ఆపద్బాంధవుడు (కథ )
రచన : జీడిగుంట నరసింహ మూర్తి
( 5/11/2023 విశాలాంధ్ర దినపత్రిక ఆదివారం అనుబంధంలో ప్రచురితం )
విక్రమ్ కు ప్రతి పరీక్షలో తొంభై పర్సెంట్ మార్కులు వస్తాయి అని కాలేజీ మొత్తం తెలుసు. అతని విజయ రహస్యం ఎవరితోనూ చెప్పడానికి అతను ఇష్టపడడు. అటువంటి వాడు డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలో రెండు సంవత్సరాలు డిబార్ అయ్యాడని తెలిసి చాలా మంది ఆశ్చర్య పోయారు. అతన్ని చూసి అసూయ పడినవాళ్లు కొంతమంది మనసులో ఆనంద పడినట్టు కూడా ఉన్నారు.
విక్రమ్ రెండు సంవత్సరాల పాటు డిబార్ అవ్వడానికి కారణం కేవలం అతని స్వయం తప్పిదమే. ఇంకో రకంగా చెప్పాలంటే అతని అత్యాశ కూడా అని చెప్పొచ్చు. అప్పటికే నూటికి తొంబై మార్కులు సాధించే అతనికి ఎలాగైనా వంద మార్కులు సాధించి తనకు సాటి ఎవరూ లేరని నిరూపించుకోవాలన్న పిచ్చి కోరిక .
ఆ రోజు ఆఖరి పరీక్ష. అప్పటికే అన్ని పరీక్షలు తను అనుకున్నట్టుగా చాలా బాగా వ్రాసానని అతనికి నమ్మకం ఉంది. ఆ రోజు అతను సీరియస్ గా పేపర్ వ్రాస్తూండగా ఎక్కడినుండో రౌండ్ గా చుట్టబడిన ఒక కాయితం ఉండ అతని టబుల్ మీద పడింది.
విక్రమ్ అటూ ఇటూ చూసి ఆ కాయితం ఉండను విప్పి చూశాడు. ఆశ్చర్యం అందులో తను ఇంకొక ప్రశ్నకు జవాబు వ్రాస్తే ఖచ్చితంగా వంద మార్కులు వస్తాయి కానీ ఆ ప్రశ్నకు జవాబు దొరకక తల బద్దలు కొట్టుకుంటున్న పరిస్తితిలో ఏ దేవుడో తన మొర ఆలకించి తనకు కావలసిన జవాబును ఆ కాయితం ఉండ రూపంలో పంపించాదన్న ఆనందం అతనిని నిలువెల్లా ఆవరించింది.
ఆ కాయితం ఉండలో దొరికిన సమాధానాన్ని చూసి ఆబగా తన పేపర్లో ఎక్కిస్తూ ఉండగా సరిగ్గా అదే సమయంలో వాచర్ కు పట్టుబడి పోయాడు. ఆ మరుక్షణంలోనే అతన్ని ప్రిన్సిపల్ దగ్గరకు తీసుకెళ్ళడం ఆధారాలతో దొరకడం వల్ల తన తప్పును ఒప్పుకోవడంతో రెండు సంవత్సరాలు డిబార్ అయ్యాడు. అప్పటివరకూ ప్రతి పేపర్లో తొంబై మార్కులు సాధిస్తున్న అతనికి అత్యాశ వల్ల మొదటికి మోసం వచ్చింది. అతనితో చదువుతున్న వాళ్ళు ఆఖరికి ముప్పై ఐదు మార్కులతో పాస్ అయినా వాళ్ళు కూడా కాలర్ ఎత్తుకుని తిరుగుతూ ఉంటే విక్రమ్ అవమాన భారంతో క్రుంగిపోయి ఎవరికీ మొహం చూపించలేని పరిస్తితికి వచ్చాడు.
అదే సమయంలో అతనికి అందరూ దూరంగా జరగగా ఒక్క రమణ మాత్రం అతని వెన్నంటి ఉన్నాడు. రమణ విక్రమ్ తో పోల్చుకుంటే ఏ మాత్రమూ చదువులో అంత తెలివి గల వాడు కాదు. క్లాసులో విక్రమ్ ముందు బెంచీలో క్లాస్ ఫస్ట్ వచ్చే వాళ్ళ పక్కనే కూర్చుంటే రమణకు వచ్చే మార్కులు ప్రకారం ఆటోమేటిక్ గా అతను చివరి బెంచీలోకి నెట్టబడ్డాడు.
ఎప్పుడూ అత్యధిక మార్కులతో క్లాసులో టాపర్ గా నిలిచే విక్రమ్ తన స్వయం కృతాప రాధంతో పాస్ మార్కులతో పాస్ ఐనా వాళ్ళ కన్నా వెనక పడిపోవడమే కాకుండా అతనంటే అసహ్యించుకునే పరిస్తితి తెచ్చుకున్నాడు.
