విముక్తి

విశాలాంధ్ర ఆదివారం • 19 Nov 2023 • 👁 1 views
" విముక్తి " (కథ )
రచన : జీడిగుంట నరసింహ మూర్తి
(19/11/2023 విశాలాంధ్ర ఆదివారం అనుబంధంలో ప్రచురణ )
"మిష్టర్ విశ్వనాధ్! ఈ రోజు రాత్రి డిల్లీ నుండి డైరెక్టర్ పరమేశ్వరన్ మన కంపినీలో సరుకు ఇన్స్పెక్షన్ చెయ్యడానికి వస్తున్నారు. మీరు ఈ రాత్రికి ఇంటికి వెళ్లకుండా గెస్ట్ హౌస్ లోనే ఉండి ఆయనకు కావలసిన అవసరాలు అన్నీ చూడండి. ఈ విషయంలో ఏ విధంగానూ తేడా రాకూడదు సుమా .." అంటూ హుకూం జారీ చేశాడు కంపినీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రవణన్.
"విశ్వనాధ్ గుండెల్లో రాయి పడింది. అదే రోజు రాత్రి అతను తన భార్యను ఆరోగ్య సమస్యపై ఆ వూళ్ళో పెద్ద ఆసుపత్రిలో చూపించడానికి అపాయింట్మెంట్ తీసుకున్నాడు. అక్కడ ఆవిడకు కొన్ని టెస్టులు కూడా చేయాల్సి ఉంటుందని చెప్పడంతో ఆమె వెంట తను కూడా తప్పనిసరిగా వెళ్లాల్సి ఉంది.
అదే విషయాన్ని ఈడీ శ్రవణన్ తో చెప్పాలని ప్రయత్నం చెయ్యబోతూ ఉండగా మళ్ళీ ఆయనే అన్నాడు.
" ఇప్పుడు పరమేశ్వరన్ అండ్ పార్టీ మన కంపినీలో కొద్దిగా నాణ్యతా పరిమాణాలు లోపించిన రెండు వేల టన్నులు సరుకును ఇన్స్పెక్షన్ చేసి క్లియరెన్స్ ఇస్తే కానీ కంపినీ రాబోయే రెండు నెలలు కాలంలో అందరికీ జీతాలు ఇచ్చే పరిస్తితి లేదు. . ఈ విషయంలో మన మేనేజింగ్ డైరెక్టర్ చాలా ప్రత్యేకమైన శ్రద్ద పెట్టి అందరినీ అలెర్ట్ చేస్తున్నారు. మీరు కూడా ఈ రాత్రి గెస్ట్ హౌస్ లోనే భోజనం చేయండి. రేపు పొద్దున్న ఎనిమిదింటికి ఇంటికి వెళ్ళి కావాలంటే ఒక గంట లేట్ గా ఆఫీసుకు రండి పర్వాలేదు " అన్నాడు. గంభీరంగా పలికింది ఆయన గొంతు.
డాక్టర్లు తనకు తొమ్మిది గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఖచ్చితంగా అదే సమయంలో తను వెళ్ళి పరమేశ్వరన్ ను రైల్వే స్టేషన్ కు వెళ్ళి తీసుకు రావాలి. ఏం చెయ్యాలో విశ్వనాధ్కు పాలు పోవడం లేదు. ఎప్పుడూ లేని ఏదో అవ్యక్తమైన బెదురూ, నీరసం, నిర్లిప్తత ముంచుకొచ్చాయి.
వెంటనే అతని మస్తిష్కంలో చటుక్కున ఒక మెరుపులా ఆలోచన మెరిసింది. ఇంతకు ముందు ఎన్నో సార్లు తను పరమేశ్వరన్ తో పాటు గెస్ట్ హౌస్ లో ఉన్నాడు. ఆయన తనతో చనువుగానే ఉంటాడు. దాన్ని ఉపయోగించుకుని తన పరిస్తితిని వివరించి ఈ రోజు రాత్రికి గెస్ట్ హౌస్ లో ఎలాగో అలా తన సహాయం లేకుండానే అడ్జస్ట్ అయిపొమ్మని చెప్పాలని అనుకున్నాడు.
అలా అనుకోగానే ఇంక్కొక్క క్షణం ఆలస్యం చేయకుండానే పక్కకు వెళ్ళి పరమేశ్వరన్ కు ఫోన్ చేశాడు.
"పరమేశ్వరన్ సార్ ! మీరు ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చారు ?" అని అడిగాడు. అతని కంఠం ఉద్వేగంతో వణికింది.
