తత్త్వం, సింప్లిసిటీ, సహాయపడే తత్త్వం, సేవాతత్పరత,, మంచితనం గురించి మనవళ్ళతోనూ చెబుతున్నారు.
పదవరోజు వచ్చింది. ధర్మోదకాలు ఇవ్వడానికి దగ్గర బంధువులు, మూర్తి గారి తోబుట్టువులు అందరూ వచ్చేరు. అందరూ ఒకటే మాట.” శరీర బాధలు ఏవీ లేవు, అందుకే ఏ బాధా లేకుండా వెళ్ళిపోయేడు” అని. మూడు రోజుల క్రతువులు కూడా ముగిసాయి. కల్యాణి తల్లితో “ అమ్మా! ధీరజ్ కి పరీక్షలు మొదలవుతాయి. నాకు సెలవు కూడా లేదు. వీలు చూసుకుని మళ్ళీ వస్తాను. ఎప్పటి లాగానే నీతో రోజూ వీడియో కాల్ చేస్తుంటాను. నువ్వు దిగులు పడకు. నీకు తెలుసుగా ! డాడీకి దిగులు పడితే నచ్చదని. జాగ్రత్తగా ఉంటానని మాట ఇవ్వు” అని వాగ్ధానం తీసుకుంది. లక్ష్మి వాళ్ళ ఆయన, కొడుకు కూడా వెళ్ళిపోయేరు. లక్ష్మి మాత్రం తల్లి కొంచెం సెటిల్ అయ్యేంతవరకు ఉంటానంది.
కల్యాణీ కుటుంబం అమెరికా వెళ్ళిపోయేరు. ఆ రాత్రి విశ్వం, కామాక్షి, లక్ష్మి కూర్చుని మాట్లాడుకుంటున్నారు. విశ్వం “పిన్నీ! కొన్నాళ్ళు నువ్వు మా దగ్గర ఉంటే బాగుంటుంది. పిల్లలకి నీ గురించి బెంగ లేకుండా ఉంటుంది. నువ్వు మా దగ్గర ఏమీ మొహమాట పడక్కర్లేదు. మా అమ్మ ఎంత స్వతంత్రంగా వుందో, నువ్వు కూడా అంతే స్వతంత్రంగా ఉండవచ్చు” అని హామీ ఇచ్చేడు.
“ నీ దగ్గర నాకు మొహమాటం ఏమిటిరా? నీ చిన్నప్పుడు నేనే నిన్ను పెంచితేను! ఎబ్బయేళ్ళ దాంపత్యంలో ఒక్కసారిగా ఆయన మాయమైపోతే దిగులు లేకుండా ఎలా వుంటుందిరా? ఆయన లేని లోటు భర్తీ చేయలేనిది. ఇద్దరం ఒకరికొకరు సహాయంగా వుండేవాళ్ళం. ఒకరి అభిప్రాయాలనొకరం కొట్టిపడేయకుండా గౌరవించుకునే వాళ్ళం. ఇప్పుడు ఆ తోడే లేకుండా పోయింది . అలా అని ఎవరూ ఎల్లకాలం వుండరు. నేనైనా, ఆయనైనా ఎప్పటికైనా వెళ్లాల్సిందే. ఆయన పుణ్య పురుషుడు. ఏ బాధా లేకుండా, ఎవరి చేత సేవ చేయించుకోకుండా వెళ్ళిపోయేరు. ఒకవేళ నేనే వెళ్ళిపోయి, ఆయన ఉండాల్సి వస్తే ఆయన ఇబ్బంది పడేవారేమో! నేనైతే తోచకపొతే, వెళ్లాల్సి వస్తే పిల్లల దగ్గరకి వెళతాను. ఆయనది అలా వెళ్లే మనస్తత్వం కూడా కాదు. ఆయన కర్మలన్నీ క్షయం చేసేసుకుని వెళ్ళిపోయేరు. నాకు ఇంకా చేయవలసిన కర్మలు మిగిలి ఉండి ఉంటాయి. ఇక్కడ చేయవలసిన పనులు కూడా వున్నాయి కదా! చుట్టుపక్కల పిల్లలకి ఫ్రీగా ట్యూషన్ చెబుతాను. నాకు ఎలాగూ పేపర్ చదవడం, టీవిలో సీరియల్స్ చూడటం అలవాటే కదా! మధ్య మధ్యలో మీరు వస్తుండండి. లక్ష్మి ఎలాగూ నన్ను చూసిపోవడానికి వస్తుంటుంది. దిగులుతో పిన్ని ఏమైపోతుందోనని నువ్వు దిగులు పెట్టుకోకు సరేనా” ! అని ధైర్యం చెప్పేరు.