ఆ రోజు రమణ విక్రమ్ ను కలుసుకోవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. రమణ వెళ్ళేసరికి విక్రమ్ లోపల ఒక చీకటి గదిలో కూర్చుని ఉన్నాడు. ఇంట్లో వాతావరణం అంతా గంభీరంగా ఉంది. అతను పరీక్షల్లో డిబార్ అయినప్పటినుండి బయటకు వెళ్ళడం కానీ, ఎవరినీ కలుసుకోవడం కానీ చెయ్యడం లేదు.
" ఏం బాబూ ? నువ్వు పాస్ అయ్యావా ?" అని అడిగింది విక్రమ్ తల్లి అనుమానంగా చూస్తూ. సామాన్యంగా పరీక్షల్లో ప్యాసైన వాళ్ళు ఒక బ్యాచ్ గా ఉంటే తప్పిన వాళ్ళు అంతా ఒక చోట చేరుతారు. తన కొడుకును చూడటానికి వచ్చాడంటే ఆ బాపతే అయ్యుంటాడని అనుకుందేమో .
ఏం సమాధానం చెపుతాడో అన్నట్టుగా అక్కడే కూర్చున్న విక్రమ్ తండ్రి రమణ వైపు ప్రశ్నార్ధకంగా చూశాడు.
"ఏదో లెండి ఆంటీ. . కనా కష్టం మీద గట్టెక్కాను. నాకెప్పుడూ క్లాసులో ముప్పై ఐదు మార్కులకు మించవు. మీ అబ్బాయితో పోల్చుకుంటే నేను జీరో కింద లెక్క. " అన్నాడు రమణ నిరాశగా. .
" అలా అనే కదా మా వాడిని విపరీతంగా పొగిడి ఈ స్తితికి తీసుకొచ్చారు మీ అందరూ. ముప్పై ఐదు మార్కులతో పాస్ అయితే మాత్రం ఏముంది ? పాస్ పాసే కదా. మా వాడు తొంభై మార్కులు తెచ్చుకున్నా డిబార్ అయ్యి ఈ రోజు ఎవరికీ మొహం చూపించలేక ఇంట్లో చీకటి గదిలో కూర్చున్నాడు. వాడికి ఎవరి దిష్టి తగిలిందో కానీ ఇలా పనికిరాని వాడిలా తయారయ్యాడు. వాడితో పాటు మేము కూడా బయట తలెట్టుకోలేక పోతున్నాం " అంటోంది కళ్ల నీళ్ళు పెట్టుకుంటూ విక్రమ్ తల్లి.
ఆమె కళ్ళల్లో నీళ్ళు చూసి చలించిపోయాడు రమణ. ఉన్నది ఒక్క కొడుకు. ఆ కుటుంబం అన్ని ఆశలూ అతని పైనే పెట్టుకున్నారు. ఆవిడ పరీక్షల టైంలో రాత్రంతా విక్రమ్ పక్కనే కళ్ళల్లో దివిటీలు వేసుకుని కూర్చుని కొడుకు పరీక్షలు బాగా వ్రాసి అందరిలోనూ తలమానికంగా మిగిలిపోవాలని ఆశించింది.
" ఏం రమణా ? మా వాడు అసలు కాపీ కొట్టడం ఏమిటి ? మేము నమ్మలేకపోతున్నాం ? అన్ని సబ్జెక్ట్లలోనూ తొంభై మార్కులకు తక్కువ రాని వాడు కాపీ కొట్టాడంటే ఎవరైనా నమ్ముతారా ?" అన్నాడు విక్రమ్ తండ్రి ఆవేదనగా .
"లేదు సార్ . విక్రమ్ కాపీ కొట్టలేదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. నేను విన్న దాని ప్రకారం ఆ సమయంలో కాపీ కొడుతున్న ఒక స్టూడెంట్ ను పట్టుకోబోతే అతను ఆ కాపీ దూరంగా విసిరెయ్యడంతో అది విక్రమ్ పరీక్ష వ్రాస్తున్న టేబుల్ మీద పడిందని , అదేమిటో తెలియక తీసి చూడబోయిన మన విక్రమ్ ను వాచర్ పట్టుకోవడం, ఆ తర్వాత ప్రిన్సిపాల్ దగ్గరకు తీసుకెళ్ళడం, ఆయన ఏం జరిగిందో కూడా సరిగ్గా తెలుసుకోకుండా విక్రమ్ ను డిబార్ చేసెయ్యడం జరిగింది. విక్రమ్ తను కాపీ చేయలేదు అని చెప్పినా కూడా ప్రిన్సిపాల్ వినిపించుకోక పోవడంతో ఈ దుర్ఘటన జరిగింది. మన విక్రమ్ భయంతోనే తను కాపీ కొట్టలేదని చెప్పలేకపోయాడు కానీ నిజానికి వాడికి అంత అవసరం ఏమొచ్చింది ? వాడు క్లాసులో టాపర్ అని అందరికీ తెలుసు. ఆఖరికి ప్రిన్సిపాల్ కి కూడా . ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది అంతే " అన్నాడు రమణ గట్టిగా ఊపిరి తీసుకుంటూ.
