*****
అభూత దీపం
============
(హాస్య కథ)
(ఈ కథ ఫిబ్రవరి 2021,"హాస్యపు హరివిల్లు" అనే మాసపత్రిక లో ప్రచురితమైనది)
రచన ::
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్.
ఈ మద్య ఎక్కడ విన్నా, చూసినా ఒక పుకారు షికారు చేస్తోంది. అది ఏమిటంటే..
'అల్లాఉద్దీన్ అద్భుత దీపం' మళ్ళీ కనపడిందని.
'అరుంధతి', 'మగధీర' సినిమాలు విడుదల అయినప్పటి నుంచి, ప్రజలలో ఇలాంటి చారిత్రక అంశాలు, అలాగే పూర్వ జన్మల మీద నమ్మకం బాగా పెరిగి పోయింది.
దానికి తోడు 'రూమర్' అనే ఓ వార పత్రిక "ఇది పుకారు కాదనీ, పూర్తిగా నిజమనీ, అల్లాఉద్దీన్ ఆఖరి రోజుల్లో ఆ అద్భుత దీపంతో పాటు తన మేనమామ జియాఉద్దీన్ గారింటికి ఇప్పుడు మనం పిలుచుకుంటున్న హైదరాబాద్ వచ్చినట్లు గానూ, తిరుగు ప్రయాణంలో నల్లమల, శ్రీశైలం అడవుల్లో సంచరించినట్లుగానూ, ఆ తరువాత అతని వివరాలు ఏమీ తెలియరాలేదనీ, కాబట్టి తప్పకుండా ఆ రెండు ప్రాంతాల్లో ఏదో ఒకచోట ఆ అద్భుతదీపం ఉండవచ్చని" ఒక కథనం వండివార్చింది.
అంతే, అది పుకారో వాస్తవమో కూడా ఆలోచించకుండా, దానిని నమ్మిన పిచ్చి జనం ఆ అడవులని జల్లెడ పట్టడం మొదలెట్టారు.
***** ***** ***** *****
"ఏమండీ, మీరు అర్జెంటుగా, ఆ అడవుల్లోకి వెళ్లి, ఆ దీపాన్ని పట్టుకొని రండి , లేకపోతే
మీ తల దగ్గరో, నా తల దగ్గరో దీపం వెలగడం గ్యారెంటీ" అని అల్టిమేటం పాస్ చేసింది మా ఆవిడ, ఆరనిదీపం సీరియల్ లోని ఆడవిలన్ లా.
"అవన్నీ ఉత్త పుకార్లే . అలాంటివి నమ్మకూడదు" అన్నాను కొంచెం భయపడుతూ.
"అబ్బచ్ఛా, నిజమా ? మాకు తెలవదు మరి. పునర్జన్మలు ఉన్నాయంటే నమ్ముతారు, రంగురాళ్ళు పెట్టుకుంటే దశ మారుతుంది అంటే నమ్ముతారు. అలాగే రైస్ పుల్లింగ్ యంత్రం అంటే నమ్మేస్తారు కానీ, దీనిని ఎందుకు నమ్మరు?" లాజిక్ లాగింది మా ఆవిడ. సెంటిమెంట్ మీద కొడితే నేనేం చేయలేనన్న ధీమాతో కాబోలు!
"ఈ పత్రికల వాళ్ళకి ఏదైనా వార్త దొరికితే చాలు ఇలాగే గిల్లి వదిలేస్తారు. ఆ తర్వాత దాని సంగతే అసలు పట్టించుకోరు. ఇది కూడా అంతే. ఈ పాటికి ఎవరికో దొరికే ఉంటుంది. వీళ్ళు రాసి ఉండరు, అంతే" అన్నాను, అలా అంటే వదిలేస్తుందేమోనని.
"ఆ ముచ్చటా అయ్యింది. ఎంతవరకూ నిజమో తెలియదు కానీ, ఆ దీపం, చిన్నప్పుడు మీ ఇంట్లో పనిచేసిన వీర్రాజుకి దొరికిందిట. ఈ విషయం మాటల మధ్యలో మన పక్కింటి పనిమనిషి ద్వారా తెలిసింది. వాళ్ళ ఆడపడుచు తోటికోడలుదీ, మీ వీర్రాజుదీ ఒకే ఊరుట" తను సేకరించిన సమాచారం అందించింది.
