“ డిటాచ్మెంట్ “ ( కథ )
రచన : జీడిగుంట నరసింహ మూర్తి
(24/3/2024 విశాలాంధ్ర ఆదివారం అనుబంధంలో ప్రచురితం )
“ ఇదిగో నేను వాడని బట్టలన్నీ ఒక మూట కట్టి పక్కన పెట్టు. మన కాలనీలో గుడి దగ్గర చాలా మంది ముష్టి వాళ్ళు సరైన ఆచ్చాదన లేకుండా ఉండటం చూస్తున్నాను. రేపు ఆదివారం వెళ్ళి అక్కడ ఇచ్చేస్తాను ..” అంటూ భార్య రామలక్ష్మికి పురమాయించాడు కేశవ్ .
“ అబ్బబ్బ ఏమిటండీ బాబూ ఆ పనేదో మీరే చేసుకోవచ్చు కదా . పని మనిషి నాలుగు రోజులనుండి రాక పోవడంతో నానా చాకిరీ చేసుకోలేక చస్తున్నాను. మీవే కాదు. నావి కూడా కట్టని బోలెడన్ని చీరలు మూలుగుతున్నాయి. పని మనుషుల చేత ఏవైనా పనులు చేయించుకుని ఇద్దామంటే వాళ్ళు వాటికి అసలు లొంగడం లేదు. .వాళ్ళకు ప్రతి చిన్న పనికి డబ్బులు కావాలి...మొన్నా మధ్య నేను కట్టుకోవడానికి వీలు లేని కొన్ని పట్టు చీరలు ఇంట్లో అలమారులలో ఎప్పటినుండో మూలుగుతూ ఉంటే మాట వరసకు మన పక్కింటావిడకు చెపితే ఆవిడ ఒక రోజు పాత పట్టు చీరలు కొనే వాడిని తీసుకొచ్చింది. తీరా చూస్తే వాడు తనకు వాటి జరీ తప్ప ఆ చీరలతో పని లేదన్నాడు. ఏమి చేయాలో పాలుపోక తెచ్చి అల్మారాలో పడేశాను . ఇవి పూర్వం రోజులు కావు బట్టలు ఇచ్చి పుణ్యం సంపాదించుకోవడానికి . అవన్నీ పారేయలేక , ఇంట్లో ఉంచుకోలేక నేను సతమతమవతున్నాను . ఇక ఈ పరిస్తితిలో మీ బాధ్యత కూడా నా మీద వేయకండి. .. అయినా కొత్త బట్టలు కుట్టించుకుంటారు. అవి సరిపోలేదని పక్కన పడేస్తారు. ఇవి కాకుండా ఊళ్ళు వెళ్ళినప్పుడల్లా మీ వాళ్ళు “కొత్త బట్టలు మడత నలగకుండా ఉన్నాయి. నీకు సరిపోతాయేమో చూడు” అంటూ అంటగట్టిన బాపతు ఒక్కసారైనా వేసుకున్నారా ? ఏమో బాబూ మీరేమి చేసుకుంటారో మీ ఇష్టం. నన్ను మాత్రం వదిలేయండి “ అంటూ అక్కడ నుండి విసురుగా వెళ్ళిపోయింది రామలక్ష్మి.
కేశవ్ కు రాత్రంతా ఒకటే ఆలోచన . ఒక్క బట్టలే కాదు . ఇంట్లో తను వాడని ఏ వస్తువైనా కాళ్ళకు, వేళ్ళకు తగులుతూంటే అతనికి పరమ చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది. అప్పటికీ ఇంట్లో అనవసరం అనిపించిన పాత సెల్ ఫోన్లు, ఎలెక్ట్రికల్ జంక్షన్ బాక్సులు, ఇయర్ ఫోనులు కూరగాయల వాళ్లకు, పక్కన వాచ్ మ్యాన్లకు అంటగట్టాడు . ఏదైనా ఒక వస్తువు రెండు మూడేళ్ళ నుండి వాడకపోతే వాటితో అవసరం లేకుండానే రోజులు గడిచిపోతున్నాయి అంటే దానర్ధం వాటితో ఇక పని లేదనే థియరి అతని మనసులో ఒకసారి అతని కజిన్ నాటడంతో అప్పటినుండి అతనిలో ఒక విప్లవాత్మకమైన మార్పు రాసాగింది.