" హలో మై డియర్ విశ్వనాధ్ హౌ ఆర్ యు ? నేను మాక్జిమమ్ రెండు గంటల్లో అక్కడ ఉంటాను. ఈ రోజు రాత్రి మనం మీ గెస్ట్ హౌస్ లో కలుసుకుందాం. మీరు నాకోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారని ఈ రాత్రంతా నాతోనే ఉండి ప్రొడక్షన్ వివరాలు అందిస్తారని మీ ఈడీ గారు చెప్పారు " అన్నాడు పరమేశ్వరన్ ఉత్కంఠతతో. .
"సార్. అదే విషయం మీతో మాట్లాడాలని ఫోన్ చేస్తున్నాను .మీ ప్రోగ్రామ్ గురించి నాకు మా ఈడీ గారు ఇందాకే చెప్పారు. అనుకోకుండా నా పై ఆఫీసర్లు వేరే పని మీద ఎక్కడికో వెళ్లడంతో బహుశా నాకు చెప్పాల్సి వచ్చి ఉంటుంది. ఈ విషయంలో నేను మీ సహాయం కోసం ఆర్ధిస్తున్నాను . నేను ఈ రోజు రాత్రి మా మిసెస్ ఒక క్రానిక్ సమస్యకు డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాను. వేరే తోడు వెళ్లడానికి ఇంట్లో ఎవరూ లేరు. ఆవిడకు చాలా టెస్టులు చేయించాల్సి ఉంది. అవన్నీ నేను దగ్గరుండి చూసుకోవాలి. మీరు వస్తున్న విషయం నాకు కనీసం ఒక రోజు ముందు తెలిసి ఉంటే అపాయింట్మెంట్ మరో రోజు తీసుకునే వాడిని. నేను మా గెస్ట్ హౌస్ లో మీకు అన్ని సదుపాయాలు సమకూరేటట్టుగా చూసి వెళతాను. మళ్ళీ పొద్దున్నే ఏడు గంటలకల్లా మీ దగ్గరికి వచ్చి వాలుతాను. ఈ విషయంలో నాకు మీరు తప్ప ఎవరూ అర్ధం చేసుకునే వాళ్ళు లేరు. మీరు నాకు ఈ పూటకు పెర్మిషన్ ఇప్పిస్తే మీకు ఎంతో ఋణపడి ఉంటాను " అంటూ ఒక రకంగా ప్రాధేయపడుతున్నట్టుగానే చెప్పాడు విశ్వనాధ్.
" అరె. పోవయ్యా . ఎన్నాళ్లని నీ జీవితాన్ని త్యాగం చేసి మా వెనక తిరుగుతావయ్యా బాబూ ? నీకూ కుటుంబం ఉంది. పైగా నీ భార్యకు అనారోగ్యం అంటున్నావు. నువ్వింకా ఏమీ ఆలోచించక ఈ రాత్రికి నీ పని ప్రశాంతంగా చేసుకో. మీ గెస్ట్ హౌస్ వాళ్ళు నాకు బాగా పరిచయమే కదా. జస్ట్ నేను వస్తున్నట్టు , డిన్నర్, పడకా అవీ సరిగ్గా అమరేటట్టు చూడు . అంతే. మిగిలిన విషయాలు నేను చూసుకుంటాను. హాయిగా మీ కుటుంబంతో గడుపు ..." అంటూ ఎంతో కాలంగా విశ్వనాధ్ ను చూస్తూ వస్తున్న పరమేశ్వరన్ గట్టి భరోసా ఇచ్చేశాడు.
** ** **
రాత్రి పదకొండు గంటలయ్యింది. ట్రైన్లో చాలా సేపు నిద్రపోయి ఉండటంతో పరమేశ్వరన్ కు ఒక పట్టాన కంటిమీద కునుకు రావడం లేదు. వెంటనే ఈడీకి ఫోన్ చేసి తను తర్వాత రోజు ఇన్స్పెక్షన్ చెయ్యాల్సిన సరుకు తాలూకు వివరాలు అడిగాడు.
"మీకు కావాల్సిన ప్రొడక్షన్ తాలూకు వివరాలు అన్నీ మా ఆఫీసర్ విశ్వనాధ్ దగ్గర ఉన్నాయి. అతను ఈ పాటికి మీకు భోజనం , వసతి ఏర్పాట్లు చేసి ఉంటాడని అనుకుంటున్నాను. ప్రొడక్షన్ తాలూకు మీకు ఇంకా ఏవైనా వివరాలు కావాలని అనుకుంటే రేపు ఉదయం మీరు ఫ్యాక్టరీ లోకి రాగానే నేను క్లియర్ చేస్తాను ..." అన్నాడు ఈడీ. .