"అయితే ఏం చెయ్యమంటావ్ నన్ను?" విసుక్కుంటూ అడిగేను.
"ముందు అతని దగ్గరకు వెళ్లి, ఆ అద్భుత దీపం దొరకడం నిజమో కాదో తేల్చుకోండి. ఒకవేళ అతని దగ్గరే కనుక అది ఉంటే, ఓ రెండు రోజులు వాడుకుని ఇచ్చేస్తామని చెప్పి, తీసుకుని రండి. మీ మాట కాదనడు. రేపే బయలు దేరండి" అంటూ అతని వివరాలు చెప్పింది సతీమణి.
***** ***** ***** *****
వీర్రాజు చిన్నతనంలో, అతని తల్లిదండ్రులు వీరన్న, వీరమ్మలు మా ఇంట్లో పనిచేసేవారు. అయితే ఓ రోజు పొలంలో పనిచేస్తున్న సమయంలో పిడుగు పడి ఆ దంపతులు ఇరువురు మరణించారు. మేనమామ వచ్చి, తీసుకుని వెళ్తానన్నా వెళ్ళకుండా, పదేళ్ళు వచ్చేవరకూ మా దగ్గిరే ఉండిపోయాడు వీర్రాజు. ఆ తరువాత రోజుల్లో ఉద్యోగ రీత్యా నేను టౌనుకు వచ్చేయడంతో అతని గురించిన వివరాలేమీ తెలియలేదు. మళ్ళీ ఇన్నాళ్ళకు ఇదే కలవడం.
***** ***** ***** *****
నా సతీమణి ఇచ్చిన సమాచారం ప్రకారం వీర్రాజు ఇంటికి చేరాను. మొదట గుర్తు పట్టకపోయినా తరువాత నన్ను బాగానే గుర్తు పట్టాడు వీర్రాజు. ఇన్ని సంవత్సరాలైనా అతని తీరులో ఏమీ మార్పు లేదు. అదే అమాయకత్వం, అవే మూఢనమ్మకాలు. కుశలప్రశ్నల అనంతరం,
"ఇదిగో వీర్రాజూ, నీకు అద్భుతదీపం దొరికిందని మా ఆవిడకు ఎవరో చెప్పారు. కానీ నాకు తెలుసు ఇదంతా ఉత్త పుకారనీ!" మొత్తం సంగతి వివరించి చెప్పేను, ఇలాంటివి అసలు నేను నమ్మనని అతనికి స్పురించేలా.
"అది పుకారు కాదు సార్. పచ్చి నిజం. ఏం జరిగిందో చెప్తా, వినండి" అంటూ జరిగింది సినిమా కథలా చెప్పడం మొదలెట్టాడు, బిక్కచచ్చిపోయి వింటున్న నా వైపు చూస్తూ!
***** ***** ***** *****
అల్లాఉద్దీన్ అద్భుత దీపం గురించి తెలిసిన వీర్రాజు మిత్రబృందం నల్లమల అడవుల్లో ఓ వారం రోజులు గావించి, చివరికి దొరక్క అదో పుకారు అని వదిలేసారు.
కానీ పట్టు వదలని వీర్రాజమూర్ఖుడు ఓ పది రోజుల తరువాత ఒక్కడూ బయలు దేరాడు అడవిలోకి. కొంచెం దూరం వెళ్ళగానే కొంచెం మురికితో ఉన్న ఆ అద్భుత దీపం అతని కంట పడింది. వెంటనే చేతిలోకి తీసుకుని గట్టిగా రుద్దగానే, ఎదురుగా నల్లని దుస్తులతో ఉన్న ఓ టిబెట్ మాంత్రికుడు ప్రత్యక్షమై,
"నీకు రాజయోగం ఉందిరా బాలకా ! అందుకే ఈ దీపం నీకు కనపడింది. ఎన్నో శతాబ్దాలుగా దీనిని కాపలా కాస్తున్నా. ఈ నాటితో నాకు శాపవిముక్తి అయ్యింది" అంటూ వెళ్ళబోతున్న అతడిని,
"అదేటీ, దీన్ని ఎలా వాడాలో చెప్పకుండా అలా వెళ్ళిపోతావేటీ ?" అన్నాడు వీర్రాజు ఆందోళనగా.