“జీవితంలో ఎప్పటికైనా ఈ లగేజ్ తగ్గించుకోవాలి. ఈ విషయంలో కేరళ వాళ్ళను చూసుకుని నేర్చుకోవాలి. వాళ్ళు ఏ ప్రాంతానికి ఉద్యోగ రీత్యా వెళ్ళినా ఇళ్ళల్లో ఎంతో ముఖ్యమైన సామాను తప్ప అనవసర మైనవి ఏవీ ఉండవు. ఇది తను వాళ్ళను స్వయంగా చూసిన అనుభవం . ఈ రోజుల్లో డబ్బు ఉంటే అప్పటికప్పుడు మనకు కావలసిన వస్తువులు కొనుక్కుని తెచ్చుకోవచ్చు. షాపుల్లో ఉండాల్సినవి అన్నీ మనం ఇంట్లో తెచ్చి ఎందుకు ఇంట్లో పెట్టుకోవడం ? ప్రతి వ్యక్తి జీవితం అప్డేట్ కావాలి. ఈ క్షణం నుండి ఇంట్లో అవసరం లేనివన్నీ బయటకు తోసేయాలి. ఫ్రెష్ గా ఉండటానికి ప్రయత్నం చేయాలి .” ఈ భావాలు మనసులో కందిరీగలా ముసురుకుంటూ ఉండే సరికి ముందుగా ఇంట్లో ఉన్న వాడని అట్ల పెనాలు ,పాత కుక్కర్లు, వంకర పోయిన , చిల్లులు పడిన స్టీలు సామాన్లు, కాల క్రమేణా పాత మిక్సీల స్థానంలో కొత్తవి చేరడంతో నిరుపయోగంగా పడి ఉన్న వాటిని మొత్తం ఒక గోనె సంచిలో వేసుకుని ఒక స్టీల్ సామాను కొట్లో ఇచ్చేశాడు. ఏదో శాస్త్రం చెప్పినట్టు కొనపోతే కొరివి అమ్మబోతే అడివి అన్నట్టు అవన్నీ వేసేసినా చివరకు షాపు వాడు ఇచ్చిన డబ్బు ఒక కిలో కూరలు కొనడానికి కూడా సరిపోయేవి కావు.
ఆ రోజు ప్లాన్ ప్రకారం తను వాడని బట్టలన్నీ మూటగట్టి గుడి దగ్గరకు వెళ్ళాడు. మోత బరువే మిగిలింది తప్ప ఆ రోజు ఒక్క యాచకుడు కూడా కనిపించలేదు. వెనక్కి తీసుకెళ్లడం ఇష్టం లేక గుడి పూజారి గారిని కలుసుకుని “ అయ్యా ఇక్కడ గుడి దగ్గర రోజూ వచ్చే యాచకులకు బట్టలు ఇవ్వాలని తెచ్చాను. అన్నీ మంచి బట్టలే. ఉతికినవే. మీరు ఏమీ అనుకోకపోతే వీటిని పక్కన పెడతాను. మీ వాళ్ళతో ఎవరితోనైనా చెప్పి ఈ మూటను రేపు ఏ పండగనాడో గుమిగూడే యాచకులకు ఇప్పించే ఏర్పాటు చేయగలరా? మీకు ఈ బాధ్యత అప్పగించడం నేను చేస్తున్న పొరపాటే. కానీ వీటిని వెనక్కి తీసుకెళ్ల లేక మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. ..” అన్నాడు కేశవ్ ఇబ్బంది పడుతూనే.