నిజానికి విక్రమ్ ఆ రోజు తన టేబుల్ మీద పడిన కాయితంలో ఏముందో చూసి అందులోని సమాచారం తనకు ఇంకా మరిన్ని మార్కులు తెచ్చి పెడుతుందనే భావనతోనే ఆ కాయితం చూసి కాపీ చేస్తూండగా పట్టుబడ్డాడు. ఈ విషయాన్ని అతని తల్లి తండ్రులకు చెపితే వాళ్ళు మరింత బాధ పడతారనే ఉద్దేశ్యంతో అతని తప్పేమీ లేదంటూ వేరే రకంగా మార్చి చెప్పాడు.
" ఏది అయితే ఏముంది బాబూ ? హత్య చెయ్యకపోయినా చేతిలో కత్తి ఉంటే చాలు వాడే చంపాడు అంటారు . ఇదీ అంతే .. కాస్త మా వాడి పక్కన ఉండి వాడికి ధైర్యం చెప్పి మళ్ళీ మామూలు మనిషిని చెయ్యి బాబూ. నీకు పుణ్యం ఉంటుంది " అంది విక్రమ్ తల్లి తన్నుకు వస్తున్న ఏడుపును బలవంతంగా ఆపుకుంటూ.
" ఆ .. ఆ.. అతనికి ఇదే పనా ? అతను మన వాడిలా కాదు. పాస్ అయ్యాడు . ఏ ఉద్యోగమో వెతుక్కోవాలి కదా. ఒక రోజు కాక పోతే రెండు రోజులు మన వాడిపక్కన ఉండమంటే ఉంటాడు. వీడు మళ్ళీ పరీక్షలు వ్రాయాలంటే రెండేళ్ళు ఆగాలి. వీడి చుట్టూ తిరుగుతూ ఉంటే వాళ్ళ తల్లి తండ్రులు ఊరుకుంటారా ? ఇవన్నీ జరిగేవి కాదు కానీ నీకు వీలు దొరికినప్పుడు వచ్చి ఒక్కసారి పలకరించు. అంతే చాలు . వాడికి ధైర్యంగా ఉంటుంది. !" అన్నాడు విక్రమ్ తండ్రి భార్గవ్ అక్కడనుండి లేచి వెళ్ళి పోతూ.
వీళ్ళందరి సంభాషణ వింటున్నాడే కానీ విక్రమ్ బయటకు రానే రాలేదు. అతనికి ఇప్పుడు ఎదుర్కుంటున్న పరిస్తితి ఆత్మహత్యా సదృశ్యంగా అనిపిస్తోంది.
** ** ** **
" ఏరా ఆ డిబారైన నీ ఫ్రెండ్ విక్రంతో తిరుగుతున్నావా ? అతనికి చాలా గర్వంటగా? ఎప్పుడైనా మన ఇంటికి రావడం కానీ, నీతో మాట్లాడటం కానీ చేశాడా ? అతను చేసుకున్న స్వయంకృతాపరాధానికి అతనే శిక్ష అనుభవించాలి. రేపటినుండి నువ్వు చక్కగా ఇంట్లో కూర్చుని పోటీ పరీక్షలకు చదివి ఉద్యోగం సంపాదించుకో. ..లేకపోతే డిబారయ్యి ఆ విక్రమ్, ఉద్యోగం రాక నువ్వూ ఈ వూళ్ళో శాశ్వతంగా మిగిలిపోతారు జాగ్రత్త " అంటూ హెచ్చరించింది రమణ తల్లి ధుమ ధుమ లాడుతూ.
"లేదమ్మా. వాడు నాతో బాగానే ఉండేవాడు. ఏదో పొరపాటు జరిగింది కానీ అతను డిబార్ అవ్వాల్సిన వాడు కాడు. అంత మాత్రాన వాడిని వాడి మానాన అలా వదిలేయడం ఏం బాగుంటుంది చెప్పు ?" అన్నాడు రమణ సానుభూతి ప్రకటిస్తూ.
"ఏమోరా బాబూ. నీ జాగ్రత్తలో నువ్వు ఉండటం నేర్చుకో. ఈత కెళ్ళిన వాడు ప్రాణాపాయ పరిస్తితిలో వాళ్ళతో వెళ్ళిన వాళ్ళను కూడా ముంచేస్తారుట. ఇప్పుడు పరిస్తితి అలాగే ఉంది చూస్తూంటే . " అంది రమణ తల్లి కొడుక్కి జాగ్రత్తలు చెపుతూ.
