పెద్ద కష్టం

విశాలాంధ్ర ఆదివారం • 14 Jan 2024 • 👁 1 views
" పెద్ద కష్టం" ( కథ )
14/1/2024 విశాలాంధ్ర ఆదివారం అనుబంధం లో ప్రచురితం )
రచన : జీడిగుంట నరసింహ మూర్తి
"మిత్రమా ! నువ్వు ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నట్టుగా కొన్ని రోజుల క్రితం నాతో అన్నావు. అప్పుడు అనుకోని పరిస్తితులవల్ల నీకు సహాయం చేయాలని ప్రయత్నించినా కుదరలేదు. మనమిద్దరమూ కలిసి ఒకే కాలేజీలో చదువుకున్నాం. నా అదృష్టం వల్ల నాకు మంచి ఉద్యోగం దొరికింది. నువ్వు మాత్రం ఎక్కడెక్కడో ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగాలు చేసుకుంటూ జీవనాన్ని లాక్కుంటూ వచ్చేస్తున్నావని తెలిసి కొంత బాధ పడ్డాను. కొన్ని రోజుల క్రితం అనుకోకుండా చాలా రోజుల తర్వాత కలిశాం. అప్పుడు నాకు తెలిసింది నువ్వు పని చేస్తున్న కంపెనీ మూత పడటంతో కొన్నాళ్లు తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందులను ఎదురుకుంటున్నావని చెప్పావు. మళ్ళీ ఆ విషయం ఎందుకు గుర్తు చేస్తున్నాను అంటే నీకింకా ఆర్ధిక సమస్యలు ఉంటే చెప్పు. నా వంతు కర్తవ్యంగా ఒక పదివేలు రూపాయలు వెంటనే పంపిస్తాను. అంతే కాదు . మన వాళ్ళల్లో ఇంకా ఎవరైనా సమస్యల్లో ఉన్నా నాకు వెంటనే వాళ్ళ అక్కౌంట్ నెంబర్ చెపితే నాకు వీలైన సాయం చేస్తాను . ఇంకో విషయం. ఈ డబ్బు తిరిగి నాకు ఎవ్వరూ ఇవ్వనక్కరలేదు. ఆ భగవంతుని దయవల్ల నా ఆర్ధిక పరిస్తితి బాగానే ఉంది. ఒక వేళ మీ కంపెనీ తెరిచినా కూడా ఇన్నాళ్ళు జీతాలు ఇవ్వకపోయి ఉండటం వల్ల నువ్వు తలకు మించి అప్పులు చేసి ఉంటావు. ఇప్పుడు నేను పంపబోయే డబ్బు నీ కనీస అవసరాలకు ఉపయోగపడుతుంది . వెంటనే నీ ఫోన్ పే నెంబర్ పంపు .." అని ఫోన్ లో చెప్పాడు చలపతి .
చలపతి ఫోన్ అందుకున్నాక వెంకట్ కొద్దిసేపు ఆలోచనలో పడిపోయాడు. ఎంత మిత్రుడైనా ఈ రోజుల్లో అవతల వాళ్ళ కష్టాలు తెలుసుకుని ఆర్ధిక సహాయం చేస్తాననడం సామాన్యమైన విషయం కాదు. నిజానికి ఇప్పుడు తనకు డబ్బు చాలా అవసరమే. పరుల సొమ్ము పాముతో సమానం అంటారు. తను తిరిగి తీర్చగలిగినప్పుడే ఎవరి దగ్గర నుండైనా ఆశించవచ్చు. ఇప్పటికే తను ఎన్నో అప్పులు చేశాడు. అది తీర్చడానికే తనకు తలకు మించిన సమస్యగా పరిణమించింది. . ఎంత తిరిగి నువ్వు డబ్బు ఇవ్వక్కరలేదు అని చలపతి చెప్పినా కూడా తను ఆనందపడిపోవడం తగదు కాక తగదు. అటువంటి ఉచిత ధన సాయం తర్వాత కాలంలో తనని, తన కుటుంబాన్ని ఎన్ని సమస్యలకు గురి చేస్తుందో ?