"చూడు బాలకా, ఇది వరాలు కానీ, ప్రశ్నలు కానీ కేవలం పది మాత్రమే తీరుస్తుంది. అలవికాని కోర్కెలు కోరరాదు. దీని శక్తి కూడా కేవలం పది రోజులే. ఆ తరువాత దీని శక్తి పోతుంది. ప్రతీ రోజూ సాయంత్రం ఆరు గంటలకు ఇంటి తలుపులు అన్నీ మూసి, ఒక్క తూర్పు వైపు గుమ్మం మాత్రమే తీసి ఉంచి, కళ్ళు మూసుకుని భక్తితో ఓ మంత్రం పది సార్లు పఠించాలి. అంతే మరునాడు ఉదయం ఆరు గంటలకు నువ్వు కోరినది నీ ఇంటి ముందు ఉంటుంది" అంటూ మంత్రోపదేశం చేసి, మంత్రజలం వీర్రాజు మీద జల్లి అంతర్ధానమయ్యాడు టిబెట్ మాంత్రికుడు.
***** ***** ***** *****
ఆ రోజు సాయంత్రం ఆరుగంటలకు అన్ని తలుపులు మూసి, అద్భుతదీపానికి పూజ చేసి, రుద్దుతూ, ధీక్షగా మంత్రం పటించడం మొదలెట్టాడు వీర్రాజు.
"బేటా ! ఏమి నీ కోరిక ?" అడిగాడు తెల్లటి వస్త్రాలతో మిలమిల మెరిసిపోతూ, ప్రత్యక్ష మైన ఓ పిల్లిగడ్డపాయన.
ఆ దెబ్బకి అదిరిపోయిన వీర్రాజు, కాసేపటికి తేరుకుని, ఇది ఎంతవరకు నిజమో పరీక్షిద్దాం అనుకొని,
"ఏ కోరిక కోరినా తీరుస్తారా ?" అడిగాడు అమాయకంగా.
"ఇక నీ రెండవ కోరిక ఏమిటి బేటా" అడిగాడు పిల్లిగెడ్డం.
"ఇదిగో సేటూ, నాకు పానీపూరీ కావాలి" అన్నాడు లొట్టలు వేస్తూ,ఇంక ప్రశ్నలు అడగ కూడదు అని మనసులో అనుకుని.
"అచ్ఛా , ఆలాగే మిలేంగా !" అంటూ మంత్రజలం జల్లి అదృశ్యమయ్యాడు ఆ పిల్లిగెడ్డం.
ఓసారి కళ్ళు నలుపుకుని చూసిన వీర్రాజు కళ్ళకు అక్కడ ఎవరూ కనపడలేదు.
మర్నాడు ఉదయం తలుపు తీసి చూసిన వీర్రాజు కు గుమ్మంలో ఓ ప్లేటులో నాలుగు పెద్ద పూరీలు, అలాగే ఓ చిన్న గ్లాసులో పానీ కనపడ్డాయి. అదిరిపోయిన వీర్రాజు ఈ రోజు సాయంత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకుని అడగాలని నిశ్చయించుకున్నాడు.
రెండో రోజు సాయంత్రం, యధావిధిగా పూజ, మంత్రం, రుద్దడం పూర్తవ్వగానే..
"బేటా ! ఏమి నీ కోరిక ?" అంటూ వచ్చేడు పిల్లిగెడ్డం.
"నిన్న సాయంత్రం నేను పానీపూరీ అడిగితే విడివిడిగా పానీ, పూరీ తెచ్చారేం ?" ఉడికిపోతూ అడిగాడు వీర్రాజు.
"ఇక నీ నాలుగో కోరిక ఏమిటి బేటా ?"
"ఏమిటి ప్రశ్నను కూడా కోరికగా తీసేసుకుంటారా ? మీ లోకంలో?"
"ఇక నీ ఐదో కోరిక ఏమిటి బేటా?"
"నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు ముందు?"
"ఇక నీ ఆరో కోరిక ఏమిటి బేటా?"
"బుధ్ధొచ్చింది. నాకు ఓ ఆవు కావాలి" నోరు తెరచి అడిగాడు వీర్రాజు.
"అచ్ఛా , ఆలాగే మిలేంగా !" అంటూ మంత్రజలం జల్లి అదృశ్యమయ్యేడు ఆ పిల్లిగెడ్డం.
మర్నాడు ఉదయం తలుపు తీసి చూసిన వీర్రాజు కు గుమ్మం వద్ద కట్టి ఉంచిన ఆవు కనపడింది. ఆనందంతో ఉబ్బితబ్బుబ్బైన వీర్రాజుకు ఆ మధ్యాహ్నం కానీ తెలియలేదు అది పక్కవీధాయన ఆవు అని.