“ ఏమో బాబూ . మాకు ఈ గుడి సేవలలోనే క్షణం తీరిక లేకుండానే ఉంటాము. మేము ఎవరికీ మాట ఇవ్వం. మీరు ఎప్పుడూ గుడికి వస్తూ ఉంటారు కాబట్టి ఒప్పుకుంటున్నాను. అయితే వీటిని మాత్రం ఈ పక్కనే ఉన్న షెడ్ లో పెట్టండి, కావలసిన వారు తీసుకుంటారు. ఇక్కడ గుడిలో మాత్రం పెట్టడానికి మాత్రం కుదరదు ..” అంటూ నిర్మొహమాటంగా చెప్పేసి తన పనిలో మునిగిపోయాడు పూజారి గారు.
బట్టల మూట పూజారి గారు చెప్పిన షెడ్ లో పెట్టాడు కానీ అది ఒక అసంపూర్తి కార్యం లాగా మిగిలిపోయింది కేశవ్ మనసులో. స్వయంగా తన చేతులతో ఇస్తే ఆ తృప్తే వేరు. అన్యమస్కంగా ఇంటికి చేరాడు కేశవ్.
ఇక ఆ రోజు మొదలు నుండి గుడివైపుగా పని గట్టుకుని వెళ్తూ గుడి దగ్గర వున్న షెడ్ వైపు గమనిస్తున్నాడు . వారం రోజులైనా తను పెట్టిన మూట కనీసం విప్పినట్టుగా కూడా లేదు. కేశవ్ చాలా నిరాశగా ఫీలయ్యాడు.
ఇంతలో గుడి బయటకు వస్తున్న పూజారి గారు “ బాబూ ఇచ్చిన బట్టల మూట అలాగే పడి ఉంది. అప్పటికీ ఆ మూటను తెరిచే పెట్టించాను. ఒక్కరంటే ఒక్కరు కూడా వాటిమీద ఆసక్తి చూపలేదు. ఇక్కడకొచ్చే యాచకులు తమని తాము ఇప్పుడున్న పరిస్తితిలోనే చూసుకోవాలని అనుకుంటున్నారు. కొత్త బట్టలు, మంచి బట్టలు వేసుకుని గుడిదగ్గర కూర్చుంటే వాళ్ళను ఎవరూ పట్టించుకొరని వాళ్ళ ఉద్దేశ్యం అయ్యి ఉండవచ్చు. ఇక అవి ఎన్ని రోజులైనా అలాగే ఉంటాయి. మీరు ఆ స్తలం ఖాళీ చేస్తే అక్కడ మా ఆవును కట్టేయాలి. .. కొద్దిగా త్వరగా వాటిని తీసుకుపోండి బాబూ .వాటిని మీరు ఎక్కడ పారేస్తారో మీ ఇష్టం. ఈ గుడి దగ్గర మాత్రం పెట్టి ఇక్కడ వాతావరణాన్ని కాలుష్యం చేయవద్దని మనవి .” అంటూ కేశవ్ మొహంలో పూర్తిగా చూడకుండానే ఆయన వెళ్ళిపోయాడు.
చీకటిలో తీసుకెళ్లిన మూట మళ్ళీ వాపసు తేవడంతో రామలక్ష్మి “ ఏమిటి ఇవన్నీ మళ్ళీ వెనక్కి తెచ్చేశారు ? ఎవరూ తీసుకోలేదా ఏమిటి ?” అని అడిగింది తల బాదుకుంటూ.
కేశవ్ కు ఆవిడకు సమాధానం చెప్పాలని అనిపించలేదు. ఇలా ఈ బట్టలన్నీ ఇళ్ళు మారినప్పుడల్లా వారి వెంట వస్తూనే ఉన్నాయి. ఎవరూ తీరుకోరు.కొన్ని రోడ్డు మీద పడేస్తే పిచ్చి కుక్కలు వాటిని చీల్చి చింపేసి ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నాయి. కొన్ని ఇళ్ళు తుడుచుకోవడానికి వాడుకుంటున్నారు . కానీ ఇటువంటి పనులకు ఎన్ని బట్టలని ఉపయోగించడం ? ఇవే కాదు ఇంటినిండా గుట్టలు గుట్టలుగా పుస్తకాలు.. ఇంటికొచ్చిన వాళ్ళకు ఎవరికైనా ప్రెజెంట్ చేద్దామంటే అబ్బే మాకు వాటిమీద అస్సలు ఆసక్తి లేదు. టీవీనే చూస్తామా ఈ పుస్తకాలే చదువుతామా ? వద్దు బాబూ . ఇంట్లో పెట్టడానికి కూడా చోటు లేదు అంటూ అక్కడే వదిలేసి వెళ్లిపోయే వాళ్ళే అందరూ.