“ భగవద్గీత క్లాసులో స్థితప్రజ్ఞత గురించి, స్థితప్రజ్ఞులకు ఉండవలసిన లక్షణాలు గురించి చెప్పేరు. అందులో ఒక లక్షణం, సుఖదుఃఖాలని సమానంగా చూడటం - సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా, దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోకుండా ఉండటమే స్థితప్రజ్ఞత. ఋషులకి, జ్ఞానులకి మాత్రమే ఇది సాధ్యమవుతుంది కానీ మనలాంటి సాధారణమైన మనుషులకి ఇదెలా సాధ్యమని ఎప్పుడూ అనుకుంటూండేదాన్ని. స్థితప్రజ్ఞులు అంటే కొండల్లోనూ, కొనల్లోనూ ధ్యానం చేసుకునే జ్ఞానులు మాత్రమే అనుకునేదాన్ని. కానీ మీలాంటి సామాన్య గృహిణులు కూడా స్థితప్రజ్ఞులే అని ఇప్పుడు అర్ధం అయ్యింది. మావయ్య లేరనే వాస్తవాన్ని ఎంత హుందాగా అంగీకరించేరు! మీరు భగవద్గీత చదవలేదు. ప్రవచనాలు కూడా వినరు. మరి మీకు స్థితప్రజ్ఞత ఎలా అబ్బింది”? ఆశ్చర్యంగా అడిగింది కామాక్షి.
“ స్థితప్రజ్ఞత లాంటి పెద్ద పెద్ద పదాలు నాకు తెలియదు. మావయ్య కంటికి కనిపించకపోతేనేమి? ఆయన నాలోనే వున్నారు, నాతోనే వున్నారని భావిస్తాను. అప్పుడు ఆయన లేరనే భావనే కలుగదు. ఆయన ఎప్పుడూ అంటుంటారు. “కష్ట, సుఖాలు జీవితంలో భాగాలు. రెండూ అనుభవించక తప్పదు. కష్టం వచ్చినప్పుడు ఎంత హుందాగా దాన్ని అధిగమించేమన్నది, మన మనోధైర్యం యొక్క స్థాయిని తెలియజేస్తుంది. బేలగా, దిగాలుగా ఉంటే ఆయనకు నచ్చదు. బహుశా భగవంతుడే ఈయన ద్వారా నన్ను నడిపిస్తున్నాడేమో!
సరే! చాలా పొద్దుపోయింది. ఇంక ఏమీ ఆలోచించకుండా వెళ్లి పడుకోండి” అని తన గదిలోకి పడుకోవడానికి వెళ్ళేరు.
“పిన్నిని చూసి మనం ఎంతో నేర్చుకోవాలి. చిన్నచిన్నఇబ్బందులకే మనం తలకిందులైపోతాము. జీవితాన్ని కుదిపేసే సంఘటనని కూడా తన మనోధైర్యంతో ఎంత అవలీలగా ఎదుర్కొంది”! అన్నాడు విశ్వం.
“ అవును అన్నా! మమ్మీ ధైర్యంగా ఉంటే నాకూ వెనుక దిగులు ఉండదు” తేలికపడిన హృదయంతో అంది లక్ష్మి.
“స్థితప్రజ్ఞత గీతా ప్రవచానాలకి, పుస్తకాలకే పరిమితం కాదని, ఇంటి నాలుగు గోడల మధ్య కూడా సాక్షాత్కరించవచ్చని అత్తయ్య ఎంత హుందాగా నిరూపించారు! భగవద్గీతలో
దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః !
వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే !!
శ్లోకాన్ని కామాక్షి అప్రయత్నంగా మననం చేసుకుంది.