వెంకట్ తన భార్యతో కలిసి ఆలోచించాక చలపతి నుండి డబ్బు తీసుకోవడానికి మనస్కరించక ఎప్పుడో తన తాతలనాటి వెండి కంచం అమ్మి ఇంట్లో కావలసిన బియ్యం, ఇతర సరుకులు తెచ్చుకుని ఒక నాలుగైదు రోజులకైనా భుక్తి గడుస్తుందని అనుకున్నాడు.
ఫోన్ మోగుతూ ఉంటే మళ్ళీ చలపతే చేస్తున్నాడేమో అనుకుని తీశాడు వెంకట్.
"నేను వెంకట్. రమణ మూర్తిని మాట్లాడుతున్నాను. నీతో మాట్లాడి చాలా రోజులయ్యింది. ఈ రోజు అనుకోకుండా చలపతిని కలిశాను. చాలా నీరసంగా ఉన్నాడు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో ఉన్నాడుట. మాటల మధ్యలో మా సంభాషణ నీ గురించి వచ్చింది. కొన్నాళ్లుగా మీ ఫ్యాక్టరీ లాకౌట్లో ఉందని, పని చేసిన కాలానికి కూడా జీతాలు ఇవ్వలేదని ,నువ్వు చాలా ఇబ్బందుల్లో ఉన్నావని చెప్పాడు. తనేదో నీకు ఆర్దిక సహాయం చెయ్యబోతే నువ్వు వద్దన్నావుటగా ? నీ పరిస్తితి చూస్తూంటే నాకు జాలేస్తోంది. ఈ రోజుల్లో ఆ మాత్రం ఆదుకోవడానికి ముందుకొచ్చే వాళ్ళు ఎవరు చెప్పు ? నాకు ఎంతో కొంత ఇవ్వాలని ఉంది కానీ మొన్ననే అమ్మాయి పెళ్లి చేశాను. తలకు మించిన ఖర్చు అయ్యింది. చెప్పకూడదు కానీ నా పరిస్తితి కూడా అలాగే ఉంది. నువ్వు మారు మాట్లాడకుండా చలపతి ఇచ్చే డబ్బు తీసుకో. మళ్ళీ మీ కంపినీ తెరిచాక ఇచ్చేద్దువు గానీ. .. మనమందరమూ ఒక కాలేజీలో చదువుకున్నాం కాబట్టి వీలైతే ఒకరికొకరు సాయం చేసుకోవడంలో తప్పు లేదు . ఇంకా ఏమీ ఆలోచించకు . వెంటనే చలపతికి ఫోన్ చేసి డబ్బు పంపమను.." అంటూ ఫోన్ పెట్టేశాడు.
వెంకట్ ఆలోచనలో పడ్డాడు. అతనికి కొన్నేళ్ళ క్రితం సంగతి గుర్తుకొచ్చింది. తను ఉద్యోగ వేటలో ఉన్నప్పుడు ఒక రోజు చలపతిని కలిశాడు. అప్పటికి చలపతి మంచి ఉద్యోగం చేస్తూ బాగానే ఉన్నాడు. అయితే అతనికింకా అప్పటికి పెళ్లి కాలేదు. ఒక రూమ్ తీసుకుని ఉంటున్నాడు. కొన్నాళ్ల పాటు తనని కూడా ఆ రూములో ఉంచుకోమని , ఉద్యోగం దొరికాక వెళ్లిపోతానని అడిగాడు తను .