ఆయనెవరో పెద్దమనిషి సలహా ఇస్తే ఒక రోజు దగ్గరలో ఉన్న గ్రంధాలయానికి వెళ్ళి పుస్తకాలు డొనేట్ చేయబోయాడు కేశవ్. అవన్నీ చూసి గ్రంధాలయాధికారి “ఛీ ఛీ ఇవన్నీ ఎవరు చదువుతారండీ . ఇప్పుడు అందరికీ కావలసింది సరసమైన , శృంగార భరితమైన పుస్తకాలు . ప్రతి వారూ ఇంట్లో చోటు లేక మా ప్రాణాన పడేస్తారు. తీసుకుపోయి ఏ బజ్జీల బండి వాళ్లకో అమ్ముకోండి . ..” అంటూ ఒక అవమానంతో కూడిన తిరస్కార భావాన్ని వెళ్ళబుచ్చే వాళ్ళు.
ఎప్పటికప్పుడు కథ మొదటికొస్తోంది. పోనీ తను” సెల్ ఫోన్లు, వేరే సామాన్లు తను తిరిగి ఎటువంటి ప్రయోజనం ఆశించకుండా ఇచ్చిన వాళ్ళకే ఈ బట్టలు కూడా ఇస్తే ఎలా ఉంటుంది ? “ అన్న ఆలోచన కేశవ్ లో మెదిలి వాళ్ళను అడిగి చూశాడు.
“ఎవరికైనా చెప్పి చూస్తాను లెండి. ..” అన్నాడు కూరల బండి వాడు పెద్దగా సీరియస్ గా తీసుకోకుండా . అంటే తను మాత్రం తీసుకోవడానికి సిద్దంగా లేడన్న మాట. అతన్ని బాగా పరిశీలించి చూస్తే వాడు నిజానికి తను కట్టుకున్న బట్టలు కన్నా మంచి బట్టలు ధరించినట్టుగా అనిపించింది. కాళ్ళ చెప్పులు కూడా మెరిసిపోతున్నాయి. ఈ రోజుల్లో ప్రతి వారికీ డబ్బులు కావాలి. ఈ పాత బట్టలు ఇస్తున్నాం అంటే అవి ఇంట్లో ఎవరైనా చని పోతే వాళ్ళ తాలూకు బట్టలు ఇస్తున్నాం అనే అనుమానం వస్తోందిట . అప్పటినుండి అందరూ అవంటే భయపడి పోతున్నారు. . ఒకవేళ మనల్ని గౌరవించి తీసుకున్నట్టు అనిపించినా వాటిని ఏ మోటార్ షెడ్డు దగ్గరో లారీలు, బళ్ళు తుడవడానికి అమ్ముకుంటున్నారు అని చాలా మంది చెపుతూ ఉంటారు. అంటే అక్కడ కూడా డబ్బు చేసుకుంటున్నారు తప్ప బట్టలు ధరించడానికి ఎవరూ సిద్దంగా లేరు. అనాధ శరణాలయాల్లో పూర్వం తీసుకునే వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకు కూడా ప్రభుత్వాలు కొత్త బట్టలు కొని ఇస్తున్నాయిట .
కేశవ్ వాళ్ళకు ఏ ఇంటికి అద్దెకు వెళ్ళినా ఆరునెలలు తిరగక ముందే ఆ ఇంట్లో అన్ని లోపాలు బయట పడతాయి. స్వంత ఇళ్ళు అయితే బాధపడాలి కానీ బాడుగకు ఉండే ఇంట్లో రాజీ పడాల్సిన అవసరం ఏముంది అందుకే సంవత్సరం తిరక్క ముందే ఇంకో ఏరియా లో ఇంకో ఇంట్లోకి మారిపోయే వాళ్ళు. కొన్నాళ్ళు బాగానే ఉండేది. ఆ తర్వాతే సమస్యలు మొదలయ్యేవి.