" ఆ .. ఆ ..నాకిక్కడ అంతా బాగానే ఉంది. మీకు వీలైతే మీ సిస్టమ్లో ఉంటే దయచేసి కొంత ఇన్ఫర్మేషన్ నాకివ్వగలరా ? మీ విశ్వనాధ్ ప్రస్తుతం నాతో లేడు. తను ఏదో ఈ రోజు చాలా అర్జెంట్ పని ఉంది రాలేనని రిక్వెస్ట్ చేస్తే సరే అన్నాను . .."అంటూ చావు కబురు చల్లగా చెప్పాడు పరమేశ్వరన్ .
పరమేశ్వరన్ చెప్పిన విషయం విని ఈడీ శ్రవణన్ మొహం అసహనంగా మారిపోయింది. రక్తం వేడెక్కి పరుగులు తీస్తోంది. విశ్వనాధ్ మీద కోపం ఉవ్వెత్తున పొంగి పొర్లింది. అది పైకి కనపడనియ్యకుండా లోపలే అణిచిపెట్టుకున్నాడు. తన మాటను లెక్కచేయ్యకుండా ఇంతటి ఘాతుకానికి ఒడికట్టి తనని ఇంతగా తీవ్రంగా అవమానించిన విశ్వనాధ్ ను ఉద్యోగంలో నుండి పీకెయ్యాలని అప్పటికప్పుడు నిర్ణయించుకున్నాడు. ఆయనలో బిగపట్టిన ఆవేశం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. దాని ఫలితమే క్షణం ఆలోచించక విశ్వనాధ్కు ఫోన్ చేసేశాడు.
రాత్రి ఆసుపత్రిలో ఆలస్యం అవ్వడంతో విశ్వనాధ్ ఒళ్ళు ఎరగకుండా పడుకోవడంతో ఫోన్ తియ్యలేదు. ఈడీ అక్కడితో ఊరుకోక విశ్వనాధ్ పై బాస్ మాధవన్ కు సీరియస్గా ఫోన్ చేసి " మీరు లేకపోతే మీ కింద పని చేసే స్టాఫ్ ఎందుకూ పనికిరారు అని నాకర్ధమయ్యింది. మన సరుకుకు ఇన్స్పెక్షన్ చెయ్యాల్సిన డైరెక్టర్ వస్తే దగ్గరుండీ చూసుకునే దిక్కే లేదు. ఈ రాత్రి గెస్ట్ హౌస్ కు వచ్చే ఆయనతోనే ఉండి ఆయనకు అన్ని సౌకర్యాలు దగ్గరుండి చూసుకుంటానని నాకు హామీ ఇచ్చిన మీ విశ్వనాధ్ బాధ్యతను విస్మరించి ఇంటికెళ్ళి పడుకున్నాడు. రేపు ఆ డైరెక్టర్ తన కోపాన్ని అమ్ముడు కాకుండా మూలుగుతున్న సరుకు మీద చూపిస్తే మన అందరి ఉద్యోగాలు పోతాయి. మీరు ఎంతో నమ్మకంగా చెప్పడం వల్లే మీకు చాలా ముఖ్యమైన పని ఉందని చెపితే పెర్మిషన్ ఇచ్చాను. ఇప్పుడు అందరూ కలిసి కొంప ముంచారు .." అంటూ ఈడీ శ్రవణన్ సుందరమ్మీద తీవ్రమైన అసహనం ప్రకటించాడు.
ఇది జరిగిన చాలా రోజుల తర్వాత సంగతి.
ఆ కంపినీలో ఇన్స్పెక్షన్ చెయ్యడానికి చాలా మంది డైరెక్టర్లు మారుతూ ఉంటారు.
విశ్వనాధ్ బాస్ మాధవన్ అర్జెంట్ గా రమ్మని చెప్పడంతో విశ్వనాధ్ ఆయన క్యాబిన్లోకి వచ్చాడు. .