"ఒక నెల రోజులు పాటు నువ్వు ఉండటానికి నాకు అభ్యంతరం లేదు. కానీ మా పేరెంట్స్ సిటీ కొచ్చినప్పుడు నన్ను చూడటానికి నా రూముకి వస్తూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళకు ఇబ్బంది అవుతుందేమో నని ఆలోచిస్తున్నాను . పైగా నా టైమింగ్స్ వేరు. చాలా సార్లు క్యాంపులకు వెళ్లాల్సి ఉంటుంది. ఇంటి ఓనర్ నేను ఒక్కడినే ఉంటేనే రూమ్ ఇస్తానని మాట తీసుకున్నాడు. నేను లేనప్పుడు నిన్ను చూస్తే ఆయన నీతో గొడవ పెట్టుకునే అవకాశం ఉంది. ...ఆలోచించు ఒకసారి. ప్రస్తుతం ఒక నెలకైతే నేను ఎలాగో అలా మ్యానేజ్ చేస్తాను .." అన్నాడు చలపతి ఇబ్బందిగా మొహం పెడుతూ. .
వెంకట్ కు ప్రస్తుతం వేరే ఆప్షన్ లేదు. ఊళ్ళో ఎవరూ చుట్టాలు కూడా లేరు. బాగా తెలిసిన వాడు చలపతి ఒక్కడే.
"సరే . వెంటనే ఉద్యోగం వెతుక్కుని వెళ్లిపోతాను. సాధ్యమైనంతవరకు నీకు ట్రబుల్ ఇవ్వను " అని చలపతికి మాటిచ్చి తన సామానులు తెచ్చుకుని చలపతి రూంలో చేరిపోయాడు.
చలపతి , అతని ఆఫీస్ స్టాఫ్ అంతా కలిసి రాత్రి డిన్నర్ ఒక మెస్ లో చేస్తూ ఉండేవాళ్లు. కొన్ని సార్లు వాళ్ళ వెంట వెంకట్ ను కూడా తీసుకెళ్ళాల్సి వచ్చేది. అతని డిన్నర్కు అయిన ఖర్చు కూడా ఒకటి రెండు సార్లు చలపతే భరించాల్సి వచ్చింది.
ఆ రోజు చలపతితో పాటు వెంకట్ డిన్నర్ కు తయారవుతూండగా మధ్యలో చలపతి కలిపించుకుని "చలపతీ నువ్వు ఏమీ అనుకోకపోతే మీ ఇంటినుండి కొంత డబ్బు తెప్పించుకో రాదూ ? . ఇక్కడ సిటీలో చాలా ఖర్చులవుతాయి. మేము మెస్ లో నెలకు ఇంత అని ఇచ్చేస్తే మాకు తక్కువలో డిన్నర్ వస్తుంది. మా వెంట ఎవరినైనా తీసుకెళ్తే భోజనం రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు నీ పరిస్తితి చూస్తూంటే ఉద్యోగం దొరికే అంతవరకు ఏ ఖర్చులూ భరించే స్తితిలో లేవు . మరి ఏం చేద్దామంటావ్?" అన్నాడు కొద్దిగా సీరియస్గానే .
"సారీ చలపతీ. నీకు చాలా ట్రబుల్ ఇస్తున్నాను. నాకు ఎవరో ఇక్కడ ఉద్యోగం చూపిస్తాను వెంటనే రమ్మంటే ఏమీ ఆలోచించకుండా వచ్చేశాను. కానీ ఆ వుద్యోగం చేతికి వచ్చినట్టే వచ్చి వెనక్కి వెళ్లిపోయింది. నా దగ్గర ఉన్న డబ్బుతో నేను కొద్దిగా బియ్యం , సరుకులు తెచ్చుకుంటాను. నీ దగ్గర నీళ్ళు కాచుకునే స్టవ్ ఉంది కదా. దాని మీద అన్నం వండుకుని తింటాను. హోటల్స్ లో అయితే చాలా ఖర్చు అయిపోతుంది. పాపం నువ్వు మాత్రం ఎంతకాలం భరించగలవు ? కనీసం ఒక నెల రోజులు ఇలా లాగించేస్తే అప్పుడు ఏదో ఆలోచించి నా దారి నేను చూసుకుంటాను . దయచేసి నువ్వు నాకు సహకరిస్తావని అనుకుంటున్నాను..'అన్నాడు ప్రాధేయపడుతూ వెంకట్ .