రాత్రి ఎంతసేపటికి నిద్ర రాకపోయే సరికి ఆ మగత నిద్రలోంచే కేశవ్ కు ఒక ఐడియా పుట్టుకొచ్చింది . తను ఎలాగూ ఇంకో నాలుగు రోజుల్లో ఇళ్ళు మారుబోతున్నాడు. ఏదైనా ఇస్త్రీ షాపులో తన బట్టలు, భార్య చీరల మూటను ఇస్త్రీ చేయడానికి ఇచ్చి వాటిని తిరిగి తీసుకోకుండా అక్కడే వదిలేస్తే వాడు తన కోసం చూసి చూసి ఏదో ఒకటి చేసుకుంటాడు .. పాపం అంటితే అంటింది. m ఇంతకన్నా ప్రస్తుత పరిస్థితిలో మంచి ఉపాయం తట్టడం లేదు అతనికి.
ఒక పదిహేను రోజుల తర్వాత కేశవ్ కు ఇస్త్రీ షాపు అతను గుర్తు వచ్చాడు. పాపం తను ఇచ్చిన మొత్తం బట్టలన్నీ నడుం పడేటట్టు ఇస్త్రీ చేసి తనకోసం ఎదురు చూసి ఉంటాడు. షాపు అతని ఫోన్ నెంబర్ తన దగ్గర ఉంది కానీ తన నెంబర్ వాళ్ళ దగ్గర లేదు. మొత్తం బట్టలన్నీ ఇస్త్రీ చేసినందుకు కనీసం నూట ఏభై రూపాయిలైనా అయ్యి ఉంటాయి. నిజానికి అది అతనికి నష్టమే. పైగా నడుం విరిగేటట్టుగా పని చేసి ఉంటాడు. తను స్వార్ధానికి ఆ షాపు వాడు ఎందుకు బలైపోవాలి. ఇది న్యాయం కాదు అనుకుని వెంటనే ఫోన్ చేశాడు.
“బాబూ. మేము అనుకోకుండా చాలా దూరం ఇల్లు మారాల్సి వచ్చింది. ఆ హడావిడిలో మీ షాపులో ఇస్త్రీ కోసం బట్టలిచ్చినట్టు మర్చిపోయాను. ఇప్పుడు అంత దూరం వచ్చి తీసుకోవడం నాకు కుదిరేటట్టుగా లేదు. ఆ బట్టలు ఏదో రకంగా ఎవరికైనా అవసరం ఉంటే ఇచ్చేసేయండి. మీకు నేను నష్టం చేయదల్చుకోలేదు. మీ ఫోన్ పే కి ఇప్పుడే నూట ఏభై రూపాయలు పంపుతున్నాను. ..” అంటూ ఇస్త్రీ షాపు వ్యక్తికి ఫోన్ చేసి ఇక అతని నుండి సమాధానం కోసం ఎదురు చూడకుండానే ఫోన్ పెట్టేశాక కేశవ్ మనసు కుదుటపడింది .
ఈ రోజుల్లో ప్రతి వారూ ఎన్నో విషయాలలో “డిటాచ్మెంట్ గా ఉండండి- లగేజ్ తగ్గించుకోండి” అని అంటూ సలహాలు ఇస్తూ ఉంటారు. “పాత సామానులే వదుల్చుకోలేక నానా విధాలుగా సతమతమవుతూ ఉంటే మన చుట్టూ ఉండే అల్లుకుపోయిన బంధాలను , మనుష్యులను దూరం చేసుకోవడం అసలు మన వల్ల అవుతుందా?” అనే అనుమానం కేశవ్లో ఎప్పటికీ ఒక జవాబులేని ప్రశ్నగా మిగిలిపోయింది.