కాసేపటి తర్వాత ఆయన వచ్చి, వీర్రాజును నానా బూతులు తిట్టి దానిని తోలుకు పోయాడు.
మూడో రోజు సాయంత్రం, పూజ, మంత్రం, రుద్దడం పూర్తవ్వగానే..
"బేటా ! ఏమి నీ కోరిక ?" అంటూ వచ్చేడు పిల్లిగెడ్డం.
"సేటూ, ఇలా మోసం చేస్తావా ?"
"ఇక నీ ఎనిమిదో కోరిక ఏమిటి బేటా?"
"నేను ఏడో కోరిక ఎప్పుడు కోరేనూ ?"
"ఇక నీ తొమ్మిదో కోరిక ఏమిటి బేటా?"
"ఈ తతంగం చూస్తూంటే ఏదో సినిమాలో రాళ్ళపల్లి గారు నటించిన సీన్ గుర్తుకొస్తోంది. అది ఏ సినిమా అంటావ్ ?" అడిగాడు అమాయకంగా.
"చెప్తాను కానీ బేటా, నీ ఆఖరి కోరిక ఏమిటి ?" అడిగాడు పిల్లిగెడ్డపాయన.
అప్పుడే తొమ్మిది ప్రశ్నలు అయిపోయాయా అని మనసులో అనుకున్న వీర్రాజు
"ఇదిగో సేటూ, నాకు ఇక ఓపిక లేదు కానీ, నా ఆఖరి వరాన్ని, నాకు ఏదైతే మంచిదో అది నువ్వే అనుగ్రహించు" అంటూ వేడు కున్నాడు.
"చూడు బేటా, చిన్నప్పటి నుండి అనాథలా పెరిగావు. నీకంటూ ఒక సంసారం ఏర్పడితే ఇలాంటి దిక్కు మాలిన సాహసాలు చెయ్యాలన్న కోరికలు నశించి, హాయిగా పిల్లా పాపలతో కాలక్షేపం చేస్తావు. అందుకే మా గురుడుతో మాట్లాడి నీకు ఓ అనుకూలవతి అయిన అమ్మాయిని రేపటికల్లా ఏర్పాటు చేయిస్తా. హాయిగా సంసారం చేసుకో " అంటూ మంత్రజలం జల్లి అదృశ్య మయ్యేడు పిల్లిగెడ్డం.
మర్నాడు ఉదయం తలుపు తీసి చూసిన వీర్రాజు కు గుమ్మంలో ఓ అమ్మాయి ప్రత్యక్ష మయ్యింది. ఆమెనే దీపమిచ్చిన భార్యగా అనుకొని ఆనందంగా లోపలికి తీసుకెళ్లాడు మూఢ నమ్మకాల వీర్రాజు.
***** ***** ***** *****
జరిగిన కథ అంతా విపులంగా చెప్పి,
"అదీ సార్ జరిగింది. నేనే బుద్ధి తక్కువగా కొన్ని ప్రశ్నలు అడిగి మంచి అవకాశాన్ని కోల్పోయాను" బాధపడుతూ చెప్పేడు వీర్రాజు.
"అయితే, ఆ అద్భుత దీపం అనేది పుకారు కాదంటావ్? " అనుమానంగా అడిగాను.
"కాదు సార్. అది నగ్నసత్యం. దానికి నేనే ప్రత్యక్ష నిదర్శనం"ఇంకా అదే ట్రాన్స్ లో ఉన్నాడు వీర్రాజు.
"సరేకానీ, ఆ అద్భుత దీపం పవర్ పోయింది కదా ? నాకు ఇవ్వకూడదూ, పాత వస్తువులు సేకరించే అలవాటుంది నాకు" అడిగాను, మా ఆవిడకి ఇవ్వొచ్చు అన్న ఉద్దేశంతో.
"తీసుకోండి సార్" అంటూ, తన భార్యతో కలిసి నా కాళ్ళకు దణ్ణం పెట్టి, ఆ అద్భుత దీపాన్ని నాకిచ్చాడు.
"సరేకానీ, మాంత్రికుడు చెప్పిన మంత్రం ఏమిటి ?" బయటకు వస్తూ అడిగేను.