" అయ్యో ! నువ్వు అనుకున్నది ఈ రూంలో అసలు సాధ్యం కాదు. ఈ ఇంటాయన అన్నం కాదు కదా . టీ నీళ్ళు కూడా పెట్టుకొనియ్యడు. ఇంతకు ముందు ఈ రూంలో ఉన్న వాళ్ళు అన్నం వండుకుని ఆ గంజి నీళ్ళు , అన్నం మెతుకులు ఎక్కడ పడితే అక్కడ పడేస్తే ఇంటాయన చాలా రోజులు ఈ రూమ్ ఎవరికీ అద్దెకు ఇవ్వలేదుట. నేనెలాగో బ్రతిమాలుకుని ఇందులో దిగాను. .నా సలహా ఏమిటంటే నువ్వు ఏదైనా ఫ్యాక్టరీ సైడ్ ఉద్యోగాలు వెతుక్కుంటే బాగుంటుంది. వాళ్ళు అయితే ఉండటానికి క్వార్టర్ లాంటివి కూడా ఇస్తారు. ఇంకా పని చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి ఎవరినైనా కొన్నాళ్లు ఉంటానికి అడిగినా అభ్యంతరం పెట్టరని అనుకుంటున్నాను. ఇక నువ్వు మీనమేషాలు లెక్కపెట్టక ఈ సిటీలో ఉద్యోగాలు వెతకడం మానేసి ఏవైనా ఉత్పత్తి చేసి పరిశ్రమలలో పని చేస్తే బాగుంటుంది .." అని ఒక రకంగా వెంకట్ ను వెళ్లిపొమ్మని చెప్పే ఉద్దేశ్యంతోనే నిర్ణయానికి వచ్చేశాడు.
ఒకసారి ఘోరమైన అనుభవం చలపతితో ఎదురైనా మళ్ళీ ఎందుకో అతని సాయాన్ని పొందటానికి తను అవమానంగా ఫీలవుతున్నాడు. అంతకన్నా కడుపు మాడ్చుకుని వుండటం ఉత్తమం అని అతని మనసుకు అనిపిస్తోంది.
ఆ రోజు మళ్ళీ వెంకట్ మిత్రుడు రమణ మూర్తి నుండి ఫోన్ వచ్చింది.
"ఇది విన్నావా వెంకట్ ! చలపతి చాలా రోజులనుండి కేన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడుట.ఇంట్లో భార్య తప్ప చూసుకోవడానికి పిల్లలు కూడా లేరు. అతనికి పిల్లలు పుట్టలేదు. ఉద్యోగంలో రిటైరయ్యాక ఎనభై వేల పెన్షన్ వస్తోందిట. ఇది కాకుండా ఏ బ్యాంకులో చూసినా ఫిక్సెడ్ డిపాజిట్లే. డాక్టర్లు ఎక్కువ కాలం బ్రతికే అవకాశం లేదని చెప్పారుట. ఈ మధ్య అతనికి ఒక ఆలోచన వచ్చిందిట. తను ఎలాగైనా పోతాడు. అనుభవించడానికి పిల్లలు కూడా లేరు. ఆ ఉన్నదేదో భార్యకు సరిపోతుంది. మిగిలిన డబ్బును ఎవరికైనా ఇబ్బందులో ఉన్నవారికి, అనాధ శరణాలయాల్లోనూ పంచి పెట్టాలని చూస్తున్నాడుట. బాగా ఉన్నప్పుడు ఎవరికీ సహాయం చెయ్యలేకపోయానన్న బాధ అతనిలో కనిపిస్తోంది . ఇప్పుడు అతను చాలా పశ్చాత్తాప పడుతున్నట్టుగా కనిపిస్తున్నాడు. తను చెయ్యాలనుకుంటున్న కొన్ని మంచి పనులను ఇప్పటికే మొదలెట్టాడుట. ..." అంటూ చెప్పుకు పోతున్నాడు రమణ మూర్తి.