విక్రమ్ అవమానంతో ఇంట్లో వుండలేక బయట విడిగా రూమ్ తీసుకుని ఉంటున్నాడు. అతనికి తోడుగా అప్పుడప్పుడు రమణ కూడా వెళ్ళి కూర్చుని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు. ఇంకా తను వ్రాయవలసిన పరీక్షకు ఇంకా చాలా సమయం ఉన్నా ఇప్పటినుండే విక్రమ్ రాత్రింబగళ్ళు చదువు మీద దృష్టి పెట్టసాగాడు.
వారాలు, నెలలు , గడుస్తున్నా అత్తిసరు మార్కులతో పాస్ అయిన రమణకు ఉద్యోగం దొరకడం కష్టమైపోయింది. ఏ పోటీ పరీక్షకు వెళ్లినా చుక్క ఎదురవుతోంది. అతనితో పాటు ఇంట్లో వాళ్ళు కూడా తీవ్ర నిరాశకు గురవుతున్నారు. . చేసేది లేక టైప్ ఇన్స్టిట్యూట్ కు వెళ్లి కొన్నాళ్లు టైప్ నేర్చుకున్నాడు. ఇంటి అరుగుల మీద ట్యూషన్లు చెప్పి రోజులు వెళ్లదీసే వాడు. చూస్తూండగానే రెండు సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ రెండేళ్ళల్లో ఎంతమంది అడ్డం పడినా కూడా రమణ విక్రమ్ పక్కనే తోడుగా ఉండి అతనికి ధైర్యాన్ని ఇచ్చి అతను విజయవంతంగా పరీక్షలు వ్రాయడానికి దోహదపడ్డాడు. .
మంచి పట్టుదలగా చదవడం వల్ల ఈ సారి విక్రమ్ తొంభై ఐదు పెర్సెంట్ మార్కులతో పాస్ అయ్యి రికార్డు సాధించాడు. ఫలితాలు వచ్చి రెండు నెలలు కూడా కాలేదు . పోటీ పరీక్షలకు కూర్చున్న విక్రమ్ గ్రూప్ టూ సర్వీసెస్ లో ఎన్నిక కాబడి మంచి ఉద్యోగం సంపాదించాడు.
విక్రంతో పాటే ఉండి అతను డిబారైన రెండేళ్ళ కష్ట కాలంలో అతన్నేఅంటి పెట్టుకుని తను మాత్రం ఏ అవకాశమూ రాక ప్రైవేట్లు చెప్పుకుంటూ ఆ వూళ్లోనే స్తిరపడి పోయాడు రమణ. . అందుకే అంటారు. అదృష్టవంతుల్ని చెడగొట్టలేరు దురదృష్టవంతుల్ని బాగుచెయ్యలేరని .
రెండేళ్ళు డిబార్ అయ్యాడన్న రిమార్క్ ఇప్పుడు విక్రమ్ విషయంలో పూర్తిగా తుడుచుకు పోయి మంచి ఉద్యోగం చేసుకుంటూ బంధువుల్లోనూ, బయట జనాల్లోనూ నీరాజనాలు అందుకుంటున్నాడు . అవును నిజమైన తెలివి తేటలు ఎక్కడికి పోతాయి ? అతని రాత బాగోలేక బుద్ది వికటించి చేసిన చిన్న తప్పిదానికి శిక్ష రెండేళ్ళు ఎలాగూ పడింది. కానీ విక్రమ్ ని చూస్తూంటే రమణకు అనిపించేది "వజ్రం ఎక్కడున్నా , ఏ మూల పడిఉన్నా దాని ప్రకాశం ఎప్పటికీ తగ్గిపోదు. చెదిరి పోదు " అని. విక్రమ్ ని గురించి అలా భావించడం రమణ సంస్కారం. ఆ తర్వాత రోజుల్లో కూడా రమణ విక్రమ్ తో అడపా దడపా కలుస్తూనే ఉన్నాడు. తన మిత్రుడు మంచి ఉద్యోగం చేస్తూ బాగా సంపాదించుకుంటున్నా రమణ ఎప్పుడూ చనువు తీసుకుని కష్టకాలంలో కూడా విక్రమ్ ని ఒక్క రూపాయి కూడా అడగటానికి ప్రయత్నం చేయలేదు. అది అతని సంస్కారం. రమణ దృష్టిలో విక్రమ్ వజ్రం అయితే విక్రమ్ దృష్టిలో నిస్వార్ధ జీవితాన్ని గడుపుతున్న రమణ ఒక ఆపద్బాంధవుడు ****
సమాప్తం