"విశ్వనాధ్ గారు . మన కంపెనీలో సరుకు ఇన్స్పెక్షన్ చెయ్యడానికి ఈ సారి డిల్లీ నుండి శ్యాంసుందర్ గారు వచ్చారు. . ఆయనతో పాటు మన ఊరు చూడటానికి మొట్టమొదటి సారిగా వారి సతీమణి ఆసక్తి చూపడంతో ఆమె కూడా వచ్చి ఇప్పుడు గెస్ట్ హౌస్ లో ఉన్నారు. రేపు ఆదివారం నాడు వారు ఇక్కడ కొన్ని దేవాలయాలు , ముఖ్యమైన ప్రదేశాలు చూడాలని కూడా అనుకుంటున్నారు. . మీరు మన కంపెనీ వెహికిల్ తీసుకుని వెళ్ళి వారికి మొత్తం ఊరు చూపించండి... ఇంతకు ముందులా కాకుండా ఈ సారి మీరు ప్రత్యేకమైన శ్రద్ద తీసుకుని మన ఈడీ దగ్గర మాట రాకుండా చూడండి " అన్నాడు విశ్వనాధ్ పై బాస్ మాధవన్ . .
"అలాగే సార్. రేపు ఉదయమే వాళ్ళను మన గెస్ట్ హౌస్ నుండి పికప్ చేసుకుంటాను. ఈ విషయంలో మీరు నిస్సంకోచంగా ఉండండి ..." అని మాటిచ్చాడు విశ్వనాధ్ నిజాయితీగా.
ఆ రోజు ఆదివారం ఉదయాన్నే విశ్వనాధ్ గెస్ట్ హౌస్ కు వచ్చేటప్పటికి డైరెక్టర్ శ్యాంసుందర్ వారి భార్య రెడీగా ఉన్నారు.
ఆ వూళ్ళో ప్రసిద్ది చెందిన రెండు మూడు దేవాలయాలు చూసిన అనంతరం శ్యాంసుందర్ భార్య కోరికపైన వాహనాన్ని పళ్ల మార్కెట్ దగ్గర ఆపమనడంతో అందరూ కిందకు దిగారు. ఆ ప్రదేశమంతా బంగారపు రంగుతో మెరిసిపోతున్న బంగినపల్లి మామిడిపళ్ల బుట్టలతో నిండిపోయి సువాసనలు వెదజల్లుతున్నాయి. . అవి చూడగానే శ్యామ్ సుందర్ భార్య భర్త చెవిలో ఏదో గొణగడంతో ఆయన విశ్వనాధ్కు చెప్పి ఒక పెద్ద బుట్టను జీపులో పెట్టించాడు. ఆ బుట్టలో కనీసం ఏభై పళ్ళకు తక్కువ ఉండవు. మామిడి పళ్ల బుట్టను లోపలకు ఎక్కించగానే ఆ దంపతులు విశ్వనాధ్ మొహం వైపు చూడసాగారు.
రెండు నిమిషాల తర్వాత డ్రైవరు అంటున్నాడు "సార్. లోపల పెట్టిన బుట్టకు డబ్బులు కోసం పళ్ళు అమ్మిన అతను కింద వెయిట్ చేస్తున్నాడు " అని .
ఈ హఠాత్ పరిణామానికి విశ్వనాధ్ తల తిరిగిపోయింది. తను జీపులో ఊరు చూపించడం వరకే తన బాధ్యత అనుకున్నాడు కానీ డైరెక్టర్ గారి భార్య , శ్యాంసుందర్ పళ్ల మార్కెట్ దగ్గర బండి ఆపించి పళ్ల బుట్టలను లోపల పెట్టించి తనచేత డబ్బులు ఇప్పించాలని చూస్తున్నారని అతను కలలో కూడా ఊహించలేదు. అక్కడి పరిస్తితి చూసి అసహాయంగా శూన్యం నిండిన కళ్ళతో చూస్తున్నాడు విశ్వనాధ్. అతని జేబులో ఏదో కొంత చిల్లర తప్ప పళ్ళకు సరిపడా డబ్బులు లేవు. ఇటువంటి ఇన్స్పెక్షన్ల కోసం పైనుండి ఎవరైనా వచ్చినప్పుడు వారికయ్యే ఖర్చుల కోసం తన పై ఆఫీసర్లు లక్షల రూపాయలు కంపినీ నుండి డ్రా చేసి అందులో వేలకు వేలు మిగుల్చుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ తన దగ్గరికొచ్చేసరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా పంపించిన మాధవన్ పైన అసహ్యం పొంగి పొర్లింది. చివరకు శ్యామ్ సుందర్ మామిడి పళ్ల బుట్టకు అయిన డబ్బు చెల్లిస్తూ ఉంటే విశ్వనాధ్ చేష్టలుడిగి నిలబడి పోయాడు. . డ్రైవరు ఇంకా చూడవలసిన కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయని చెప్పడం అందుకు శ్యామ్ సుందర్ కోపంగా "ఏమీ అక్కరలేదు. చూసింది చాలు. ఇక గెస్ట్ హౌస్ కు తీసుకు పో " అన్నాడు. ఆయన మాటల్లో ఒక విధమైన ఈసడింపు కనిపిస్తోంది. . .