"హమనమమానమే" రహస్యంగా చెవిలో చెప్పేడు వీర్రాజు.
***** ***** ***** *****
వీర్రాజు ఇంటి నుండి బయలుదేరిన కొద్ది సేపటికి నా బండిని ఓ ముసలాయన ఆపి,
"బాబూ, గుర్తు పట్టేరా ? నేనూ వీర్రాజు మేనమామను. ఏంటి సార్, మీరు కూడా ఇలాంటివి నమ్మతారా? ఆ అద్భుత దీపం తీసుకుని వెళ్తున్నారు?" అడిగాడు ఆశ్చర్యపోతూ.
"లేదయ్యా, మా ఆవిడకు కూడా ఈ వీర్రాజు లాగే మూఢనమ్మకాలు ఎక్కువ. ఆవిడ మాట కాదనలేక వచ్చి, ఇదిగో దీన్ని తీసుకుని వెళ్తున్నా. ఔనూ, మరి ఈ జరిగింది అంతా ఏమిటి ?" అడిగాను అనుమానంగా.
"ఓ! అదా బాబూ. చెబుతా వినండి. నాకు కొంత మంది మిత్రులు ద్వారా నా మేనల్లుడు గురించి, వాడి మూఢనమ్మకాలు గురించి, పుకార్లు కూడా యధార్ధాలుగా నమ్మేసే వాడి అమాయకత్వం గురించి తెలిసింది సార్. మా అమ్మాయిని చేసుకొమ్మని మామూలుగా చెబితే వినడని, వాడి నమ్మకాల పిచ్చినే ఆసరాగా తీసుకుని ప్రస్తుతం చలామణిలో ఉన్న అల్లాఉద్దీన్ అద్భుత దీపం పుకారును మాకు అనుకూలంగా మార్చుకుని ఈ డ్రామా ఆడి మా అమ్మాయిని వాడికి కట్టబెట్టా" అసలు నిజం చెప్పాడు వీర్రాజు మేనమామ.
"మరి ఈ మాంత్రికుడు, పిల్లిగెడ్డం, ఆ అమ్మాయి ? ఆ మంత్ర జలం, ఆ అద్భుత దీపం ? వీటి సంగతి ఏమిటి ?" అడిగాను సందేహిస్తూ.
"అబ్బే, ఆ మాంత్రికుడు, పిల్లిగెడ్డం అతనూ మా బావమరుదులు సార్. వాళ్లకి కొంచెం నాటకాల అనుభవం ఉంది. ఇక ఆ పిల్ల నా కూతురే ! అలాగే, ఆ మంత్రజలం కేవలం పసుపు కొద్దిగా కారం కలిపిన నీళ్లు. అది మొహం మీద జల్లి, అతను తేరుకొనేలోపు మా వాళ్ళు అక్కడ నుండి మాయమైపోయే వాళ్ళు. ఇక ఆ దీపం మా ఊరి కంసాలి బ్రహ్మం గారి చేత చేయించినది'' మొత్తం వివరించాడు ఆ ముసలాయన.
"ఔనా ? అంతా బాగానే ఉంది కానీ, మరి ఆ మంత్రం అర్థం ఏమిటంటావ్ ?" అడిగాను ఆ రహస్యం ఏమిటో తెలుసుకుందామని.
"ఆ మంత్రాన్ని ఓ సారి తిరగేసి చదువుకోండి బాబూ !" అంటూ చుట్ట కాలుస్తూ నిష్క్రమించాడు.
"హమనమమానమే" అనే మంత్రం అర్థం
"మేనమామ నమహ" అనా? అని మనసులో అనుకుంటూ ఇంటి దారి పట్టాను.
***** ***** ***** *****
ఇంటికి చేరిన నేను, మా ఆవిడకు అది పుకారు అని చెబితే, ఎక్కడ కథ మళ్ళీ మొదటి కొస్తుందోనన్న భయంతో,.....
"ఇదిగోనే, నువ్వు అడిగిన ఆ అద్భుత దీపం . నువ్వు అన్నది నిజమే. ఇది పుకారు కాదు, వాస్తవమే. కానీ దీని శక్తి పోయిందిట. " అంటూ, వీర్రాజు చెప్పిన కథ మాత్రమే చెప్పి, ధీనంగా చూస్తున్న ఆమె చేతిలో పెట్టాను, ఆ అభూతదీపాన్ని.
***** ***** సమాప్తం. ***** *****