వెండి కంచం అమ్మిన డబ్బు ఇంకో నాలుగు రోజులు తిండి తినడానికి పనికొస్తుంది అని అనుకున్న వెంకట్ వెంటనే ఆ డబ్బుతో టికెట్ కొనుక్కుని చలపతి దగ్గరకు ప్రయాణమయ్యాడు. తను ఉద్యోగాల వేటలో తిరుగుతున్నప్పుడు చలపతి తనని అతని రూంలో ఉంచుకోలేకపోయినందుకు వెంకట్ గుర్తు తెచ్చుకుని అతని మీద కోపం తెచ్చుకోవడం లేదు. ఇప్పటి అతని దయనీయ పరిస్తితికి నిలువెల్లా క్రుంగిపోతున్నాడు.
" నీ గురించి రమణ మూర్తి అంతా చెప్పాడు. నువ్వు అధైర్య పడకు . ఇప్పుడు కేన్సర్ మరీ అంత ప్రాణాంతమైన వ్యాధి కాదు. మంచి మందులు ఉన్నాయి. లైఫ్ స్పాన్ ను కొంతకాలం పొడిగించవచ్చు. నీకు మేమంతా ఉన్నాం. నీ దగ్గర కొంతకాలం ఉండి నేను చూసుకుంటాను. మా ఫ్యాక్టరీ తెరిచినప్పుడు వెళ్లిపోతాను. ..." అంటూ వెంకట్ చలపతి చేతిని తన చేతిలోకి తీసుకుని ధైర్యం చెప్పాడు.
" ఏం పర్వాలేదు రా. డాక్టర్లు ఆల్రెడీ చెప్పేశారు . అన్నట్టు నీకు డబ్బు పంపుతానంటే నీ నుండి జవాబే రాలేదు. నువ్వు చాలా ఆత్మాభిమానం గలవాడివి. ఎవరినుండి ఏమీ ఆశించక ఇన్నాళ్ళు నీ జీవన యాత్ర సాగించుకుంటూ వచ్చావు. ఇప్పుడు నీ పరిస్తితి చూసి నీ ప్రియ మిత్రుడిగా బాగా డబ్బున్న వాడిగా పైగా ఆ డబ్బు నాకు ఉపయోగం లేని స్తితిలో నిన్ను ఆదుకోకపోతే నాకు మరిణించాక కూడా శాంతి ఉండదు . ..." అంటూ బ్యాగులోంచి డబ్బుల కట్ట తీసి బలవంతాన వెంకట్ చేతిలో పెట్టాడు చలపతి.
"అవును వెంకట్ ! నా అదృష్టం బాగుండి నువ్వే నా దగ్గరికి వచ్చావు. ఇప్పటికైనా నేను చెయ్యాలనుకున్నది చేసేశానన్న తృప్తి నాకు మిగిలింది ... ఆ తృప్తిని ఇలాగే ఉండనియ్యి .." అంటూంటే చలపతి కళ్ళల్లో ఉబికి వచ్చాయి.
"లేదు మిత్రమా నీ కష్టం ముందు నాది చాలా చిన్న కష్టం. మేమేం చేసినా కూడా నీ సమస్యను తీర్చలేం . నీకిలా జరుగుతుందని నేను ఊహించలేదు అంటూ విచిత్రమైన భావోద్రేకానికి గురవుతూ చేతిలో రెపరెప లాడుతున్న నోట్ల కట్టను చూస్తూ అచేతనంగా ఉండిపోయాడు వెంకట్ *****
సమాప్తం