గెస్ట్ హౌస్ కు చేరుకోగానే శ్యామ్ సుందర్ ఎవరితోనో ఫోన్ చేసి అరుస్తున్నాడు . ఆయన మొహంలో రంగులు మారాయి క్రమక్రమంగా.
"మీ కంపినీ వాళ్ళకు మ్యాన్నర్స్ అస్సలు లేవు. చూస్తూంటే మా విలువ మీకెవ్వరికీ తెలియడం లేదు. ఒక్కసారి మా తడాఖా చూపిస్తే కానీ మీకు అర్ధం కాదు ..." అన్నాడు . అతని గొంతు కటువుగా, కర్కశంగా ఉంది.
"అయ్యో. అంత మాటనకండి సార్. మా వల్ల మీకు ఏమైనా అసౌకర్యం కలిగితే చెప్పండి. వెంటనే సరిదిద్దుకుని పరిహారం చేసుకుంటాం .." అన్నాడు సుందరం అవతలవైపునుండి . గజగజ వణుకుతూ . .
" ఇక నుండి మా వెంట దమ్మిడీకి పనికిరాని ఏబ్రాసీలను పంపకండి. మా ఆడవాళ్ళ మధ్య అవమానం అయిపోయింది ఈ రోజు. " అంటూ ఒక గంట క్రితం పళ్ల మార్కెట్ దగ్గర జరిగిన ఉదంతాన్ని జరిగిన దానికన్నా ఇంకొంచం ఎక్కువేసి చెప్పి కోపంగా ఫోన్ పెట్టేశాడు శ్యామ్ సుందర్.
పక్కనే ఉండి ఆయన మాటలు వింటున్న విశ్వనాధ్ కు చెళ్లుమని కొరడాతో కొట్టినట్లుగా అనిపించింది. నిజానికి ఈ రోజు డైరెక్టర్ శ్యాంసుందర్ తో పాటు తను కూడా తీవ్రమైన అవమానానికి గురయ్యాడు. తన విషయంలో పై అధికార్లు ప్రవర్తిస్తున్న తీరు చాలా సార్లు తల కొట్టేసినట్టుగా ఉంటోంది. తను రాత్రింబవళ్ళు ఈ కంపినీ కోసం పడుతున్న కష్టం అంతా ఒక్క దెబ్బతో తుడిచిపెట్టుకుపోయింది. . చివరకు తనకు మిగిలింది " అయోగ్యుడు" అన్న బిరుదు. ఇంకా ఈ కంపినీలో ఉద్యోగం చేస్తూ ఇంకెన్ని సార్లు అగచాట్లు పడాలో ? " అనుకుంటూ అవమాన భారంతో , బాధాతప్త హృదయంతో విశ్వనాధ్ అక్కడనుండి కదిలాడు.
ఆ తర్వాత రోజు విశ్వనాధ్ ఆఫీసుకు వెళ్ళాక తెలిసింది తనని వేరే డిపార్ట్మెంట్ కు ట్రాన్సఫర్ చేశారని." అవును అంతకన్నా ఏం చెయ్యగలరు ? వాళ్లందరి రహస్యాలు తన దగ్గర ఉన్నాయి. ఎవరెవరు కంపినీలోని సరుకు ఇన్స్పెక్షన్ సమయంలో ఎంతెంత సంపాదించుకున్నారో తను చాలా రోజులనుండి గమనిస్తూనే ఉన్నాడు. కానీ తనెప్పుడూ ఆ రక్తపు కూడు మాత్రం తినడానికి సిద్దంగా లేడు. , కేవలం గొడ్డు చాకిరీ చేయించుకునే విషయంలో మాత్రం తనని బాగా వాడుకున్నారని, అయినా కూడా తను చేసిన కష్టం ఎక్కడికీ పోదని భావిస్తూ ఇన్నాళ్లూ నెట్టుకుంటూ వచ్చాడు. ఒకందుకు తనకు మంచే జరిగింది. . అనుకోకుండా తనకు ఇష్టమైన డిపార్ట్మెంట్కే తనని బదిలీ చెయ్యడంతో గుర్తింపులేని తను చేసిన గాడిద చాకిరీ నుండి తన బ్రతుక్కి శాశ్వత విముక్తి లభించింది. అలా అని మనసులో అనుకున్నాక విశ్వనాధ్ మనసు తేలికపడి హాయిగా ఊపిరి తీసుకున్నాడు ******